విష్ణు మహా పురాణము

11 - గోవర్ధనోద్ధరణము

శ్రీపరాశరుడు:

మఖేప్రతిహతేశక్రో మైత్రేయాఽతిరుషాన్వితః

సంవర్తకంనామ గణంతోయదానా మథాబ్రవీత్

భోభోమేఘా నిశమ్యైతద్వచనం గదతోమమ

అజ్ఞానంతరమేవాశు క్రియతామవిచారితమ్

నన్దగోపస్సుదుర్భుద్దిర్గోపైరన్యైస్సహాయవాన్

కృష్ణాశ్రయబలాధ్మాతోమఖభఙ్గమచీకరత్

ఆజీవో యాః పర స్తేషాంగావ స్తస్యచ కారణమ్

తాగావోవృష్టిపాతేన పీడ్యన్తాం వచనాన్మమ

అహమప్యద్రిశృఙ్గాభం తుఙ్గమారుహ్యవారణమ్

సాహాయ్యంవః కరిష్యామి వాయ్వమ్బూత్సర్గయోజితమ్

శ్రీపరాశరుడు:

మైత్రేయా! ఇంద్రుడు యాగ భంగమై నందులకు మిగుల రోషము గొని సంవర్తకములను మేఘ గణముం బిలిచి నా మాట విని మీరు గోకులమునకుం జనుడు. అక్కడ మిక్కిలి దుర్భుద్ధితో నందగోపుడు మఱి గొందఱం గూడి కృష్ణుని యండం బలుపుగొని యాగభంగము సేసెను. గోపకులకు జీవనాధారము లయిన గోవులు కూడ దానికి కారణము. కావున నా గోవులను వర్షపాతముచే బాధింపుడు. నేను కొండ శిఖర మట్లై ఐరావతము నెక్కి వాయుజలోపద్రవము సమకూర్చి సాహయ్యము సేసెదను.

శ్రీపరాశరుడు:

ఇత్యాజ్ఞప్తా స్తతస్తేనముముచు స్తేబలాహకాః

వాతవర్షంమహాభీమ మభావాయ గవాంద్విజ

తతః క్షణేనపృథివీకకుభోఽమ్భరమేవచ

ఏకం ధారమహాసారపూరణే నాభవన్మునే

విద్యుల్లతాకశాఘాతత్రస్తై రివఘనైర్ ఘనమ్

నాదా పూరితదిక్చాక్రైః దారాసార మపాత్యత

అన్ధకారీకృతే లోకే వర్శద్భిరనిశం ఘనైః

అధశ్చోర్ ధ్వంచతిర్యక్చ జగదాప్యమివాభవత్

గావస్తు తేనపతతావర్షవాతేన వేగినా

ధూతాః ప్రాణాన్ జహు స్సన్నత్రికసక్థి శిరోధరాః

క్రోడేనవత్సానాక్రమ్యతస్థురన్యా మహామునే

గావోవివత్సాశ్చక్రుతావారిపూరేణచాపరాః

వత్సాశ్చ దీనవదనా వాతకంపితకన్ధరాః

త్రాహిత్రాహీత్యల్పశబ్దాః క్రుష్ణమూచు రివాతురాః

తత స్తద్గోకులంసర్వం గోగోపీగోపసంకులం

అతీవాతం హరిర్ దృష్ట్వా మైత్రేయాచిన్తయత్తదా

ఏతత్కృతంమ హేన్ద్రేణ మఖభఙ్గవిరోధినా

తదేతదఖిలంగోష్ఠం త్రాతవ్య మధునా మయా

ఇమమద్రి మహం ధైర్యాదుత్పాట్యోరుశిలాఘనమ్

ధారయిష్యామి గోష్ఠస్యపృథుచ్చత్రమివోపరి

ఇతికృ త్వామతిం కృష్ణో గోవర్ధనమహీ ధరమ్

ఉత్పాట్యైకకరేణైవ ధారయామాస లీలయా

శ్రీపరాశరుడు:

ఇట్ల ఆజ్ఞపింపబడి మేఘములు గోవులు నశింప వలెనని పెనుగాలి వాన గురిసినవి. క్షణములో భూమి దిక్కులు నింగియు అనేక మగునట్లు నేకధారగా జడివాన గురిసి ముంచెత్తెను. మెఱుపు తీగలనెడి కొరడా దెబ్బలకు జడిసినవో యన్నట్లు మేఘములు దిక్కులు పెను గర్జనముల బ్రతిధ్వనింప కుంభ వృష్టి గురియ లోకమంధకార బంధురమై క్రిందు మీదులు నంతరాళమును కేవల జలప్రాయ మయ్యెను. గోవులు పైబడు నా వాన పెనుగాలుల కేగిరిపోయి సంధి బంధములు విడి తలలొరిగి ప్రాణములు వాసెను. కొన్ని యావులు దూడల కడుపున కదుముకొని నిలిచెను. జల పూరములం గొన్ని లేగలం గోల్పోయినవి. దూడలు బిక్క మొగము వెట్టి పెనుగాలికి మేడలు వడక రక్షింపు రక్షింపు మని కృష్ణునిం గూర్చి యడలను నంభారములు సేసినవి. గోపగోపీ గోపాల సంకులమైన యా గోకులము మిక్కిలి దుఃఖితము కాగా హరి చూచి యిట్లను కొనెను. మఖభంగము సేసెనని కసిగొని యింద్రుడు చేసిన చేష్ట యిది. ఈ గోష్ఠమంతను నేనిపుడు గాపాడ వలయును. ఈ కనిపించు గిరి నేను దేకువ గొనియెత్తి పెను శిలలం బలువైన దీనిని గొడుగగట్లెత్తి పట్టెదను. అని నిశ్చయించి కృష్ణుడు గోవర్ధన పర్వతముం బెకల్చి యొక్క కేలనవలీలగా నెత్తి పట్టెను.

గోపాంశ్చాహ హసన్ శౌరి స్సముత్పాటితభూధరః

విశధ్వమత్ర త్వరితాః కృతం వర్షనివారణమ్

సునివాతేషుదేశేషు యథాజోషమిహాస్యతామ్

ప్రవిశ్యతాం నభేతవ్యంగిరిపాతాచ్చనిర్భయైః

ఇత్యుక్తాస్తేన తేగోపా వివిశుః గోధనైస్సహ

శకటారోపితై ర్భాణైః గోప్యశ్చాసారపీడితాః

కృష్ణోపి తం దధారైవశైల మత్యన్తనిశ్చలమ్

వ్రజైక వాసిభి ర్హర్షవిస్మితాక్షైః నిరీక్షితః

గోపగోపీజనైర్ హృష్టైః ప్రీతివిస్తారితేక్షణైః

సంస్తూయమానచరితః కృష్ణశ్శైలమధారయత్

సప్తరాత్రం మహామేఘా వవర్షుః నంధగోకులే

ఇన్ద్రేణచోదితా విప్ర గోపానాంనాశకారిణా

తతోధృతేమహాశైలే పరిత్రాతేచగోకులే

విథ్యాప్రతిజ్ఞోబలభిధ్వారయామాసతాన్ ఘనాన్

న్యభ్రే నభసి దేవేంద్రోవితథాత్నవచస్యథ

నిష్క్రమ్యగోకులం హృష్టం స్వస్థానం పునరాగమత్

ముమోచకృష్ణోపితదాగోవర్ధనమహాచలమ్

స్వస్థానే విస్మతముఖే ర్దృష్టస్తైస్తువ్రజౌకసైః

మఱియు కొండనెత్తి నవ్వుచు గోపాలురతో నవ్వుచు తొందరగ నందఱు నీ క్రిందకు రండు. ఈదురుగాలి చొరని ఇక్కడ సుఖముగా నుండుడు. కొండపై బడునేమోయని జడియకుడు. అని కృష్ణుడు పలుక గోధనములతో గోపకులు భాండములు బండ్లకెక్కించి గోపికలను నక్కొండ క్రిందకు జేరిరి. అందఱు నాశ్చర్యపడి, యానందపడి ప్రీతిచే చూపులు

 విప్పార తన లీలలను స్తుతింప నా కొండను హరి యవలీలగ దనకేలం ధరించెను. ఏడురాత్రు లమ్మబ్బులుబ్బునం గుండపోతగ గురిసినవి. గోవర్ధనమెత్తి గోకులముం గాపాడ బలారి వింతముసెడి వారిదములను వారించెను. అందఱు నాశ్చర్యముఖులై కనుగొన కృష్ణుడంత గోవర్ధన పర్వతమును యథా స్థానము విడిచెను.