శ్రీపరాశరుడు:
మైత్రేయ శ్రూయతాం సమ్యక్చరితం తస్య ధీమతః।
ప్రహ్లాదస్య సదోదార చరితస్య మహాత్మనః॥
దితేఃపుత్రో మహావీర్యో హిరణ్యకశిపుఃపురా।
త్రైలోక్యంవశమానిన్యే బ్రహ్మణోవరదర్పితః॥
ఇన్ద్రత్వమకరోద్డైత్యఃసచాసీత్సవితా స్వయమ్।
వాయురగ్నిరపాంనాథఃసోమశ్చాసీ న్మహాసురః॥
ధనానామధిప స్సోభూత్స ఏవాభూత్స్వయంయమః।
యజ్ఞభాగాన శేషాంస్తుసస్వయం బుభుజేఽసురః॥
దేవాస్స్వర్గంపరిత్యజ్యతత్త్రాసాన్మునిసత్తమః।
విచేరురవనౌసర్వేబిభ్రాణామానుషీంతనున్॥
జిత్వాత్రిభువనంసర్వం త్రైలోక్యైశ్వర్యదర్పితః।
ఉద్గీయమానోగన్ధర్వైర్బుభుజేవిషయాన్ ప్రియాన్॥
పానాసక్తం మహాత్మానం హిరణ్యకశిపుంతదా।
ఉపాసాంచక్రిరేసర్వేసిద్ధగన్ధర్వపన్నగాః॥
అవాదయన్ జగుశ్చాన్యేజయశబ్దాంస్తథాఽపరే।
దైత్యేశ్వరస్యపురతశ్చక్రుస్సిద్దాముదాన్వితాః॥
తత్రప్రనృత్తాప్సరసఃస్పటికాభ్రమయేఽసురః।
పపౌపానంముదాయుక్తః ప్రాసాదేసుమనోహరే॥
తస్యపుత్రోమహాభాగః ప్రహ్లాదో నామనామతః।
పపాఠబాలపాఠ్యాదిగురుగేహగతోఽర్భకః॥
శ్రీపరాశరుడు:
మైత్రేయా! నిరంతర ముదార చరితుడగు ప్రహ్లాదుని చరిత్రమును వినుము. పూర్వము దితి యొక్క పుత్రుడు మహా పరాక్రమశాలి యగు హిరణ్యకశిపుడను వాడు బ్రహ్మ వరముచే గర్వించి ఇంద్రుడుగను, సూర్యుడుగను, వాయువుగను, అగ్ని, వరుణుడుగను, సోముడుగను, కుభేరుడుగను, యముడుగను వ్యవహరించుచు యజ్ఞ భాగముల నపహరించు చుండెను. అతని వలన భయపడి దేవతలు భూలోకమున కేగి మనుష్య రూపధారులై తిరుగు చుండిరి. ముల్లోకముల జయించి హిరణ్యకశిపుడు విజయ దర్పముచే గంధర్వులు కొనియాడగా ప్రియ విషయముల ననుభవించు చుండెను. గానాదులచే సిద్ధులు, అప్సరసలు వాని సేవించు చుండిరి. మనోహర ప్రాసాదమున స్పాటిక శిలా స్థలిని అప్సరసలు నాట్య మాడగా మద్యపాన సక్తుడై యుండెను. వాని పుత్రుడు ప్రహ్లాదుడు గురు కులమున బాల పాఠ్యముల నభ్యసించు చుండెను.
ఏకదాతుసధర్మాత్మాజగామగురుణాసహ।
పానాసక్తస్య పురతః పితుర్ దైత్యపతేస్తదా॥
పాదప్రణామావనతం తముత్థాప్యపితాసుతమ్।
హిరణ్యకశిపుః ప్రాహ ప్రహ్లాదమమితౌజసమ్॥
పఠ్యతాంభవతావత్ససారభూతంసుభాషితమ్।
కాలేనైతావతాయత్తేసదోద్యుక్తేనశిక్షితమ్॥
ధర్మాత్ముడగు ప్రహ్లాదుడొక దినమున గురువు పురస్సరముగ నేతెంచి పానాసక్తుడగు తండ్రికి పాద వందనము చేయగా లేవనెత్తి హిరణ్యకశిపుడు నీ చదువుల సారము నెరింగింపుమన ప్రహ్లాదుడు చదువుల మర్మమును నా మనోగతమైన దానిని తెల్పెద. సావధానముగ వినుండు.
ప్రహ్లాదుడు:
శ్రూయతాంతవక్ష్యామిసారభూతంతవాజ్ఞయా।
సమాహితమనాభూత్వాయన్మేచేతస్యవస్థితమ్॥
అనాదిమధ్యాన్తమజమవృద్ధిక్షయమచ్యుతమ్।
ప్రణతోఽస్మ నన్తసన్తానం (స్మిసదానన్దం) సర్వకారణ కారణమ్॥
ప్రహ్లాదుడు:
ఆది, మధ్యాంతములు, వృద్ధి క్షయములు లేనివాడును, నాశన రహితుడును, నాశకరుడును, సర్వ కారణ కారుణుడును నగు విష్ణువును నమస్కరించెద.
శ్రీపరాశరుడు:
ఏతన్నిశమ్యదైత్యేన్ద్రః కోపసంరక్తలోచనః।
విలోక్యతద్గురుంప్రాహ స్పురితాధరపల్లవః॥
శ్రీపరాశరుడు:
అని పలుకగా విని కోపోద్రిక్తుడై గురువుతో నిట్లనియె.
హిరణ్యకశిపుడు:
బ్రహ్మబన్ధోకిమేతత్తేవిపక్షస్తుతి సంహితమ్।
అసారంగ్రాహితోబాలోమామవజ్ఞాయదుర్మతే॥
హిరణ్యకశిపుడు:
బ్రాహ్మణ బృవుడా! ఏమిది? నన్ను తిరస్కరించి అపారమగు శత్రుపక్ష స్తుతిని వీనికి భోధించితి వేల? అనగా
గురువు:
దైత్యేశ్వర నకోపస్య వశమాగన్తుమర్ హసి।
మమోపదేశ జనితంనాయంవదతితేసుతః॥
గురువు:
“దైత్య ప్రభూ! ఆగ్రహింప వలదు, నా బోధన యొక్క సారమును నీ సుతుడు పలుకుట లేదు” అనెను.
హిరణ్యకశిపుడు:
అనుశిష్టోఽసికేనేదృగ్వత్సప్రహ్లాదకథ్యతామ్।
మమోపదిష్టంనేత్యేషప్రబ్రవీతిగురుస్తవ॥
హిరణ్యకశిపుడు:
“నాయనా! నేవెవ్వరిచే యిట్లు శిక్షింప బడితివి! నీ గురువిట్లు శిక్షింప లేడను చున్నాడు” అని పలికిన తండ్రికి,
ప్రహ్లాదుడు:
శాస్తావిష్ణురశేస్య జగతోయోహృదిస్థితః।
త మృతేపరమాత్మానంతాత కః కేనశాస్యతే॥
ప్రహ్లాదుడు:
“తండ్రీ! విష్ణువు సర్వ జనుల హృదయంతరాళ వర్తియై శాసించు చుండగా అట్టి పరమాత్మ కంటే మరెవ్వరు శాసించ గలరు?” అని పలికిన కుమారునితో
హిరణ్యకశిపుడు:
కోయంవిష్ణుస్సుదుర్బుద్దేయం బ్రవీషి పునః పునః।
జగతామీశ్వరస్యేహపురతః ప్రసభంమమ॥
హిరణ్యకశిపుడు:
“ఓ దుష్టబుద్ధీ! సర్వ జగత్పతినగు నా యెదుట పదేపదే నీచే పేర్కొనబడు విష్ణువనువా డెవ్వడు?”
ప్రహ్లాదుడు:
నశబ్దగోచరంయస్యయోగిధ్యేయం పరంపదమ్।
యతోవిశ్వంస్వయం విశ్వంవిష్ణుః పరమేశ్వరః॥
ప్రహ్లాదుడు:
“ఎవ్వని స్వరూపము శబ్ద గోచరము కాక యోగి జనధ్యేయము మాత్రమే సమస్త జగత్తు ఎవని వలన నేర్పడు చున్నదో, యెవడు విశ్వ స్వరూపుడో అతడే పరమేశ్వరుడగు విష్ణు దేవుడు”
హిరణ్యకశిపుడు:
పరమేశ్వర సంజ్ఞోఽజ్ఞకిమన్యోమయ్యవస్థితే।
తథాఽద్యమర్తుకామస్త్వం ప్రబ్రవీషిపునః పునః॥
హిరణ్యకశిపుడు:
“తెలివి లేని వాడా! నేనుండగా మరియొకరు పరమేశ్వరు డనువా డెచట నున్నాడు? నీవు చచ్చుటచే క్షణక్షణ మిట్లు పలుకు చున్నావు.”
ప్రహ్లాదుడు:
నకేవలంతాతమామప్రజానాంస బ్రహ్మభూతోభవశ్చవిష్ణుః।
ధాతావిధాతా పరమేశ్వరశ్చ ప్రసీదకోపంకురుషేకిమర్థమ్॥
ప్రహ్లాదుడు:
“నాకు మాత్రమే గాదు, సమస్త ప్రజలకు నీకు నాతడే ధారకుడు సృష్టి కర్త పరమేశ్వరుడునై యున్నాడు. అనుగ్రహింపుము కోపమేల” అనగా తండ్రి ఆవేశముతో
హిరణ్యకశిపుడు:
ప్రవిష్టః కోఽస్యహృదయేదుర్బుద్దేరతిపాపకృత్।
యేనేదృశాన్యసాదూనివదత్యావిష్టమానసః॥
హిరణ్యకశిపుడు:
నిట్లు అయోగ్య వచనములు పల్కుటకు దుర్బుద్ధి గల నీతని హృదయమున మహాపాపి యగునెవడో ప్రవేశించెను.
ప్రహ్లాదుడు:
నకేవలం మద్ధృదయంస విష్ణు రాక్రామ్యలోకానఖిలానవస్థితః।
సమాంత్వదాదీంశ్చపితస్సమస్తాన్ సమస్తచేష్టాసుయునక్తిసర్వగః॥
ప్రహ్లాదుడు:
“తండ్రీ! నా హృదయమును మాత్రమే గాదు, సమస్త లోకములను ఆక్రమించుకొని యుండి ఆ విష్ణువే నీవు మొదలగు నందరిని సమస్త వ్యాపారము లందు ప్రవర్తింప జేయు చున్నాడు. అతడంతట నిండి యున్నాడు.” అని పలుకగా
హిరణ్యకశిపుడు:
నిష్క్రామ్యతామయం దుష్తః శాస్యతాంచగురోర్ గృహే।
యోజితోదుర్మతిః కేన విపక్షప్రతిసంస్తుతౌ॥
హిరణ్యకశిపుడు:
“ఈ మహాపాపిని వెళ్ళ గొట్టుడు. గురు గృహంబున శిక్షింప బడుగాక! శత్రుపక్ష స్తుతి యందెవ్వడీ దుర్మతిని ప్రవేశ పెట్టెను.”
శ్రీపరాశరుడు:
ఇత్యుక్తస్సతదాదైత్యైర్నీతోగురుగృహంపునః।
జగ్రాహవిద్యామనిశంగురుశుశ్రూషణేరతః॥
కాలేఽతీతేఽతిమహతిప్రహ్లాదమసురేశ్వరః।
సమాహూ యాబ్రవీద్గా ధాకాచిత్పుత్రకగీయతామ్॥
శ్రీపరాశరుడు:
అని పలుకగా, గురు గృహంబునకు గొంపోయిరి. గురు శుశ్రూషతో రేయిం బవాళ్ళు విద్యా గ్రహణము చేసెను. చాలా కాలమునకు దైత్యపతి కుమారుని రప్పించి యొక శ్లోకము చదువ మనగా ప్రహ్లాదుడిట్లు చదివెను.
ప్రహ్లాదుడు:
యతః ప్రధానపురుషౌయతశ్చైతచ్చరాచరమ్।
కారణం సకలస్యాస్య సనోవిష్ణుః ప్రసీదతు॥
ప్రహ్లాదుడు:
“(ప్రధాన ప్రకృతి) పురుషులకు చరాచర ప్రపంచమునకు సమస్తమునకు కారణభూతుడైన యా విష్ణువు మనల ననుగ్రహించు గాక!”
హిరణ్యకశిపుడు:
దురాత్మావధ్యతామేషనానేనార్థోఽస్తిజీవతా।
స్వపక్షహానికర్ తృత్వాద్యఃకులాంగారతాంగాతః॥
హిరణ్యకశిపుడు:
అనగా రాజు “ఈ దుర్మార్గుడు చంపబడు గాక! వీడు బ్రతికి ప్రయోజనము లేదు. స్వపక్షహానికర్త యగుటచే నీతడు కులదాహకుడు” అని ఆజ్ఞాపింపగా
శ్రీపరాశరుడు:
ఇత్యాజ్ఞప్తాస్తతస్తేనప్రగృహీతమహాయుధాః।
ఉద్యతాస్తస్యనాశాయ దైత్యాశ్శతసహస్రశః॥
శ్రీపరాశరుడు:
మహాయుధముల దాల్చి వేల కొలది రాక్షసులు ఆతనిని చంపుటకు సిద్ధ పడిరి.
ప్రహ్లాదుడు:
విష్ణుశ్శస్త్రేషుయుష్మాసుమయిచాసౌ యథాస్తితః।
దైతెయాస్తేనసత్యే నమాక్రాన్త్వాయుధానివః॥
ప్రహ్లాదుడు:
శాస్త్రము లందు మీ యందు నా యందున ఆ విష్ణువే నిండి యున్నాడు. ఆయాదార్థ్య,ము ననుసరించి యాయుధములు నన్ను స్పృశింపకుండు గాక!
శ్రీపరాశరుడు:
తతస్టైశ్శతశోదైత్యైఃశాస్త్రౌఘైరాహతోపిసన్।
నావాపవేదనామల్పామభూచ్చైవపునర్నవః॥
శ్రీపరాశరుడు:
అనేక రాక్షసులచే ఘోర శస్త్రములతో కొత్త బడినను ప్రహ్లాదుడు స్వల్పమగు బాధను కూడా పొంద కుండుటయే గాక తిరిగి నూతతత్వ మందు చుండెను. అది చూచి రాజు,
హిరణ్యకశిపుడు:
దుర్బుద్దేవినివర్త స్వవైరిపక్షస్తవా దతః।
అభయంతేప్రయచ్చామిమాతిమూడమతిర్భవాన్॥
హిరణ్యకశిపుడు:
“ఓరి దుర్బుద్దీ! వైరి పక్షము నుండి మరలుము. నీ కభయ మిచ్చెద. మిక్కిలి మూర్ఖత్వము నొందకుము.” అని పలికెను.
ప్రహ్లాదుడు:
భయంభయానామపహారిణి స్థితేమనస్యనన్తే మమకుత్రతిష్టతి।
యస్మిన్ స్మృతేజన్మజరాన్తకాదిభయా నిసర్వాణ్యపయాన్తితాత॥
ప్రహ్లాదుడు:
“తండ్రీ! ఎవ్వని స్మరణ మాత్రమున జన్మ భయము జరాభాయము యమ భయము మున్నగు భయములు అన్నియు తొలగిపోవునో అట్టి యనంతుడు మనసులో నుండగా నాకు భయ మెచట నుండును?” అనెను.
హిరణ్యకశిపుడు:
భోస సర్పాదురాచారమేనమత్యన్తదుర్మతిమ్।
విషజ్వాలాకులైర్వక్రైస్సద్యోనయతసంక్షయమ్॥
హిరణ్యకశిపుడు:
“ఓ సర్పములారా! దురాచారుడు, దుర్బుద్ధియునగు నీతనిని విష జ్వాలలచే భయంకరములైన ముఖములచే వెంటనే నశింప జేయుడు” అని పలుకగా
శ్రీపరాశరుడు:
ఇత్యుక్తాస్తేనతేసర్పాఃకుహకా స్తక్షకాదయః।
అదశన్త సమస్తేషు గాత్రేష్వతివిషోల్బణాః॥
స త్త్వాసక్తమతిః కృష్ణేదశ్యమానోమహోరగైః।
నవివేదాత్మనోగాత్రంతత్స్మృత్యాహ్లాదసం స్థితః॥
శ్రీపరాశరుడు:
తక్షకాది క్రూర సర్పములు అంటని యవయవము లందు కాట్లు వేసెను. కృష్ణుని యందు లగ్నమైన మనసు గల ప్రహ్లాదుని కేమియు తెలియక పోయెను. సర్పములు దైత్యరాజుతో నిట్టనియే.
సర్పములు:
దంష్ట్రావిశీర్ణామణయ స్స్పాటన్తి ఫణేషుతాపోహృదయేషుకమ్పః।
నాస్యత్వచి స్వల్పమపీహభిన్నంప్రశాధి దైత్యేశ్వర కార్యమన్యత్॥
సర్పములు:
మా కోరలు విరుగు చున్నవి. హృదయ మందు కంపము పడగలందు తాపము కలుగు చున్నది. ఓ ప్రభూ! పిల్లవాని చర్మమైన కొంచము భిన్నమగుట లేదు. మరియొక పనిని చెప్పుడు.
హిరణ్యకశిపుడు:
హే దిగ్గజాస్సంకటదన్తమిశ్రాఘ్నతై నమస్మద్రిపుపక్షభిన్నమ్।
తజ్జావినాశాయభవన్తితస్య యథాఽరణేః ప్రజ్వలితోహుతాశః॥
హిరణ్యకశిపుడు:
“దిగ్గజములారా! శత్రు పక్షముచే భిన్నుడైన ఈ బాలుని మీ చతుర్దంతములతో చంపుడు. అరణి వలన పుట్టిన యగ్ని యా అరణికి నాశనకరమగు గదా!” అని పలుకగా
శ్రీపరాశరుడు:
తతస్సదిగ్గజైర్బాలోభూభృచ్చిఖరసన్నిభైః।
పాతితోధరణీపృష్టేవిషాణై రప్యపీడ్యత॥
స్మరతస్తస్యగోవిన్దమిభదన్తాస్సహస్రశః।
శీర్ణావక్షస్స్థలంప్రాప్య సప్రాహ పితరంతతః॥
శ్రీపరాశరుడు:
దిగ్గజములు ప్రహ్లాదుని దంతములతో పొడిచి క్రింద పడ వేసెను. గోవింద స్మరణలో నిమగ్నుడైన యాతనికి బాధ కలుగ లేదు. దిగ్గజముల దంతములు భగ్నము లాయెను.
ప్రహ్లాదుడు:
దన్తాగజానాంకులిశాగ్రనిష్ఠురాశ్శీర్ణాయదేతెనబలంమమైతత్।
మహానిపత్పాపవినాశనోఽయంజనార్దనానుస్మరణానుభావః॥
ప్రహ్లాదుడు:
“తండ్రీ! వజ్రము వలె నిష్టురములైన గజ దంతములను కూడ భగ్నము చేసిన భగవంతుని బలము చూడుడు. భగవదను స్మరణము మహా విపత్తులను గూడ నశింప జేయ గలదు”
హిరణ్యకశిపుడు:
జ్వాల్యతా మసురావహ్ని రపసర్పత దిగ్గజాః।
వాయో సమేధయాగ్నింత్వం దహ్యతామేషపాపకృత్॥
హిరణ్యకశిపుడు:
“రాక్షసులారా! దిగ్గజముల పారద్రోలుడు. అగ్నుల రగుల్కొల్పుడు. వాయువు అగ్నిని రగుల జేసి యీ పాపాత్ముని దహింప జేయు గాక!”
శ్రీపరాశరుడు:
మహాకాష్ఠచయచ్చన్నమసురేన్ద్రసుతంతతః।
ప్రజ్వాల్యాదానవావహ్నిందదహుః స్వామిచోదితాః॥
శ్రీపరాశరుడు:
అని యాజ్ఞాపింపగా నట్లు చేయ మొదలిడిరి.
ప్రహ్లాదుడు:
తా తైషవహ్నిః పవనేరితోపినమాందహత్యత్రసమస్తతోఽహమ్।
పశ్యామి పద్మాస్తరణాస్తృతానిశీతానిసర్వాణి దిశాంముఖాని॥
ప్రహ్లాదుడు:
“తండ్రీ! గాలిచే రగులజేయ బడిన యీ అగ్ని నన్ను దగ్ధము చేయ జాలదు. దిక్ముఖములెల్ల పద్మములచే పరువ బడినట్లు చల్లగా నున్నవి.”
శ్రీపరాశరుడు:
అథదైత్యేశ్వరం ప్రోచుః భార్గవస్యాత్మజాద్విజాః।
పురోహితామహాత్మానస్సామ్నాసంస్తూయవాగ్మినః॥
శ్రీపరాశరుడు:
శుక్రాచార్య పుత్రులును, రాక్షస పురోహితులునగు చండామార్కాదు లేతెంచి రాజుతో నిట్లనిరి.
పురోహితుడు:
రాజన్నియమ్యతాంకోపోబాలేఽత్రతనయేనిజే।
కోపోదేవనికాయేషుతత్రతేసఫలోయతః॥
తథాతథైనం బాలంతేశాసితారోవయంనృప।
యథావిపక్షునాశా యవినీతస్తే భవిష్యతి॥
పురోహితుడు:
“ప్రభూ! బాలుడైన నీ తనయునిపై కోప ముపసంహరింపుడు. మీ కోపము దేవతల యెడ సఫల మగును. ఈ బాలుని మేము విపక్ష నాశ దక్షుడగునట్లు శిక్షింప గలము.
బాలత్వం సర్వ దోషాణాం దైత్యరాజాస్పదంయతః।
తత్రోఽత్రకోపమత్సర్థంయోక్తుమర్హసినార్భకే॥
నత్యక్ష్యతిహరేః పక్షమస్మాకం వచనాద్యది।
తతః కృత్యాంవధాయాస్య కరిష్యామోనివర్తినీమ్॥
దైత్యరాజా! బాల భావము సర్వ దోషములకు నిలయము గదా! ఈ యర్భాకుని యెడ తీవ్ర కోపము వలదు. మా శిక్షణ వలన హరి పక్షమును వీడడేని క్రుత్యయను అభిచారికా భూత విశేషమును నీ బాలుని వదార్తమై ప్రయోగింతుము. దానికి తిరుగుండదు.
శ్రీపరాశరుడు:
ఏవమభ్యర్థితస్తైస్తు దైత్యరాజః పురోహితైః।
దైత్యైర్నిష్క్రామయామాసపుత్రం పావక సంచయాత్॥
తతోగురుగృహేబాలస్సవసన్ బాలదానవాన్।
అధ్యాపయామాసముహు రుపదేశాన్తరే గురోః॥
శ్రీపరాశరుడు:
అని పలికిన పలుకులను విని రాజు బాలుని అగ్ని నుండి తొలగింప జేసెను. పిమ్మట బాలుడు గురు నికేతనము నందు గురు బోదాసానము నందు బాల దానవులను శిక్షింప మొదలిడెను.
ప్రహ్లాదుడు:
శ్రూయాతాం పరమార్థో మేదైతేయా దితిజాత్మజాః।
నచాన్యథైతన్మన్తవ్యంనాత్రలోభాదికారణమ్॥
జన్మబాల్యంతతస్సర్వోజన్తుః ప్రాప్నోతియౌవనమ్।
అవ్యాహతై వభవతితతోఽనుదివసం జరా॥
తతశ్చమృత్యుమభ్యేతిజన్తుర్ దైత్యేశ్వరాత్మజాః।
ప్రత్యక్షందృశ్యతేచితదస్మాకంభవతాం తథా॥
మృతస్యచవునర్జన్మభావత్యేతచ్చనాన్యథా।
ఆగమోయంతథాతచ్చనోపాదానంవినోద్భవః॥
గర్భవాసాదియావత్తుపునర్జన్మోపపాదనమ్।
సమస్తావస్థకంతావద్దుఃఖమేవావగమ్యతామ్॥
క్షుత్తృష్ణోపశమంతద్వచ్చీతాద్యుపశమంసుఖమ్।
మన్యతేబాలబుద్ధిత్వాద్దుఃఖమేవహితత్పునః॥
ప్రహ్లాదుడు:
“దైతేయ బాలకులారా! పరమ పురుషార్థమును వినుడు. అన్యథా భావింపకుడు. అనగా మిత్యగా తలంపకుడు. గురూపదేశము నందు వలె నా బోధ యందు లోభాదులు కారణము గావు. జన్మాది పంచకము (జన్మ, బాల్యము, యౌవనము, జరా మృత్యువులు) ప్రతి జంతువునకు ప్రత్యక్షముగ గోచరించు చున్నవి గదా! మృతునకు పునర్జన్మ కలుగు ననునదియు అసత్యము గాదు, కారణము లేకుండ పుట్టుక లేదని కూడా నాగమము చెప్పు చున్నది. ఆకలి, చలి మున్నగు వాని ఉపశాంతి హేతువగు అన్నము అగ్ని మొదలగునవి దుఃఖ కారణమే యైనను అజ్ఞతచే సుఖ హేతువనుకొను చున్నారు.
అత్యన్తస్తిమితాంగానాంవ్యాయామేనసుఖైషిణామ్।
భ్రాన్తిజ్ఞానావృతాక్షాణాంప్రహారోఽపి సుఖాయతే॥
క్వశరీర మశేషాణాంశ్లేష్మాదీనాం మహాచయః।
క్వకాన్తిశోభాసౌరభ్యకమనీయాదయోగుణాః॥
మాంసాసృక్పూయవిణ్మూత్రస్నాయుమజ్జాస్థిసంహతౌ।
దేహేచేత్ప్రీతిమాన్ మూడోభవితానరకేఽపిసః॥
అగ్నేశ్శీతేనతోయస్యతృషా భక్తస్యచక్షుధా।
క్రియతేసుఖకర్ తృత్వంతద్విలోమస్యచేతరైః॥
కరోతిహేదైత్యపుత్రాయావన్మాత్రం పరిగ్రహః।
తావన్మాత్రంస ఏవాస్యదుఃఖంచేతసియచ్చతి॥
యావతఃకురుతేజన్తుస్సంబన్ధాన్మనసః ప్రియాన్।
తావన్తోఽస్యనిఖన్యన్తే హృదయేశోకశంకవః॥
యద్యద్గృహేతన్మనసియత్రకుత్రావతిష్ఠతః।
నాశదాహోపహరణంకుతస్తత్రైవతిష్ఠతి॥
జన్మన్యస్యమహాద్దుఃఖంమ్రియమాణ్యస్యచాపితత్।
యాతనాసుయమస్యోగ్రంగర్భసంక్రమణేషుచ॥
గర్భేచసుఖలేశోఽపిభవద్భిరనుమీయతే।
యదితత్కథ్యతామేవంసర్వందుఃఖమయంజగత్॥
తదేవమతిదుఃఖానామాస్పదేతుభవార్ణవే।
భవతాంకథ్యతేసత్యంవిష్ణురేకఃపరాయణమ్॥
మిక్కిలి నిశ్చలమైన యవయవములు గలవారునూ ఆయాసముతో సుఖమును పొందగోరు వారునూ భ్రాంతిచే గ్రమ్మ బడిన నేత్రములు గల వారికిని దుఃఖమే సుఖముగ నుండును. శ్లేష్మాది సమస్త కల్మషముల సముదాయ రూపమగు శరీర మెక్కడ? సౌందర్య శోభాది గుణములెక్కడ? మాంస విణ్మూత్రాది సంఘాత రూపమగు దేహము నందు ప్రీతిగల మూడునకు నరకము నందు కూడ ప్రీతి కలుగు గాక! అగ్నికి చల్లదనము చేత నీటికి దప్పిక చేత అన్నమునకు ఆకలి చేత సుఖ కర్తృత్వము సెప్పబడు చున్నది. శీతాద్యభావములచే అగ్న్యాదులకు దుఃఖ కర్తృత్వము సెప్పబడు చున్నది. ఓ దానవ బాలకులారా! ధనాదులెంతెంతసంగ్రహింతురో వారికవి అంతంతగ దుఃఖ హేతువులగును. కళత్రాదిక మెంతగ ప్రేమింతురో అంతగనవి శోకశంకువువై హృదయమున స్థిరముగ నిలిచి పోవును. ఇంటి యందున్న వస్తువులన్నియు దూరమున నున్న వానికి నాశాద్యా శంకచే నవియెల్ల మనస్సు నందేయుండ గలవు. జనన మందు మరణము నందు యమ యాతనల యందు గర్భమున సంక్రమించుట యందు గర్భము నందును సుఖ లేశము గూడ నూహింప శక్యము గాదు. ఈ విధముగ నతిదుఃఖముల కునికిపట్టగు సంసార సముద్రము నందు విష్ణువొకడే సుఖమైన శరణ్యము.
మాజానీతవయంబాలాదేహీదేహేషు శాశ్వతః।
జరయౌవనజన్మాద్యాధర్మా దేహస్యనాత్మనః॥
బాలోఽహంతావదిచ్చాతో యతిష్యే శ్రేయసేయువాం।
యువాహంవార్థకే ప్రాప్తేకరిష్యామ్యాత్మనోహితమ్॥
వృద్ధోఽహంమమకార్యాణిసమస్తానినగోచరే।
కింకరిష్యామిమన్దాత్మ సమర్థేన నయత్కృతమ్॥
ఏవందురాశయాక్షిప్తమానసః పురుషస్సదా।
శ్రేయసోఽభిముఖంయాతినకదాచిత్పిపాసితః॥
బాల్యేక్రీడనకాసక్తాయౌవనేవిషయోన్ముఖాః।
అజ్ఞానయన్త్యశక్త్యాచవార్థకం సముపస్థితమ్॥
తస్మాద్బాల్యేవివేకాత్మాయతేతశ్రేయసేసదా।
బాలయౌవనవృద్ధాద్యైః దేహభావైరసంయుతః॥
తదేతద్వోమయాఖ్యాతంయదిజానీతనానృతమ్।
తదస్మత్ప్రీతయేవిష్ణుస్స్మర్యతాంబన్ధముక్తిదః॥
ఆయాసస్స్మరణేకోఽస్యస్మృతోయచ్చతి శోభనమ్।
పాపక్షయశ్చభవతిస్మరతాంత మహర్నిశమ్॥
సర్వభూతస్థితే తస్మిన్ మతిర్మై త్రీదివానిశమ్।
భవతాంజాయతామేవంసర్వ క్లేశాన్ ప్రహాస్యథ॥
తాపత్రయేనాభిహతంయదైతదఖిలం జగత్।
తదాశోచ్యేషుభూతేషుద్వేషం ప్రాజ్ఞః కరోతికః॥
ఇది నిజము. మేము పిల్లలమని తలంచ వలదు. దేహము లందుండు దేహి శాశ్వతుడు. జన్మ యౌవనము, జర మొదలగు ధర్మములు దేహమునకు గాని ఆత్మకు లేవు. “నేను బాలుడను. నా శ్రేయస్సు కొఱకై యౌవనమున యత్నింతును. నేనిపుడు యువకుడను. వార్ధక్యము వచ్చిన పిదప యత్నింతును. నేనిపుడు వృద్దుడను. నాకిపుడే పనులు గోచరించుట లేదు. ఏమి చేయుదును? సమర్థతతో నుండగా నేమియు సేయ నైతిని.” అని దురాశ పూరితుడై నరుడు శ్రేయో మార్గమున ప్రవర్తింపడు. బాల్యమున నాటలతోను యౌవనమున విషయాసక్తితోను వార్దమున అశక్తతతోను మూడులు కాలము గడుపుదురు. కావున వివేకయుక్తుడు బాల్యాది దేహ భావములతో సంబంధము లేకుండ శ్రేయస్సు (మోక్షము) కొఱకు నెల్లపుడు బాల్యము నందే ప్రయత్నింప వలయును. నేను మీకు చెప్పిన ఈ విషయములను అసత్యము గాదని గుర్తించిన మీ ప్రీతి కొఱకై భుక్తి ముక్తుల నొసంగు శ్రీమహా విష్ణువు స్మరింపుడు ఇట్లు స్మరించుట కేమి శ్రమ గలదు? స్మరణ మాత్రముననే హరి మంచిని కలుగ జేయును. రేయిం బవళ్ళు ఆ విష్ణు దేవుని స్మరించు వారలకు పాప నాశనము కూడా కలుగును. సర్వ భూతముల యందు నిండి యున్న విష్ణువు నందు రేయిం బవళ్ళు మీకు బుద్ధి యుండుగాక! సర్వ భూతముల యందు మైత్రి కలుగు గాక! ఇట్లగునేని సర్వ సంసార క్లేశములు తొలగును. సమస్త ప్రపంచము తాపత్రయ దూషితము. అట్టి యెడ శోచనీయమైన ప్రాణుల యెడ ప్రాజ్ఞుడైన వాడు కరుణ చూపును గాని ద్వేషమూనడు.
అథభద్రాణిభూతాని హీనశక్తి రహంపరమ్।
ముదంతథాఽపికుర్వీతహానిర్ ద్వేషఫలంయతః॥
బద్ధవైరాణిభూతాని ద్వేషంకుర్వన్తిచేత్తదా।
శోచ్యాన్యహోఽతిమోహేనవ్యాప్తానీతిమనీషిణా॥
ఏతేభిన్నదృశాందైత్యావికల్పాః కథితామయా।
కృత్వాభ్యుపగమంతత్రసంక్షేపః శ్రూయతాంమమ॥
విస్తారస్సర్వభూతస్యవిశ్నోస్సర్వమిదం జగత్।
ద్రష్టవ్యమాత్మవత్తస్మాదభేదేనవిచక్షణైః॥
సముత్సృజ్యాసురంభావంతస్మాద్యూయం యథావయమ్।
తథాయత్నం కరిష్యామోయథాప్రాప్స్యామనిర్వృతిమ్॥
నైనాగ్నినానచార్కేణనేన్దునానచవాయునా।
పర్జన్యవరుణాంభ్యావానసిద్డైర్నైవ రాక్షసైః॥
నాయక్షైఃనచదైత్యేన్ద్రెర్నోరగైర్నచ కిన్నరైః।
న మనుష్యైర్న పశుభిః దోషైర్నైవాత్మ సంభవైః॥
జ్వరాక్షిరోగాతిసార ప్లీహగుల్మాది కైస్తథా।
ద్వేషేర్ ష్యామత్సరాద్యైర్వా రాగలోభాదిభిః క్షయమ్॥
నచాన్యైర్నీయతేకైశ్చిన్నిత్యాయాఽత్యన్త నిర్మలా।
తామాప్నోత్యమలే న్యస్య కేశవే హృదయం నరః॥
అసార సంసార వివర్తనేషు మాయాతతోషంప్రసభంబ్రవీమి।
సర్వత్రదైత్యాస్సమతాముపేత సమత్వమారాధనమచ్యుతస్య॥
తస్మిన్ ప్రసన్నేకిమిహాసత్యలభ్యం ధర్మార్థకామైరలమల్పకాస్తే।
సమాశ్రితాద్బ్రహ్మతరోరనన్తాన్నిస్సంశయో ముక్తిఫలప్రపాతః॥
సమస్త భూతములు అధిక పుణ్యవంతములు. నేను హీన శక్తుడను భావమున్నచో దాని యందు మోదమును చూప వలెను. కాని యసూయ పడరాదు. ద్వేషము వలన తన పుణ్యం నాశనమగును గదా! వ్యర్థముగ బద్ధ వైరులై పరులందు ద్వేషము చూపువారి యెడ విద్వాంసుడు వీరు అధిక మొహముచే వ్యాప్తులై యున్నారు. కావున వీరు శోచనీయులు గాని ద్వేషింప దాగిన వారు గాదని ఉపేక్ష వహింప వలెను. ఈ వికల్పము లన్నియు భేద దృష్టి గల మధ్యమాదికారుల ద్వేషోప శమన ప్రాకారములు. అభేద దృష్టి గల ఉత్తమాదికారుల మతమును సంక్షేపముగ చెప్పేద వినుడు. ఈ సర్వ జగత్తు సర్వ భూత స్వరూపుడగు విష్ణు దేవుని విస్తృతియే. కావున నేర్పరులైన వారు సర్వ భూతములను ఆత్మాభిన్నములుగ చూడ వలెను. అసుర భావమును (దేహము నందు ఆత్మాభిమానమును) వదలి మీరు మేము కూడా మోక్షము పొందునట్లు ప్రయత్నించ వలెను. ఆ నిర్వృతి (మోక్షము) అగ్ని సూర్య చంద్ర వాయు వరుణ సిద్ధ సాధ్య కిన్నరాద్యాధీ దైవికోప ఘాతములచే గాని, మనుష్య పశ్వాద్యాధీ భౌతికోప ఘాతములచే గాని, శారీరమాన సాద్యాధ్యాత్మికోప ఘాతములచే గాని, నాశనము చెందడు. అట్టి మోక్షమును మానవుడు అమలుడైన కేశవుని యందు హృదయము నుంచి కేశవా స్మ్రుతిచే నంద గలడు. అపారములగు సంసార వివర్తములగు దేవ మనుష్య తిర్యక్ పశ్వాది జన్మ లందు సంతోషము నంద వలదు. సర్వ భూతముల సమ దర్శితను పొందుడు. అదియే యచ్యుతారాధనము. ఆ కేశవుడు ప్రసన్నుడు కాగా అలభ్య మనునది లేదు. ధర్మార్థ కామములు అత్యంతాల్పములు. నిత్య సన్నిహితమైన బ్రహ్మ కల్పతరువు నాశ్రయించిన వారికి మహాఫలమగు మోక్షము తప్పదు.
Summary of chapter 17 of the Vishnu Mahā Purāṇa is as follows:
Dakṣa's daughters are enumerated. Aditi's sons are the twelve Ādityas. Ditī's sons include Hiraṇyakaśipu and Hiraṇyākṣa — the two great daitya lords. The lineage of Hiraṇyakaśipu is established, setting the stage for Prahlāda's story.