విష్ణు మహా పురాణము

4 - ఋగ్వేద శాఖా భేద నిరూపణము

శ్రీపరాశరుడు:

అద్యోవేదశ్చ తుష్పాదశ్శతసాహస్రసమ్మితః

తతోదశగుణః కృత్స్నోయజ్ఞోఽయం సర్వకామధుక్

తతోఽత్రమత్సుతో వ్యాస అష్టావింశతిమేఽన్తరే

వేదమేకంచతుష్పాదంచతుర్దావ్యభజత్ప్రభుః

యథాచతేనతేవ్యస్తావేదవ్యాసేనధీమతా

వేదా స్తథాసమస్తైస్తైర్ వ్యస్తావ్యాసైస్తథామయా

తదనేనైవవేదానాం శాఖాభేదాద్విజోత్తమా

చతుర్యుగేషురచితాన్ సమస్తేష్వవధారయ

కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధినారాయణం ప్రభుమ్

కోఽన్యోహిభువి మైత్రేయ! మహాభారత కృద్భవేత్

తేనవ్యస్తాయథావేదా మత్పుత్రేణ మహాత్మనా

ద్వాపరేహ్యత్రమైత్రేయ! తన్మేశృణుతతార్థతః

బ్రహ్మణాచోదితోవ్యాసోవేదాన్వ్యస్తుంప్రచక్రమే

అథశిష్యాన్ సజగ్రాహచతురోవేదపారగాన్

ఋగ్వేదగ్రాహకంపై లం జగ్రాహసుమహామతిః

వైశమ్పాయననామానం యజుర్వేదస్యచాగ్రహీత్

జైమినింసామవేదస్య తథైవాథర్వవేదవిత్

సుమన్తుస్తస్య శ్యిషోఽభూద్వేదవ్యాసస్య ధీమతః

రోమహర్షణనామానం మహాబుద్ధిం మహామునిమ్

సూతంజగ్రాహశిష్యంస ఇతిహాసపురాణయోః

శ్రీపరాశరుడు:

 సృష్టి ప్రారంభమున చతుర్ముఖ బ్రహ్మచే నవిభక్తముగా పఠితమైన వేదము నాల్గు భాగములు (ఋగ్యజుస్సామాధర్వణము) తోను అనంత శాఖలతోను నిండియున్నది. ఆ వేదముచే బోధింప బడిన యజ్ఞములు పది విధములుగ నున్నవి. 1. అగ్నిహోత్రం, 2. దర్శపూర్ణమాసలు, 3. చాతుర్మాస్యలు, 4. పశుబంధము, 5. బ్రహ్మ అని అయిదు, వైతానిక యజ్ఞములు, 1. దేవయగ్నము, 2. పితృ యజ్ఞము, 3. భూతయగ్నము, 4. మనుష్యయజ్ఞము, 5. బ్రహ్మయజ్ఞము అని అయిదు యజ్ఞములు గృహము నందు జరుపు కొనునవి. మొత్తము పది. ఈ యజ్ఞములు సమస్త కోరికలను పూరించ గలవు. ఇరువది యెనిమిది మన్వంతరమున నా కుమారుడు వేదవ్యాసునిచే నాలుగు పాదములతో గూడిన నొక వేదము ఋగాది చతుర్విధముగ నెట్లు విభజింప బడెనో అట్లే నాచేతను గూడ విభజింప బడినవి. ఈ విధముగా సమస్త చతుర్యుగము లందు నారాయణుడిగ తెలిసికొనుము. తదితురుడెవ్వడు మహాభారత కర్త కాగలడు? బ్రహ్మచే వేదవ్యాసుడు వేద విభాగీకరణమునకు ప్రేరితుడై నలుగురు వేద పారంగతులైన శిష్యులును స్వీకరించెను. అందు పైలుని ఋగ్వేద పాఠకునిగను, వైశంపాయనుడిని యజుర్వేద పాఠకునిగను, జైమినిని సామవేద పాఠకునిగను, సుమంతుని నథర్వణవేద పాఠకునిగను చేసెను. మహా బుద్దిశాలి యగు రోమహర్షణుడను శిష్యుని ఇతిహాస పురాణ ప్రవక్త యగు సూతునిగా గ్రహించెను.

ఏకాసీద్యజుర్వేదస్తంచతుర్దావ్యకల్పయత్

చాతుర్హోత్రమభూద్యస్మింస్తేనయజ్ఞమథాకరోత్

ఆధ్వర్యవంయజుర్భిస్తు ఋగ్భిర్ హోత్రంతతామునిః

ఔద్గాత్రంసామభిశ్చక్రేబ్రహ్మత్వం చాప్యథర్వభిః

తతస్సఋచఉద్ధృత్య ఋగ్వేదం కృతవాన్మునిః

యజూంషిచయజుర్వేదం సామదవేదంచసామభిః

రాజ్ఞాంత్వథఱ్వవేదేన సర్వకర్మాణిసప్రభుః

కారయామాస మైత్రేయ బ్రహ్మత్వంచ యథాస్థితి

సోఽయమేకోమహావేదతరుస్తేనపృథక్కృతః

చతుర్దాచతతోజాతం వేదపాదపకాననమ్

బిభేదప్రథమంవిప్రపైలో ఋగ్వేదపాదపమ్

ఇన్ద్రప్రమితయేప్రాదాద్బష్కలాయచసంహితే

చతుర్దాసబిభేదాథ బాష్కలోద్విజ! సంహితామ్

బోధ్యాదిభ్యోదదౌతాస్తు శిష్యేభ్యస్సుమహామతిః

బోధ్యాగ్నిమాడకౌతద్వద్యాజ్ఞవల్క్యపరాశరౌ

ప్రతిశాఖాస్తుశాఖాయా స్తస్యాస్తేజగృహుర్మునే

ఇన్ద్రప్రమితిరేకాంతు సంహితాంస్వసుతంతతః

మాణ్డూకేయంమహాభాగం మైత్రేయాధ్యాపయత్తదా

తస్యశిష్యప్రశిష్యేభ్యః పుత్రశిష్యక్రమాద్యయే

ఒకే విధమగు యజుర్వేదమును విభజింపగా చతుర్భేద మాయెను. అందు చాతుర్హోత్ర ముండెను. అనగా నాలుగు ఋత్విక్కులను చతుర్హోత లందురు. ఆ నలుగురు చేయు కర్మకు చాతుర్హోత్రమని పేరు. దానిచే యజ్ఞమును కల్పించెను. యజస్సులచే అధర్యుడు చేయు కర్మకు అధ్వర్యమని పేరు. ఋక్కులతో హోత చేయు కర్మకు హౌత్రమని పేరు. ఉద్గాత సామలతో చేయు కృత్యమునకు ఔద్గాత్రమని పేరు. అధర్వ మంత్రములతో బ్రహ్మ చేయు కృత్యమునకు అధ్వర్వణమని పేరు. అందలి ఋక్కులతో ఋగ్వేదమును, యజస్సులతో యజుర్వేదమును, సామలతో సామ వేదమును, అధర్వ ఋక్కులతో రాజులను సర్వ కర్మలను చేయించి బ్రహ్మత్వమును శాస్త్ర మర్యాదను అనుసరించి కల్పించెను. ఈ విధముగా నొక వేదము వృక్షము పృథక్కృతమై నాలుగు విధములై వేదారాణ్య మాయెను. పైలుడు ఋగ్వేద వృక్షమును ముందుగా విభజించెను. రెండుగా విభజించిన యా ఋగ్వేద సంహితలను ఇంద్ర ప్రమితికి బాష్కలునకు నిచ్చెను. బాష్కలుడు చతుర్విధముగ విభజించి సంహితను తన శిష్యులకు బోధ్యాదుల కిచ్చెను. బోధ్యాఽగ్నిమాడకులు యాజ్ఞవల్క్య పరాశరులు బాష్కల శాఖ యొక్క ప్రతి (అవాంతర) శాఖలను గ్రహించిరి. ఇంద్ర ప్రమితి యొక సంహితను తన పుత్రుడగు మాండుకేయునకు జెప్పెను! వాని శిష్య ప్రశిష్యులకు పుత్ర శిష్య క్రమమున నది చేరెను.

వేదమిత్రస్తుశాకల్యస్సంహితాంతామధీతవాన్

చకారసంహితాః పంచశిష్యేభ్యః ప్రదదౌచతాః

తస్యశిష్యాశ్చయేపంచ తేషాంనామానిమేశృణు

ముద్గలోగోముఖశ్చైవవాత్స్యశ్శాలీయ ఏవచ

శైశిరః పంచమశ్చాసీన్ మైత్రేయ! సుమహామతిః

సంహితాత్రితయంచక్రేశాకపూర్ణ స్తథేతరః

నిరుక్తమకరోత్తద్వచ్చతుర్థం మునిసత్తమ

క్రౌంచోవైతాళికస్తదద్బలాకశ్చ మహామునిః

నిరుక్తశ్చ చతుర్థోఽభూద్వేదవేదంగ పారగః

ఇత్యేతాః ప్రతిశాఖాభ్యోహ్యనుశాఖద్విజోత్తమ

భాష్కలిశ్చాపరాస్తిస్రస్సంహితాః కృతవాన్ ద్విజ

శిష్యః కాలాయనిర్గాగ్యస్తృతీయశ్చ తథాజపః

ఇత్యేతేబహ్వృచాః ప్రోక్తాస్సంహితాయైః ప్రకీర్తతాః

వేద మిత్రుడగు (బ్రహ్మచారి) శాకల్యుడు ఆ యింద్ర ప్రమిత సంహిత నధ్యయనము చేసి పంచ సంహితలుగా విభజించి తన శిష్యులగు ముద్గలాదులకు నొసంగెను. వారి నామదేయములు - ముద్గాలుడు, గోముఖుడు, వాత్స్యుడు, శాలీయుడు, శరీరుడు. శరీరుడు మహా బుద్ధిమంతుడు. మరియొకడు శాకపూర్ణ శావల్యుడు. ఆ యింద్ర ప్రమితి సంహితను మూడు సంహితలుగ జేసి క్రౌంచ వైతాళిక బలాక నిరుత్తులకు నిచ్చెను. ఇట్లు ప్రతి శాఖల నుండి యనుశాఖ లేర్పడెను. బాష్కలుడు మరియొక మూడు శాఖలను చేసి శిష్యులగు వాలాయని గార్గ్యుడు తథాజపుడు అనువారాల కిచ్చెను. వీరందరి చేత ప్రవర్తితములైన సంహితలకు బహ్వృచ ఋగ్వేద సంహిత అని పేరు.