6 - బలరామకృష్ణ లీలా విహారము

శ్రీపరాశరుడు:

కదాచిచ్చకటస్యాధశ్శయానో మధుసూదనః।

చిక్షేపచరణావూర్ ధ్వం స్తన్యార్ థీప్రరురోదహ॥

తస్యపాదప్రహారేణశకటం పరివర్తితమ్।

విధ్వస్తకుమ్భభాణ్డం తద్విపరీతంపపాతవై॥

తతోహాహాకృతస్సర్వోగోపగోపీజనోద్విజ!।

ఆజగామాథదదృశేబాలముత్తానశాయినమ్॥

గోపాః కేనేతికేనేదంశకటం పరివృతమ్।

తత్త్రైవాబాలకాః ప్రోచుర్భాలేనానేనపాతితమ్॥

రుదతాదృష్టమస్మాభిః పాదవిక్షేపపాతితమ్।

శకటం పరివృత్తంవై నైతదన్యస్యచేష్టితమ్।

తతః పునరాతీవాసన్ గోపావిస్మయచేతసః।

నన్దగోపోఽపిజగ్రాహబాలమత్యన్తవిస్మితః॥

యశోదాశకటారూఢభగ్నభాన్డకపాలికాః।

శకటం చార్చయామాసదధిపుష్పఫలాక్షతైః॥

శ్రీపరాశరుడు:

ఒక తఱి మధువైరి బండి క్రింద పరుండి చిఱుపాదము లెత్తి పాలకై ఏడ్పు పెట్టెను. అతని కాలితాపున నా తలక్రిందులు పడి దరినున్న పాల కడవలు పగిలి యెగిరి పడెను. అంతట గోప గోపీజనము హాహాకార మొనరించుచు వచ్చి వెల్లగిల పరున్న చిన్ని కృష్ణుని జూచిరి. గోపకులారా! ఎవనిచే నీ బండి తలక్రిందు పడినది? అనుచు వారునటనున్న పిల్లలీ పిల్లవాని చేనిది పడగొట్ట బడిన దనిరి. ఏడ్చుచు వీడు కాలాడించి నంతట దిరిగి వడి కూలి పడెనిది యింకొకని చేతగాదనిరి. అంతట గోపు లత్యాశ్చర్య మతులైరి. నందగోపుడును మిక్కిలి యక్కజమున నా చక్కని పాపనెత్తి కొనెను. యశోదయు బండిపై నెక్కించిన కుండ లోటువడి చెదరి పడిన పాలికలను బండిని పెరుగు పూలు అక్షతలు మొదలగు వానిచే బూజసేసిరి.

గర్గశ్చగోకులేతత్రవాసుదేవప్రచోదితః।

ప్రచ్చన్న ఏవగోపానాం సంస్కారానకరోత్తయోః॥

జ్యేష్ఠం చరామమిత్యాహకృష్ణం చైవతథాపరమ్।

గర్గోమతిమతాం శ్రేష్ఠోనామకుర్వన్మహామతిః।

స్వల్పేనైవతుకాలేన రఙ్గిణౌతౌతదవ్రజే।

ఘృష్ఠజానుకరౌవిప్ర! భూష్ట్రవతురుభావపి॥

కరీషభస్మదిగ్ధాఙ్గౌభ్రమమాణావిత స్తతః।

ననివారయితుం సేహే యశోదాతౌనరోహిణీ॥

గోవాటమధ్యేక్రీడన్తౌ వత్సవాటం గతౌపునః।

తదహర్జతగోవత్సపుచ్చాకర్షణతత్పరౌ॥

యదాయశోదాతౌబాలావేకస్తానచరావుభౌ।

శశాకనోవారయితుం క్రీడన్తావతిచఞ్చలౌ॥

దామ్నామధ్యేతతోబధ్వాబబన్ధతములూఖలే।

కృష్ణమక్లిష్టకర్మాణమాహచేదమమర్షితా॥

వసుదేవు పనుపున జ్ఞాననిధి గర్గాచార్యుడు వ్రేపల్లెకు వచ్చి దాబ్రకటించు కొనకయు యా బలరామ కృష్ణులకు నామ కరణాది సంస్కారములను జరిపించెను. పెద్దవానిని రాముడని పిన్నవానిని కృష్ణుడనియుం బేర్కొనెను. అల్పకాలముననే వారిద్దరు నా పల్లెలో మోకాళ్ళు చేతులు నవనిపై దాకించుచుం బాకుచు నొడలికిం గోమయ భస్మముం బూసికోనుచు నిట్టట్టు పరువులు వారుచునుండ యశోద రోహిణియును వారిం బట్టజాలలైరి. ఆవుల దొడ్డిలో నాటలాడుచు నాడుచునే నా దూడల మందకుఱికి వాని తోకలం బట్టికొని దూకుచు వినోదము గొల్పుచుండిరి. ఒక తఱి యన్నా దమ్ములొక్కటై యొక్కచో నాటలాడుచు గంతులు వేయుచుండ వారిని వారింప వశము గాక యశోదయొక తఱి నెట్లో పట్టుబడిన కృష్ణుడి బొజ్జకుం ద్రాడుచుట్టి ఱోటికిం గట్టి వైచెను. కోపముతో నితనిం గూర్చి యిట్లనియె

యదిశక్నోషిగచ్ఛత్వమతిచఞ్ఛలచేష్టిత।

ఇత్యుక్త్వాఽథనిజంకర్మసాచాకారకుటుమ్భినీ॥

వ్యగ్రాయామథతస్యాంసకర్షమాణ ఉలూఖలమ్।

యమళార్జునమధ్యేనజగామకమలేక్షణః॥

కర్షతావృక్షయోర్మధ్యే తిర్యగ్గతములూఖలమ్।

భగ్నావుత్తుఙ్గశాఖాగ్రౌ తేనతౌయమళార్జునౌ॥

తతః కటకటాశబ్దసమాకర్ణనతత్పరః।

ఆజగామవ్రజజనో దదర్శచమహాద్రుమౌ॥

నవోద్గతాల్పదన్తాంశుసిహాసంచబాలకమ్।

తయోర్మధ్యగతందామ్నాబద్డంగాడంతథోదరే।

తతశ్చదామోదరతాం సాయయౌదామాబన్ధనాత్॥

ఓ అల్లరి పిల్లవాడ! ఏదీ! చేతనైన కదలి వెళ్ళుమని యానవెట్టి బెదరించి తన యింటి పనులం జూచుకోను చుండెను. ఆ తొందరలో నామె యుండుటగని యా పాపడు రెండు మద్దిచెట్ల నడుమ నుండి నా ఱోలీడ్చుకొనుచు బోయి యయ్యిరుకు సందున నడియడ్డము దిఱుగ నా బాలుడు లాగినంత నా మహావృక్షములు విఱిగిపడె. అయ్యెడ నాకటకటా శబ్దమాలించి వ్రేపల్లె జనమేతేంచి యా పెనుమ్రాకులం దిలకించిరి. వచ్చియురాని లేత పలువరుస తెలికాంతుల మిగుల నచ్చమయిన చిఱునవ్వులు గులుక నా తరువులు రెండిటి నడుమ బొజ్జకుం బెనుత్రాటం గట్టబడిన ఱోలితో నున్న బాలకృష్ణునిం గాంచిరి. అమ్మ దామమున త్రాటం గడుపునకు ఱోలు గట్టుట నా పాపడు దామోదరుడను పేర్వడసెను.

గోపవృద్దాస్తస్సర్వేనన్దగోపపురోగమాః।

మన్త్రయామాసురుద్విగ్నామహోత్పాతాతిభీరవః॥

స్థానేనేహననః కార్యం వ్రజామోన్యన్మహావనమ్।

ఉత్పాతాబహవోహ్యత్రదృశ్యన్తేనాశహేతవః॥

పూతనాయావినాశశ్చ శకటస్యవిపర్యయః।

వినావాతాదిదోషేణ ద్రుమాయోః పతనం తథా॥

బృన్దావనమితస్థ్సానాత్తస్మాద్గాచ్చామమాచిరమ్।

యావద్భౌమమహోత్పాతదోషోనాభిభవేద్వ్రజమ్॥

ఇతికృత్వామతిం సర్వేగమనేతేవ్రజౌకసః।

ఊచుస్స్వంస్వంకులంశీఘ్రంగమ్యతాం మావిలమ్బథ॥

తతః క్షణేనప్రయయుశ్శకటైః గోధనై స్తథా।

యూధశోవత్సపాలాశ్చకాలయంతోవ్రజౌకసః॥

ద్రవ్యావయవనిర్దూతం క్షనమాత్రేణత త్తదా।

కాకభాససమాకీర్ణం వ్రజస్థానమభూద్ద్విజ॥

బృన్దావనంభాగవత కృష్ణేనాక్లిష్టకర్మణా।

శుభేనమనసాధ్యాతం గవాం వృద్దిమభీప్సతా॥

నందాది గోప వృద్దులేపల్లియం గలుగు నుత్పాతముల కడలి యిక్కడ మనము నివసింపరాదు. వనమునకుం బోదము. గాలి లేకుండనే యిమ్మహా వృక్షములు గూలినవి. పూతనా వినాశము శకటము తిఱుగుడు వడుట మొదలగు భయంకర సంఘటన లయినవి వెంటనే మనమిట నుండి కదలి బృందావనమునకు బోదము. ఈ భౌమోత్పాత దోషము తొలగు నందాక యట నుందుము. అని నిశ్చయించి వ్రజవాసులెల్లరు లెండులెండు వెనువెంటనే పోవలయునని తమ వారలకు హెచ్చరికలు సేసి యా క్షణమే మందలతో నాలకాపరు లొండొరులం బిలిచికొని యటువోయిరి. క్షణములో బండలపై సామగ్రితో నెక్కి గోధనములతో దరలినంత నా వ్రేపల్లె శూన్యమై కాకులు గ్రద్దలకు నిలయమై శోభ తొరంగెను.

శ్రీ బలరామకృష్ణుల బృందావన విహారము:

తత స్తత్రాతిరూక్షేఽ పిఘర్మకాలేద్విజోత్తమ।

ప్రావృట్కాల ఇవోద్భూతం నవశష్పంసమన్తతః॥

ససమావాపితస్సర్వోవ్రజోబృన్దావనేతతః।

శకటావాటపర్య న్తశ్చన్ద్రార్దాకారసంస్థితః॥

వత్సపాలౌచసంవృత్తౌరామదామోదరౌతతః।

ఏకస్థానస్థితౌగోష్ఠేచేరతుర్బాలలీలయూ॥

బర్ హిపత్రకృతాపీడౌవన్యపుష్పావతంసకౌ।

గోపవేణుకృతాతోద్యపత్రవాద్యకృతస్వనౌ॥

కాకపక్షధరౌబాలౌకుమారావివ పావకీ।

హసన్తౌచరమన్తౌచచేరతుః స్మ మహావనమ్॥

క్వచిద్వహన్తావన్యోన్యం క్రీడమానౌతథాపరైః।

గోపపుత్త్రైస్సమం వత్సాంశ్చారయన్తౌవిచేరతుః॥

కాలేనగచ్ఛతా తౌతుస ప్తవర్షౌమహావ్రజే।

సర్వస్యజగతః పాలౌ వత్సపాలౌభూవతుః॥

శ్రీకృష్ణ భగవానుడు గోవుల పెంపుగోరు శుభ సంకల్పముతో బృందావనముం దలంచు కొనెను. అందుచే నా ప్రాంతమంతయు మిక్కిలి తీవ్రమైన గ్రీష్మకాల మందును వర్షర్తువు నందువలె పచ్చని లే పచ్చిక మొలచెను. సర్వగోకుల రూపయి నా దొడ్డిలో బండ్లను విప్పి అర్ధచంద్రాకారముగ నేర్పఱచు కొన్న హద్దునందు విడిది సేసిరి. అయ్యెడ బలరామ కృష్ణులాల కాపరులైరి. ఇద్దరుం గూడి యయ్యావుల మందలో బాలలీలల న్విహరింప జొచ్చిరి. నెమలి పించెములం శిరములం జెరవికొని వన్యము లగు పువ్వులను జుట్టులం దురుముకొని తోడి గోపాలురు లేగలంగాయుటకు జేకొన్న వేణు ఖండమ్ములచే తను బత్రవాద్యముల చేతను (కొబ్బరియాకులు మొదలయిన వాని చేనయిన బూరాల చేతను) తాళ లయానుగుణ మేళనంబు గావింప కాకపక్షధరులై (తల నిరువైపుల వ్రేలాడు జునపాలతో ముచ్చట గొలుపుచు) అగ్నికుదయించిన కుమారులట్లు అగ్నియందు నిక్షిప్తమైన శివ వీర్యమున నుదయించిన స్కందస్వామి యంశావతార మూర్తులయిన శాఖ విశాఖలను కుమారులట్ల బలరామ కృష్ణులా బృందావన మందల్లన నవ్వుచుం గేరింతలు కొట్టుచు నవ్వన మందాటలు మఱిగి తిరుగాడం జొచ్చిరి. ఏడేండ్ల యీడువారై యమ్మహా వ్రజమందా సర్వజగత్పరి పాలకులు గోవత్స పరిపాలకులైరి.

బృందావన మందు వర్ష ఋతు శోభ:

ప్రావృట్కాలస్తతోఽతీవమేఘౌఘస్థగితామ్భరః।

బభూవవారిదారాభిరైక్యం కుర్వన్ దిశామివ ॥

ప్రరూఢనవశాష్పాఢ్యాశక్రగోపాచితామహీ।

తథామారకతీవాసీత్పద్మరాగవిభూషితా॥

ఊహురున్మార్గవాహీని నిమ్నగామ్భాంసిసర్వతః।

మనాంసిదుర్వినీతానాం ప్రాప్యాలక్ష్మీంనవామివ॥

నరేజేఽన్తరితశ్చన్ద్రోనిర్మలోమలినైః ఘనైః।

సద్వాదివాదో మూర్ ఖాణాం ప్రగల్భాభిరివోక్తిభిః॥

నిర్గుణేనాపిచాపేనాశక్రస్యగగనేపదమ్।

అవాప్యతావివేజస్యనృపసైవపరిగ్రహే॥

మేఘపృష్ఠేబలాకానాం రారాజవిమలాతతిః।

దుర్ వృత్తేవృత్తచేష్టెవకులీనస్యాతిశోభనా॥

నబబన్ధామ్బరేస్థైర్యంవిద్యుదత్యన్తచఞ్చలా।

మైత్రీవప్రవారేపుంసిదుర్జనేనప్రయోజితా॥

మార్గాబభూవురస్పష్టాస్తృణశష్పచయావృతాః।

అర్థా న్తరమనుప్రాప్తాః ప్రజడానామివో క్తయః॥

ఉన్మత్త శిఖిసార జ్ఞేతతస్మిన్ కాలేమహావనే।

కృష్ణరామౌముదాయుక్తౌగోపాలై శ్చేరతుస్సహ॥

క్వచిద్గోభిస్సమంరమ్యంగేయతారతావుభౌ।

చేరతుః క్వచిదత్యర్థం శీతవృక్షతలాశ్రితౌ॥

క్వచిత్కదమ్భస్రక్చిత్రౌమయూరస్రగ్విరాజితౌ।

విలిప్తౌక్వచిదాసాతాంవివిధై ర్గిరిధాతుభిః॥

పర్ణశయ్యాసుసంసుప్తౌక్వచిన్నిద్రాన్తరైషిణౌ।

క్వచిద్గర్జతిజీమూతే హాహాకారరవాకులౌ॥

గాయతామన్యగోపానాం ప్రశంసాపరమౌక్వచిత్।

మయూరకేకానుగతౌగోపవేణుప్రవాదకౌ॥

ఇతినానావిధైర్భావై రుత్తమప్రీతిసంయుతౌ।

క్రీడన్తౌతౌవనేతస్మిన్ చేరతుస్తుష్టమానసౌ॥

వికాలేచసమం గోభిః ర్గోపబృన్ధసమన్వితౌ।

విహృత్యాథయథాయోగం ప్రజమేత్యమహాబలౌ॥

గోపైస్సమానైస్సహితౌక్రీడన్తావామరావివ।

ఏవంతావూషతు స్తత్రరామకృష్ణౌ మహాద్యుతీ॥

ఆకసమలముకొన్న మబ్బులతో మిన్ను మన్నేకము గావించు వర్షధారలతో వర్షర్తువు వచ్చెను. పచ్చని లేబచ్చికలతో నింద్ర గోపములతో (ఆర్ద్ర పురుగులతో) వసుమతి నడునడుమ పద్మరాగ మణులు దాపిన మరకత మాణిక్య మయమై (పచ్చలతో నిండినదై) నటుల ముచ్చట గొల్పు చుండెను. నదులు వఱదలంగొని కట్టలు తెంచుకొని పరవళ్ళు ద్రొక్కుచు నడిమంత్రపు సిరుల మిడిసిపడు సవినయ శీలుర మనస్సులట్లు దుందుడుకుం గొని పారం జొచ్చెను. అచ్చ తెల్లని చందమామ నల్లని మబ్బుల చాటునం బడి మూర్ఖుల ప్రగల్భోక్తుల చేత సద్వాదుల వాడమట్లు వెలవెలబోయెను. వివేకము లేని రాజు చేతిలోని విల్లటుల గుణ హీనమై పనికి మాలినదై (శ్లేష) (గుణము = నారి ఎక్కిడినది గాని) ఇంద్రధనస్సు నింగినిందిర వొందెను. నల్లని మబ్బుల వెనుక తెల్లని బెగ్గురు పక్షుల వరుస కులభ్రష్టుని యెడ శిష్టాచార వంశుడు చేసిన శోభనచర్య యలా (ప్రాయశ్చిత్త క్రియవలె) విరాజిల్లెను. మెఱపు మిక్కిలి చపలమై యుత్తమ పురుషుని యెడ నపాత్రుడు చూపిన మైత్రివలె నాకసమందు నిలుకడ గోన జాలడయ్యె. గడ్డి గాదముల గ్రమ్ముకొని బాటలు పెడయర్ధముల నిచ్చు మూర్ఖుల మాటలట్లు తెలియ రావయ్యెను. నెమళ్ళు సారంగములు (బెగ్గురు పక్షులు) మిక్కిలి మదమును ముదముంగొను నా వానకారున నా బృందావనమున బలరామకృష్ణు లానందభరితులై గోపాలురతో సంచరించిరి. ఒక్కతఱి కడిమి పూలమాలల వింతగులుకుచు నొకప్పుడు నెమలి పించముల సొంపుగొని మఱియొక వేళ గైరికాది ధాతువుల నంగరాగములుగ బూసికొనియు నాకులసెజ్జ లందొక వేళ నిద్రవోవుచు నొక్కయెడ మేఘములు బిట్టురుమగ హాహాకారము లోనరించుచు నట్టిట్లు పరువు లిడుచు తోడి గోపకులు పాటలు పాడుచుండ బాగుబాగని యభినందనములు సేయుచు నెమళ్ళుల కేకారవముల ననుసరించుచు పిల్లన గ్రోవులూదుచు నిటుల పలుపోకలు బాలచేష్టల నానంద వివశులై మనసు లెంతేని తుష్టి నంద నా సుందర బృందావనము నందా గోప సుందరుల లన్నాదమ్ములింపు గుల్కుచుం గ్రీడించిరి. ఇట్లు విహరించి సంజెవేళ గోవులతో గోపా బృందముల్తో మహాబలులు రామకృష్ణులు పల్లియకుం జనుదెంచి యీడు జోడైన గోపకులతో నాటలాడుచు దేవకుమారు లద్భుతప్రభ నా వ్రజవాటము నందు వసించిరి.