కథితం భగవన్ బ్రహ్మన్ మమైతదఖిలంత్వయా।
భూవర్లోకాదికాన్ లోకాన్ శ్రోతుమిచ్చామ్యాహం మునే॥
తథైవగ్రహసంస్థాన ప్రమాణానియథాతథా।
సమాచక్ష్వమహాభాగమహ్యంత్వాంపరిపృచ్చతే॥
“ఓ లోమహర్షణ! నీవు సర్వమును మాకు తెలిపితివి. భువర్లోకము మొదలగు లోకములను, గ్రహ సంస్థానమను వాని ప్రమాణమును తెలుపుము” అని మునిని మునులడుగ లోమహర్షణు డిట్లనియె.
శ్రీపరాశరుడు:
రవిచన్ద్రమసోర్యావన్మయూఖైరవభాస్యతే।
ససముద్రసరిచ్ఫైలా పాపతీపృథివీస్మృతా॥
యావత్ప్రమాణాపృథివీవిస్తారపరి మణ్డలాత్।
నభాస్తావత్ర్పమాణంవై వ్యాసమన్డలతోద్విజ॥
భూమేర్యోజనలక్షేతుమైత్రేయ రవిమణ్డలమ్।
అక్షేదివాకరస్యాపిమణ్డలం శశినఃస్థితిమ్॥
పూర్ణేశతసహశ్రేతుయోజనానాంనిశాకరాత్।
నక్షత్రమణ్డలంకృత్స్నముపరిష్టాత్ప్రకాశతే॥
ద్విలక్షేచోత్తరేబ్రహ్మన్ బుధోనక్షత్రమణ్డలాత్।
తావత్ప్రమాణభాగేతుబుధస్యాప్యుశనాస్థితః॥
అఙ్గారకోపిశుక్రస్యతత్ర్పమాణేవ్యవస్థితః।
లక్షద్వయేనభౌమస్య స్థితూదేవపురోహితః॥
సౌరిర్ బృహస్పతేశ్చోర్ ధ్వంద్విలక్షేసమవస్థితః।
సప్తర్షిమణ్డలంతస్మాల్లక్షమేకంద్విజోత్తమ॥
ఋషిభ్యస్తుసహస్రాణాంశతాదూర్ ధ్వంవ్యవస్థితః।
మేధీభూతస్సమస్తాస్యజ్యోతిశ్చక్రస్యవైధ్రువః॥
త్రైలోక్యమేతత్కథితముత్సే దేనమహామునే।
ఇజ్యాఫలస్యభూరేషా ఇజ్యాచాత్ర ప్రతిష్ఠితా॥
శ్రీపరాశరుడు:
సూర్యచంద్రుల కిరణ ప్రసారము కలదా సముద్ర శైల పరివృతమై యున్న పృథివీ మండలము భూమి యొక్క విస్తారమెంతో దానికి మీదనున్న అంతరిక్ష విస్తారము నంతే. భూమికి లక్ష యోజనములలో సౌరమండల మున్నది. దానికి లక్ష యోజనములలో చంద్ర మండల మున్నది. దానికి లక్ష యోజనముల మీద నక్షత్ర మండల మున్నది. ఆ నక్షత్ర మండలమునకు రెండు లక్షల యోజనములలో నుత్తరమున బుధుడు కలడు. అతనికంతే దూరములో శుక్రుడు. అంతే దూరములో అంగారకుడు(కుజుడు) గలరు. అక్కడకు రెండు లక్షల యోజనముల దూరములో బృహస్పతియు, అటకు రెండు లక్షల యోజనములలో శని, ఆ మీద లక్ష యోజనములలో సప్తర్షి మండలము, దానికి లక్ష యోజనములలో జ్యోతి శ్చక్రమునకెల్ల కేంద్ర స్థానమైన ధ్రువ మండలము నున్నవి. ఈ యంతరిక్ష లోకము జ్యోతిర్మండలము. ఇది యజ్ఞ ఫలమునకు స్థానము. ఇజ్య (యజ్ఞము) ఇందు బ్రతిష్టితమై యున్నది. “క్షిప్రంహి మానుషే లోకే సిద్దిర్భవతి కర్మజా” మనుష్య లోకమున కర్మఫల సిద్ది వేగముగా గల్గును.
ద్రువాదూర్ ద్వంమహర్లోకోయత్రతేకల్పవాసినః।
ఏకయోజనకోటీతుయాత్రతేకల్పవాసినః॥
ద్వేకోట్యౌతుజనోలోకోయత్రతేబ్రాహ్మణస్సుతాః।
సనన్ధనాధ్యః కథితాః మైత్రేయామలచేతసః॥
చతుర్గుణోత్తరేచోర్ ధ్వం జనలోకత్తపస్స్మృతః।
వైరాజాయత్రతేదేవాః స్థితాదేహవివర్జితాః॥
షడ్గుణేనతపోలోకాత్సత్యలోకోవిరాజతే।
అపునర్మారకాయత్రాబ్రహ్మలోకోహిసంస్మృతః॥
ధ్రువ లోకమునకు మీద నోకకోటి యోజనములలో కల్పాంత జీవులు నివసించు మహర్లోక మున్నది. దానిపై రెండు కోట్ల యోజనములలో జనోలోక మున్నది. అది బ్రహ్మ మానస పుత్రులు నిర్మల చిత్తులునైన సనక సనందనాదు లుండెడి స్థానము. జనలోకమునకు పై ఎనిమిది కోట్ల యోజనములలో తపో లోక మున్నది. అచట వైరాజులను దేహ రహితులైన (విదేహులు) దేవతలు నివసింతురు. తపోలోకముకు పై నాఱు యోజనములలో సత్యలోకము విరాజిల్లు చున్నది. అచటి సిద్ధాది మును లుందురు. అది అపునర్మారకము. తిరిగి ధర్మము లేని పుణ్య లోకము బ్రహ్మలోకము.
పాదగామ్యంతుయత్కించిద్వస్త్వస్తిపృథివీమాయమ్।
సభూర్లోకస్సమాఖ్యాతో విస్తారోఽస్యమయోదితః॥
భూమిసూర్యాన్తరంయత్తు సిద్దాది ముని సేవితమ్।
భువర్లోకస్తూసోప్యుక్తోద్వితీయో మునిసత్తమ॥
ద్రువసూర్యాన్తరంయత్తునియుతాని చతుర్దశ।
స్వర్లోకస్సోపిగాదితో లోక సంస్థాన చిన్తకైః॥
త్రైలోక్యమేతత్కృతకం మైత్రేయ పరిపఠ్యతే।
జనస్తాపస్తథాసత్యమితిఛాకృతకంత్రయమ్॥
కృతాకృతకయోర్మధ్వేమహర్లోక ఇతిస్మృతః।
శూన్యోభవతికల్పాన్తేయోత్యన్తంనవినశ్యతి॥
పాదగమ్యమైన భూభాగమంతయు భోలోకము. దీని విస్తారము చెప్పబడెను. భూమికిని సిద్దాది ముని సేవితమైన సూర్య లోకమునకు నడిమి భాగము భువర్లోకము (అంతరిక్షము) అని చెప్పబడును. ఇది రెండవ లోకము. సూర్యునకు ధ్రువునకును నడుమ గల చతుర్దశ నియుత (లక్ష) పరిమాణమైన లోకము స్వర్లోకము. ఈ మూడు లోకములకు కృతకము (కర్మ సంపాద్యము) లను పేరు గలదు. ఆ మీద జనత పస్సత్య లోకములు మూడును ఆకృతకము లనబడును. కృతకాకృతకములు నడిమి భాగము మహర్లోకము. (దీనికి కృతకా కృతమని పేరు) ఇది కల్పాంత మందు శూన్యమగును కాని నశింపదు.
ఏతేసప్తమహాలోకామై త్రేయకథితాస్తవ।
పాతాళానిచాసప్తైవ బ్రహ్మాణ్డస్యైషవిస్తరః॥
ఏతదణ్డకటాహేనతిర్యక్చోర్ ధ్వమాధస్తథా।
కపిత్థస్యయథాబీజం సర్వతోవై సమావృతమ్॥
దశోత్తరేణపయసా మైత్రేయాణ్డం చతద్వృతమ్।
సర్వోఽమ్భుపరిధానోఽసౌవహ్నినావేష్టితో బహిః॥
వహ్నిశ్చవాయువాయుర్మైత్రేయనభసావృతః।
భూతాదినానభాస్సోఽపిమహతాపరివేష్టితః॥
దశోత్తరాణ్యశేషాణి మైత్రేయైతానిసప్తవై॥
మహాన్తంచసమావృత్ర్యప్రధానం సముపస్థితమ్।
అనన్తస్యనాతస్యాన్తస్సంఖ్యానంవాపివిద్యతే॥
తదనన్తమసంఖ్యాత ప్రమాణంచాపివైయతః।
హేతుభూతమశేషస్య ప్రక్రుతిస్సాపరామునే॥
అణ్డానాంచసహస్రాణాంసహస్రాణ్యయుతానిచ।
ఈదృశానాంతథాతత్రకోటికోటిశతానిచ॥
దారుణ్యగ్నిర్యథాతైలంతిలేతద్వాత్పుమానపి।
ప్రధానేఽవస్థితోవ్యాపీచేతనాత్మాత్మవేదనః॥
ప్రధానంచపుమాంశ్చైవ సర్వభూతాత్మభూతయా।
విష్ణుశక్త్యామహాబుద్దే వృతౌసంశ్రయధర్మిణౌ॥
తయోస్సైవప్రుథగ్భావకారణంసంశ్రయస్యచ।
క్షోభకారణభూతాచసర్గకాలేమహామతే॥
బ్రాహ్మణులారా! సప్త మహాలోకములు సప్త పాతాళములు నాచే చెప్ప బడినవి. ఇది బ్రహ్మాండము యొక్క విస్తృతి. అండ కటాహముతో కింద మీద నడుమ వ్యాపించి వెలగపండు విత్తనము వలె నుండునది బ్రహ్మాండము. దీనికి పదిరెట్లు విరివిగల యుదకము వహ్నిచే నావరింప బడియున్నది. అయ్యగ్ని వాయువుచే నది యాకాశాముచే నాకాశము మహాత్తత్వముచే పదేసిరెట్లు పరిమాణము గల దానితో నావరింపబడి యున్నది. మహాతత్తత్వము నావరించి ప్రధాన మున్నది. అది అనంతము. దానికి లెక్క లేదు. అది సమస్త సృష్టికి హేతువైన పరాప్రకృతి. ఇట్టి అనంత కోటి కోటి ప్రకృతులందు దారువు నందగ్నివలె నువ్వులందు తైలము వలె చేతనాత్మకమైన పురుష తత్వము, అనగా పరబ్రహ్మ వస్తువు ప్రదానమందు వ్యాపించి యున్నది. ఈ ప్రధానము పురుష తత్వము సార్వభూతముల యనుభూతిలో నున్న విష్ణుశక్తిచే ధరింపబడి పరస్పరాశ్రయ ధర్మము కలవియై యున్నవి. ఆ రెంటి పృథగ్భావమునకు, సంశ్రయమునకు ఆ విష్ణు శక్తియే కారణము.
యథాసక్తంకలేవాతో బిభర్తికణికాశతమ్।
శక్తిస్సాఽపితథావిష్ణోః ప్రధానపురుషాత్మకమ్॥
యథాచపాదపోమూలస్కన్దశాఖాదిసంయుతః।
ఆదిబీజాత్పరభవతి బీజాన్యన్యానివైతతః॥
ప్రభావన్తితతస్తేభ్యస్సంభావంత్యపరేద్రుమాః।
తేఽపితల్లక్షణద్రవ్యకారణానుగతామునే॥
ఏవమవ్యాకృతాత్పూర్వంజాయన్తేమహాదాదయః।
విశేషాన్తాస్తత స్తేభ్యస్సంభవన్తిసురాదయః॥
తేభ్యశ్చపుత్రాస్తేషాంచ పుత్రాణామపరేసుతాః॥
బీజవృక్షప్రరోహేణయథానాపచయస్తరోః।
భూతానాంభూతసర్గేణనై వాస్త్యపచాయస్తథా॥
సన్నిదానద్యథాకాశకాలద్యాఃకారణంతరోః।
తథైవాపరిణామేన విశ్వస్యభగవాన్ హరిః॥
వ్రీహిబీజేయథామూలంనాలంపత్రాఙ్కురౌతథా।
కాణ్డంకోశస్తథాపుష్పంక్షీరంతద్వచ్చతణ్డులమ్॥
తుషఃకణాశ్చసన్తోవై యా న్త్యావిర్ భావమాత్మనః।
ప్రరోషహేతుసమగ్ర్యమాసాద్యమునిసత్తమ॥
తథాకర్మస్వనేకేషుదేవాద్యాస్సమవస్థితాః।
విష్ణుశక్తింసమాసాధ్యప్రరోహముపయాన్తివై॥
సచవిష్ణుఃపరంబ్రహ్మయతస్సర్వమిదంజగత్।
జగచ్చ యోయత్రచేదం యస్మిమ్శ్చలయమేష్యతి॥
తద్బ్రహ్మపరమంధామ సదసత్పరమంపదమ్।
యస్యసర్వమభేదేన జగదేతచ్చరాచరమ్॥
స ఏవమూలప్రకృతిః వ్యక్తరూపీజగచ్చసః।
తస్మిన్నేవలయం సర్వం యాతితత్రచతిష్ఠతి॥
కర్తాక్రియాణాంససఇజ్యతేక్రతుస్స ఏవతత్కర్మ ఫలంచ తస్యయత్।
యుగాదియత్సాధనమాప్యశేషం హరేర్నకించిద్వ్యతిరిక్తమస్తితత్॥
సృష్టికాల మందు విష్ణు శక్తియైన మాయ (ప్రకృతి) యే కారణ రూపమైన తత్త్వము నందు క్షోభకు కారణ మగును. అదే ప్రథమ స్పందనము. ఈ శక్తి, వాయువు నీటి బిందువు లందలి చలువను భారించినట్లు ప్రధాన పురుషాత్మకమై యీ జగత్తును భరించును. చెట్టు మొదలు స్కంధము (బోదె) కొమ్మలు రెమ్మలు ఆకులతో మొదటి విత్తనము నుండి పుట్టును. ఆ చెట్టు నుండి మఱల విత్తనము పుట్టును. ఈ క్రమము నంద పుట్టిన చెట్లు మొదలయిన వాని లక్షణములు తత్తద్రవ్యములీ కారణముల ననుసరించి యున్నట్లే యీ జగత్పరంపర (బీజ పరంపర) అనంతమైన జగత్కారణమైన విష్ణువు ననుసరించి యుండును. ఆ విష్ణువే యవ్యాకృతతత్వము. ఆ బీజము నుండియే మహత్తు అహంకారము సమిష్టి మనస్సు మొదలగునవి వ్యాక్రుతమగు చున్నవి. అవ్యాకృతమునే యవ్యక్తమని వ్యాకృతమును వ్యక్తమని శాస్త్రము వ్యవహరించినది). అహంకార తత్త్వము నుండి దేవవర్గము తత్పుత్రులు పౌత్రులు జనించిరి. బీజము నుండి మొలక నుండి వృక్షము తద్భాగములు పుట్టినపుడు బీజాదులకు నాశము లేనట్లు భూతముల పరిణామము వలన మూల భూతముల కపచయము లేదు. వృక్షమునకు నాకాశము కాలము మొదలైన ద్రవ్యములు సన్నిధాన మాత్రమున కారణ మైనట్లు సర్వ సాక్షిమయిన భగవంతుని సన్నిధాన మాత్రమున బొడమెడి నామ రూపాత్మక వివిధ సృష్టి వలన సర్వాదిష్టాన మైన భగవత్త్వమునకు నుపచాయాపచయములు లేవు. హరి పరిణామము లేకుండగనే కారణ మగుచున్నాడు. ధాన్యపు గింజలో మూలము కాడ, మొలక, ఆకు, కోశము, పువ్వు, క్షీరము, ధాన్యము, బియ్యము, ఊక, తవుడు మొదలయిన పదార్దములు (అవ్యక్తముగ) ఇమిడి యుండి తరువాత వ్యక్తమైనట్లు పరమాత్మ యందు సృష్టి కారణ సామగ్రి యయిన అనేక కర్మ బీజములు దేవాద్యుపాధులు జీవ శరీరమును నిండి యుండి విష్ణు శక్తి వలన యప్పరమాత్మ నుండి యావిర్భావమును బొందు చున్నవి. కావున నీ జగమెల్ల పుట్టిపెరిగి లయించుటకు హేతువైన విష్ణువే పరబ్రహ్మ మన బడును. అదియే పరంధామము, పరమపదము, సదసద్రూపము ననబడు పరతత్త్వము. చరాచరమైన యీ జగత్తు అభేద దృష్టి చేత నతడే యగును. మూల ప్రకృతియు వ్యక్త రూప మగు జగత్తును నతడే. ఆతని యందే సర్వము నిలుచు చున్నది. యజ్ఞకర్త యజ్ఞము యజ్ఞమున యజింప బడువాడు. యజ్ఞ భోక్త యజ్ఞఫలము నాతడే. సర్వ రూపుడయిన నతని నుండియే యుగాది కాలగమన మేర్పడినది. అ హరికి వ్యతిరిక్త మయిన దే కొంచము లేదు.
Summary of chapter 7 of the Vishnu Mahā Purāṇa is as follows:
The distances between the cosmic regions are given in precise yojana measurements: Earth to Sūrya (1 lakh yojanas), Sūrya to Candra (1 lakh), Candra to Nakṣatra-maṇḍala (1 lakh), Nakṣatras to Budha (2 lakh), Budha to Śukra (2 lakh), Śukra to Maṅgala (2 lakh), Maṅgala to Bṛhaspati (2 lakh), Bṛhaspati to Śani (2 lakh), Śani to Saptarṣi-maṇḍala (1 lakh), Saptarṣi to Dhruva (1 lakh), and the upper worlds reaching Satyaloka. The brahmāṇḍa itself is enclosed in successive shells of water, fire, vāyu, ākāśa, mahattattva, and pradhāna. Viṣṇu is the ultimate substrate in whom this entire brahmāṇḍa rests.