విష్ణు మహా పురాణము

28 - రుక్మి వధ

శ్రీపరాశరుడు:

చారుదేష్ణంసుదేష్ణంచ చారుదేహంచ వీర్యవాన్

సుషేణంచారుగుప్తంచభద్రచారుంతథాపరమ్

చారువిన్ధంసుచారుంచ చారుంచబలినాం వరమ్

రుక్మిణ్యజనయత్పుత్రాన్ కన్యాంచారుమతీంతథా

అన్యాశ్చభార్యాః కృష్ణస్య బభూవుస్సప్తశోభనాః

కాళిన్దీమిత్రవిన్దాచ సత్యానాగ్నజితీతథా

దేవీజామ్బవాతీచాపి రోహిణీకామరూపిణీ

మద్రరాజసుతాచాన్యా సుశీలాశీలమణ్డనా

సాత్రాజితీసత్యభామా లక్ష్మణాచారుహాసినీ

షోడశాసన్ సహస్రాణి స్త్రీణామన్యానిచక్రిణః

ప్రద్యుమ్నోఽపి మాహావీర్యో రుక్మిణస్తనయాం శుభామ్

స్వయంవరేతాం జగ్రాహ సాచతంతనయంహరేః

తస్యామస్యాభవత్పుత్రో మహాబలపరాకమః

అనిరుద్దోరణేఽరుద్దో వీర్యోదధిరరిన్ధమః

తస్యాపిరుక్మిణః పౌత్రీంవర్యామాసకేశవః

దౌహిత్రాయదదౌరుక్మితాం స్ఫర్ధన్నపి చక్రిణా

తస్యావివాహేరామాద్యా యాదవాహరిణాసహ

కళ్యాణార్థం తతస్సర్వే యేచాన్యేభూభృతస్తథా

రుక్మిణోనగరం జగ్ముర్నామ్నాభోజకటంద్విజ

వివాహేతత్రణిర్వృత్తేప్రద్యుమ్నస్యమహాత్మనః

కళిఙ్గరాజప్రముఖారుక్మిణం వాక్యమబ్రువన్

అనక్షగ్నోహలీద్యూతేతథాస్యవ్యసనం మహత్

తజ్జయామోబలంకస్మాద్ద్యూతేనై నంమహాబలమ్

శ్రీపరాశరుడు:

శ్రీ రుక్మిణీదేవి కన్న సంతానము చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుషేణుడు, చారుగుప్తుడు, భద్రబాహువు, చారువిందుడు, చారువిందుడు, సుబాహువు, చారువునను పుత్రులు చారుమతి యను కన్యయును. కృష్ణునికి మఱియు నేడుగురు పత్నులుండిరి. ఆ సప్త మహిషులు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, జాంబవతి, కామ రూపిణి యగు రోహిణి, మద్రరాజ సుతయగు సుశీల, సత్రాజిత్తు కూతురు సత్యభామ లక్ష్మణ. వీరు గాక పదునారు వేల మంది భామలుండిరి. ప్రద్యుమ్నుడు రుక్మి కూతురు నొండొరులను స్వయంవర మందు వరించు కొనిరి. వారికి మహాబలశాలి యుద్ద మందెవ్వరికి నిరోధింప వశము గాని వాడు వీర్య సముద్రుడు నగు ననిరుద్దుడు ఉదయించెను. రుక్మిపౌత్రి నాతని కిమ్మని శ్రీకృష్ణుడు కోరెను. రుక్మి కృష్ణునెడ స్పర్ధగొన్నను తన దౌహిత్రునకు భౌత్రినిచ్చెను. ఆమె పెండ్లిలో కృష్ణునితో గూడ బలరామాది యాదవులు మరియుం గల రాజు లందరితో రుక్మి యొక్క నగర మగు భోజ కటమునకు తరలి వచ్చిరి. వివాహ మహోత్సవమైన తరువాత కళింగ రాజు మొదలయిన వారు రుక్మింగని బలరాముడు పాచికలాడు టెఱుగడు. జూదమున నతని మనమేల గెలువ రాదనిరి.

శ్రీపరాశరుడు:

తథేతితానాహనృపాన్ రుక్మిబలమదాన్వితః

సభాయాంసహరామేణచక్రేద్యూతంచవై తదా

సహస్రమేకం నిష్కాణాం రుక్మిణావిజితోబలః

ద్వితీయేఽపిపణేచాన్యత్సహస్రం రుక్మిణాజితః

తతోదశసహస్రాణినిష్కాణాంపణమాదదే

బలభద్రోఽజయత్తాని రుక్మీద్యూతవీదాంవరః

తతోజహాసస్వనవత్కలిఙ్గాధిపతి ద్విజ

దన్తాన్విదర్శయన్మూఢో రుక్మీచాహమదోద్దతః

అవిద్యోఽయంమయాద్యూతే బలభద్రః పరాజితః

ముధైవాక్షావలేపాన్దోయోవమేనేక్షకోవిదాన్

దృష్ట్వాకలిఙ్గరాజానంప్రకాశదశనాననమ్

రుక్మిణంచాపిదుర్వాక్యంకోపం చక్రేహలాయుధః

తతః కోపపపరీతాత్మానిష్కకోటింసమాదదే

గ్లహం జగ్రాహరుక్మీచతదర్థేఽక్షానపాతయత్

అజయద్బాలదేవ స్తంప్రాహోచ్చైర్విజితంమయా

మాయేతిరుక్మీప్రాహోచ్చైరళీకోక్తేరలంబలం!

త్వయోక్తోయంస్గ్లహస్సత్యం నమయైషోఽనుమోదితః

ఏవం త్వయాచేద్విజీతం విజితం నమయాకథమ్

అథాన్తరిక్షేవాగుచ్చైః ప్రాహగమ్భీరనాదినీ

బలదేవస్యతం కోపం వర్థయన్తీమహాత్మనః

జితం బలేనధర్మేణ రుక్మిణాభాషితం మృషా

అనుక్త్వాపివచః కించిత్కృతంభవతికర్మణా

శ్రీపరాశరుడు:

బలమదమున రుక్మియట్లే కానిండని సభలో బలరామునితో ద్యూతక్రీడ నారంభించెను. ఒక్క వేయి నిష్కము లొడ్డి బలరాముడు రుక్మిచే నోడిపోయెను. రెండవ పందెమందు నట్లే యంతమొత్తము గోల్పోయెను. ఆ వీర బలరాముడు బదివేల నిష్కముల పందెము కాసెను. దానిని ద్యూత విశారదుడు రుక్మి గెల్చుకొనెను. అది కని కళింగ రాజు నోరు తెరచి విరగబడి పెద్ద ధ్వని యగునట్లు పండ్లు బయలు వడ నవ్వెను. అప్పుడు రుక్మియు మదోద్దతుడై “ఇతడు ధ్యూతము నెఱుంగని వాడు. నేను వీనిం గెలిచితిని. అక్ష క్రీడలో లేనిపోని గర్వముకొని అక్ష క్రీడా కోవిదుల మని మనల నెఱుంగడయ్యె” అనెను. కళింగ రాజు పండ్లి గిలించుటయు రుక్మి ప్రేలుటయుం గని హలాయుధుం డీసుగొని కోటి నిష్కములను మరల పందెము సరచెను. రుక్మి పాచికం బట్టి విసరెను. బలదేవుడు ఆ పందెముం గెలిచి కొనెను. గెలిచితి ననియుం బలికెను. రుక్మి నేను గెలిచితినని పలికెను. అబద్దమాడకుము. నీవు పందెము పెట్టితివి. నిజమే కాని దానిని నేనా మోదించ లేదు. ఇట్టి యెడ గెల్పు నీదగు నంటివేని నాదెందులకు గాదు? అని రుక్మిం వివాదమునకు దిగెను. అంతట నంతరిక్షము నందాకాశావాణి గంభీర నాదమున మహానుభావుడగు బలదేవుని కోపముం బెమ్పొందించుచు “ధర్మముగా బలరాముడే గెలిచెను. రుక్మియన్న మాట యబద్ధము. అంగీకారపు మాటను పలుక కుండగూడ నని క్రియతో జరుగు చుండును అనెను.”

శ్రీపరాశరుడు:

తతోబలస్సముత్తయకోపసంరక్తలోచనః

జఘానాష్టాపదేనైవ రుక్మిణం సమహాబలః

కళిఙ్గరాజం చాదాయవిస్ఫుర న్తంబలాద్బలః

బభఞ్జదన్తాన్ కుపితోయైః ప్రకాశై ర్జహాససః

ఆకృష్యచమహా స్తమ్భంజాతరూపమయం బలః

జఘానతాన్ ఏతత్పక్షేభూభృతః కుపితోభృశమ్

తతోహాహాకృతంసర్వం పలాయనపరంద్విజ

తద్రాజమండలంభీతం బభూవకుపితేబలే

బలేననిహతం దృష్ట్వారుక్మిణం మధుసూదనః

నోవాచకిం చిన్మైత్రేయరుక్మిణీబలయోర్భయాత్

తతోఽనిరుద్ధమాదాయకృతదారం ద్విజోత్తమ

ద్వారకామాజగమాథయదుచక్రంచ కేశవః

శ్రీపరాశరుడు:

అవ్వల బలరాముడు లేచి కోపముచే గన్ను లెఱ్ఱవడ పాచికంగొని రుక్మినిం గొట్టెను. ఎగిరెగిరి పడుతున్న కాలింగరాజుం గూడ పట్టుకొని వాడు మున్నెవ్వాన నవ్వెనా దంతములు బగుల నడిచెను. మఱియు పెద్దదగు నా సభా స్తంభమును స్వర్ణ మాయముం జేసుకొని యా పక్షమునకు జెందిన రాజుల నందరందాన గోపాన నడిచెను. బలరాముడు కుపితుడు కాగా సభయంతయు గగ్గోలై రాజమండల మెల్ల నదరి పారిపోబోయెను. మధుసూదనుడు బలుని చేనట్లు రుక్మిని హతుడగుట గని మైత్రేయా రుక్మిణీ బలరాములకు జడిసి యించుకేని పలుక డయ్యెను. అవ్వాల హరి పెండ్లియై నిరుద్దుడై యున్న యనిరుద్దుని యాదవ మండలమును జేకొని ద్వారకా పురికి వచ్చెను.