విష్ణు మహా పురాణము

1 – ద్వితీయాంశము:  భారత చరిత్ర

మైత్రేయుడు:

భగవన్ సమ్యగాఖ్యాతంమమైతదఖిలంత్వయా

జగతస్సర్గసంబన్ధియత్పృష్టోఽసిగురోమయా

యోఽయమంశోధతత్సృష్టిసంబన్దోగదితస్త్వయా

తచ్చాహంశ్రోతుమిచ్చామి భూయోఽపిమునిసత్తమ

ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌస్వాయంభువస్యయౌ

తయోరుత్తానపాదస్య ధ్రువఃపుత్రస్త్వయోదితః

ప్రియవ్రతస్యనైవోక్తభావతాద్విజ! సంతతిః

తామహంశ్రోతుమిచ్చామిప్రసన్నో వక్తుమార్హసి

మైత్రేయుడు:

సృష్టిని గురించి చక్కగా దెలిపితివి. ఈ విషయము నింకను విన గోరెదను. స్వాయంభువ మనువు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తన పాదుడును. అందు త్తానపాదుని కుమారుడగు ధ్రువుని గూర్చి తెల్పితివి. ప్రియవ్రతుని సంతతిం గూర్చి దయతో తెలుపుడు.

శ్రీపరాశరుడు:

కర్దమస్యాత్మజాంకామ్యా కన్యాముపయేమేప్రియవ్రతః

సమ్రాట్కుక్షీచతత్కన్యేదశపుత్రాస్తథాపరే

మహాప్రాజ్ఞామహావీర్యావినీతాదయితాఃపితుః

ప్రియవ్రతసుతాఃఖ్యాతాస్తేషాంనామానిమేశృణు

అగ్నీధ్రశ్చాగ్ని బాహుశ్చ వపుష్మాన్ ద్యుతిమాంస్తథా

మేధామేధాతిథిర్భవ్యస్సవనఃపుత్రాఏవచ

జ్యోతిష్మాన్ దశమస్తేషాంసత్యనామాసుతోభవత్

ప్రియవ్రతస్యపుత్రాస్తే ప్రఖ్యాతాబలవీర్యతః

మేదాగ్ని బాహుపుత్రాస్తు త్రయోయోగపరాయణాః

జాతిస్మరామహాభాగా నరాజ్యాయమనోదధుః

నిర్మమాస్సర్వకాలంతు సమస్తర్థేషువై మునే

చక్రుః క్రియాయథాన్యాయ్యమఫలాకాజ్ క్షిణోహితే

ప్రియవ్రతోదదౌతేషాంసప్తానాంమునిసత్తమ

విభజ్యసప్తద్వీపానిమైత్రేయసుమహాత్మనామ్

జమ్భూద్వీపంమహాభాగఽసోగ్నీ ద్రాయదదౌపితా

మేధాతిథేస్తథాప్రాదాత్ ప్లక్షద్వీపమథాపరమ్

శాల్మలేచవపుష్మన్తంనరేద్రమభిషిక్తవాన్

జ్యోతిష్మన్తంకుశద్వీపేరాజానంకృతవాన్ ప్రభుః

ద్యుతిమన్తంచరాజానం క్రౌంఛద్వీపేసమావిశత్

శాకద్వీపేశ్వరంచాపిభవ్యం చక్రేప్రియవ్రతః

పుష్కరాధిపతించక్రేసవనంచాపిసప్రభుః

జమ్బూద్వీపేశ్వరోయస్తు అగ్నీద్రోమునిసత్తమ

తస్యపుత్రాబభూవుస్తుప్రజాపతిసమానవ

నాభిఃకింపురుషశ్పైవ హరివర్షఇళావృతః

రమ్యోహిరణ్యాన్ షష్ఠస్తుకురుర్భద్రాశ్వఏవచ

కేతుమాలస్తథై వాన్యస్సాధుచేష్టోనృపోఽభవత్

శ్రీపరాశరుడు:

ప్రియవ్రతుడు కర్దమ ప్రజాపతి కూతురును కామ్యను బెండ్లాడెను. వారికి సమ్రాట్టు, కుక్షియను వారు కూతుండ్రు. పదిమంది కుమారులు వారి పేర్లు అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధమేధాతిథి, భవ్యుడు, సవనుడు, పుత్రుడు, జ్యోతిష్మంతుడు (జ్యోతిష్మంతుడు యదార్ధ నామధేయుడు), మేధా. అగ్నిభాహువు పుత్రుడునను ప్రియవ్రతుని కొడుకులు ముగ్గురు యోగులు. పూర్వ జన్మ జ్ఞానము గలవారు. రాజ్యముపై వారు మనసు లేని వారు నిర్మములు విరక్తులు నిష్కామ కర్మపరులై యుండిరి. ప్రియవ్రతుడు తక్కిన యేడుగురు మహాత్ములగు కొడుకులకు రాజ్యము విభజించి యిచ్చెను. జంబూ ద్వీపమును ఆగ్నీధ్రునికి ప్లక్ష ద్వీపమును మేధాతిథికి, శాల్మలి ద్వీపమును

వపుష్మమంతునికి, కుశ ద్వీపమును జ్యోతిష్మమంతునికి, క్రౌంచ ద్వీపమును ద్యుతిమంతునికి, శాక ద్వీపమును భవ్యునికి, పుష్కర ద్వీపమును సవనునికి యిచ్చి పట్టాభి షిక్తులం జేసెను. జంబూ ద్వీపాధిపతి యైన యాగ్నీద్రుని కుమారులు ప్రజాపతి సములు తొమ్మండుగురు. వారు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇళావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అను వారు. కేతుమాలుడు పరమ సాధువు.

జమ్భూద్వీపవిభాగాంస్తు తేషాంవిప్రనిశామయ

పిత్రాదత్తంహిమాహ్వంతు వర్షంనాభేస్తూదక్షిణమ్

హేమకూటంతథావర్షం దదౌకింపురుషాయసః

తృతీయంనైషధంవర్షం హరివర్షాయదత్తవాన్

ఇళావృతాయ ప్రదదౌమేరుర్యత్రతుమధ్యమః

నీలాచలాశ్రితంవర్షంరమ్యాయప్రదదౌపితా

శ్వేతంయదుత్తరంతస్మాత్పిత్రాదత్తంహిరణ్వతే

యదుత్తరంశృంగవతోవర్షంతత్కురవేదదౌ

మేరోః పూర్వేణయద్వర్షం భద్రాశ్వాయప్రదత్తవాన్

గన్ధమాదనవర్షంతు కేతుమాలాయదత్తవాన్

ఇత్యేతానిదదౌతేభ్యః పుత్రేభ్యస్సనరేశ్వరః

వర్షేష్వేతేషుతాన్ సర్వానభిషిచ్యసభూపతిః

సాలగ్రామంమహాపుణ్యం మైత్రేయతపసేయయౌ

యానికింపురుషాద్యానివర్షాణ్యష్టౌమహామునె

తేషాంస్వాభావికీసిద్దిస్సుఖప్రాయాహ్యయత్నతః

విపర్యాయోనతేష్వస్తి జరామృత్యుభయంనచ

ధర్మాధర్మౌనతేష్వాస్తాం నోత్తమాధామమధ్యమాః

నతేష్వస్తియుగావస్థాదేహాదిహ్రాసలక్షణా(ః)

హిమాహ్వయంతువైవర్షంనాభేరాసీన్మహాత్మనః

తస్యర్షభోఽభవత్పుత్రో మేరుదేవ్యాంమహాద్యుతిః

ఋషభాద్భరతోజజ్ఞేజ్యేష్ఠఃపుత్రశతస్యసః

కృత్వారాజ్యంస్వధర్మేణతథేష్ట్వావివిధాన్మఖాన్

అభిషిచ్యసుతంవీరం భరతంపృథివీపతిః

తపసేసుమహాభాగః పులహస్యాశ్రమంయయౌ

వారు జంబూ ద్వీపమును దొమ్మిది భాగము లోనర్చి పంచుకొనిరి. అందు హిమవర్షము నాభికి, దక్షిణ దెసనున్న హేమకూట వర్షమును కింపురుషునికి, మూడవది నైషద వర్షమును హరివర్షునికి, నడుమ మేరువు గల వర్షము నిలావృతునికి, నీలాచల మంటి యున్న వర్షమును రమ్యునికి, దాని కుత్తరముగ నున్న శ్వేత వర్షమును హిరణ్వంతునికి, శృంగవంతమను పర్వతమున కుత్తరపు దెసనున్న వర్షమును కురువునకు, మేరువునకు దూరపు దెసనన్న వర్షమును భద్రాశ్వునకు, గందమాధన వర్షమును కేతుమాలునికి నోసంగెను. ఇట్లారాజు అగ్నీధ్రుడా కుమారులు తొమ్మండ్రను తొమ్మిది వర్షము లందు నభిషేకించి సాల గ్రామమను పుణ్య స్థలమునకు దపస్సునకు నేగెను. కింపురుషాది వర్షము లెనిమి దింట జీవులకు జీవన స్వభావ సిద్దము సుఖప్రాయము (ఆయత్న సిద్దము). అందలి జనులకు విపర్యయము (మార్పు) దుఃఖాదికము ముదిమి మరణము అనువాని భయము లేదు. అందలి జనులందు ధర్మాధర్మములు ఉత్తమాధమ మధ్యమ భేదాములును లేవు. వారిలో యుగ నిమిత్తమైన యవస్థా భేదము ననుసరించి దేహాదులలో హెచ్చు తగ్గులు లేవు. హిమవర్షము మహాత్ముడగు నాభిది. ఆతనికి మేరుదేవి యందు గలిగిన వాడు ఋషభుడు మహాతేజశ్శాలి. ఋషభునికి నూరుగురు పుత్రులు. అందు భరతుడు పెద్దవాడు. ఋషభుడు స్వధర్మముతో రాజ్యము చేసి వీరుడైన తన కుమారుడగు భరతుని అభిషేకించి తపస్సు కొఱకై పులహుని యాశ్రమమగు సాలగ్రామ క్షేత్రమున కేగెను. అచట వానప్రస్థ ధర్మ మవలంభించి తపస్సు చేసెను. యజ్ఞము చేసెను.

వానప్రస్థవిధానేన తత్రాపికృతనిశ్చయః

తపస్తేపేయథాన్యాయ్యమియాజచమహీపతిః

తపసాకర్ణితోత్యర్ధంకృశోధమనిసంతతః

ఆస్యేకృత్వాశ్శఫలకం నగ్నోవీటం ముఖేకృత్వావీరధ్వానమితోగతః

తతశ్చభారతంవర్షమేతల్లో కేషుగీయతే

భరతాయయతఃపిత్రాదత్తం ప్రాతిష్ఠతావనమ్

సుమతిర్భరతస్యాభూత్పుత్రః పరమధార్మికః

కృత్వాసమ్యగ్ దదౌతస్మైరాజ్యమిష్టమఖఃపితా

పుత్రసంక్రామితశ్రీస్తుభరతస్సమహీపతిః

యోగాభ్యాసరతఃప్రాణాన్ సాలగ్రామేత్యజన్మునే

అజాయతచవిప్రోఽసౌ యోగినాంప్రవరేకులే

మైత్రేయతస్యచరితం కథయిష్వామితేపునః

సుమతేస్తేజసస్తస్మాదిన్ద్రద్యుమ్నోవ్యజాయత

పరమేష్టీతత స్తస్మాత్ప్రతిహారస్తదన్వయః

ప్రతిహార్తేఽతివిఖ్యాతఉత్పన్నస్తస్యచాత్మజః

భువ(ః) వోతస్మాతథోగీతిః ప్రస్తావస్తత్సుతోవిభుః

పృథుస్తతస్థతోనక్తోనక్తస్యాపిగయస్సుతః

నరోగయస్యతనాయస్తస్యపుత్రోవిరోహణః

తస్యపుత్రోమహావీర్యో ధీమాంస్తస్మాదజాయత

మహాన్తోహితతశ్చాభూద్ భావనస్తస్య చాత్మజః

త్వష్టాత్వష్టుశ్చవిరజా రజస్తస్యాప్యభూత్సుతః

శతజిద్రజసస్తస్య జజ్ఞేపుత్రశతంమునే

విష్వగ్జ్యోతిప్రధానాస్తేయైరి మావర్దితాః ప్రజాః

తైరిదంభారతంవర్షంనవభేదమలంకృతమ్

తేషాంవంశప్రసూతైశ్చభుక్తేయంభారతీపురా

కృతత్రేతాదిసర్గేణయుగాఖ్యాహ్యేకసప్తతిః

ఏషస్వాయంభువస్సర్గోయేనేదంపూరితంజగత్

వారాహేతుమునేకల్పేపూర్వమన్వన్తరాధిపః

తపస్సుచే గృశించి శల్యమాత్రా వశిష్టుడై నగ్నుడై (దిగంబరియై) మౌనానశన వ్రతస్థులు ధరించు నట్టి బంతివంటి రాతిని నోటపెట్టుకొని వీరమార్గ (మహాప్రస్థాన) మేగెను. (మహాప్రస్థానము చేయునపుడు ధర్మరాజు ఆశ్మఫలమును నోట నుంచుకొని వెళ్ళినాడని, శ్రీ భాగవతము). భరతుడు పాలించుట వలన వనమున కేగు తండ్రిచే ఈయబడిన యీభూమి భారత వర్షమని లోకఖ్యాతి నందినది. భరతుని పుత్రుడు సుమతి పరమ ధార్మికుడు. యజ్ఞనిష్టుడగు తండ్రి (భరతుడు) తన రాజ్యమును చక్కబరచి యాతని కిచ్చెను. సామ్రాజ్య లక్ష్మిని భరతుడు కొడుకున కప్పగించి సాలగ్రామ క్షేత్రమందు యోగాభ్యాస మొనరించి ప్రాణములను విడిచెను. ఇతడవ్వల విప్రుడై యోగి వీరుల కులమందు జనించెను. మైత్రేయా! అతని కథను నీకు ముందు తెలిపెదను. సుమతి యొక్క తేజస్సు (వీర్యము) వలన నింద్రద్యుమ్నుడు, వానికి పరమేష్టి, వానికి ప్రతిహారుడు, నతనికి ప్రతిహర్తయను ప్రసిద్దుడు, వానికి భవుడు, వానికి గీతి, వానికి ప్రస్తావుడు, వానికి పృథువు, వానికి నక్తుడు, వానికి గయుడు, వానికి నరుడు, వానికి విరోహణుడు, వానికి బుద్ధిశాలి యగు మహావీర్యుడు, వానికి భావనుడు. వానికి త్వష్ట, వానికి విరజుడు, వానికి రజుడు, వానికి శతజిత్తు, వానికి విశ్వగ్జోతి మొదలగు నూర్గురు కుమారులును కల్గిరి. వారు ప్రజలను పెంపొందించిరి. వారిచే నవ విభాగ మందిన భారత వర్ష మలంకరింప బడినది. వారి వంశీయులచే నీ భారత భూమి భుక్త మయినది. కృత త్రేతాది విభాగముగా డెబ్బది యొక్క మహా యుగములు వారీ భూమిని ముందుగ భుక్తము సేసికొనిరి. వరాహ కల్పమందు ప్రథమ మన్వంతరాధిపుడు స్వాయంభువ మనువుండగా నీ ప్రియవ్రతాది సృష్టి జరిగినది. ఈ సృష్టిచే జగత్తంతయు నిండినది.