33 - బాణాసుర సంహారము - ఉషానిరుద్ధ కల్యాణము

శ్రీపరాశరుడు:

బాణోఽపి ప్రణిపత్యాగ్రే మైత్రేయాహత్రిలోచనమ్।

దేవ! బాహుసహస్రేణనిర్విణ్ణోఽస్మ్యాహవంవినా॥

కచ్చిన్మమైషాంబాహూనాంసాఫల్య జనకోరణః।

భవిష్యతి వినాయుద్ధంభారాయమమకింభుజైః॥

శ్రీపరాశరుడు:

బాణుడు త్రినేత్రుని ముందు వ్రాలి దేవా! యుద్దము లేక ఈ వేయి బాహువులు నాకెందులకని నిస్పృహుడనయితిని. నాకు నా ఈ బాహువులకు సాఫల్యము గూర్పగల రణ మగునా? ఈ చేతుల పెనుబరువు నాకెందుల కన

శంకరుడు:

మయూరధ్వజ భంగస్తే యదాబాణ! భవిష్యతి।

పిశితాశి జనానన్దం ప్రాప్స్యసేత్వంతదా రణమ్॥

శంకరుడు:

నీ నెమలి టెక్కె మెప్పుడు విరుగు నప్పుడు బాణా! మాంసాశనులకు మాహానందము గూర్చు యుద్దము నీకు సంఘతితము కానున్నది.

శ్రీపరాశరుడు:

తతః ప్రణమ్య వరదం శంభుమభ్యాగతో గృహమ్।

సభగ్నంద్వజమాలోక్య హృష్టోహర్షం పునర్యయౌ॥

ఏతస్మిన్నేవకాలేతు యోగవిద్యాబలేనతమ్।

అనిరుద్దమథానిన్యే చిత్రలేఖావరాప్సరాః॥

కాన్యాన్తః పురమభ్యేత్యరమమాణం సహోషయా।

విజ్ఞాయరక్షిణోగత్వాశశంసుర్ దైత్యభూపతేః॥

వ్యాదిష్టం కింకరాణాంతు సైన్యంతేన మహాత్మనా।

జఘానపరిఘం ఘోరమాదాయపరవీరహా॥

హతేషుతేషుబాణోఽపి రథస్థస్తద్వధోద్యతః।

యుధ్యమానోయథాశక్తి యదువీరేణ నిర్జితః॥

మాయయాయుయుధేతేన సతదామన్త్రిచోదితః।

తతః స్తంపన్నగాస్త్రేణ బబన్ధయదునన్ధనమ్॥

ద్వారవత్యాంక్వయాతోఽసావనిరుద్దేతిజల్పతామ్।

యదూనామాచచక్షేత్రంబద్ధంబాణేన నారదః॥

తంశోణితపురం నీతంశ్రుత్వావిద్యావిదగ్ధయా।

యోషితాప్రత్యయం జగ్ముర్యాదవానామరై రితి॥

శ్రీపరాశరుండు:

అన విని వీరుడగు శంభునికి మ్రొక్కి బాణుండింటికి వచ్చి తన మయూర ధ్వజము విరుగుట గని యుప్పొంగు చుండెను. ఇదే సమయమున అప్సరస చిత్రలేఖ యోగ విద్యా శక్తిచే యయ్యనిరుద్దునిం గొని వచ్చెను. అతడంతఃపురము సొచ్చి యుషతో గ్రీడించుట నెరింగి రక్షకులేగి దైత్యపతికి దెల్పిరి. అతడు రాక్షస సైన్యము నాదేశింప నా వచ్చిన సేనను పరిఘాయుధముచే ననిరిద్ధుడు గూల్చెను. తన భటులట్లు వడ బాణుడరద మెక్కి వచ్చి యనిరుద్ధుతో బోరి యోడిపోయెను. అవ్వల మంత్రులు ప్రేరేప మాయాయుద్ద మొనరింప యనిరుద్ధుని నాగాస్త్రమునం బంధించెను. అక్కట ద్వారవతిలో ననిరుద్దుడెటె వోయెనని యనుకొను యాదవులకు నారదుడతడు బాణునిచే బద్ధుడగుటం దెలియ జేసెను. మఱియు నాతడు ఒక యువతిచే శోణ నగరమునకుం గొంపోబడెను గాని దేవతలచే గొంపో బడలేదని దేవముని పలుకు విని యాదవులిది నిక్కమని నమ్మిరి.

తతోగరుడమారుహ్యస్మృత మాత్రాగతం హరిః।

బలప్రద్యుమ్న సహితో బాణస్య ప్రయయౌ పురీమ్॥

పురప్రవేశే ప్రమథైర్యుద్ధమాసీన్మహాత్మనః।

యయౌబాణపురాభ్యాశం నీత్వాతాన్ సంక్షయం హరిః॥

తతస్త్రిపాదస్త్రిశిరాజ్వరో మాహేశ్వరోమహాన్।

బాణరక్షార్థమభ్యేత్యయుయుధేశార్గ్యధన్వనా॥

తద్భస్మస్పర్శసంభూతతాపః కృష్ణఙ్గసంగమాత్।

అవాపబలదేవోపి శమమామీలితేక్షణః॥

తతస్సయుధ్యమానస్తు సహదేవేనశార్ఙ్గిణా।

వైష్ణవేనజ్వరేణాశు కృష్ణ దేహాన్నిరాకృతః॥

నారాయణభుజాఘాతపరిపీడనవిహ్వలమ్।

తంవీక్ష్యక్షమ్యతామస్యేత్యాహదేవః పితామహః॥

తతశ్చక్షాన్తమేవేతి ప్రోక్త్వాతం వైష్ణవం జ్వరమ్।

ఆత్మన్యేవలయం నిన్యేభగవాన్ మధుసూదనః॥

ఆపై హరి తలచిన మాత్రమున నెదుట వ్రాలిన గరుడుని ప్రద్యుమ్నునితో నెక్కి బాణపురి కేగెను. ఆ మహాత్మునితో ప్రమథ గణము పురప్రవేశ సమయమం దెదుర్కొనెను. వారి నందరి నోడించి కృష్ణుడు నగరములో కేగెను. అప్పుడు మూడు పాదములు మూడు తలలుం గల శివ జ్వరము వచ్చి బాణుని రక్షింప హరితో బోరు సల్పెను. ఆ జ్వరము యొక్క భస్మపు స్పర్షవలని తాపము కృష్ణ శరీర స్పర్శ మాత్రమున నశించెను. బలరాముడునుం దాన తాపశాంతి వడసి కన్నులు మోడ్చి సుఖానుభవము వెల్లడించెను. ఆ జ్వరమవ్వల హరితో బోరి కృష్ణ శరీర నిర్గతమైన వైష్ణవ జ్వరముచే సమసి పోయెను. నారాయణ బాహు ఘాతముచే గలిగిన యోత్తిడిచే విహ్వాలమైన యా జ్వరమూర్తిం గని బ్రహ్మ వీని క్షమింపు మని హరిని వేడుకొనెను. కృష్ణుడు సైరించితి నని పలికి వైష్ణవ జ్వరమును దన యంమిడించి కొనెను.

జ్వరుడు:

మమత్వయాసమం యుద్ధం యేస్మరిష్యన్తిమానవాః।

విజ్వరా స్తేభావిష్యన్తీత్యుక్త్వాచై ననంయయౌజ్వరః॥

తతోఽగీర్ భగవాన్ పఞ్చ జిత్వానీత్వాతథాక్షయమ్।

దానవానాం బలం కృష్ణశ్చూర్ణయామాసలీలయా॥

తతస్సమస్తసై న్యేనదై తేయానాం బలేస్సుతః।

యుయుధేశం కరశ్శైవకార్తి కేయశ్చశౌరిణా॥

జ్వరుడు:

అంతట జ్వర దేవత దేవదేవుం గని నీతో నే నొరించిన యీ యుద్దమును తలచుకొన్న వారు విజ్వరుల గుదురని పలికి జ్వరమేగెను. ఆపై భగవంతు డగ్నుల నైదింటిని శమింపజేసి దానవ బలమును లీలగా జూర్ణ మొనరించెను.

హరిశంకరయోర్యుద్దమతీవాసీత్సుదారుణమ్।

చుక్షుభుస్సకలాలోకాశ్శస్త్రాస్త్రాంశుప్రతాపితాః॥

ప్రళయోఽయమశేషస్యజగతోనూనమాగాతః।

మేనిరేత్రిదశా స్తత్ర వర్తమానేమహారణే॥

జృమ్భకాస్త్రేణగోవిన్దోజృమ్బయామాసశంకరమ్।

తతః ప్రణేశుర్ దైతేయాఃప్రమథాశ్చసమంతతః॥

జృంభాభిభూత స్తుహరోరథోపస్థ ఉపావిశత్।

నశశాకకతతోయోద్దుంకృష్ణేనా క్లిష్టకర్మణా॥

గరుడక్షతవాహశ్చప్రద్యుమ్నాస్త్రేణపీడితః।

కృష్ణహుంకారనిర్ధూతశక్తిశ్చాపయయౌగుహః॥

జృంభితేశంకరేనష్టేదైత్యసై న్యేగుహేజితే।

నీతేప్రమథసై న్యేచసంక్షయం శార్ఙ్గధన్వనా॥

నన్దినాసం గృహీతాశ్వమధిరూఢోమహారథమ్।

బాణ స్తత్రయయౌయోద్దుం కృష్ణకార్ ష్ణిబలై స్సహ॥

అవ్వల బాణాసురు డెల్ల సేనలతో దరలె. బాణుడును శంకరుడును కార్తికేయుడును (దేవసేనాని కుమారస్వామి) శౌరితో పోరిరి. హరిశంకరుల యయ్యుద్ద మతి దారుణమయ్యె. సర్వ లోకములు వారి శస్త్రాస్త్ర కిరణ జాతమున దపించి పోయెను. దేవతలిది చూచి జగత్ప్రలయ మాసన్నమయ్యె ననుకొనిరి. గోవిందుడు జృంభకాస్త్రముచే శంకరుని జృంభింప జేసెను. (బెండు పడవేసెను). దైత్యులును ప్రమథ గణమును హరికి బ్రణమిల్లిరి. జృంభకాస్త్రము దెబ్బతిని హరుడు రథము మొగ జతికిల బడెను. కృష్ణునితో బోరలేడయ్యె. గరుడుని ఱెక్కలం గుఱ్ఱములు కుంటువడి ప్రద్యుమ్నాస్త్ర పీడితుడై కృష్ణుడి హుంకారముచే శక్త్యాయుధము పారదరుమ బడినంతట కుమారస్వామి యుద్దము నుండి దప్పుకొనెను. జృంభకాస్త్రమునకు శంకరుడు వడ దైత్య సేనలును మందల మందలుగ ప్రమథ సైన్యము హరిచే క్షయింప నంది సారథిగా బాణుండు రథమెక్కి కృష్ణ, కృష్ణ కుమారులతో బోరనని కేతెంచెను.

బలభద్రోమహావీర్యోబాణసైన్యమనేకధా।

వివ్యాధభాణైః ప్రభ్రశ్యధర్మతశ్చాపలాయత॥

ఆకృష్యలాఙ్గలాగ్రేణముసలేనాశుతాడితమ్।

బలంబలేనదదృశే బాణోబాణైశ్చచక్రిణా॥

తతః కృష్ణేనబాణస్య యుద్దమాసీత్సుదారుణమ్।

సమస్యతోరిపూన్ దీప్తాన్ కాయత్రాణవిభేదినః॥

కృష్ణశ్చిచ్చేదబాణైస్తాన్ బాణేనప్రహితాన్ శితాన్।

వివాద్యకేశవం బాణో బాణంవివ్యాధచక్రధృత్॥

ముముచాతేతథాఽస్త్రాణి బాణకృష్ణౌజిగీషయా।

పరస్పరక్షతికరౌ లాఘవాదనిశం ద్విజ!॥

భిద్యమానేష్వశేషేషుశరేష్వస్త్రేచసీదతి।

ప్రాచుర్యేణతతోబాణంహ న్తుంచక్రేహరిర్మనః॥

తతోర్కశాతసంఘాతతేజసాసదృషద్యుతి।

జగ్రాహదైత్యచక్రార్హరిశ్చక్రం సుదర్శనమ్॥

ముఞ్చతోబాణనాశాయ తతశ్చక్రంమధుద్విషః।

నగ్నాదై తేయవిద్యాఽభూత్కోటరీపురతోహరేః॥

తామగ్రతోహరిర్ దృష్ట్వా మీలితాక్షస్సుదర్శనమ్।

ముమోచబాణముద్దిశ్య ఛేత్తుంబాహువనం రిపోః॥

క్రమేణతత్తుబాహూనాం బానస్యాచ్యుతచోదితమ్।

ఛేదంచక్రేఽసురాపాస్తశస్త్రౌఘక్షవణాదృతం॥

ఛిన్నేబాహువనేతత్తుకరస్థం మధుసూదనః।

ముముక్షుర్భాణనాశాయ విజ్ఞాతస్త్రిపురద్విషా॥

సముపేత్యాహగోవిన్దం సామపూర్వముమాపతిః।

విలోక్యబాణం దోర్దణ్డచ్చేదాసృక్శ్రావవర్షిణమ్॥

మహావీరుడు బలరాముడు బాణములచే బాణు సైన్యముం బారగొట్టెను. మఱియు నాగటి కొనచే రోకలిచే వీర సైన్యముం జిందఱ వందఱ సేయు హరిహరుల వోడిపోయిన తన సేనంగని బాణుడు తనంత నెదిరించి నయ్యుద్దమతి దారుణమయ్యె. తీవ్ర శరీరములం గృష్ణ సైనికుల కవచములం భేదించు బాణుని బాణములను హరి ఖండించెను. అవ్వల నొండొరులం గొట్టుకొనిరి. తుట్టతుదకు శ్రీహరి బాణుం గూల్చి తీర వలెనను నిశ్చయము కొని నూరుగురు సూర్యుల తేజస్సున వెలుగు సుదర్శన చక్రముం బట్టెను. బాణుడు నశింప వలెనని దానిని విడువ నున్నంత రాక్షస విద్య కోటరీయను నొకానొక శక్తి నగ్నయై (దిగంబరయై) హరి యెదుట నిలువ బడెను. దానిం గని హరి కన్నులు మూసికొని సుదర్శ నాయుధమును బాణుని గురిసేసి వాని బాహు సహస్రముం దెగి పోవలెనని వదలెను. అది యసురు లొకవంక విసరు శస్త్రాస్త్రము లన్నిటిని నరకుచు బాణాసురుని చేతుల నెల్ల ఖండించెను. వాని బాహు వనమెల్ల తెగినది. తిరిగి కృష్ణుని చేతిలో నిలిచెను. బాణుని గూల్ప దానిని వదల వలెనను కొనుచున్నంతలో బాహువు లన్నియుం దెగి రక్తధారలం గురియు బాణునిం గని త్రిపురారియు ఉమారమణుడు రమారమణు తులంపెఱిగి యెదుటి కేతెంచి సామ పూర్వకముగ గోవిందుని కిట్లనియె

శంకరుడు:

కృష్ణకృష్ణ జగన్నాథ! జానేత్వాం పురుషోత్తమమ్।

పరేశం పరమాత్మానమనాదినిధనంహరిమ్॥

దేవతిర్యఙ్మనుష్యేషు శరీర గ్రహాణాత్మికా।

లీలేయం సర్వభూతస్య తవాచేష్టోపలక్షణా॥

తత్ప్రసీదాభయం దత్తం బానస్యాస్యమయాప్రభో!।

తత్త్వయానానృతం కార్యం యన్మయావ్యాహృతం వచః॥

అస్మత్సం శ్రయదృప్తోఽయం నాపరాధీతవావ్యాయ!।

మయాదత్తవారోదైత్యస్తతస్తాం క్షమయామ్యహమ్॥

శంకరుడు:

కృష్ణా! కృష్ణ! జగన్నాథ! నిన్నేను పురుషోత్తముడు పరేశుడు పరమాత్మ అనాధి నిధనుడు అగు హరివని యెఱుంగుదును. సర్వముం దానయ్యు దేవ పశుపక్షి మనుష్యులందు లీలా విలాసముగా రూపొంది యవతరించుట యిది నీకుపలక్షణము. అందుచే ప్రసన్నుడవు గమ్ము. ఈ బాణునికే నభయమిచ్చి యున్నాను. ఆ నా మాట నీవబద్దము సేయదగదు. నాయండగొని వీడు పొగ రెక్కినాడు. అపరాధము సేయకుండ వలసినది సేసినాడు. నాచే వరమొందినాడు కావున వీని నేను క్షమించు చున్నాను.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్తః ప్రాహగోవిన్దశ్శూలపాణిముమాపతిమ్।

ప్రసన్నవదనోభూత్వా గతామర్షోఽసురంప్రతి॥

శ్రీపరాశరుడు:

అన విని గోవిందుడు ప్రసన్న ముఖుడైన బాణుని యెడ కోపముమాని శూలపాణి కుమాపతి కిట్లనియె

కృష్ణుడు:

యుష్మద్దత్తవరోబాణోజీవతామేషశంకర!।

త్వద్వాక్యగౌరవాదేతన్మయాచక్రం నివర్తితమ్॥

త్వయాయదభయం దత్తం తద్దత్తమఖిలం మయా।

మత్తోవిభిన్న మాత్మానం ద్రష్టుమర్హసి శంకర॥

యోఽహంసత్వంజగచ్చేదంస దేవాసుర మానుషమ్।

మత్తోనాన్యదశేషం యథ్తత్త్వం జ్ఞాతుమిహార్హసి॥

అవిద్యామోహితాత్మానః పురుషాభిన్నదర్శినః।

వదన్తిభేదం పశ్యన్తిచావయోర న్తరంహర!॥

ప్రసన్నోఽహంగమిష్యామి త్వంగచ్ఛవృషభధ్వజ!॥

కృష్ణుడు:

వీడు నీచే వరము వడసిన వాడు గావున బ్రతుకుం గాక! నీ మాటయెడ గౌరవమున నీ చక్రము నుపసంహరించెద. నీవు వరమిచ్చుట యన్న నేనిచ్చుటయే. నన్ను నీ కంటె నన్యునిగా గనవలదు. సదేవాసుర మానుషమైన యీ జగము నాకంటె వేఱుగాదు. నీవు నట్ల తెలియుము. అవిద్యా మోహితులైన వారు భిన్న దృష్టులై మన యిద్దఱును భేదముం జేసి పలుకుదురు. మనకు భేదముం గాంతురు. ఏనిది ప్రసన్నుడనైతి నేగుచున్నాను. నీవునుం జనుము.

శ్రీపరాశరుడు:

ఇత్యుక్త్వాప్రయయౌకృష్ణః ప్రాదుమ్నిర్యత్రాతిష్ఠతి।

తద్భన్ధఫణినోనేశుర్గరుడానిలపోథితాః॥

తతోఽనిరుద్ధమారోప్యసపత్నీ కంగారుత్మతి।

ఆజగ్ముర్ ద్వారకాం రామకార్ ష్టి దామోదరాః పురీమ్॥

పుత్రపౌత్రైః పరివృత స్తత్రరేమేజనార్దనః।

దేవీభిస్సతతం విప్ర! భూభారతరణేచ్చయా॥

శ్రీపరాశరుడు:

అని పలికి కృష్ణుడు ప్రద్యుమ్న కుమారుడున్న తావున కేగెను. ఆతని న్బంధించిన పాములు గరుత్మంతు గాలి తగిలిన మాత్ర విరిసి చచ్చు పడిపోయినవి. అవ్వల బలరామ కృష్ణ ప్రద్యుమ్ను లనిరుద్దుని సపత్నీకముగ రథ మెక్కించుకొని ద్వారకా నగరమున కేతెంచి వివాహ వైభవము కావించెను. అక్కడ జనార్దనుండు కొడుకులతో మనుమలతో గూడి రుక్మిణి సత్యభామ మొదలగు గల దేవీ సముదాయముతో భూభారము నవతరింప జేయు తలంపున నా ద్వారక యందు సుఖ ముండెను.