విష్ణు మహా పురాణము

30 - పారిజాతా నయనము

శ్రీపరాశరుడు:

గరుడోవారుణం ఛత్రం తథై వమణిపర్వతమ్

సభార్యంచహృషీకేశం లీలయైవవహాన్ యయౌ

తతశ్శఙ్ఖముపాధ్మాసీత్స్వర్గ ద్వారగతో హరిః

ఉపతస్థుస్తదాదేవా స్సార్ ఘ్యహస్తా జనార్ధనమ్

సదేవైరర్చితః కృష్ణో దేవమాతుర్ని వేశానమ్

సితాభ్రశిఖరాకారం ప్రవిశ్యదదృశేఽదితిమ్

స తాం ప్రణమ్యశక్రేణ సహతేకుణ్డలోత్తమే

దత్తౌనరకనాశం చ శశంసాస్యై జనార్దనః

తతః ప్రీతాజగన్మాతా త్రాతారంజగతాం హరిమ్

తుష్టావాదితిరవ్యగ్రాకృత్వాతత్ప్రవణం మనః

శ్రీపరాశరుడు:

గరుత్మంతుడు వారుణ చత్రమును మణి పర్వతమును సత్యభామతో శ్రీకృష్ణుని సలీలముగ వహించెను. స్వర్గ ద్వారమును జేరి హరి పాంచజన్య శంఖముం బూరించెను. అమరులర్ఘ్య పాద్యాదులం గొని ఎదురు వచ్చిరి. వారిచే అచ్యుతం డర్చితుడై దేవమాత యగు అదితి గృహమ్మున కరిగెను. తెల్లని మేఘ శిఖర మట్టి యా గృహముం బ్రవేశించి అదితిం గని యింద్రుడు దాను ప్రణమిల్ల కుండలముల నొసంగి నరకనాశన వార్త నివేధించెను. అదితియుం బ్రీతిసెంది జగద్విధాత హరి యెడల మనసుంచి ఇట్లు స్తుతించెను.

అదితి:

నమస్తే పుణ్డరీకాక్ష భక్తానామభయంకర

సనాతనాత్మన్ సర్వత్మాన్ భూతాత్మాన్ భూతభావన

ప్రణేతర్మనసోబుద్దేరిన్ద్రియాణాం గుణాత్మక

త్రిగుణాతీత నిర్ ద్వన్ద్వశుద్దసత్త్వహృదిస్థిత

సితదీర్ఘాదినిశ్శేషకల్పనాపరివర్జిత

జన్మాదిభిరసంస్పృష్ఠస్వప్నాదిపరివర్జిత

సంధ్యారాత్రిరహోభూమిర్గగనంవాయురమ్బుచ

హుతాశనోమనోబుద్దిర్భూతాదిస్త్వంతథాఽచ్యుత

సర్గస్థితివినాశానాం కర్తాకతృర్ పతిర్భావాన్

బ్రహ్మవిష్ణుశివాభ్యాభిరాత్మమూర్తిభిరీశ్వర

దేవదైత్యాస్తథాయక్షా రాక్షసాస్సిద్దపన్నాగాః

కూశ్మాణ్డాశ్చాపిశాచాశ్చ గంధర్వామనుజా స్తథా

పశవశ్చమృగాశ్చై వపతఙ్గాశ్చ సరీసృపాః

వృక్షగుల్మలతాబహ్వ్యస్సమస్తాస్తృణజాతయః

స్థూలామధ్యాస్తథాసూక్ష్మాస్సూక్ష్మాత్సూక్ష్మతరాశ్చయే

దేహభేదభవాన్ సర్వే యేకేచిత్సర్గతాశ్రయాః

మాయాతవేయమజ్ఞాతపరమార్థాతిమోహినీ

అనాత్మాన్యాత్మవిజ్ఞానం మయామూఢోనిరుధ్యతే

సంసారమాతుర్మాయాయాస్తవైతన్నాథ! చేష్టితమ్

యైస్స్వధర్మపరైర్నాథ! నరై రారాధితోభవాన్

తేతర న్త్వఖిలామేతాం మాయామాత్మవిముక్తయే

బ్రహ్మాద్యాస్సకలాదేవా మనుష్యాః పశవ స్తథా

విష్ణుమాయామహావర్తమోహాన్ధతమసావృతాః

ఆరాధ్యత్వామభీప్సన్తే కామాన్నత్మభవక్షయమ్

యదేతేపురుషామాయా సై వేయంభగవంస్తవ

మయాత్వం పుత్రకామిన్యావైరిపక్షజయాయచ

ఆరాధితోనమోక్షాయమాయావిలసితంహితత్

కౌపీనాచ్చాదనప్రాయవాఞ్చాకల్పద్రుమాదపి

జాయతేయదపుణ్యానాం సోపరాధస్స్వదోషజః

తత్ప్రసీదాఖిలజగన్మాయామోహకరావ్యయ

అజ్ఞానంజ్ఞానసద్భావభూతం భూతేశ! నాశయ

నమస్తేచక్రహస్తాయ శార్ఙ్గహస్తాయతే నమః

నన్దహస్తాయతే విష్ణో! శఙ్ఖహస్తాయతే నమః

ఏతత్పశ్యామితేరూపం స్థూలచిహ్నోపలక్షితమ్

నజానామిపరంయత్తే ప్రసీద పరమేశ్వర

అదితి కృష్ణుని స్తుతించుట:

పుణ్డరీకాక్ష! భక్త భయప్రదా! సనాతనా! సర్వాత్మా భూతరూపుడవు! మహాభూత జనకుడవు! నీకు వందనము. మనోదుద్దీంద్రియములను నడపించు వాడవు. గుణాతీతుడవు కనుకనే శీతోష్ణ రహితుడవు. శుద్దసాత్త్విక హృదయవాసిని. తెలుపు నలుపు పొడవు వెడల్పు మొదలగు వికల్పములు లేని వాడవు. జన్మాది వికారములు లేని వాడవు. జాగ్రదాద్యవస్థలు లేనివాడవు. సర్గాదికర్తవు కర్తలకు పతివి. బ్రహ్మ విష్ణు శివాది మూర్తులు చరాచర ప్రపంచ మంతయు నీ స్వరూపమే. తత్త్వము నెఱుంగని వారిని మిక్కిలి మొహపెట్టు మాయ నీదే. ఆత్మ కాని దాని యందు ఆత్మజ్ఞానమే మాయ. తనది కాని దాని యందు తనదను భావము దాననే కలుగును. ఈ మాయ సంసార జనని. ఆమె చేష్టయిది. స్వధర్మపరులై నిన్ను నారాధించిన వారు ఈ మాయను దాటుదురు. బ్రహ్మాది దేవతలు, మనుష్యులు, పశువులు, విష్ణుమాయ యనెడి సుడిలో పడి మొహమను గాడాంధకారముతో చుట్టబడిన వారై నిన్నారాధించి కోరికలను కోరుదురు. కాని సంసార నాశమును గోరడు. ఇట్టి వారే మాయ. ఈ మాయ నీదే. నేను శత్రుపక్ష క్షయము సేయగోరి నీవు పుత్రుడవు కమ్మని నిన్నారాదించితిని గాని మోక్షము కొఱకు గాదు. ఇదియు మాయా విలసనమే. కల్పవృక్షమునుం గూడ గోచిపాత మాత్రముపై వాంఛ పుణ్యులు కాని వారికి కల్గుచుండుట యను అపరాధము తమ కర్మ దోషము వలన గల్గినదే. కావున నన్ను ననుగ్రహింపుము. జ్ఞానమట్లు భాసించు నజ్ఞానమును నశింప జేయుము. శారఙ్గచక్రధరునకు నీకు నమస్కారము. శంఖనందక ఖడ్గదారికి నీకు వందనము. ఈ స్థూల చిహ్నముల తోడి నీ రూపము గాంచితిని. కాని పరమార్థ రూప మెఱుంగను. అనుగ్రహింపుము.

శ్రీపరాశరుడు:

అదిత్యైవం స్తుతోవిష్ణుః ప్రహస్యాహసురారణిమ్

మాతాదేవిత్వమస్మాకం ప్రసీదవరదాభవ

శ్రీపరాశరుడు:

అని యాదితి స్తుతింప నా తల్లిని సురారణిం (జన్మహేతువు) గని విష్ణువమ్మా! మాకు వరము లిమ్మని మాయామానుష వేషధారి కుమారుడర్థింప

అదితి:

ఏవమ స్తుయథేచ్చా తేత్వమశేషైస్సురాసురైః

అజేయః పురుషవ్యాఘ్రమర్ త్యలోకేభవిష్యసి

తతః కృష్ణస్యపత్నీచ శక్రేణసహితాఽదితిమ్

సత్యభామాప్రణమ్యాహ ప్రసీదేతి పునః పునః

మత్ప్రసాదాన్నతేసుభ్రు! జరా వైరూప్యామేవవా

భవిష్యత్యనవాద్యాఙ్గి! సుస్థిరం నవయౌవనమ్

అదితి:

నట్లయగు గాక యనియు సురారుల కీవజయ్యుడ వగుదువనియు మనుష్య లోకమున పుట్టుదు వనియు నదితి యచ్యుతుం దీవించెను. అంతట కృష్ణుని భార్య సత్యభామ యింద్రునితో గూడ నదితికి మ్రొక్కి దయ సూపుమ దయ సూపుమని మఱి పలికెను. ఆమె నా సాకతమున నీకు ముదిమి వైరూప్యము గలుగదు. నిత్య నవయౌవ్వనము నమ్భాసింతువు గాక యని దీవించెను.

శ్రీపరాశరుడు:

అదిత్యాతు కృతాను జ్ఞోదేవరాజో జనార్దనమ్

యథావత్పూజయామాసబహుమా నపురస్సరమ్

శచీసత్యభామాయై పారిజాతస్య పుష్పకమ్

నదదౌమానుషీం మత్వాస్వయం పుష్పైరలంకృతా

తతోదదర్శకృష్ణోఽపిసత్యభామా సహాయవాన్

దేవోద్యనానిహృద్యాని నన్దనాదీనిసత్తమ

దదర్శచసుగన్ధాఢ్యం మఞ్జరీపుఞ్జధారిణమ్

నిత్యాహ్లాదకరం తామ్రబాలపల్లవ శోభితమ్

మథ్యమానేఽమృతేజాతం జాతరూపోపమత్వచమ్

పారిజాతం జగన్నాథః కేశవః కేశిసూదానః

తుతోషపరమప్రీత్యాతరురాజనుత్తమమ్

తందృష్ట్వాప్రాహగోవిన్దం సత్యభామా ద్విజోత్తమ

కస్మాన్నద్వారకామేష నీయతేకృష్ణ! పాదపః

యదిచేత్త్వద్వచః సత్యం త్వమత్యర్థం ప్రియేతిమే

మద్గేహనిష్కుటార్థాయ తదయం నీయతాంతరుః

నమేజామ్బవతీతాదృగభీష్టానచ రుక్మిణీ

సత్యేయథాత్వమిత్యుక్తం త్వయాకృష్ణాసకృత్ప్రియమ్

సత్యంతద్యదిగోవిన్ధనోపచారకృతం మమ

తద స్తుపారిజాతోఽయం మమగేహవిభూషణమ్

బిభ్రతీపారిజాతస్య కేశపక్షేణమఞ్జరీమ్

సపత్నీనామహం మధ్యే శోభేయమితికామయే

శ్రీపరాశరుడు:

ఇట్లదితి యనుగ్రహ మందు అనుజ్ఞ గొని జనార్ధనుని సబహుమానముగ యథావిధిం బూజించెను. శచీదేవి దాను పారిజాత పుష్పములం బెక్కింటిని గొప్పునంగైసేసికొని, మానుష స్త్రీయని భావించి యొక్క పారిజాత కుసుమమును సత్యభామ కొసంగెను. అవ్వాల కృష్ణుడు సత్యభామతో నందనాది దేవోద్యానములను అతి హృదయములం దర్శించెను. అందు ఘుమఘుమ పరిమళ ములనించు గుత్తు గుత్తులుగా నిండపూచి నిత్యాహ్లాదము గొల్పు కుసుమములతో లేత చివుల్లతో శోభిల్లుచు బంగారు పైపట్టతో రాజిల్లుచు సముద్ర మథన సమయమందు క్షీరవారాశి నుదయించిన తరురాజముం బారిజాతముం జూచి పరమ ప్రీతి నానందించి ముచ్చట గొని సత్యభామ గోవిందుని గని యిట్లనియె. కృష్ణ! ఈ పాదపమును మనమెల ద్వారకకు గోనిపోరాదు? సత్యా! నీవు నాకెంతయుం గూర్చు దానవని యన్న నీ పలుకు సత్య మగునేని అది కేవల మౌపచారికము (వట్టి ఇచ్చకము) గాదేని నా యింటి పెరటిలో నాతుటకు దీనిం గొంపో వలయును. జాంబవతి గాదు, రుక్మిణి యుంగాదు. భామ! నీవభీష్టురాలవై నట్లేవ్వరుం గారని పలుమారులు కృష్ణా! ముచ్చటల నాడితిని. అది నిజమేని గోవింద! ఈ పారిజాతము నా గృహ విభూషణ మగుగాక! నా కొప్పునందొక వంక మెరపుగా మెరుగుగా నీపారిజాత పుష్పమంజరి జేరవికొని నా సవతు లందరిలో శోభింప వలయునని ముచ్చట పడుచున్నాను.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తస్సప్రహస్యైనాం పారిజాతం గరుత్మతి

ఆరోపయామాసహరి స్తమూచుర్వనరక్షిణః

భోశచీదేవరాజస్య మహిషీతత్పరిగ్రహమ్

పారిజాతంనగోవిన్ద! హర్తుమర్హసిపాదసమ్

ఉత్పన్నోదేవరాజాయదత్తస్సోపిదదౌపునః

మహిష్యైసుమహాభాగాదేవ్యైశచ్యైకుతూహలాత్

శచీవిభూషణార్థాయదేవైరమృతమన్థనే

ఉత్పాదితోయం నక్షేమీ గృహీత్యైనంగమిష్యసి

దేవరాజోముఖప్రేక్షీ యస్యాస్తస్యాః పరిగ్రహమ్

మౌఢ్యాత్ప్రార్థయసేక్షేమీ గ్రుహీత్వైనం హికోవ్రజేత్

అవశ్యమస్యదేవేన్ద్రోనిష్కృతిం కృష్ణ యాస్యతి

వజ్రోద్యతకరం శక్రమనుయాస్య న్తిచామరాః

తదలంసకలై ర్దేవైః విగ్రహేణతవచ్యుత!

విపాకకటుయత్కర్మ తన్నశంస న్తిపణ్డితాః

శ్రీపరాశరుడు:

అన వినినదే తడవుగ కృష్ణు డల్లన నామె వంకం గని యా పారిజాత తరు రాజమును గరుత్మంతునిపై నెక్కించెను. వనపాలురు “దేవరాజ పట్టమహిషి శచీ దేవి, ఆమె సోత్తీ పారిజాత మహా వృక్షము. దీని నీవు గొంపోదగదు. ఇది దేవరాజు కొరకే పుట్టినది. అతడును దానిని మహానుభావురాలగు పట్టమహిషి శచీదేవికి వేడుక కొని యిచ్చెను. శచీదేవి నగగా నలంకరించుకొన నమృత మధన మందు దేవతలు దీనిం జనియింప జేసిరి. దీనిం కొని క్షేమముగా నీవు పోలేవు. దేవేంద్రు డేదేవి మొగముం జూచు నా ఇల్లాలి సొంత సొత్తైన ఈ పారిజాత రత్నము నీవు దెలియమిం గోరుచున్నావు. క్షేమము గల వాడెవ్వడిది గొనిపో గలడు?” సురపతి ఈ పనికిం బ్రాయశ్చిత్తాము సేయగలడు. వజ్రయుధముం జేతనెత్తిన శక్రుని నమరులు వెంబడింతురు. అందుచే అచ్యుత! దేవతలతో తగవు కోరి తెచ్చి కొనుట నీకు దగదు. పాకాదశ బరమ కటువయ్యెడు (విషమించెను) పనిం బండితులు మెచ్చారు.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తేతై రువాచైతాన్ సత్యభామాతి కోపినీ

కాశచీపారిజాతస్య కోవాశక్రస్సురాధిపః

సామాన్యస్సర్వ లోకస్య యద్యేషోమృతమన్థనే

సముత్పన్న స్తరుః కస్మాదేకోగృష్ణాతివాసవః

యథాసుధాయథై వేన్దుర్యథాశ్రీర్వనరక్షిణః

సామాన్యస్సర్వలోకస్యపారిజాత స్తథాద్రుమః

భర్తృబాహు మహాగర్వా ద్రుణద్ధ్యేనమథో శచీ

తత్కథ్య తామలంక్షాన్త్యా సత్యాహారయతిద్రుమమ్

కథ్యతాంచద్రుతం గత్వాపౌమ్యావచనం మమ

సత్యభామావదత్యేతదితిగర్వోద్దతాక్షరమ్

యదిత్వందయితాభర్తుర్యదివశ్యః పతి స్తవ

మద్బర్తుర్హరతో వృక్షంతత్కారయ నివారణమ్

జానామితేపతింశక్రం జానామిత్రిదశేశ్వరమ్

పారిజాతం తథాప్యేనం మానుషీహారయామితే

ఇత్యుక్తారాక్షిణోగత్వా శచ్వాః ప్రాచుర్యథోదితమ్!

శ్రుత్వాచోత్సాహయామాస శచీశక్రం సురాధిపమ్

శ్రీపరాశరుడు:

అనవిని యా వనపాలురం గని యతికోపిని సత్యభామ ఆ! పారిజాతమునకు శచి యెవ్వతె? సురాధిపుడు శక్రుడెవ్వడు అమృత మథన మందు పుట్టిన యీ చెట్టు సర్వ లోకమునకు సమానము. ఇంద్రుడొక్కడే ఎలా గైకొనును? అమృతమెట్లో చంద్రుడెట్లో యట్లీ పారిజాతమును సర్వలోకముల కుమ్మడి సొమ్ము. మగని బాహుబల మూతగ గర్వమెక్కి శచి యడ్డుచున్నది. అందుచే జెప్పుడు నీ ఓరిమి చాలు. సత్య యీ తరువుం బట్టించుకొని వెళ్ళుచున్న దని చెప్పుడు. పరుగున మీరేగి పౌలోమి యేమన్నదో వచ్చి చెప్పుడు. ఈ గర్వోద్దతాక్షరము లయిన మాటలు సత్యభామవని చెప్పుడు. నీవు భర్తకు వల్లభవేని నీకు భర్త వశుడేని యీ వృక్షముం గొని పోవుచున్న నా మగని నీవడ్డ గింపుము. నీ మగడు శక్రుడని యెరుంగుదును. అతడు త్రిదశాదీశ్వరు డనియు నెరుంగుదును. అయినను మానుషీ మాత్రను నేను పారిజాతము నిదిగో పట్టించు కొనిపోవుచున్నాను. అన వన రక్షకులు శచికి సత్యభామ పలికినది నివేదించిరి. శచియును విని సురాధిపుని బ్రోత్సహించెను.

తతస్సమస్తదేవానాం సైన్యైః పరివృతోహరిమ్

ప్రయయౌపారిజాతార్థమిన్ద్రోయోద్దుంద్విజోత్తమ!

తతః పరిఘనిస్త్రిం శగదాశూలవరాయుధాః

బభూవుస్త్రిదశాస్సజ్జాశ్శాక్రేవజ్రకరేస్థితే

తతోనిరీక్ష్యగోవిన్దో నాగరాజోపరిస్థితమ్

శక్రందేవపరీవారం యుద్దాయసముపస్థితమ్

చకారశంఖనిర్ ఘోషం దిశశ్శబ్దేనపూరయన్

ముమోచశరసం ఘాతాన్ సహస్రాయుతశశ్శితాన్

తతోదిశోనభశ్పైవదృష్ట్వాశరశతై శ్చితమ్

ముముచుస్త్రిదశాస్సర్వేహ్యస్త్రశస్త్రాణ్యనేకశః

ఏకైకమస్త్రంశాస్త్రంచదేవైర్ము క్తంసహస్రశః

చిచ్చేదలీలయైవేశోజగతాం మధుసూదనః

పాశంసలిల రాజస్య సమాకృష్యోరగాశనః

చకారఖండశాశ్చఞ్చ్వ బాలపన్నగ దేహవత్

యమేన ప్రహితం దణ్డం గదావిక్షేపఖణ్డితమ్

పృథ్వివ్యాంపాతయామాస భగవాన్ దేవకీసుతః

శిబికాంచధనేశస్య చక్రేణతిలశోవిభుః

చక్రవిచ్చిన్నశూలాగ్రా రుద్రాభువినిపాతితాః

నీతోగ్నిశ్శీతతాంబా ణైఃద్రా వితావసవోదిశః

చక్రవిచ్చిన్నశూలా గ్రారుద్రాభువినిపాతితాః

సాధ్యావిశ్వేఽథమరుతో గన్ధర్వాశ్పైవసాయకైః

శార్ఙ్గిణాప్రేరితై రస్తా వ్యోమ్నిశాల్మలితూలవాత్

గరుత్మానపితుణ్డేనపక్షాభ్యాంచనఖాంకురైః

భక్షయంస్తాడయాన్ దేవాన్దారయం శ్చచచారవై

అవ్వల నింద్రుడు పారిజాతమునకై దేవతలతో సైన్యముల నెల్లంగొని హరితో బోర నేగెను. ఇంద్రుడు వజ్రాయుధముం గైకొని పరిఘనిస్త్రింశగదా శూలాది దివ్యాయుధములం గొని త్రిదశులు యుద్ద సన్నద్దులైరి. అంతట హరి యైరావత మందున్న యింద్రుని యుద్దమునకు సన్నద్ధమైన యింద్ర పరివారమునుం గని దిశలు మ్రోయ శంఖముం బూరించి నిశిత శర జాలమును విసరెను. అది గని త్రిదశులునుం దీవ్ర దివ్యాస్త్రా శస్త్రములను వదలిరి. లీలగా జగత్పతి యోక్కొక్క దానిం బెక్కుతునుకలు గావించెను. ఉరగాశనుడు (పాము లందిన గరుత్మంతుడు) వరుణుని పాశమును కొన ముక్కునం బెట్టిలాగి పాముపిల్ల నట్లు బెక్కు తునకలు సేసెను. యముడు విసరిన దండమును గదా విక్షేపమున ఖండించి భగవంతుడు దేవకీ సుతుండవానిం బడనేసెను. కుబేరుని పాలకిని నువ్వు గింజంతగ నులిసేసెను. హరి సూర్యుందేరి చూచి సారము హరించెను. అమ్ముల నగ్ని చల్లారె. వసువులం దశ దిశలకుం బారదరిమె. చక్రముచే శూలముల కొనలు విరిగి రుద్రులు నేలకొరగిరి. సాధ్యులు విశ్వేదేవులు మరుత్తులు గంధర్వులు శార్ఙ్గి వదలిన సాయకములచే నింగిని బూరుగు దూదియట్లు పింజెలు పింజెలై తూలిరి. గరుడుండును దన సూది మొనవంటి ముక్కునం బొడిచి వీక్షించి ఇరు ఱెక్కలం దూల్చి గోళ్ళ గొనలర్ జీల్చి పెక్కు తెఱంగుల వీర విహారము న్నెఱపెను.

తతశ్శరసహస్రేణ దేవేన్ద్రమధుసూదనౌ

పరస్పరంవవర్షాతే ధారభిరివతోయదౌ

ఐరావతేనగరుడో యుయుధేతత్రసంకులే

దేవై స్సమస్తైర్యుయుధే శక్రేణచ జనార్దనః

ఛిన్నేష్వ శేషబాణేషు శస్త్రేష్వస్త్రేషుచత్వరన్

జగ్రాహవాసవోవజ్రం కృష్ణశ్చకరంసుదర్శ నమ్

తతోహాహాకృతంసర్వం త్రైలోక్యం ద్విజసత్తమ!

వజ్రచక్రకరౌదృష్ట్వా దేవరాజ జనార్దానౌ

క్షిప్తం వజ్రమథేన్ద్రేణజగ్రాహ భగవాన్ హరిః

నముమోచతదాచక్రంశక్రంతిష్టేతి చాబ్రవీత్

ప్రణష్ఠవజ్రందేవేన్ద్రం గరుడక్షత వాహనమ్

సత్యభామాఽబ్రవీద్వీరం పలాయన పరాయణమ్

త్రైలోక్యేశ! నతేయుక్తంశచీభర్తుః పలాయనమ్

పారిజాతస్రగ్రాభోగాత్వాముపస్థాస్యతే శచీ

కీదృశందేవరాజ్యంతే పారిజాతస్రగుజ్జ్వలామ్

అపశ్యతో యథాపూర్వం ప్రణయాభ్యాగతాం శచీమ్

అలంశక్రప్రయాసేననవ్రీళాంగంతుమర్హసి

నీయతాంపారిజాతోయం దేవాస్సన్తుగతవ్యథాః

పతిగర్వాపలేపేన బహుమానపురస్సరమ్

నదదర్శగృహంయాతాముపచారేణమాంశచీ

స్త్రీత్వాదగురుచిత్తాహం స్వభర్ తృశ్లాఘనాపరా

తతః కృతవతీశక్ర! భవతాసహవిగ్రహమ్

తదలం పారిజాతేన పరస్వేనహృతేనమే

రూపేణగర్వితాసాతుభర్ త్రాకాస్త్రీనగర్వితా

ఇత్యుక్తోవై నివవృతే దేవరాజు స్తయాద్విజ

అవ్వల దేవేంద్ర మాధవులు మేఘములు జలధారల ట్లొందొరులపై శరధారలం గురిసి కొనిరి. ఐరావతముతో గరుడుండు పోరె. అన్ని బాణములు అస్త్రశస్త్రములు తెగివడ వాసవుండు వజ్రాయుధము లంబట్టెను. కృష్ణుండు సుదర్శనముం గైకొనెను. అంతట వారింగని ముల్లోకములు హాహాకార మొనరించెను. ఇంద్రుడేసిన వజ్రాయుధ మల్లన హరియందు కొనెను. నిలునిలు మని చక్రాయుధమును విసరెను. వజ్రాయుధమా నష్టమయ్యె. వాహనమా గరుడ క్షతమయ్యె. అయ్యెడ నిక పారిపోవలయు నన్న యింద్రుడు మహావీరుని గని సత్యభామ! “త్రిభువనేశ! శచీ భర్తవు గదా! నీవు పారిపోవుట తగునా! పారిజాత మాలా సంపూర్ణ వైభవ శచీదేవి నిన్ను సేవించు చున్నది. పారిజాత పుష్పమాలం గైసేసి వలపుగొని మున్నట్లు దరికేతెంచు శచీదేవిం గనుగొనని నీకు దేవరాజ్య మేపాటిది? శక్ర! ప్రయాస పడకు! సిగ్గు పడదగదు. పారిజాతమిది గోనిపోమ్ము. దేవతలు దిగులు వడవలదు. ఇంటికి వచ్చిన నన్ను పతి గర్వాతిశయముచే శచి సబహుమానముగ సోపచారముగ జూడలేదు. నేను స్త్రీ నగుటచే నుదారభావము లేని దానను. నా మగడు నన్నెపుడు బహుమానించునన్న దురభిమానమున తమతో జగడము పెట్టి కొంటిని, ఒరుల సొమ్ము హరించిన సొత్తు పారిజాతము వద్దు. ఆమె తన చక్కదనముచే మగనిచే గర్వించినది. ఏ యాడుది గర్వింపదు!” అన సత్యభామ పలుకులు విని

ఇంద్రుడు:

ప్రాహచైనామలంచణ్డి! సఖ్యుః ఖేదోక్తివిస్తరైః

సచాపిసర్గసంహారస్థితికర్తాఽఖిలస్యయః

జితస్యతేనమేవ్రీళా జాయతేవిశ్వరూపిణా

యస్మాజ్జగతసకలమేతదనాదిమధ్యాద్యస్మిన్ యతశ్చనభవిష్యతి సర్వభూతాత్

తేనోద్భవప్రళయపాలనకారణేన వ్రీళాకథంభవతి దేవినిరాకృతస్య

సకలభువనసూతిర్మూర్తిరల్పాల్పసూక్ష్మావిదిత సకలవేదైః జ్ఞాయతేయస్యనాన్యైః

తమజమకృతమీశంశాశ్వతం స్వేచ్చయైనం జగదుపకృతిమర్త్యం కోవిజేతుం సమర్ధః

ఇంద్రుడు:

ఓ చండి! కోపనాస్వభావ! చాలు చాలు. మిత్రభేదము సేయు వచన విస్తర మికవలదు. సర్గస్థితి సంహార కర్తయైన విశ్వరూపి భగవంతుని చేత నోడిన నాకు సిగ్గేమి? దేవీ! సృష్టి స్థితి ప్రళయ పాలన కారణమై ఆది మధ్యాంతములు లేని పరమాత్మచే నోడిన నాకు లజ్జ యేమి. అట్టి అజుని చేసియుం జేయని వాని శాశ్వతునీ జగదుప కార నిమిత్త లీలామానుషావతారు నెవ్వడు గెలువ సమర్థుడు? అని యింద్రుడు స్తుతించె.