శ్రీపరాశరుడు:
యదాఽభిషిక్త స్సపృథుః పూర్వంరాజ్యేమహర్షిభిః।
తతఃక్రమేణరాజ్యానిదదౌలోకపితామహః॥
నక్షత్రగ్రహవిప్రాణాంవీరుధాంచాప్య శేషతః।
సోమంరాజ్యేన్యధాద్ బ్రహ్మయజ్ఞానాంతపసామపి॥
రాజ్ఞాంవై శ్రవణం రాజ్యేజలానాం వరుణం తథా।
ఆదిత్యానాంపతింవిష్ణుం వసూనామథపావకమ్॥
ప్రజాపతీనాందక్షంతువాసవంమరుతామపి।
దైత్యనాందానవానాంచ ప్రహ్లాదమదిపందదౌ॥
పితౄణాంధర్మరాజానంయమంరాజ్యేభ్యషేచయత్।
ఐరావతంగజేన్ద్రాణామ శేషణాంపతిందదౌ॥
పతత్రిణాంచ గరుడం నాగానామపి వాసికిమ్।
ఉచ్పైశ్శ్రవసమశ్వానాం వృశభంతు గవామపి॥
మృగాణాంచైవసర్వేషాంరాజ్యేసింహందదౌప్రభుః।
శేషంతుదన్దశూకానామకరోత్పతిమన్వయః॥
హిమాలయంస్థావరాణాం మునీనాంకపిలంమునిమ్।
నఖినాందంష్ట్రిణాంచైవ మృగాణాంవ్యాఘ్రమీశ్వరమ్॥
వనస్పతీనాంరాజానం ప్లక్షమేవాభ్యషేచయత్।
ఏవమేవాన్యజాతీనాం ప్రాదాన్యేనాకరోత్ప్రభూన్॥
ఏవం విభజ్యరాజ్యనిదిశాపాలాననన్తరమ్।
ప్రజాపతిపతిర్ బ్రహ్మా స్థాపయామాససర్వతః॥
శ్రీపరాశరుడు:
పూర్వము పృథు చక్రవర్తిని మహర్షులు రాజ్యమునంద భిషేకించిన వెనుక క్రమముగా బ్రహ్మ రాజ్యముల నీయ మొదలిడెను. నక్షత్రములు గ్రహములు లతలు యజ్ఞములు తపస్సుల రాజ్యము నందు సోముని పతిగ నుంచెను. రాజుల రాజ్యమున కుబేరుని జలము రాజ్యమున వరుణుని ఆదిత్యుల రాజ్యమున విష్ణువును వసు రాజ్యమున నగ్నిని ప్రజాపతుల రాజ్యమున దక్షుని అదితి పుత్రులగు మరుత్తుల రాజ్యమున వాసవుని (ఇంద్రుని) దైత్య దానవుల రాజ్యమున ప్రహ్లాదుని అధిపతులుగా జేసెను. పితృ దేవతలకు యమధర్మ రాజుని, గజేంద్రములకు నైరావతమును, పక్షులకు గరుత్మంతుని, దేవతలకు వాసవుని, ఆశ్వములకు నుచ్పైశ్రవమును, గోవులకు వృషభమును, మృగము లన్నిటికిని సింహమును, సర్పములకు శేషుని, స్థావరములకు హిమవత్పర్వమును, మునులకు కపిల మహామునిని, నఖములు కోరలు ప్రధానముగా గల మృగములకు వ్యాఘ్రమును, వనస్పతులకు ప్లక్షము (జువ్విచెట్టు) ను, ఇతరములకు గూడ ఇట్లే ప్రాదాన్యమును పునస్కరించుకొని రాజ్యాధిపతుల జేసెను. ఇట్లు రాజ్యములను విభజించి దిక్పాలకులను గూడ బ్రహ్మ ఏర్పాటు జేసెను.
పూర్వస్యాందిశిరాజానంవై రాజస్యప్రజాపతేః।
దిశాపాలంసుధాన్వానమాత్మజంసోభ్య షేచయత్॥
దక్షిణస్యాందిశితథాకర్ద మస్యప్రజాపతేః।
పుత్రంశంఖపదంనామరాజానంసోభ్య షేచయత్॥
పశ్చిమాయాందిషితథారజసః పుత్రస్యమచ్యుతమ్।
కేతుమన్తంమహాత్మానంరాజానమభిషిక్తవాన్॥
తథాహిరణ్యరోమాణంపర్జన్యస్య ప్రజాపతేః।
ఉదీచ్యాందిశిదుర్ధర్షంరాజానమభిషేచయత్॥
తైరియంపృథివీసర్వాసప్తద్వీపాసకాననా।
యథాప్రదేశమద్యాపి ధర్మతః పరిపాల్యతే॥
ఏతేసర్వే ప్రవృత్తస్యస్థితౌ విష్ణోర్మహాత్మనః।
విభూతిభూతారాజానోయేచాన్యేమునిసత్తమ॥
యేభావిష్యన్తియేతీతాస్సర్వభూతేశ్వరాద్విజ।
తేసర్వేసర్వభూతస్య విష్ణోరంశసముద్భవాః॥
యేతుదేవాదిపతయోయేచదైత్యాధిపాస్తథా।
దానవానాంచాయేనాథాయేనాథాః పిశితాశినామ్॥
పశూనాంయేచపతయః పతయోయేచపక్షిణామ్।
మనుష్యాణాంచపతయోనాగానాంచాదిపాశ్చయే॥
వృక్షాణాంపర్వతానాంచగ్రహాణాంచాధిపాశ్చయే।
అతీతావర్త మానాశ్చయేభవిష్యన్తిచాపరే॥
తేసర్వేసర్వభూతస్య విష్ణోరంశసముద్భవాః॥
తూర్పు దిక్కునందు వైరాజ ప్రజాపతి పుత్రుడగు సుధన్వుని, దక్షిణ దిక్కునందు కర్దమ ప్రజాపతి పుత్రుడగు శంఖపదుని, పశ్చిమ దిక్కు నందు రాజ పుత్రుడును నాశ రహితుడును నగు మహానుభావుడు కేతుమంతుని, ఉత్తర దిక్కు నందు పర్జన్య ప్రజాపతి పుత్రుడును నేరికిని నెదుర్కొన శక్యము కాని వాడును హిరణ్యరోముడను వానిని బ్రహ్మ రాజులుగ నభిషేకించెను. ఆ దిక్పాలకులచే నీ సప్త ద్వీపములు పట్టణములతో నొప్పు భూమి యంతయు వానియా దేశమును మీరక ధర్మమును పునస్కరించుకొని యిప్పటికిని పరిపాలింప బడుచున్నది. వీరందరూ ప్రపంచస్థితి (పరిపాలనము) యందు ప్రవర్తించిన మహానుభావుడగు విష్ణు దేవుని విభూతు (ఐశ్వర్య)లే. ఇంక నితర రాజులు కాబోవు వారు పూర్వమయిన వారు ఇప్పుడున్న వారు అందఱును సర్వభూత మయుడగు విష్ణువు యొక్క యంశభూతులు. దేవ దైత్య దానవ రాక్షస పశు పక్షి మనుష్య సర్ప నాగ వృక్ష పర్వత గ్రహ ప్రభువులు అతీతులు వర్తమానులు భావులు వారందరున్ను విష్ణు దేవుని యంశ వలన పుట్టిన వారే.
నహిపాలనసామర్ థ్యమృతేసర్వేశ్వరంహరిమ్।
స్థితౌస్థితం మహాప్రాజ్ఞ భావత్యన్యస్యకస్యచిత్॥
సృజత్యేషజగత్సృష్టౌస్థితౌ పాతిసనాతనః।
హన్తిచైవాన్తకత్వేనరజస్సత్త్వాదిసంశ్రయః॥
చతుర్విభాగస్సంసృష్టౌచతుర్దా సంస్థితః స్థితౌ।
ప్రళయంచకరోత్యన్తేచతుర్భే దోజనార్ధనః॥
ఏకేనాంశేనబ్రహ్మాసౌభావత్యవ్యక్తమూర్తిమాన్।
మారీచిమిశ్రాఃపతయః ప్రజానామన్యభాగతః॥
కాలస్తృతీయ స్తస్యాంశస్సర్వభూతానిచాపరః।
ఇత్థంచతుర్దా సంసృష్టౌవర్తతేసౌరజోగుణః॥
ఏకాంశేనస్థితోవిష్ణుః కరోతిపరిపాలనమ్।
మన్వాదిరూపీచాన్యేన కాలరూపోఽపరేణచ॥
సర్వభూతేషుచాన్యేన సంస్థితః కురుతేస్థితమ్।
ససత్త్వగుణమాశ్రిత్య జగతః పురుషోత్తమః॥
ఆశ్రిత్యతమసోవృత్తిమన్తకాలేతథాప్రభుః।
రుద్రాస్వరూపోభగవానేకాంశేనభవత్యజః॥
అగ్న్యన్తకాదిరూపేణభాగేనాన్యేనవర్తతే।
కాలస్వరూపోభాగోఽన్యస్సర్వభూతానిచాపరః॥
వినాశంకుర్యతస్తస్యచతుర్థైవంమహాత్మనః।
విభాగకల్పనాబ్రహ్మన్ కథ్యతేసార్వకాలికీ॥
పరిపాలానా సామర్ధ్యము సర్వేశ్వరుడగు విష్ణువును వదలి మరి ఎవ్వరికిని నుండదు. ఈతడే సృష్టి కాలము నందు రజో గుణాశ్రితుడై సృష్టిని స్థితి కాలమున సత్త్వ గుణాశ్రితుడై పరిపాలనమును ప్రళయ కాలమున తమో గుణాశ్రితుడై లయమును చతుర్విభాగ పురస్సరముగ చేయు చున్నాడు. జనార్ధనుడు చతురంశలు గలవాడు. సృష్టి సమయమున రజో గుణవంతుడై ఒక అంశచే బ్రహ్మగను అవ్యక్త రూపుడాయెను. రెండవ అంశచే మరీచ్యాది ప్రజాపతులైరి. స్థితి కాలమున సత్వ గుణాశ్రితుడై ప్రథమాంశచే విష్ణువుగనై పాలనము చేయు చున్నాడు. రెండవ యంశచే మన్వాది రూపుడుగను మూడవ యంశచే కాలరూపుడుగను నాల్గవ యంశచే సర్వప్రాణు లందు నుండి స్థితిని (పరిపాలనమును) చేయు చున్నాడు. అంతకాలము నందు తమోగుణాశ్రితుడై ప్రథమాంశచే రుద్రా రూపుడుగను రెండవ యంశచే అగ్ని, అంతకుడు మున్నగు రూపములతోను మూడవ యంశలో కాల స్వరూపుడుగను నాల్గవ యంశలో సర్వ భూతముగనునై వినాశము చేయు చున్నది. ఈ విభాగము సార్వకాలికము.
బ్రహ్మాదక్షాదయః కాలాస్తథైవాఖిలజన్తవః।
విభూతయోహరేరేతా జగతస్సృష్టిహేతవః॥
విష్ణుర్మన్వాదయః కాలస్సర్వభూతానిచద్విజ।
స్థితేర్నిమిత్త భూతస్యవిష్ణోరేతావిభూతయః॥
రుద్రః కాలాన్తకాద్యాశ్చసమస్తాశ్చైవజన్తవః।
చతుర్దాప్రళయాయైతాజనార్ధనవిభూతయః॥
జగదాదౌతథామధ్యేసృష్టిరాప్రళయాద్ద్విజ।
ధాత్రామరీచిమిశ్రైశ్చక్రియతేజన్తుభిస్తథా॥
బ్రహ్మదక్షుడు మున్నగువారు కాలుడు అన్ని జంతువులు ఇవన్నియు జగత్తు యొక్క సృష్టి కారణములైన హరి విభూతులు విష్ణువు మన్వాదులు కాలము సర్వభూతమును ఇవన్నియు స్థితికి నిమిత్తమగు విష్ణువు యొక్క విభూతులు. రుద్రుడు కాలుడు అంతకుడు మున్నగు వారు సమస్త జంతువులు ఇవన్నియు ప్రళయమునకు నిమిత్తమగు జనార్దునుని విభూతులు. సృష్టి జగదాది యంది మధ్య మందు అంతము నందును ధాత మరీచ్యాదుల చేత చేయ బడుతున్నది.
బ్రహ్మాసృజత్యాదికాలేమరీచిప్రముఖాస్తథా।
ఉత్పాదయ న్త్వపత్యానిజన్తవశ్చ ప్రతిక్షణమ్॥
కాలేననవిణాబ్రహ్మాసృష్టినిష్పాదకోద్విజ।
నప్రజాపతయస్స ర్వే నచైవాఖిలజన్తవః॥
ఏవమేవవిభాగోఽయంస్థితావప్యుపదిశ్యతే।
చతుర్దాదేవ దేవస్య మైత్రేయ ప్రళయేతథా॥
యత్కించిత్సృజ్య తేయేనసత్త్వజాతేనవైద్విజ।
తస్యసృజ్యస్యసంభూతౌతత్సర్వం వైహరేస్తానుః॥
ఆ కాలము నందు బ్రహ్మ సృష్టిచేయును. తరువాత మరీచ్యాదులు. జంతువులు పక్షులు కూడ ప్రతిక్షణము సృష్టించు చుండును. కాలరూప మగు విభూతి లేకుండ బ్రహ్మగాని ప్రజాపతులు గాని సమస్త జంతువులు గాని సృష్టిని చేయజాలవు. స్థితిని లయమును చేయజాలవు. ఏ ప్రాణిచేత సృష్టి స్థితి లయములు చేయబడు చున్నను వానికెల్ల నిమిత్తము హరి శరీరమే.
హన్తియావత్క్వచిత్కించిద్భూతంస్థావరజంగమమ్।
జనార్ధనస్యతద్రౌద్రం మైత్రేయాన్తకరంవఫుః॥
ఏవమేశజగత్స్రష్టాజగత్పాతాతథాజగత్।
జగద్భక్షయితాదేవస్సమస్తస్యజనార్దనః॥
సృష్టిస్థిత్యన్తకాలేషు త్రిదై వంసంప్రవర్తతే।
గుణప్రవృత్త్యాపరమంపదం తస్యాగుణంమహత్॥
తచ్చజ్ఞానమయంవ్యాపిస్వసంవేద్యమనూపమమ్।
చతుష్ప్రకారంతదపిస్వరూపంపరమాత్మనః॥
ఈ విధముగ సృష్టి స్థితి లయములకు జనార్దనుడే కర్త. త్రిగుణ ప్రవృత్తిచే నిట్లు మూడు విధములై నాలుగు అంశలతో నుండును. గుణ ప్రకృతి రహితమైన పరమ పదము మహత్తు. అది జ్ఞానమయము. వ్యాపకము స్వప్రకాశము, సాటిలేనిది. పరమాత్మ స్వరూపమగు ఆ పదము కూడా నాలుగు రీతులు గలది.
మైత్రేయుడు:
చతుష్ప్రకారతాంతస్యజ్ఞానభూతస్యవైమునే।
త్వమాచాక్ష్వయథాన్యాయంయదుక్తంపరమం పదమ్॥
మైత్రేయుడు:
ఆ పరమ పదము బ్రహ్మ రూపమే గదా! దానికి చాతుర్విధ్య మెట్లు?
శ్రీపరాశరుడు:
మైత్రేయకారణంప్రోక్తంసాధనంసర్వవస్తుషు।
సాధ్యంచవస్త్వభిమతంయత్సాధయితుమాత్మనః॥
యోగినోమిక్తికామస్య ప్రాణాయామాదిసాధనమ్।
సాధ్యంచపరమంబ్రహ్మ పునర్నావర్తతేయతః॥
సాధనాలమ్బనంజ్ఞానంముక్తయేయోగినాంహియత్।
సభేదః ప్రతమస్తస్యజ్ఞానభూతస్యవైమునే॥
శ్రీపరాశరుడు:
సర్వ వస్తువులకును కారణమైన సాధన మందురు. దానిచే సాధించుటకు నభిమతమైన వస్తువే సాధ్యము. ముక్తిగోరిన యోగికి ప్రాణాయా మాదికము సాధనము. పునరావృత్తి రహితమైన పరబ్రహ్మ సాధ్యము. యోగులకు ముక్తి కొఱకై యోగ శాస్త్ర జన్యమైన ప్రాణాయామాది సాధన విషయమైన జ్ఞానమే చతుర్భేద జ్ఞానభూత బ్రహ్మయొక్క మొదటి భేదము.
యజ్ఞతఃక్లేశాముక్త్యర్థంసాధ్యంయద్బ్రహ్మయోగినః।
తదాలమ్బనవిజ్ఞానం ద్వితీయోంశోమహామునే॥
ఉభాయోస్త్వవిభాగేన సాధ్యసాధనయోఃహియత్।
విజ్ఞానమద్వైతమయం తద్భాగోఽన్యోమయోదితః॥
జ్ఞానత్రయస్యవైవస్యవిశేషోయోమహామునే।
తన్నిరాకరణద్వారాదర్శితాత్మస్వరూపవత్॥
నిర్ వ్యాపారమనాఖ్యేయం వ్యాప్తిమాత్రమనూపమమ్।
ఆత్మసంబోధవిషయం సత్తమాత్రమలక్షణమ్॥
ప్రశాన్తమభయంశుద్ధం దుర్విభావ్యమసంశ్రయమ్।
విష్ణోర్ జ్ఞానమయస్యోక్తం తద్ జ్ఞానంబ్రహ్మసంజ్ఞితమ్॥
తత్రాన్యజ్ఞానరోధేనయోగినో యాన్తియేలయమ్।
సంసారకార్షణోప్తౌతేయా న్తినిర్భీతాంద్విజ॥
ఏవంప్రకారమమలంనిత్యంవ్యాపకమక్షయమ్।
సమస్తభేదరహితం విష్ణ్వాఖ్యం పరమంపదమ్॥
క్లేశ నివృత్తి కొఱకై యాగా మభ్యసించు చున్న యోగికి సాధమగు బ్రహ్మ విషయక మగు జ్ఞానము రెండవ భేదము. (అనగా సాంఖ్య జన్యమగు ప్రకృతి వినిక్తాత్మ విషయక విశిష్ట జ్ఞానము). సాధ్యసాధన విభాగ రహితమై పరస్పరైక్య భావముతో బ్రహ్మైవాహం అహమేవ బ్రహ్మ అనెడి మనుష్యాది ద్వైత రహితాత్మ విషయ ప్రచురమైన విజ్ఞానము మూడవ భేదము. పైన చెప్పబడిన మూడు జ్ఞానములు (1. నేను దేహాది విలక్షుడను. 2. సచ్చిదానంద రూపమగు బ్రహ్మను. 3. బ్రహ్మను నేనే) యందలి విశేషాంశ పరిత్యాగ పూర్వకముగ చూపబడిన నిర్విశేషాత్మ స్వరూపము గలదియు. వ్యాపార శూన్యము (సాధనానుష్టాన రహితము) నాకు రూప గోచరము కానిదియు, వ్యాపించు నదియు, సాటి లేనిదియు, స్వప్రాకాశము, సత్తామాత్రము,( అపక్షయాది రహితము) స్త్రీత్వాదిలింగ గమ్యము కానిదియు ప్రశాంతము = ఆశనాయాది షడ్మూరి రహితము శుద్దము = కర్మ రహితము. ఉహాతీతము. ఆశ్రయ శూన్యమును బ్రహ్మ సంజ్ఞితమగు జ్ఞానమయుడగు విష్ణు జ్ఞానము నందు ఇతర జ్ఞాన నిరోధముచే అంతిమ జ్ఞాన బలముచే పొందు యోగులు, సంసార కేదారము నందు నిర్భీజతను అనగా పునరావృత్తి లేక పోవుటను పొందుదురు. ఇదియే విష్ణుపదము.
తత్బ్రహ్మపరమంయోగీపునర్నావర్తతేయతః।
అపుణ్యపుణ్యోపరమః క్షీనక్లే శోఽతినిర్మలః॥
ద్వేరూపేబ్రహ్మణస్తస్యమూర్తంచామూర్తన్ మేవచ।
క్షరాక్షరస్వరూపేతేసర్వభూతేశ్వవస్థితే॥
అక్షరంతత్పరంబ్రహ్మక్షరంసర్వమిదంజగత్।
ఏకాదేశస్థితస్యాగ్నేర్ జ్యోత్సాన్నవిస్తారిణీయథా॥
పరస్యబ్రహ్మణశ్శక్తిస్తథేదమఖిలంజగత్॥
తత్రాప్యాసంనదూరత్వాద్బహుత్వస్వల్పతామయః।
జ్యోత్స్నాభేదోఽస్థితచ్చాక్తేస్తద్వన్మైత్రేయవిద్యతే॥
బ్రహ్మవిష్ణుశివాబ్రహ్మన్ ప్రధానాబ్రహ్మశక్తయః।
తతశ్చదేవామైత్రేయ! న్యూనాదక్షాదయస్తథా॥
తతోమానుష్యాఃపశవోమృగపక్షిసరీసృపాః।
న్యూనాన్యునతరాశ్చైవవృక్షగుల్మాదయస్తతః॥
తదేతదక్షరం నిత్యంజగన్మునివరాఖిలమ్।
ఆవిర్భావతిరోభావజన్మనాశవికల్పవత్॥
ఇది పాప శూన్యము శాశ్వతము, వ్యాపకము నాశ రహితము. హేయ శూన్యము. పునరావృత్తి శూన్యము. పాపనాశము కాగా క్లేశ ద్వంసము కాగా నిర్మలుడై ఈ పదము నందును బ్రహ్మ రూపములు రెండు. క్షరము, అక్షరము. మూర్థము అమూర్థము. ఇవి సర్వ భూతము లందు గలవు. ఆ పరాబ్రహ్మ అక్షర రూపము. సమస్త జగత్తక్షర రూపము. ఒక ప్రదేశమున నున్న అగ్ని యొక్క కాంతి విస్తరించి నట్లు పరబ్రహ్మ శక్తియే ప్రపంచము. సామీప్య దూరత్వాదులచే అగ్నికి బహు త్వాల్పత్వముల వలె తచ్చక్తికి కూడా తారతమ్య ముందును. బ్రహ్మ శక్తులయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధానులు. దేవతలు దక్షాదులు అంతకంటె న్యూనులు. అంతకంటె మనుష్యులు అంతకంటె పశువులు మున్నగు వారు అల్పులు, అల్పతరులు. ఓ మునివరా! ఈ జగత్తంతయు నిత్యము అక్షరము. ఆవిర్భావతి రోభావములచే జన్మ నాశ వికల్పములు కలుగు చుండును.
సర్వశక్తిమయోవిశ్నుస్స్వరూపం బ్రహ్మణోఽపరమ్।
మూర్తంయద్యోగిభిః పూర్వం యోగారమ్భేషుచిన్త్యతే॥
సాలమ్బనోమహాయోగాస్సాబీజోయత్రసంస్థితః।
మనస్యవ్యాహతేసమ్యగ్యుంజతాంజాయతేమునే॥
సపరస్సర్వశక్తీనాంబ్రహ్మణస్సమనన్తరమ్।
మూర్తంబ్రహ్మమహాభాగసర్వ బ్రహ్మమయో హరిః॥
యత్రసర్వమిదంప్రోతమోతంచైవాఖిలంజగత్।
తతోజాతంజగత్తస్మిన్ సజగాచ్చాఖిలంమునే॥
క్షరాక్షరమాయోవిష్ణుఃబిభర్త్యఖిలమీశ్వరః।
పురుషావ్యాకృతమయం భూషణాస్త్రస్వరూపవత్॥
ప్రవాహమువలె స్నది నిత్యము. సర్వశక్తి మయుడు విష్ణువు. బ్రహ్మ యొక్క పరస్వరూపము. అందు మూర్త రూపమును యోగులు యోగారంభము నందు ధ్యానింతురు. మనస్సు ఏకాగ్రము కాగా దివ్యరూప విషయము గూడిన డగుటచే సాలంబమై, మంత్రా నుసంధనాది యుక్త మగుటచే సభీజమైన మహాయోగము యోగులకు సమాధి పర్యంతము ఆ రూపమున కలుగును. ఆ విష్ణువు సర్వ శక్తుల కంటె నుత్కృష్టుడు. అపర రూపము బ్రహ్మకు సన్నిహితము. బ్రహ్మ మూర్తరూపుడు. హరి సర్వ బ్రహ్మమయుడు. ఆ హరి యందే సమస్త జగత్తు ఓతప్రోత భావమున నున్నది. పడుగుపేకగా నల్లుకొన్నది. ఆయన వలన జగత్తు. జగత్తు నందు ఆ హరి. క్షరాక్షర రూపుడగు శ్రీహరి భూషణాస్త్ర స్వరూపము గల పురుష ప్రకృతి రూపమగు జగత్తును భరించు చున్నాడు.
మైత్రేయుడు:
భూషణాస్త్రస్వరూపస్థంయదేదఖిలంజగత్।
బిభర్తిభగవన్ విష్ణుస్తన్మమాఖ్యాతుమర్హసి॥
మైత్రేయుడు:
భూషణాస్త్ర స్వరూపమున నున్న యీ జగత్తును విష్ణువు భరించు చున్న సంగతిని తెలుపుదురు గాక!
శ్రీపరాశరుడు:
నమస్కృత్వాప్రమేయాయవిష్ణవే ప్రభవిష్ణవే।
కాథయామీయథాఖ్యాతంవసిష్ఠేనమమాభవత్॥
ఆత్మానమస్యజగతోనిర్లే పమగుణాలయమ్।
బిభర్థికౌస్థుభమణిస్వరూపంభగవాన్ హరిః॥
శ్రీవత్ససంస్థానపరమనన్తేనసమాశ్రితమ్।
ప్రధానంబుద్ధిరధ్యాస్తే గదారూపేణచస్థితమ్॥
చలస్వరూపమత్యంతంజవేనాన్తరితానిలమ్।
చక్రస్వరూపంచమనోధత్తేవిష్ణుః కరేస్థితమ్॥
పంచరూపాతుయామాలానై జయన్తీగదాభృతః।
సాభూతహేతుసంఘాతోభూతమాలాచ వైద్విజ॥
యానీన్ద్రియాణ్యశేషాణిబుద్దికర్మాత్మకానివై।
శరరూపాణ్యశేషాణితానిధత్తేజనార్దనః॥
బిభర్తియచ్చాసివరమచ్యుతోఽత్య న్తనిర్మలమ్।
విద్యామయంతుయద్ జ్ఞానమవిధ్యాచర్మ సంస్థితమ్॥
ఇత్థంపుమాన్ ప్రదానంచబుధ్యహంకారమేవచ।
భూతానిచహృషీకేశేమనస్సర్వేన్ద్రియాణిచ॥
విద్యావిద్యేచమైత్రేయ! సర్వమేతత్సమాశ్రితమ్॥
అస్త్రభూషణసంస్థానస్వరూపంరూపవర్జితః।
బిభర్తిమాయారూపోఽసౌ శ్రేయసేప్రాణినాంహరిః॥
శ్రీపరాశరుడు:
సమర్ధుడు అప్రమేయుడునగు విష్ణు దేవునకు నమస్కరించి వశిష్టునిచే నాకు చెప్పబడిన విషయమును చెప్పెదను. భగవంతుడగు శ్రీహరి కౌస్తుభమణి రూపమున నీ జగత్తు యొక్క స్వచ్చమగు రూపమును ధరించు చున్నాడు. శ్రీవత్స రూపముతో నున్న ప్రధానమును ధరించు చున్నాడు. బుద్ది అనగా మహాత్తత్త్వము గదా రూపమున మాధవుని యందున్నది. భూతముల కాది భూతమగు తామసాహంకారమును శంఖ రూపముతోను ఇంద్రియములకు నాది భూతమగు రాజసాహంకారమును శార్జదనూ రూపమునను ధరించు చున్నాడు. మిక్కిలి చంచలమును వేగముచే వాయువు నతిక్రమించి నదియు నగు మనస్సును సుదర్శన చక్ర రూపమున హస్తమున ధరించు చున్నాడు. ముక్తామాణిక్య మరకతేంద్రనీలవ్రజ రూపమై పంచరూపములతో నున్న గదాధరుని వైజయంతీ మాల పంచభూత హేతువులగు పంచ తన్మాత్రల సంఘాతమైన భూతమాలయే. జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను అన్నిటిని అశేష బాణ రూపమున జనార్ధనుడు ధరించు చున్నాడు. అచ్యుతుడు ధరించు చున్న అతి నిర్మలమైన ఖడ్గరత్నము అవిద్యామయ కోశమందు దాచబడిన విద్యామయమగు జ్ఞానమే ఈ విధముగ హృషీకేశుడు ప్రదానమును బుద్ది (మహాత్తత్త్వము) అహంకార ద్వయమును భూత పంచకమును మనస్సును సర్వేంద్రియములను విద్యాఽవిద్యలను అస్త్రభూషణ రూపమున నున్న వానిని అరూపుడై ధరించు చున్నాడు. ప్రాణుల శ్రేయస్సు కొఱకై మాయారూపుడై వికారములతో గూడిన ప్రకృతిని సకల జగత్తును ధరించు చున్నాడు.
సవికారంప్రధానంచపూమాంసంచాఖిలంజగత్।
బిభర్తిపుణ్డరీకాక్షస్త దేవంపరమేశ్వరః॥
యావిధ్యాయాతథావిద్యా యథ్సద్యచ్చాసదవ్యయే।
తత్సర్వంసర్వభూతేశే మైత్రేయ! మధుసూదనే॥
కలాకాష్టానిమేషాదిదినర్ త్వయనహాయనైః।
కాలస్వరూపోభగవానపరోహరిరవ్యయః॥
భూర్లోకోథభువర్లోకస్స్వర్లోకోమునిసత్తమ।
మహార్జనస్తపస్సత్యంసప్తలోకా ఇమేప్రభుః॥
మఱియు విద్యాఽవిద్యలును సదసత్తులును సర్వ భూతేశుడైన మధు సూదనుని యందు గలవు. కళా కాష్టా నిమేష దిన ఋతు ఆయన సంవత్సరాది కాల స్వరూపుడు భగవంతుడు. అపాపుడు నాశరహితుడు. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్య లోకములు ఏడును ఈ ప్రభువే.
లోకాత్మమూర్తిస్సర్వేషాం పూర్వేషామపిపూర్వజః।
ఆధారస్సర్వభూతానాం స్వయమేవహారిస్థ్సితః॥
దేవమానుషపశ్వాదిస్వరూపిర్భాహుభిర్విభుః।
స్థితస్సర్వేశ్వరోఽనన్తో భూతమూర్తి రమూర్తిమాన్॥
ఋచోయజూమ్షిసామానితథై వాధర్వణానిచ।
ఇతిహాసోపవేదాశ్చ వేదాన్తేషుయథోక్తయః॥
వేదాంగనిసమస్తానిమన్వాదిగదితానిచ।
శాస్త్రాణ్యశేషాణ్యాఖ్యానాన్యనువాకాశ్చయేక్వచిత్॥
కావ్యాలాపాశ్చయేకేచిద్గీతకాన్యఖిలానిచ।
శబ్దమూర్తిధరసయితద్వాపుర్విష్ణోర్మహాత్మనః॥
యానిమూర్తాన్యమూర్తాని యాన్యత్రాన్యాత్రవాక్వచిత్।
సన్తినై వస్తుజాతాని తానిసర్వాణితద్వపుః॥
అహంహరిస్సర్వమిదంజనార్ధనో నాన్యత్తతఃకారణకార్యజాతమ్।
ఈదృఙ్మనోయస్యనతస్యభూయో భవోద్భవాద్వణ్ద్వగదాభవన్తి॥
ఇత్యేహతేంశః ప్రథమః పురాణస్యాస్యవైద్విజ।
యథావత్కథితోయస్మిన్ ధృతేపాపైః ప్రముచ్యతే॥
కార్తిక్యాంపుష్కరస్థానేద్వాదశాబ్దేతుయత్ఫలమ్।
తదస్యశ్రవణేసర్వం మైత్రేయాప్నోతిమానవః॥
దేవర్షితృగన్దర్వయక్షాదీనాంచసంభవమ్।
భవన్తిశృణ్వతఃపుంసో దేవాద్యావరదామునే॥
సమస్త లోక రూపమగు నాకారము గలవాడై పూర్వజులకు కూడ పూర్వజుడై సర్వ విద్యలకు నాధార భూతుడై శ్రీహరి స్వతంత్రుడై యున్నాడు. దేవ మనుష్య పశ్వాది బహు రూపములతో నమూర్తి మంతుడగు నీ సర్వేశ్వరుడు భూతమూర్తియు ననంతుడు నగుచున్నాడు. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఉప వేదములు ఇతిహాసములు వేదాంత (ఉపనిషద్) సూక్తులు వేదాంగములు మన్వాడి స్మృతులు సమస్త శాస్త్రములు ఉపాక్ష్యానములు అనువాకములు వాక్య ప్రసంగములు గీతములు ఇవి యున్నవి శబ్ద రూపధరుడగు విష్ణు భగవానుని శరీరమే. మూర్తములు గాని అమూర్తములు గాని యగు వస్తు సముదాయ మంతయు వాని శరీరమే. కార్యకారణ రూపమగు నీ విశ్వమంతయు నా జనార్ధనుని కంటె వేరుగాదు. ఆ హరిని నేనై యున్నాను. అను బుద్ది ఎవరికి కల్గునో అతనికి శరీరము వలన కలిగెడి రాగ దేశాదులు కాని హృద్రోగాములు కాని సంభవింపవు. ఓ బ్రాహ్మణుడా! విష్ణు పురాణ మండలి ప్రథమాంశము పూర్తిగా నీకు చెప్పితిని. దీనిని ధరించుటచే జనుడు సర్వపాప నిర్ముక్తు డగును. మైత్రేయా! ఈ ప్రథమాంశమును వినుట వలన మానవుడు కార్తిక మాసమందు పుష్కర క్షేత్రము నందు పన్నెండు సంవస్తారములు స్నానము చేసిన వచ్చెడి ఫలము కలుగును. దేవ ఋషి పితృ గంధర్వ యక్షాదుల జన్మ వృత్తాంతమును వినువానికి దేవతలు మొదలగు వారు వరప్రదాత లగుదురు.
Summary of chapter 22 of the Vishnu Mahā Purāṇa is as follows:
The cosmic earth-milking (pṛthivī-dohanam) is narrated: Pṛthu, as the first sovereign, levels mountains, creates plains, and then milks the earth as a cosmic cow. Different groups — devas, ṛṣis, pitṛs, nāgas, asuras, and yakṣas — each milk the earth with different vessels and calves, receiving different kinds of nourishment. Pṛthu is established as the one from whom the earth receives the name Pṛthvī. The chapter also contains teachings on Viṣṇu's cosmic vibhūtis — his immanent manifestations in all excellent things in the cosmos.