కేశిధ్వజుడు:
నప్రార్థితం త్వయాకస్మాదస్మద్రాజ్యమకణ్టకమ్।
రాజ్యలాభాద్వినానాన్యత్ క్షత్రియణామతిప్రియమ్॥
కేశిధ్వజుడు:
రాజ్య లాభము కంటె క్షత్రియుల కతిప్రియ మింకొకటి లేదు. నీవకంటక మైన నా రాజ్యము నీ వెందువలన గోర లేదు
ఖాండిక్యుడు:
కేశిధ్వజనిభోధత్వం మయానప్రార్థితం యతః।
రాజ్యమేతదశేషం తేయత్రగృధ్నన్త్యపణ్డితాః॥
క్షత్రియాణామయం ధర్మోయత్ ప్రజా పరిపాలనమ్।
వధశ్చ ధర్మయుద్ధేన స్వరాజ్యపరిపన్ధినామ్॥
తత్రాశ క్తస్యమేదోషోనై వాస్త్యహృతే త్వయా।
బన్ధాయైవభవత్యేషాహ్యవిధ్యాఽప్యక్రమోజ్ఘితా॥
జన్మోపభోగలిప్సార్థమిహం రాజ్యస్పృహామమ.।
అన్యేషాం దోషజాసై వధర్మం వైనానురుధ్యతే॥
నయాచ్ఞాక్షత్రబన్ధూనాం ధర్మాయైతత్సతాం మతమ్.।
అతోనయాచితం రాజ్యమవిద్యాన్తర్గతం తవ॥
రాజ్యేగృధ్నన్త్యవిద్వాం సోమమత్వాహతచేతసః।
అహం మానమహాపానమదమత్తా నమాదృశాః.॥
ఖాండిక్యుడు:
నేను రాజ్యమర్థింప కుండుటకు కారణ మెను దెల్పెదం దెలిసి కొనుము. రాజ్యమెల్ల గావలెనని యవిద్వాంసు లయిన రాజులు లోభవశు లగుదురు. ప్రజాపాలనము ధర్మ యుద్దముచే తన రాజ్యమునకు శత్రువు లయిన వారిం జంపుటయు క్షత్రియులకు ధర్మము ఆపని యందశక్తుడనై నేను నీచే రాజ్య మపహరింప బడినానన్న దానిలో నా దోషము లేనే లేదు. అవిద్య క్రమము దోషజన్యమే. అందు ధర్మ మనుసరింప బడదు. క్షత్ర బంధువులు ధర్మ నిమిత్తముగనే రాజ్యము నడుగుకొనరు. ఇది సత్పురుష సమ్మత మైన రీతి. అవిద్యాంతర్గతము కావున నీ రాజ్యము నేనడిగి కొనలేదు. మమకారముచే మతిచెడిన యజ్ఞానము అహం మమభిమాన మహాపానముచే నయినమదముచే నొడలు తెలియని వారు రాజ్యము నెడ దురాశ గొందురు. కాని నావంటి వారది కోరరు.
శ్రీపరాశరుడు:
ప్రహృష్టస్సాధ్వితితతః ప్రాహకేశిధ్వజో నృపః।
ఖాణ్డిక్య జనకం ప్రీత్యాశ్రూయతాం వచనం మమ॥
శ్రీపరాశరుడు:
అన విని కేశిధ్వజుడు బాగున్నదని మెచ్చికొని ప్రీతితో ఖాండిక్య జనకునితో వినుమని యిట్లు పలికెను
కేశిధ్వజుడు:
అహంహ్యవిద్య యామృత్యుం తర్తుకామః కరోమివై.।
రాజ్యం యాగాంశ్చ వివిధాన్భోగైః పుణ్యక్షయం తథా॥
తదిదం తేమనోదిష్ట్యా వివేకై శ్వర్యతాం గతమ్.।
తచ్చ్రూయతామవిద్యా యాస్స్వరూపం కులనన్దన॥
అనాత్మన్యాత్మబుద్ధిర్యాచాస్వేస్వమితియామతిః.।
అవిద్యాతరు సంభూతి భీజమేతద్ద్విధా స్థితమ్॥
పఞ్చభూతాత్మకే దేహేదేహీ మోహతమోవృతః.।
అహమ్మమైతదిత్యుచ్చైః కురుతే కుమతిర్మతిమ్॥
ఆకాశవాయ్వగ్ని జలపృథివీభ్యః పృథక్థ్సితే।
ఆత్మన్యాత్మమయం భావం కః కరోతి కళేబరే॥
కళేబరోపభోగ్యం హిగృహక్షేత్రాదికం చకః।
అదేహేహ్యాత్మని ప్రాజ్ఞో మమేదమితి మన్యతే॥
ఇత్ధం చపుత్రపౌత్రేషుతద్దేహోత్పాదితేషుకః।
కరోతిపణ్డితస్స్వామ్యమనాత్మనికళేబరే॥
సర్వందేహోపభోగాయ కురుతేకర్మ మానవః।
దేహశ్చాన్యోయదాపుంస స్తదాబన్ధాయతత్పరమ్॥
మృణ్మయం హియథాగేహం లిప్యతేవై మృదమ్భసా।
పార్ధివోఽయం తథాదేహోమృదమ్భాలేపనస్థితిః॥
పఞ్చభూతాత్మకైర్ భోగైః పఞ్చభూతాత్మకం వపుః।
ఆప్యాయతే యది తతః పుంసో భోగోత్రకింకృతః॥
అనేక జన్మసాహస్రీం సంసారపదవీం వ్రజన్।
మోహశ్రమం ప్రయాతోఽసౌవాసనారేణుకుణ్ఠితః॥
ప్రక్షాళ్యతేయదాసోస్య రేణుర్ జ్ఞానోష్ణవారిణా।
తదా సంసారపాన్థస్యయాతి మోహశ్రమశ్శమమ్॥
మోహశ్ర మేశమం యాతేస్వస్థాన్తః కరణః పుమాన్।
అన్యనాతిశయాబాధం పరం నిర్వాణమృచ్ఛతి॥
నిర్వాణమయ ఏవాయమాత్మా జ్ఞానమయోఽమలః.।
దుఃఖాజ్ఞానమయా ధర్మాః ప్రకృతే స్తేతునాత్మనః॥
జలస్యనాగ్ని సంసర్గస్ధ్సాలీసంగా త్తథాపిహి।
శబ్దోద్రేకాదికాన్ ధర్మాన తత్ కరోతి యథా నృప॥
తథాఽఽత్మా ప్రకృతేస్సంగాదహం మానాదిదూషితః।
భజతే ప్రాకృతాన్ ధర్మానన్య స్తేభ్యోహిసోఽవ్యయః॥
తదేతత్కథితం బీజ మవిద్యాయామయాతవ.।
క్లేశానాం చక్షయకరం యోగాదన్యన్న విద్యతే॥
కేశిధ్వజుడు:
నేను అవిద్యచే మృత్యువుం దరింప గోరి రాజ్యము వివిధ యాగములను భోగములను ననుభవించుట మూలమున పుణ్య క్షయమును జేయుచున్నాను. నీ మనస్సు నీ భాగ్యమున వివేకైశ్వర్య భావముం బొందినది. కుల నందనుడ వీవవిద్యా స్వరూపమును వినుము. ఆత్మగాని దాని యందాత్మ బుద్ది తనది గాని దాని యందు తనదను తలంపు ననునిది యవిద్యా తరువునం బుట్టిన బీజము రెండుగా నున్నది. పాంచభౌతిక దేహమందు దేహి మొహతమంబునం జుట్టుకొని యహం = నేను, ఇదం మమ = ఇది నాది యని తలంపును గుమతియై చేయును. శరీరమందు ఆకాశాది పంచ భూతముల కంటె వేరుగా నున్న యాత్మయందాత్మ మయ భావన నెవ్వడు సేయును? (ఎవ్వడును సేయుట లేదని భావము) గృహ క్షేత్ర కలత్రాదికము కళేబరోప భోగ్యము నెవ్వడు నేను నాది యనును? దేహము గాని యాత్మ విషయములలో ప్రాజ్ఞుడిది నాదనుకొనును. ఈ విధముగా తన దేహముచే బుట్టింప బడిన పుత్రా పౌత్రాదుల యందు జ్ఞాని యెవ్వడు స్వామ్యమును చేయును? అట్లే ఆత్మకాని కళేబర మందును స్వామ్యము నెవ్వడును చేయడు. మానవుడు దేహోప భోగము కొఱకే సర్వకర్మమును జేయును. ఆ దేహము పురుషుని కంటె నెపుడు వేరగునో దానికి చేయు కర్మమప్పుడు బంధ హేతువగును. మట్టితో గట్టిన ఇల్లు మట్టి నీళ్లచే (బురదచే) పూయ బడునో మట్టి గిలాబా చేయు పార్థివమైన యీ దేహము (భూమిభాగా మేచ్చుగా గల శరీరము) మట్టి నీళ్లచే (బురదచే) పూయ బడినట్లు గిలాబా చేయ బడినట్లు పృథివీ భూత జలభూత జన్యమైన అన్నాదులచే బూయ బడును. పెంపబడును. పంచ భూతాత్మక భోగములచే బంచ భూతాత్మక శరీర మాప్యాయనము సేయ బడుచున్నదేని దానిచే పురుషునకు భోగ మిక్కడెక్కడిది? అనేక జన్మసహస్ర పరిమితి గల సంసార పదవిం జరించుచు మోహమను శ్రమకు గురియై యీ దేహి వాసన లనెడి రేణువుల (ధూళి) క్రమ్ముకొని యుండును. వీని యీ రేణువుల జ్ఞాన వారిచే నెప్పుడు కడుగ బడునప్పుడు సంసార పాంథుని మోహశ్రమము శాంతి నొందును. మోహశ్రమము శమింపగనే యంతః కరణ స్వస్థమై పురుషుడు అనన్యాతి శయమైన బాధా రాహిత్యమును బొంది పరమ నిర్వాణమును (మోక్షమును) బొందును. ఆత్మయను నిది నిర్వాణ మయము జ్ఞానమయము అమలము. దుఃఖాజ్ఞాన మయమయిన యాయా ధర్మములు ప్రకృతివి గాని ఆత్మవి గావు. నీటి కగ్ని సంసర్గము లేదు. అయిన స్థాలీ సంగము వలన గిన్నేతోడి సంసర్గము వలననది దానికి గల్గి శబ్దము = చప్పుడు, ఉద్రేకము = పొంగు మొదలయిన ధర్మములను ఆ నీరు చేయును. అట్లే ఆత్మ ప్రకృతి సంగము వలన అహం మమాభిమానాదులచే దూషితమగు చుండును. అగుచు వానికంటె వేరయ్యు నవ్యయమయ్యు నయ్యాత్మ యాయా ప్రాకృత ధర్మములను బొందును. అవిద్యా బీజమిది నీకు వివరించి చెప్పితిని. దుఃఖములకు క్షయ కరమైనది యోగము కంటె మఱి యొకటి లేదు.
ఖాండిక్యుడు:
తంబ్రవీహిమహాభాగయోగం యోగవిదుత్తమ।
విజ్ఞాతయోగశాస్త్రార్థస్త్వమస్యాం నిమిసంతతౌ॥
ఖాండిక్యుడు:
యోగవేత్తలలో నుత్తమ! ఈ నిమి సంతతిలో యోగ శాస్త్రార్థము చక్కగా నెరిగిన మహానుభావుడవు నీవు యోగమును గరించి చెప్పుమన
కేశిధ్వజుడు:
యోగాస్వరూపం ఖాండిక్య! శ్రూయతాం గదతోమమ।
యత్రస్థితోనచ్యవతేప్రాప్య బ్రహ్మలయం మునిః॥
మన ఏవమనుష్యాణాం కారణం బన్ధమోక్షయోః।
బన్దాయవిషయాసంగి ముక్యై నిర్విషయం మనః॥
విషయేభ్యస్సమాహృత్య విజ్ఞానాత్మామనో మునిః।
చిన్తయేన్ముక్తయేతేన బ్రహ్మభూతం పరేశ్వరమ్॥
ఆత్మభావం నయత్యేనం తద్బ్రహ్మధ్యాయినం మునిమ్।
వికార్యమాత్మనశ్శక్త్యా లోహమాకర్షకో యథా॥
ఆత్మప్రయత్నసాపేక్షా విశిష్టాయా మనోగతిః।
తస్యా బ్రహ్మణి సంయోగో యోగమిత్యభిధీయతే॥
ఏవమత్యన్తవైశిష్ట్యయుక్త ధర్మోప లక్షణః।
యస్య యోగస్యవై యోగీ ముముక్షురభిధీయతే॥
యోగయుక్ప్రథమం యోగీ యుఞ్జానోహ్యభిధీయతే।
వినిష్పన్నసమాధిస్తు పరం బ్రహ్మోపలబ్ధిమాన్॥
యద్యన్తరాయదోషేణ దూష్యతే చాస్య మానసమ్।
జన్మాన్తరైరభ్యసతో ముక్తిః పూర్వస్యజాయతే॥
వినిష్పన్నసమాధిస్తు ముక్తిం తత్రైవ జన్మని।
ప్రాప్నోతి యోగీ యోగాగ్నిదగ్ధకర్మచయోచిరాత్॥
కేశిధ్వజుడు:
బ్రహ్మమందు లయమందిన ముని యెచ్చట నున్నను నందుండి జారిపోడు. మానవులకు బంధ మోక్షములకు మనస్సే కారణము. అది విషయము లందుత్తుకొన్న బంధనమునకు గారణ మగును. నిర్విషయ మైనచో ముక్తికి హేతువగును. విజ్ఞాన స్వరూపుడైన ముని విషయముల నుండి మనస్సును సమాహరించి (వెనుకకు లాగి) ముక్తి కొఱకు బ్రహ్మమేయైన పరమేశ్వరుని ధ్యానింప వలెను. అట్టి బ్రహ్మధ్యాన నిష్టుని యీ మనస్సు ఆయస్కాంతము తన శక్తిచే వికారము లందదగిన లోహము నట్లు ఆత్మ భావమును బొందించును. ఆత్మ ప్రయత్నము తోడి యపేక్షగల విశిష్టమైన యేమనోగతి గలదో ఆ గతిని బ్రహ్మమందు లగించుటయే యోగమని చెప్ప బడును. (అనగా సాధకుడు గట్టి ప్రయత్నము చేసి సంకల్ప వికల్పక మయిన మనస్సు ఇతర విషయముల వెంటబోకుండ సంహరించి ఆత్మ యందు (బ్రహ్మ మందు) దృఢముగా నిలువరించుటయే యోగ శబ్దమున కర్థమన్న మాట). ఇట్లు మిక్కిలి వైశిష్ట్యముతో (అనుసంధానము నందలి నేరుపుతో) గూడిన ధర్మము లక్షణముగా గల యోగమెవ్వని కనువు పడునో యట్టి యోగి ముముక్షువు (మోక్షమును కోరువాడు) అనబడును. మొట్టమొదట యోగాభ్యాసమునకు బూనుకొన్న వాడు) ‘యుంజానుడు’ అనబడును. సమాధి చక్కగా గుదిరి పరబ్రహ్మోప లబ్ది నందినవాడు అంతరాయ దోషము చేత యోగ నిఘ్నము లని శాస్త్రమందు జెప్పబడిన యభ్యంతరముల దోశంయుచే నీ సాధకుని మనస్సు దూషిత మగునేని (యోగభ్రష్టు డగునేని యన్నమాట).
తరువాత జన్మము లందా యోగ విధిని మానకుండ పట్టుకొని యభ్యసించు నేని వానికి ముక్తి కలిగి తీరును. తొలి జన్మయందే సమాధి చక్కగా గుదిరేనేని యతడా జన్మ మందే ముక్తిపొందును. అప్పుడు యోగాగ్ని చేత నాతని పూర్వ జన్మకర్మము వర్తమానము గూడ యప్పుడే దగ్ధమై పోవును.
బ్రహ్మచర్యమహింసాంచ సత్యాస్తేయాపరిగ్రహాన్।
సేవేతయోగీ నిష్కామో యోగ్యతాం స్వమనోనయన్॥
స్వాధ్యాయశౌచసంతోషతపాం సినియతాత్మవాన్।
కుర్వీత బ్రహ్మణి తథా పరస్మిన్ ప్రవణం మనః॥
ఏతేయమాస్సనియమాః పఞ్చ పంచచకీర్తితాః।
విశిష్టఫలదాః కామ్యా నిష్కామానాం వియుక్తిదాః॥
ఏకం భద్రాసనాదీనాం సమాస్ధాయ గుణైర్యుతః।
యమాఖ్యైః నియమాఖ్యైశ్చ యుఞ్జీతనియతో యతిః॥
ప్రాణాఖ్యమవనిలం వశ్యమభ్యాసాత్కురుతేతుయత్।
ప్రాణాయామస్సవిజ్ఞేయస్సబీజోఽబీజ ఏవచ.॥
పరస్పరేణాభిభవం ప్రాణాపానౌ యథానిలౌ।
కురుతస్సద్విధానేన తృతీయ స్సంయమాత్తయోః.॥
తస్య చాలమ్బనవత స్స్థూలరూపం ద్విజోత్తమ।
ఆలమ్బనమన న్తస్యయోగినోభ్యసతః స్మృతమ్॥
శబ్దాదిష్వనుర క్తాని నిగృహ్యాక్షాణి యోగవిత్।
కుర్యాచ్చిత్తానుకారీణి ప్రత్యాహారపరాయణః॥
వశ్యతా పరమాతేన జాయతేతిచలాత్మనామ్।
ఇన్ద్రియాణామశ్యైస్తైర్నయోగీ యోగసాధకః॥
ప్రాణాయామేన పవనే ప్రత్యాహారేణ చేన్ద్రియే।
వశీకృతేతతః కుర్యాత్ స్థితం చేతశ్శుభాశ్రయే॥
యోగి బ్రహ్మచర్యము అహింస సత్యము అస్తేయము (దొంగతనము లేకుండుట) అపరిగ్రహము (దానము పట్టకుండుట) అను ధర్మములను జక్కగా సేవించుచు తన మనస్సును యోగ్యతను (యోగార్హతను) పొందించుచు స్వాద్యాయము శౌచము సంతోషము తపస్సు అనువాని నాచరించుచు నియతాత్ముడై మనస్సును పరబ్రహ్మ మందు ప్రవణ మయిన దానింగా (లగ్నమయిన దానినిగా లేక ఆవంకకు బ్రసరించునదిగా) నొనరింప వలెను. ఈ చెప్పిన నియమము లైదు. వీనితో బాటు యమము లైదు. (ధ్యాన ధారణాదులు) యోగ శాస్త్రమందు జెప్ప బడినవి. కామ్యము లయినపుడు విశిష్ట లయిన ఫలముల నిచ్చును. అవే నిష్కామములయిన వారికి ముక్తి నిచ్చును. యతి (మనస్సును నియమించుకొన్న యోగి యన్నమాట) భాద్రాసనములు మొదలగు యోగాసనముల లక్షణములతో గూడి యోగి యమ నియమములతో యోగమును సంధాన పరచు కొనవలెను. ప్రాణమను పేరుగల వాయువును అభ్యాసము వలన వశము సేసికొనుట యనునది “ప్రాణాయామము” అన బడును. అది సబీజము నిర్బీజముగా రెండు విధములని యెరుంగనగును. ప్రాణ వాయువు (హృదయ మందున్న గాలి) అపాన వాయువు (గుదమందుండు నది) అను నీ రెండు గాలులు నోకదానితో నొకటి (తిరస్కరించు నప్పుడు) యెదురయి నపుడు వానిని రెండింటిని చక్కని రీతిలో సంయమించి (నిరోధించి) ఆలంబించుట మూడవ యోగ భూమిక. అది స్థూల రూపము. అట్టి యాలంబనమును విడువక యోగి యభ్యసింప వలెను. అందు శబ్దాది విషయానురక్తము లయిన శ్రవణేంద్రియములను యోగవేత్త నిగ్రహించి చిత్తాను కారులం గావింప వలెను. చిత్తము వెంట నుండు వానిం జేయవలెను. అదే ప్రత్యాహార మనబడును. దానిచే నతి చంచలము లైన యింద్రియములు వశ్యము లగుటయను పరమ యోగ భూమిక సమకూరును. అవి వశములు గానిచో యోగి యోగ సాధకుడు గానేరడు. ప్రాణాయమముచే వాయువు ప్రత్యాహారముచే నింద్రియము వశము చేయబడిన తరువాత
యోగి మనస్సును శుభాశ్రయ మందు సగుణమైన భగవాన్ మూర్తి యందు లేక నిర్గుణ పరబ్రహ్మ మందో నిలకడ చెందిన దానిం గావింప వలెను. అన విని
ఖాండిక్యుడు:
కథ్యతాం మే మహాభాగ చేతసోయశ్శుభాశ్రయః।
యదాధారమశేషం తద్ధన్తి దోషమలోద్భవమ్॥
ఖాండిక్యుడు:
మహానుభావా! ఈ చిత్తమునకు శుభాశ్రయ మేది? దేని నాధారము సేసికొని యీ మనస్సు దోష మలముల పుట్టుకకు హేతువైనయా మనస్సు నశింప జేయును? ఆ వివరము తెలుపు మన
కేశిధ్వజుడు:
ఆశ్రయశ్చేతసోబ్రహ్మద్విధా తచ్చ స్వభావతః।
భూపమూర్తమమూర్తం చ పరం చాపరమేవచ॥
త్రివిధాభావనాభూప విశ్వమే తన్నిభోధతామ్।
బ్రహ్మాఖ్యాకర్మసంజ్ఞా చతథాచై వోభయాత్మికా॥
కర్మభావాత్మికాహ్యేకాబ్రహ్మభావాత్మికాపరా।
ఉభయాత్మికాతథై వాఽన్యా త్రివిధా భావభావనా॥
సనన్దనాదయోయేతు బ్రహ్మభావనయాయుతాః।
కర్మభావనయా చాన్యే దేవాద్యాస్ద్సావరావరాః॥
హిరణ్యగర్భాదిషుచ బ్రహ్మకర్మాత్మికాద్విధా।
భోధాధికారయు క్తేషువిద్యతే భావభావనా॥
అక్షీణేషుసమస్తేషు విశేషజ్ఞానకర్మసు।
విశ్వమేతత్పరంచాన్యద్భేదభిన్నదృశాం నృణామ్॥
ప్రత్యస్తమితభేదం యత్సత్తామాత్రమగోచరమ్।
వచసామాత్మసంవేద్యం తత్ జ్ఞానం బ్రహ్మసంజ్ఞితమ్॥
తచ్చవిష్ణోః పరం రూపమరూపాఖ్యమనుత్తమమ్।
విశ్వస్వరూపవై రూప్యలక్షణం పరమాత్మనః॥
కేశిధ్వజుడు:
రాజా! చేతస్సునకు (మనస్సునకు) ఆశ్రయము నిజముగా మూర్తము. అమూర్థము రెండు విధము లయిన వస్తువు. అమూర్థము (నిర్గుణము) పరము. మూర్తము (సగుణము) అపరము. భావనయు మూడు విధములు. ఒకటి కర్మ భావన రెండు బ్రహ్మ భావన మూడు కర్మ బ్రహ్మో భయాత్మిక. సనంద నాదులు (బ్రహ్మ మానస పుత్రు) బ్రహ్మ భావనా సంపన్నులు. దేవాది స్థావర జంగమ భూతములు కర్మ భావనా పరులు. హిరణ్య గర్భాదు లందు బ్రహ్మకర్మాత్మిక రూపము భయ భావన యుండును. జ్ఞానాదికారు లయిన వారి యందు భావభావన యుండును. విశేష జ్ఞాన కర్మము లన్నియు క్షీణము కానప్పుడు ఇది విశ్వము, దీనికి పరమైన దింకొకటి యున్నది అను భేదముచే భిన్నమయిన దృష్టి కలవారికి ఈ ద్యైత భావ ముండును. భేదమస్త మించి యేది సత్తామాత్రము వాచామ గోచరము ఆత్మ సంవేద్యము నైన బ్రహ్మ జ్ఞానమను పేరిజ్ఞానమది విష్ణువు యొక్క పరరూపమది యా రూపము అనుత్తమము (దానికంటె మరి యుత్తమము లేదన్న మాట) విశ్వము యొక్క యీ పరమాత్మ యొక్క యీ పరమాత్మ యొక్క రూప వైరూప్య లక్షణములు రెండును గలది యది. అది యోగ నిష్టునికి జింతింప (ద్యానింప) శక్యము గాదు. అందువలన హరి యొక్క స్థూల రూపము విశ్వ రూపమున గోచరమగు దానినే చింతింప వలెను. (ధ్యానము సేయ వలెను)
నతద్యోగయుజాశక్యం నృప! చిన్తయితుం యతః।
తతః స్థూలం హరేరూపం చిన్తయేద్విశ్వ గోచరమ్॥
హిరణ్య గర్భో భగవాన్ వాసుదేవః ప్రజాపతిః।
మరుతోవసవోరుద్రాభాస్కరాస్తారకాగ్రహాః॥
గన్ధర్వాయక్షదై త్యాద్యాస్సకలా దేవయోనయః।
మనుష్యాః పశవశ్శైలాస్సముద్రాస్సరితోద్రుమాః॥
భూపభూతాన్య శేషాణి భూతానాం యేచ హేతవః।
ప్రధానాదివిశేషా న్తంచేతనాచేతనాత్మకమ్॥
ఏకపాదం ద్విపాదఞ్చ బహు పాదమపాదకమ్।
మూర్తమేతద్ధరే రూపం భావనాత్రితయాత్మకమ్॥
ఏతత్సర్వమిదం విశ్వం జగదేతచ్చరాచరమ్।
పరబ్రహ్మస్వరూపస్య విష్ణోశ్శక్తి సమన్వితమ్॥
విష్ణుశక్తిః పరాప్రోక్తా క్షేత్రజ్ఞాఖ్యాతథాపరా।
అవిద్యాకర్మసంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే॥
యయాక్షేత్రజ్ఞ శక్తిస్సావేష్టితా నృపసర్వగా।
సంసారతాపానఖిలానవాప్నోత్యతిసంతతాన్॥
తయాతిరోహితత్వాచ్చ శక్తిః క్షేత్రజ్ఞ సంజ్ఞితా।
సర్వభూతేషు భూపాల తారతమ్యేన లక్ష్యతే॥
అప్రాణవత్సుస్వల్పాసా స్థావరేషుతతోఽధికా।
సరీసృపేషుతేభ్యోఽపి హ్యతిశక్త్యాపతత్రిషు॥
పతిత్రిభ్యోమృగా స్తేభ్యస్తచ్చక్త్యాపశవోధికాః।
పశుభ్యోమనుజాశ్చాతిశక్త్యా పుంసః ప్రభావితాః॥
తేభ్యోఽపి నాగగన్ధర్వ యక్షాద్యా దేవతా నృప॥
శక్రస్సమస్తదేవేభ్యస్తతశ్చతి ప్రజాపతిః।
హిరణ్యగర్భోఽపి తతః పుంసశ్శక్త్యుపలక్షితః॥
ఏతాన్య శేషరూపాణి తస్య రూపాణి పార్థివ।
యత స్తచ్ఛక్తియోగేన యుక్తాని నభసాయథా॥
హిరణ్య గర్భుడు భగవంతుడు వాసుదేవుడు ప్రజాపతి మరుత్తులు వసువులు రుద్రులు భాస్కరులు (ద్వాదశాదిత్యులు) తారకలు గ్రహములు గంధర్వ యక్ష దైత్యుదులు సర్వ దేవా యోనులు మనుష్యులు పశువులు శైలములు సముద్రములు నదులు చెట్లు అశేష భూతములు వానికి హేతువు లయిన ప్రధానము మొదలయిన విశేషములు చేతనము అచేతనము నైనది ఏకద్విపాత్పంచ బహుపాదము లయిన ప్రాణులు అపాదకము (పాదములు లేనిది) నైన మూర్తమయిన యీ ప్రపంచ మెల్ల హరి యొక్క రూపము. త్రివిధ భావనా రూపము. ఈ చరాచరాత్మక విశ్వమది ఎల్ల పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువు యొక్క శక్తితో గూడినది. విష్ణు శక్తి పరయను పేర నొకటి క్షేత్రజ్ఞ యను పేరా అపరయను పేర రెండవది అవిద్య కర్మయను పేర మూడవ శక్తి యున్నది. ఈ అవిద్యా కర్మ రూపమైన మూడవ శక్తి చేతనే సర్వగమయిన క్షేత్రజ్ఞ శక్తి వేష్టితమై యున్నది. ఆవృతయైయున్న దన్నమాట. అదే సంసార తాపము లన్నిటిన విరామము లయిన వాని ననుభవించును. ఆ మూడవ శక్తిచే గప్పుపడిన కతననే క్షేత్రజ్ఞ శక్తి సర్వ భూతము లందు తరతమ భేదముచే గానబడు చుండును. ప్రాణములు లేని వాటి యందది మిక్కిలి అల్పము. స్థావరము లందంత కంటె కంచె మెక్కువ. సరీ సృపాదుల యందు, పాములు తేళ్ళు మొదలగు వాని యందది అంతకంటె నెక్కువ. పక్షులందంత కంటె, మృగము లందంత కంటె పశువు లందంత కంటె మనుజు లందంత కంటె ఆ పరమ పురుషుని ఆత్మయొక్క శక్తి ప్రభావితమై యున్నది. మానవుల కంటెను పైని నాగ గంధర్వ యక్షాదులు దేవతలు వారి కంటె శక్రుడు (ఇంద్రుడు) అంతకంటె ప్రజాపతి ఆపైని హిరణ్య గర్భుడు నెక్కువగు ఆత్మ శక్త్యుప లక్షితుడై యున్నాడు. ఆకాశముచే నంతయు గూడి యున్నట్లు ఈ చెప్పిన అశేష రూపములు నా ఆత్మ శక్తి యోగముచే నాతని రూపము లేయై యున్నవి. ఇది విష్ణువు యొక్క మూర్త రూపము, విశ్వరూపము.
ద్వితీయం విష్ణుసంజ్ఞస్య యోగిధ్యేయం మహామతే।
అమూర్తం బ్రహ్మణో రూపం యత్సదిత్యుచ్యతేబుధైః॥
సమస్తాశ్శక్తయశ్చైతా నృప యత్ర ప్రతిష్ఠితాః।
తద్విశ్వరూప వైరూప్యం రూపమన్యద్ధరేర్మహత్॥
సమస్తశక్తిరూపాణి తత్కరోతి జనేశ్వర।
దేవతిర్యఙ్మనుష్యాదిచేష్టావన్తి స్వలీలయా॥
జగతాముపకారాయనసాకర్మమనిమిత్తజా।
చేష్టాతస్యాప్రమేయస్య వ్యాపిన్యవ్యాహతాత్మికా॥
తద్రూపం విశ్వరూపస్యతస్యయోగయుజా నృప।
చిన్త్యమాత్మవిశుద్ధ్యర్ధం సర్వకిల్బిషనాశనమ్॥
యథాగ్నిరుద్ధతశిఖః కక్షం దహతి సానిలః।
తథాచిత్తస్థితో విష్ణుర్యోగినాం సర్వకిల్బిషమ్॥
తస్మాత్సమస్తశక్తీనామాధరేతత్ర చేతసః।
కుర్వీతసం స్థితిం సాతు విజ్ఞేయా శుద్ధధారణా॥
శుభాశ్రయస్సచిత్తస్యసర్వగస్యాచలాత్మనః।
త్రిభావభావనాతీతో ముక్తయే యోగినోనృప॥
అన్యేతుపురుషవ్యాఘ్రచేతసో యేవ్యపాశ్రయాః।
అశుద్ధాస్తేసమస్తాస్తు దేవాద్యాః కర్మయోనయః॥
మూర్తం భగవతో రూపం సర్వాపాశ్రయనిస్పృహమ్।
ఏషావై ధారణాప్రోక్తాయచ్చిత్తం తత్రధార్యతే॥
యచ్చమూర్తం హరే రూపం యాదృక్చిన్త్యం నరాధిప।
తచ్ఛ్రూయతామనాధారాధారణా నోపపద్యతే॥
ఇక విష్ణువు యొక్క రెండవ రూపము యోగి ధ్యేయము. అమూర్తము బ్రహ్మ యొక్క రూపము పండితులు దాని ‘సత్’ ఉన్న వస్తువని పల్కుదురు. ఈ సమస్త శక్తులు నెందు బ్రతిష్టితము లయి యున్నవో అది విశ్వరూప వైరూప్యమైన హరి యొక్క మరియొక్క మహా రూపమది. అది తన లీలచే దేవతిర్యఙ్మనుష్యాది చేష్టలు గల సమస్త శక్తి రూపములను జేయు చుండును. అది జగత్తున కుపకారక మాశక్తి కర్మ నిమిత్తమున బుట్టినది గాదు. ఆ యప్రమేయమైన బ్రహ్మము యొక్క యవ్యాహతమైన సర్వ వ్యాపిని యైన చేష్టయది. విశ్వరూపు డయిన పర బ్రహ్మ యొక్క యా శక్తి రూపము సర్వ పాప హరమది యోగానుసంధాన పరుడైన వానిచే ఆత్మ విశుద్ది కొఱకు ద్యానింప దగినది. అగ్ని జ్వాలలెగయ వాయువుతో గూడి కక్షమును గడ్డిని లేదా యడవిని దహించు నట్లా విష్ణువు యోగుల చిత్తము నందుండి సర్వ కిల్బిషములను దహించును. కావున సమస్త శక్తుల కాదరువైన యా విష్ణువు నందు మనస్సు యొక్క ధారణను నిలుకడను జేయవలెను. అదే శుద్ధ ధారణ యనబడును.
ప్రసన్న వదనం చారు పద్మపత్రోయతేక్షణమ్।
సుకపోలం సువిస్తీర్ణ లలాటఫల కోజ్జ్వలమ్॥
సమకర్ణా న్తవిన్యస్త చారుకుణ్డల భూషణమ్।
కంబుగ్రీవం సువిస్తీర్ణ శ్రీవత్సాంకిత వక్షసమ్॥
వలిత్రిభఙ్భనామాగ్ననాభినాహ్యుదరేణచ।
ప్రలమ్బాష్ట భుజం విష్ణు మథవాపి చతుర్భుజమ్॥
సమస్ధితోరుజఙ్ఘఞ్చసుస్థితాఙ్ఘ్రివరామ్బుజమ్।
చిన్తయేద్బ్రహ్మ భూతం తంపీత నిర్మల వాసనమ్॥
కిరీటహార కేయూర కటకాది విభూషితమ్॥
శార్ఙశంఖ గదాఖడ్గ చక్రాక్ష వలయాన్వితమ్।
వరదాభయ హస్తఞ్చముద్రికారత్న భూషితమ్॥
చిన్తయేత్తన్మయో యోగీ సమాధాయాత్మమానసమ్।
తావద్యావద్దృఢీ భూతాతత్రైవ నృపధారణా॥
వ్రజతస్తిష్ఠతోన్యద్వా స్వేచ్ఛయా కర్మకుర్వతః।
నాపయాతి యదా చిత్తాత్సిద్దాం మన్యేతతాం తదా॥
ఆ ధారణ యందు ప్రసన్న ముఖుడు పద్మ పత్రాయ తేక్షణుడు సుకపోలుడు సువిశాల లలాట ఫలకోజ్జ్వలుడు సమకర్ణముల తోడ నంప బడిన చక్కని కుండలా లంకారములు గలవాడు కంబుగ్రీవుడు సువుశాల శ్రీవత్సాంకిత వక్షుడు కడుపుపై మూడు ముడుతలతో లోతైన బొడ్డుతో గూడిన కడుపుతో ప్రలంబ మాణ భుజాష్టకముతో ఎనిమిది దీర్ఘ బాహువులతో లేదా నాల్గు భుజములతో గూడిన సమముగా నున్న తొడలు పిక్కలి గల్గి చాల చక్కగ నున్న పాదాంబుజ యుగముతో పీత నిర్మలామ్బర ధారిని హరిణి సాక్షాత్ర్బహ్మమేయైన వానిని ధ్యానింప వలెను. నడచుచున్న నిలిచి యున్న మది స్వేచ్చగానే పని చేయు చున్నాను మనసు నుండి యా ధ్యాన లక్ష్యము (గురి) అయిన పరమాత్మ వస్తువు (మూర్తము) తొలగ కున్నచో నపుడా ధారణ సిద్దించి నట్లెరుగా వలయును.
తతశ్శఙ్ఖ గదాచక్ర శార్ఙ్గదిరహితం బుధః।
చిన్తయేద్భగవద్రూపం ప్రశాన్తం సాక్షసూత్రకమ్॥
సాయదా ధారణా తద్వదవస్థానవతీ తతః।
కిరీటకేయూర ముఖైః భూషణైః రహితం స్మరేత్॥
తదేకావయవం దేవం చేతసాహి పునర్బుధః।
కుర్యాత్తతోఽవయవినిప్రణిధానపరోభవేత్॥
తద్రూపప్రత్యయాచై కాసన్తతిశ్చాన్యనిస్పృహా।
తద్ధ్యానం ప్రథమైరఙ్గైః షడ్భిర్నిష్పాద్యతే నృప॥
తస్యైవకల్పనాహీనం స్వరూప గ్రహణం హియత్।
మనసా ధ్యాన నిష్పాద్యం సమాధిస్సోభిధీయతే॥
విజ్ఞానం ప్రాపకం ప్రాప్యే పరేబ్రహ్మణి పార్థివ।
ప్రాపణీయ స్తథైవాత్మా ప్రక్షీణాశేష భావనః॥
క్షేత్రజ్ఞః కరణీజ్ఞానం కరణం తస్యతేనతత్।
నిష్పాద్య ముక్తికార్యం వైకృతకృత్యం నివర్తతే॥
తద్భావభావనాపన్నస్తతోఽసౌ పరమాత్మనా।
భవత్యభేదీ భేదశ్చ తస్యాజ్ఞానకృతో భవేత్॥
విభేదజనకేజ్ఞానే నాశమాత్యన్తికం గతే।
ఆత్మనో బ్రహ్మణోభేద మనన్తంకః కరిష్యతి॥
ఇత్యుక్తస్తేమయా యోగః ఖాండిక్య పరిపృచ్ఛతః।
సంక్షేపవి స్తరాభ్యాంతుకిమన్యత్ర్కియతాం తవ॥
అటుపైని కొన్నాళ్ళకు శంఖ చక్రాదులు లేని అక్షసూత్రముతో నున్న భగవద్రూపమును (పరిమితముగా) ద్యానింప వలెను. ఆ ధారణ యెప్పుడు పైదానివలె నిలుకడ చెందునో కిరీట కేయూరాది భూషణ రహితముగ నా రూపము ద్యానింప వలెను. ఆ మీద నొక్కొక్క యవయవ మందు ధ్యానము నిలుప వలెను. దానిచే యవయవియందు బ్రణిధానము నొందవలెను. అదే రూపము నందు దృఢపడి అన్య వస్తువునెడ స్పృహ గొనక యుండు నా ద్యానము మొట్టమొదటి యోగామ్గము లారింటి చేత నేర్పడును. అదే ధ్యానము యొక్క రూపాంతరము కల్పనా రహిత మయిన కేవల రూపగ్రహ్న మనునదేది గలదో యది మనస్సుచే ధ్యాన మందేర్పరుప బడునదదే సమాధి యనబడును. అందు ప్రాప్యమయిన పరబ్రహ్మ మందు ప్రాపకమయిన విజ్ఞానము ప్రాపణీయము (పొందింప వలసినదగు) అశేష భావనలు క్షీణించిన కేవల సంవిద్యస్తువు ఆత్మ వస్తువు క్షేత్రజ్ఞుడు కరణ జ్ఞానము (సాధన కుపయోగించు జ్ఞానము) దాని యొక్క కరణము (సాధనము) ధ్యాన నిష్ఠాద్య మనుకొన్న ముక్తి కార్యమున నున నవియెల్ల కృత కృత్యములై మరలి పోవును. ఆ భూమికలో తద్భావము బొంది, అనగా ధ్యేయ వస్తువు యొక్క వస్తుత్వముం దాను బొంది యీ సాధకుడు పరమాత్మతో నభిన్ను డగును. వానికి భేద మజ్ఞాన కృతమగును. విభేదా జనక మయిన జ్ఞానము (తెలివి) పూర్తిగా నశింపగనే ఆత్మకు (తనకు) బ్రహ్మమునకు లేనిపోని భేద మెవడు సేయును? ఖాండిక్య! అడిగితివి కావున సంక్షేపముగను విస్తరముగ నిట్లు నీకు యోగము నేను తెల్పితిని. నీకింకేమి సేయు మందువు? అన
ఖాండిక్యుడు:
కథితే యోగసద్భావే సర్వమేవ కృతం మమ।
తవోపదేశేనాశేషో నష్టశ్చిత్తమలోయతః॥
మమేతి యన్మయాచోక్తమసదేతన్నచాన్యథా।
నరేన్ద్ర గదితుం శక్యమపి విజ్ఞేయవేదిభిః॥
అహం మమేత్యవిద్యేయం వ్యవహార స్తథానయోః।
పరమార్ద స్త్వసంలాప్యో గోచరేవచసాం నయః॥
తద్గచ్ఛ శ్రేయసే సర్వం మమైతద్భవతా కృతమ్।
యద్విముక్తిప్రదో యోగః ప్రోక్తః కేశిధ్వజావ్యయః॥
ఖాండిక్యుడు:
యోగ సద్భావము తెలుపుటతో నాకు సర్వము సేసినదే యైనది. నీ యుపదేశముచే చిత్తమల మెల్ల పోయినది. నాదియని యేనేమంటిని ఇది తప్పేకాని వేరొకటి కాదని విజ్ఞేయ వేదులు (తెలియ వలసిన బ్రహ్మ వస్తువు నెరింగిన వారు) చెప్ప శక్యమయినది. నేను నాది యను వీవ్యవహారమ విద్య యిది. ఈ రెండింటి యొక్క పరమార్థము పలుక వలనైనది గాదు. వాక్కుల కది గోచరము గాదు. కావున దామిక దయచేయుడు. నాకు జేయ వలసిన దెల్ల తాము గావించితిరి. ముక్తి ప్రదమయిన అవ్యయ మయిన యోగము మీరు సెలవిచ్చితిరి.
శ్రీపరాశరుడు:
యథార్హం పూజయాతేన ఖాండిక్యేన సపూజితః।
ఆజగామపురం బ్రహ్మం స్తతః కేశిధ్వోజో నృపః॥
ఖాండిక్యోఽపి సుతం కృత్వా రాజానం యోగసిద్ధయే।
వనం జగామగోవిన్దే వినివేశితమానసః॥
తత్రైకాన్తమతిర్ భూత్వాయమాదిగుణ సంయుతః।
విష్ణ్వాఖ్యే నిర్మలే బ్రహ్మణ్యవాప నృపతిర్లయమ్॥
కేశిధ్వజో విముక్త్యర్ధం స్వకర్మక్షపణోన్ముఖః।
బుభుజేవిషయాన్ కర్మచక్రేచానభి సంహితమ్॥
అకల్యాణోపభోగైశ్చ క్షీణపాపోఽమలస్తథాః।
అవాపసిద్ధిమత్యన్తాం తాపక్షయఫలాం ద్విజ॥
శ్రీపరాశరుడు:
అని యా ఖాండిక్యునిచే కుమారుని రాజుం గావించి యోగ సిద్ధికై గోవిందు నందు డెందము నిలిపి వనముం బ్రవేశించెను. అటనేకాంత మతియై యమాది గుణములతో విష్ణువను పెరి నిర్మల బ్రహ్మందాఱేడు లయ మందెను. కేశిధ్వజుడు విముక్తి కొఱకు స్వకర్మ క్షపనమునెడ నున్ముఖుడై (కర్మ క్షయమున కుద్యమించిన వాడై) విషయముల ననుభవించెను. అనభి సంహితముగా (కర్మఫలాభి సంధి లేకుండ) కర్మముల నొనరించెను.
ఆకల్యాణము లైన ఉపభోగములచే పాపము క్షీణమయి అమలుడై తాపత్రయ క్షయము ఫలము గాగల అత్యన్తిక సిద్ధిని (మోక్షమును) పొందెను.
Summary of chapter 7 of the Vishnu Mahā Purāṇa is as follows:
This is the philosophical heart of the Ṣaṣṭhāṃśa. Keśidhvaja explains avidyā: the mistaken identification of the ātman with the five-element body and the consequent delusion of "I" (aham) and "mine" (mama). The mechanism of bondage is compared to water boiling in a pot over fire: though water and fire have no direct contact, their proximity through the vessel produces the effects — so too the ātman and prakṛti, though intrinsically separate, produce the illusion of identity through the antaḥkaraṇa. The complete yoga teaching follows: yamas (ahiṃsā, satya, asteya, brahmacarya, aparigraha), niyamas (svādhyāya, śauca, santoṣa, tapas), āsanas, prāṇāyāma, pratyāhāra, dhāraṇā on Viṣṇu's mūrta and amūrta forms, dhyāna on Bhagavān's described form, and samādhi as the dissolution of all bhāvanā into pure ātma-saṃvit. The three śaktis of Viṣṇu are defined: Parā (the supreme śakti), Kṣetrajñā (the jīva's consciousness), and Avidyā-karma (the śakti that veils and binds). Khāṇḍikya crowns his son as king, enters the forest to practice yoga, and achieves liberation. Keśidhvaja, performing karma without attachment, burns away all accumulated karma and attains ātyantika-siddhi — mokṣa.