విష్ణు మహా పురాణము

35 - బలరామ పరాక్రమ వైభవము

మైత్రేయుడు:

భూయ ఏవాహమిచ్చామి బలభద్రస్యధీమతః

శ్రోతుంపరాక్రమంబ్రహ్మాన్ తన్మమాఖ్యాతుమర్హసి

యమునాకర్షణా దీనిశ్రుతానిభ గవన్మయా

తత్కథ్యతాం మహాభాగయదన్యత్కృతవాన్ బలః

మైత్రేయుడు:

శ్రీపరాశరులతో బలభద్రుడు సేసిన యమునాకర్షణాదులు విచిత్ర లీలలు తాము సెలవీయ నేను విన్నాను. వెండియు నా మహానుభావు డొనరించిన వింతలను దెలుపుడన నమ్మౌని యిట్లు తెలుప దొడంగె

శ్రీపరాశరుడు:

మైత్రేయ శ్రూయతాంకర్మ యద్రామేణా భవత్కృతమ్

అనన్తేనా ప్రమేయేన శేషేణ ధరణీధృతా

సుయోధనస్య తనయాం స్వయం వరకృతక్షణామ్

బలాదాదత్తవాన్ వీరస్సామ్బోజామ్బవతీ సుతః

తతః క్రుద్దామహావీర్యాః కర్ణదుర్యోధనాదయః

భీష్మద్రోణాదయశ్చైనంబబన్దుర్యు నిర్జితమ్

తచ్చ్రుత్వాయాదవాస్సర్వే క్రోధందుర్యోధనాదిషు

మైత్రేయ! చక్రుః కృష్ణశ్చతాన్నిహన్తుం మహోద్యయమ్

తాన్ని వార్యబలః ప్రాహ మదలోలకలాక్షరమ్

మోక్ష్యాన్తితేమద్వచనాద్యాస్యామ్యేకోహికౌరవాన్

బలదేవస్తతో దృష్ట్వానగరంనాగసాహ్వయమ్

బాహ్యోపవనమధ్యేభూన్నవివేశచ తత్పురమ్

బలమాగతమాజ్ఞాయ భూపాదుర్యోధనాదయః

గామార్ ఘ్యముదకంచైవ రామాయప్రత్యవేదయన్

గృహీత్వావిదివత్సర్వం తతస్తానాహాకౌరవాన్

ఆజ్ఞాపయత్యుగ్రసేనస్సామ్బమాశువిముంచత

తతస్తద్వచనం శ్రుత్వాభీష్మద్రోణాదయోనృపాః

కర్ణదుర్యోధనాద్యాశ్చచుక్షుభుర్ ద్విజసత్తమ

ఊచుశ్చకుపితాస్సర్వేబాహ్లీకాద్యాశ్చ కౌరవాః

అరాజ్యార్హంయదోర్వంశమవేక్ష్య ముసలాయుధ

భోభోకిమేతద్భవతాబలభద్రేరితంవచః

ఆజ్ఞాంకురుకులోత్థానాం యాదవః ప్రదాస్యతి

ఉగ్రసేనోఽపి యద్యాజ్ఞాం కౌరవాణాం ప్రదాస్యతి

తదలంపాణ్డరైశ్చత్రైః నృపాయోగ్యైః విడమ్బితైః

తద్గచ్చబల మావా త్వంసామ్బమాన్యాయ చేష్టితమ్

విమోక్ష్యామోనభవతశ్చోగ్రసేనస్యశాసనాత్

ప్రణతిర్యాకృతాఽస్మాకం మాన్యానాంకుకురాన్ధకైః

ననామసాకృతాకేయమాజ్ఞాస్వామినిభృత్యతః

గర్వమారోపితాయూయం సమానాసనభోజనైః

కోదోషోభవతాంనీతిర్యత్ప్రీత్యానావలోకితా

అస్మాభిరర్ఘోభవతో యోఽయంబల! నివేదితః

ప్రేమ్ణైతన్నైతదస్మాకంకులాద్యుష్మత్కులోచితమ్

ఇత్యుక్త్వాకురవస్సామ్బం ముంచామోనహరేస్సుతమ్

కృతైకనిశ్చయాస్తూర్ణం వివిశుర్గజసాహ్వయమ్

శ్రీపరాశరుడు:

బలరాముడన గేవల మనంతుడు ధరణిం ధరించు శేషుడే. ఆయన యప్రమేయ మూర్తి. సుయోధనుని కూతురును స్వయంవర సన్నాహము లందున్న దానిని జాంబవతి కొడుకు సాంబుడు శూరాగ్రేసరుడు బలిమినై నెత్తికొని పోయెను. దానగుపితులై మహావీరులు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనాదులు పోర వీని బంధించుకొని పోయిరి. అది విని యాదవులెల్లరు దుర్యోధనాదులపై కినుక గొని యనికుద్యమించిరి. కృష్ణుడు నందున్నాడు. వారినాపి బలభద్రుండే నొక్కడ జాలుదు నిదె కౌరవులపై కేగెద. నా మాటం బట్టి వానిని విడిపింతురని మదాలోల మధురాక్షరముగా బలికెను. అన్న యట్లాతడేగి హస్తి నగరముం గని బాహ్యోప వనమందు విడిది సేసెను గాని పురములో మాత్రము ప్రవేశింపడయ్యె. బలరాము రాక తెలిసి దుర్యోధనాదులు గోవును, అర్ఘ్యము రామునకు నివేదించిరి. అవి యథావిధిం గైకొని కౌరవులతో ఉగ్రసేనుడాజ్ఞ యిచ్చుచున్నాడు సాంబుని వెంటనే విడుదల చేయుడనియే. భీష్మద్రోణాదులు మరి రాజులు కర్ణ దుర్యోధనాదులు క్షోభించి కుపితులై బాహ్లికాదులు కౌరవులు యదువంశము రాజ్యార్హము గాదని చూచికూడ ఓ ముసలీ! నీ విప్పుడు పలికిన మాటయేమి? కురుకులము వారికి యాదవుడెవ్వడాన యిచ్చును? ఉగ్రసేనుడు కూడా కౌరవులకు శాసించు వాడగు నేని శ్వేతచ్చాత్రములు రాజ యోగ్యములైన విడంబనము నింక చాలును. ఓ బలా! నీవు పొమ్ము. మానుము. అన్యాయవర్తనుని సాంబుని నీ యొక్క ఉగ్రసేనుని యొక్క ఆజ్ఞతో వదలి పెట్టము. మాన్యులమైన మాకు కుకురాంధకులు చేసిన ప్రణతిని కూడ మేము ప్రణతిగ స్వీకరించుట లేదు. అది చేయబడనట్లే. అట్టియెడ భృత్యులగు మీరు మాకాజ్ఞ యిచ్చుట యేమి? సహాసన సహభోజనముల వలన మీరు గర్వమెక్కింప బడినారు. మీ తప్పేమి? మీపై ప్రీతిచే నీతిని గమనింపని పొరపాటు మాది. ఓ బలరామ! నీకిప్పు డిచ్చిన అర్ఘ్యము (పూజ) ప్రేమచే నీయబడినది. ఇది మా కులము నుండి మీ కులమున కుచితమైనది కాదు. అని పలికి కురువులు హరి కుమారుని సాంబుని వదలమను నిశ్చయమునకు వచ్చి యప్పుడ హస్తినాపురముం బ్రవేశించిరి.

శ్రీపరాశరుడు:

మత్తకోపేనచాఘూర్ణం స్తతోధీక్షేపజన్మనా

ఉత్థాయపార్ ష్ణ్యా వసుధాం జఘాన సహలాయుధః

తతోవిదారితా పృథ్వీపార్ ష్ణిఘాతాన్మహాత్మనః

ఆస్పోటయామాసతదాదిశశ్శబ్దేన పూరయన్

ఉవాచచాతితామ్రాక్షో భ్రుకుటీకుటిలాననః

ఆహోమదావలేపోయమసారాణాం దురాత్మనామ్

కౌరవాణాం మహీపత్వమస్మాకం కిలకాలజమ్

ఉగ్రసేనస్యయేనాజ్ఞాం మన్యాన్తేఽద్యాపిలంఘనమ్

ఉగ్రసేనస్సమధ్యాస్తే సుధార్మాంనాశచీపతిః

దిజ్మానుషశతోచ్చిష్టే తుష్టిరేషాంనృపాసనే

పారిజాతతరోః పుష్పంజరీర్వనితాజనః

బిభర్తియస్యభృత్యానాంసోప్యేషాంనో మహీపతిః

సమస్తభూభృతాంనాథ ఉగ్రసేనస్సతిష్ఠతు

అద్యనిష్కౌరవాముర్వీంకృత్వాయాస్యామితత్పురీమ్

కర్ణం దుర్యోధనం ద్రోణం మద్యభీష్మంస బాహ్లికమ్

దుశ్శాసనాదీన్ భూరించ భూరిశ్రవసమేవచ

సోమదత్తం శలంచైవ భీమార్జునయుథిష్టిరాన్

యమౌచకౌరవాంశ్చానాన్ హత్వాసాశ్వరథద్విపాన్

వీరమాదాయతంసామ్బం సపత్నీకంతతః పురీమ్

ద్వారకాముగ్రసేనాదీన్ గత్వాద్రక్ష్యామిబాంధవాన్

అథవాకౌరవావాసంసమస్తైః కురుభిస్సహ

భాగీరథ్యాంక్షిపామ్యాశునగరంనాగసాహ్వయమ్

ఇత్యుక్త్వామదరక్తాక్షః కర్షణాథోముఖంహలమ్

ప్రాకారవప్రదుర్గస్యచకర్షముసలాయుధః

ఆఘూర్ణింతంతత్సహసా తతోవైహాస్తినంపురమ్

దృష్ట్వాసంక్షుబ్ధ హృదయాశ్చుకృశుస్సర్వకౌరవాః

రామరామ మహాబాహో! క్షమ్యతాంక్షమ్యతాంత్వయా

ఉపసంహ్రియతాం కోపః ప్రసీదముసలాయుధ!

ఏషసామ్బస్సపత్నీకస్తవనిర్యాతితో బలాత్

అవిజ్ఞాత ప్రభావానాంక్షమ్యతామపరాధినామ్

తతోనిర్యాతయామాసుస్సామ్బంపత్నీ సమన్వితమ్

నిష్క్రమస్వపూరాత్తూర్ణం కౌరవామునిపుంగవ

భీష్మద్రోణకృపాదీనాంప్రణమ్యవదతాప్రియమ్

క్షాన్తమేవమయేత్యాహ బలోబలవతాంవరః

అద్యాప్యాఘూర్ణితాకారం లక్ష్యతేతత్పురంద్విజ

ఏషప్రభావోరామస్య బలశౌర్యోప లక్షణః

తతస్తుకౌరవాః సామ్బంసంపూజ్యబలినాసహ

ప్రేషయామాసురుద్వాహధనభార్యా సమన్వితమ్

శ్రీపరాశరుడు:

తిరస్కారము వలన కల్గిన కోపముచే మత్తుకొని ఘూర్ణిల్లి లేచి హలాయుధుడు మడమం భూమి నడిమి కొట్టెను. ఆ దెబ్బతో భూమి బ్రద్దలయ్యెను. ఆ మీద దిక్కులు ప్రతిధ్వనించునట్లు బాహువులు చరచెను. కనులు మిగుల నెరుపెక్క కనుబొమలు ముడువడి మోముకుటిలము కాగ నిస్సారులు దురాత్ములునగు కౌరవుల కహో! ఎంత పొగరు! వీరి దొరతనము మా కాల ప్రభావము వలన వచ్చినది. (మా గ్రహవిదశ తాత్కాలికముగ వక్రమగుటచే వచ్చినదన్న మాట) దానన గదా ఉగ్రసేనుని యాజ్ఞను గూడ యిపుడుల్లంఘింప దలచుచున్నారు. సుధర్మ సభ నధిష్టించిన వాడు ఉగ్రసేనుడు. శచీపతి కాడు, ఛీఛీ! చాలామంది మానవుల ఉచ్చిష్టమయిన రాజాసనము నందు వీరికి దుష్టి కలిగినది (ఎంత నీచము) ఎవ్వని నౌకరుల అంగనాజనము పారిజాత పుష్ప మంజరులను గోప్పులం దురుముదు రట్టివాడు మా ప్రభువు సమస్త రాజాధిరాజు సార్వభౌముడుగ్రసేను డట్లుండు గాక! ఇప్పుడుర్విని నిష్కౌరవము నొనరించి యారేని రాజధాని కరిగెదను. కర్ణుని, దుర్యోధనుని, ద్రోణుని, భీష్ముని, బాహ్లికుని, దుశ్శాసనాదులను, భూరిని, భూరిశ్రవసుని, సోమదత్తుని, శలుని, భీమార్జున, యుథిష్ఠిరులను, గవలను మఱియుం గల కౌరవులను గజాశ్వరథ బలముతో మట్టువెట్టి వరుడగు సాంబకుమారుని భార్యతో జేకొని ద్వారకాపురి కేగి ఉగ్రసేనాదులను బందుగులతో దర్శింతును. లేదా కౌరవ రాజధానిని (హస్తినాపురమును) కౌరవులతో గంగలో గలిపెదను. అని పలికి మత్తున నెరుపారుగన్నులతో ప్రాకార వప్రదుర్గముల లాగి పెల్లగించుటకై క్రింది ముఖమయియున్న నాగలిం బట్టి లాగెను. అంత నొక్కుమ్మడి ఆ ఘూర్ణితమైన యా హస్తినాపురమును గని హృదయములు సంక్షుబ్ధములై కౌరవులు మొర్రోయని యాక్రోశించిరి. రామా! రామా! మహావీరాగ్రేసరా! క్షమింపు క్షమింపుము. కోప ముపసంహరింపుము. ప్రసన్నుడవగుము. ఇదిగో సాంబుడు భార్యతో నీ బలిమిని వెడలింప బడినాడు నీ ప్రభావ మెరుంగక అపరాథము సేసిన మమ్ము క్షమింపుమనిరి. అవ్వల కౌరవులు సపత్నీకముగ సాంబుని తమ పురంబు నుండి సాగనంపిరి. అతడును భీష్మ, ద్రోణ, కృపాచార్యాదులకు నమస్కరించి మరలి వక్తగావున నేను శమించితినని పలికెను. నేటికిని అట్టిట్టు మట్టుగదలిన రూపముతో నా నగరము గనబడు చున్నది. బలరాముని బలశౌర్యోప లక్షణమైన ప్రభావమిది. బలరామునితో గూడ సాంబుని కౌరవులు పూజించి ఉద్వాహ ధనముతో (సారెతో) భార్యతో గూడ సాగనంపిరి.