విష్ణు మహా పురాణము

1 - చతుర్థాంశము: రాజవంశ వివరణము

మైత్రేయుడు:

భగవన్ యన్నరైః కార్యంసాధుకర్మణ్యవస్థితైః

తన్మహ్యంగురుణాఖ్యాతం నిత్య నైమిత్తకాత్మకమ్

వర్ణధర్మాస్తథాఽఽఖ్యాతా ధర్మాయేచశ్రమేషువై

శ్రోతుమిచ్చామ్యహంవంశం రాజ్ఞాంతంబ్రూహిమేగురో!

మైత్రేయుడు:

భగవంతుడా! కర్మ మార్గ మందున్న మానవులు సేయనగు మంచిపని నిత్యము నైమిత్తకమగు కర్మ మేమి సేయవలెనో నాకు గురువులు చెప్పిరి. వర్ణాశ్రమ ధర్మములు గూడ చెప్ప బడినవి. రాజ వంశములను గురించి వినగోరెదనానతిమ్మన

శ్రీపరాశరుడు:

మైత్రేయా! శ్రూయతామయమనేక యజ్వవీరదీరశూర భూపాలంకృతో బ్రహ్మాదిర్మానవోవంశః

తస్యవంశ్యస్యాసుపుర్వీమశేషపాపప్రక్షాళనాయ మైత్రేయ! తాంశృణు

సకలజగతామాదిరనాదిభూతస్సఋగ్యజుస్సామాదిమాయో భగవాన్ విష్ణుః

తస్య బ్రహ్మణో మూర్తంస్వరూపం హిరణ్య గర్భాఖ్యోబ్రహ్మాణ్డభూతో భగవాన్ బ్రహ్మావై ప్రాగ్భభూవ

బ్రాహ్మణశ్చదక్షిణాఙ్గుష్ఠజన్మాదక్షః ప్రజాపతిః

దక్షస్యాదితిః అదితేర్వివస్వాన్ వివస్వతోమనుః

మనోరిక్ష్వాకునృగధృష్టశర్యాతినరిష్యన్తనాభాగదిష్టకరూశపృషధ్రాఖ్యా నవపుత్రా బభూవుః

ఇష్టిం చమిత్రా వరుణ యోర్మనుః పుత్రకామశ్చకార

తత్రాపహ్నుతే హోతురపచారా దిళానామ కన్యాబభూవ

సైవచనిత్రావరుణయోః ప్రాసాదాత్సుద్యుమ్నోనామ మనోః పుత్రో మైత్రేయా సీత్

పునశ్చేశ్వరకోపాత్ స్త్రీసతీ సోమసూనోర్భుధస్యాశ్రమసమీపే బభ్రామ

సానురాగశ్చ తస్యాం బుధః పురూరవసమాత్మజ ముత్పాదయామాస

జాతేచతస్మిన్న మితతేజోభిః పరమఋషిభిః ఇష్టిమయః ఋఙ్మయో యజుర్మయస్సామాయయోఽథర్వణ మయః సర్వమయోమనోమయోసుజ్ఞానమయో విజ్ఞానమయోనకిఞ్చిన్మయోఽమృతమయో భగవాన్ యజ్ఞ పురుష స్వరూపీ సుద్యుమ్నస్యపుంస్త్వమభిలషద్భిర్యథావదిష్టస్తత్ప్రసాదాదిళా పునరపి సుద్యుమ్నోఽభవత్

తస్యాప్యుత్కలగయవినతాస్త్రయః పుత్రాబభూవుః

సుద్యుమ్నస్తుస్త్రీపూర్వత్వాత్ రాజ్యభాగం న లేభే

తత్పిత్రాతు వసిష్ఠ వచనాత్ప్రతిష్టానం నామనగరం సుద్యుమ్నాయదత్తం, తచ్చాసౌ పురూరవసే ప్రాదాత్

శ్రీపరాశరుడు:

మైత్రేయా! వినుము. బ్రహ్మ మొదలయిన మానవ వంశము అనేక యజ్ఞకర్తలు వీరులు ధీరులు శూరులునైన భూపాలురచే నాలంకృతమైనది. ఆ వంశము యొక్క అనుపూర్విని సర్వ పాప ప్రక్షాళము కొఱకై వినుము. అనాదియగు ఋగ్యజుస్సామాది వేదమూర్తి యగు విష్ణు భగవానుడు సర్వ జగములకాది ఆ పరబ్రహ్మ యొక్క సాకార రూపము హిరణ్య గర్భుడను వాడు బ్రహ్మాండ స్వరూపుడై భగవంతుడు బ్రహ్మ తొలుత రూపొందెను. ఆ బ్రహ్మ యొక్క కుడి బొటన వ్రేలినుండి దక్ష ప్రజాపతి అతని కదితి ఆమెకు వివస్వంతుడు ఆతనికి మనువు జనించిరి. మనువు పుత్రకాముడై నిత్రా వరుణులం గూర్చి యిష్టి కావించెను. మను పత్ని యగు శ్రద్దదేవి కన్యను కోరగా హోతచేసిన హోమమున పొరపాటు వలన అయిష్టి వికలముకాగా ఇలయను కన్య పుట్టెను. ఆమె మిత్రా వరుణుల యనుగ్రహముచే మనువు కొడుకు సుద్యుమ్నుడుగా నయ్యెను. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడించుచున్న ప్రదేశమునకు శివుని చూడ నేతెంచిన మునుల జూచి, కోపించిన పార్వతి నోదార్చుటకై ఇచటికి వచ్చిన పురుషుడు స్త్రీయగు గాక యని కోపముతో శివునిచే శపించిన బడిన తావునకు సద్యుమ్నుడు వేట తమకమున నేతెంచి ఈశ్వర శాపము వలన నాడుదై సోముని కుమారుడగు బుధుని యాశ్రమ ప్రాంతమున జరించెను. బుధుడామె యెడ ననురక్తుడై పురూరవుడను కుమారునిం గనెను. అతడు పుట్టగా మహాతేజస్వులగు పరమర్షులచే, యజురాది చతుర్వేద మయుడు సర్వమయుడు మనోమయుడు విజ్ఞాన మయుడు అశేష మయుడు అమృత మయుడు యజ్ఞ మూర్తియు నగు భగవంతుడు సుద్యుమ్నునికి పుంస్త్వము రావలెనని కోరి యథావిధిగా యజింప బడెను. తత్ప్రసాదముచే నిళ మరల సుద్యుమ్ను డయ్యెను. అతనికి ఉత్కల గయ వినతులను ముగ్గురు కొడుకులు పుట్టిరి. సుద్యుమ్నుడు మాత్రము తోలుతస్త్రీ యనందున రాజ్య భాగమును బొందడయ్యె. కాని వశిష్ఠుని మాట ననుసరించి యాతని తండ్రి ప్రతిష్ఠానమను నగరము నాతని కిచ్చెను. అతడు దానిని పురూరవున కొసంగెను. వాని వంశము వారు అన్ని దిక్కులందు క్షత్రియులైరి.

తదన్వయాశ్చక్షత్రియాస్సర్వేదిక్ష్వభవ్

వృషధ్రస్తుమనుపుత్రో గురుగోవధాత్ శూద్రత్వమగమత్ 

కరూశాత్కారుశాః క్షత్రియా మహాబల పరాక్రమా బభూవుః

దిష్ట పుత్రస్తు నాభాగోవైశ్యతా మగమత్

తస్మాద్బలంధనః పుత్రోఽభూత

బలంధనాద్వాత్సప్రీతిరుదారకీర్తిః

వత్సప్రీతేః ప్రాంశురభవత్

ప్రజాపతిశ్చప్రాంశోరేకోఽభవత్

తతశ్చఖనిమిత్రః

తస్మాచ్చక్షుషః

చక్షుషాచ్చాతిబలపరాక్రమోవింశోఽభవత్

తతోవివింశకః

తస్మాచ్చఖనినేత్రః

తతశ్చాతి విభూతిః

అతివిభూతేరతి బలపరాక్రమః కరంథమః పుత్రోఽభవత్

తస్మాద ప్యవిక్షిత్

అవిక్షితోఽప్యతి బలపరాక్రమః పుత్రో మరుత్తోనామాభవత్

యస్యేమావద్యాపిశ్లోకౌగీయేతే

 మనువు కొడుకు పృషధ్రుడు గురువగు వశిష్ఠుని గోపాలనము నకై నియుక్తుడై రాత్రి యందు గోవులను తినగోరి వచ్చిన పులిని చంపగోరి ప్రమాదమున గురు గోవును జంపి గురు శాపమున శూద్రత్వ మందెను. కరూశుని వలన కారూశులు క్షత్రియులు మహాబల పరాక్రములు జనించిరి. దిష్టుని కొడుకు నాభాగుడు కర్మచే వైశ్వత్వ మొందెను. అతనికి బలధనుడను పుత్రుడు కలిగెను. బలధనునికి కీర్తిశాలి యగు వత్స ప్రీతియు వానికి ప్రాంశువు వానికి ప్రజాపతి, వానికి ఖనిమిత్రుడు, వానికి చక్షుషుడు, వానికి నతిబల శాలియైన వింశుడు, వాని వలన వివింశకుడు వానికి ఖనినేత్రుడు వానికి అతివిభూతి, వానికి నతిబల పరాక్రముడగు కరంధముడు, వానికి అవిక్షిత్తు, వానికి మహాబల పరాక్రముడు మరుత్తుడు కల్గిరి. మరుత్తుని గూర్చి యిప్పటికిని యీ రెండూ శ్లోకములు గానము చేయ బడుచున్నవి.

మరుత్తస్యయథాయజ్ఞస్తథా కస్యాభవద్భువి

సర్వంహిరణ్మయం యస్యయజ్ఞవస్త్వతిశోభనమ్

అమాద్యాదిన్ద్రస్సోమేన దక్షిణాబిర్ ద్విజాతయః

మరుతః పరివేష్టారః సదస్యాశ్చదివౌకసః

సమరుత్తశ్చక్రవర్తీ నరిష్యన్తనామానంపుత్రమవాప

తస్మాచ్చదమః

దమస్యపుత్రోరాజవర్ధనోజజ్ఞే

రాజవర్ధనాత్ సువృద్ధిః

సువృద్దేః కేవలః

కేవలాత్ సుధృతిరభూత్

తతశ్చనరః

తస్మాచ్చన్ద్రః

తతః కేవలోఽభూత

కేవలాద్భన్దుమాన్

బన్ధుమతోవేగవాన్

వేగవతోబుధః

తతశ్చతృణబిన్దుః

తస్యాప్యేకాకన్యా ఇలాబిలానామ

తంచాలమ్బుసానామమవరాప్సరాస్తృణబిన్దుంలేభే

తస్యామప్యస్యవిశాలోజజ్ఞేయః పురీం వైశాలీం నామ నిర్మమే

హేమచన్ద్రశ్చవిశాలస్య పుత్రోఽభవత్

తస్మాచ్చన్ద్రః

తత్తనయోధూమ్రాక్షః

తస్యాపిసృఞ్జయోఽభూత్

సృఞ్జయాత్సుహదేవః

తతశ్చక్రుశాశ్వోనామపుత్రోఽభూత

సోమదత్తః క్రుశాశ్వాజ్జజ్ఞే యోశాతాశ్వమేధానాజహార

తత్పుత్రోజనమేజయః

జనమేజయాత్సుమతిః

ఏతేవై శాలికా భూభృతః

శ్లోకోఽప్యత్రాగీయతే

మరుత్తుని యజ్ఞము వంటి యజ్ఞము భూమిపై మఱి ఎవ్వనికి జరిగెను, అందు సర్వ యజ్ఞ సామగ్రి స్వర్ణమయమే. సుశోభానమే, సోమముచే నింద్రుడును దక్షిణలచే ద్విజులు మదించిరి. వడ్డించు వారు మరుత్తులు, సదస్యులు దేవతలు. ఆ మరుత్త చక్రవర్తి నరిష్యంతుడను పుత్రునిం గాంచెను. వానికి దముడు, వానికి రాజ వర్ధనుడు, వాని వలన సువృద్ది, వానికి కేవలుడు, వాని వలన సుధృతి, వానికి నరుడు, వానికి చంద్రుడు, వానికి కేవలుడు, వానికి బంధుమంతుడు, వానికి వేగవంతుడు, వానికి బుధుడు, వానికి తృణబిందువు, అతనికి ఇలబిలయను కన్యయు జన్మించిరి. తృణ బిందువును ఆలంబుస యను నప్సరస వరించెను. ఆమె యందాతనికి విశాలుడు జనించిరి వైశాలి యను పురమును నిర్మించెను. అతని కొడుకు హేమచంద్రుడు, వానికి చంద్రుడు, వానికి ధూమ్రాక్షుడు, వానికి సృంజయుడు, వానికి సహదేవుడు, వానికి క్రుశాశ్వాడు. క్రుశాశ్వునికి సోమదత్తు డుదయించి శాతాశ్వ మేధములు చేసెను. వాని కొడుకు జనమేజయుడు వానికి సుమతి పుట్టెను. వీరు వైశాలికులను పేరందిన రాజులు. వీరిని గూర్చిన శ్లోకమది కీర్తింప బడుచున్నది.

తృణబిన్దోః ప్రసాదేనసర్వేవైశాలి కానృపాః

దీర్ ఘాయుషో మహాత్మానో వీర్యవన్తోఽతిధార్మికాః

శర్యాతేః కన్యాసు కన్యానామా భవత్

యాముపయే మేచ్యవనః

ఆనర్తనామాపరమధార్మికశ్శర్యాతిపుత్రోఽభూత్

రేవతీ బలరామ వివాహ ప్రస్తావః

ఆనర్తస్యాపిరేవతనామాపుత్రోజజ్ఞే

యోసావానర్తవిషయంబుభుజే

పురీంచకుశస్థలీమధ్యువాస

రేవతస్యాపిరై వతః

కుకుద్నీనామధర్మాత్మాభ్రాతృశతస్యజ్యేష్ఠోఽభవత్

తస్యచరేవతీనామకన్యాఽభవత్

సతామాదాయకస్యేయమర్హతీతిభగవన్తమబ్జయోనింప్రష్టుం బ్రహ్మాలోకంజగామ

తావచ్చబ్రాహ్మణోఽన్తరేహాహాహూహూసంజ్ఞాభ్యాం గన్ధర్వాభ్యామతితానం నామాదివయం గన్ధర్వమగీయత

తచ్చత్రిమార్గపరివృత్తైరనేకయుగపరివృత్తీస్తిష్ఠన్నపిరైవతః శృణ్వన్ ముహూర్తమివమేనే

గీతావసానే భగవన్తమబ్జయోనిం ప్రణమ్య రైవతః కన్యాయోగ్యవర మపృచ్చత్

తృణబిందుని ప్రసాదముచే సర్వ వైశాలిక రాజులు దీర్ఘాయుష్మంతులు మహాత్ములు వీర్యవంతులు అత్యంత ధార్మికులు. మను పుత్రులలో శర్యాతి కూతురు సుకన్య. ఆమెను చ్యవన మహర్షి పెండ్లాడెను. శర్యాతి కుమారుడు ఆనర్తుడు మహా ధార్మికుడు. ఆనర్తునికి రేవతుడు కొడుకు. ఆతడానర్త దేశమును బాలించెను. కుశస్థలి యాతని రాజధాని. రేవతుని కొడుకగు (రైవతుడు) కకుద్మియను పేరు గలవాడు. నూరుగురి కతడన్నగారు. అతని కూతురు రేవతి, అతడామెంజేకొని ఈమె ఎవ్వనికి భార్యగాదగుదని బ్రహ్మనడుగ సత్య లోకమున కేగెను. ఆ సమయంలో బ్రహ్మ సన్నిధిలో హాహాహూహూ యను నిద్దరు గంధర్వు లతితాన మను పేరు గల దివ్య గంధర్వమును (సంగీతమును) బాడిరి. అది కూడ త్రిమార్గ పర్యావృత్తిగ ననేక యుగములు జరుగు దాక యటనుండి విని యా కాలమంతయు నొక్క ముహూర్త మాత్రమయినట్లు భావించెను. పాట చివర భగవంతుని అబ్జయోనిని బ్రణమిల్లి రైవతుడు తన కన్య కర్హుడైన వరుడెవ్వరని యడిగెను.

తంచాహభగవాన్ కథయ యోఽభిమతస్తేవర ఇతి

పునశ్చప్రణమ్య భగవతే తస్మై యతాభిమతానాత్మన స్సవరాన్ కథయామాస

క ఏషాంభగవతోఽభిమత ఇతియస్మైకన్యాం ప్రయచ్ఛామీతి

తతః కించి దవనత శిరాః సస్మితం భగవా నబ్జయోనిః ప్రాహ

య ఏతే భగవతోఽభిమతా నైతేషాంసాంప్రతమపత్యాపత్యసంతతి ర ప్యవనితలేఽస్తి

బహూనితవాత్రైత ద్గాన్ధర్వం శృణ్వతశ్చతుర్యుగాణ్యతీతాని

సాంప్రతం మహీతలేఽష్టావింశతితమస్యమనోశ్చతుర్యుగమతీతప్రాయంవర్తతే

ఆసన్నోహికలిః

అన్యస్మైకన్యారత్నమిదం భవతై కాకినాదేయమ్

భవతోఽపిపుత్రమన్త్రిభృత్యకళత్రబన్ధుబలకోశాదయః సమస్తాః కాలేనై తేనాత్యన్తమతీతాః

తతః పునరప్యుత్పన్నసాధ్యసః సరాజాభగవన్తం ప్రణమ్యపప్రచ్ఛ

భగవన్నేవమవస్థితేమయేయంకస్మైదేయేతి

తతస్సభగవాన్ కిం చిదవనమ్రకం ధరః కృతాఞ్జలిర్ భూత్వాసర్వలోకగురు రమ్భోజయోనిరాహ

భగవంతు డాతనిని నీకభిమతుడగు వరుడెవ్వడని ప్రశ్నించెను. అతడు ప్రణమిల్లి తన కభిమతులైన వరులను బెర్కొనెను. వీరిలో నీ కభిమతు డెవ్వడు? వానికి నా కన్య నిత్తుననియె. అంతట నించుక తలవంచి యల్లన నవ్వుచు బ్రహ్మ నిట్లనియె. నీ కభిమతులైన వారు వీరెవ్వరో వారి సంతానమునకు సంతానము కూడ నిపు డవనితల మందు లేదు. ఇచట నీవు సంగీతము వినుచుండ ననేక మహా యుగములు గడచి పోయినవి. ఈపుడవనిపై నిరువది ఎనిమిదివ మనువు యొక్క మహాయుగ మించుమించు గడచి పోవుచున్నది. కలి సమీపించినది గదా! నీవొంటరిగ నేవ్వనికేని ఈ పిల్లనిమ్ము. నీకు కూడ మంత్రి భృత్య కళత్ర బందుసైన్య కోశాదు లన్నియు నీ కాలమున పూర్తిగ జెల్లి పోయినవి. అన విని యా ఱేడు మిక్కిలి జడిసి భగవంతునికి మ్రొక్కి యిట్లడిగెను. స్వామి! పరిస్థితి యిట్లుండా నేనీ కన్య నెవ్వని కీయవలయు? నన నించుక మెడ వంచి చేతులు మొగిచి సర్వలోక గురువగు కమల యోని యిట్లనియె.

బ్రహ్మకృత భగవద్విష్ణు స్తుతి:

నహ్యాదిమధ్యాన్తమజస్యయస్య విద్మోవయం సర్వమయస్యధాతుః

నచస్మరూపం నపరం ప్రభావం నచైవపారం పరమేశ్వరస్య

కలాముహూర్తాదిమయశ్చకాలో నయద్విభూతేః పరిణామహేతుః

అజన్మనాశస్య సమస్తమూర్తే రనామరూపస్య సనాతనస్య

యస్యప్రసాదాదహమచ్యుతస్య భూత ప్రజాసృష్టికరోఽన్తజారీ

క్రోధాచ్చరుద్రః స్థితి హేతుభూతో యస్మాచ్చమధ్యే పురుషః పరస్మాత్

మద్రూప మాస్థాయ సృజత్యజోయః స్థితౌచాయోఽసౌ పురుషస్వరూపీ

రుద్రస్వరూ పేనచయోఽత్తివిశ్వం ధత్తేతథాఽనన్తవపు స్సమస్తమ్

శక్రాదిరూపీ పరిపాతివిశ్వమర్కేన్దురూపశ్చ తమో హినప్తి

పాకాయ యోఽగ్నిత్వ ముపైతిలోకాన్ బిభర్తిపృథ్వీవపు రవ్యయాత్మా

చేష్టాంకరోతి శ్వాసనస్వరూపీ లోకస్య తృప్తిం చ జలాన్నరూపీ

దదాతి విశ్వస్థితిసంస్థితస్తు సర్వావకాశంచనభ స్స్వరూపీ

యస్సృజ్యతే సర్గకృ దాత్మనైవ యః పాల్యతే పాలయితాచ దేవః

విశ్వాత్మానా సంహ్రితతేఽన్తకారీ పృతక్త్రయస్యాస్యచయోఽవ్యయాత్మా

జయతియస్మిన్ జగ ద్యోజాగాదేతదాద్యో యశ్చాశ్రితోఽస్మిన్ జగతిస్వయంభూః

ససర్వభూతప్రభవో ధరిత్ర్యాం స్వాంశేనవిష్ణుర్ నృపతేఽవతీర్ణః

కుశస్థలీయాదవభూపరమ్యా పురీవరాఽభూదమరావతీవ

సాద్వారకాసంప్రతితత్రచాన్తే సకేశవాంశో బలదేవనామా

తస్మై త్వ మేనాం త నయాం నరేన్ద్ర! ప్రయచ్ఛ మయామనుజాయ జాయామ్

శ్లాఘ్యో వరోఽసౌతనాయాతవేయం స్త్రీరత్నభూతా సదృశోహియోగః

బ్రహ్మకృత భగవద్విష్ణు స్తుతి:

అజుడగు నెవ్వని కాదిమధ్యాంతముల నెఱుంగమో సర్వ మయుడగు నా దాత యొక్క స్వరూప పరమ ప్రబావములు ఆ పరమేశ్వరుని పరమ పారముం దెలియమో యే దేవుని విభూతికి కళా ముహూర్తాది మాయమైన కాలము పరిణామ హేతువు కాదో (కాలికమైన దశాపరిణామము లేని వాడన్న మాట) పుట్టుట, గిట్టుటయు లేని రూపులేని పేరు లేని సనాతనుని యొక్క ఏ అచ్యుతుని యొక్కయు ననుగ్రహముచే నే నీ భూత ప్రజసృష్టిని చేయు చున్నానో, రుద్రుడు క్రోధముచే నీ విశ్వమును భక్షించునో, స్థితికి హేతువై యెవ్వడనంతుడై పురుష రూపియై సకల విశ్వముం ధరించు చున్నాడో, ఇంద్రాది రూపియై పాలించు చున్నాడో, సూర్య చంద్ర స్వరూపియై చీకటిని జెండునో తిన్న యాహారము పాకము సేయుట కగ్నిత్వము నెవ్వడందునో, పృథ్వి రూపమున నేయవ్యయుండు లోకములం భరించునో, వాయు స్వరూడై చేష్టించునో, జలము అన్నము రూపొంది లోకమునకు దృష్టి గూర్చు చున్నాడో, విశ్వమందంతట నిలిచి యాకాశ రూపమున సర్వావకాశము నొసంగునో, ఎవ్వడు తనను దాన సృష్టించు కొనునో పాలించు కొనునో, విశ్వ రూపమున తననుదా నుపసంహరించు కొనునో. యీ మూడు పనులు సేయు మూడు మూర్తులయి మఱి వానికంటే వేరయి అవ్యయుండగు చున్నాడో ఎవ్వని యందు జగమున్నదో ఎవ్వడీ జగత్తు ఎవ్వడాద్యుడీ జగత్తునకు స్వయంభువైన దిక్కో, యట్టి సర్వభూత ప్రభావ కారణమైన విష్ణువు తన యంశమున నవతరించి నాడు. కుశస్థలి యను పురము యాదవ రాజులకు అమరావతి వలె (ఇంద్ర రాజధాని వలె) ధరణిపై మున్నుండెను. అక్కడ యిపుడు ద్వారక యున్నది. ఆ విష్ణువు బలదేవుడను పేర నతనున్నాడు. నీ వీ పిల్ల నామాయా మనుజునకు జాయగా నోసంగుము. ఈమె స్త్రీరత్నము. ఈమె కితడు తగిన వరుడు. యిర్వురు సంబంధము చాల అపురూపము.

శ్రీపరాశరుడు:

ఇతీరితోఽసౌకామలోమ్భవేన భువం సమాసాద్యపతిః ప్రజానామ్

దదర్శహ్రస్వాపురుషా నశేషా నల్పౌజసః స్వల్పవివేక వీర్యాన్

కుశస్థలీం తాంచపురీముపేత్య దృష్ట్వాన్యరూపాం ప్రదదౌకన్యామ్

సీరాయుధాయ స్ఫటికాచలాభ వక్షస్థలాయాతులధీ ర్నరేన్ద్రః

ఉచ్చైః ప్రమాణా మితి తామవేక్ష్య స్వలంగలాగ్రేణ సతాలకేతుః

వినామయామాస తతశ్చ సాపి బభూవ సద్యో వనితా యథాఽన్యా

తాంరేవతీం రైవతభూపకన్యాం సీరాయుధోఽసౌవిధి నోపయేమే

దత్త్వాచకన్యాం సనృపోపోజగామ హేమాచలంవై తపసే ధృతాత్మా

శ్రీపరాశరుడు:

అని కమల భువుడు పలుక విని రేవత రాజు భూమికిం దిగివచ్చి మరుగుజ్జులు, అల్ప బలులు, అల్ప వివేక వీర్యులు నైన పురుషులం జూచెను. రూపము మారియున్న కుశస్థలి ద్వారకగా మారెను. అచటికి వచ్చి తన కన్యను స్ఫటికాద్రి వలె దృఢము విశాలమునైన వక్ష స్థలము గల హాలాయుధున కా బుద్ధిశాలి కకుద్మి కన్యాదానము సేసెను. ఆతాలకేతువు (తాడిచెట్టు జెండా గుర్తు గల బలరాముడు) తనకంటె నెత్తుగా నున్నదని యామెంగని తన నాగేటి కొనతో క్రిందికి వంచెను. ఆమెయు నప్పటికప్పుడు వేఱొకతె వలె కననయ్యెను. రేవత రాజకన్య నా రేవతిని హలాయుధుడు యథావిధిగ బరిణయ మాడెను. ఆ రేవత రాజును కన్యాదానము సేసి మనోనిగ్రహము వడసి తపస్సునకై హిమాచలమున కేగెను.