విష్ణు మహా పురాణము

11 - సూర్య మహిమా వర్ణనము

మైత్రేయుడు: 

యదేతద్భగవానాహ గణస్సప్త విదోరవేః

మణ్డలేహిమవార్యుష్ణ కారణం తన్మయాశ్రుతమ్

వ్యాపారశ్చాపికథితోగన్ధర్వోరగ రక్షసామ్

ఋషీణాం వాలఖిల్యానాంతథై వాప్సరసాంగురో

యక్షాణాం చరథేభానోర్విష్ణు శక్తి ధృతాత్మనామ్

కించాదిత్యస్యయత్కర్మ తన్మాత్రోక్తంత్వయామునే

యదిసప్తగణోవారి హిమముష్ణంచవర్షతి

తత్కిమత్రరవేర్యేన వృష్టిస్సూర్యాదితీర్యతే

వివస్వానుదితోమధ్యే యాత్యస్తమితికింజనః

బ్రవీత్యేతత్సమంకర్మ యదిసప్తగణస్యతత్

మైత్రేయుడు:

స్వామీ! తమరు రవి రథమందలి సప్త గణము వారి వారి పనులఁ గూర్చి సమగ్రముగ సెలవిచ్చితిరి. సూర్యుడు సేయు పనిం దేలిపినారు గారు. దేవతాది సప్త గణమే హిమోష్ణ జలములను వర్షించునేని వృష్టి సూర్యుని వలన నని యేల చెప్ప బడినది. సర్వ కార్యక్రమము నీ సప్త గణమునకు జెందినదగు నేని సూర్యుడు దయించినాడు. ఆకాశ మధ్య మందున్నాడు, అస్తమించినాడని జనమేల పలుకును? 

శ్రీపరాశరుడు:

మైత్రేయ శ్రూయతే తద్యద్భవాన్ పరిపృచ్చతి

యథాసప్తగణేప్యేకః ప్రాధాన్యేనాధీకోరవిః

సర్వశక్తిః పరావిష్ణోః ఋగ్యజుస్సామసంజ్ఞితా

సైషాత్రయీతపత్యంహజగతశ్చహినస్తియత్

సైషావిష్ణుస్స్థిత్యాం జగతః పాలనోద్యతః

ఋగ్యజుస్సామభూతోఽన్తస్సవితుర్ ద్విజతిష్టతి

మాసిమాసిరవిర్యోయస్తత్రతత్రహిసాపరా

త్రయీమయీవిష్ణుశక్తిరవ స్థానం కరోతిహి

ఋచస్త్సువన్తిపూర్వాహ్ణే మధ్యాహ్నేచ యజూంష్యథ

బృహద్రథన్తరాదీని సామాన్యహ్నః క్షయేరవిమ్

అంగమేషాత్రయీ విష్ణోః ఋగ్యజుస్సామ సంజ్ఞితా

విష్ణు శక్తిరవ స్థానం సదాదిత్యేకరోతిసా

నకేవలంరవేశ్శక్తిర్వైష్ణవీ సాత్రయీమాయీ

బ్రహ్మాథ పురుషోరుద్రస్త్రయమేతత్త్రయీ మయమ్

సర్గాదావృఙ్ఞ్మయో బ్రహ్మా స్థితౌవిష్ణుర్యజుర్మయః

రుద్రస్సామమయోఽన్తాయ తస్మాత్తుస్యాశుచిర్ ధ్వనిః

ఏవంసాసాత్వికీశక్తిర్వైష్ణవీయాత్రయీమయీ

ఆత్మసప్తగణస్థంతం భాస్వన్తమదితిష్టతి

తయాచాధిష్టితస్సోఽపి జాజ్వలీతిస్వరశ్మిభిః

తమస్సమస్తజగతాం నాశంనయతిచాఖిలమ్

స్తువన్తిచైవం మునయోగన్ధర్వై ర్గీయతేపురః

నృత్యన్త్యప్సరసోయాన్తితస్యచాను నిశాచరాః

వహన్తిపన్నాగాయక్షైః క్రియతేఽభీశు సంగ్రహః

వాలఖిల్యాస్తథైవైనం పరివార్యసమాసతే

నోదేతానా స్తమేతాచకదాచిచ్చాక్తి రూపధ్రుత్

విష్ణుర్విష్ణోః పృథక్తస్యగణస్సప్తవిదోప్యయమ్

స్తమ్భస్థదర్పణసైతియోయ ఆసన్నతాంనరః

చాయాదర్శన సంయోగం సనప్రాప్నోత్యథాత్మనః

ఏవంసావైష్ణవీ శక్తిః నైవాపై తితతోద్విజ

మాసానుమాసంభాస్వన్తమధ్యా స్తేతత్ర సంస్థితమ్

పితృదేవమనుష్యాదీన్ ససదాప్యాయయన్ ప్రభుః

పరివర్తత్యహోరాత్ర కారణం సవితాద్విజ!

సూర్యరశ్మిసుషుమ్నాయస్తర్పితస్తేణచన్ద్రమాః

కృష్ణపక్షేమరైశ్షశ్వత్పీయతేవై సుదామయః

పీతంతంద్వికలంసోమం కృష్ణ పక్ష క్షయేద్విజ!

పిబన్తిపితర స్తేషాంభాస్కరాత్తర్పణం తథా

ఆదత్తేరశ్మిభిర్యంతుక్షితిసంస్థంరసంరవిః

తముత్సృజతి భూతానాం పుష్ట్యర్థం సస్యవృద్ధయే

తేనప్రీణాత్య శేషాణిభూతాని భగవాన్ రవిః

పితృదేవ మనుష్యాదీనేన మాప్యాయయత్యసౌ

పక్షతృప్తింతుదేవానాం పిత్రూణాంచై కమాసికీమ్

శశ్వత్తృప్తించమర్ త్యానాం మైత్రేయార్కః ప్రయచ్చతి

శ్రీపరాశరుడు:

మైత్రేయా! వినుము. ఈ సప్తగణ మొక్కటగను రవి సర్వప్రధానుడుగ నున్నాడో దీని కంతకుంబైని విష్ణువు యొక్క పరాశక్తి ఋగ్యజుస్సామ వేదరూపిణి త్రయీమూర్తి వెలుంగు చున్నది. అది జగత్తు యొక్క పాపమునెల్ల నశింప జేయును. ఆ శక్తియే విష్ణువు. జగత్తును పాలించును. స్థితి హేతువగును. సూర్యుని యందు ఋగ్యజుస్సామ స్వరూపిణియై ఆ శక్తియే యున్నది. ప్రతి మాసము నాయా సూర్యులెవరు గలరో వారియందు త్రయీరూపిణియగు నా శక్తి నిలుపొందు చుండును. పూర్వాహ్ణ మందు ఋక్కులు, మధ్యాహ్నము యజుస్సులు, సాయాహ్నమందు బృహద్రథంతరాది సామములు సూర్యుని స్తుతించు చుండును. ఈ త్రయీ విష్ణువు యొక్క శరీరము. బ్రహ్మ పురుషుడు పురుషోత్తముడగు హరి, రుద్రుడునను, మూర్తి త్రయము త్రయీ రూపము. బ్రహ్మ సృష్టి యందు ఋగ్వేదమయుడుగను విష్ణువు స్థితియందు యజుర్మయుడుగను రుద్రుడు లయయందు సామమయుడుగను నుందురు. కావున రుద్ర దేవతాకమయిన సామము యొక్క ధ్వని యశుచి హేతువన బడును. శుద్ధ సత్వమయము. వేదత్రయ రూపమునగు వైష్ణవీ శక్తి తన శరీరమైన సప్తగుణము నందున్న యా సూర్యుని నధిష్టించి యున్నది. దాని వలన భానుడు తన కిరణములతో జాజ్వల్యమానుడగుచు సర్వ జగమ్ముల సర్వవిధ తమస్సును నశింప జేయు చున్నాడు. స్థూలమైన చీకటినే కాదు, జీవుల యంతః కారణము నందున్న తమో గుణమును అజ్ఞానమును నశింప జేయుచు చైతన్యాధాయకు డగుచున్నాడని భావము. ఈయనను మునులు స్తుతించు చున్నారు. గందర్వు లెదుట నిలిచి గానము సేయుచున్నారు. అప్సరసలు నృత్యము సేయు చున్నారు. రాక్షసు లనుగమనము సేయు చున్నారు. పన్నగులు వహించు చున్నారు. యక్షులు రశ్మి సంయోజనము చేయు చున్నారు. వాలఖిల్య మహర్షులు గూడనట్లే వీని చుట్టుకొని యందురు. శక్తి రూపధరుడగు విష్ణువు ఒకప్పుడు నుదయించుట లేదు. అస్తమించుట లేదు. కేవల అధిష్టాటయగుటచే స్థిరుడు అధిష్టేయము అస్థిరమునగు ఆయన సప్తవిధ గణము కంటే వేరైన వాడు. ప్రత్యేక శక్తిమయము స్తంభము నందున్న అద్దమున కెదురుగా నేవ్వడెవ్వ డెగును. అతడతడందు ప్రతిబింబ దర్శనము నొంది దానితో సంబంధమును బడయును. ఇట్లే యా వైష్ణవీ శక్తియు ప్రతిమాసము నందును దీపించు నా భాను బింబము నందిరవుకొని ఎన్నడు విడిచి పోదు. ఆ ప్రభువు పితృ దేవా మనుష్యాదుల నెల్ల వేళల నాప్యాయితులం గావించును. నహోరాత్రములకు కారణమై తిరుగు చున్నాడు. సూర్య రశ్మి విశేషమైన సుషుమ్నచే తర్పితుడై అమృతమూర్తి యగు చంద్రుడు కృష్ణపక్ష మందు దేవతలచే పానము సేయబడును. దేవపానానంతరము రెండు కళలు మాత్రముగా మిగిలి యున్న యా సోముని కృష్ణ పక్షము తుదను (అమావాస్య తిథి యందు) పితృ దేవతలు త్రావుదురు. సూర్యుని వలన వారు తర్పణము (తృప్తిని) పొందుదురు. భూమి యందున్న రసమును సూర్యుడు తన కిరణములచే గ్రహించి (పీల్చి) దానిచే భూత జాలము యొక్క పుష్టి కొఱకు సస్య సమృద్ధి కొఱకును విడుచును. అట్లు సూర్య భగవాను డశేష భూత జాలమును పితృ దేవా మనుష్యాదులను దనియింప జేయు చున్నాడు. దేవలతకు ఒక శుక్ల పక్షము నందును పితృ దేవతలకు నెలకొక రోజు (అమావాస్య) నందును మర్త్యులకు దిన దినము నీ సూర్య తృప్తి ననుగ్రహించు చున్నాడు. ఈ యాసాయన కాల భేదము సూర్యగోళ పరిభ్రమణమును బట్టి ఇది దేవలోక పితృలోక మానవ లోకములం దేర్పడును. ఇది ఖగోళ శాస్త్ర విజ్ఞాన విషయము. పురాణము లందిది కథా రూపమున ప్రతిపాదితము.