విష్ణు మహా పురాణము

14 - వృషభాసుర వధ

శ్రీపరాశరుడు:

ప్రదోషాగ్రేకదాచిత్తు రాసాస క్తేజనార్థనే

త్రాసయంత్సమదోగోష్టమరిష్టస్సముపాగమత్

సతోయతోయదచ్చాయ స్తీక్ష్ణ శృఙ్గోర్కలోచనః

ఖురాగ్రపాతై రత్యర్థం దారయన్ ధరణీతలమ్

లేలిహానస్సనిష్పేషం జిహ్వాయోష్ఠౌపునః పునః

సంరంభావిద్దలాఙ్గూలః కఠినస్కంధబంధనః

ఉదగ్రకకుదాభోగః ప్రమాణాద్దురతిక్రమః

విణ్మూత్రలిప్తపృష్ఠాఙ్గోగవాముద్వేగకారకః

ప్రలమ్భకణ్ఠోతిముఖ స్తరుఘాతాఙ్కితాననః

పాతయన్ సగవాంగర్భాన్ దైత్యోవృషభరూపధృత్

సూదయం స్తాపనానుగ్రో వనాన్యటతియస్సదా

శ్రీపరాశరుడు:

సంధ్యా కాలానంతరము కృష్ణుడు రాసక్రీడా కుతూహలియైన తఱి నరిష్టుడు పొగఱుకొని బెదరించుచు గోష్ఠమునకు వచ్చెను. సజల మేఘము లట్టి నల్లని మేనితో పెద్ద కొమ్ములతో సూర్యునట్లున్న కన్నులతో డెక్కలచే నేలను జీల్చుచు నాలుక సాచి పెదవులను గట్టిగ నాకుచు తోక పైకెత్తి కఠినమయిన మెడతో మిక్కిలి యెత్తయిన మూపురముతో అంతులేని యోడ్డునుం బోడవుతో మూత్ర పురీషముల పూతగొన్న వృష్ఠముతో గోవులకు దుడుకు గూర్చుచు మెడవ్రేల పెద్ద ముట్టెతో చెట్ల రాపిడిం బుండ్లు వడిన మొగముతో గోవుల గర్భ నిర్భేదనము సేయుచు వృషభ రూపుడై యా రాక్షసుడు తపస్వులం జంపుచు వనము లందే వేళ తిరుగు చుండును.

తతస్తమతిఘోరాక్షమవేక్ష్యాతిభయాతురాః

గోపాగోపస్త్రియశ్చైవకృష్ణకృష్ణేతిచుక్రుశుః

సింహనాదం తతశ్చ క్రేతలశబ్ధంచ కేశవః

తచ్చబ్దశ్రవణాచ్చాసౌ దామోదరముపాయయౌ

అగ్రన్య స్తవిషాణాగ్రః కృష్ణకుక్షితేక్షణః

అభ్యధావతదుష్టాత్మా కృష్ణం వృషభదానవః

ఆయా న్తందైత్యవృషభం దృష్ట్వాకృష్ణోమహాబలః

నచచాలతదాస్థానాదవజ్ఞాస్థితలీలయా

ఆసన్నంచై వజగ్రాహ గ్రాహవన్మదుసూదనః

జఘానజానునాకుక్షౌ విషాణగ్రహణాచలమ్

తస్యదర్పబలం భఙ్త్వాగృహీతస్యవిషాణయోః

అపీడయదరిష్టస్య కణ్ఠంక్లిన్న మివామ్బరమ్

ఉత్పాట్య శృఙ్గమేకంతుతేనై వాతాడయ త్తతః

మమారసమహాదైత్యో ముఖాచ్ఛోణితముద్వామన్

తుష్టువుర్నిహతేతస్మిన్ దైత్యేగొపాజనార్ధనమ్

జమ్బేహతేసహస్రాక్షం పురాదేవగణాయథా

ఆ ఘోర రాక్షసునిం జూచి గోపీ గోపాలకులు జడిసిపోయి కృష్ణ కృష్ణాయని యాక్రందించిరి. అంతట కేశవుడు సింహ గర్జనము చేసి యరచేతులు సరచి చప్పుడు చేసెను. ఆ సడివిని వీడు హరి పైకి వచ్చెను. ఆ దానవుడు కృష్ణుని కుక్షిం గురిసేసి కొమ్ముల కొనల ముందునకు సాచి స్వామి మీదకు బరువిడెను. అట్లుపై బడునా మ్రుక్కుడి రక్కసుని గనియు హరి యున్నతావు నుండి కదలక నీలెక్కేమి పోరా యన్నట్లు నటించి దరిసిన వానిం బట్టుకొని కదలకుండ రెండు కొమ్ములుం బట్టి వ్రాల్చి మొకాళ్ళం గడుపునం బోడిచెను. వాని దర్ప బలమణచి తడిబట్ట పట్టి పిడిచి నట్లు వాని మెడబట్టి పిడుప వెట్టెను. ఒక కొమ్మూడ బెరికి దాననే వానిం గొట్టెను. ఆ రాక్షసుడు నోట నెత్తురు గ్రక్కికొని చచ్చెను. ఆ క్రూర దానవుడు హతుడై నంత గోపకులు జంభాసురుడు చావగా దేవగణము లింద్రునిం బలె కృష్ణునిం గొనియాడిరి.