విష్ణు మహా పురాణము

12 - సదాచార ప్రపంచః

ఔర్వుడు:

దేవగోబ్రాహ్మణాన్ సిద్ధవృద్ధాచార్యాంస్తథాఽర్చయేత్

ద్వికాలంచనమేత్సంధ్యామగ్నీనుపచరేత్తథా

సదాఽనుపహతేవస్త్రే ప్రశస్తాశ్చతథౌషదీః

గారుడానిచరత్నాని బిభృయాత్ప్రయతోనృప!

ప్రస్నిగ్ధామలకేశశ్చసుగన్ధశ్చారువేషధృత్

ప్రియంచనానృతంబ్రూయాన్నాన్యదోషానుదీరయేత్

నాన్యస్త్రియంతథావైరం రోచయేత్పురుషర్శభ

నదుష్టంయానమారోహేత్కూలచ్చాయాంనసంశ్రయేత్

విద్విష్టపతితోన్మత్తబహువై రాతికీటకైః

బన్ధకీవర్ధకీభర్తృక్షుద్రానృతకథైస్సహ

తథాఽతివ్యయశీలైశ్చ పరివాదరతై శ్షరైః

బుధోమైత్రీంనకుర్వీత నైకః పన్థానమావ్రజేత్

నావగాహేజ్జలౌఘస్య వేగమగ్రేనరేశ్వర

ప్రదీప్తంవేశ్మన విశేన్నారోహేచ్చిఖరంతరోః

నకుర్యాద్దన్తసంఘుర్షం నకృష్ణీ యాచ్చనాసికామ్

నాసంవృతముఖోజృమ్భేచ్చ్వాసకాసౌవివర్జయేత్

నోచ్చైర్హసేత్సశబ్దంచనముంచేత్పవనంబుధః

నఖాన్నఖాదయేచ్చిన్ద్యన్నతృణం నమహీంలిఖేత్

నశ్మశ్రుభక్షయేల్లోష్టంనమృద్నీ యాద్విచక్షణః

జ్యోతీంష్యమేధ్యశస్తాని నాభివీక్షేతచప్రభో

నగ్నాంపరస్త్రియంచై వసూర్యంచాస్తమయోదయే

నహుంకుర్యాచ్చవంచైవశవగన్ధోహిసోమజః

చతుష్పథంచైత్యతరుంశ్మశానోపవనానిచ

దుష్టస్త్రీసన్నీకర్షంచ వర్జయేన్నిశి సర్వదా

పూజ్య దేవాద్విజ జ్యోతిశ్చాయంనాతిక్రమేద్బుధః

నైకశ్శూన్యాటవీంగచ్చేన్నచశూన్యగృహేవసేత్

కేశాస్థికణ్టకామేధ్యబలిభస్మతుషాంస్తథా

స్నానార్ ద్రధరణీంచైవ దూరతఃపరివర్జయేత్

నాఽనార్యానాశ్రయేత్కాంశ్చిన్నజిహ్మంరోచయేద్బుధః

ఉపసర్పేచ్చనవ్యాళాంశ్చిరంతిష్ఠేన్నచోత్తితః

అతీవజాగరస్సప్నౌ తద్వత్థ్సానాసనేబుధః

సవేవేతతథాశయ్యాం వ్యాయామంచనరేశ్వర

దంష్ట్రిణశ్శృంగిణశ్చైవ ప్రాజ్ఞోదూరేణవర్జయేత్

అవశ్యాయంచరాజేన్ద్ర పురోవాతాతపౌతథా

నస్నాయాన్నస్వప్నపేన్నగ్నో నచైవోపస్పృశేద్బుధః

ముక్తకచ్చశ్చనాచామేద్దేవాద్యర్చాశ్చవర్జయేత్

హోమదేవార్చనాద్యాసుక్రియాస్వాచమనేతథా

నైకవస్త్రః ప్రవర్తేతద్విజవాచనికేజపే

ఔర్వుడు:

దేవ, గో, బ్రాహ్మణ, సిద్ధ, వృద్దాచార్యులను పూజింప వలెను. ప్రాతస్సాయము లందు సంధ్యా వందనము అగ్న్యుపాసనము చేయ వలయును. ఎల్లప్పుడును చినిగి పోనీ వస్త్ర ద్వయమును, విష్ణుక్రాంతాద్యోషాదులను గారుడాది రత్నములను ధరింప వలెను. అలంకరింప బడిన కేశములు గలవాడై సుగంధయుతుడై చక్కని వేషమును ధరించి మనోహరములగు తెల్లని పుష్పములను దరించ వలెను. పర ధనమును లేశమయిన హరింప రాదు. స్వల్పమగు నప్రియమును గూడ పలుక రాదు. ప్రియమయినను అసత్యమును చెప్పరాదు. ఇతరుల దోషములను చెప్పరాదు. పురుష శ్రేష్ఠా! పర స్త్రీని, విరోధమును అభిలషింప రాదు. దుష్టమైన వాహనము నెక్కరాదు. జల ప్రవాహముచే హతమయిన ప్రదేశపు నీడ నాశ్రయించ రాదు. శత్రువు పతితుడు ఉన్మాదము గలవాడు బహు వైరము గలవాడు, బహు కీటకముల వలె బాధించు వాడు, అయోగ్యులు (జారిణి), సంకర జాతిది, నీచుడు, అబద్ధము లాడువాడు, అతిగ ధనము వ్యయము చేయువాడు, పరస్త్రీ వాంఛ గలవారు, మూర్ఖులు, వీరితో బుద్ధిమంతుడు స్నేహము చేయరాదు. ఒంటరిగ త్రోవను పోరాదు. జల ప్రవాహమున మునగ రాదు. దగ్ధ మగుచున్న యింటి లోనికి పోరాదు. చెట్టు చివరికి నెక్కరాడు. దంతముల కోరక రాదు. ముక్కును నలుప రాదు. నోరు కప్పకుండ ఆవులించుట గాని, ఉమియుట గాని చేయరాదు. బిగ్గరగా నవ్వరాదు. శబ్దము కలుగు నట్లు అపాన వాయువును విడువ రాదు. గోళ్ళు తినరాదు. గడ్డి పరకను త్రుంచ రాదు. నేలను రాచరాదు. నేర్పరి యైన వాడు మీసములను కోరుకరాదు. మట్టి గడ్డను చిదుప రాదు. అపవిత్రములు అప్రశస్తములునగు జ్యోతిస్సుల చూడరాదు. దిసమొలతో నున్న పరస్త్రీని ఉదయించు చున్న, అస్తమించు చున్న సూర్యుని చూడరాదు. శవమును గాని తద్గంధమును గాని యేవగించుకొన రాదు. ఆ శవ గంధము అగ్నీషోమీయ మగు శరీరము నందలి సోమాంశము గదా! రాత్రి యందెల్లపుడు చతుష్పథమును, రచ్చ చెట్టును, శ్మశాన వనమును, దుష్ట స్త్రీ సామీప్యమును విడువ వలెను. పూజ్యులు, దేవులు, ద్విజులు, జ్యోతిస్సులు వీని నీడ నతిక్రమింప (బాట) రాదు. ఒంటరిగా శూన్యారణ్యమునకు వెళ్ళరాదు. అట్లే జన శూన్య గృహమున వసింప రాదు . కేశములు, ఎముకలు, ముండ్లు, అపవిత్రములు, బలులు, బూడిద, ఊక స్నానముచే తడిసిన భూమిని వీనికి దూరముగా తొలగి పోవలెను. యోగ్యుల నాశ్రయింప రాదు. కుటిలుని కోరరాదు. క్రూర మృగము లేక పామును సమీపింప రాదు. వాని ముందు నిలబడి చాలాసేపు ఉండరాదు. అతిగ కొమ్ములు గల జంతువులను, మంచును, పురోవాతమును, ఎండను దూరముగా విడువ వలెను. దిసమొలతో స్నానము, నిద్రించుట, ఆచమనము చేయరాదు. జుట్టు ముడి చేయక ఆచమనము చేయరాదు. దేవతార్చనాదికమును చేయరాదు. హోమము దేవతార్చానము మున్నగు క్రియలలోను ఆచమనము చేయునపుడు బ్రాహ్మణ పాద ప్రక్షాళనము చేయునపుడు నేకవస్త్రుడుగా నుండరాదు.

నాసమంజసశీలైస్తు సహాసీతకదాచన

సద్వృత్తసన్నికర్షోహి క్షణార్ధమపిశస్యతే

విరోధంనోత్తమైర్గచ్చేన్నాధమైశ్చసదాబుధః

వివాహశ్చవివాదశ్చతుల్యశీలైర్ నృపేష్యతే

నారభేతకలింప్రాజ్ఞశ్శుష్కవైరంచవర్జయేత్

అత్యల్పహానిస్సోడవ్యా వైరేణార్థాగమంత్యజేత్

స్నాతోనాంగానినిర్మార్జేత్స్నానశాట్యానపాణినా

నచనిర్ధూనయేత్కే శానాచామేచ్చైవనోచ్చ్రితః

పాదేననాక్రమేత్పాదంనపూజ్యాభిముఖంనయేత్

శయ్యాసనేగురోరగ్రేభజేతవినయాన్వితః

అపసవ్యంనగచ్చేచ్చ దేవాగారచతుష్పథాన్

మాంగళ్యపూజ్యంశ్చతథావిపరీతాన్న దక్షిణమ్

సోమార్కాగ్న్యమ్బువాయూనాం పూజ్యానాంచనసంముఖమ్

కుర్యాత్ ష్ఠీవనవిణ్మూత్రసముత్సర్గంచపణ్డితః

తిష్ఠన్నమూత్రయే త్తద్వత్పన్థానంనైవమూత్రయేత్

శ్లేష్మవిణ్మూత్రరక్తాని సర్వదైవనలజ్ఘయేత్

శ్లేష్మశింఘణకోత్సర్గో నాన్నకాలేప్రశస్యతే

బలిమంగలజప్యాదౌ నహోమేనమహాజనే

యోషితోనావమన్యేత నచాసాంవిశ్వసేద్బుధః

నచైవేర్ ష్యాభవేత్తాసునధిక్కుర్యాత్కదాచన

మంగళ్యపుష్పరత్నాదిపూజ్యాననభివాద్యచ

ననిష్క్రా మేద్గృహాత్ప్రజ్ఞస్సదాచారపరోనరః

చతుష్పథంనమస్కుర్యాత్కాలేహోమపరోభవేత్

దీనానభ్యుద్ధరేత్సాధూనుపాసీతబహుశ్రుతాన్

మంచి శీలము లేని వారితో నెప్పుడును కలియరాదు. అర్ధక్షణమయిన సాదుశీలుర సాంగత్యము ప్రశస్త మయినది గదా! ఉత్తములతో గాని అధములతో గాని, విరోధము కూడదు. రాజా! వివాహము గాని, వివాదము గాని సమానులతో తగి యుండును. ప్రాజ్ఞుడు కయ్యమునకు కాలు దువ్వరాదు. శుష్క కలహము పనికిరాదు. అల్పమయిన హానిని సహింప వలెను. వైరముతో ధనమార్జింప రాదు. స్నానము చేసి స్నాన వస్త్రముతో గాని, చేతితో గాని అవయవములను తుడుచుకొన రాదు. కేశములను దులుపుకొన రాదు. నిలబడి ఆచమనము చేయరాదు. ఒక కాలితో మరియొక పాదమును త్రొక్కరాదు. పూజ్యుల వైపు కాలు చాచరాదు. గురువు నెదుట వినయముతో శయ్యనుగాని, ఆసనమును గాని అధిష్టించ వలయును. దేవాలయమును గాని, చతుష్పథమును గాని అపసవ్యముగా చుట్టరాదు. మంగళ ద్రవ్యములను పూజ్యములను కూడనట్లే. తద్భిన్నములు అనగా అమంగళ ద్రవ్యములను అపూజ్యములను ప్రదక్షిణ చేయరాదు. చంద్ర సూర్యాగ్ని జల వాయువులకు పూజ్యులకు నెదురుగా ఉమ్మి వేయుట, మూత్ర పురీషములు విడుచుట చేయరాదు. నిలబడి గాని, మార్గము నందు గాని, మూత్ర విసర్జన చేయరాదు. శ్లేష్మమును, మూత్ర పురీషములను, రక్తమును నెప్పుడు దాటరాదు. అన్న సమయమున గాని, పూజా, జప, హోమ సమయము నందుగాని, మహా జనము నందుగాని కఫముగాని, చీమిడిగాని విడువరాదు. స్త్రీల నవమానించ రాదు. వారిని నమ్మరాదు. ఈర్ష్య పడరాదు. వారినెప్పుడు ధిక్కరింప రాదు. సదాచార పరుడైన వాడు మంగళ ద్రవ్యములను పుష్పములను, రత్నాది పూజ్య వస్తువులను నమస్కరించకుండ నింటి నుండి బయలు దేరరాదు. చతుష్పథమును నమస్కరించ వలెను. సకాలమున హోమము చేయవలెను. దీనులైన సజ్జనుల నుద్ధరించ వలెను. విద్వాంసులను సేవించ వలెను.

దేవర్షిపూజకస్సమ్యక్పితృపిణ్డోదకప్రదః

సత్కర్తాచాతిథీనాంయః సలోకానుత్తమాన్ వ్రజేత్

హితంమితంప్రియంకాలే వశ్యాత్మాయోఽభిభాషతే

సయాతిలోకానాహ్లాద హేతుభూతాన్నృపాక్షయాన్

ధీమన్ హ్రీమాన్ క్షమాయుక్తోప్యాస్తికోవినయాన్వితః

విద్యాభిజనవృద్దానాంయాతిలోకాననుత్తమాన్

అకాలగర్జితాదౌతు పర్వస్వాశౌచుకాదిషు

అనధ్యాయంబుధః కుర్యాదుపరాగాదికేతథా

శమంనయతియః క్రుద్ధాన్ పర్వబన్ధురమత్సరీ

భీతాశ్వాసనకృత్సాధుస్స్వర్గస్తస్యాల్పకంఫలమ్

వర్షాతపాదికేచత్రీదణ్డీరాత్ర్యటవీషుచ

శరీరత్రాణకామోవై సోపానత్కస్సదావ్రజేత్

నొర్ధ్వం నతిర్యగ్దూరం వానిరీక్షన్ పర్యటేద్బుధః

యుగమాత్రమహీపృష్ఠం నరోగచ్చేద్విలోకయన్

దోషహేతూనశేషాంశ్చవశ్యాత్మాయోనిరస్యతి

తస్యధర్మార్థకామానాంహానిర్నాఽల్పాపిజాయతే

సదాచారరతః ప్రాజ్ఞోవిద్యావినయశిక్షితః

పాపేఽప్యపాపః పురుషే హ్యభిధత్తేప్రియాణియః

మైత్రీద్రవాన్తః కరణస్తస్యముక్తిః కరేస్థితా

యేకామక్రోధలోభనాంవీతరాగానగోచరే

సదాచారస్థితాస్తేషామనుభావైర్ ద్రుతామహీ

తస్మాత్సత్యంవదేత్ప్రాజ్ఞోయత్పరప్రీతికారణమ్

సత్యంయత్పరః దుఃఖాయతత్రమౌనపరోభవేత్

ప్రియముక్తంహితంనైతదితిమత్వానతద్వదెత్

శ్రేయస్తత్రహితంవాచ్యంయద్యప్యత్యన్తమ ప్రియమ్

ప్రాణినాముపకారాయయదేవేహపరత్రచ

కర్మణామనసావాచాతదేవమతిమాన్ వదేత్

ఓ రాజా! దేవతలను, ఋషులను పూజించు వాడు పితృ దేవతల నుద్దేశించి తర్పణాంజలులను పిండ ప్రదానమును చేయువాడు, అతిథులను సత్కరించు వాడును నుత్తమ లోకముల కేగును. మనసును వశము చేసికొను సమయము వచ్చినపుడు హితము, ప్రియమునైన మాటను మితముగ చెప్పువాడు ఆహ్లాద కారణములై అక్షయములైన లోకముల కేగును. బుద్ధిమంతుడు, లజ్జావంతుడు, క్షమావంతుడు విద్య చేతను, కులము చేతను పెద్దలైన వారి యెడ వినయము గలవాడును, ఆస్తికులు నగువారు సర్వోత్తమమగు లోకమున కేగుదురు. ఆసమయ మేఘ గర్జనాది సమయమునను పూర్ణిమాది పర్వము లందు, అశౌచాదులు కలిగి నపుడు, సూర్య చంద్ర గ్రహాణాదు లందు వేదాధ్యాయనము చేయరాదు. కోపించిన వారిని శమింపజేయు వాడును, అందరికి బంధువగు వాడును, ద్వేషము లేని వాడును, భయము నొందిన వారిని ఓదార్చు వాడును, సాధువునైన వానికి స్వర్గమనునది అల్పమైన ఫలము. వాన ఎండలందు గొడుగును ధరించియు, రాత్రి యందు గాని, అడవులందు గాని దండమును ధరించియు శరీర రక్షణ కొఱకై పాదరక్షలు ధరించియు నెల్లపుడు సంచరించ వలెను. పైకిని, అడ్డముగను దూరమును చూచుచు తిరుగ రాదు. ఒకకాడి మాత్ర పరిమితమగు ప్రదేశమును జాగ్రత్తగా చూచుచు వెళ్ళు చుండవలెను. నియమిత చిత్తము గలవాడై దోష కారణముల నన్నిటిని నిరసించిన వానికి ధర్మార్థ కామముల హాని లేశమైన కలుగదు. సదాచారాసక్తుడు బాగుగ తెలిసిన వాడు విద్య వినయము లందు శిక్షింప బడిన వాడు, పాపుని యెడ క్రూరుని యెడ క్రమముగా కల్మషము లేని వాడును, ప్రియ వాక్యములను చెప్పు వాడును, మైత్రితో కూడిన చిత్తము గలవాడును నగు వానికి ముక్తియనునది చేతిలో నున్నది (సులభము). కామ క్రోధ లోభములకు గురి కాకుండ సదాచారములో నుండి నట్టి వారి సత్యాది ప్రభావముల చేతనే భూమి ధరింప బడుచున్నది. అందువలన ప్రాజ్ఞుడైన వాడు ఇతరుల ప్రీతిహేతువగు సత్యము నెప్పుడు పలుక వలెను. ఇతరుల దుఃఖ కారణమగు సత్యము విషయమై మౌనము వహించ వలెను. నేను చెప్పినది ప్రియమైనదే కాని హితకారము కాదు అను తలంచిన వాడు అట్టి దానిని చెప్పరాదు. మిక్కిలి అప్రియమైనను శ్రేయస్కరము, హితకరమునగు దానిని చెప్ప వచ్చును. బుద్ధిమంతుడగు వాడు ప్రాణులకు ఇహ, పర లోకము లందు నుపకారము కల్గించు దానిని త్రికరణ (మనస్సు, వాక్కు, కర్మ) శుద్ధితో చెప్ప వలయును.