విష్ణు మహా పురాణము

32 - ఉషా పరిణయ ప్రసంగము

శ్రీపరాశరుడు:

ప్రద్యుమ్నాద్యాహరేః పుత్రా రుక్మిణ్యాం కథితాస్తవ

భానుభౌమేరికాద్యాంశ్చ సత్యభామావ్యజాయత

దీప్తిమత్తామ్రపక్షాద్య రోహిణ్యాం కథితాహరేః

బభూవుర్జామ్బవత్యాంచసామ్భాద్యాబాహుశాలినః

తనయాభద్రవిన్దాద్యా నాగ్న జిత్యాం మహాబలాః

సంగ్రామజిత్ప్రధానాస్తుశై బ్యాయాంచహరేస్సుతాః

వృకాద్యాశ్చసుతామాద్ర్యాం గాత్రావత్ప్రముఖాన్ సుతాన్

అవాపలక్ష్మణాపుత్రాన్ కాళిన్ద్యాశ్చశ్రుతాదయః

అన్యాసాంచై వభార్యాణాం సముత్పన్నానిచక్రిణః

అష్టాయుతానిపుత్రాణాం సహస్రాణిశతం తథా

ప్రద్యుమ్నః ప్రథమ స్తేషాం సర్వేషాం రుక్మిణీ సుతః

ప్రద్యుమ్నాదనిరుద్దోఽభూద్వజ్రస్తస్మాదజాయత

అనిరుద్దోరణేరుద్దోబలేః పౌత్రీం మహాబలః

ఉషాంబాణస్యతనయాముపయే మేద్విజోత్తమ

యత్రయుద్దమాభూద్ఘోరం హరిశంకరయోర్మహత్

భిన్నంసహస్ర బాహునాం యత్రబాణస్యచక్రిణా

శ్రీపరాశరుడు:

మైత్రేయ! రుక్మిణి సంతానము ప్రద్యుమ్నుడు మొదలుగా నెఱింగించితిని. సత్యభామ భౌమ భౌమేరికాదులం గాంచెను. దీప్తిమంతుడు తామ్రపక్షుడు మున్నగు వారు రోహిణీ కుమారులు. జాంబవతికి సాంబుడు మొదలగు వీరులు హరి వలన గల్గిరి. నాగ్నజితి కుమారులు భద్రవిందాదులు శూరులు. హరికి శైబ్యయందు సంగ్రామజిత్తు మొదలయిన వారు గల్గిరి. మాద్రికి వృకాదులు లక్ష్మణకు గాత్రవంతుడు మున్నగువారు పుట్టిరి. కాలింది తనయులు శ్రుతుడు మున్నగు వారు మరియుం గల భార్యలందు హరికి ఎనుబదివేల నూరుగురు కుమారులు గల్గిరి. వారిలో ప్రద్యుమ్నుడందఱకుం బెద్ద, అతని కనిరుద్దుడు అతనికి వజ్రుడుం గలిగె. అనిరుద్దుడు యుద్దమున నేరికింగట్టు వడనివాడు. అతడు బాణాసురుని కూతురగు ఉషను బెండ్లాడెను. అప్పుడే హరి హరులకు బెద్ద ఘోర యుద్దము జరిగెను. చక్రి యందు బాణుని వేయి చేతులను ఖండించెను.

మైత్రేయుడు:

కథం యుద్దమభూద్బ్రహ్మన్నుషార్ థేహరకృష్ణయోః

కథంక్షయంచబాణస్య బాహూనాం కృతవాన్ హరిః

ఏతత్సర్వం మహాభాగ! మమాఖ్యాతుంత్వమార్ హసి

మహత్కౌతూహలం జాతం కథాంశ్రోతుమిమాంహరేః

మైత్రేయుడు:

హరిహర సమారా వృత్తాంతము విస్తరముగ నానతిమ్ము

శ్రీపరాశరుడు:

ఉషాబాణసుతావిప్ర! పార్వతీంసహశంభునా

కీడన్తీముపలక్ష్యోచ్చైః స్పృహాం చక్రేతదాశ్రయామ్

తతస్సకలచిత్తాజ్ఞా గౌరీతామాహభామినీమ్

అలమత్యర్థతాపేన భర్ త్రాత్వమపిరం స్యసే

ఇత్యుక్తాసాతయాచక్రే కదేతిమతిమాత్మనః

కోవాభర్తామమేత్యాహపునస్తామాహపార్వతీ

శ్రీపరాశరుడు:

బాణుని కూతురు ఉషాదేవి శంభునితో పార్వతి క్రీడించుట గని యట్టి విలాసముపై తాను నుబలాట పడెను. అన్ని చిత్తములం గ్రహింప గలది కావున

పార్వతీ దేవి:

వైశాఖశుక్లద్వాదశ్యాం స్వప్నేయోభిభవంతవ

కరిష్యతిసతేభర్తా రాజపుత్రిభవిష్యతి

పార్వతీ దేవి:

చాలుచాలు, పెద్ద పరితాప పడకుము. నీవును నీ మగనితో రమింతు వనెను.

శ్రీపరాశరుడు:

తస్యాంతిథావుషాస్వప్నేయథాదేవ్యాసమీరితమ్

తథై వాభిభవం చక్రేకశ్చిర్ రాగంచతత్రసా

తతః ప్రబుద్దాపురుషమపశ్యన్తీసముత్సుకా

క్వగతోసీతినిర్లజ్జా మైత్రేయో క్తవతీసఖీమ్

బాణస్యమన్త్రీకుమ్భాణ్దః, చిత్రరేఖాచతత్సుతా

తస్యాస్సఖ్యభవత్సాచ ప్రాహకోఽయంత్వయోచ్యతే

యదాలజ్జాకులానాస్యైకథయామాససాసఖీ

తదావిశ్వాససమానీయసర్వమేవాభ్యవాదయత్

విదితార్ థాంతుతామాహ పునశ్చోషాయథోదితమ్

దేవ్యాతథై వతత్ప్రాప్తౌ యోహ్యుపాయః కురుష్వతమ్

శ్రీపరాశరుడు:

అంతట నుష ఇప్పుడు? నా మగడెవ్వ డగును? అని ప్రశ్నించెను. పార్వతి వైశాఖ శుక్ల ద్వాదశినాడు నిన్ను కలలో నెవడు గలియునో అతడు నీమగడగు ననియె. అన్నట్లుగ నుషకు స్వప్నమందారేయి యోకానొకడు దన్ను బొందినట్లు కల వచ్చెను. ఆమెయు నాతని యెడ ననురక్త యయ్యెను. ఆపై మేల్కొని యా కనిన వానింగానక సిగ్గు విడిచి ఏడి? యేడి? ఎటు వోయెనని నెచ్చెలి నడిగెను. బాణుని మంత్రి కుంభాండుడు. ఆతని కుమార్తె చిత్రలేఖ. ఆమె ఉషాదేవి చెలి.

చిత్రలేఖ:

దుర్విజ్ఞేయమిదంవక్తుంప్రాప్తుంవాపినశక్యతే

తథాపికించిత్కర్తవ్యముపకారం ప్రియేతవ

సప్తాష్టదిన పర్యన్తం తావత్కాలః ప్రతీక్ష్యాతామ్

ఇత్యుక్త్వాభ్యన్తరం గత్వా ఉపాయంత మథాకరోత్

చిత్రలేఖ:

సఖీ! నీవన్న యా పురుషు డెవ్వడే యనెను. ఉష సిగ్గున జెప్పకున్న నామెం బలురీతుల బ్రతిమాలి నమ్మిక గూర్చి యడిగినంత నామె స్వప్నమందొక సుందరుడు దన్ను గలియుట నెఱింగించెను. మఱియు నా రమణునిం బొందు నుపాయ మొనరింపు మనియె.

శ్రీపరాశరుడు:

తతః పటేసురాన్ దైత్యాన్ గన్ధర్వాంశ్చప్రధానతః

మనుష్యాంశ్చవిలిఖ్యాస్యై చిత్రలేఖావ్యదర్శయత్

అపాస్యసాతుగన్ధర్వాం స్తథోరగసురాసురాన్

మనుష్యేషుదదౌదృష్టిం తేష్వప్యన్ధకవృష్ణిషు

కృష్ణరామౌవిలోక్యాసీత్సుభ్రూర్లజ్జాజడేవసా

ప్రద్యుమ్నదర్శనేవ్రీడాదృష్టింనిన్యేన్యతోద్విజ

దృష్టమాత్రేతతః కాన్తేప్రద్యుమ్నతనయేద్విజ

దృష్ట్యాత్యర్థవిలాసిన్యాలజ్జాక్వాపినిరాకృతా

సోయంసోయమితీత్యుక్తేతయాసాయోగ గామినీ

చిత్రలేఖాబ్రవీదేనాముషాం బాణసుతాం తదా

శ్రీపరాశరుడు:

అంతట చిత్రలేఖ ఇది తెలియుట యేమి చాల కష్టము. తెలిసిన నతని పొందుట యంతకంటెను నశక్యము అయిన నాకు గూర్చు దానవు గావున కొంచె ముపకారము సేయుదును. ఏడెనిమిది నాళ్లోపిక పట్టుము. అని యంతపురము లోనికి కేగి యయ్యుపాయము నొనరించెను. ఒక వస్త్రము నందు సురలు దైత్యులు గంధర్వులు మనుష్యులు ప్రదానులగు సుందరులు కొందరిని జిత్రించి చూపించెను. వారందరి చిత్రములం ద్రోసిరాజని యుష మనుష్యులలో నందును వృష్ణ్యంధక కుటుంబముల లోని యువక సుందరులపై సుందరి చూపు వెట్టెను. బలరామ కృష్ణ మూర్తులం జూచి యువరాణి సిగ్గున నిశ్చేష్ట యట్లయ్యెను. ప్రద్యుమునిం దర్శించిన తఱి లజ్జకొని వేఱొక వంకకు జూపు మరల్చెను. ఆ మీద ప్రద్యుమ్న తనయుం గాంతునిం గనినంత మాత్రనత్యంత విలాస చకితమైన చూపున నా లజ్జనెటు నెత్తెనో కాని ఆతడే యీతడని యన్నదే తడవుగ నా చిత్రలేఖ యోగశక్తి గలది బాణకుమారి నుశం గని యిట్లనియె

చిత్రలేఖ:

అయం కృష్ణస్యపౌత్రస్తే భర్తాదేవ్యాప్రసాదితః

అనిరుద్ధ ఇతిఖ్యాతః ప్రఖ్యాతః ప్రియదర్శనః

ప్రాప్నోషియదిభర్తారమిమం ప్రాప్తం త్వయాఽఖిలమ్

దుష్ప్రవేశాపురీపూర్వం ద్వారకా కృష్ణపాలితా

తథాపియత్నద్భర్తారమానయిష్యామితేసఖి

రహస్యమేతద్వక్తవ్యంనకస్యచిదపిత్వయా

అచిరాదాగమిష్యామి సహస్వవిరహం మమ

యయౌద్వారవతీంచోషాంసమాశ్వాస్యతతస్సఖీమ్

చిత్రలేఖ:

ఈతడు కృష్ణుని పౌత్రుడు. గౌరీదేవి నీకు భర్తగా బ్రసాదించిన వాడు. అనిరుద్దుడను పేరందిన వాడు. అందగాడు. యీతని నీవు భర్తగా బడయుదు వేని సర్వముం బడసి నట్లే. కృష్ణ పాలన మందున్నది ద్వారకా పురమది మున్ను దుష్ప్రవేశము. అయిన ప్రయత్నించి నెచ్చెలీ నీ భర్తం గొనితెత్తును. ఈ రహస్య మెవ్వరికిం జెప్పవలదు. చిటికలో గొని వచ్చెద. నా యెడబాటించుక సైరింపు మని యుషను నెమ్మది పరచి చిత్రలేఖ ద్వారవతి కేగెను.