విష్ణు మహా పురాణము

16 - ప్రహ్లాద చరిత్ర

మైత్రేయుడు:

కథితో భవతా వంశో మానవానాం మహామునే

కారణంచాస్యజగతో విష్ణురేవ సనాతనః

యత్త్వేతద్భగవా నాహ ప్రహ్లాదందైత్యసత్తమమ్

దదాహ నాగ్ని ర్నాస్త్రైశ్చక్షుణ్ణ స్తత్యాజజీవితమ్

జగామ వసుధా క్షోభంయత్రాబ్దిసలిలస్థితే

బన్ధబద్దే విచలతి విక్షిప్తాంగై స్సమాహతా

శైలైరాక్రాన్తదేహోఽపి నమమార చయఃపురా

త్వయైవాతీవమాహాత్మ్యం కథితంయస్య ధీమతః

తస్య ప్రభావమతులం విష్ణోర్భక్తిమతో మునే

శ్రోతుమిచ్చామితస్యైతచ్చరితం త్వమితౌజసః

కింనిమిత్త మసౌ శస్త్రైర్విక్షిప్తో దితిజైర్మునే

కిమర్థం చాబ్దిసలిలే విక్షిప్తో ధర్మతత్పరః

ఆక్రాన్తః పర్వతైః కస్మా త్కస్మాద్దష్టో మహోరగైః

క్షిప్తఃకిమాద్రి శిఖరా త్కింవా పావకసంచయే

దిగ్దన్తినాం దన్తభాగై స్సచకస్మాన్ని పీడితః

సంశోషకోఽనిల శ్చాస్యప్రయుక్తః కింమహాసురైః

కృత్యాంచ దైత్యగురవో యుయుజు స్తేతుకింమునే

శమ్బరశ్చా పిమాయానాంసహస్రం కింప్రయుక్తవాన్

హాలాహలంవిషం ఘోరం దైత్యసూదైర్మహాత్మనః

కస్మాద్దత్తంవినాశాయ యజ్జీర్ణం తేనధీమతా

మైత్రేయుడు:

ఓ పరాశర మునీ! నీచే స్వాయంభువ మనువంశ జాతులగు నుత్తానపాదాది మహాత్ముల వంశము చెప్ప బడినది. సనాతనుడగు విష్ణువే జగత్కారణము. ప్రహ్లాదుని నగ్ని దహింపలేదు. అస్త్రములు బాధింప లేదు. సముద్రమున నతడు త్రోయ బడగా పాశములచే బంధింప బడగా భూమి క్షోభించి చలించెను. పర్వతములచే కప్పు బడినను నాతడు మృతి చెంద లేదు. విష్ణు భక్తుడు దీప్త తేజస్కుడునగు నాతని ప్రతాపము నీచే చెప్ప బడినను మరల విన వలయును. ఓ మునీ! దైత్యులచే ధర్మ పరుడగు నీ ప్రహ్లాదు డెందులకు నస్త్రములచే బాధింప బడెను? సముద్రమున త్రోయ బడెను? పర్వతములచే గొట్ట బడెను? పాములచే కరిపింప బడెను? పర్వత శిఖరముల నుండి యగ్ని జ్వాలలలో త్రోయింప బడెను? దిగ్గజముల దంతములచే కుమ్మింప బడెను? సంశోషకమగు వాయువు ప్రయోగింప జేయ బడెను? దైత్య గురువులు కృత్యయను శక్తి ప్రయోగించిరి? ఐంద్రజాలికులు మాయా సహస్రముల కురిపించిరి? వంట వారిచే హాలాహల మహా విషమును పెట్టించిరి?

ఏతత్సర్వం మహాభాగ ప్రహ్లాదస్య మహాత్మనః

చరితం శ్రోతుమిచ్చా మిమహార్థస్యచసూచకమ్

నహికౌతూహలం తత్రయద్డైత్యైర్నహతోహిసః

అనన్యమనసోవిష్ణౌ కస్సమర్థో నిపాతనే

తస్మిన్ ధర్మపరేనిత్యం కేశవారాధనోద్యతే

స్వవంశ ప్రభవైః దైత్యైః కర్తుంద్వేషోఽ తిదుష్కరః

ధర్మాత్మని మహాభాగే విష్ణుభక్తే విమత్సరే

దైతేయైః ప్రహృతంకస్మాత్తన్మమాఖ్యాతుమర్ హసి

ప్రహరన్తి మహాత్మానోవిపక్షేచాపినేదృశే

గుణైస్సమన్వితేసాధౌకింపునర్యస్సపక్షిజః

తదేతత్కథ్యతాం సర్వంవిస్తరాన్మునిసత్తమ

దైత్యేశ్వరస్య చరితం శ్రోతుమిచ్చామ్య శేషతః

ఈ ప్రయత్నము లన్నియు వమ్మాయెను. ఎందుల కిట్లు చేయించిరో ఆ వివరముల విన గోరెదను. విష్ణువునం దనన్య మనసు గలిగి ధర్మ తత్పరుడైన వాని నెవరు బాధించ గలరు? ఇట్టి యోగ్యుని యందేల దైత్యులిట్లు ప్రవర్తించిరి? ఇట్టి యోగ్యుల యెడ శత్రువులు కూడ నిట్లు ప్రవర్తిల్లరు. స్వపక్షులు ప్రవర్తిల్లుదురా? దైత్య రాజు చరితమును విస్తరముగ చెప్పుడు. పూర్తిగ విన వలతుము