విష్ణు మహా పురాణము

5 - కృష్ణుడు మధురా నగర మేగుట

శ్రీపరాశరుడు:

విముక్తోవసుదేవోఽపినన్దస్య శకటం గతః

ప్రహృష్టం దృష్టవాన్నన్దం పుత్రోజాతోమమేతివై

వసుదేవోపీతం ప్రాహదిష్ట్వాదిష్ట్యేతిసాదరం

వార్ధకేపిసముత్పన్నస్తనయోయంతవాధునా

దత్తోహివార్షికస్సర్వో భవద్భిర్ నృపతేః కరః

యదర్ధమాగతాస్తస్మాన్నాత్రస్థేయం మహాధనైః

యదర్ధమాగతాః కార్యం తన్నిష్పన్నం కిమాస్యతే

భవద్భిర్గమ్యతాంనన్ద! తచ్చీఘ్రం నిజగోకులమ్

మమాపిబాలక స్తత్ర రోహిణీప్రభవోహియః

సరక్షణీయోభావతాయథాఽయం తనయోనిజః

ఇత్యుక్తాః ప్రయయుర్గోపాః నన్దగోపపురోగమాః

శకటారోపితై ర్భాణ్డైః కరందత్త్వామహాబలాః

శ్రీపరాశరుడు:

వసుదేవుడు బంధముక్తుడై నందుని బండి దరికేగి నాకు బుత్రుడు గల్గినాడని మిగుల నానందించుచున్న నందునిం జూచెను. మఱియు నతనింగని బాగు! బాగు! నీకు ముసలి తనమున దనయుండు గల్గినాడు నీ భాగ్యమని సాదరముగ నందునిం బలుకరించెను. ఱేనికిం బన్నుగట్టినారు గదా మీరిటకు వచ్చినపని యైనది. ధనరాసులతో మీరిట క్షణమాగ వలదు. ఆగవలసిన పని మాత్ర మేమున్నది మీ వ్రేపల్లె కిప్పుడచ నుండు. నాకును రోహిణికి బుట్టిన కొడుకచ్చట నున్నాడు. మీ బిడ్డనట్ల వానిం గాపాడుము. అని పలుక నందాది గోపకులు పన్నులు సెల్లెంచి తమ సామాగ్రిం బండ్ల కేక్కించికొని యట నుండి తరలిరి.

వసతాం గోకులేతేషాం పూతనాబాలఘాతినీ

సుప్తంకృష్ణముపాదాయ రాత్రౌతస్మైస్తనందదౌ

యస్మైయస్మైస్తనంరాత్రౌపూతనాసంప్రయచ్చతి

తస్యతస్యక్షణేనాఙ్గంబాలకస్యోపహన్యతే

కృష్ణస్తుత్త్సనంగాడం కరాభ్యమతిపీడితమ్

గృహీత్వాప్రానసహితం పపౌక్రోధసమన్వితః

సాతిముక్తమహారావావిచ్చిన్నస్నాయుబన్ధనా

పపాతపూతనాభూమౌ మ్రియమాణాతిభీషణా

తన్నాదశ్రుతిసంత్రస్తాః ప్రబుద్దాస్తేవ్రజౌకసః

దదృశుఃపూతనోత్సంగే కృష్ణం తాంచనిపాతితామ్

ఆదాయకృష్ణం సంత్రస్తాయశోదాపి ద్విజోత్తమ

గోపుచ్చభ్రామణేనా థబాలదోషమపాకరోత్

గోకరీషముపాదాయనన్దగోపోఽపిమస్తకే

కృష్ణస్యప్రదదౌరక్షాంకుర్వంశ్పైతదుదీరయన్

గోకులమందు వారు సుఖమున్న తఱి బాలఘాతిని పూతన యటకేగి రాత్రి నిదురించు చున్న బాలకృష్ణు నెత్తుకొని పాలిచ్చెను. అది ఎవ్వని కెవ్వనికి జన్నుగడుపు వాని వాని శరీరము క్షణములో బడి పోవు చుండును. కాని కృష్ణుడు మాత్రము దాని ఱొమ్మును గట్టిగ బట్టి కుడిచికొని కినుకగొని పాలతో బాటు దాని ప్రాణములం ద్రావి వైచెను. ఆ రక్కసి మిక్కిలిగ నార్చి ప్రేవులు దెగి ప్రాణ వాయువులు పోయి చట్టన నేలం గూలేను. దాని యఱపు విని జడుపుగొని వ్రజవాసులు మెలుకువ గొని యా పూతన యొడిలోని కృష్ణుని నచ్చట పడియున్న యా రాక్షసినిం జూచిరి. యశోదయుం గృష్ణుని గని యెత్తికొని మిక్కిలి జడిసి బిడ్డ జడుపుగొని నాడని ఆదోక తలచుట్టు త్రిప్పుట దిగదుడుపు మొదలగునవి గావించి బాలదోష నివారణ మొనరించెను. నంద గోపుడును నావుపేడం గొని నడినెత్తిపై నీ క్రింది మంత్రములు జపించుచు రక్ష పెట్టెను.

నందుడు బాలకృష్ణుని కంగరక్ష పెట్టుట (నందగోపుడు):

రక్షతుత్వామశేషాణాం భూతానాం ప్రభవోహరిః

యస్యనాభిసముద్భూతపంకజాతభవంజగత్

యేనదంష్ట్రాగ్రవిధృతాధారయత్యవనిర్జగాత్

వరాహరూపధృద్దేవస్సత్వాం రక్షతుకేశవః

నఖాంకురవినిర్భిన్నవైరివక్షస్థలోవిభుః

నృసింహరూపీసర్వత్ర రక్షతుత్వాంజనార్దనః

వామనోరక్షతుసదా భవన్తంయః క్షణాదభూత్

త్రివిక్రమః క్రమాక్రాన్తత్రైలోక్యః స్ఫురదాయుదః

శిరస్తేపాతుగోవిన్దః కణ్ఠం రక్షతు కేశవః

గుహ్యంసజఠరం విష్ణుః జఙ్ఘేపాదౌజనార్దనః

ముఖం బాహూప్రబాహూచమనస్సర్వేన్ద్రియాణిచ

ఱక్షత్వవ్యాహతై శ్వర్య స్తవనారాయణోఽవ్యయః

శార్గ్య చక్రగదాపాణేశ్శంఖనాదహతాః క్షయమ్

గచ్చన్తుప్రేతకూశ్మాణ్డరాక్షసాయేతవాహితాః

త్వాంపాతుదిక్షువైకుణ్ఠోవిదిక్షుమధుసూదనః

హృషీకేశోమ్భరేభూమౌరక్షతుత్వాంమహీధరః

ఏవం కృతస్వస్త్యయనో నన్దగోపేనబాలకః

శాయితశ్శకటస్యాధో బాలపర్యఙ్కికాతలే

తేచగోపామద్దృష్ట్వా పూతనాయాః కళేబరమ్

మృతాయాః పరమంత్రాసం విస్మయంచ తదాయయుః

అశేష భూతకారణుడు హరి నిన్ను రక్షించు గాక! ఎవని బొడ్డునం బొడమిన తామర పూవునం జగమెల్ల బొడమినదో, ఎవ్వని కోరచే ధరింప బడి ధరణియీ జగముం ధరించు చున్నదో అవ్వరాహమూర్తి ధరుడు దేవుడు కేశవుడు నిన్ను రక్షించు గాక! గోటి కొనలచే వైరుల వక్షములం జీల్చిన యమ్మేటి నృసింహమూర్తి జనార్దనుండెల్ల యెడల నిన్ను రక్షించుగాక! క్షణములో పొట్టివడుగురూపైబెడిదపుటడిదములం గొని ముల్లోకములను మూడడగుల నాక్రమించిన యవ్వామనుండు నిన్నీవేళ రక్షించు గాక! గోవిందుడు నీ శిరస్సును గాపాడు గాక! కేశవుడు నీ కంఠమును రక్షించుగాక! కడుపుతోటి నీ గుహ్యమును విష్ణువు, జనార్దనుడడుగులం పిక్కలను బ్రోచుగాక! అవ్వాహతైశ్వర్యుడు అవ్యయుడు నగు నారాయణుడు ముఖమును చేతులను మోచేతులను మనస్సును ఎల్ల యింద్రియములను గాపాడుగాక! శార్ఙ్గ చక్రగదా పాణి యొక్క శంఖ భంభాంకారములచే ప్రేతకూష్మాండాదులగు రాక్షసులు నీ కహితులు నిహతులాయి నశింతురు గాక! వైకుంఠడు దిక్కు లందు మధుసూదనుడు విదిక్కు లందు (మూలలందును). ఆకసము నందు హృషీకేశుడు, భూమి యందు ధరణీధరుడు రక్షించుగాక! ఈ విధముగ నందగోపుడు పిల్లవానికి శాంతికర్మను చేసి బండిక్రింద చిన్న మంచము మీద పరుండ బెట్టెను. గోపాలురందరు చనిపోయిన పూతన యొక్క పెద్ద శరీరమును చూచి గొప్ప భయమును, ఆశ్చర్యమును పొందిరి.