విష్ణు మహా పురాణము

38 - కృష్ణావతారగమనానంతరము - పరీక్షిత్పట్టాభిషేకము

శ్రీపరాశరుడు:

అర్జునోపితదాన్వీక్ష్యరామకృష్ణకళేబరే

సంస్కారంలమ్భయామాసతతాన్యేషామనుక్రమాత్

అష్టౌమహిష్యః కథితారుక్మిణీప్రముఖాస్తుయాః

ఉపగుహ్యహరేర్దేహం వివిశుస్తాహుతాశనమ్

రేవతీచాపిరామస్య దేహమాశ్లిష్యసత్తమా

వివేశజ్వలితం వహ్నిం తత్సంగాహ్లాదశీతలమ్

ఉగ్రసేనస్తుతచ్చ్రుత్వా తథైవనకదున్దుభిః

దేవకీరోహేణీచైవ వివిశుర్జాతవేదసమ్

శ్రీపరాశరుడు:

అర్జునుడు బలరామకృష్ణ శరీరములను గాంచి సంస్కారము గావించెను. మఱియుం గల యందరకును క్రమముగా నది యోనరించెను. రుక్మిణి మొదలుగా గల అష్టమహిషులు కృష్ణ శరీరముం గౌగిలించికొని యగ్ని ప్రవేశము సేసిరి. రేవతి బలరామ దేహమును గౌగిలించి ప్రజ్వలదగ్నిం జొచ్చెను. ఆమె తాకినంత నగ్ని యానంద భరితుడై చల్లనయ్యెను. అది విని ఉగ్రసేనుడు వసుదేవుడు దేవకి రోహిణియు నగ్నిం జొచ్చిరి.

తతోర్జునః ప్రేతకార్యం కృత్వాతేషాం యథావిధి

నిశ్చక్రామజనం సర్వం గృహీత్వావజ్రమేవచ

ద్వారవత్యానిష్క్రన్తాః కృష్ణపత్న్యస్సహస్రశః

వ్రజంజనంచకౌ న్తేయః పాలయన్ శనకైర్యయౌ

సభాసుధర్మాకృష్ణేనమర్ త్యలోకేసముజ్ఘితే

స్వర్గం జగామమైత్రేయపారిజాతశ్చపాదపః

యస్మిన్ దినేహరిర్యాతోదివం సంత్యజ్యమేదినీమ్

తస్మిన్మేవావతీర్ణోయం కాలకాయోబలీకలిః

ప్లావయామాసతాం శూన్యాం ద్వారకాంచ మహోదధిః

వాసుదేవగృహం త్వేకం నప్లావయతిసాగరః

నాతిక్రాన్తుమలంబ్రహ్మం స్తదద్యాపిమహోదధిః

నిత్యం సన్నిహితస్తత్ర భగవాన్ కేశవోవ్యయః

తదతీవమహాపుణ్యం సర్వపాతక నాశనమ్

విష్ణుశ్రియాన్వితం స్థానందృష్ట్వాపాపాద్విముచ్యతే

పార్థః పఞ్చనదేదేశే బహుధాన్యధనాన్వితే

చకారవాసం సర్వస్య జనస్యమునిసత్తమ

అర్జునుడు ప్రేత కృత్య మెల్లరకు యథావిధిం గావించి తక్కిన జనముం గొని వజ్రుని వెంటనిడికొని బయలు దేరారు. ద్వారావతి నుండి వెడలిన వేల కొలదిగ గల కృష్ణ భార్యలను వజ్రుని పురజనుముం గాపాడుచు నల్లన నేగెను. కృష్ణుడు మర్త్యలోకముం బాయగనే సుధర్మయను నింద్రసభయ పారిజాతమును స్వర్గమున కేగెను. ఏ దినమున హరి దివమ్మున కరిగె నానాడె నల్లనిమేని వాడు బలీయుడు నైన కలి యవనికిం దిగెను. మహోదధి శూన్యమైపోయిన యీ ద్వారకా నగరమును ముంచివేసెను. వాసుదేవ మందిరము నొక్కదానిని మాత్రము ముంచడయ్యెను. ఓ బ్రహ్మణ్యుడ! విను మిప్పటికిని సముద్రుడా నగర మాక్రమింప లేకున్నాడు. అక్కడ నవ్యయుండగు కృష్ణ భగవానుడు నిత్య సన్నిహితుడై యున్నాడు. ఆ స్థానము సర్వపాథక నాశనము మహాపుణ్యము. విష్ణు శ్రీసంపన్నము. దర్శనము సేసినంత బాపము పోవును. ద్వారకావాసుల కందరకు నర్జునుడు బహుధాన్య ధన సమృద్దమైన పంచనదమను దేశ మందునికి యేర్పరచెను.

తతోలోభస్సమభవత్పార్థేనై కేనధన్వినా

దృష్ట్వాస్త్రియోనీయమానా దస్యూనాం నిహతేశ్వరాః

తతస్తేపాపకర్మణోలోభోపహతచేతసః

ఆభీరామంత్రయామాసుస్సమేత్యాత్యన్తదుర్మదాః

అయమేకోర్జునోధన్వీజనం నిహత్యేశ్వరమ్

నయత్యస్మానతిక్రమ్యధిగేతద్భావతాం బలమ్

హర్యాగర్వసమారూఢోభీష్మద్రోణజయద్రథాన్

కర్ణాదీంశ్చనజానాతిబలం గ్రామనివాసినామ్

యష్టిహస్తానవేక్ష్యాస్మాన్ ధనుష్పాణిస్సదుర్మతిః

సర్వానేవావజానాతికింవోబాహుభిరున్నతైః

తతోయష్టిప్రహరణాదస్యవోలోష్టదారిణః

సహస్రశోఽభ్యదావన్తతం జనం నిహతేశ్వరమ్

తతోనిర్భత్స్యకౌన్తేయః ప్రాహాభీరాన్ హసన్నివ

నివర్తధ్వమధర్మజ్ఞా యదినస్థముమూర్షవః

అవజ్ఞాయవచస్తస్యజగృహు స్తేతదాధనమ్

స్త్రీధనంచైవమైత్రేయవిష్వక్సేనపరిగ్రహమ్

తతోఽర్జునోధనుర్దివ్యం గాణ్దీవమజరంయుధి

ఆరోపయితుమారేభేనశశాకచవీర్యవాన్

చకారసజ్యం కృచ్ఛ్రాచ్చతచ్చాభూచ్చిథిలంపునః

నసస్మారతతోస్త్రాణిచిన్తయన్నపిపాణ్డవః

శరాన్ముమోచచై తేషుపార్థోవై రిష్వమర్షితః

త్వగ్భేదంతే పరంచక్రురస్తాగాణ్డీవధన్వనా

వహ్నినాయేఽక్షయాదత్తాశ్శరాస్తేపిక్షయంయుయుః

యుధ్యతస్సహగోపాలై రర్జునస్యభవక్షయే

అచి న్తయచ్చ కౌన్తేయః కృష్ణస్యైవహితద్బలమ్

యన్మయాశరసంఘాతై స్సకలాభూభబృతోహతాః

మిషతః పాణ్డుపుత్రస్యతతస్తాః ప్రమాదోత్తమాః

అభీరైరపక్రుష్యన్తకామం చాన్యాః ప్రదుద్రువుః

తతశ్శరేషుక్షీణేశుధనుష్కోట్యాధనంజయః

జఘానదస్యూం స్తేచాస్యప్రహారాన్ జహసుర్మునే

ప్రేక్షత స్తస్యపార్థస్యవృష్ణ్యన్ధకవరస్త్రియః

జగ్మురాదాయతేమ్లేచ్చాస్సమస్తా మునిసత్తమ!

తతస్సుదుఃఖితోజిష్ణుః కష్టం కష్టమితిబ్రువన్

అహోభగవతాఽనేన ముష్టోఽస్మీతిరురోదవై

తద్ధనుస్తానిశస్త్రాణి సరథస్తేచవాజినః

సర్వమేకపదేనష్టం దానమశ్రోత్రియేయథా

ఆహోతిబలవద్దైవం వినాతేనమహాత్మనా

యదసామార్ థ్యయుక్తేఽపి నీచవర్గేజయప్రదమ్

తౌబాహూసచామేముష్టిః స్థానం తత్సోస్మిచార్జునః

పుణ్యేనై వనినాతేన గతం సర్వమసారతామ్

మమార్జునత్వం భీమస్యభీమత్వం తత్కృతం ధ్రువమ్

వినాతేనయదాభీరై ర్జితోహం రథినాం వరః

అటుమీద విల్లుపూని యొక్కడ పార్థుడు విధవలైన స్త్రీలను గొనిపోవుట చూచి దొంగలకు ఆశ పొడమెను. ఆ పాపకర్ము లొండొరుల గదిసి మిగుల పొగరెక్కిన వాండ్రై ఇడుగో ఒక్కడర్జునుడు విగత భర్తృక మయిన స్త్రీజనమును గొని మనల నతిక్రమించి కొని పోవుచున్నాడు. ఛీ ఛీ! మీ బలమేపాటిది? భీష్మద్రోణ జయద్రథులను కర్ణుని జంపి పొగరెక్కి పల్లెటూరి వాండ్రమగు మన బల మెఱుంగ కున్నాడు. కర్రచే కొనిన మనలం గని దుర్మతి వీడు తాను ధనుష్పాణియై నేను మేటి విల్కాడనని మనలనందర నవమానించు చున్నాడు. ఎందులకు మనకీ పొడవు చేతులు? అని యా దొంగలు కర్రలు గొని మంటి యిటుకలు గొని వేలకొలది మంది యా విధవా జనముపై పరువెత్తిరి. అది చూచి యర్జునుడయ్యా భీరులం జూచి నవ్వుచునే ధర్మజ్ఞాన హీనులు మీరు బ్రతుక దలతురేని మరలి పొండనెను. అతని మాట నీసడించి వాండ్రు ధనమును, కృష్ణుని భార్యలయిన స్త్రీ ధనమును గాజేసిరి. అంత నర్జునుడు యుద్దమున వమ్ముగాని గాండీవము జేకొని యెక్కిడ బూనెను. కాని యదిసేయ లేకపోయె. అతికష్టము మీద నెక్కిడెను గాని యది యప్పుడే శిథిలమై పోయెను. అటుపై నెంతయాలోచించినను అస్త్రములు జ్ఞాపకము రావయ్యెను. ఈసుగొని వీండ్రపై బాణములను విసరెను. అవి వారి చర్మముం జించిన వంతియ. అగ్నిదేవుడిచ్చిన అక్షయ బాణము లవికూడ కృష్ణుడు లేనందున అయ్యల కాపరులతో బోరునెడ క్షయము నందెను అప్పుడు కౌంతేయుడు ఇంతకు మున్ను నా బలమది యంతయు కృష్ణునిదే. దాననే సర్వరాజులం బాణ జాలములం గూల్చితిని. అని యతడు రెప్పవేసినంతలో నా మ్రుచ్చులాభీరులా యంగనమణుల యథేచ్చను లాగికొని పోయిరి. కొందఱాడు వాండ్రు పారిపోయిరి. ఆ మీద నమ్ములు వమ్మువోగా నర్జునుడు వింటికొప్పున నా దొంగలం గొట్టెను. ఆ దెబ్బలను గని వారు పరిహసించిరి. అతడు సూచు చుండగానే యా మ్లేచ్చులు వృష్ణ్యంధక స్త్రీ జనము నంతను గొనిపోయిరి. అందులకు జయశీలి అర్జునుడు ఎంత కష్టమెంత కష్టమని దుఃఖించి ఆహా! భగవంతునిచే నేనిట్లు బలము హరింప బడినవాడను అయితినని బోరున నేడ్చెను. అదే విల్లు, అవే యమ్ములు, అదే రథము, అవే గుఱ్ఱములు. ఇవి యెల్ల ఆ మహాత్ముడు లేమిని నొక్కయడుగున అశ్రోత్రియునికి ఇచ్చిన దానము వలె నడగారి పోయెను. ఆహా! దైవమెంత బలవంతమైనది! అసమర్థ మయిన నీచ వర్గమునకు కూడ జయము గూర్చినది. అవే బాహువులు. అదే గుప్పిలి. స్థానమదే. ఆ అర్జునుడు నేను. పుణ్యము లేమిచే వలె నాతడు లేమిచే సర్వము నసారమయి పోయినది. నా కర్జునత్వము భీమునికి భీమత్వము నిక్కముగ నాతడు సేసినది. ఆతడు లేమి నాభీరులచే రథికశ్రేష్ఠుడ నేనోటు వడితిని.

శ్రీపరాశరుడు:

ఇత్థం వదన్ యయౌజిష్ణురిన్ద్రప్రస్థం పురోత్తమమ్

చకారతత్రారాజానం వ్రజంయాదవనన్దనమ్

సదదర్శతతోవ్యాసం ఫల్గునః కాననాశ్రయమ్

తముపేత్యమహాభాగం వినయేనాభ్యవాదయత్

తంవన్దమాణంచరణావ వలోక్యమునిశ్చిరమ్

ఉవాచవాక్యం విచ్చాయః కథమధ్యత్వమీదృశః

అవీరజోనుగమనం బ్రహ్మహత్యాకృతాథవా

దృఢాశాభఙ్గదుఃఖీవభ్రష్టచ్చాయోసిసాంప్రతమ్

సాంతానికాదయోవాతేయాచామానానిరాకృతాః

అగమ్యస్త్రీరతిర్వాత్వం యేనాసివిగతప్రభః

భుఙ్త్కెప్రదాయవిప్రేభ్యోమృష్టమీకోథవాభవాన్

కింవాకృపణవిత్తానిహృతానిభవతార్జున

కచ్చిన్ను శూర్పవాతస్యగోచరత్వంగతోర్జున

దుష్టచక్షుర్హతోవాపినిశ్ర్శీకః కథమన్యథా

స్సృష్టోనఖామ్భసావాఽథ ఘటవార్యుక్షితోఽపివా

కేనత్వంవాఽసిచ్చాయో న్యూనైర్వాయుధినిర్జితః

తతః పార్థోవినిః శ్వస్య శ్రూయతాం భగవన్నితి

ప్రోక్త్వాయథావదాచష్టే వ్యాసాయాత్మపరాభవమ్

శ్రీపరాశరుడు:

అని పలుకుచు జయశీలి యర్జునుడు ఇంద్రప్రస్థ పురమున కేగెను. అక్కడ యాదవ నందనుని వజ్రుని రాజుం జేసెను. అటుపై నతడరణ్య మందున్న వ్యాసుని దర్శించెను. అమ్మహానుభావుని జేరి వినయము మెయి మ్రోక్కెను. అమ్ముని తన యడుగుల కెక్కువ సేపు నమస్కరించు చున్న యతనిం గని ఏమిది? నీవిట్లు వన్నె దఱిగితివి! ముట్టుతం గూడితివ! లేక బ్రహ్మ హత్యా సేసితివా? ఏదో దృఢాభిలాష భంగమయి దుఃఖితుడయి నట్లిదె కాంతి దఱిగి యున్నావు. నీ సంతతి వారు జ్ఞాతులు మొదలయిన వారు నిన్ను యాచింపగా నిరాకరించితివా? అగమ్య స్త్రీ గమనము సేసితివా? ప్రభ తఱిగి యున్నావేమి? విప్రులకు బెట్టక మృష్టాన్నమీవ కుడిచితివా? దీన జనుల ధనము హరించితివా? అర్జునా! ధాన్యాదుల నెగురబోయు చేటనుండి వచ్చు గాలి కెదురైతివా? దిష్టి తగిలిన వాడనై శోభ గోల్పోయితివా? గోళ్ళ నుండి జారు నుదకము స్పర్శ పొంది కుండ నీళ్ళచే స్నానము చేసి ఛాయ తరిగితివా? నీకంటె దక్కువ వారిచే యుద్దమున నోడితివా? అని వ్యాసులు ప్రశ్నింప పార్థుండు నిట్టూర్పు చెంది స్వామీ! వినవలయునని తన పరాభవ వృత్తాంత మెల్ల పూస గ్రుచ్చినట్లు విన్నవించెను.

అర్జునుడు:

యద్బలం యచ్చతత్తేజో యద్వీర్యంయః పరాక్రమః

యాశ్రీశ్చాయాచనస్సోఽస్మాన్పరిత్యజ్యహరిర్గతః

ఈశ్వరేణాపిమహాతాస్మితపూర్వాభిభాషిణా

హీనావయం మునేతేనజాతాస్తృణమయా ఇవ

అస్త్రాణాం సాయకానాంచ గాణ్డీవస్యతథామమ

సారతాయాభవన్మూర్తిస్సగతః పురుషోత్తమః

యస్యావలోకనాదస్మాన్ శ్రీర్జయస్సం పదున్నతిః

నతత్యాజసగోవిన్దస్త్యక్త్వాఽస్మాన్భగవాన్ గతః

భీష్మద్రోణాఙ్గరాజాద్యాస్తథాదుర్యోధనాదయః

యత్ప్రభావేననిర్దగ్దాస్సకృష్ణస్త్యక్తవాన్భువమ్

నిర్యౌవనాగతశ్రీకా నష్టచ్చాయేవమేదినీ

విభాతితత! నైకోఽహం విరహేతస్యచక్రిణః

యస్యప్రభావావాద్భీష్మాద్యైః మయ్యగ్నౌశలభాయితమ్

వినాతేనాద్యకృష్ణేన గోపాలై రస్మినిర్జితః

గాణ్దీవస్త్రిశులోకేషు ఖ్యాతిం యదనుభావతః

గతస్తేనవినాఽభీరలగుడై స్సతిరస్కృతః

స్త్రీసహస్రాణ్యనేకానిమన్నాథాని మహామునే

యతతోమమనీతానిదస్యుభిర్లగుడాయుదైః

ఆనీయమానమాభీరైః కృష్ణకృష్ణావరోధనమ్

హృతం యష్టిప్రహరణైః పరిభూయబలంమమ

నిశ్ర్శీకతానమేచిత్రం యజ్జీవామితడద్భుతమ్

నీచావమానపఙ్కాఙ్కేనిర్లజ్జోఽస్మిపితామహ!

అర్జునుడు:

బలము ప్రతాపము తేజస్సు పరాక్రమము వీర్యము శోభ కాంతి అన్నియు మాకే హరియో ఆ కృష్ణుడు మమ్ము విడిచి వెళ్ళినాడు. ఈశ్వరుడు మహానుభావుడు చిరునవ్వు మున్నుగ పలకరించు వాడునైన యాతడు లేని వారమై మేము తృణ ప్రాయులమయినాము. అస్త్రములు అమ్ములు నాగండీవము సారవంతము లగుట కేమూర్తి కారణమో ఆ పురుషోత్తముడు వెళ్ళి పోయినాడు. ఎవని చూపున మమ్ము శ్రీజయము సంపత్సమృద్ది విడువలేదో అట్టి గోవిందుడు భగవంతుడు మమ్ము విడిచి వెళ్ళినాడు. భీష్మ ద్రోణాంగ రాజాదులు దుర్యోధనాదులు నెవ్వని ప్రభావమున నిర్దగ్దులైరి, ఆ కృష్ణుడు భూమిని విడిచినాడు. ఆ చక్రి ఎడబాటున ప్రాయము వాసి శ్రీతఱిగి కాంతి సెడి మేదిని వెలవెల బోవుచున్నది. ఎవ్వని ప్రభావముచే భీష్మాదులు నిప్పయిన నా యందు శలభములు (మిడుతలు) అయినారో అట్టి కృష్ణుడు లేమి నేను గొల్లల కోడిపోయితిని. ఎవ్వని యనుభావముచే నా గాండీవము త్రిలోక విఖ్యాతి నందెనో అది యిపుడతడు లేమి నా భీరుల కర్రలకు చచ్చుపడి పోయినది. అనేక స్త్రీ సహస్రములు నేనే దిక్కయినవి. నేనెంత యత్నించినను నా దొంగల బడితెలకు లొంగి కొంపో బడినవి. కృష్ణాంతఃపురము కృష్ణ కృష్ణా! వట్టి కర్రలతో నా బలము వమ్ముసేసి కొనిపో బడినది. నేను శోభా హీనుడను అగుట నాకు వింత గాదు. ఇంకను నేను బ్రతికి యున్నాను. ఇది చిత్రము. తాత గారూ! నీచుల వలని యవమానమను పెందడింబడి సిగ్గు చెడియున్నాను. అనవిని వ్యాసులు

వ్యాసులు:

అలంతేవ్రీదయాపార్థ! నత్వంశోచితుమర్హసి

అవేహిసర్వభూతేషు కాలస్యగతిరీదృశీ

కాలోభవాయభూతానామభవాయచపాణ్డవ

కాలమూలమిదంజ్ఞాత్వా భవస్థైర్యపరోర్జున

నద్యస్సముద్రాగిరాయస్సకలాచవసుంధరా

దేవామనుష్యాః పశవ స్తరవశ్చసరీసృపాః

సృష్టాః కాలేనకాలేన పునర్యాస్యన్తిసంక్షయమ్

కాలాత్మకమిదం సర్వం జ్ఞాత్వాశమమవాప్నుహి

కాలస్వరూపీభగవాన్ కృష్ణః కమలలోచనః

యచ్చాత్థకృష్ణమహాత్మ్యంతత్తథై వధనం జయ

భారావతరకార్యార్థమవతీర్ణస్సమేదినీమ్

భారాక్రాన్తాధరాయాతాదేవానాం సమితిం పురా

తదర్థమవతీర్ణోసౌకాలరూపీజనార్దనః

తచ్చానిష్పాదితం కార్యమశేషాభూభుజోహతాః

వృష్ణ్యన్ధకకులం సర్వం తథాపార్థోపసంహృతమ్

నకించిదన్యత్కర్తవ్యం తస్యభూమితలేప్రభోః

అతో గతస్సభగవాన్ కృతకృత్యోయథేచ్చయా

సృష్టిం సర్గేకరోత్యేషదేవదేవః స్థితౌస్థితిమ్

అన్తేన్తాయాససమర్థోయం సాంప్రతం వైయథాగతః

తస్మాత్పార్థనసంతాపస్త్వయాకార్యః పరాభావే

భవన్తిభావాః కాలేషుపురుషాణాం యతః స్తుతిః

త్వయైకేనహతాభీష్మద్రోణకర్ణాదయోరణే

తేషామర్జునకాలోత్థః కిం న్యూనాభిభవోనసః

విష్ణోస్తస్యప్రభావేనయథాతేషాం పరాభవః

కృతస్తథై వభవతో దస్యుభ్యస్సపరాభవః

సదేవేశశ్శరీరాణి సమావిశ్యజగత్థ్సితిమ్

కరోతిసర్వభూతానాం నాశమన్తేజగత్పతిః

భగోదయేకౌన్తేయ! సహాయోభూజ్జనార్ధనః

తథాఽన్తేతద్విపక్షాస్తేకేశవేనవినాశితాః

కశ్శ్రద్దధ్యాత్సగాం గేయాన్ హన్యాస్త్వం కౌరవానితి

ఆభీరేభ్యశ్చభవతః కశ్శ్రద్దధ్యాత్పరాభవమ్

పార్థైతత్సర్వభూతస్య హరేర్లీలావిచేష్టితమ్

త్వయాయత్కౌరవాధ్వస్తా యదాభీరైర్భవాన్ జితః

గృహీతాదస్యుభిః ర్యాశ్చ భవాన్ శోచతితాస్త్రియః

తదప్యహంయథావృత్తం కథయామితవార్జుస!

వ్యాసులు:

పార్థ! సిగ్గుపడకు. శోకింపకు. సర్వభూతము లందు కాలగతి యిట్టిదని యెఱుంగుము. భూతములు పుట్టుటకు గిట్టుటకు కాలము కారణము. ఇదెల్ల కాలమూల మణి తెలిసి స్థైర్యపరుడ వగుము. నదులు సముద్రములు గిరులు వసుంధర దేవతలు మనుష్యులు పశువులు తరువులు పాములు కాలము చేబుట్టి కాలముచే గిట్టును. ఇదంతయు కాలాత్మకమని తెలిసి శమింపుము. కృష్ణ భగవానుడు కమల లోచనుడు కాలరూపి. ధనుంజయ! కృష్ణ! మహాత్మా! నీవేమి యుగ్గడించితి వదియట్లే. భారావతరణమున కాతడవని నవతరించెను. మున్ను బరువోర్వ రానిదై భూమి దేవసభ కేగెను. అందులకే కాలరూపి యీ విష్ణు నవతార మెత్తెను. ఆ పని జరిపింప బడినది. అశేష రాజులు హతులయిరి. వృష్ణ్యంధక కులము కూడ నిట్లే నుపసంహృత మయినది. భూమి తలమున నా ప్రభువున కింక జేయ వలసిన దేకొంచెము లేదు. ఇందుచే కృతార్థుడై యాయన స్వేచ్చగా నేగెను. ఈయన సర్గ కాలమందు సృష్టిని స్థితికాల మందు స్థితిని తుదకంతమును జేయ సమర్థు డిపుడు వెళ్ళినాడు. కావున నీ వోటమికి సంతాప పడవలదు. ఆయా కాలమందు పురుషులకు స్తుతి కలుగును. నీ యోంటి చేత భీష్మ ద్రోణ కర్ణాదు లోడిరన్న నది వారికి కాలప్రాప్త మయిన క్రిందివాని వలననైన యోటమి కాదా! విష్ణు ప్రభావమున నంతవారికా పరాభవ మెట్లో యట్లే నీకును దొంగల వలన పరాభవము జరుప బడినది. ఆ దేవేశ్వరుడు పలుమేను లందావేశించి జగత్ స్థితి సేయును. ఆ జగత్పతి తుదకు సర్వభూత నాశముం జేయును. నీకు భాగ్యోదయ మయినది. నీకాయన సహాయు డయ్యెను. అట్లే తుదకు నీ శత్రువుల నా హరి తుద ముట్టించెను. నీవు గాంగేయాదులను కౌరవులను జంపితి వన్న నెవ్వడు నమ్మును? ఈ అభీరులచే గొల్లలచే నీ పరాభవమును మాత్రమెవ్వడు నమ్మును? సర్వము తానైన హరియొక్క లీలా విలాస మిది. నీచే కురవులు ధ్వంసమయి రన్న గొల్లలచే నీవోడితివి వన్న నీవెవ్వరి కోసము శోకించు చున్నా వా స్త్రీలు మ్రుచ్చులచే గొంపో బడిరన్న దీనికి మున్ను నడచిన కథ నీ కర్జునా! చెప్పెద వినుము

అష్టావక్రః పురావిప్రో జలవాసరతోఽభవత్

బహూన్ వర్షగణాన్ పార్థ! గృణన్ బ్రహ్మసనాతనమ్

జితేష్వసురసం ఘేషుమేరుపృష్ఠే మహోత్సవః

బభూవతత్రగచ్చన్త్యోదదృశుస్తం సురస్త్రియః

రంభాతిలోత్తమాద్యాస్తుశతశోథసహస్రశః

తుష్టువు స్తంమహాత్మానం ప్రశశం సుశ్చపాణ్డవ

ఆకణ్ఠమాగ్నం సలిలేజటాభారవహమ్మునిమ్

వినయావనతాశ్చేనంప్రణేముస్త్సోత్రతత్పరాః

యథాయథాప్రసన్నోసౌతుష్టువు స్తంతథాతథా

సర్వాస్తాః కౌరవ శ్రేష్ఠతం వరిష్ఠం ద్విజన్మనామ్

మున్ను అష్టావక్రుడను విప్రుడు సనాతన బ్రహ్మముం జపించుచు పెక్కేండ్లు నీట నివసింప నెంచెను. అసుర సంఘము లోడిపోగా మేరు పృష్ఠమందు పెద్ద యుత్సవ మయ్యెను అచటి కేగుచు సురకాంతలాతని జూచిరి. రంభా తిలోత్తమాదులు వందలు వేలు ఆ మహాత్ముని గీర్తించిరి. కొనియాడిరి. కంఠము లోతున నుండి జటాభారము దాల్చియున్న యమ్మునిని వారు వినయ వినతులై ప్రణమిల్లిరి. ఆయన ప్రసన్నుడగు నంత వరకు నయ్యెల్లరు నా ద్విజ వరిష్ఠుని స్తుతించిరి. అంత నాత డిట్లనియె.

అష్టావక్రుడు:

ప్రసన్నోఽహం మహాభాగా భవతీనాం యదిష్యతే

మత్తస్తద్ర్వియతాం సర్వం ప్రదాస్యామ్యతిదుర్లభమ్

రంభాతిలోత్తమాద్యాస్తం వైదిక్యోప్సరసోబ్రువన్

ప్రసన్నేత్వయ్యపర్యాప్తం కిస్మాకమితిద్విజ

ఇతరా స్త్వబ్రువన్ విప్ర! ప్రసన్నో భగవాన్ యది

తదిచ్చామః పతిం ప్రాప్తుం విప్రేన్ద్ర! పురుషోత్తమమ్

అష్టావక్రుడు:

మహానుభావలార! సంతుష్టుడ నైతిని. మీరు నావలన నేమి కోరుదురు, దుర్లభమయినది యిత్తు ననియె. రంభాది దివ్యాప్సరసలు నీవు ప్రసన్నుడ వయితేని మాకిక లోటేమి యున్న దనిరి. తదితరులు కొందఱు స్వామీ! నీవు భగవంతుడవు. ప్రసన్నుడవేని పురుషోత్తముడు మా పతి కావలయు నని కోరుచున్నా మనిరి.

వ్యాసులు:

ఏవం భావిష్యతీత్యుక్త్వాహ్యుత్తతారజలాన్మునిః

తముత్తీర్ణఞ్చదద్రుశుర్విరూపం వక్రమష్టధా

తందృష్ట్వాగుహామానానాం యాసాం హాసస్స్ఫుటోఽభవత్

తాశ్శశాపమునిః కోపమవాప్యకురునన్దన

యస్మాద్వికృతరూపం మాంమత్వాహాసావమాననా

భవతీభిః కృతాతస్మాదేతం శాపం దదామివః

మత్ప్రసాదేనభర్తారం లబ్ధ్యాతు పురుషోత్తమమ్

మచ్చాపోపహతాస్సర్వా దస్యుహస్తం గమిష్యథ

ఇత్యుదీరితమాకర్ ణ్య మునిస్తాభిః ప్రసాదితః

పునస్సురేన్ర్దలోకంవై ప్రాహభూయోగమిష్యథ

ఏవంతస్యమునేశ్శాపాదష్టావక్రస్య చక్రిణమ్

భర్తారం ప్రాప్యాతాయాతాదస్యుహ స్తంసురాఙ్గనాః

తత్త్వయానాత్రాకర్తవ్యశ్శోకోల్పోపిహిపాణ్డవ

తేనై వాఖిలనాథేనసర్వంతదుపసం హృతమ్

భవతాం చోపసంహార ఆసన్న స్తేనపాణ్డవ

బలంతేజ స్థాథావీర్యం మాహాత్మ్యం చోపసంహృతమ్

జాతస్యనియతోమృత్యుః పతనఞ్చతథోన్నతేః

విప్రయోగావసానస్తుసంయోగస్సఞ్చయేక్షయః

విజ్ఞాయనబుధాశ్శోకంన హర్షముపయాన్తియే

తేషామేవేతరేచేష్టాం శిక్ష న్తస్సన్తితాదృశాః

తస్మాత్త్వయానరశ్రేష్ఠజ్ఞాత్వైతద్భ్రాత్త్వైతద్భ్రాతృభిస్సహ

పరిత్యజ్యాఖిలం తన్త్రం గంతవ్యంతపసేవనమ్

తద్గచ్చధర్మరాజాయనివేద్యైతద్వచోమమ

పరశ్శ్వోభ్రాత్రుభిస్సార్థం యథాసితథాకురు

వ్యాసులు:

అమ్ముని ఎట్లే యగునని నీటి నుండి వెలికి వచ్చెను. ఆ వచ్చిన వాని వికృత రూపము ఎనిమిది వంకరలు గల దానిని వారు చూచిరి. అతని జూచి చాటునవ్వు నవ్వెడి వారి నవ్వు

ఆయనకు వినబడెను. దాన కోపము గని ముని వికృత రూపుడ నగు నన్ను కని పరిహసించి యవమానింతిరి గావున మీకు శాపమిచ్చెద. నా సాకతమున మీరు విష్ణువుం భర్తగా బడిసి నా శాపము దగిలి మీరందఱు దస్యువుల చేజిక్కుదురు గాక! అని పలికినది విని వారు బ్రతిమాల మఱి మీరందఱు సురేంద్ర లోకమున కేగుదురు గాక యనియె. ఇట్లా ముని శాపముచే చక్రిని భర్తగ బడిసి యా దేవాంగనలిప్పుడు దస్యుల చేజిక్కిరి. పాండవ! ఇందీవించుకయు శోకింప వలదు. అఖిలనాథు డా హరి చేతనే సర్వము నుపసంహృతము. అతని చేతనే మీ యొక్కయు నుపసంహారము దగ్గరయయి యున్నది. నీ తేజో బలవీర్యాదు లాయన చేతనే యుప సంహృతము. పుట్టిన వానికి చావు తప్పదు. ఎత్తు నుండి పడుట తప్పదు. కూడుట వీడుట కొఱకే. పెఱుగుట తఱుగుటకే. ఇది బుధులెఱిగి శోకింపరు. హర్షింపరు. అట్టి వారిలో గొందరిది యితరులకు కూడ యలవరుప నుందురు. అందువలన నో నరవర! ఇది తెలిసి అన్నదమ్ములతో నఖిల తంత్రమును విడిచి తపస్సునకు వనమేగ నగును. కావున నీవేగుము. నా వచనము ధర్మరాజునకు నివేదించి ఎల్లుండి సోదరులతో గూడ వెల్లునట్టు ఏర్పాటు సేయుము.

ఇత్యుక్తోఽభ్యేత్య పార్థాభ్యాం యమాభ్యాంచసహార్జునః

దృష్టంచై వానుభూతంచ సర్వలాఖ్యాతవాం స్తథా

వ్యాసవాక్యం చతేసర్వే శ్రుత్వాఽర్జునముఖేరితమ్

రాజ్యేపరీక్షితం కృత్వాయయుః పాణ్డుసుతావనమ్

ఇత్యేతత్తవమైత్రేయ! విస్తరేణ మయోదితమ్

జాతస్యయద్యదోర్వం శేవాసుదేవస్యచేష్టితమ్

యశ్చైతచ్చరితం తస్యకృష్ణస్యశ్రుణుయాత్సదా

సర్వపాపవినిర్ముక్తోవిష్ణులోకం సగచ్చతి

అని వ్యాసునిచే దెలుపబడి ధర్మజ భీములకు నకుల సహదేవులకు తానట్లు జూచిన, యనుభవించిన, దెల్ల యట్లనే చెప్పెను. పాండవులు వ్యాసు వాక్యమర్జునుని ముఖమున బలుక బడిన దాలించి పరీక్షిత్తుని రాజ్యము నందు నిలిపి వనమేగిరి. మైత్రేయ! ఇట్టిది యదు వంశమందు బుట్టిన వాసుదేవుని చేష్టితమేను విస్తరించి చెప్పితిని. కృష్ణుని యీ చరితము నెవ్వడు విను నాతడు సర్వపాప విముక్తుడై విష్ణు లోకమేగును.