విష్ణు మహా పురాణము

20 - నృసింహావతారము

శ్రీపరాశరుడు:

ఏవంసంచిన్తయన్విష్ణుమభేదేనాత్మనోద్విజ

తన్మయత్వమవాప్యాగ్రేమేనేచాత్మానమచ్యుతమ్

విసస్మారతదాత్మానం నాన్యత్కించిదజానతా

అహమేవావ్యయోనిత్యః పరమాత్మేత్యచిన్తయత్

తస్యతద్భావనాయోగాత్ క్షీణపాపస్యవై క్రమాత్

శుద్దేఽన్తః కరణేవిష్ణుస్తస్ఠౌజ్ఞానమయోచ్యుతః

యోగప్రభావాత్ప్రహ్లాదేజాతేవిష్ణుమయేఽసురే

చలత్త్యురగబన్ధాస్తేమైత్రేయత్రుటితాఃక్షణాత్

భ్రాన్తగ్రహగణస్సోర్మర్యయౌక్షోభంమహార్ణవః

చచాలచమహీసర్వాసశైలవనకాననా

సచాతంశైలసంఘాతందైత్యైర్ న్యస్తమథోపరి

ఉత్ క్షిప్యాతస్మాత్సలిలాన్నిశ్చక్రామమహామతిః

దృష్ట్వాచసజగద్భూయోగగనాద్యుపలక్షితమ్

ప్రహ్లాదోఽస్మీతిసస్మారపునరాత్మానమాత్మనా

తుష్టావచపునర్దీమాననాదిం పురుషోత్తమమ్

ఏకాగ్రమతిరవ్యగ్రోయతవాక్కాయమానసః

శ్రీపరాశరుడు:

ఓ బ్రాహ్మణుడా! ప్రహ్లాదుడిట్లు విష్ణువును తనకంటె భిన్నుడు కానివానిగా భావించుచు నుత్కృష్టమైన తన్మయత్వమును పొంది తనను అచ్యుతునిగా తలంచెను. తనను మరచెను. ఇతరము నెఱుంగ డయ్యెను, అవ్యయుడు అనంతుడునగు పరమాత్మ నేనేయని తలంచెను. అట్టి విష్ణుతాదాత్మ్య భావనా యోగము వలన క్రమముగా పాపపంకమింక శుద్దాంతః కరణము నందు జ్ఞానమయుడగు నచ్యుతుడు నిలచెను. రాక్షసుడగు ప్రహ్లాదుడు యోగ ప్రభావమున విష్ణుమయుడై చలింపగా నాగబంధము లన్నియు తెగిపోయెను, భ్రమించు చున్న జలచరమ సంకులమై తరంగములతో గూడిన సముద్రము క్షోభిల్లెను. పర్వతారణ్యములతో గూడిన భూమి కంపించెను. రాక్షసులచే తనపై నుంచబడిన పర్వత సంఘాతము నెల్ల లేవనెత్తి బుద్దిమంతుడగు ప్రహ్లాదుడు పైకి వచ్చి అకాశాదులతో గూడిన జగత్తును చూచి, తాను ప్రహ్లాదుడనని మనసు నందు స్మరించెను. బుద్దిశాలియగు నాతడు త్రికరణముల నియమించుకొని యేకాగ్రచిత్తుడై యనాదియగు పురుషోత్తముని తొట్రుపాటు లేకుండ స్తుతించెను.

ప్రహ్లాదుడు:

ఓంనమఃపరమార్ధార్ధస్థూలక్ష్మక్షరాక్షర

వ్యక్తావ్యక్తకాలాతీతసకలేశనిరంజన

గుణాంజనదునాధారనిర్గుణాత్మన్ గుణస్థిత

మూర్తామూర్తామహామూర్తే సూక్ష్మమూర్తే స్ఫుటాస్ఫుట

కరాళరూపసౌమ్యాత్మన్ విద్యావిద్యామయాచ్యుత

సదసద్రూపసద్భావసదసద్భావభావన

నిత్యానిత్య ప్రవంచాత్మన్నిష్పపంచామలాశ్రిత

ఏకానేకనమస్త్యుభ్యం వాసుదేవాదికారణ

యస్థ్సూలసూక్ష్మప్రకటాప్రకాశో యస్సర్వభూతోనచసర్వభూతః

విశ్వంయతశ్చైతాదవిశ్వహేతో నమోస్తుతస్మై పురుషోత్తమాయ

ప్రహ్లాదుడు (విష్ణు స్త్రోత్రము):

పరమార్ధ జ్ఞానరూపా! స్థూల సూక్ష్మరూపా! క్షరాక్షర రూపా! వ్యక్తావ్యక్త రూపా! సకల నిష్కల (సావయవ నిరవయవ) రూపా! నిర్లేపరూపా! సగుణ నిర్గుణ రూపా! సంస్థ గుణాధారా! మూర్తామూర్త రూపా! వ్యక్తావ్యక్తస్వ రూపా! కరాల సౌమ్యస్వ రూపా! విద్యాఽవిధ్యా రూపా! సదసద్రూప! కారణభూతా! సదాసద్భావాభిజ్ఞా! నిత్యానిత్య ప్రపంచ రూపా! ప్రపంచాతీతా! జ్ఞానులచే నాశ్రయించ బడినవాడా! కారణ రూపమున నేక రూపా! కార్య రూపమున ననేక రూపా! వాసుదేవా! ఆదికారణ భూతుడా! నమస్కారము. స్థూల రూపమున ప్రకటమైన వాడును, సూక్ష్మరూపమున అప్రకాశుడును సర్వ భూతరూపుడు సర్వ భూతాతీతుడు విశ్వహేతు భూతుడు జీవుల కర్మానుసారము సృష్టికి కర్తయు అంతియే కాని నిజమునకు విశ్వహేతువు కాని వాడును నగు పురుషోత్తమునకు నమస్కారము.”

శ్రీపరాశరుడు:

తస్యతచ్చేతసోదేవః స్తుతిమిత్థం ప్రకుర్వతః

ఆవిర్భాభూవభగవాన్ పీతాంబరధరోహరిః

ససంభ్రమస్తమాలోక్యసముత్థాయాకులాక్షరమ్

నమోఽస్తు విశ్నవేత్యేతద్వ్యాజహారసకృద్ద్విజ

శ్రీపరాశరుడు:

ఇట్లు స్తుతించు చుండగా పీతాంబర ధారియై శ్రీహరి సాక్షాత్కరించెను. వెంటనే ప్రహ్లాదుడు చూచి తత్తరపాటుతో లేచి

ప్రహ్లాదుడు:

దేవప్రపన్నార్తిహరప్రసాదంకురుకేశవ!

అవలోకనదానేనభూయోమాంపాలయావ్యయ!

ప్రహ్లాదుడు:

“నమోస్తు విష్ణవే” యని యడుగడుగు ననుచు స్వామీ! శరణాగతార్తిహరా! అనుగ్రహింపుము! కటాక్షము నెరపి నన్ను పవిత్రుని చేయుమని పలుకగా

శ్రీభగవానుడు:

కుర్వతస్తేప్రసన్నోహంభక్తిమవ్యభిచారిణీమ్

యథాభిలషితోమత్తః ప్రహ్లాదవ్రియతాంవరః

శ్రీభగవానుడు:

నాయందు స్థిరమగు భక్తిని చేయుచున్న నీకు ప్రసన్నుడ నైతిని. అభీష్టమును కోరుకొను మనెను.

ప్రహ్లాదుడు:

నాథ! యోనిసహస్రేషు యేషుయేషువ్రజామ్యహమ్

తేషుతేష్వచ్యుతాభక్తిరచ్యుతాఽస్తుసదాత్వయి

యాప్రీతిరతివివేకానాంవిషయేష్వనపాయినీ

త్వమనుస్మరతస్సామేహృదయాన్మాపసర్పతు

ప్రహ్లాదుడు:

“అచ్యుతా నేనే జన్మ మెత్తినను నీయందనపాయిని యగు భక్తి యుండు గాక! వివేకహీనులకు విషయము లందెట్టి గాఢ ప్రీతీ యుండునో ఆ ప్రీతీ నీయందు నిన్ను స్మరించు చుండు నాకు కలుగు గాక!” అని పలుకగా

శ్రీభగవానుడు:

మయిభక్తిస్తవాస్త్యేవభూయోప్యేవంభవిష్యతి

వరశ్చమత్తః ప్రహ్లాదవ్రియతాంయస్తవేప్సితః

శ్రీభగవానుడు:

నాయందు నీకు భక్తి గలదు గదా! ఇంకను నండును. నీకభీష్టమైన వరము కోరుకొను మనెను.

ప్రహ్లాదుడు:

మయిద్వేషానుబన్దోభూత్సంస్తుతావుద్య తేతవ

మత్పితుస్తత్కృతంపాపం దేవతస్య ప్రణశ్యతు

శాస్త్రాణిపాతితాన్యంగెక్షిప్తోయచ్చాగనిసంహతౌ

దంశితశ్చోరగైర్ధత్తంయద్విషంమమభోజనే

బద్ధ్వాసముద్రేయత్ క్షిప్తోయచ్చితోఽస్మిశిలోచ్చయైః

అన్యానిచాప్యసాధూని యానిపిత్రాకృతానిమే

త్వయిభక్తిమాతోద్వేషాదఘంతత్సంభవంచయత్

త్వత్ప్రసాదాత్ర్పభోసద్యస్తేనముచ్యేతమేపితా

ప్రహ్లాదుడు:

నేను నిన్ను స్తుతింప బూనగా నా తండ్రికి నీపై ద్వేషము కలిగెను. దాని వలన నాతనికి కల్గిన పాపము నశించు గాక! శస్త్రములు అగ్ని సర్పములు విషాన్నము సముద్రము పర్వతములు మున్నగు వానితో నన్ను అనేక విధముల మా తండ్రి బాధించెను. అందువలన కలిగిన పాపము నశించు గాక! నీ అనుగ్రహముచే నా పాప విముక్తి యగుగాక!

శ్రీభగవానుడు:

ప్రహ్లాదసర్వమేతత్తే మత్ప్రసాదాద్భవిష్యతి

అన్యంచతేవరందద్మి వ్రియతామాసురాత్మజ!

శ్రీభగవానుడు:

నా అనుగ్రహముచే అన్నియు జరుగును. మరియొక వరము కోరుకొను మనెను.

ప్రహ్లాదుడు:

కృతకృత్యోఽస్మిభగవన్ వరేణానేనయత్త్వాయి

భావిత్రీత్వత్ప్రసాదేనభక్తిరావ్యభిచారిణీ

ధర్మార్ధకామైఃకింతస్యముక్తిస్తస్యకరేస్తితా

సమస్తజగతాంమూలేయస్యభక్తిః స్థిరాత్వయి

ప్రహ్లాదుడు:

నీయందు చలించని భక్తి ఎల్లప్పుడు కలుగు గాక! ధర్మార్ధ కామములతో నేమి ప్రయోజనము? సంస్థ జగన్మూల కారణుడగు శ్రీహరి యందు స్థిరమగు భక్తి గల వానికి ముక్తి కరతలామలకమే అన

శ్రీభగవానుడు:

యథాతేనిశ్చలంచేతోమయిభక్తి సమన్వితమ్

తథాత్వంమత్ప్రసాదేననిర్వాణంపరమాప్స్యపి

శ్రీభగవానుడు:

నీ చిత్త మచంచలమై నా యందున్నట్లే నా యనుగ్రహముచే నీవు మోక్షము నంద గలవు.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్త్వాఽన్తర్ధధేవిష్ణుస్తస్యమైత్రేయపశ్యతః

సచాపిపునరాగమ్య వవన్దేచరణౌపితుః

తంపితామూర్ ధ్న్యుపాఘ్రాయ పరిష్వజ్యచపీడితమ్

జీవసీత్యాహవత్సేతి భాష్పార్ ద్రనయనోద్విజ

ప్రీతిమాంశ్ఛాభావత్తస్మిన్ అనుతాపీమహాసురః

గురుపిత్రోశ్చకారైవం శుశ్రూషాంసోఽపిధర్మవిత్

శ్రీపరాశరుడు:

ఇట్లు పలికి మైత్రేయా! ఆతడు చూచు చుండగనే భగవానుడు అంతర్హితు డాయెను. ప్రహ్లాదుడు తండ్రికడకేగి పాదములకు మ్రొక్కగా తండ్రి వాని శిరము మూర్కొని కౌగిలించి వత్సా! బ్రతికి యుంటివా అని బాష్పార్ద్ర లోచనుడై పశ్చాత్తప్తుడై ప్రేమకల వాడయ్యెను. ధర్మవేత్తయగు ప్రహ్లాదుడు గురు జనకుల ఇట్లు సేవచేసెను.

పితర్యుపరతింనీతేనరసింహస్వరూపిణా

విష్ణునాసోఽపి దైత్యానాంమైత్రేయాభూత్పతిస్తతః

తద్రాజ్యభూతింసంప్రాప్యకర్మశుద్ధికరీంద్విజ

పుత్రపౌత్రాంశ్చసుబహునవాప్త్యైశ్వార్యమేవచ

క్షీనాదికారస్సయదాపుణ్యపాపవివర్జితః

తదాఽసౌభగవద్ధ్యానాత్పరంనిర్వాణమాప్తవాన్

ఏవంప్రభావోదైత్యోఽసౌ మైత్రేయాభూన్మహామతిః

ప్రహ్లాదోభగవద్భక్తో యంత్వంమామనుపృచ్చసి

యస్త్వేతచ్చరితంతస్యప్రహ్లాదస్యమహాత్మనః

శృణోతితస్యపాపానిసద్యోగాచ్చన్తిసంక్షయమ్

అహోరాత్రకృతంపాపం ప్రహ్లాదచరితం నరః

శృణ్వన్ పఠంశ్చమైత్రేయ వ్యాపోహతిన సంశయః

పౌర్నమాస్యామమావాస్యామష్టమ్యామథవా పఠన్

ద్వాదశ్యాంవాతదాప్నోతి గోప్రదానఫలంనరః

ప్రహ్లాదంసకలాపత్సు యథారక్షితవాన్ హరిః

తథారక్షతియస్తస్యశృణోతిచరితంసదా

నృసింహ రూపియైన విష్ణు భగవానుడు నుపాధిపోగా ప్రహ్లాదుడు అనుభవముచే కర్మశుద్ది కలిగించు రాజ్యలక్ష్మి నొంది పుత్రపౌత్ర ద్వైశ్వర్యము పొంది క్షీణింప ప్రారబ్దకర్మ పుణ్య పాప రహితుడై భగవ ద్ధ్యానము వలన ముక్తినొందెను. మైత్రేయా! ఏ ప్రహ్లాదుని గురించి నన్ను నీవడిగితివో ఆ రాక్షసుడగు ప్రహ్లాదుడిట్టి మహామతి. ఇట్టి మహానుభావుని చరితము విన్నవాని పాపములు వెంటనే నశింప గలవు. నిరంతర కృతపాపము కూడ నేతచ్చరిత్ర పఠనము నను శ్రవణమునను నశించును. సందేహము లేదు. పూర్ణిమ అమావాస్య అష్టమి ద్వాదశి తితులందు పఠించిన యెడల గోదాన ఫలము కలుగును. శ్రీహరి సర్వాపద లందు ప్రహ్లాదుని రక్షించినట్లే తచ్చరిత శ్రవణ మొనరించిన వానిని కూడా సదా రక్షించును.