విష్ణు మహా పురాణము

26 - రుక్మిణీ కల్యాణము - ప్రద్యుమ్న జననము

శ్రీపరాశరుడు:

భీష్మకః కుణ్డినేరాజా విదర్భవిషయేఽభవతే

రుక్మీ తస్యాభవత్పుత్రో రుక్మిణీచ వరాననా

రుక్మిణీం చకమేకృష్ణస్సాచతం చారుహాసినీ

నదదౌయాచతేచైనాం రుక్మీ ద్వేషేణ చక్రిణే

దదౌచ శిశుపాలాయ జరాసంధ ప్రచోదితః

భీష్మకోరుక్మిణాసార్థం రుక్మిణీ మురువిక్రమః

వివాహార్థం తాతాస్సర్వే జరాసంధ ముఖానృపాః

భీష్మకస్యపురం జగ్ము శ్శిశుపాలప్రియైషిణః

కృష్ణోపిబలభాద్రాద్యైరయదుభిః పరివారితః

ప్రయయౌకుణ్డినంద్రష్టుం వివాహంచై ద్యభూభృతః

శ్వోభావినివిహాహేతుతాం కన్యాం హృతవాన్ హరిః

విపక్షభారమాసజ్యరామాదిష్వథబంధుషు

శ్రీపరాశరుడు:

కుండినము రాజధానిగ భీష్మకుడను రాజు విదర్భ దేశము నేలుచుండెను. ఆయన కుమారుడు రుక్మి - కూతురు రుక్మిణి యనంబరగిరి. రుక్మిణిం గృష్ణుడు కృష్ణుని రుక్మిణియు నన్యోన్యము వరించి కొనిరి. కాని రుక్మి ద్వేషము గొని యామెం జక్రికీయ డాయెను. జరాసంధుని ప్రేరణమున రుక్మితో గూడ భీష్మకు డామెను శిశుపాలునకు వాగ్ధానము సేసెను. శిశుపాలుని హితవుకోరు రాజులు జరాసంధాదులు పెండ్లికి భీష్మక నగరమున కేతెంచిరి. కృష్ణుడును బలభద్రుడు మున్నగు యాదవులతో చైద్యరాజగు శిశుపాలుని పెండ్లి చూడ కుండినమున కేగెను. రేపు వివాహము గానున్న తరి కృష్ణుడు శత్రు నిగ్రహ కార్యభారమును బలరామాదులగు బందుగుల పైనిడి యా పెండ్లికూతుం దొంగచాటుగ గొనియేగెను.

తతశ్చపౌణ్డ్రకశ్ర్శీమాన్ దన్తవక్త్రోవిదూరథః

శిశుపాల జరాసంధ సాల్వద్యాశ్చమహీభృతః

కుపితాస్తేహరింహన్తుం చక్రురుద్యోగముత్తమమ్

నిర్జితాశ్చసమాగమ్య రామాద్యైర్యదుపుంగవైః

కుణ్డినంనప్రవేక్ష్యామి హ్యహత్వాయుధికేశవమ్

కృత్వాప్రతిజ్ఞాం రుక్మీచ హన్తుం కృష్ణమనుద్రుతః

హత్వాబలం సనాగాశ్వం పత్తిస్యన్దనసంకులమ్

నిర్జితః పాతితశ్చోర్వ్యాంలీలయైవ స చక్రిణా

నిర్జిత్యరుక్మిణం సమ్యగుపయేమేచరుక్మిణీమ్

రాక్షసేనవివాహేన సంప్రాప్తం మధుసూదనః

తస్యాం జజ్ఞేచప్రద్యుమ్నోమదనాం శస్సవీర్యవాన్

జహారశమ్బరోయంవై యోజఘానచశంబరమ్

అంత పౌండ్రక దంతవక్త్ర విదూరథ శిశుపాల జరాసంధ సాల్వాది రాజులు కోపమెత్తి హరిం బరిమార్ప పెద్ద ప్ర్రయత్నము సేసిరి. ఎదుర్కొని బలరామాది యదుపుంగవుల చేతిలో నోడిపోయిరి కూడ. కేశవు ననిం గూల్పక కుండినము సోరనని ప్రతినసేసి రుక్మి కృష్ణుం గూల్ప వెనుదరిమెను. బలానుజుడు చతురంగ బలముం గూల్చి విలాస మాత్రముగ నా రుక్మి నవనిం బడ ద్రొబ్బెను. ఇట్లు రుక్మిం గెల్చి చక్కగ రాక్షస వివాహ ప్రక్రియను లభించిన రుక్మిణిని మధుసూదనుడు పెండ్లాడెను. ఆమె యందు హరి మన్మథాంశుడైన వీర్యవంతుడగు ప్రద్యుమ్నునిం గనియె. అతనిని శంబరాసురుడు హరించి కొనిపోవ వానిని ప్రద్యుమ్నుడు సంహరించెను.