శ్రీపరాశరుడు:
గార్గ్యంగోష్ట్యాంద్విజంస్యాలష్షణ్డ ఇత్యుక్తవాన్ ద్విజ।
యదూనాం సన్నిధౌ సర్వేజహసుర్యాదవా స్తదా॥
తతః కోపపరీతాత్మా దక్షిణాపథమేత్యసః।
సుతమిచ్చం స్తప స్తేపే యదుచక్రభయావహమ్॥
ఆరా ధయన్మహాదేవం లోహచూర్ణమభక్షయత్।
దదౌవరంచతుష్టోస్మైవర్షేతు ద్వాదశేహరః॥
సంతోషయామాసచతం యవనేశోహ్యనాత్మజః।
తద్యోషిత్సంగమాచ్చాస్యపుత్రోఽభూదళి సన్నిభః॥
తం కాలయవనంనామ రాజ్యేస్వేయవనేశ్వరః।
అభిషిచ్యవనంయాతో వజ్రాగ్రకఠినోరసమ్॥
సతువీర్యమదోన్మత్తః పృథివ్యాంబలినోనృపాన్।
అపృచ్చన్నారద స్తస్మైకథయామాస యాదవాన్॥
మ్లేచ్చకోటి సహస్రాణాం సహస్రైస్సోభిసంవృతః।
గజాశ్వరథసం పన్నైశ్చకారపరమోద్యమమ్॥
ప్రయయౌసవ్యవచ్చిన్నం చిన్నయానోదినేదినే।
యాదవాన్ ప్రతిసామర్షో మైత్రేయ! మథురాంపురీమ్॥
కృష్ణోఽపిచిన్తయామాస క్షపితం యాదవం బలమ్।
యవనేన రణేగమ్యం మాగధస్య భవిష్యతి॥
మాగధస్య బలంక్షీణం సకాలయవనోబలీ।
హన్తైతద్దేవమాయాతం యదూనాంవ్యసనంద్విధా॥
తస్మాద్దుర్గం కరిష్యామియదూనామరి దుర్జయమ్।
స్త్రియోఽపియత్రయుధ్యేయుః కింపునర్ వృష్టి పుంగవాః॥
మయిమత్తేప్రవత్తేవా సుప్తేప్రవసితేపివా।
యాదవాభిభవందుష్టామాకుర్వన్త్వరయోఽదికాః॥
ఇతిసంచిన్త్య గోవిన్దోయోజనానాం మహోదధిమ్।
యయాచేద్వాదశపురీంద్వారకాంతత్రనిర్మమే॥
మహోద్యానాం మహావప్రాంతటాకశతశోభితమ్।
ప్రాసాదగృహసంబాధా మిన్ద్రస్యేవామరావతీమ్॥
మథురావాసినంలోకంతత్రానీయ జనార్దనః।
ఆసన్నేకాలయవనే మధురాంచస్యయంయయౌ॥
శ్రీపరాశరుడు:
సభలో యాదవు లందరి ముందు గార్గ్యుడను బ్రాహ్మణుని నతని బావమరిది (సంతానము లేకుండటచే) ఇతడు నపుంసకుడని గేలిసేసెను. యాదవులు నవ్విరి. దాన కోపించి యాతడు దక్షిణ పథమునకు వచ్చి యాదవ చక్రమున కెల్ల భయంకరుడగు కొడుకు గావలయునని తపము సేసెను. అందులకత డినుపపొడి దినుచు శంకరునిం గూర్చి చేసిన తపస్సునకు సంతుష్టుడై హరుండు పండ్రెండేండ్ల తపస్సు ఫలముగా వర మోసంగెను. ఆ గార్గ్యుని యవన రాజు సంతానహీనుడై సేవించెను. గార్గ్యుడా యవనుని భార్యతో సంగమించి నంతట తుమ్మెద వంటి శిశువు గల్గెను. వాడే కాలయవనుడు. వజ్రమువలె కఠినమైన రొమ్ము గలవానిని రాజుం గావించి యవన రాజు వనమునకుం బోయెను. ఆ కాలయవనుడు వీర్యమదోన్మత్తుడై ఈనాడు భూమిపై బలవంతులగు రాజు లేవరని యడుగ నారదుడు యాదవులని తెలిపెను. వాడు కోట్లకొలది మ్లేచ్చులం గూడ గట్టుకొని చతురంగ బలముతో దరలి నడుమ నడుమ అలసిన వాహనముల విడుచుచు విడుదులు సేయుచు యాదవుల సంహరింప మథురాపురికి దండయాత్ర వెడలెను. కృష్ణుడును యవనునిచే యాదవ బలము క్షీణించి మాగథునికి లొంగునని యనుకొనెను. మాగధుని బలమల్పము. ఆ కాలయవనుడు ప్రబలుడు. కావున వానితో గలిసి మాగధుడు యుద్దము సేయవలయును. ఆహా! దైవమాయ! యాదవుల కిప్పుడు రెండు విధాల విపత్తు వచ్చి పడినది. అని గోవిందుడెంచి యాదవులకు దుర్గ నిర్మాణార్థమై సముద్రు నడిగి పండ్రెండ్రు యోజనముల చోటిమ్మని యడిగి యట ‘ద్వారక’ అను పురము నిర్మించెను. అట స్త్రీలు కూడా సురక్షితులై యుద్దము చేయ వచ్చును. పురుషుల సంగతి చెప్పనేల? అది మహోద్యానములతో చెరువులతో మేడలతో మిద్దెలతో ప్రాసాదములతో గూడి యింద్ర రాజధానియగు నమరావతిం బోలియుండెను. మథురావాసుల నందులకు రావించి హరి తానందు వసించెను.
బహిరావాసితేసై న్యేమథురాయా నిరాయుధః।
నిర్జగామచ గోవిన్దో దదర్శయవనశ్చతమ్॥
సజ్ఞాత్వావాసుదేవంతం బాహుప్రహరణం నృపః।
అనుయాతో మహాయోగిచేతోభిః ప్రాప్యతే న యః॥
తేనానుయాతః కృష్ణోఽపి ప్రవివేశ మహాగుహామ్।
యత్రశేతే మహావీర్యో ముచుకున్దో నరేశ్వరః॥
సోఽపి ప్రవిష్టోయవనో దృష్ట్వాశయ్యాగతం నృపమ్।
పాదేనతాడయామాస మత్వాకృష్ణం సుదుర్మతిః॥
ఉత్థాయముచుకున్దోఽపి దదర్శయవనం నృపః॥
కాలయవనుడు సైన్యమును రాజధాని నిలువ జూచి కృష్ణుడు తానొక్కడే నిరాయుధుడై చనినంతట యవనుడు బాహుయుద్ద సమర్థునింగా హరి నెరిగి మహాయోగుల చిత్తములు వెంబడించి యందుకొనలేని యా స్వామిని వెంబడించెను. అట్లు పరువిడి తరుమ కృష్ణుడట నున్న గుహలో ప్రవేశించెను. అందు ముచుకుందుడు పరుండి యుండెను. యవనుడును నందు జొచ్చి యందు శయనించి యున్న ముచుకుందుని జూచి కృష్ణుడనుకొని పాదమునం దన్నెను. అతడు మెలకువగని యవనునిం గనెను.
దృష్టమాత్రశ్చతేనాసౌ జజ్వాలయవనోఽగ్నినా।
తత్క్రోధజేన మైత్రేయ! భస్మీభూతశ్చ తత్ క్షణాత్॥
సహిదేవాసురేయుద్దే గతోహత్వామహాసురాన్।
నిద్రార్తస్సుమహాకాలం నిద్రాంవవ్రేవరంసురాన్॥
ప్రోక్తశ్చ దేవై స్సంసుప్తంయస్త్వాముత్థాపయిష్యతి।
దేహజేనాగ్ని నాసద్యస్సతుభస్మీ భవిష్యతి॥
కనిన యా క్షణమ యవనుడా క్రోధాగ్నిచే మసియయ్యెను. ఆ ముచుకుందుడు దేవాసుర యుద్దమందు రాక్షసులం బలిగొని గాడనిద్ర గొని పెద్దకాలమట నిద్రను దేవతల వరము గోరి నిద్రవోయెను. వారును నిన్నెవ్వడు లేపునో వాడు తన మేనం బొడమిన యగ్నిచే తాన కాలి నుసియగుననిరి.
ఏవందగ్ధ్వాసతం పాపం దృష్ట్వాచ మధుసూదనమ్।
కస్త్వమిత్యాహసోప్యాహజాతోహంశశినః కులే॥
వసుదేవస్యతనయో యదోర్వంశసముద్భవః।
ముచుకున్దోపితత్రాసౌవృద్ధగార్గ్యవచోఽస్మరత్॥
సంస్మృత్యప్రణిపత్యై నంసర్వంసర్వేశ్వరం హరిమ్।
ప్రాహజ్ఞాతోభవాన్విష్ణోరంశస్త్వం పరమేశ్వర॥
ఇట్లా పాపిని యవనుని దహించి యా ముచుకుందుడు ముకుందుంగని నీవెవ్వడవన నేను చంద్రవంశమున యాదవుల వంశమున పుట్టిన వసుదేవుని తనయుడనన ముచుకుందుడు వృద్ధగార్గ్యుడన్న మాట జ్ఞప్తికి దెచ్చికొనెను. వెనువెంటనే ప్రణమిల్లి సర్వేశ్వరుని సర్వరూపుహరిం గూర్చి యిట్లనియె.
ముచుకుందుడు కృష్ణుని స్తుతించుట:
పురాగార్గ్యేణ కథితమష్టావింశతిమేయుగే।
ద్వాపరాన్తేహరేర్జన్మ యదువంశే భవిష్యతి॥
సత్వం ప్రాప్తోనసన్దేహో మర్త్యానాముపకారకృత్॥
తథాహిసుమహ త్తెజో నాలంసోడుమహంతవ।
తథాహిసజలామ్బోధనాదధీరతరంతవ।
వాక్యంనమతిచై వోర్వీ యుష్మత్పాదప్రపీడితా॥
దేవాసుర మహాయుద్దెదైత్యసైన్యమహాభటాః।
నసేహుః మమతేజస్తేత్వత్తేజోనసహామ్యహమ్॥
సంసారపతితస్యై కోజన్తోస్త్వం శరణం పరమ్।
ప్రసీదత్వం ప్రసన్నార్తి హరనాశయమేఽశుభమ్॥
త్వంపయోనిధయశ్శైలాస్సరితస్త్వంవనానిచ।
మేదినీ గగనం వాయురాపోగ్నిః స్త్వంతథామనః॥
బుద్ధిరవ్యాకృతంప్రాణాః ప్రాణేశ స్త్వంతథాపుమాన్।
పుంసః పరతరంయచ్చవ్యాప్యజన్మ వికారవత్॥
శబ్దాదిహీనమజరమమేయంక్షయ వర్జితమ్।
అవృద్ధినాశంతద్బ్రహ్మత్వమాద్యన్తవివర్జితమ్॥
త్వత్తోమరాస్సపితరో యక్ష గన్దర్వ కిన్నరాః।
సిద్ధశ్చాప్సరస స్త్వత్తోమనుష్యాః పశవః ఖగాః॥
సరీసృపా మృగా స్సర్వేత్వత్తస్సర్వే మహీరుహాః।
యచ్చభూతం భవిష్యంచ కించిదత్రచరాచరమ్॥
మూర్తామూర్తంతథాచాపిస్థూలంసూక్ష్మతరంతథా।
తత్సర్వంత్వంజగత్కర్తానాస్తికించి త్త్వయావినా॥
ముచుకుందుడు:
నీవు సాక్షాద్విష్ణుడవని ఎరింగితిని. ఇరువది ఎనిమిదవ యుగములో నవతారమగునని గార్గ్యుడు మున్ను తెలిపెను. ఆ హరివే నీవిట సాక్షాత్కరమైతివి. సందేహము లేదు. మనుష్యుల కుపకారము చేయు నీ మహత్తర తేజ మేను సైప జాలను. సజల జలదనాద గంభీరమయిన నీ పలుకు నీ పాద స్పర్శ మాత్రమున నవని క్రుంగుటయుం గంటిని. దేవాసుర మహాసమరమున దైత్య సైన్య మహాభటులు నా తేజము సైపలేరైరి. అట్టి నేనే నీ మహాతేజ మోర్వలేకున్నాను. సంసారమునం బడిన జంతువునకు నీ వొక్కడవ దిక్కు. ప్రపంనార్తిహరా! ప్రభో ప్రసన్నుడవగుము. నా అశుభము హరింపుము! సముద్ర శైల సరిద్వనాదులు భూమ్యాది పంచభూతములు మనస్సు బుద్ధి అవ్యాకృత ప్రాణములు ప్రాణేశ్వరుడవు నీవ. పురుషోత్తముడవు. పురుషతత్త్వమున కంటెను బైది జన్మాది వికార రహితము సర్వవ్యాపి శబ్దాది రహితము అజరము అమేయము అక్షయము వృద్ధి నాశములు లేనిదియు ఆద్యన్తహితమునైన బ్రహ్మము నీవ. నీ నుండియ దేవ పితృ యక్ష గంధర్వాదులు ఆ పిపీలిక బ్రహ్మము చరాచరము భూత భవిష్యము నుదయించినది. మూర్తము అమూర్తము స్థూలము సూక్ష్మమునైన సర్వవిశ్వము నీవు. నిను మించియే కొంచెమును లేదు.
మయా సంసారచక్రేస్మిన్ భ్రమతాభగవంత్సదా।
తాపత్రయాభిభూతేననప్రాప్తానిర్ వ్రుత్తిః క్వచిత్॥
దుఃఖాన్యేవసుఖానీతిమృగతృష్ణా జలాశయాః।
మయానాథ గృహీతాని తానితాపాయమేఽభవన్॥
రాజ్యముర్వీబలంకోశోమిత్రపక్ష స్తథాత్మజాః।
భార్యాభృత్యజనోయేచ శబ్దాద్యావిషయాఃప్రభో॥
సుఖబుద్ధ్యామయాసర్వంగృహీతమిదమవ్యయమ్।
పరిణామేతదేవేశ! తాపాత్మకమభూన్మమ॥
దేవలోక గతింప్రాప్తోనాథ! దేవగణోపిహి।
మత్తస్సాహాయ్యకామోభూచ్చాశ్వతీకుత్రనిర్వృతిః॥
త్వామనారాధ్యజగతాంసర్వేషాంప్రభవాస్పదమ్।
శాశ్వతీప్రాప్యతేకేన పరమేశ్వరనిర్వృతిః॥
త్వన్మాయామూడమనసోజన్మ మృత్యు జరాదికాన్।
అవాప్యతాపాన్ పశ్యన్తిప్రేతరాజమనంతరమ్॥
ఈ సంసార చక్రమున నేననేక భ్రమణములు సేసి తాపత్రయము వలన గుమిలితిని. ఎండమావులం జూచి జలాశచే జలాశయములని పర్వెత్తినట్లు దుఃఖములనే సుఖములని యెంచి పర్వులిడితిని. అవి నాకు తాపమునకే అయినవి. రాజ్యము, నేల, బలము, కోశము, మిత్రపక్షము, కొడుకులు, భార్య, సేవకులు, శబ్దాది విషయములు, సుఖములను బుద్ధిం దగిలితి నిది యెల్ల పరిణామ దశయందు నాకు తాపాత్మకమైనది. దేవా! దేవగతి కేగితిని. అక్కడ దేవగణము గూడ నా వలన సాహాయ్య మర్థించినది. స్వామీ! శాశ్వత నిర్వృతి యెక్కడ? సర్వ జగత్కారణమగు నిన్ను గొలువక శాశ్వతానంద మెట్లు లభ్యము? నీ మాయచే మూడులై జన్మ మృత్యుజరాదుల వశులై తాపములువడి ప్రేతరాజును దర్శింతురు.
తతోనిజక్రియా సూతినరకేష్వతి దారుణమ్।
ప్రాప్నువన్తినారా దుఃఖ మస్వరూపవిదస్తవ॥
అహమత్యన్తవిషయీ మోహిత స్తవమాయయా।
మమత్వగర్వగర్తాన్తర్ భ్రమామి పరమేశ్వర॥
సోఽహంత్వాంశరణమాపారమప్రమేయం సంప్రాప్తః పరమపదంయతోనకించిత్।
సంసారభ్రమపరితాపతప్తచేతా నిర్వాణేపరిణతదామ్నిసాభిలాషః॥
ఆవలదా మొనరించిన పనులం బొడమిన యతిదారుణ నరకముల దుఃఖములను నీకల రూపెరుంగని నరులు గుడుతురు. నేనత్యంతము విషయ లోలుడనై నీ మాయచే మోహితుడనై మమత్వాహంకారము లనెడి గుంటలో నిట్టట్టు లెట్టి పర్వులిడితిని. పరమేశ్వరా! అట్టి నేను అప్రమేయము పరమ పదమునైన నిన్ను శరణందు చున్నాను. ఇంతకు పైనేమియు లేదు. సంసార భ్రమణ పరితప్తచేతస్కుడ నిప్పుడు నిర్వాణమందు కేవల తేజస్సు నందలి లాషగా గన్నాను. ప్రభూ! శరణు శరణు.
Summary of chapter 23 of the Vishnu Mahā Purāṇa is as follows:
Kālayavana pursues Kṛṣṇa into the Himalayan hills. Kṛṣṇa leads him into a cave where the ancient king Mucukunda lies in a deep sleep — a sleep granted by the devas as a reward for cons of service in their wars, with the boon that whoever wakes him will be burned by his gaze. Kālayavana kicks Mucukunda awake and is immediately burned to ashes. Mucukunda, recognizing Kṛṣṇa, offers a stotra of complete surrender. Kṛṣṇa grants him mokṣa and Mucukunda resolves to depart for Badarikāśrama.