మైత్రేయుడు:
జ్ఞాతమేతన్మయాత్వత్తో యథాసర్వమిదంజగత్।
విష్ణుర్విష్ణౌవిష్ణుతశ్చ సపరంవిద్య తేతతః॥
ఏతత్తుశ్రోతుమిచ్చామివ్యస్తావేదామహాత్మనా।
వేదవ్యాసస్వరూపేణ యథాతేనయుగేయుగే॥
యస్మిన్యస్మిన్యుగేసోయేయ ఆసీన్మహామునే।
తంతమాచక్ష్వభగవన్ శాఖాభేదాంశ్చమే వద॥
మైత్రేయుడు:
‘భగవాన్! సర్వ ప్రపంచము విష్ణువే కాని వేరుగాదు. ఇదంతయు విష్ణువు నందే స్థితి లయముల నొందు చున్నది. విష్ణువు కంటె వేరొకటి లేదు’ అను విషయములను నీ వలన నేను తెలిసికొంటిని. ఈ విషయమును వినగోరు చున్నాను. అదేమనగా, ఆ విష్ణువే వేదవ్యాస రూపమున వేదమును యుగయుగమున విభజించెను గదా! ఏ యే యుగమందు నేయే రూపము దాల్చెనో తెలుపుము. వేదశాఖా భేదములను గూడ తెలుపుదువు గాక!
శ్రీపరాశరుడు:
వేదద్రుమస్యమైత్రేయశాఖాభేదాస్సహస్రశః।
నశక్యావిస్తరాద్వక్తుంసంక్షేపేణ శృణుష్వతమ॥
ద్వాపరేద్వాపరేవిష్ణుర్ వ్యాసరూపీమహామునే।
వేదమేకంసు బహుధా కురుతేజగతేహితః॥
వీర్యంతేజోబలం చాల్పం మనుష్వాణామవేక్ష్యచ।
హితాయసర్వభూతానాం వేదభేదాన్ కరోతిసః॥
యయాసకురుతేతన్వా వేదమేకంపృథక్ప్రభుః।
వేదవ్యాసాభిధానాతుసోపామూర్తిర్మదుద్విషః॥
యస్మిన్మన్వన్తరేవ్యాసా యేయేతాంస్తాన్నిభోధమే।
యథాచభేదశ్శాఖానాం వ్యాసేనక్రియతేమునే॥
అష్టావింశతకృత్వోవై వేదోవ్యస్తోమహర్షిభిః।
వివస్వతేఽన్తరేతస్మిన్ ద్వాపరేషుపునఃపునః॥
వేదవ్యాసావ్యతీతాయే అష్టావింశతిసత్తమ।
చతుర్దాయైః కృతోవేదోద్వాపరేషుపునఃపునః॥
శ్రీపరాశరుడు:
మైత్రేయా! వేదమనెడి వృక్షమునకు శాఖలు వేలకొలది గలదు. వాని విస్తృతి చెప్ప నలవి గాదు. కావున సంగ్రహముగ వినుము. మహామునీ! ప్రతి ద్వాపర యుగమునను. మనుష్యుల యొక్క వీర్యము అనగా నుత్సాహము, తేజస్సు అనగా తపోయోగాది జనిత ప్రభావము. బలము అనగా ధారణా శక్తియు నల్పములని గుర్తించి సర్వ భూతముల హితము కొఱకు వేద విభాగము నా వేద వ్యాసుడు చేయు చుండును. ఒక్కొక్క వేదము నిట్లు విభజించు చున్న వేదవ్యాస మూర్తి మధుసూదనుని మూర్తియే. ఏ మన్వంతరమున నేయే వ్యాసులు జనించి వేదశాఖా భేదముల నెట్లు గావించిరో వినుము. వైవస్వత మన్వంతర మందలి ద్వాపర యుగము లందు మహర్షులచే వేదము ఇరువది యెనిమిది పర్యాయములు విభక్త మయినది. ఇరువది యెనమండుగురు వేదవ్యాసులు గతించినారు. వారిచే ద్వాపర యుగము లందు వేదము నాలుగు భాగములుగ ననేక పర్యాయములు చేయ బడినది.
ద్వాపరేప్రథమేవ్యస్త్స్వ్సయం వేదస్వ్సయంభువా।
ద్వితీయేద్వాపరేచైవ వేదవ్యాసః ప్రజాపతిః॥
తృతీయేచోశానావ్యాసశ్చతుర్థేచ బృహస్పతిః।
సవితాపఞ్చమేవ్యాసష్షష్ఠే మృత్యుస్స్మృతఃప్రభుః।
సప్తమేచతథై వేన్ద్రో వసిష్ఠశ్చాష్టమే స్మృతః।
సారస్వతశ్చనవమే త్రిధామాదశమేస్మృతః॥
ఏకాదశేతుత్రివృషాభరద్వాజ స్తతఃపరః।
త్రయోదశేచాన్తరిక్షో ధర్మీచాపీచతుర్దశే॥
త్రయ్యారుణిః పఞ్చదశే షోడశేతుధనంజయః।
కృతంజయస్సప్తదశే సంజయోఽష్టాదశేస్మృతః॥
తతోవ్యాసోభరద్వాజో భరద్వాజాత్తుగౌతమః।
గౌతమాదుత్తమోవ్యాసోహర్యాత్మాయోఽధిదీయతే॥
తతోవ్యాసోభరద్వాజో భరద్వాజాత్తుగౌతమః।
గౌతమాదుత్తమోవ్యాసోహర్యాత్మాయోఽధిదీయతే॥
అథహర్యాత్మనావేనస్స్మృతోవాజశ్రవాస్తుయః।
సోమశుష్మాయణస్తస్మాత్తృణబిన్దురితిస్మృతః॥
ఋక్షోఽభూద్బార్గవస్తస్మాద్వాల్మీకిర్యోఽభిధీయతే।
తస్మాదస్మత్పితాశక్తిర్ వ్యాసస్తస్మాదహంమునే॥
జాతుకర్ణోభవన్మత్తః కృష్ణద్వైపాయనస్తతః।
అష్టావింశతిరిత్యేతేవేదవ్యాసాఃప్రకీర్తితాః॥
ఏకోవేదశ్చతుర్ధాతు తైఃకృతోద్వాపరాదిషు॥
భవిష్యేద్వాపరేచాపిద్రౌణిర్ వ్యాసోభవిష్యతి।
వ్యతీతేమమపుత్రేస్మిన్ కృష్ణద్వైపాయనేమునే॥
వేద విభాగీకరణము - భిన్న వ్యాసులు:
ప్రధమ ద్వాపర యుగము నందు స్వయంభువుని (బ్రహ్మ)చే వేదవిభాగము చేయ బడెను. రెండవ ద్వాపరమున ప్రజాపతి మనువు వేద వ్యాసుడాయె, తృతీయ ద్వాపరమున నుశనుడు (శుక్రుడు)ను చతుర్థ ద్వాపరమున బృహస్పతియు, పంచమ ద్వాపరమున సవిత (సూర్యుడు)యు, షష్ఠ ద్వాపరమున మృత్యు దేవతయు, సప్తమ ద్వాపరమున నింద్రుడును, అష్టమ ద్వాపరమున వసిష్ఠుడును, నవమ ద్వాపరమున సారస్వతుడు అనగా బ్రహ్మయు, దశమ ద్వాపరమున త్రిధాముడు (విష్ణువు)ను, ఏకాదశ ద్వాపరమున త్రిశిఖుడు, ద్వాదశ ద్వాపరమున భరద్వాజుడు, త్రయోదశ ద్వాపరమున నంతరిక్షుడు, చతుర్దశ ద్వాపరమున వర్ణియు, పంచదశ ద్వాపరమున త్రయ్యారుణియు, షోడశ ద్వాపరమున ధనంజయడును, సప్తదశ ద్వాపరమున ఋతుంజయుడును, అష్టాదశ ద్వాపరమున జయుడును, తరువాత భరద్వాజుడు, గౌతముడు, హర్యాత్మ వాజశ్రముని సోమ శుష్కాయణుడు తృణబిందువు ఋక్షుడు భార్గవుడు వాల్మీకి వాని తరువాత మా తండ్రియగు శక్తియు, తరువాత నేను(పరాశరుడు), జాతవర్ణుడు, కృష్ణ ద్వైపాయనుడు వ్యాసులైరి. పూర్వపు వేదవ్యాసు లగు వీరు ఇరువది యెనమండ్రుగురు. ద్వాపరాదు లందు వీరిచే నొక వేదము నాలుగుగ చేయ బడినది. రాబోవు ద్వాపరమున కృష్ణద్వైపాయనుని యనంతరము ద్రోణ పుత్రుడగు అశ్వత్థామ వ్యాసుడు కాగలడు.
ధ్రువమేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేవవ్యవస్థితమ్।
బృహత్వాద్బృం హణత్వాచ్చతద్బ్రహ్మేత్యాభిధీయతే॥
ప్రణవావస్థితంనిత్యంభూర్భువస్వ్సరితీర్యతే।
ఋగ్యజుస్సామాథర్వాణంయత్తస్మైబ్రాహ్మణేనమః॥
జగతః ప్రళయోత్పత్త్యోర్య త్తత్కారణసంజ్ఞితమ్।
మహతః పరమంగుహ్యం తస్మైసుబ్రహ్మణేనమః॥
వేదము విభక్త మయినను వికార రహితమయి స్థిరముగ నున్న ఓ మను నేకాక్షర రూపమగు బ్రహ్మ గొప్పది యగుట వలన పెంపొందించునది యగుట చేతను బ్రహ్మ యనబడును. భూః భువః స్వః అను వ్యాహృతి త్రయమును కారణా వ్యవస్తయందు అంతర్గతము చేసికొని యుండుటచే బృహత్పదార్ధ మగుట చేతను కార్య వ్యవస్థ యందు వ్యాహృతి వేద రూపమున పరిణమించుట చేతను బృహత్వ బృంహణములచే బ్రహ్మయన బడుచున్నది. జగత్తు యొక్క ప్రలయోత్పత్తు లందు కారణ రూపమయి మహాత్తత్వము కంటె పరమై గుహ్యమైన యే ప్రధానము గలదో తద్రూపమగు బ్రహ్మకు నమస్కారము. ప్రధానము నుండియే జగత్తు పుట్టి అందే లయించుటచే ప్రధానము అనగా ప్రక్రుతి జగత్తు యొక్క ప్రలయోత్పత్తులకు కారణ మందురు. అట్లు కారణమైన ప్రధాన తాదాత్మ్య రూపమున ప్రణవమును స్తుతించు చున్నాడని భావము.
అగాధాపారమక్షయ్యం జగత్సంమోహనాలయమ్।
స్వప్రకాశప్రవృత్తిభ్యాం పురుషార్థ ప్రయోజనమ్॥
సాంఖ్యజ్ఞానవతాంనిష్ఠాగతిశ్శమదమాత్మనామ్।
యత్తదవ్యక్తమమృతం ప్రవృత్తి బ్రహ్మశాశ్వతమ్॥
ప్రధానమాత్మయోనిశ్చగుహావాసంచకథ్యతే।
అవిభాగంతథాశుక్రమక్షయం బహుదాత్మకమ్॥
పరమబ్రహ్మణేతస్మైనిత్యమేవనమోనమః।
యద్రూపంవాసుదేవస్య పరమాత్మస్వరూపిణి॥
ఏతద్బ్రహ్మత్రిధాభేదమభేదమాపిసప్రభు।
సర్వభూతేష్వభేదోఽసౌ భిద్యతేభిన్నబుద్దిభిః॥
సఋఙ్మయస్సామమయస్సర్వాత్మాసాయజుర్మయః।
ఋగ్యజుస్సామసారాత్మా స ఏవాత్మా శరీరిణామ్॥
సభిద్యతే వేదమయస్స వేదం కరోతివేదైర్బహుభిస్సశాఖమ్।
శాఖాప్రణేతాససమస్తశాఖాజ్ఞానస్వరూపో భగవాననన్తః॥
ఆ తత్త్వము ఆగాధము, అనగా ఆది లేనిది. అపారము అనగా సర్వగతము నాశ రహితమునై తమోగుణ కార్యమగు అజ్ఞానముచే మోహము కలిగించును. సత్వ గుణ కార్యమగు ప్రకాశముచే జ్ఞాన జననము చేతను రజోగుణ కార్యమగు ప్రవృత్తిచే కర్మోత్పాదన
చేయుట చేతను పురుషార్థ సాధన మగును. భోగ సాధన మగును. సాంఖ్యులకు అనగా మూల ప్రకృత్యుపాసకులకు ప్రకృతి పురుష వివేకమును కలిగించుణ దగుటచే నదియే ప్రాప్యస్థానము. అంతరింద్రియ బహి రింద్రియముల ఉపరమమే స్వభావముగా గల యోగులకు శమాది ప్రాప్తికి నుపాయ మగుటచే ప్రాప్యము. అప్రదానము ఇంద్రియ గోచరము కానిది నాశ రహితము ప్రవృత్తి రూపము. ఎల్లప్పుడు సంకోచ వికాసములచే ఉండునది. ఉపనిషత్తు లందు ప్రధానము స్వతస్సిద్ధ మని అవిద్యాంతర్గతము భేదారహితము ప్రకాశవంతమని అపక్షయ శూన్యమని అనేక రీతులుగా చెప్ప బడును. పరమాత్మ రూపుడగు వాసుదేవ రూపుడగు నా పరమాత్మకు నమస్కారము. ఈ ప్రణవరూప బ్రహ్మ అకారోకారమకార రూపావయవ భేదముచే మూడుగ నున్నది. అవయవిరూపమున అభిన్నము. తన యందు కల్పితములైన భిన్న మూర్తులచే భిన్నుడుగా గ్రహింప బడును. ఆ పరమాత్మయే శాఖా ప్రణేతయగు వ్యాసాది రూపము ధరించి వేద విభాగము చేయును. అట్లు చేయు నతడు సమస్త వేద శాఖాజ్ఞాన స్వరూపుడు అసంగుడు నగు భగవంతుడే.
Summary of chapter 3 of the Vishnu Mahā Purāṇa is as follows:
In every Dvāpara Yuga, Bhagavān Viṣṇu/Nārāyaṇa descends as Veda Vyāsa to divide and transmit the undivided Veda. Twenty-eight such Dvāpara Vyāsas are enumerated, culminating with the twenty-eighth, Kṛṣṇadvaipāyana Vyāsa — son of Parāśara and Satyavatī. Kṛṣṇadvaipāyana divided the single Veda into four saṃhitās and entrusted them to five principal disciples: Pailā (Ṛgveda), Vaiśampāyana (Yajurveda), Jaimini (Sāmaveda), Sumantu (Atharvaveda), and Lomaharṣaṇa/Romaharṣaṇa (Itihāsa-Purāṇa).