విష్ణు మహా పురాణము

16 - ఋభు నిదాఘ సంవాదము

బ్రాహ్మణుడు:

ఋభుర్వర్షసహస్రేతు సమతీతే నరేశ్వర!

నిదాఘజ్ఞానదానాయ త దేవనగరం యయౌ

నగరస్యబహిస్సోఽథనిదాఘంద ద్రుశేమునిః

మహాజనపరీవారే పురంవిశతిపార్థివే

దూరేస్తితంమహాభాగం జనసమ్మర్థవర్జితమ్

క్షుత్ క్షామకణ్ఠ మాయాన్థ మరణ్యాత్ససమిత్కుశమ్

దృష్ట్వానిదాఘం సఋభు రుపగమ్యాభివాద్యచ

ఉవాచ కస్మాదేకాన్తే స్థీయతేభవతా ద్విజ!

బ్రాహ్మణుడు:

వేయేండ్లయిన తరువాత ఋభువు నిదాఘునికి జ్ఞాన మనుగ్రహింప నా నగరమున కేగెను. నగరము వెలుపల నమ్ముని. రాజు మహాజన పరివారముతో పుర ప్రవేశము చేయు చుండగా దూరమందు జన సమ్మర్ధము లేకుండ నిలువ బడిన వానిని ఆకలిచే దడియారిన కంఠముతో సమిధలు దర్భలు పట్టుకొని వచ్చుచున్న నిదాఘుని చూచి సమీపించి, మ్రొక్కి నీవేకాంత మందెందులకున్నావని యడిగెను. అంత వారి కిట్లుత్తర ప్రత్యుత్తరములు జరిగిని.

నిదాఘుడు:

భోవిప్ర! జనసంమర్థో మహా నేష సర్వేశ్వరః

ప్రవివిక్షుఃపురంరమ్యం తేనాత్రస్థీయతేమయా

నిదాఘుడు:

రాజా! జన సమ్మర్థముతో నీ మహారాజు చక్కని పురముం బ్రవేశింప దలచి యున్నాడు. అందువలన నిట నిల్చితిని.

ఋభుడు:

నరాధిపోఽత్ర కతమః కతమశ్చేత రోజనః

కథ్యతాంమే మహాభాగ త్వమాభిజ్ఞోమతో మమ

ఋభుడు:

నీవు తెలిసిన వాడవని తోచు చున్నది. ఇక్కడ రాజెవడు? మఱి యితర జనులెవ్వరు?

నిదాఘుడు:

యోఽయంగజేన్ద్ర మున్మత్తమాద్రిశృఙ్గ సముచ్చ్రితం

అదిరూఢో నరేన్ర్దోఽయంపరిలోక స్తథేతరః

నిదాఘుడు:

పర్వత శిఖతము వలె ఉన్నతముగ నున్న గజేంద్రము నెక్కిన వాడు నరేంద్రుడు, ఇతరులు పరిజనులు.

ఋభుడు:

ఏతౌహి గజరాజానౌ యుగాపద్దర్శి తౌమమ

భవతా న విశేషేణ పృతగ్భిన్నోప పక్షితౌ

తత్కథ్యతాం మహాభాగా విశేషో భవతా నయోః

జ్ఞాతుమిచ్చామ్యహంకోత్రగజః కోవానరాధిపః

ఋభుడు:

ఈ ఏనుగు రాజును నీచే నాకొకమారే జూప బడినారు తమచే నిద్దరును వేరు వేరుగా జూప బడలేదు. కావున నో మహానుభావా! ఇక్కడ గజమేది? రాజెవాడు? ఈ యొండొరులకు విశేషమేమి సెలవిమ్ము.

నిదాఘుడు:

గజోయోఽయమధో బ్రహ్మ న్నుపర్యస్యైవ భూపతిః

వాహ్యవాహక సబన్ధంకొనజానాతివైద్విజః

నిదాఘుడు:

ఆ క్రిందుగా నున్నది ఏనుగు. దీని మీదనున్న వాడు రాజు. ఒకటి మోసేది ఒకడు మోయ బడువాడు. ఈ వాహ్యవాహక సంబంధ మెవ్వడెఱుంగడు?

ఋభుడు:

జానామ్యాహంయథా బ్రహ్మం స్థతామామవబోధయ

అధశ్శాబ్దని గద్యంకిం కించోర్ ధ్వమభిదీయతే

ఋభుడు:

నేనెట్లు తెలిసి కొందునో యట్లు చెప్పుము. అధశ్శబ్ధముచే చెప్ప బడునదేది? ఊర్ద్వశబ్ధ వాచ్యమేది? అని పలుకగా నిదాఘ ముని పైకి ఎక్కి యిట్లనియె. రాజువలె నేను పైన, ఏనుగువలె నీవు క్రింద నున్నావు, బ్రాహ్మణుడా! నీకు దృష్టాంతము చూప బడినది. తెలిసికొనుము.

ఋబుడు:

ఇత్యుక్తస్సహసారుహ్య నిదాఘః ప్రాహతం ఋభుమ్

శ్రూయతాం కథయామేష్య యన్మాంత్వంపరిపృచ్చసి

ఉపర్యాహంయథారాజా త్వమధః కుఞజరోయథా

అవబోధాయతే బ్రహ్మన్ దృష్టాన్తోదర్శితోమయా

ఋభుడు:

బ్రాహ్మణోత్తమా! నీవు రాజు వలెను నేను గజము వలెనున్నచో నీవేవ్వడవు? నేనెవ్వడను? అని ఋభువు పలుకగా నిదాఘు డాతని పాదముల కొఱగి యిట్లనెను. మీరు నా గురువులగు ఋభు మహర్షులు. నిశ్చయము, మఱి యితరుల మనస్సు మీ మనస్సు వలె అద్వైత సంస్కారముచే సంస్కరింప బడి యుండదు. కావున నిన్ను మా గురువుగ తలంచెదను.

ఋభుడు:

త్వంరాజేవద్విజ శ్రేష్ఠ! స్థితోఽహంగా జవద్యాది

తదేవత్వంమమాచక్ష్వకతమస్త్వమహంతథా

బ్రాహ్మణుడు:

ఇత్యుక్తస్సత్వరంతస్య ప్రగృహ్య చరణావుభౌ

నిదాఘః ప్రాహ భగవానాచార్యస్త్వమృభుర్ ధ్రువమ్

నాన్యస్యాద్వైత సంస్కార సంస్కృతం మానసంతథా

యథాచార్యస్య తేనత్వాం మన్యేప్రాప్త మహంగురుమ్

ఋభుడు:

తవోపదేశాదానాయ పూర్వశుశ్రూషణాదృతః

గురుస్నేహాదృభుర్నామనిదాఘ! సముపాగతః

తదేతదుపదిష్టంతే సంక్షేపేణ మహామతే

పరమార్థసారభూతంతదద్వైతమశేషతః

ఏవముక్త్వాయయౌవిద్వాన్ నిదాఘంస ఋభుర్గురుః

నిదాఘోఽప్యుపదేశేన తేనాద్వైతపరోఽభవత్

సర్వభూతాన్యాభేదేన దదర్శసతదాత్మనః

తథాబ్రహ్మపరోముక్తి మవాప పరమాం ద్విజః

తథాత్వమపిధర్మజ్ఞ తుల్యాత్మరిపుబాంధవః

భావ సర్వగతంజానన్నాత్మానమవనీపతే!

సితనీలాదిభేదేన యథై కందృశ్యతేనభః

భ్రాన్తదృష్టిభి రాత్మాపి తథైక స్సన్ పృథక్కృతః

ఏకస్సమస్తంయదిహాస్తికించిత్తదచ్యుతోనాస్తిపరంతతోఽన్యతో

సోఽహంసచాత్వంసచసర్వమేతదాత్మస్వరూపం త్యజభేదమోహమ్

ఋభుడు:

నిదాఘా! ఋభువను నేను పూర్వము నీవు చేసిన సేవ యందాదరము నుండి గురు స్నేహము వలన నీకు అద్వైతోపదేశము చేయుటకై వచ్చితిని. మహామతీ! సంగ్రహముగా నీకు నుపదేశించితిని. పరమార్ధ సారమే అద్వైతము, దేవాది భేద రహితమైన జ్ఞానమే అద్వైతము. అని నిదాఘుం గూర్చి జ్ఞాని ఋభుడు గురువై పలికి చనెను. నిదాఘుడు నా యుపదేశముచే నద్వైత నిష్ఠుడయ్యెను. అన్ని భూతములను దనకంటె నభిన్నముగ దర్శించెను. ఆ విధముగ బ్రహ్మపరుడై ముక్తిం బొందెను. ఆ విధముగ నో ధర్మజ్ఞా! నీవు నిన్ను సర్వగతమై యున్న యాత్మనుగా దెలిసి శత్రువు బంధువునెడ సముడవు గమ్ము. ఒకే ఆకాశము తెలుపు నలుపు మొదలగు భేదముతో భిన్నముగ గనిపించు నట్లు భ్రాంతి దృష్టులచే నాత్మ యొక్కటి యుండియు వేఱు పెట్టబడును. ఇదంతయు సర్వాత్మకుడైన యచ్యుతుడే. అంతకంటే మఱి లేదు. అతడే నేను నీవు ఈ యంతయు (దృశ్యము) నాత్మ స్వరూపము. భేద మోహమును వీడుము.

శ్రీపరాశరుడు:

ఇతీరితస్తేనసరాజవార్య స్తత్యాజభేదం పరమార్థదృష్టిః

సచాపిజాతిస్మరణాప్తబోధస్తత్రైవజన్మన్యపవర్గమాప

ఇతిభారతనరేన్ద్రసారవృత్తం కథయతి యశ్చశృణోతి భక్తియుక్తః

సవిమలమతిరేతినాత్మమోహం భవతిచసంసరణేషుముక్తియోగ్యః

శ్రీపరాశరుడు:

అని భరతునిచే తెలుప బడి యా రాజశ్రేష్టుడు పరమార్థ దృష్టి వడసి భేదమును విడచెను. మఱియు నాతడు జాతి స్మృతి (పూర్వజన్మ జ్ఞానము) నొంది యా జన్మములోనే యపవర్గమును (సాయుజ్య ముక్తిని) బొందెను. ఈ భరత నృపుల సారభూతమైన చరిత్ర నెవ్వడు చెప్ప నెవ్వడు భక్తితో విను నాతడు శుద్ధ చిత్తుడై ఆత్మ మోహము నందడు. ముక్తికధికారియు నగును.