15 - దక్షుని తల్లి మారిష పాణి గ్రహణము

శ్రీపరాశరుడు:

తపశ్చరత్సుపృథ్వీం ప్రచేతస్సు మహీరుహాః।

అరక్ష్యమాణావవృధుర్భాభూవాథ ప్రజాక్షయః॥

నాశకన్మరుతో వాతుం వృతంఖమభవద్ద్రుమైః।

దశవర్షసహస్రాణినశేకుశ్చేష్టితంప్రజాః॥

తాన్ దృష్ట్వాజలనుష్క్రాన్తాస్సర్వేక్రుద్దాః ప్రచేతసః।

ముఖేభ్యోవాయుమగ్నించతేఽసృజన్ జాతమన్యవః॥

ఉన్మూలానథతాన్ వృక్షాన్ కృత్వావాయురశోషయత్।

తానగ్నిరదహద్ఘోర స్థదాభూద్ద్రుమసంక్షయః॥

ద్రుమక్షయమథోదృష్ట్వాకించిచ్ఛి ష్టేషుశాఖిషు।

ఉపగమ్యాబ్రవీదేనాన్ రాజాసోమః ప్రజాపతీన్॥

కోపంయచ్ఛతరాజానశ్శృణుద్వంచవచోమమ।

సంధానంవఃకరిష్యామి సహక్షితురుహై రహమ్॥

రత్నభూతాచకన్యేయంవార్ క్షేయీవరవర్ణి నీ।

భవిష్యజ్జానతాపూర్వంమయాగోభిర్వివర్దితా॥

మారిషానామనామ్నై షావృక్షాణామితినిర్మితా।

భార్యావోస్తూమహాభాగా ధ్రువంవంశవివర్ధినీ॥

యుష్మాకం తేకసోర్ధే నమమచార్ధే నతేజసః।

అస్యాముత్పత్స్య తేవిద్వాన్ దక్షోనామప్రజాపతిః॥

మమాంశేనచసంయుక్తోయుష్మత్తేజోమయేనవై।

తేజసాఽగ్నిసమోభూయః ప్రజాస్సంవర్ధయిష్యతి॥

శ్రీపరాశరుడు:

ప్రచేతసులు తపస్సు చేయుచుండ రక్షించు వారు లేక చెట్లు తెగ పెరిగి భూమి నావరించినవి. దాన ప్రజా క్షయ మయ్యెను. వాయువు వీవ శక్యము గాదయ్యె. చెట్లతో నాకసమెల్ల నిండెను. పదివేలేండ్లు ప్రజలు కదలి మెదల లేరైరి. వారిం జూచి ప్రచేతసులు కుపితులై ముఖముల నుండి వాయువును అగ్నిని సృష్టించిరి. వాయువు ఆ వృక్షములను మొదలంట గూల్చి ఎండించెను. అగ్ని వానిం దహించెను. అందుచే వృక్ష క్షయ మయ్యెను. చెట్లు కొద్దిగా మిగులుట చూచి రాజగు సోముడు ప్రజాపతుల దగ్గిరగా వచ్చి యిట్లనియె. ఓ రాజులారా! కోపమును నియమింపుడు. నా మాట వినుడు. చెట్లతో గూడ మీకు సంధానము (సంధి) నేను చేసెదను. ఈ చెట్లకు బుట్టిన సుందరి సుందరీ రత్నము. భవిష్యత్తు నెరింగి నేనీమెను నా కిరణములచే బెంచితిని. ఈమె ‘మారిష’ యను పేరిది. ఓ మహానుభావులారా! మీకీమె భార్యయగు గాక! మీ వంశాభివృద్ధి సేయును గాక! ఈమ మీ తేజస్సు సగము కలిసి యీమె యదు దక్షుడను ప్రజాపతి జ్ఞాని పుట్ట గలడు. మన యుభయుల తేజస్సుతో గూడి యతడగ్ని సమాన తేజస్వియై ప్రజలను సంవర్ధింప గలడు.

కణ్డుర్నామమునిః పూర్వమాసీ ద్వేదవిదాంవరః।

సురమ్యేగోమతీతీరే స తేపేపరమంతపః॥

తత్ క్షోభాయసురేన్ద్రేణ ప్రమ్లోచాఖ్యా వరాప్సరాః।

ప్రయుక్తా క్షోభాయామాస తమృషింసాశుచిస్మితా॥

క్షోభితపస్సతయాసార్ధంవర్షాణామధికంశతమ్।

అతిష్ఠన్మన్ధరద్రోణ్యాంవిషయాసక్తమానసః॥

సా తంప్రాహమహాభాగ గన్తుమిచ్ఛామ్యహందివమ్।

ప్రసాదసుముఖో బ్రహ్మన్ననుజ్ఞాం దాతుమర్హసి॥

తయైవముక్తస్సమునిస్తస్యామాస్తకమానసః।

దినానికతిచిద్భద్రేస్థీయతామిత్యభాషత॥

ఏవముక్తాతతస్తేన సాగ్రం వర్షశతంపునః।

బుభుజేవిషయాంస్తన్వీ తేనసార్ధం మహాత్మనా॥

అనుజ్ఞాందేహిభగవన్ వ్రజామి త్రిదశాలయమ్।

ఉక్తస్తయేతి సపున స్థ్సీయతామిత్యభాషత॥

పునర్గతేవర్షశతే సాధికే సాశుభాననా।

యామీత్యాహదివంబ్రహ్మన్ ప్రణయాత్ స్మితశోభనమ్॥

ఉక్తస్తయైన సముని రూపగృహ్యాయతేక్షణామ్।

ప్రాహాస్యతాం క్షణంసుభ్రు చిరకాలం గమిష్యసి॥

తచ్చాపభీతా నుశ్రోణీ సహదేవర్షిణాపునః।

శతద్వయంకించిదూనం వర్షాణామన్వతిష్ఠత॥

మున్ను కండువను ముని యుండెను. వేదవిదు లందగ్రేసరుడు చక్కని గోమతీ తీరమందా ముని తపము గావించెను. అతనిని క్షోభింప చేయ నింద్రుడు ప్రమ్లోచయను నప్సరసను బ్రయోగించెను. ఆశుచిస్మిత (అచ్చపు జిరనవ్వు గలది) యాతనిం గలసెను. ఆమెతో గలసి యాతడు నూరెండ్లు మించి మందర గిరి కందరమున విషయరతుడై యుండెను. ఆమె యాతనింగని మహానుభావ! దివంబున కేనేగ గోరెదను. ప్రసాద సుముఖుడవై ఓ బ్రాహ్మణ! నాకనుజ్ఞ యీదగుదు వనియె. అతడు విని యామె యందు మనసుగొని ఓ కళ్యాణి! కొలది నాళ్ళుండు మనియె. ఇట్లున్న తర్వాత నూరేండ్లు పైని జరిగినది. అతనితో నాతన్వి విషయము లనుభవించెను. అనుజ్ఞ దయ సేయుము. స్వర్గమునకు వెళ్ళెదనన నతడు వెండియు కొన్నాళ్ళు నిలువ మనియె. ఆమీద నూరేండ్లు పైగా గడువ నా చంద్రానన యల్లన నవ్వుచు ఓ బ్రాహ్మణ! దివమ్మున కేగెదనని వలపుమీర బలికెను. అది విని యమ్ముని యా విశాల నయనను జేతంకొని క్షణ ముండుము చిరకాల మైనది నిజమే. వెల్లుదువు గాని యనియె. ఆయన శాపమున కడలి యా పడతి కొంచే మించుమించుగా రెండు వందలేండ్లు కలిసి యుండెను.

గమనాయమహాభాగోదేవరాజ నికేతనమ్।

ప్రోక్తఃప్రోక్తస్తయాతన్వ్యా స్థీయతామిథ్యభాషత॥

తస్యశాపభయాద్భీతా దాక్షిణ్యేనచ దక్షిణా।

ప్రోక్తప్రణయభఙ్గార్తివేదినీ నజహౌమునిమ్॥

తయాచ రమత స్తస్య మహర్షేస్తదహర్నిశమ్।

నవంనవమభూత్ప్రేమమన్మథావిష్టచేతసః॥

ఏకదా త్వరయా యుక్తోనిశ్చక్రామోటజాన్మునిః।

నిష్క్రామన్తంచాకుత్రేతిగమ్యతే ప్రాహసాశుభా॥

ఇత్యక్త స్సతయాప్రాహ పరివృత్త మహాశ్శుభే।

సంధ్యోపాస్తింకరిష్యామి క్రియాలోపోఽన్యథాభవేత్॥

దేవేంద్ర! రాజధానికి వెళ్ళెదనని యామె యడుగనడుగ నాతండుండు ముండు మనుచుండెను. ఆ యప్సరః కాంత శాపమునకు భయపడి దాక్షిణ్యముచే (ముగమోలుముచే) దక్షిణ గావున సరళ స్వభావంగాన (నేర్పరితనం గాన) ప్రణయ భంగమయి నప్పుడు కలుగు బాధ నెఱింగినది గావున యమ్మునిని విడిచి పోదయ్యెను. రాత్రిందివము లామేతో విహరించు చుండ మన్మథావిష్ట చేతస్కుడగు నతనికి వలపెప్పటి కప్పుడు క్రొంగ్రొత్తగా జొచ్చెను. ఒకతఱి తొందరగొని యమ్ముని పర్ణశాల వెడలి పోవుచుండెను. ఆయపస్సరయీ యేగుట యెక్కడికని యడిగెను. ప్రొద్దుగ్రుంకు చున్నది సంధ్యవార్చి కొందును. లేదేని గర్మలోప మగును.

తతఃప్రహస్యసుదతీసాతంప్రాహమహామునిమ్।

కిమద్యసర్వధర్మజ్ఞ పరివృత్తమహస్తవ॥

బహూనాంవిప్రవషాన్ ణాంపరిణామమహస్తవ।

గతమేతన్న కురు తేవిస్మయంకస్యకథ్యతామ్॥

అన విని, యా సురతి యల్లన నవ్వి ధర్మజ్ఞ! నీకిప్పుడా ప్రొద్దు గ్రుంకినది? ఓ విప్ర! అనేకేండ్లు నీకిట్లు ప్రొద్దు గ్రుంకినది. ఈ గడచిన దెవ్వరికి వింత గల్గింపదు? చెప్పుమన కండువు

కండురుడు:

ప్రాత స్త్వమాగతాభ ద్రేనదీతీర మిదంశుభమ్।

మయాదృష్టాచాతస్వజ్గీప్రవిష్టాచమమాశ్రమమ్॥

ఇయంహివర్తతేసంధ్యాపరిణామమహస్తవ।

అపహాసః కిమర్థోయంసద్భావః కథ్యతాంమమ॥

కండురుడు:

కళ్యాణి! నీవీయుదయమే యీ నదీ తీరమునకు వచ్చితివి. నాకు గన పడితివి. నా యాశ్రమముం జొచ్చితివి. ఇదిగో సంధ్యాకాల మయినది. పగలు గడచినది. ఎందులకే పరియాచకము! నాకు నీ మంచి యభిప్రాయము చెప్పుము.

ప్రమ్లోచ:

ప్రత్యూషస్యాగతాబ్రహ్మన్ సత్యమేతన్నతన్మృషా।

తద్వాద్గతస్య కాలస్యగతాన్యబ్దశతానితే॥

ప్రమ్లోచ:

బ్రాహ్మణుడ! వేకువనే నేను వచ్చిన దానను. ఇది నిజమే అబద్దము గాదు. ఆ విధముగా గడచినా కాలము నూర్లకొలది సంవత్సరముల గడచినవి.

సోముడు:

తతస్ససాధ్యసోవిప్రస్తాం ప ప్రచ్చాయతేక్షణామ్।

కథ్యతాంభీరుకఃకాలస్త్వయామేరమతస్సహ॥

సోముడు:

అన నావిప్రుడు సంభ్రమించి, యా విశాలక్షిని గని ఓ యబల! (భయ స్వభావ) నీతో నేను విహరించిన కాలమెంత?

ప్రమ్లోచ:

సప్తోత్తరాణ్యతీతానినవవర్షశతానిచ।

మసాశ్చషషట్తథైవాన్యత్సమతీతందినత్రయమ్॥

ప్రమ్లోచ:

తొమ్మిది వందల యేడు సంవత్సరముల ఆరు మాసముల మూడు రోజులైన దనెను.

కండురుడు:

సత్యంభీరువదస్వైతత్పరిహాసోఽథవాశుభే।

దినమే కమహంమన్యేత్వయాసార్ధమిహాస్థితమ్॥

కండురుడు:

ఇది నిజమా! పరిహాసమా చెప్పుము. నీతో నేనిచట నున్నది యొక్క దిన మనుకొను చున్నాను.

ప్రమ్లోచ:

వదిష్యామ్యనృతం బ్రహ్మాన్ కథమత్రతవాన్తికే।

విశేషేణాద్యభవథాపృష్టామార్గానువర్తినా॥

ప్రమ్లౌచ:

అబద్ద మోట్లాడుదును. అందును నీ దగ్గరనా? విశేషించి దారి ఏమాత్రము తప్పని తమరడుగు చుండగా నేనా యాసత్యము పల్కుట!

సోముడు:

నిశమ్యతద్వచస్తథ్యంసమునిర్ నృపనన్దనాః।

దిగ్దిఙ్మామిత్యతీవేత్థంనినిన్దాత్మానమాత్మనా॥

తపాంసినష్టానిహతం బ్రహ్మబ్రహ్మవిదాంధనమ్।

హృతోవివేకః కేనాపియోషిన్మోహాయనిర్మితా॥

ఊర్మిషట్కాతిగంబ్రహ్మజ్ఞేయమాత్మజయేనమే।

మతిరేషాహృతాయేనధిక్తంకామంమహాగ్రహమ్॥

వ్రతానివేదవేద్యాప్తికారణాన్యఖిలానిచ।

నరకగ్రామమార్గేణసంగేనాపహృతానిమే॥

వినిన్ధ్యేత్థంసధర్మజ్ఞస్స్వయమాత్మనమాత్మనా।

తామప్సరసమాసీనామిదంవచనమబ్రవీత్॥

గచ్చపాపేయథాకామంత్కార్యంతత్కృతంత్వయా।

దేవరాజస్యమత్ క్షోభంకుర్వన్త్యభావచేష్టితైః॥

సోముడు:

ఆమె పలుకు విని నిజ మనుకొని ఛీ! ఛీ! నేనెంత నింద్యుడనని తనను దానిందించు కొని, తపస్సులు నష్టము లయ్యె, బ్రహ్మవిదుల ధనము బ్రహ్మ(బ్రూణము) దెబ్బతిన్నది, నావివేక మెవ్వడో గాజేసెను. నన్ను మొహింపచేయ ఒక యాడుది ఎవ్వని చేతనో సృష్టింప బడ్డది. ఆత్మను జయించి (మనస్సును నిగ్రహించి) షడూర్ములకు నతీతమైన బ్రహ్మ వస్తువు నెఱుంగ వలసిన వాడను (షడూర్ములు= ఆకలి దప్పిక మోహము ముదిమి చావు) నా మతి దేన హరింప బడెనో యట్టి కామగ్రహము ఛీ చీయని నిందింప దగినది. వేద వేద్యమైన బ్రహ్మ వస్తువు నందింపగ హేతువునైన నా వ్రతము లన్నియు నరక గ్రామమునకు దారియైన సంగముచే నపహృతము లైనవి. అని యిట్లు ధర్మజ్ఞుడా ముని తనకు దానిందించుకొని యెదురు గూర్చున్న యాయప్సరసం గని యిట్లనియె. ఓ పాపురాల! పో నీ యిచ్చ వచ్చినట్లు పొమ్ము. నీ హావభావ విలాసముల నాకు క్షోభ గలుగజేసి దేవేంద్రున కేమేమి పని చేయ వచ్చితివో యంత సేసితివి.

నత్వాంకరోమ్యహంభస్మక్రోధతీవ్రేణవహ్నినా।

సతాంసప్తపదంమైత్రముషితోహంత్వయాసహ॥

అథవాతవదోషః కః కిమ్వాకుప్యామ్యహంతవ।

మమైవదోషోఽతితరాంయేనాహమజితేన్ద్రియః॥

యయాశక్రప్రియార్దిన్యాకృతోమత్తపసోవ్యయః।

త్వయాధిక్త్వాంమహామోహమాఞ్జూషాంసుజుగుప్సితామ్॥

యావదిత్థంసవిప్రర్షిస్తాం బ్రవీతిసుమధ్యమామ్।

తావద్గళత్స్వేదజలాసాబభూవాతివేపథుః॥

ప్రవేపమానాంసతదాస్విన్నగాత్రలతాంసతీమ్।

గచ్ఛగచ్ఛేతిసక్రోధమువాచామునిసత్తమః॥

కోప తీవ్రమైన యగ్నిచే నిన్ను నేను భస్మము సేయను. మైత్రి యనునది సత్పురుషునకు సప్త పదము (ఏడడుగులు కలిసి వేయుట లేక ఏడు మాటలు మాట్లాడుట వలన నేర్పడునది) నీతో నేనుంటిని. అదిగాక నీ తప్పేమీ? నీ యెడల కోప పడుచున్నాను. ఇది నాదే తప్పిదము. ఇంద్రియ నిగ్రహము లేని వాడను నేను. శక్రుని ప్రియముగోరి నా తపస్సు నశింప జేయబడినది. ఛీ ఛీ మహా మొహపేటిక, సర్వాసహ్యవయిన నీకు నిందయగు గాక!

అని యా విప్రర్షి యా రమణి నిట్లు పలుకునంత యామె యోడలెల్ల జెమట జాలువార మిగుల వణికి పోయెను. అట్లు వడంకుచు మెయిదగ జెమట గ్రమ్మ నిలిచిన దానింగని కినుకుతో నమ్ముని పోపోమ్మనెను.

సాతునిర్భత్సితాతేనవినిష్క్రమయతదాశ్రమాత్।

ఆకాశగామినీ స్వేదంమమార్జతరుపల్లవైః॥

వృక్షాద్దృక్షంయయౌబాలాతద గ్రారుణపల్లవైః।

నిర్మార్జమానాగాత్రాణిగలత్స్వేదజలానివై॥

ఋషిణాయస్తథాగర్భస్తస్యాదేహేసమాహితః।

నిర్జగామసరోమాఞ్చస్వేదరూపీతదఙ్గతః॥

తంవృక్షాజగగృహుర్గర్భమేకంచక్రేచమారుతః।

మయాచాప్యాయితోగోభిస్సతథావవృధేశనైః॥

వృక్షాగ్రగర్భసంభూతామారిషాఖ్యావరాననా।

తాంప్రదాస్యన్తివోవృక్షాః కోపఏషప్రశామ్యతామ్॥

ఆమె యట్లు బెదరింప బడి యయ్యాశ్రమము వెడలి ఆకాశ గమనమున నేగుచు చెట్లకెంజిగురున నొడలు దుడిచి కొనుచు చెట్టు నుండి చెట్టున కడుగు విడుచుచు బోయెను. ఆ ఋషిచే నామే యందేర్పడిన గర్భము (శిశువు) మెనూ గగుర్పొడువ చెమట రూపున నామే యోడలి నుండి బయలి వెడలెను. ఆ గర్భమును వృక్షములు చేబట్టినవి. వాయువేక మొనర్చెను. నాచే కిరణములచే నాప్యాయితమై యది వృద్ది నందెను. ఆ వృక్షాగ్ర గర్భ మందుండి మారిష యను నొక రమణి యుదయించెను. ఆమెను వృక్షములు మీకు గన్యగ నిచ్చును కావున శమింపుడు అని సోముడనెను.

కణ్దొరపత్యమేవం సావృక్షేభ్యశ్చసముద్గతా।

మమాపత్యంతతతావాయోః ప్రమ్లోచాతనయాచసా॥

సచాపిభగవాన్ కణ్డుః క్షీణేతపసిసత్తమః।

పురుషోత్తమాఖ్యమద్రీశం విష్ణోరాయతనంయయౌ॥

తత్రైకాగ్రమతిర్భూత్వాచకారారాధనంహరేః।

బ్రహ్మపారమాయంకుర్వన్ జపమేకాగ్రమానసః॥

ఊర్ధ్వభాహుర్మహాయోగీస్థిత్వాఽసౌభూపనన్దనాః॥

ఈ విధముగా కండువు సంతాన మయిన యా కన్య వృక్షముల నుండి వెడలినది నాకునిది కూతురు. వాయువునకును, ప్రమ్లోచకును. ఆ కుండు మహర్షి యట్లు తపస్సు క్షీణింప నడరి యందున్న పురుషోత్తమ మను విష్ణువు నాలయమున కేగి ఏకాగ్ర మతియై యూర్ధ్వబాహువై మహాయోగియై బ్రహ్మపారమును నీ స్తోత్రమును జపించుచు విష్ణు నారాధానము గావించెను. అన విని

ప్రచేతసులు:

బ్రహ్మపారంమునేశ్శ్రోతుమిచ్చామః పరమంస్తవమ్।

జపతాకణ్డునాదేవోయేనారాధ్యతకేశవః॥

ప్రచేతసులు:

 విష్ణుపారమను పరమోత్తమ స్తవము విన కుతూహల పడుచున్నా మన సోముండిట్లా నతినిచ్చె.

సోముడు:

పారంపరం విష్ణుపారపారః పరః పరేభ్యః పరమార్ధరూపీ।

సబ్రహ్మపారః పరపారభూతః పరః పరాణామపిపారపారః॥

సకారణంకారణతస్తతోపితస్యాపిహేతుః పరహేతుహేతుః।

కార్యేషుచైవం సహకర్మాకర్తృరూపైరషేషైరవతీహసర్వమ్॥

బ్రహ్మప్రభుః బ్రహ్మ ససర్వభూతో బ్రహ్మప్రజానాంపతిరచ్యుతోఽసౌ।

బ్రహ్మాక్షరంనిత్యమజంవిష్ణురపక్షయాద్యైరఖిలైరసంగి॥

బ్రహ్మాక్షరమజంనిత్యం యదాఽసౌపురుషోత్తమః।

తదారాగాదయోదోషాః వ్రయాన్తుప్రశమంమమ॥

సోముడు (బ్రహ్మపార స్తవము):

శ్రీవిష్ణు భగవానుడు సంసార మార్గమునకు పునరావృత్తి శూన్యమగు పరమావది యైనవాడు. లేక గురు పరంపరచే దెలియ నగు రహస్య వస్తువైన వాడును, తెలియరాని యంతము ఉత్కృష్టములు నేనంబడు ఆకాశాదుల కుంటె కూడా నుత్కృష్టుడును సత్య స్వరూపుడును లేక ఆనంద స్వరూపుడును వేదము తపస్సులతో నొప్పు వారిచే ప్రాప్తమైన వాడును, అనాత్మ ప్రపంచమునకు నవధియైన వాడును, ఆత్మగా తోచు నింద్రియములకు గోచరించు వాడును స్వభక్తులను పాలించు వాడును వారికి నభీప్సిత వరములచే పూరకుడును లేక లోక పాలకులు గనున్న యింద్రాదులకు గూడ పాలకుడును నభీప్సిత వూరకుడును కారణమునకు గూడ కారణమైన వాడును సృష్టికి మూలమైన భూత పంచకమునకు కారణమైన పంచ తన్మాత్రలకు కూడ కారణమైన వాడును పరము (అహంకారము) నకు కారణమైన మహాత్తత్త్వమునకు గూడ కారణమైన ప్రకృతి రూపుడు. అనగా సమస్తమునకు ప్రధాన కారణము. మహదాది దేహాన్తకార్య ప్రపంచము నందు కర్మ రూపుడు గను కర్తరూపుడుగను నుండి సర్వాత్మకుడై సర్వమును రక్షించు వాడునై యున్నాడు. ఆ విష్ణువే వేద నిర్వాహకుడు. వేదమే అతడు. సర్వము తానై సర్వభూత పాలకుడగును. అతడు సర్వభూత వివర్త మగుటచే స్వరూపచ్యుతి (నాశము) లేక పోవుటచే నచ్యుతుడు అవ్యయుడు నిత్యుడు వ్యాపకుడు అజుడు ననబడును. అపక్షయాదులతో సంబంధము లేని యా పురుషోత్తముడు పరబ్రహ్మయే తదనుస్మరణచే నాకు రాగద్వేషాది సమస్త దోషములు శాంతించు గాక!

పారంపర = సంసారము యొక్క పరమావధి లేక గురు సంప్రదాయముగా తెలియబడు రహస్యము, అపారపారః = అందుకోరాని అవధి గలవాడు, పరేభ్యఃపారః = ఆకాశాది భూతములు పరములు వాని కంటె మీది వాడు. పరమార్ధ రూపీ = సత్య స్వరూపుడు (మోక్ష రూపుడన్నమాట) సత్తు చిత్తు ఆనందము ననువాని రూపము పరబ్రహ్మ. బ్రహ్మపారః = బ్రహ్మ వేదము లేక తపస్సు అవి గలవారిచే పొందదగిన పారము గలవాడు. పరపారభూతః = పరము = ఆత్మగా నిదంతయు దానికి పారః = అవ్వాలి వాడు దృశ్యాత్మక జగత్తునకు సాక్షి యన్న మాట. పరఃపరాణామాపి = ఆత్మగా భావింప బడెడి యింద్రియాదులకు పరుడు (గోచరము గానివాడు) పారపారః పార = భగవద్భక్తులకు (పరస్య భగవంత సంబంధి పారః) పారః పూరకుడు పాలకుడు. సః = ఆ విష్ణువు, కారణతః = కారణము కంటె కారణం కారణ మయిన వాడు, తతోఽపి = సృష్టి కారణ ములయిన భూత పంచకమునకు కారణమైన పంచ తన్మాత్రలకు కూడ కారణము. పరహేతుహేతుః పరమహ త్తత్వము (బుద్ది) దానికి హేతుః = ప్రకృతి దానికిని హేతువు. కార్యేషుచ = కార్య ప్రవాచము లందు (మహాదాది దేహాంతములయిన వానియందు) సఃకర్మకర్తరూపైః అశేషః = కర్మ = కర్మ రూపము కర్త రూపము లన్నితితోను ఇహ = విశ్వమందు. సర్వం = అంతనూ, అవతి = రక్షించు చున్నవాడు. సః = ఆ పరమాత్మ, బ్రహ్మప్రభుః = వేదములకు సఃస్రహ్మచ = వేదరూపుడు గూడ, సర్వభూతః = సర్వము యైనవాడు, ప్రజానాంపతిః = ప్రజా పాలకుడు, అచ్యుత = చ్యుతి లేనివాడు (నివర్త రూపచ్యుతి లేని వాడన్నమాట), అవ్యయః నిత్యః = నిత్యుడు, అజః = అపక్షయాది షడ్భావ వికారములు అనగా, అస్తి = ఉండును, జాయతే = పుట్టును, వర్ధతే = పెరుగును, పరిణమతే = రూపాంతర మందును, అవక్షీయతే = తఱగును, నశ్యతే = నశించును అను నారు వికారములతో సంబంధము లేని అసంగి.

సోముడు:

ఏతద్బ్రహ్మపరాఖ్యంవైసం స్తవంపరమంజపన్।

అవాపపరమాంసిద్దిససమారాధ్యకేశవమ్॥

(ఇమంస్తవంయఃపఠతిశృణుయాద్వాపిమిత్యశః।

సకామదోషైరఖిలైః ముక్తఃప్రాప్నోతివాఞ్చితమ్)॥

ఇయంచామారిశాపూర్వమాసీద్యాతాం బ్రవీమివః।

కార్యగౌరవమేతస్యాఃకథనేఫలదాయివః॥

అపుత్రాప్రాగియంవిష్ణుంమృతేభర్తరిసత్తమాః।

భూపపత్నీమహాభాగాతోషయామాసభక్తితః॥

తయాచారాధితోవిష్ణుః ప్రాహప్రత్యక్షతాంగతః।

వరంవృణీష్యేతిశుభంసాచాప్రాహాత్మవాఞ్చితమ్॥

భగవాన్ బాలవై ధవ్యాద్వ్రుదాజన్మాహమీదృశీ।

మన్దభాగ్యసముద్భూతవిఫలాచజగత్పతే॥

భవన్తుపతయశ్శ్లాఘ్యామమజన్మనిజన్మని।

త్వత్ప్రసాదా త్తతాపుత్రః ప్రజాపతినమోస్తుమే॥

రూపసంవత్సమాయుక్తాసర్వస్యప్రియదర్శ నా।

అయోనిజాచజాయేయంత్వత్ప్రసాదదోక్షజ॥

తయైవముక్తోదేవేశోహృషీ కేశ ఉవాచతామ్।

ప్రణామనమ్రాముత్థాప్యవరదస్సముపస్థితః॥

భవిష్యన్తిమహావీర్యా అన్యస్మిన్నేవజన్మని।

ప్రఖ్యాతోదారకర్మాణోభవత్యాః పతయోదశ॥

పుత్రంచసుమహాత్మానమతివీర్యపరాక్రమమ్।

ప్రజాపతిగుణైర్యుక్తంత్వమేవాప్స్యసిశోభనే॥

వంశానాంతస్యకర్ తృత్వంజగత్యస్మిన్ భవిష్యతి।

త్రైలోక్యమఖిలాసూతి స్తస్యచాపూరయిష్యతి॥

త్వంచాప్యయోనిజాసాధ్వీరూపౌదార్యగుణాన్వితా।

మనః ప్రీతికరీనౄణాంమత్ప్రసాదాద్భవిష్యసి॥

ఇత్యుక్త్వాఽన్తర్దధేదేవస్తాంవిలోలవిలోచనామ్।

సాచేయంమారిశాజాతాయుష్మత్పత్నీ నృపాత్మజాః॥

ఈ బ్రహ్మపారస్తవము జపించుచు కండుముని హరి నర్చించి పరమ సిద్ది నందెను. ఈ స్తవము నిత్యము పఠించు వినునాతడు కామ దోషముల నుండి విడివడి యభీష్టము నందును.

సోముడు (మారిష వృత్తాంతము):

ఈ మారిషయను కన్య యొక్క కార్యగౌరవ మేను దెల్పెద. ఇది మీకు మంచి ఫలమిచ్చును. మున్నీమే యొక రాజపత్ని. పుత్ర సంతానము లేక భర్త గతింప భక్తితో విష్ణు నారాధించెను. దాన విష్ణువామెకు బ్రత్యక్ష మయ్యెను. వరమడుగు మనెను. ఆమె స్వామీ! బాలవైధవ్య వ్యధకు లోనైన దానను. అభాగ్యను. నా జన్మ విఫల మైనది. నీ ప్రసాదమున నాకు గొని యాడదగిన వారు ప్రతి జన్మ మందు భర్తలగుదురు గాక! నీ యనుగ్రహమున కొడుకును గల్గుగాక! అతడు ప్రజాపతుల వంటివాడు గావలయును. రూప సంపద గల్గి సర్వ జగమ్మునకు బ్రియదర్శినివై యయోనిజవై నీ యనుగ్రహమున నేను జన్మింప వలయునని వ్రాలి ప్రణామము సేయ నామెను లేపి వరదుడు హరి యిట్లనియె. మహావీర్యులు మహోదర కార్య నిర్వాహకులు పదిమంది మరియొక జన్మమందు నీకు భర్త లగుదురు. అతివీర్య పరాక్రమ శాలిని ప్రజాపతి గుణ సంపన్నుని మహాత్ముని పుత్రుని గూడ నీవు గాంతువు. ఈ జగమ్మున ననేక వంశముల కాతడు కర్తయగును. అతని సంతతి ముల్లోకములును నింప గలదు. నీవయోనిజవు సాధ్విని రూపౌదార్య గుణ శాలివియునై నా ప్రసాదముచే మానవులకు మనః ప్రీతి గూర్చు దానవయ్యెదవు. అని యా కలికిం గూర్చి పలికి యంతర్ధాన మందెను. ఆమె యా మారిష నీకు భార్య యైనది.

శ్రీపరాశరుడు:

తతస్సోమస్యవచనాజ్జగృహుస్తేప్రచేతసః।

సంహృత్యకోపంవృక్షేభ్యః పత్నీంధర్మేణమారిషామ్॥

దశభ్యస్తుప్రచేతోభ్యోమారిషాయాంప్రజాపతిః।

దక్షోజజ్ఞేమహాభాగోయః పూర్వం బ్రాహ్మణోభవత్॥

సతుదక్షోమహాభాగాస్సృష్ట్యర్ధంసుమహామతే।

పుత్రానుత్పాదయామాసప్రజాసృష్ట్యర్ధ మాత్మనః॥

అవరాంశ్చవరాంశ్చవద్విపదోథచతుష్పదః।

ఆదేశం బ్రహ్మణఃకుర్వాన్స్రష్టృత్వేసమస్థితః॥

ససృష్ట్వమనసాదకక్షః పఞ్చశదసృజత్ స్త్రియః॥

దదౌసాడషాదర్మాయకాశ్యపాయత్రయోదశ।

కాలస్యనయనేయుక్తాస్సప్తవింశతిమిన్దవే॥

తాసుదేవాస్తథాదై త్యానాగాగావస్తథాఖగాః।

గన్దర్వాప్సరసశ్చైవదానవాద్యాశ్చజజ్ఞిరే॥

తతఃప్రభృతిమైత్రేయప్రజా మైథునసంభావాః।

సంకల్పాద్దర్శనాత్ స్పర్శాత్పూర్వేషామభవన్ ప్రజాః॥

తపోవిశేషైస్సిద్ధానంతదాద్యన్తతపస్వినామ్॥

శ్రీపరాశరుడు:

అంతట నా సోముని మాట ననుసరించి ప్రచేతసులు కోప ముపసంహరించి ధర్మ విదినామేను వృక్షముల నుండి గైకొనిరి. ఆమె యందు పదిమంది ప్రచేతసులకును బ్రజాపతి దక్షుడు మహానుభావుడు జనించెను. మున్నాయనయే బ్రహ్మ కుదయించి యుండెను. ఆ దక్షుడు సృష్టింబెంప గుమారులం గనెను. వారు కొందఱు శ్రేష్ఠులు కొందఱు తక్కువ వారు. ద్విపాదులు చతుష్పాదులు బ్రహ్మ నిదేశమును బాటించి వారింగని మనస్సుచే నేబది మందిని స్త్రీలనుం గనెను. అందు బదిమంది ధర్మునకు పదముగ్గురు కాశ్యపునికి కాల గమనమునకు చంద్రున కిరువది ఏడుగుర నొసంగెను. వారి యందు దేవతలు దైత్యులు నాగులు ఖగములు(పక్షులు) గంధర్వులు అప్సరసలు దానవాదులు జనించిరి. ఆ మీద నుండి ప్రజలు మైథున సంభవులైరి. ఆ ముందటి వారికి సంకల్పము దర్శనము స్పర్శ మాత్రమున సంతానము గల్గెడిది. ఆ కాలమున వారు మిగుల తపస్సులు తపో విశేష సిద్దులునై యుండిరి. కావున నట్లు జరిగినది.

మైత్రేయుడు:

అఙ్గుష్ఠాద్దక్షిణాద్దక్షఃపూర్వంజాతశ్శ్రుతోమయా।

కథంప్రాచేతసోభూయస్ససంభూతోమహామునే॥

ఏషమేసంశయోబ్రహ్మన్ సుమహాన్ హృదివర్తతే।

యద్దౌహిత్రశ్చసోమస్యపునశ్శ్వశురతాంగతః॥

మైత్రేయుడు:

కుడి బొటన వ్రేలినుండి దక్షుడు పుట్టెనని మున్ను విన్నాను. ఓ మహాముని! అతడు మఱి ప్రాచేతసుల కెట్లు జనించెను? ఈ సందియము నా హృదయ మందున్నది వారింపుము. సోమునికి దౌహిత్రుడైన వాడతడు మామ గారెట్లయ్యె?

శ్రీపరాశరుడు:

ఉత్పత్తిశ్చనిరోధశ్చనిత్యోభూతేషుసత్తమ।

ఋషయోత్రమమోహ్యన్తియేచాన్యేదివ్యచక్షుషః॥

యుగేయుగేభావన్త్యేతేదక్షాద్యామునిసత్తమ।

పునశ్చైవనిరుధ్యన్తేవిద్యాం స్తత్రనముహ్యతి॥

కానిష్ఠ్యంజ్యైష్ఠ్యమప్యేషాంపూర్వంనాభూద్ద్విజోత్తమ।

తప ఏవగారీయోభూత్ప్రభావశ్చైవ కారణమ్॥

శ్రీపరాశరుడు:

ఓ మునిసత్తమ! భూతముల యందు పుట్టుట గిట్టుట అనునది నిత్యము. మునులు మఱి దివ్య దృష్టిగల మహానుభావులు గూడ యిందు బొర బడుదురు. ఈ దక్షాదులు యుగ యుగమున గలుగు చుందురు. మఱి పోవు చుందురు. జ్ఞాని యందు మొహమొందడు. ఓ విప్రోత్తమ! మునుపు వీరుకి పెద్ద చిన్న భేదము లేదు. తపస్సు, ప్రభావమే యీ పెద్దరిక మునకు చిన్నరికమునకు గారణ మయి యుండెడిది.

శ్రీమైత్రేయుడు:

దేవానాందానవానాంచగన్ధర్వోరగరక్షసామ్।

ఉత్పత్తింవిస్తరేణేహమమబ్రహ్మన్ ప్రకీర్తయ॥

మైత్రేయుడు:

దేవ దానవ గాంధర్వ నాగ రక్షస్సుల యుత్పత్తిని విస్తరముగ నిపుడానతిమ్మన

శ్రీపరాశరుడు:

ప్రజాస్సృజేతివ్యాదిష్టః పూర్వందక్షస్సృయంభువా।

యథాససర్జభూతానితథాశృణుమహామతే॥

మనసాత్వేవభూతానిపూర్వందక్షోఽసృజత్తదా।

దేవానృషీన్ సగంధర్వానసురాన్ పన్నగాంస్తథా॥

యదాస్యసృజ్యమానస్యనవ్యవర్ధన్తతాఃప్రజాః।

తతస్సంచిన్త్యసమునిః సృష్టిహేతోః ప్రజాపతిః॥

మైథునేనివధర్మేణసిసృక్షువిధాఃప్రజాః।

అసిక్నీ ముపయేమేఽథవీరణస్యప్రజాపతేః॥

సుతాంసుతపసాయుక్తాంమహతీంలోకధారిణీమ్॥

అథపుత్రాసహస్రాణివైరణ్యాంపఞ్చవీర్యవాన్।

అసిక్న్యాంజనయామాససర్గహేతోఃప్రజాపతిః॥

శ్రీపరాశరుడు:

బ్రహ్మ దక్షునిం గని ప్రజలను సృజింపు మన నాతడెట్లు సృజించెనో వినుము. మనసు చేతనే భూతముల నాతడు తొల్త సృజించెను. వారు దేవర్షి గాంధర్వ సుర పన్నగులు. దాన ప్రజావృద్ది కాదయ్యెను ఆమీద నా ప్రజాపతి యాలోచించి మైథున ధర్మముచే ప్రజా సృష్టింబెంప నెంచి వీరణ ప్రజాపతి కూతురు నసిక్ని యనునామెం గ్రహించెను. ఆమె మహా తపస్విని. లోక ధారిణియును. ఆమె యండత దైడువేల మందిని మంచి బలశాలురైన గుమారులం గనెను.

తాన్ దృష్ట్వానారదోవిప్రసంవివర్ధయిషూన్ ప్రజాః।

సంగమ్యప్రియసంవాదోదేవర్షిరిదమబ్రవీత్॥

హేవర్యశ్వామహావీర్యాః ప్రజాయూయంకరిష్యథ।

ఈదృశోలక్ష్యతేయత్నో భవద్భిః శ్రూయతామిదమ్॥

బాలిశాబతయూయంయేనాస్యాజానీథవైభువః।

అన్తరూర్ ధ్వమథశ్చైవకథంస్రక్ష్యథవైప్రజాః॥

ఊర్ధ్వంతిర్యగధశ్చైవయథాప్రవిహతాగతిః।

తథాకస్మాద్భువోనాన్తంసర్వేద్రక్ష్యథబాలిశాః॥

తేతుతద్వచనంశ్రుత్వాప్రయాతాస్సర్వతోదిశమ్।

అద్యాపిననివర్త న్తేసముద్రేభ్యఇవాపగాః॥

హర్యశ్వేష్వ ధనష్టేషుదక్షః ప్రాచేతసః పునః।

వైరిణ్యామథపుత్రాణాంసహస్రమసృజత్ప్రభుః॥

వివర్ధయిషవస్తేతుశబలాశ్వాః ప్రజాః పునః।

పూర్వోక్తంవచనంబ్రహ్మన్ నారదేనప్రచోదితాః॥

అన్యోన్యమూచుస్తేసర్వేసత్యమాహమాహామునిః।

భ్రాతౄణాంపదవీచైవగన్తవ్యానాత్రసంశాయః॥

జ్ఞాత్వాప్రమాణంపృథ్వ్యాశ్చప్రజాస్స్రక్ష్యామహేతతః।

తేఽపితేనైవమార్గేణప్రయాతాస్సర్వతోదిశమ్॥

అద్యాపిననివర్త న్తేసముద్రేభయఇవాపగాః॥

తతఃప్రభృతివై భ్రాతాభాతురన్వేషణేద్విజ।

ప్రయాతోనశ్యతితథాతన్నకార్యంవిజానతా॥

సంతాన వృద్దింగావింప నున్న వారింగని నారదుడిచ్చక ములాడి యా దేవర్షి, ఓ హర్యశ్వులార! మహా వీరులార! మీరు సంతానాభి వృద్ది చేయనున్నారు. మీ ప్రయత్నము దెలిసినది. మీరిది వినుడు. మీరందరు బాలిశులు(స్థాబ్దులు, శిశువులు) ఈ భూమి యడుగు మీరేమో యెఱుగరు. మీరు పిల్లల నెట్లుగందురు? మీరీ భూమి యొక్క క్రిందు మీదులు దీని యంతును అప్రతిహత గతినెఱింగి చూచి రండు. అన వారామాట విని నలుదేసల కుంబోయిరి. సముద్ర గాములయిన నదులట్లు వారింత వరకు తిరిగి రానేలేదు. అట్లా హర్యశ్వులు పోవ ప్రాచేతసుడు మఱియు వైరిణి యందు వేయి మందిని సృజించెను. బలాశులను పేరివారు వారు సృష్టింబెంప బూనినంత నారదుని ప్రేరణచే నొండొరులు “మహా ముని యీయన నిజ మాడెను. మనమన్నల దారినే పొడగును. సంశయము లేదు. భూమి యొక్క ప్రమాణ మెరింగి ప్రజలను సృజింతము అని వారు నదే దారిని నలుదెసల కుంబోయిరి. సముద్ర గాములయిన నదులట్లు తిరిగి రానేలేదు. అప్పటి నుండి అన్నను వెదక బోయిన తమ్ముడు నశించును. ఇందు విమర్శింప బనిలేదను న్యాయ మేర్పడెను.

తాంశ్చాపినష్టాన్విజ్ఞాయపుత్రాన్ దక్షఃప్రజాపతిః।

క్రోధంచక్రేమహాభాగోనారదంతమషశాపచ॥

సర్గాన్ కామస్తతోవిద్వాన్ సమైత్రేయప్రజాపతిః।

షష్టిందక్షోఽసృజత్క న్యావైరణ్యామితినశ్శ్రుతమ్॥

దదౌసదశధర్మాయకాశ్యపాయత్రయోదశ।

సప్తవింశతిసోమాయచతస్రోఽరిష్టనేమినే॥

ద్వేచైవబహుపుత్రాయద్వేచైవాంగిరసేతథా।

ద్వేభృశాశ్వాయవిదుషేతాసాంనామానిమేశృణు॥

అరున్ధతీవసుర్జామీలజ్ఘాభానుర్మరుద్వతీ।

సంకల్పాచముహూర్తాచసాధ్యావిశ్వాచభామినీ॥

ధర్మపత్న్యోదశత్వేతాస్తాస్వపత్యానిమేశృణు॥

విశ్వేదేవాస్తువిశ్వాయాస్సాధ్యాన్వ్యజాయత।

మరుద్వత్యాంమరుత్వన్తోవసోస్తువసవస్సుతాః॥

ముహూర్తాస్తు ముహూర్తాయాంజాతాభానోస్తుభానవః॥

లజ్ఘయాస్తుసుతో ఘోషోనాగవీధిస్తుజామిజః॥

పృథివీ విషయం సర్వమరున్ధత్యామజాయత।

సంకల్పాయంతు సర్వాత్మాజజ్ఞే సంకల్ప ఏవచ॥

యేత్వనేకవసుప్రాణాదేవాజ్యోతిః పురోగమాః।

వసవోఽష్టౌ సమాఖ్యాతాస్తేషాంవక్ష్యామి విస్తరమ్॥

ఆపోధ్రువశ్చ సోమశ్చ ధర్మశ్చైవానిలోనలః।

ప్రత్యూషశ్చప్రభాసశ్చవసవోనామభిస్సృతాః॥

దక్షుడు వారుంబోయిరని తెలిసి కోపముం గొని నారదుని శపించెను. మైత్రేయ! ఆ మీద ప్రజాపతి సృష్టిం గోరి వైరిణి యందు అరువది మంది కన్యలం గనెనని మేము విందుము. అందు పది మందిని ధర్మునకు, కాశ్యపునకు బదముగ్గురును, నిరవది యేడుగురను సోమునికి, అరిష్టనేమికి నల్గురన, ఇద్దరిని బహు పుత్రునికి, ఇద్దరి నంగిరసునకు, నిద్దరిని భ్రుశాశ్వునకు నిచ్చెను. వారి పేరులివి. అరుంధతి, వసువు, జామిలంఘ, భానువు, మరుద్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్యవిశ్వ వీరు పది మంది ధర్ముని భార్యలు. వారి సంతానము విశ్వదేవులు విశ్వకు, సాధనకు సాద్యులు, మరుద్వతికి మరుద్వంతులు, వసువునకు వసువులు, ముహూర్తకు ముహూర్తులు, భానునకు భానువులు, లంఘకు ఘోషుడు, జామికి నాగవీథి, అరుంధతికి పృథివీ విషయమైన సర్వము, సంకల్పకు సంకల్పుడు నుదయించిరి. జ్యోతిః, ప్రభృతులు అనేక వసు ప్రాణులు వసువు లెనమండుగురు. వారి వంశ విస్తర మెరిగించెద. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధర్ముడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అను వారు వసువులు.

ఆపస్యపుత్రోవైస్తబ్దశ్శ్రమశ్శ్రాన్తోధునిస్తాథా।

ధ్రువస్యపుత్రో భగవాన్ కాలోలోక ప్రకాలనః॥

సోమస్య భగవాన్ వర్చావర్చ స్వీయేన జాయతే॥

ధర్మస్య పుత్రో ద్రవిణోహుతహవ్యవహస్తథా।

మనోహరాయశ్శిశిరః ప్రాణోఽథరమణస్తథా॥

అనిలస్య శివాభార్యతస్యాః పుత్రః పురోజవః।

అవిజ్ఞాతగతిశ్చైవద్వౌపుత్రావనిలస్యతు॥

అగ్నిపుత్రః కుమారస్తుశరస్తమ్బేవ్యజాయత।

తస్యశాఖోవిశాఖస్చనైగమేషశ్చపృష్ఠజాః॥

అపత్యంకృతికానాంతు కార్తికేయ ఇతిస్మృతః॥

ప్రత్యూషస్యవిదుః పుత్రమృషింనామ్నాతుదేవాలమ్।

ద్వౌపుత్రౌదేవలస్యాపిక్షమావన్తౌమనీషిణౌ॥

బృహస్పతేస్తుభగినీవరస్త్రీ బ్రహ్మచారిణీ।

యోగసిద్ధాజగత్కృత్య్న మసక్తావిచరత్యుత॥

ప్రభాసస్యతుభార్యాసావసూనామష్టమస్యహ॥

విశ్వకర్మామహోభాగస్తస్యాంజజ్ఞేప్రజాపతిః।

కర్తాశిల్పసహస్రాణాంత్రిదశానాంచవర్దకిః॥

భూషాణానాంచ సర్వేషాం కర్తాశిల్పవతాంవరః।

యస్సర్వేషాంవిమానానిదేవాదీనాంచకారహ॥

మనుష్యాశ్చోపజీవన్తియస్య శిల్పం మహాత్మనః॥

ఆపుని కొడుకులు స్తబ్ధుడు శ్రముడు శ్రాన్తుడు దుని యనువారు. ధ్రువుని కొడుకు కాల భగవానుడు. ఆయన లోక ప్రకాలనుడు. లోకము యొక్క లెక్కగట్టు వాడన్న మాట. సోముని కొడుకు వర్చుడు. వాని కొడుకు వర్చస్వి. ధర్ముని కొడుకు ద్రవిణుడు హుతహవ్య వరుడును. మనోహర యొక్క కొడుకు శిశిరుడు ప్రాణుడు రమణుడు ననువారు. అనిలుని భార్య శివ, కొడుకు పురోజవుడు, అతని వెనుక శాఖుడు విశాఖుడు నైగామేషుడు ననువారు పుట్టిరి. కృత్తికల బిడ్డ కార్తికేయుడు. ప్రత్యూషుని కొడుకు దేవలుడను ఋషి. దేవలుని కొడుకు లిద్దరు. వారు క్షమావంతులు (ఓరిమి గలవారు), మనీషులును (బుద్ది మంతులు). బృహస్పతి చెల్లెలు బ్రహ్మచారిణి యోగ సిద్దురాలు దేని యందు ఆసక్తి లేక (విరక్తయై) ఎల్ల జగమ్ముల గ్రుమ్మరు చుండెను. ఆమె వసువలలో నెనిమిదవ వాడగు ప్రభాసుని భార్య. ఆమె యందు విశ్వకర్మయను ప్రజాపతి శిల్ప సహస్రకర్త దేవతల వడ్రంగి సర్వ భూషణములు చేయువాడు శిల్ప శిరోమణి. దేవతల విమానముల నిర్మించిన వాడాతడు. ఆయన శిల్పమును అనుసరించి శిల్పులై మనుష్యులు జీవనము సేయుచున్నారు.

అజైకపాదహిర్భుధ్నస్త్వష్టారుద్రశ్చబుద్దిమాన్।

త్వష్టుశ్చాప్యాత్మజఃపుత్రోవిశ్వరూపోమహాతపాః॥

హరశ్చబహురూపశ్చత్యంభాకశ్చాపరాజితః।

వృషాకశిశ్చశంభుశ్చకపర్దీరైవతస్తథా॥

మృగవ్యాధశ్చశర్వశ్చకపాలీచ మహామునే।

ఏకాదశై తేకథితారుద్రాస్త్రిభువనేశ్వరాః॥

శతంత్వేకంసమామ్నాతంరుద్రాణామమితౌజసామ్।

కాశ్యపస్యతుభార్యారాస్తాస్తాంనామానిమేశృణు॥

అదితిర్దితరనుశ్చివహ్యరిషాసురసాకషా।

సురభిర్వినతాచైవతామరాక్రోధవశాఇలా॥

కద్రూఃమునిశ్చధర్మజ్ఞతదపత్యానిమేశృణు॥

పూర్వమన్వన్తరే శ్రేష్ఠాద్వాదశాసన్ సురోత్తమాః।

తుషితానామతేఽన్యోన్యమూచుర్వైవస్వతేఽన్తరే॥

ఉపస్తితేఽతియశసశ్చాక్షుషస్యాన్తరేమానోః।

సమవాయీక్రుతాస్సర్వే సమాగమ్యపరస్పరమ్॥

ఆగచ్చతాద్రుతందేవాఆదితింసంప్రవిశ్యవై।

మన్వన్తరే ప్రసూయామస్తన్న శ్శ్రేయోభవేదితి॥

ఏవముక్త్వాతు తేస్వర్వే చాక్షుషస్యాన్తరేమనోః।

మారీచాత్ కాశ్యపాజ్జాతాస్తేఽత్యాదక్షకన్యయా॥

తత్రవిష్ణుశ్చశాక్రశ్చజజ్ఞాతెపునారేవహి।

అర్యమాచై వధాతాచత్వాష్టాపూషాతథైవచ॥

అజైకపాత్తు అగిర్భుధ్నుడు. త్వష్ట విశ్వరూపుడు హరుడు బహురూపుడు త్ర్యంబకుడు వృషాకపి శంభువు కపర్ది దైవతుడు మృగవ్యాధుడు శర్వుడు కపాలి యనువారు. వీరేకాదశ రుద్రులు త్రిభువనేశ్వరులు కాశ్యపునికి భార్య యందు నూరుగరు రుద్ర సంతతి గల్గిరి. అదితి దితి దనువు అరిశా సురస కష సురభి వినత తామ్ర క్రోధవశ ఖలా కద్రువు ముని అనువారు కాశ్యపుని భార్యలు. చాక్షుష మన్వంతరము రాగా వీరరొండొరులు మనువునకు సంబంధింప బడిరి. దేవతలారా అదితిని జొచ్చి చాక్షుష మన్వంతరములో సంతతిగా పుట్టుదము. దాన మనకు శేయస్సు కల్గునని పిలిచికొని మరీచి కొడుకగు కాశ్యపుని వలన దక్ష కన్య యగు నదితి యందు దేవతలు పుట్టిరి. అందు విష్ణువు ఇంద్రుడు మఱల జన్మించిరి. అర్యముడు దాత త్వష్టపూష.

వివస్వాన్ సవితాచై వమిత్రోవరుణఏవచ।

అంశుర్భగశ్చాతితేజా ఆదిత్యా ద్వాదశస్మృతాః॥

చాక్షుషస్యాన్తరేపూర్వమాసన్ యేతుషితాస్సురాః।

వైవస్వతేఽన్తరేతేవై ఆదిత్యాద్వాదశస్మృతాః॥

యాస్సప్తవింశతిఃప్రోక్తాస్సోమపత్న్యోఽతసువ్రతాః।

తసామపత్యాన్యభవన్ దీప్తిమన్త్యతితేజసామ్॥

అరిష్టనేమిపత్నీ నామపత్యా నీహాషోడశ॥

బహుపుత్రస్యవిదుషశ్చత స్రోవిద్యుతస్సతాః॥

ప్రత్యన్గిరసజా శ్రేష్టాఋచో బ్రహ్మర్షిసత్కృతాః॥

భృశాశ్వస్యతు దేవర్షేః దేవప్రహరణాస్సుతాః॥

ఏతేయుగ సహస్రా న్తేజాయన్తేపున రేవహి।

సర్వేదేవగణాస్తత్రత్రయస్త్రింశత్ స్వఛన్ధజాః॥

తేషామపీహసతతంనిరోదోత్పత్తిరుచ్యతే॥

యథాసూర్యస్యమైత్రేయ ఉదయాస్తమయావిహ।

ఏవందేవనికాయాస్తేసంభవన్తియుగే యుగే॥

దిత్యాఃపుత్రద్వయంజజ్ఞేకాశ్యపాదితినశ్శ్రుతమ్।

హిరణ్యకశిపుశ్చై వహిరణ్యాక్షశ్చదుర్జయః॥

వివస్వంతుడు సవిత మిత్రుడు వరుణుడు అంశువు భగుడు అతి తేజుడు ననువారు వారే ద్వాదశాదిత్యులు. చాక్షుష మన్వంతరమున తుశితులను దేవతలు వైవస్వత మన్వంతరమున ద్వాదశాదిత్యు లయిరి. సోముని భార్య లిరువది ఏడుగురు సువ్రతలు. వారికి తేజో వంతమయిన సంతానము గల్గినది. అరిష్టనేమి పత్నులు సంతానము పదునార్గురు. బహుపుత్రుడు జ్ఞాని ఆయన కొడుకులు విద్య్త్తులను వారు నల్గురు. ప్రత్యంగిరుని కొడుకులు బ్రహ్మర్షి పూజితులు ఋక్కులు దేవర్షియగు భృశాశ్వుని కొడుకులు దేవ ప్రహారణులు. వీరు వేయి యుగముల తర్వాత మరల జనింతురు. ముప్పది మూడు దేవ గణముల వారు వారు స్వచ్చందజులు. వారి సంతానమును నిరోధమును చెప్పెద సూర్యుని కుదయాస్తమయము లట్లు దేవతలును యుగయుగము లందు బుట్టు చుందురు. కాశ్యపుని వలన దితికిద్దరు కొడుకులు పుట్టిరని విందుము. వారు హిరణ్య కశిపుడు. హిరణ్యాక్షుడును.

సింహికాచాభావత్కన్యావిప్రచిత్తేః పరిగ్రహః।

హిరణ్యకషిపోఃపుత్రాశ్చత్వారః ప్రథితౌజసః॥

అనుహ్లాదశ్చహ్లాదశ్చప్రహ్లాదశ్చైవధర్మవాన్।

సంహ్లాదశ్చమహావీరాదైత్యవంశవివర్ధనాః॥

తేషాంమధ్యేమహాభాగాస్సర్వత్రసమదృగ్వశీ।

ప్రహ్లాదఃపరమాంభక్తింయఉవాహజనార్దనే॥

దైత్యేన్ద్రదీపితో వహ్నిస్సర్వాఙ్గోపచితోద్విజ।

నదదాహచాయంపూర్వంవాసుదేవేహృదిస్థితే॥

మహార్ణవాన్తస్సలిలస్థితస్యచలతోమహీ।

చచాలసకలా యస్యపాశబద్దస్యధీమతః॥

నభిన్నంవివిధై శ్శస్రైర్యస్యదైత్యేన్ద్రపాతితైః।

శరీరమాద్రికఠినైస్సర్పత్రాచ్యుత చేతసః॥

విషానలోజ్జ్వలముఖాయస్యదైత్యప్రచోదితాః।

నాన్తాయసర్పపతాయోబభూవురురుతేజసః॥

శైలైరాక్రాన్తదేహోపియస్స్మన్ పురుషోత్తమమ్।

తత్యాజనాత్మనః ప్రాణాన్ విష్ణుస్మరణ దంశితః॥

పతన్తముచ్చాదవనిర్యముపేత్యమహామునిమ్।

దధారదైత్యపతినాక్షిప్తంస్వర్గనివాసినా॥

యస్యసంశోషకోవాయుర్దే హేదైత్యేన్ద్రయోజితః।

అవాపసంక్షయంసద్యశ్చిత్తస్థేమధుసూదనే॥

విషాణభఙ్గనుద్యుక్తామదహానించదిగ్గజాః।

యస్యవక్షాస్థ్సలేప్రాప్తాదైత్యేన్ద్రపరిణామితాః॥

యస్యచోత్పాదితాకృత్యాదైత్యరాజపురోహితైః।

బభూవనాన్తాయపురాగోవిన్దాసక్తచేతసః॥

శమ్భరస్యచామాయానాంసహస్రమతియాయినః।

యస్మిన్ ప్రయుక్తంచాక్రేణకృష్ణస్య వితథీకృతమ్॥

దైత్యేన్ద్రసూదోపహృదంయశ్చహాలాహలాంవిషమ్।

జరయామాసమతిమానవికారమమత్సరీ॥

సమచేతాజగత్యాస్మిన్ యస్సర్వేశ్యేవజన్తుషు।

యతాత్మనియథాపత్యేపరంమైత్రగుణాన్వితః॥

ధర్మాత్మాసత్యశౌచాదిగుణానామాకరఃపరః।

ఉపమానమశేషాణాంసాధూనాంయస్సదాఽభవత్॥

సింహిక యను కూతురు పుట్టినది. ఆమె విప్రచిత్తికి భార్య. హిరణ్యకశిపుని కొడుకులు అనుహ్లాదుడు హ్లాదుడు ప్రహ్లాదుడు సంహ్లాదుడు ననువారు నల్గురు. దైత్యవంశ వర్ధనులు. అందరిలో మహానుభావుడు సుదర్శనుడు జితేంద్రియుడు ప్రహ్లాదుడు విష్ణువు నందు పరమ భక్తి గలవాడు. వాసుదేవు డాతని హృదయము నందున్నందున దైత్యేంద్రుడు దీపితమైన అగ్ని సర్వాంగము లందు రగుల్కొల్ప బడియు నాతని దహింపదయ్యె. ఏ మహానుభావుడి పాశముల బంధించి మహార్ణవ మందు దండ్రి త్రోయగా నందాతడు కదలినంత భూమండల మెల్ల గదలి పోయినది. వివిధాయుధ విహతుడైన నాతని శరీరము కందదయ్యె. అచ్యుతు నందు బుద్ది నిలిచిన యాతనిని విష జ్వాలలు జిమ్ము మహాసర్పము లేమియు సేయ లేవయ్యె. కొండల నుండి దొర్లించిన విష్ణు స్మరణ దంశితుడై (విష్ణు స్మరణమను కవచము గోన్నవాడై దంశనము = కవచము) ప్రాణములు వాయడయ్యె, మీది నుండి భూమికి హిరణ్యకశిపుడు విసరిగొట్టగా గ్రిందబడు నాతనినవని యెత్తుకొని రక్షించినది మధుసూదను డాతని చిత్తమందు న్నందున దైత్యేంద్రుడు ప్రయోగించిన సర్వశోషంకుడైన వాయు వాతనిని శోశింప జేయడయ్యె (ఎండింప లేడయ్యె). పైగా తానే శోషించి పోయెను. ఎవని రోమ్ముదాకి రాక్షస రాజు ప్రేరణమున ప్రయోగించిన దిగ్గజములు దంతభంగము నందెనో, దైత్యరాజ పురోహితులు పుట్టించిన క్రుత్యయను శక్తి యెవ్వని తుదముట్టింప లేనిదయ్యెనో అట్టి గోవిందైక చిత్తుడు ప్రహ్లాదుడు మహాభక్తుడు. శంబరాది మయా సహస్రము విష్ణు చక్రముచే నట వ్యర్ధమయ్యెను. హిరణ్యకశిపుని వంటివాడు పెట్టిన మితిమీరిన హాలాహాల విషమును మాత్సర్య మేమియుం గొనక యా భక్త శిరోమణి జీర్ణ మొనరించు కొనెను. తన యందు నఖిల భూతము లందు సమాహి తత్వంబున బరుగు మైత్రగుణ సంపన్నుడు సంపన్నుడు ధర్మాత్ముడు సత్యషౌచాది గుణ రత్నాకరు డేల్లప్పుడు అశేష సాధువులకు సమానమై ప్రహ్లాదుడు భాసించెను.