మైత్రేయుడు:
వ్యాఖ్యాతాభవతాసర్గవంశమన్వన్తరస్థితిః।
వంశానుచరితం చైవ విస్తరేణ మహామునే!॥
శ్రోతుమిచ్చామ్యహంత్వత్తోయథా వదుపసంహృతిమ్।
మహాప్రళయసంజ్ఞాంచ కల్పాన్తేచ మహామునే॥
మైత్రేయుడు:
సర్గ, వంశ, మన్వంతర, వంశాను చరితములను విస్తారముగ వివరించుము. కల్పాంత మందు జరుగు ప్రాకృత ప్రళయము నందలి యుప సంహారమును గురించి వినగోరేదనన
శ్రీపరాశరుడు:
మైత్రేయ! శ్రూయతాం మత్తోయథావదుపసంహృతిః।
కల్పాన్తేప్రాకృతేచైవ ప్రళయోజాయతేయథా॥
అహోరాత్రంపితౄణాంతుమాసోఽబ్దస్త్రిదివౌకసామ్।
చతుర్యుగసహస్రేతుబ్రాహ్మణోద్వేద్విజోత్తమ॥
కృతంత్రేతాద్వాపరంచకలిశ్చేతిచతుర్యుగమ్।
దివ్యైర్వర్షసహస్రైస్తుతద్ద్వదశభిరుచ్యతే॥
చతుర్యుగాణ్యశేషాణి సదృశానిస్వరూపతః।
ఆద్యంకృతయుగం ముక్త్వా మైత్రేయా న్త్యంతథాకలిమ్॥
ఆద్యేకృతయుగేసర్గోబ్రాహ్మణాక్రియతేయథా।
క్రియతేచోపసంహార స్తథాన్తేచకలౌయుగే॥
శ్రీపరాశరుడు:
మానవుల మాసము పితరుల కొకరోజు. మనవాబ్ధము దేవతల కొక దినము. రెండు వేల చతుర్యుగములు (మహా యుగములు) బ్రహ్మకు ఒక రోజు. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగములు చతుర్యుగము. పండ్రెండు వేల దివ్య వర్షములు దేవతల కొక్క మహాయుగము. ఈ నాల్గు యుగములలో మొదటి కృత యుగము చివరి కలి యుగము తప్ప మిగిలిన అన్ని యుగములు నొకే స్వరూపము గలవి. బ్రహ్మ మొదటి కృతయుగ మందు సృష్టి కావించును. చివరి కలియుగము నందు ఉపసంహరించును.
మైత్రేయుడు:
కలేస్స్వరూపం భగవన్ విస్తరాద్వక్తుమర్ హసి।
ధర్మశ్చతుష్పాద్భగవాన్ యస్మిన్ విప్లవమృచ్ఛతి॥
మైత్రేయుడు:
నాల్గు పాదముల ధర్మము నశించు కలి స్వరూప మానతిమ్మన
శ్రీపరాశరుడు:
కలేస్స్వరూపం మైత్రేయ! యద్బవాన్ శ్రోతుమిచ్చతి।
తన్నిబోధసమాసేనవర్తతే యన్మహామునే॥
వర్ణాశ్రమాచారవతీప్రవృత్తిర్నకలౌ నృణామ్।
నసామఋగ్యజుర్ధర్మవినిష్పాదనహైతుకీ॥
వాహానకలౌ ధర్మ్యాన్ నశిష్యగురుసంస్థితిః।
నదాంపత్యక్రమానై వవహ్నిదేవాత్మకః క్రమః॥
శ్రీపరాశరుడు:
ఋగ్యజుస్సామ వేదోక్త ధర్మ ప్రవృత్తికి హేతువైన కలియుగ మందు వర్ణాశ్రమాచారములు సాగవు. వివాహములు ధర్మ సిద్దములు గావు. గురుశిష్య వ్యవస్థ యుండదు. దాంపత్య క్రమ ముండదు. అగ్ని హోత్రములు దేవతోపాసన క్రమము నుండదు.
యత్రకుత్రకులేజాతోబలీసర్వేశ్వరః కలౌ।
సర్వేభ్య ఏవవర్ణేభ్యోయోగ్యః కన్యావరోధనే॥
యేనకేనచయోగేనద్విజాతిర్దీక్షితః కలౌ।
యైవసై వచ మైత్రేయ! ప్రాయశ్చిత్తం కలౌక్రియా॥
సర్వమేవకలౌశాస్త్రం యస్యయద్వాచనం ద్విజ।
దేవతాచకలౌసర్వాసర్వస్సర్వస్యచాశ్రమః॥
ఉపవాస స్తథాయాసోవిత్తోత్సర్గ స్తపః కలౌ।
ధర్మోయథాభిరుచితై రనుష్ఠానైరనుష్ఠితః॥
విత్తేనభవితాపుంసాం స్వల్పేనాఢ్యమదః కలౌ।
స్త్రీణాం రూపంమదశ్చైవం కేశై రేవభవిష్యతి॥
సువర్ణమణిరత్నాదౌవస్త్రేచోపక్షయం గతే।
కలౌస్త్రియోభావిష్య న్తితదాకేశైరలంకృతాః॥
పరిత్యక్ష్యన్తిభర్తారం విత్తహీనం తథాస్త్రియః।
భర్తభవిష్యతి కలౌవిత్తవానేవయోషితామ్॥
కలిలో ఏ కులము వాడైన బలవంతుడే సర్వేశ్వరుడు. అన్ని వర్ణములలో కన్యను బెండ్లాడుటకు వాడే యోగ్యుడు. ఏదో తనంత దాను మంచి దనుకొన్న పని చేసిన వాడు దీక్షితుడు. తన బుద్ది ననుసరించి చేసిన పని ప్రాయశ్చిత్తము. ఎవడేమి చెప్పిన నదియె శాస్త్రము. సర్వము దేవతయే. అందరికిని అంతయు నాశ్రమమే. ఆయాస పడుట యుపవాసము. డబ్బిచ్చుట తపస్సు. అభిరుచిని బట్టి చేసిన యనుష్ఠానములే ధర్మము. అత్యల్ప ధనవంతుడు కలిలో ధనవంతుడయి పొగరెక్కును. స్త్రీలకు కేశమాత్రము చేతనే సౌందర్యము. సువర్ణమణి రత్న వస్త్రాది సంపత్తి లోపించి కేవలము జుట్టునే వివిధములుగా దిద్దుకొని యదే యందమని స్త్రీలు మురియుదురు. డబ్బులేని మగనికి స్త్రీలు విడాకులిత్తురు. స్త్రీలకు విత్తవంతుడే భర్త యగును.
యోవై దదాతిబహుళం స్వం సస్వామీసదానృణామ్।
స్వామిత్వ హేతుస్సంబన్దో నచాభిజనతాతథా॥
గృహాన్తాద్రవ్యసంఘాతా ద్రవ్యాన్తాచతథామతిః।
అర్థాశ్చత్మోపభోగ్యాన్తా భవిష్యన్తి కలౌయుగే॥
స్త్రియః కలౌభవిష్యన్తి స్వై రిణ్యోలలితస్పృహాః।
అన్యాయదా ప్తవిత్తేషు పురుషాః స్పృహయాళవః॥
అభ్యర్థితాపిసుహృదా స్వార్థమేవనిరీక్ష్యతే।
పణార్థార్దార్దమాత్రేఽపి కరిష్యన్తితథాస్పృహామ్॥
సమానపౌరుషం చేతోభావివిప్రేషువై కలౌ।
క్షీరప్రదానసంబన్ది భావిగోషుచగౌరవమ్॥
అనావృష్టిభయప్రాయాః ప్రజాః క్షుద్భయకాతరాః।
భవిష్యన్తితదాసర్వేగగనాసక్తదృష్ట దుఃఖితాః॥
దుర్భిక్షమేవసతతం తథాక్లేశమనీశ్వరాః।
ప్రాప్స్యన్తివ్యాహతసుఖప్ర మోదామానవాః కలౌ॥
అస్నానభోజినోనాగ్ని దేవతాతిథిపూజనమ్।
కరిష్యన్తికలౌప్రాప్తే నచపిణ్డోదకక్రియామ్॥
లోలుపాహ్రస్వదేహాశ్చబహ్వన్నాదనతత్పరాః।
ప్రాప్స్యన్తివ్యాహతసుఖప్రమోదామానవాః కలౌ॥
ఉభాభ్యామపిపాణిభ్యాం శిరః కణ్డూయనంస్త్రియః।
కుర్వన్త్యోగురుభర్ తౄణామాజ్ఞాం భర్త్స్యన్త్యనాదారాః॥
స్వపోషణపరాః క్షుద్రాదేహసంస్కారవర్జితాః।
పరుషానృతభాషిణోభవిష్యన్తికలౌస్త్రియః॥
దుశ్శీలాదుష్టషేలేషుకుర్యన్త్యస్సతతంస్పృహామ్।
అసద్వృత్తాభవిష్యన్తి పురుషేషుకులాఙ్గనాః॥
డబ్బు సమృద్దిగా నిచ్చువాడు ప్రభువు. అంతియకాని యుత్తమ వంశ జన్మము ప్రభుత్వ హేతువు గాదు. ఇల్లు కట్టుకొన్న వాడు ధనవంతుడుగా లెక్కింప బడును. ధనవంతుడు తెలివైన వారిలో లెక్క. ధనములకు పరమావధి తనకు దాను గుడుచుట. స్త్రీలు చిలిపి చిలిపి కోర్కలకు పై మెఱుగులకు వశమై వ్యభిచారిణు లగుదురు. పురుషు లన్యాయార్జిత విత్తముల కుబలాట పడుదురు. ఎంత ప్రార్థించి ప్రాకు లాడినను స్నేహితుడు స్వార్థమునే చూచికొనును. పరుల ధనములకై జిల్లిగవ్వ కొఱకై వేడుక పడుదురు. బ్రాహ్మణుల యెడ సర్వ మానవ సమాన భావమేకాని విశిష్టగౌరవ ముండదు. ఆవుల యందు పాలిచ్చుటకు సంబంధించిన గౌరవమే కాని మఱి మించి యుండదు. ప్రజలు అనావృష్టికి జడిసి పోవుదురు. ఆకలికి గుములుదురు. ఆకసము వంక జూచెదరు. తాపసలట్లు కందమూల ఫలములను దిందురు. వర్షములు గురియక దుఃఖించి తమకు దాము చత్తురు. దుర్భిక్షము క్లేశములు గుడుతురు. సుఖ సంతోషములు దెబ్బ తినును. స్నానము అగ్ని దేవతాతిథి పూజనము లేని భోజనము సేయుదురు. జనులు దురాశాపరులు హ్రస్వదేహులు మఱుగుజ్జులు ఎవడెవడు దుర్బలుడో వాడు వాడు కలిలో సేవకుడు. తిండిపోతులు బహు సంతానము అల్ప భాగ్యములు గలవారు నగుదురు. స్త్రీలు రెండు చేతులతో తల బరికి కొంచు పెద్దల యందు భర్తలయు నాజ్ఞలందు అనాదరలై దిక్కరింతురు. బెదిరింతురు. తమ బ్రతుకు దాము జూచుకోనుచు నీచలై దేహ సంస్కార శూన్యలై అనృతములు పరుషములు పలుకు చుందురు. శీలము చెడి ఎప్పుడు దుశ్శీలురను వలుతురు. కులవతులు గూడ పురుషుల యెడ నసత్ప్రవర్తనము సేయుదురు.
వేదాదానంకరిష్యన్తివటవశ్చాకృతవ్రతాః।
గృహస్థాశ్చనహోష్యన్తినదాస్యన్త్యుచితాన్యపి॥
వానప్రస్థాభవిష్యన్తిగ్రామ్యాహారపరిగ్రహాః।
భిక్షవశ్చాపిమిత్రాదిస్నేహ సంబంధయన్త్రణాః॥
అరక్షితారోహర్తారశ్శుల్కవ్యాజేనపార్థివాః।
హారిణోజనవిత్తానాంసంప్రాప్తేతుకలౌయుగే॥
యోయోశ్వరథనాగాఢ్యస్ససరాజా భవిష్యతి।
యశ్చయశ్చా బలస్సర్వస్ససభృత్యః కలౌయుగే॥
వైశ్యాః కృషివాణిజ్యాది సంత్యజ్యనిజ కర్మయత్।
శూద్రవృత్త్యాపవత్స్యన్తికారుకర్మోపజీవనః॥
భైక్షవ్రాతపరాశ్శూద్రాః ప్రవ్రజ్యాలిఙ్గినోఽధమాః।
పాషణ్డసంశయాంవృత్తిమాశ్రయిష్యన్తిసత్కృతాః॥
దుర్భిక్షకరపీడాభిరతీవోపద్రుతాజనాః।
గోదూమాన్నయవాన్నాఢ్యాన్ దేశాన్ యాస్యన్తిదుఃఖితాః॥
వేదమార్గేప్రలీనేచపాషణ్డాఢ్యేతతోజనే।
అధర్మవృద్ధ్యాలోకానామల్పమాయుర్భవిష్యతి॥
అశాస్త్రవిహితంఘోరంతప్యయమానేషువైతతః।
నరేషునృపదోషేణబాల్యేమృత్యుర్భవిష్యతి॥
భవితాయోషితాంసూతిః పంచషట్సప్తవార్షికీ।
నవాష్టదశవర్షాణాం మనుష్యాణాం తథాకలౌ॥
పలితోద్భవశ్చభవితా తతాద్వాదశవార్షికః।
నాతిజీవతివై కశ్చిత్కలౌవర్షాణివింశతిః॥
అల్పప్రజ్ఞావృథాలిఙ్గాదుష్టాన్తః కరణాః కలౌ।
యతస్తతోవినంక్ష్యన్తికాలేనాల్పేనమానవాః॥
బ్రహ్మచర్య వ్రత రహితముగ వటువులు వేదములం జదువుదురు. గృహస్థులగ్ని హోత్రములు సేయరు తప్పని సరిగ చేయవలసిన దానములు గూడ చేయరు. గ్రామ్యాహార పరిగ్రహములు సేసి పాడు తిండి తినుచు పాడు దానములు పట్టుచు గృహస్థులు వానప్రస్థు లగుదురు. సన్యాసులు హితుడని ఆహితుడని భావ వికారములకు లోనై పోవుదురు. రాజులు రక్షకులు గారు. పన్నుల నెపమున సర్వ భక్షకులు దొంగలు నగుదురు. ప్రజల ధనము దొంగిలింతురు. గుఱ్ఱాలు ఏనుగులు రథాలు గలవాడే రాజగును. వైశ్యులు కృషి వాణిజ్యము మొదలయిన స్వధర్మములు విడిచి వడ్రంగము మొదలయినవి చేసి శూద్రుల వృత్తిచే బ్రతుకుదురు. అధములు శూద్రులు సంన్యాస చిహ్నములు కాషాయములు దాల్చి భిక్షావ్రతము సేయుదురు. గౌరవ సత్కారములు వడయుచు పాషండ వృత్తి నాశ్రయింతురు. దుర్భిక్షము పన్నులు మొదలయిన పీడలచే నుపద్రవములకు గురియై జనులు దుఃఖితులై గోధుమలు యవధాన్యము పండు దేశములకు వలస పోవుదురు. వేదమార్గ మడుగంటి జనము పాషండ మయముగా నధర్మము పెరిగి లోకము లల్పాయష్కము లగును. రాజ దోషము చేతను నరులు శాస్త్ర విహితము గాని ఘోర తపస్సులు చేయుట చేతను బాల మరణములు గల్గును. అయిదు ఆఱు ఏడేండ్ల యీడుగల యాడు పిల్లలు పిల్లలంగందురు. పండ్రెండేండ్ల వారికి జుట్టు నరయును. ఇరువదేండ్ల మించి యెవ్వడుం బ్రతుకడు. అల్పబుద్దులు వ్యర్థమైన సంన్యాసాది చిహ్నధారులు దుష్టమతులు నగుటచే మానవు లత్యల్ప కాలముననే కాలవశు లగుదురు.
యదాయదాహి మైత్రేయహానిర్ధర్మస్యలక్ష్యతే।
తదాతదాకలేర్ వృద్ధిరనుమేయావిచక్షణై॥
యదాయదాహిపాషణ్డవృద్ధిః మైత్రేయలక్ష్యతే।
తదాతదాకలేర్ వృద్ధిరానుమేయామహాత్మభిః॥
యదాయదాసతాం హానిః వేదమార్గానుసారిణామ్।
తదాతదాకలేర్ వృద్దిరనుమేయావిచక్షణైః॥
ప్రారమ్భాశ్చావసీదన్తియదా ధర్మభృతాంనృణామ్।
తదాఽనుమేయం ప్రాధాన్యం కలేః మైత్రేయ! పణ్డితైః॥
యదాయదానయజ్ఞానామీశ్వరః పురుషోత్తమః।
ఇజ్యన్తేపురు షైర్యజ్ఞేస్తదాజ్ఞేయం కలేర్బలమ్॥
నప్రీతిర్వేదవాదేషు పాషణ్డేషుయదారతిః।
కలేః వృద్ది స్తదాప్రాజ్ఞైరనుమేయా విచక్షణైః॥
కలౌజగత్పతిం విష్ణుం సర్వస్రష్టారమీశ్వరమ్।
నార్చయిష్యన్తి మైత్రేయ! పాషణ్డోపఃతాజనాః॥
కిందేవైః కింద్వి జైర్వేదైః కింశౌచేనామ్బుజన్మనా।
ఇత్యేవం విప్రవక్ష్యన్తి పాషణ్డోపహతాజనాః॥
స్వల్పామ్బువృష్టిః పర్జన్యస్సస్యం స్వల్పఫలం తథా।
ఫలం తథాల్పసారంచవిప్ర! ప్రాప్తేకలౌయుగే॥
శాణీప్రయాణివస్త్రాణిశమీప్రాయా మహీరుహాః।
శూద్రప్రాయా స్తథావర్ణా భవిష్యన్తి కలౌ యుగే॥
అణుప్రయాణిధాన్యాని చాజ్యప్రాయం తథాపయః।
భవిష్యన్తి కలౌప్రాప్తే హౌశీరంచానులేపనమ్॥
వివేకు లెప్పుడు ధర్మహాని కనబడునో యప్పుడప్పుడు కలి పెరుగుచు నట్లు గమనింప వలయును. ఎప్పుడెప్పుడు పాషండులు పెరుగుదురో యప్పుడప్పుడు కలి పెంపును మహాత్ములు గుర్తింప వలెను. సత్పరుషులకు వేద మార్గాను సారులకు హాని కల్గి నప్పుడెల్ల కలి పెరుగుదల నూహింప వలెను. ధర్మపరులు, యువకులు చెడిపోవు నపుడెల్ల కలి ప్రాదాన్యమును పండితులు ఉహింప వలెను. ఎప్పుడెప్పుడు యజ్ఞేశ్వరుడైన పురుషోత్తముని ప్రాజ్ఞులు యజింప రప్పుడప్పుడు కలి విజృంభణము భావింప నగును. వేదవాదముల యెడ ప్రీతిలేక పాషండుల యెడ నది కల్గు నప్పుడు కలి వృద్దిని విచక్షణు లూహింప వలెను. కలిలో పాషండ నిహతులై జనులు విష్ణుని సర్వ స్రష్టను సర్వ జగత్పతి నారాధింపరు. వేదము లెందులకు? ద్విజు లెందులకు దేవత లెందులకు నీట తెగ కడుగు నాచార మెందులకు పాషండు భావోపహతులై ప్రజలు వాగుదురు. కలిలో మేఘ మల్పముగ గురియును. పంట దిగుబడి స్వల్పము. ఆ పంట కూడ అల్పసారము. కలిలో జనపనారతో చేసిన వస్త్రములు శమీ మాత్రము వృక్షములు. శూద్ర ప్రాయములు వర్ణములు నగును. ధాన్యము లణుప్రాయములు. పాలు ఆజ్య ప్రాయములు. (వట్టి జిడ్డు మాత్రము గలవై రుచి చవి యుండదు) వట్టి వెల్ల మాత్రము గంధము.
శ్వశ్రూశ్వశురభూయిష్ఠాగురవశ్చనృణాం కలౌ।
స్యాలాద్యాహారిభారాశ్చసుహృదో మునిసత్తమ॥
కస్యమాతాపితాకస్యయథాకర్మానుగః పుమాన్।
ఇతిచోదాహరిష్యన్తిశ్వశురానుగతానరాః॥
వాఙ్మనః కాయగైః దోషైరభిభూతాః పునః పునః।
నరాః పాపాన్యనుదినం కరిష్యన్త్యల్పమేధసః॥
నిస్సత్యానామశౌచానాం నిర్ హ్రీకాణాం తథానృణామ్।
యద్యద్దుః ఖాయతత్సర్వం కలికాలేభవిష్యతి॥
నిస్స్వాధ్యాయవషట్కారేస్వధాస్వాహావివర్జితే।
తదాప్రవిరళోధర్మః క్వచిల్లోకేనివత్స్యతి॥
తత్రాల్పేనైవయత్నేన పుణ్యస్కన్ధమనుత్తమమ్।
కరోతియః కృతయుగే క్రియతేతపసాహిసః॥
అత్త గార్లు, మామ గార్లు మాత్రమే నరులకు గురువులు. బావ మరదులు భార్యలే మిత్రులు. తండ్రి యెవనికి ఎవనికి దల్లి? ఇదంతయు కర్మాను సారమగునది యని యత్త మామల వెంటబడిన నరులు తల్లిదండ్రుల విడుతురు. మాటిమాటికి వాఙ్మనః కాయములచే మఱిమఱి నరు లల్పబుద్దులై పాపములు సేయుదురు. సత్యము లేదు. శౌచము లేదు. అట్టి నరులకు గాలి కాలములో సర్వము దుఃఖమునకు గారణమగును. స్వాధ్యాయ వషట్కారములు వినిపించవు. స్వాహా స్వదా కారములు శూన్యములై కలిలో స్వల్ప యత్నముచే నేర్పడు పుణ్య స్కంధము కృత యుగమున తపస్సు చేసి సంపాదించినంత గొప్పది యగును.
Summary of chapter 1 of the Vishnu Mahā Purāṇa is as follows:
Maitreya asks Parāśara for a full description of the current age. This chapter provides the most extensive account in the Purāṇa of the characteristics of Kali Yuga. The collapse of varṇāśrama, the breakdown of marriage and the guru-śiṣya system, the absence of agni-hotra and deva-upāsanā, and the spread of pāṣaṇḍa (heretical) doctrines are all described. Social signs include the domination of wealth over lineage and the corruption of rulers. Physical signs include extreme drought, crop failure, diminished life-spans, dwarfed bodies, and early death. The signs by which wise people can detect the increasing influence of Kali are enumerated: when pāṣaṇḍas increase, when the Veda-path declines, when Viṣṇu is not worshipped as the creator, and when the voices for orthodoxy grow weak.