విష్ణు మహా పురాణము

37 - యాదవ కులోపసంహారము - కృష్ణ బ్రహ్మీభావము

శ్రీపరాశరుడు:

ఏవం దైత్యవధంకృష్ణో బలదేవసహాయవాన్

చక్రేదుష్టక్షితీశానాం తథై వజగతః కృతే

క్షితేశ్చ భారం భగవాన్ ఫల్గునేన సమన్వితః

అవతారయామాస విభుస్సమస్తాక్షౌహిణీవధాత్

కృత్వాభారావతరణం భువోహత్వాఽఖిలాన్నృపాన్

శాపవ్యాజేన విప్రాణాముప సంహృతవాన్ కులమ్

ఉత్సృజ్య ద్వారాకాం కృష్ణస్యక్త్యామానుష్యమాత్మనః

సాంశో విష్ణుమయం స్థానం ప్రవివేశమునే! నిజమ్

శ్రీపరాశరుడు:

ఇట్లు జగద్రక్షణ కొఱకు శ్రీకృష్ణుడు బలదేవుని తోడ్పాటుగొని దుష్ట రాజుల యొక్కయు దైత్యుల యొక్కయు సంహారమును గావించెను. ఫల్గునునితో సర్వాక్షౌహిణీ సేనా నాశము చేసి భూభారముం గూడ దించెను. ఇట్లు కావించి విప్రశాపము మిషమున యాదవ కులముం గూడ నుప సంహరింప జేసెను. ద్వారకను వదలి మానుష రూపముం బాసి విష్ణునంశమైన కృష్ణుడు తన విష్ణు పదముం బ్రవేశించెను.

మైత్రేయుడు:

సవిప్రశాపవ్యాజేన సంజహ్రేస్వకులం కథమ్

కథంచమానుషం దేహముత్ససర్జ జనార్దనః

మైత్రేయుడు:

అనవిని కృష్ణ పరమాత్మ అయ్యాదవ వంశ సంహారాదు లెట్లు సేసె దెలుపుమని మైత్రుయుం డడుగ పరాశరుం డిట్లు పలుక దొడంగెను.

శ్రీపరాశరుడు:

విశ్వామిత్ర స్తథాకణ్వో నారదశ్చ మహామునిః

పిణ్డారకే మహాతీర్థే దృష్టాయదు కుమారకైః

తత స్తేయౌవనోన్మత్తా భావికార్య ప్రచోదితాః

సామ్బంసామ్బవతీపుత్రం భూషయిత్వాస్త్రియంయథా

ప్రశ్రితాస్తాన్మునీనూచుః ప్రణిపాతపురస్సరమ్

ఇయం స్త్రీపుత్రకామావై బ్రూతకింజనయిష్యతి

దివ్యజ్ఞానోప పన్నాస్తే విప్రలబ్ధాః కుమారకైః

మునయః కుపితాః ప్రోచుర్ముసలం జనయిష్యతి

సర్వయాదవ సంహార కారణం భువనోత్తరమ్

యేనాఖిలకులోత్సాదో యాదవానాం భవిష్యతి

ఇత్యుక్తాస్తేకుమారాస్తు ఆచచక్షుర్యథా తథమ్

ఉగ్రసేనాయ ముసలం జజ్ఞేసామ్బస్య చోదరాత్

తదుగ్రసేనో ముసలమయశ్చూర్ణ మకారయత్

జజ్ఞేతదేరకాచూర్ణం ప్రక్షిప్తంతైర్మహోదధౌ

ముసలస్యాథలౌహస్యచూర్ణితస్య తుయాదవైః

ఖణ్డం చూర్ణితశేషంతుతతోయత్తోమరాకృతి

తదప్యమ్బునిధౌక్షిప్తంమత్సోజగ్రాహజాలిభిః

ఘాతితస్యోదరాత్తస్యలుబ్దోజగ్రాహతజ్జరాః

విజ్ఞాతపరమార్థోపి భగవాన్ మధుసూదనః

నైచ్చత్తదన్యథాకర్తుంవిధినాయత్సమీహితమ్

దేవైశ్చప్రహితో వాయుః ప్రణిపత్యాహకేశమ్

రహస్యేవమహందూతః ప్రహితో భగవాన్ సురైః

వస్వశ్విమారుదాదిత్యరుద్రసాధ్యాదిభిస్సహ

విజ్ఞాపయతిశక్రస్త్వాంతదిదం శ్రూయతాంవిభో

భారావతణార్థాయవర్షాణామధికం శతమ్

భగవానవతీర్ణోత్రత్రిశైస్సహచోదితః

దుర్ వృత్తానిహతాదై త్యాభువోభారోవతారితః

త్వయాసనాథాస్త్రీదశాభవన్తుత్రిదివేసదా

తదతీతం జగన్నాథ వర్షాణామధికంశతమ్

ఇదానీంగమ్యతాం స్వర్గోభవతాయదిరోచతే

దేవైర్విజ్ఞాప్యతేదేవ! తథాత్రైవరతిస్తవ

స్థీయతాంచ యథాకాలమాస్థేయమనుజీవిభిః

శ్రీపరాశరుడు:

విశ్వామిత్ర కణ్వ నారదులు మహామునులు పిండారక తీర్థమందు యదు కుమారులకు గనబడిరి. అయ్యాదవులు యౌవనమున మత్తెక్కి కాగల కార్యవిధి ప్రేరణను జాంబవతీ కుమారుని సాంబుని ఆడుదానిగా నలంకరించి వినతులై యమ్మునులకు బ్రణమిల్లి ఈ యింతి కొడుకుంగన గోరిక గలదై యున్నది. కొడుకు పుట్టునా? చెప్పుడనిరి. అమ్మునులు దివ్య జ్ఞాన సంపన్నులు యదు కుమారులచే మోసగింపబడి కోపము గొని ఈమె ముసలముం గనును. అది యతిలోక ప్రభావము. సర్వ యాదవుల సంహార కారణము. దాన సర్వ యాదవుల కుల నాశము గాగలదనిరి. ఆ బాలురది యెల్ల నుగ్రసేన మహారాజున కెరిగించిరి. సాంబుని కడుపున ముసలము పుట్టనే పుట్టి ఉగ్రసేనుడా ముసలమును పొడి గొట్టించెను. అది ఏరకా చూర్ణమయ్యెను. దానిని యాదవులు సముద్రమందు బడవేసిరి. ముసలాయుధము చూర్ణముకాగా మిగిలిన ఖండము తోమరము రూపమున నున్న దానిని గూడ సముద్రమునం బారవేసెను. దాని నొక్క చేప దినెను. ఆ చేప జాలరుల వలలో బడ దానిం జంపి యొక లుబ్దుడుగై కొనెను. భగవంతుడు మధువైరి పరమార్థమిదియెల్ల నెరింగియు విదివిహితమై నందున దాని నన్యథాకరించుట దలంపడయ్యె. అదే సమయమున దేవతల పనుపున వాయుదేవుం డేతెంచి హరికిం బ్రణమిల్లి ఏకాంతమున నేనమరులు పంపవచ్చిన దూతను వసురుద్రాదిత్యాశ్వి సాధ్యాదు లందరతో గూడి ఇంద్రుడు తమకిట్లు విన్నపము సేయుచున్నా డాలింపుము. భూభారావతరణమునకై వంద యేండ్లకు పైగా నిమ్మేదిని నీవు దేవ ప్రేరణముచే నవతరించితివి. దుష్టులు దైత్యులు సంహరింప బడిరి. దేవతలు స్వర్గమున నీచే సనాథులగుదురు గాక! నూరేండ్లు జరిగినవిక దమకిష్టమేని తాము స్వర్గమునకు దయసేయ వలయును. తమకిటనే యుండ నభిలాషయేని అనుచరులతో నిక్కడనే యుండవలెను. అనవిని భగవంతు డిట్లనియె.

శ్రీభగవానుడు:

యత్త్వమాత్థఖిలందూత! వేద్న్యేతదహమప్యుత

ప్రారబ్ధ ఏవహిమయా యాదవానాం పరిక్షయః

భువోనాద్యాపిభారోయం యాదవై రనిబర్హితైః

అవతార్యకరోమ్యేతత్సప్తరాత్రేణసత్వరః

యథాగృహీతమమ్భో దేర్దత్త్వాఽహం ద్వారకాభువమ్

యాదవానుపసంహృత్య యాస్యామిత్రిదశాలయమ్

మనుష్యదేహముత్సృజ్య సంకర్షణ సహాయవాన్

ప్రాప్త ఏవాస్మిమన్తవ్యో దేవేన్ద్రేణ తథాఽమరైః

జరాసంధాద యోయేన్యేనిహతాభారహేతవః

క్షితేస్తేభ్యస్తుబాలోపియదూనాంనాపచీయతే

తదేతంసు మహాభారమవతార్యక్షితేరహమ్

యాస్యామ్యమరలోకస్యపాలనాయ బ్రవీహితాన్

శ్రీభగవంతుడు:

ఓ దేవదూత! నీవన్నదెల్ల నేనెరుంగుదును. యాదవ వంశ నాశము నేనే యారంభించితిని. తెగ పెరిగిన యాదవులచే నిపుడు గూడ బరువెక్కిన ఈ భూమి భారము దింపి యేడు రాత్రులలో సముద్రము నుండి ద్వారకను గొనివచ్చి యాదవుల కిచ్చి సంకర్షుణునితో ఈ మానుష్య శరీరముప సంహరించి దేవ సదనమున కేతెంతును. దేవేంద్రుడు దేవతలును నేనక్కడకు వచ్చినాడననియే తలంప వలయును. జరాసంధాదు లెందరో నిహతులైరి. కాని యాదవుల వలన గూడ బరువెక్కి యీ భూభారమింత మాత్రాన తగ్గలేదు. ఈ పెనుబరువుం గూడ నేను దింపి యమ పరలోక పాలనకే నేతెంతును. ఈ మాట వారికి జెప్పుము. వాసుదేవుం డిట్లు పలుక దేవదూత వాయు భగవానుడు భగవంతునికి బ్రణతుడై దివ్యగతి నింద్రుని దరికేతెంచెను.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తోవాసుదేవేన దేవదూతః ప్రణమ్యతమ్

మైత్రేయ! దివ్యయాగత్యాదేవరాజాన్తికంయయౌ

భగవానప్యథోత్పాతాన్ దివ్యభౌమాన్తరిక్షజాన్

దదర్శద్వారకాపుర్యాం వినాశాయదివానిశమ్

తాన్ దృష్ట్వా యాదవానాహపశ్యద్వమతిదారుణాన్

మహోత్పాతాన్ శమాయైషాం ప్రభాసంయామమాచిరమ్

ఏవముక్తేతుకృష్ణేన యాదవప్రవరస్తతః

మహాభాగవతః ప్రాహ ప్రణిపత్యోద్ధవోహరిమ్

భగవన్యన్మయాకార్యం తదాజ్ఞాపయసాంప్రతమ్

మన్యేకులమిదం సర్వం భగవాంత్సహరిష్యతి

నాశాయాస్యనిమిత్తాని కులస్యాచ్యుత! లక్షయే

శ్రీపరాశరుడు:

కృష్ణ భగవానుడు దివ్య భౌమాంతరిక్షము లయిన యుత్పాతములను రేయిం బవళ్ళు ద్వారక యందు జూచెను. చూచి యాదవులతో నిదిగో చూడుడని వాని యుపశమనంబునకు వెంటనే ప్రభాస తీర్థమున కరుగుదుమనెను. అది విని యాదవ ప్రవరుడు మహాభాగవతుడు ఉద్దవస్వామి హరింగని, 'స్వామీ! నేనిపుడేమి సేయవలయు నానతిమ్ము. ఈ యాదవ కులమంతను నీ వుపసంహరింతువని తలంచెద. ఈ వినాశమునకు శకునములం గూడ నేను జూచు చున్నాను. అన విని కృష్ణ భగవానుడిట్లనియె.

శ్రీభగవానుడు:

గచ్చత్వందివ్యయాగత్యామత్ప్రసాదసముత్థయా

యద్బదర్యాశ్రమం పుణ్యం గన్ధమాదన పర్వతే

నరనారాయణ స్థానే తత్పవిత్రం మహీతలే

మన్మనామత్ప్రసాదేనతత్రసిద్ధిమవాప్స్యసి

అహంస్వర్గంగమిష్యామిష్యామిహ్యుపసంహృత్యవై కులమ్

ద్వారకాంచమ యాత్యక్తాం సముద్రః ప్లావయిష్యతి

మద్వేశ్మచైకంముక్త్వాతు భయాన్మత్తో జలాశయే

తత్ర సన్నిహితశ్చాహం భక్తానాంహితకామ్యయా

శ్రీభగవానుడు:

నీవు నా యనుగ్రహముచే లభించిన దివ్యగతిని గంధమాదన పుణ్య బదర్యాశ్రమమున కరుగుము. పవిత్ర నర నారాయణ స్థానమందు గలదు. నాపై మనసు నిల్పి యక్కడ నా యనుగ్రహమున సిద్ధినందెదవు. నేనీ కులము ఉపసంహరించి స్వర్గమునకు వత్తును. నే విడిచిన ద్వారకను సముద్రుడు ముంచి వేయును. నా నివాస సౌధమొక్కటి మాత్రము నా వలని భయమున ముంచడు. భక్త హితము గోరి నేనక్కడ సన్నిహితుడ నయ్యెదను.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తః ప్రణిపత్యైనం జగామాశుతపోవనమ్

నరనారాయణ స్థానం కేశవేనానుమోదితః

తతస్తేయాదవాస్సర్వే రథానారుహ్య శీఘ్రగాన్

ప్రభాసం ప్రయయుస్సార్థం కృష్ణరామాదిభీర్ ద్విజ

ప్రభాసంసమనుప్రాప్తాః కకురాన్ధకవృష్ణయః

చక్రుస్తత్రమహాపానం వాసుదేవేనచోదితాః

పిబతాంతత్రచై తేషాం సంఘర్షేణ పరస్పరమ్

అతివాదేన్ధనోజజ్ఞే కలహాగ్నిః క్షయావహః

శ్రీపరాశరుడు:

అన విని యుద్ధవుడు కేశవాను మోదితుడై సత్వరము నర నారాయణ స్థానమైన బదరీ తపోవనమునకుం జనెను. అవ్వల యాదవులెల్లరు శీఘ్రగములైన రథముల నెక్కి బలరామ కృష్ణులతో ప్రభాస తీర్థమునకుం జనిరి. కుకురాంధక వృష్టి వంశముల వారు యందరు వాసుదేవ ప్రచోదనచే తెగ త్రావిరి. అట్లు త్రావి యొండొరుల సంఘర్షణ నొడివిన ప్రేలుడను కట్టెలం గనగన మండు కలహాగ్ని సర్వ నాశకము పుట్టెను.

మైత్రేయుడు:

స్వంస్వంవై భుంజతాం తేషాం కలహః కింనిమిత్తకః

సంఘర్షోవాద్విజ శ్రేష్ఠ తన్మమాఖ్యాతుమర్హసి

మైత్రేయుడు:

అనవిని వారివారి వంతు వారువారు అనుభవించు చుండ వారికే నిమిత్తమున కలహము పుట్టెను. సంఘర్ష మెందుల కయ్యెనది నాకు దెలుపుమన పరాశరుండిట్లనియె.

శ్రీపరాశరుడు:

మృష్టంమదీయమన్నంతన ఇమృష్టమితిజల్పతామ్

మృష్టా మృష్ట కథాజజ్ఞేసంఘర్షకలహౌతతః

తతశ్చాన్యోన్యమభ్యేత్య క్రోధసంరక్తలోచనాః

జఘ్నుః పరస్పరంతేతు శస్త్రైః బలాత్కృతాః

క్షీణశస్త్రాశ్చజగృహుః ప్రత్యాసన్నామథై రకామ్

ఏరకాతు గృహీతావై వజ్రభూతేవలక్ష్యతే

తయాపరస్పరం జఘ్నుస్సం ప్రహారేసుదారుణే

పద్యుమ్నసామ్బ ప్రముఖాః కృతవర్మాథ సాత్యకిః

అనిరుద్దాదయశ్చాన్యే పృథుర్వి పృథురేవచ

చారువర్మా చారుకశ్చతథాక్రూరాదయోద్విజ

ఏరకారూపిభిర్వజ్రైస్తేనిజఘ్నుః పరస్పరమ్

నివారయామాసహరిర్యాదవాం స్తేచ కేశవమ్

సహాయంమేనిరేఽరీణాం ప్రాప్తంజఘ్నుః పరస్పరమ్

కృష్ణోపికుపితస్తేషామేరకాముష్టిమాదధే

వధాయసొపి ముసలం ముష్టిర్లౌహమభూత్తదా

జఘానతేసనిశ్శేషాన్ యాదవానాంతతాయినః

జఘ్నుస్తేసహసాఽభ్యేత్య తథాన్యేపి పరస్పరమ్

తతశ్చార్ణవమధ్యేణజై త్రోసౌచక్రిణోరథః

పశ్యతోదారుకస్యాథప్రాయాదశ్వైః ధృతోద్విజ

చక్రంగదాతథాశార్గ్యం తూణీశంఖోసిరేవచ

ప్రదక్షిణం హరిం కృత్వాజగ్మురాదిత్యవర్త్మనా

క్షణేననాభవత్కశ్చిద్యాదవానామఘాతితః

ఋతేకృష్ణంమహాత్మానందారుకంచ మహామునే

చఙ్క్రమ్యమాణాతౌరామం వృక్షమూలేకృతేసనమ్

దదృశాతేముఖాచ్చాస్య నిష్క్రామన్తం మహోరగమ్

నిష్క్రమ్యసముఖాత్తస్య మహాభోగోభుజంగమః

ప్రయయావర్ణవంసిద్ధైః పూజ్యమాన స్తథోరగైః

తతోర్ఘ్యమాదాయతదాజలదిస్సం ముఖంయయౌ

ప్రవివేశతతస్తోయం పూజితః పన్నగోత్తమైః

దృష్ట్వా బలస్య నిర్యాణం దారుకం ప్రాహకేశవః

ఇదం సర్వంసమాచక్ష్వ వసుదేవోగ్రసేనయోః

నిర్యాణంబలభద్రస్య యాదవానాంతథాక్షయమ్

యోగేస్థిత్వాహమప్యేతత్పరిత్యక్ష్యేకళేబరమ్

వాచ్యశ్చ ద్వారకావాసీజనస్సర్వ స్తథాహుకః

యథేమాంనగరీంసర్వాం సముద్రః ప్లావయిష్యతి

తస్మాద్భవద్భిస్సర్ వైస్తు ప్రతీక్ష్యోహ్యర్జునాగామః

నస్థేయం ద్వారకా మధ్యే నిష్క్రాన్తేతత్రపాణ్డవే

తేనైవసగన్తవ్యం యత్రయాతిసకౌరవః

గత్వాచబ్రూహికౌన్తేయమర్జునంవచనాన్మమ

పాలనీయస్త్వయాశక్త్యా జనోఽయంమత్పరిగ్రహః

త్వమర్జునేనసహితో ద్వారవత్యాంతథాజనమ్

గృహీత్వాయాహివజ్రశ్చయదురాజో భవిష్యతి

ఇత్యుక్తోదారుకః కృష్ణం ప్రణిపత్య పునః పునః

ప్రదక్షిణంచ బహుశః కృత్వాప్రాయాద్యథోదితం

సచగత్వాతదాచష్టద్వారకాయాంతథార్జునమ్

ఆనినాయమహాబుద్ధిర్వజ్రం చక్రేతథానృపమ్

భగవానపిగోవిన్దో వాసుదేవాత్మకం పరమ్

బ్రహ్మాత్మనిసమారోష్య సర్వభూతేష్వధారయత్

నిష్ప్రపంచే మహాభాగసం యోజ్యాత్మానమాత్మని

తుర్యావస్థస్సలీలంచ శేతెస్మ పురుషోత్తమః

సమ్మానయన్ ద్విజవచో దుర్వాసాయదువాచహ

యోగయోక్తోభవత్పాదం కృత్వాజానునిసత్తమ

ఆయయౌసజరానామ తదాతత్రసలుబ్ధకః

ముసలావశేషలోహైకసాయకన్యస్తతోమరః

సతత్పాదం మృగాకారమవేక్ష్యారాదవస్థితః

తలేవివ్యాధతేనైవ తోమరేణద్విజోత్తమ

తతశ్చదదృశేతత్ర చతుర్భాహుధరంనరమ్

ప్రణిపత్యాహవైచైనం ప్రసీదేతి పునః పునః

అజానతాకృతమిదంమయాహరిణశంకయా

క్షమ్యతాంమమపాపేన దగ్ధంమాంత్రాతుమర్హసి

తతస్తం భగవానాహనతేస్తుభయమణ్వపి

గచ్చత్వం మత్ప్రసాదేనలుబ్ద! స్వర్గం సురాస్పదమ్

విమానమాగతంసద్యస్తద్వాక్యసమనన్తరమ్

ఆరుహ్యప్రయయౌ స్వర్గంలుబ్ధక స్తత్ప్రసాదతః

గతేతస్మిన్ సభగవాంత్సం యోజ్యాత్మానమాత్మని

బ్రహ్మభూతేఽవ్యయేఽచిన్త్యే వాసుదేవమయేఽమలే

ఆజన్మన్యమరేవిష్ణావప్రమేయేఽఖిలాత్మని

తత్యాజమానుషం దేహమతీత్యత్రివిధాంగతిమ్

శ్రీపరాశరుడు:

నా అన్నము రుచిగా నున్నది నీవు తిను నన్నము రుచిపచి లేనిదని యాదవులలో నొండోరులకు మృష్టామృష్ట నిమిత్తమైన కథ సాగెను. దాన వారికి సంఘర్షణ కయ్యము నారంభమైనది. అంతట కోపముచే గ్రుడ్లు ఎర్రవడ ఒండొరులం దారసిల్లి యాయుధములచే బాదుకొన జొచ్చిరి. వారి ఆ కలహమునకు దైవమే బలాత్కరించినది. ఆయుధము లన్నియు నైన తరువాత దాపున నున్న తుంగను బట్టికొనిరి. అది చేపట్టగానే అది వజ్రాయుధమయినట్లు కాన వచ్చెను. దానిచే దారుణమయిన యా పోరు ప్రద్యుమ్న, సాంబ ప్రముఖులు, కృతవర్మ, సాత్యకి, అనిరుద్దాదులు, పృథువు, విపృథువు, చారువర్మ, చారుకుడు, అక్రూరాదులు నొకరి నొకరు తుంగ గడ్డి రూపము లయిన వజ్రములం గొట్టుకొనిరి. హరి వారి నాపెం గాని వారాతనిని శత్రువులకు సహాయుడని భావించి పరస్పర మింకను బాదుకొనిరి. అదిగని కృష్ణుడుం గుపితుడై తుంగను గుప్పిటం బట్టినంత నదియు లోహమయమైన ముసల మయ్యెను. ఆతతాయు లయిన యయ్యాదవుల నాతడు దానిచే బాదేను. తక్కినవారు వారును బాదుకోనిరి. అవ్వల చక్రాయుధుని యరదము దారుకుడు చూచు చుండగానే గుఱ్ఱములతో సాగరమున బడెను. చక్రము గద శార్ఘ్యము అమ్ములపొది శంఖము ఖడ్గమును హరికి బ్రదక్షినము సేసి ఆదిత్య మండల మార్గమున నేగినవి. ఒక్క క్షణములో యాదవులలో కృష్ణుడు దారుకుడుం దప్ప కొట్టబడని వాడొక్కడు లేడయ్యే. ఆ యిద్దరు నడుగులు వేసికోనుచుం జని వృక్షము మొదలనున్న బలరాముం జూచిరి. ఆయన ముఖము నుండి యొక్క మహా సర్పము వెలువడుచున్నట్లును గాంచిరి. పెద్ద పడగ గల యా పామట్లాతని మోము వెడలి సిద్ధులు నాగులు పూజింప సముద్రముం జొచ్చెను. అవ్వల సముద్రు డర్ఘ్యముం గొని బలరాముని కెదురుగా నేగెను. అవ్వల నాగులచే నర్చింప బడుచు హలి నీటిలోని కరిగెను. బలరామ నిర్యాణముం గాంచి హరి దారుకునితో నీవీ వార్త ఎల్ల వాసుదేవునికి నుగ్రసేనునికిం జెప్పుము. బలభద్రుని నిర్యాణమును యాదవకుల క్షయమును నెరింగింపుము. నేనును యోగ సమాధి నిలిచి కళేబరము విడిచెదను. ద్వారకా వాసులకును నాహుకునికిని ‘ఈ నగరము నెల్ల సముద్రుడు ముంచి వేయును. కావున మీరందఱు నర్జునుని రాక కెదురు చూడుడు. అతడిచటకు వచ్చి నిష్క్రమించిన తరువాత మీరు ద్వారకా నగర మధ్య మందుండరాదు. అతనితో నతడెటకేగు నచ్చటికి మీరు నేగుడు’ అని చెప్పుము. నీవేగి మా మాటగా నర్జునకిట్లు ఈ నా భార్యా వర్గమును యథా శక్తి కాపాడ వలయునని చెప్పుము. నీవును నర్జునునితో ద్వారవతి యందలి జనముం గొని సనుము. వజ్రుడును రాజు గాగలడు. ఇది విని దారుకుడు మరి మరి కృష్ణునికి మ్రొక్కి పలుమారులు ప్రదక్షిణము సేసి యా చెప్పినట్లు ద్వారక కేగి యర్జునుని కా మాటలు విన్నవించెను. వజ్రుని గొని వచ్చి రాజుం గావించెను. భగవంతుడు గోవిందుడు వాసుదేవాత్మక మయిన పరబ్రహ్మమును దనయం దారోపించికొని సర్వభూతము లందును ధారణ సేసెను. నిష్ప్రపంచమగు నాత్మయందాత్మను సంయోజించి తుర్యావస్థాత్మకుడై యా పురుషోత్తముడు శయనించెను. దుర్వాసో మహర్షి మున్నేమి పలికె నా మాటను గౌరవించుచు తన పాదమును మోకాలిపై నుంచి యోగ సమాధి స్తిథుడయ్యేను. జరసుడను బోయ ముసలము యొక్క యవశేషమైన రోహ బాణమును తోమరముం జతసేసి ఏతెంచెను. వాడు హరి పాదమును మృగ పాదమట్లున్న దాని నల్లంత దూరము నుండి చూచి యా తోమరముతో ఆ పాద తాళమును గురిచేసి కొట్టెను. అటుపై నక్కడ వాడు చతుర్భాహుదారియైన విష్ణుని దర్శించెను. ఈయనకు మఱియుం బ్రణతి చేసి దయ చూడుమని మరిమరి పలికెను. ఇది యొక లేడి యనుకొని తెలియక కొట్టితిని. నా పాపముచే దగ్దుడనగుచున్న నన్ను క్షమింప వలయు రక్షింప వలయునని వాడు వేడుకొనెను. అంతట భగవంతుడు “నీకు అణు మాత్రమేని భయము వలదు లుబ్డక! నా యనుగ్రహముచే నీవు దేవతావాసమగు స్వర్గమునకుం జను” మనెను. ఆ మాట పలికినదే తడవుగ నరుదెంచిన విమాన మెక్కి యా హరి ప్రసాదమున నా బోయ స్వర్గమునకుం జనెను. వాడటు వోయినంత కృష్ణ భగవానుడు దన్ను బ్రహ్మ భూతమును అవ్యయమును అచింత్యమును అమలమును వాసుదేవ మయమును అజమును అమరమును అప్రమేయమును అఖిలాత్మకమునైన తన విష్ణుతత్త్వము నందు ఆత్మను సంయోజించి దశాత్రయమును దాటి మానుష దేహముం ద్వజించెను.