విష్ణు మహా పురాణము

4 - ప్రళయ స్వరూపము - నైమిత్తిక ప్రళయము

శ్రీపరాశరుడు:

సప్తర్షిస్థానక్రమ్యస్థితేఽమ్బసి మహామునే

ఏకార్ణవం భవత్యేత్రైలోక్యమఖిలంతతః

ముఖనిశ్వాసజోవిష్ణోర్వాయుస్తాన్ జలదాం స్తతః

నాశయన్ వాతిమైత్రేయ! వర్షాణామాపరంశతమ్

సర్వభూతమయోచిన్త్యో భగవాన్ భూతభావనః

అనాదిరాదిర్విశ్వస్యపీత్వావాయుమశేషతః

ఏకార్ణవేతటస్తస్మిన్ శేషశయ్యాగతః ప్రభుః

బ్రహ్మరూపధరశ్శేతే భగవానాదికృద్ధరిః

జగలోకగతై స్సిద్దైసనకాద్యైరాభిష్టుతః

బ్రహ్మలోక గతైశ్చైవచిన్త్యమానోముముక్షుభిః

ఆత్మమాయామయీందివ్యాం యోగనిద్రాంసమస్థితః

ఆత్మానంవాసుదేవాఖ్యాం చిన్తయన్మధుసూదనః

ఏషనై మిత్తికోనామమైత్రేయ! ప్రతిసంచరః

నిమిత్తం తత్రయచ్చేతేబ్రహ్మరూపధరోహరిః

యదాజాగర్తిసర్వాత్మాసతదాచేష్టతేజగత్

నిమీలత్యేతదఖిలంమాయాశయ్యాంగతేచ్యుతే

పద్మయోనేర్దినంయత్తుచతుర్యుగసహస్రవత్

ఏకార్ణవీకృతేలోకే తావతీరాత్రిరిష్యతే

తతః ప్రబుద్దోరాత్ర్యన్తేపునస్సృష్టింకరోత్యజః

బ్రహ్మస్వరూపధృద్విష్ణుర్యథాతేకథితంపురా

ఇత్యేషకల్పసంహారోఽవాన్తరప్రళయో ద్విజ

నైమిత్తికస్తుకథితః ప్రాకృతం శ్రుణ్వతః పరమ్

శ్రీపరాశరుడు:

ఓ మహామునీ! సప్తర్షి మండలము నాక్రమించి జలమున్నతరి నీ ముల్లోకము నొకే సముద్రమగును. అంతట విష్ణుముఖ నిశ్శ్వాసము నుండి పుట్టిన వాయువు ఆ మేఘములను జెల్లా చెదరు సేయుచు నూరు సంవత్సరములు ఒకే రీతి వీచును. సర్వభూత మయుడు ఊహ కందని వాడు విశ్వమున కాదియు నాదిలేని వాడునగు భగవంతుడు వాయువది యెల్ల ద్రావి బ్రహ్మరూప ధారుడై శేష తల్పమందు నిదురించును. అప్పుడు జనలోకము నందు బ్రహ్మలోకము నందుండు సనకాది సిద్ధులా దేవుని ధ్యానించుచు ముక్తికోరుచు స్తుతించు చుందురు. తన దివ్య మాయా స్వరూపిణి యగు యోగ నిద్ర యందుండి యమ్మధుసూదనుడు వాసుదేవాఖ్య పరబ్రహ్మమగు తన్నుదాను ధ్యానించు చుండును. ఇది నైమిత్తిక మనెడి ప్రళయము. బ్రహ్మ స్వరూపుడగు హరి యయ్యెడ నిదురించుటయే నిమిత్తము. కారణము, కావున దీనికీ పేరు వచ్చినది. ఆ సర్వాత్మకుడు మేలుకొన్నపుడు జగత్తు చేష్టించును. క్రియా సమర్థమగును. అచ్యుతుడు మాయాశయ్య నున్నపుడీ నిఖిల జగత్తు కనుమూయును. వేయి చతుర్యుగములు పద్మ గర్బునకోక పగలు. లోకమేకార్ణవ మయినపుడదే పరిమాణమున బ్రహ్మకు రాత్రియగును. ఆ రాత్రి తుదనాతడు మేల్కొని సృష్టి నారంభించును. అప్పుడు విష్ణువే బ్రహ్మ స్వరూపుడగును. లోగడ నీకిట్లు తెల్పియున్నాను. ఇదే కల్ప సంహారము, అవాంతర ప్రళయము, నైమిత్తిక ప్రళయము అనంబడును. ఇక ప్రాకృత ప్రళయ మేమో వినుండు.

ప్రాకృత ప్రళయము:

అనావృష్ట్యాది సంపర్కాత్కృతసంక్షాళనే మునే

సమస్తేష్వేవ లోకేషు పాతాళేష్వభిలేషు చ

మహదాదే ర్వికారస్య విశేషాన్తస్య సంక్షయే

కృష్ణేచ్ఛాకారితే తస్మిన్ ప్రవృత్తేప్రతిసంచరే

అపో గ్రసన్తి వై పూర్వం భూమేర్గంధాత్మకం గుణమ్‌

ఆత్తగంధా తతో భూమిః ప్రళయాత్వాయ కల్పతే

ప్రణష్టే గన్ధ తన్మాత్రే భవత్యుర్వీజలాత్మికా

అపస్తదా ప్రవృత్తాస్తు వేగవత్యోమహాస్వనాః

సర్వ మాపూరయన్తీదం తిష్ఠంతి విచరన్తిచ

సలిలేనోర్మిమలేన ఆలోకాన్తాత్సమంతతః

అపామపి గుణో యస్తు జ్యోతిషా పీయతే తుసః

నశ్యన్త్యాప స్తతస్తాశ్చ రసతన్మాత్రసంక్షయాత్‌

తతశ్చాపోహృతరసా జ్యోతిష్ట్వం ప్రాప్నువంతివై

అగ్న్యవస్థే తు సలిలే తేజసా సర్వతో వృతే

సచాగ్నిస్సర్వతో వ్యాప్య చాదత్తే తజ్జలం తథా

సర్వమాపూర్య తేర్చిర్భి స్తదా జగదిదం శనైః

అర్చిభిస్సంవృతే తస్మిం స్తిర్యగూర్ ధ్వమధస్తదా

జ్యోతిషోఽపి పరం రూపం వాయురత్తి ప్రభాకరమ్‌

ప్రలీనే చ తతస్తస్మిన్ వాయు భూతేఽభిలాత్మని

ప్రణష్టే రూపతన్మాత్రే హృతరూపో విభావసుః

ప్రశామ్యతి తదా జ్యోతిర్వాయుర్దోధూయతేమహాన్‌

నిరాలోకే తదా లోకే వాయ్వవస్థేచ తేజసి

తతస్తుములమాసాద్య వాయు స్సంభవమాత్మనః

ఊర్ధ్వం చాధశ్చతిర్యక్చదోధవీతి దిశోదశ

వాయోరపి గుణం స్పర్శ మాకాశో గ్రసతే తతః

ప్రశామ్యతితతో వాయుః ఖంతుతిష్ఠత్యనావృతమ్‌

ఆరూపరసమస్పర్శ మగన్ధంనచమూర్తిమత్‌

సర్వమాపూరయచ్చైవ సుమహత్ర్పకాశతే

పరి మణ్డలంచసుషిరమాకాశం శబ్దలక్షణమ్‌

శబ్దమాత్రం తథాకాశం సర్వమావృత్యతిష్ఠతి

తతశ్శబ్దగుణం తస్య భూతాదిర్ గ్రసతే పునః

భూతేన్ద్రియేషు యుగప ద్భూతాదౌ సంస్థితేషు వై

అభిమానాత్మకోహ్యేష భూతాదిస్తామస స్మృతః

భూతాదిం గ్రసతే చాపి మహాన్ వై బుద్ధిలక్షణః

ఉర్వీ మహాంశ్చ జగతః ప్రాన్తేఽన్తర్బాహ్యత స్తథా

ఏవం సప్తమహాబుద్ధిః క్రమాత్ర్పకృతయ స్స్మృతాః

ప్రత్యా హారేతుతాస్సర్వాః ప్రవిశన్తిపరస్పరమ్‌

ప్రాకృత ప్రళయము:

అనావృష్టి మొదలయిన హేతువులచే సర్వ లోకము లందు బాతాళము లందుక్షాళనము సేయబడగా మహాదాది వికారము నుండి విశేషము వరకు గల సర్వ వికృతి క్షయింపగా కృష్ణుని యిచ్చవలన జేయబడు ప్రతి సంచరము నందు తొలుత ఉదకములు భూమి యొక్క గంధ గుణమును గ్రసించును. అంతట భూమి ప్రళయము నందు అనువగును. గంధ గుణము పోగా అది కేవలము జలమయ మగును. అప్పుడు జలములు తెగ పెరిగి పెద్ద వేగము పెద్ద ధ్వనియుం గలవై ఈ విశ్వమంతను నిండును. అవి యోక్కొక్క తరి నిలుపొందును. ఒకతరి చలించును. కెరటములు వేయు సలిలముచే లోకాంతము దాక నెల్లెడ వ్యాప్తమగును. తేజస్తన్మాత్ర యా జలముల యొక్క గుణమును రసమును ద్రాగి వైచును. రసము క్షయించి నంతట నయ్యుదకములు క్షయించును. రస గుణము పోయిన నీరు తేజో రూపము నందును. నీరగ్ని భూతావస్థ యందుండగా సర్వము తేజస్సుచే నావరింప బడగా నా యగ్ని యంతట వ్యాపించి యా నీటిని స్వీకరించును. అప్పుడీ జగమెల్ల అగ్ని జ్వాలలచే నింప బడును. ఇట్లది క్రిందను మీదను నడ్డముగను జ్వాలలచే నిండి నంతట జ్యోతిస్సు యొక్క పరమ రూపమయిన ప్రభాకరుని వాయువు మ్రింగును. సర్వాత్మక మయిన యా వాయు మహాభూతము గూడ రూపతన్మాత్ర యందు విలీనమయినంత అగ్ని భూతము ప్రణష్ట మగును. జ్యోతిస్సట్లు ప్రశమింప మహావాయువు తెగ విసరినంతట తేజోభూతము కేవల వాయు భూతావస్థ యందున్న తరి లోక మంధకార బంధుర మగును.

అంతట నావాయువు తన నడక తుములమై క్రిందను మీదను నడ్డముగను బదిదెసల విపరీతముగ వీచును. అంతట వాయు భూతము యొక్క స్పర్శ గుణమును ఆకాశము గ్రసించును. అపుడు వాయువు శమించును. ఆకాశ మహాభూతము నిరావరణమై యుండును. రూప రస స్పర్శ గంధ గుణ రహితమయి రూపము కూడ లేక యా ఆకాశ మహాభూతము మిక్కిలి పెద్దదై యుండును. పరిమండలము రంద్ర మాత్రమునైన యాకాశము కేవలము శబ్దమే గుణము గాగలదై యుండును. అట్టి ఆకాశ మయ్యెడ సర్వము నావరించి యుండును. ఆకాశము యొక్క ఆ శబ్ద గుణమును భూతాది అహంకారతత్త్వము మ్రింగును. అంతః కరణము భూతములు ఇంద్రియములు నొక్కసారి భూతాది యందున్న తరి నీ భూతాది అహం మమాభిమానాత్మకమయి తామసమని చెప్పబడును. తమో గుణ ప్రాయమయిన యహంకారమిది ఆ భూతాదిని బుద్ధియను పేర జెప్పబడు మహత్తు గ్రసించును. ఈ మహత్తు అను భూమి జగత్తునకు లోపల వెలుపల దగ్గర దాపునను గూడ నుండును. ఈ మీద జెప్పిన క్రమముగ బుద్ధి యొక్క సప్తమూల తత్త్వములు ప్రకృతులని చెప్ప బడినవి. సృష్టి వికారనమునకివి మూల పదార్థములు. సృష్టి యొక్క ప్రవృత్తి యందివి విడివిడిగ నివృత్తి యందొక దాని యందొకటి ప్రవేశించును. ప్రవృత్తి యనగా ప్రయాణము. నివృత్తి యనగా ప్రతి ప్రయాణము నని ఆగమికుల రహస్య సంకేతము. అనులోమము విలోమమునను మాటలచే గూడ ఈ సృష్టి ప్రతిసృష్టులు వ్యవహరింప బడును.

యేనేద మావృతం సర్వమణ్డమప్సు ప్రలీయతే

సప్తద్వీప సముద్రాన్తం సప్తలోకం సపర్వతమ్‌

ఉదకావరణం యత్తు జ్యోతిషాపీయతేతుతత్‌

జ్యోతిర్వాయౌలయం యాతి యాత్యాకాశే సమీరణః

ఆకాశం చైవ భూతాదిః గ్రసతే తంతథా మహాన్‌

మహాన్తమేభిస్సహితం ప్రకృతిర్ గ్రసతే ద్విజ

గుణసామ్య మనుద్రిక్త మన్యూనం చ మహామునే

ప్రోచ్యతే ప్రకృతిర్ హేతుః ప్రధానం కారణంపరమ్‌

ఇత్యేషా ప్రకృతిః సర్వా వ్యక్తా వ్యక్తస్వరూపిణీ

వ్యక్తస్వరూపమవ్యక్తే తస్యాన్మైత్రేయ లీయతే

ఏకశ్శుద్ధోక్షరో నిత్యస్సర్వవ్యాపీ తథా పుమాన్

సోవ్యంశస్సర్వభూతస్య మైత్రేయ పరమాత్మనః

నసన్తియత్ర సర్వేశేనామజాత్యాది కల్పనాః

సత్తామాత్రాత్మకే జ్ఞేయే జ్ఞానాత్మన్యాత్మనః పరే

తద్బ్రహ్మ పరమంధామ పరమాత్మా సచేశ్వరః

సవిష్ణుస్సర్వమేవేదం యతో నావర్తతే యతిః

ప్రకృతిర్యా మయాఖ్యాతా వ్యక్తా వ్యక్తస్వరూపిణీ

పురుషశ్చాప్యుభావేతౌ లీయేతే పరమాత్మని

పరమాత్మా చ సర్వేషా మాధారః పరమేశ్వరః

విష్ణునామా సవేదేషు వేదాన్తేషు చగీయతే

ఏ యుదకములచే నీ అండ ఆకారమైన జగత్తు ఆవరింపబడి యున్నదో సప్తద్వీప, సప్త సముద్ర సప్త లోకాత్మకమయిన యిదెల్ల నుదకము లందు లీనమగును. ఆ ఉదకమును తేజస్సు ద్రావును. ఆ తేజస్సు వాయువు నందు పాయ మొందును. వాయువాకాశము నందు లయించును. ఆకాశమును భూతాది మ్రింగును. దానిని మహత్తు. ఈ చెప్పిన వానితో గూడియున్న యా మహత్తును బ్రకృతియుం గ్రసించును. సత్త్వ రాజస్తమో గుణ సామావ్యస్థ పెరుగక తరుగక యుండునది హేతువు ప్రధాన కారణము నైనదిది ప్రకృతి యనబడును. ఇది యెల్ల వ్యక్తావ్యక్త స్వరూపిణి. వ్యక్త స్వరూపము అవ్యక్త మందు లీనమగును. ఆ అవ్యక్త శబ్దమున జెప్పబడు వాడు ఏకైక మూర్తి, శుద్దుడు, అక్షరుడు, నిత్యుడు, సర్వవ్యాపి. పురుషుడునని పిలువ బడును. ఆయన కూడ సర్వమయియున్న పరమాత్మకు అంశము సర్వేశ్వర మయిన వస్తువు నందు సత్తామాత్ర స్వరూపము జ్ఞేయము (ఎరుక బడునది), జ్ఞానము (ఎరుకయు) నైన ఏపర వస్తువు నందు నామరూప జాత్యాది కల్పన లేదో యది బ్రహ్మము పరమధామము పరమాత్మ ఈశ్వరుడు విష్ణువే ఈ సర్వము. అందుండి యతి ఆ వృత్తి నందడు. వ్యక్తావ్యక్త స్వరూపిణియని నేను చెప్పిన ప్రకృతియు పురుషుడును నను నీ యిద్దరును బరమాత్మ యందు లయమందుదురు. పరమాత్మ సర్వులకు నాధారుడు. పరమేశ్వరుడు విష్ణువను పేర వేదము లందు వేదాంతము లందును గీర్తింప బడును.

పవ్రృత్తంచ వివృత్తంచ ద్వివిధం కర్మవైదికమ్‌

తాభ్యా ముభాభ్యాం పురుషై స్సర్వమూర్తిస్స ఇజ్యతే

ఋగ్యజుః సామభిర్మార్గ్రైః ప్రవృత్తై రిజ్యతేహ్యసౌ

యజ్ఞేశ్వరో యజ్ఞపుమాన్ పురుషైః పురుషోత్తమః

జ్ఞానాత్మా జ్ఞానయోగేన జ్ఞానమూర్తిస్స చేజ్యతే

నివృత్తే యోగిభిర్మార్గే విష్ణుర్ముక్తి ఫలప్రదః

వేదము సెప్పిన కర్మ ప్రవృత్తము నివృత్తమునని రెండు విధములు. ఆ రెండింటి చేతను నా సర్వ మూర్తిని పురుషు లారాధింతురు. ఋగ్యజుస్సామ మార్గములు ప్రవృత్తములు. వీనిచే యజ్ఞేశ్వరుడు యజ్ఞ పురుషుడు పురుషోత్తముడు యజింపబడును. జ్ఞాన స్వరూపుడు జ్ఞానమే తానైన వాడునగు విష్ణువును యోగులు జ్ఞాన యోగముచే నివృత్త కర్మ మార్గమున సేవింతురు. ఆ విష్ణువు ముక్తిఫల ప్రదాత.

హ్రస్వదీర్ ఘప్లుతైర్యత్తు కించిద్వస్త్వభిధీయతే

యచ్చ వాచామవిషయం తత్సర్వం విష్ణురవ్యయః

వ్యక్తస్స ఏవచావ్యక్తస్స ఏవ పురుషోత్తమః

పరమాత్మా చ విశ్వాత్మా విశ్వరూపధరో హరిః

వ్యక్తావ్యక్తాత్మికాతస్మిన్ ప్రకృతిస్సంప్రలీయతే

పురుషశ్చాపి మైత్రేయవ్యాపిన్యవ్యాహతాత్మని

ద్విపరార్ధాత్మకః కాలః కథితో యోమయాతవ

తదహస్తస్య మైత్రేయ! విష్ణోరీశస్య కథ్యతే

వ్యక్తేచప్రకృతౌ లీనే ప్రకృత్యాం పురుషేతథా

యత్రస్థితే నిశాచాస్య తత్ ప్రమాణా మహామునే

నైవాహస్తస్య ననిశా నిత్యస్య పరమాత్మనః

ఉపచారత్తథాఽప్యేత త్తస్యేశస్యద్విజోచ్యతే

ఇత్యేష తవ మైత్రేయ! కథితః ప్రాకృతో లయః

అత్యన్తికమథో బ్రహ్మన్నిబోధ ప్రతిసంచరమ్

హ్రస్వ దీర్ఘ ప్లుతములను స్వరములచే నే కొంచెము వస్తువు వచింప బడునో యే వస్తువు వాక్కులకు (వేదములకు) గోచరము గాదో యదంతయు నవ్యయుడైన విష్ణువు వ్యక్తుడాతడే. అవ్యక్తమును అతడే. అతడే పురుషోత్తముడు. పరమాత్మ విశ్వాత్మ విశ్వరూపధారి హరియే. వ్యక్తావ్యక్త స్వరూపిణియగు ప్రకృతి పురుషుడు నా విష్ణువు నందు లీనమగును. సర్వవ్యాప్తి అవ్యాహతమునైన యాత్మయందు ద్విపరార్ధమయిన నీకు నేజేప్పిన కాలము అవిష్ణువునకు పగలు. ఈ వ్యక్తము (దృశ్య ప్రపంచము) ప్రకృతి యందు పురుషు నందు లీనమయినపుడు ఆ ద్విపరార్ధ దివాకాల ప్రమాణములు రాత్రి యగును. ఆ విష్ణువునకు బవలురేయి యనునవి లేవు. ఆ పరమాత్మ యందీ కాల పరిగణము కేవల మౌపచారికము. ఇట్లీ ప్రాకృతలయ వృత్తాంతము మైత్రేయా! నీకు దెలుప బడినది. అత్యంతిక ప్రతిసంచరముం గూర్చి యిక తెలిసికొనుము.