విష్ణు మహా పురాణము

31 - పరమాత్మ లీలావిహార వైభవము

శ్రీపరాశరుడు:

సంస్తుతో భగవానిత్థం దేవరాజేన కేశవః

ప్రహస్యభావగమ్భీరమువాచేన్ద్రం ద్విజోత్తమ!

శ్రీపరాశరుడు:

దేవరాజిట్లు వినుతింప భగవంతు డల్లన నవ్వి భావ గంభీరముగ

శ్రీకృష్ణుడు:

దేవరాజో భవానిన్ద్రోవయంమర్ త్యాజగత్పతే

క్షన్తవ్యంభవతై వేద మపరాధకృతం మమ

పారిజాత తరుశ్చాయం నీయతాముచితాస్పదమ్

గృహీతోయం మయాశక్ర! సత్యావచనకారణాత్

వజ్రంచేదం గృహాణత్వం యదత్రప్రహితంత్వయా

తవైవైతత్ప్రహరణం శక్ర! వైరివిదారణమ్

శ్రీకృష్ణుడు:

భువనేశ! నీవు దేవరాజువు. ఇంద్రుడవు. మేము మర్త్యులము. నేనపరాధము సేసితిని. నీవు క్షమింపదగును. ఈ పారిజాతము దానికుచిత మైన తావునకు గొనిపోదగును. సత్యభామా వచనముం బట్టి యిది నేను గైకొంటిని. నీవు నాపై వైచిన ఈ వజ్రమును నీవ గ్రహింపుము. శత్రు విదారమైన ఈ యాయుధము నీదే. నీ దగ్గర నుండ దగినదే. అన విని యింద్రుడిట్లనియె.

ఇంద్రుడు:

విమోహయసిమామీశ మర్త్యోఽహమితికిం వదన్

జానీమస్త్యాం భగవతో నతుసూక్ష్మవిదోవయమ్

యోసిసోసిజగత్త్రాణప్రవృత్తౌనాథ! సంస్థితః

జగతశ్శలనిష్కర్షంకరోష్యసురసూదన!

నీయతాం పారిజాతోఽయం కృష్ణ! ద్వారతీం పురీమ్

మర్త్యలోకేత్వ యాత్వక్తేనాయం సంస్థాస్యతేభువి

దేవదేవజగన్నాథ! కృష్ణవిష్ణో మహాభుజ!

శంఖ చక్ర గదా పాణే క్షమస్వైతద్వ్యతిక్రమమ్

ఇంద్రుడు:

ఈశ్వర! నేను మర్త్యుడ ననుచు తబ్బిబ్బు పరతువు? నిన్నెరుంగుము. ఎవడవో యెక్కడ వగుదువు గాక! జగత్ప్రవృత్తి త్రాణములు నడపు నాథుడవు నీవు. జగమ్ము నందు శల్య నిష్కర్షము సేయు చున్నావు. (లోకములకు శల్యప్రాయులై బాధించువారి నున్మాలించు పని నీయది) కృష్ణా! ఈ పారిజాతముం ద్వారకకు గొనిపో దగును. నీవు మర్త్య లోకము వీడిన తరి నిదియు నక్కడ నుండదు. దేవదేవ! జగన్నాథ! కృష్ణా! విష్ణూ! మహాభుజ! శంఖ చక్ర గదాపాణీ! నా తప్పిదమును క్షమింపుము.

శ్రీపరాశరుడు:

తథేత్యుక్త్వాచ దేవేన్ద్రమా జగామభువం హరిః

ప్రసక్తైస్సిద్ధ గంధర్వైస్త్సూయమానస్సురర్శిభిః

శ్రీపరాశరుడు:

అన విని యట్లనే యనిన యింద్రుని వీడుకొలిపి హరి భూలోకమున కేతెంచెను. సిద్ధ గంధర్వులు సురలు పెక్కు రీతుల వినుతించిరి.

తతశ్శంఖముపాధ్మాయ ద్వారకోపరిసంస్థితః

హర్షముత్పాదయామాస ద్వారకా వాసినాంద్విజ

అవతీర్యాథ గరుడాత్సత్యభామా సహాయవాన్

నిష్కుటే స్థాపయామాస పారిజాతం మహాతరుమ్

యమభ్యేత్యజనస్సర్వోజాతింస్మరతిపౌర్వికీమ్

వాస్యతేయస్య పుష్పోత్థగన్ధేనోర్వీ త్రియోజనమ్

తతస్తే యాదవాస్సర్వేదేహబన్ధానమానుషాన్

దదృశః పాదపేతస్మిన్ కుర్వన్తోముఖ దర్శనమ్

కింకరైస్సముపానీతం హస్త్యశ్వాదితతోధనమ్

విభజ్యప్రదదౌ కృష్ణోబాన్ధవానాం మహామతిః

కన్యాశ్చకృష్ణోజగ్రాహ నరకస్య పరిగ్రహాన్

తతః కాలేశుభేప్రాప్త ఉపయేమే జనార్దనః

తాః కన్యానరకేణా సంత్సర్వతోయాస్స మాహృతాః

జగ్రాహవిధివత్పాణీన్ పృథగ్దేహేషు ధర్మతః

ఏకస్మిన్నేవ గోవిందః కాలే తాసాంమహామునే

షోడశస్త్రీ సహస్రాణి శతమేకంతతోఽధికమ్

తావన్తిచక్రే రూపాణి భగవాన్ మధుసూదనః

ఏకైకమేవతాః కన్యా మేనిరేమధుసూదనః

మమైవపాణి గ్రహణం మైత్రేయ! కృతవానితి

నిశాసుచ జగత్స్రష్టా తాసాంగేహేషు కేశవః

ఉవాసవిప్ర! సర్వాసాం విశ్వరూపధరోహరిః

అవ్వల ద్వారక కేగుదెంచి హరి శంఖము పూరించి ద్వారకా వాసుల కానందముం గూర్చెను. సత్యభామతో గరుడునిండిగ్గి పారిజాత తరువు నామె పెరటియందు తాననాటెను. దానిం దరిసి జనమునకు బూర్వ జన్మ స్మృతి గల్గును. దాని పూల పరిమళము పుడమిపై మూడామడ వ్యాపించును. ఆ పారిజాత మందు దమముఖ ప్రతిబింబములం గని యాదవు లందరుం దమ ముందటి జన్మములందైన అమానుష దేహ బంధము లన్నింటిని (అనగా దాము దేవతలమని దేవాదీషునితో బాటవని నవతరించి పరమాత్మ లీలలో దాము పాల్గొనుటకు ఉపాధి దరించి వచ్చినామని) దర్శించిరి. అవ్వల కృష్ణుడు నరకుని రాజధాని నుండి కొని వచ్చిన కనకమణి రత్నాది సంపద నయ్యాదవుల కందర కప్పుడు పంచి యిచ్చెను. నరకుని చేరబడగా తాను విడిపించిన కన్యలందరం దాను గైకొనెను. అవ్వల నొకే పుణ్య లగ్నమున వారందరిం దాను బరినయ మాడెను. వారు లెక్కకు బాదారు వేల నూరుగురు. అందరు సుందరుల కందరు దానై వారితో విలసించెను. వారందరు నెవ్వెతె మట్టుకామే కృష్ణుడు నా పాణిం గ్రహించె నాకేల్వట్టి నన్నె పెండ్లాడెనని లోలోదలంచికొని మోదించిరి. శ్రీహరి విశ్వ రూపముం గొని ఓ మైత్రేయా! వింటివా! జగత్స్రష్ట కేశవుడు వారి గృహము లందురేలం బరమాత్మ నివసించెను.