విష్ణు మహా పురాణము

14 - భరతుడు రహూగణునకు చేసిన ఉపదేశము

శ్రీపరాశరుడు:

నిశమ్యతస్యేతివచః పరమార్ధ సమన్వితమ్

ప్రశ్రయావనతోభూత్వా తమాహనృపతిర్ ద్విజమ్

శ్రీపరాశరుడు:

పరమార్ధ సంపన్నమైన విప్రుని (భరతుడు) యీ వచన మాలించి వినయ వినమితుడై యిట్లనియె.

రాజు:

భగవాన్ యత్త్వయాప్రోక్తం పరమార్ధమాయంవచః

శ్రుతేతస్మిన్ భ్రమన్తీవ మనసోమమవృత్తయః

ఏతద్వివేక విజ్ఞానం యదషేశేషుజన్తుషు

భవతాదర్శితంవిప్ర! తత్పరంప్రకృతేర్మహత్

నాహంవహామిశిబికాం శిబికానమయిస్థితా

శరీరమన్యదస్మత్తో యేనేయంశిబికాధృతా

గుణప్రవృత్త్యాభూతానాం ప్రవృత్తిః కర్మచోదితా

ప్రవర్తన్తే గుణాశ్పైతే కింమమేతిత్వయోదితమ్

ఏతస్మిన్ పరమార్ధజ్ఞామమశ్రోత్రపథంగతే

మనోవిహ్వలతామేతిపరమార్థార్థతంగథమ్

పూర్వమేవమహాభాగంకపిలర్షిమహంద్విజ

ప్రష్టుమభ్యుద్యతోగత్వాశ్రేయఃకిన్వత్రాసంశ్రవః

తదన్తరేచభవతాయదిదంవాక్యమీరితమ్

తేనై వపరమార్దార్దే త్వయిచేతః ప్రదావతి

కపిలర్షిర్భగవతస్సర్వభూతస్యవైకిల

విష్ణోరంశోజగంమోహనాశాయోర్వీముపాగతః

స ఏవభగవాన్నూనమస్మాకంహితకామ్యయా

ప్రత్యక్షతామాత్రాగతోయథై తద్భవతోతోచ్యతే

తన్మహ్యంప్రణతాయత్వంయచ్చ్రేయఃపరమంద్విజ

తద్వాదాఖిలవిజ్ఞానజలవీచ్యుదధిర్భవాన్

సౌవీరరాజు:

భగవంతుడా నీ పరమార్థ మయమైన పలుకు నేను వినినంత నా మనస్సులోని తలంపు లట్టిట్ల భ్రమించి నట్టున్నవి. ప్రకృతి కంటె మీదిదైన ఈ మహావివేక విజ్ఞానము సర్వజీవు లందు నీచే జూప బడినది. నేను శిబికను మోయుట లేదు, శిబిక నా మీద నున్నది. శరీరము నాకంటె వేఱు వస్తువు, అది యీ శిబికను మోయుచున్నది. భూతముల యొక్క గుణములు ప్రవర్తించుట చేత కర్మచోదితమైన ప్రవృత్తి యేర్పడును. ఈ గుణములు తమంత ప్రవర్తించును. దీనితో నాకేమి సంబంధముండదు. ఓ పరమార్థ తత్వజ ఇది చెవింబడగానే పరమార్థము నెడ లక్ష్యము గొన్న నా మనస్సట్టిట్టయినది. మున్నే నేనిక్కడ లెస్సగ వినవలసినది. పరమ శ్రేయస్సు ఏదని మహానుభావుడగు కపిల మహర్షి నడుగ వలయునని యత్నపడితిని. ఆలోగా నీవీ వాక్యముల బల్కితివి. దాననే పరమార్థ ప్రయోజనమునకై నీ యెడ మనస్సు దూకుచున్నది. కపిలర్షి సర్వమునైన విష్ణు భగవానుని యంశమున జగమ్ముల మోహము నశింపజేయ నీయవని యందవతరించిన మహానుభావుడు మాకు హితవు సేయ నా భగవంతుడే యిక్కడ సాక్షాత్కరించి నాడు. నీ విపుడానతిచ్చిన విధమదియే. కావున నోద్విజోత్తమ నీకు బ్రణతుడనైన నాకు బరమ శ్రేయస్సేదో యది దయ సేయుము. అఖిల విజ్ఞాన రస తరంగములకు సముద్రుడవు నీవు అన జడ భరతుండిట్లనియె.

బ్రాహ్మణుడు:

భూప! పృచ్చసికింశ్రేయః పరమార్ధంనుపృచ్చసి

శ్రేయాంస్యపరమార్ధాని యాన్యశేషాణిభూపతే

దేవతారాధనంకృత్వాధనసంపదమిచ్చతి

పుత్రానిచ్చతిరాజ్యంచశ్రేయస్తత్రాప్తిలక్షణమ్

కర్మయజ్ఞాత్మకం శ్రేయస్స్వర్లోకఫలదాయియత్

శ్రేయఃప్రధానంచఫలేతదేవానభిసంహితే

ఆత్మాధ్యేయస్సదాభూప! యోగాయుక్తైస్తథాపరమ్

శ్రేయస్తస్యైవసంయోగశ్శ్రేయోయత్పరమాత్మనః

శ్రేయాంస్యేవమనేకానిశతశోథసహస్రశః

సన్త్యత్రపరమర్ధాస్తునత్వేతేశ్రూయతాంచమే

ధర్మాయత్యజతేకింనుపరమార్దోధనంయది

వ్యయశ్చక్రియతేయస్మాత్కామప్రాప్త్యుపలక్షణః

పుత్రశ్చత్పరమార్దోఽస్తి జగత్యత్రనరాధిప

పరమార్థభూతస్సోఽన్యస్య పరమార్థోహితత్పితా

ఏవంనాపరామార్థోఽస్తి జగత్యత్రనరాధిప

పరమార్థోహికార్యాణి కారణానామశేషతః

రాజ్యాదిప్రాప్తిరాత్రోక్తాపరామార్ధతయాయది

పరమర్ధాభవన్త్యత్రనభవంతిచవైతతః

ఋగ్యజుస్సామనిష్పాద్యం యజ్ఞకర్మమతంతవ

పరమార్ధభూతంతత్రాపి శ్రూయతాంగదతోమను

యత్తునిష్పాద్యతేకార్యం మృదాకారణభూతయా

తత్కారణానుగమనాజ్జాయతేనృపమృణ్మయమ్

ఏవంవినాశిభిర్ ద్రవ్యైస్సమిదాజ్యకుశాదిభిః

నిష్పాద్యతేక్రియాయాతు సాభవిత్రీవినాశినీ

అనాశీపరమార్ధశ్చప్రాజ్ఞేరభ్యుపగమ్యతే

తత్తునాశినసందేహో నాశిద్రవ్యోపపాదితమ్

తదేవాఫలదంకర్మపరమార్ థోయథోమతః

ముక్తిసాధనభూతత్వత్పరమార్ థోనసాధనమ్

ధ్యానంనైవాత్మనోభూపపరమర్థార్థశబ్దితమ్

భేదాకారిపరేభ్యస్తత్పరమార్తోణభేదవాన్

పరమాత్మాత్మనోర్ యోగః పరమార్ధమితీష్యతే

మిథ్యైతదన్యద్ద్రవ్యంహినై తితద్ద్రవ్యతాంయతః

తస్మాచ్చ్రేయాంస్య శేషాణి నృపైతానినసంశయః

పరమార్థస్తుభూపాల! సంక్షేపాచ్చ్రూయతాంమమ

ఏకోవ్యాపీసమశ్శుద్దోనిర్గుణః ప్రకృతేర్ది పరః

జన్మవృద్ధ్యాదిరహిత ఆత్మాసర్వగతోఽవ్యయః

పరజ్ఞానమాయోఽసద్భిర్నామజాత్యాదిభిర్విభుః

నయోగావాన్నయుక్తోఽభూన్నైవపార్థివ యోక్ష్యతే

తస్యాత్మపరదేహేషుసతోప్యేకమాయంహిమత్

విజ్ఞానంపరమార్థోసౌద్వైతినోఽతథ్యదర్శినః

వేణురన్ద్రవిభేదేనాభేదష్షడ్జాదిసంజ్ఞితః

అభేదవ్యాపినోవాయోస్తథా తస్యమహాత్మనః

ఏకత్వంరూపభేదాస్తూ బాహ్యకర్మప్రవృత్తిజః

దేవాదిభేదేఽపదవస్తేవావరణే హిసః

భూపతీ! శ్రేయస్సేదో యడుగు చున్నవా? పరమార్థ మడుగు చున్నావా? (శ్రేయస్సు అనగా ఐహిక సుఖము. అదియా నీకు గావలసినది పరమార్థమా (ఆత్యన్తిక సుఖమా) మోక్షమా? అశేష శ్రేయస్సులు అపరామార్థములు. దేవతలను గొల్చి, ధన సంపదను, పుత్రులను, రాజ్యమును గోరును. అది శ్రేయః ప్రాప్తి లక్షణము. కర్మమనగా యజ్ఞ రూపము అది ఫలరూపము శ్రేయస్సు నిచ్చునది. ఆ కర్మయే ఫలాభి సంధి లేనప్పుడు ప్రధానమైన శ్రేయస్సు పరమార్థము రెండు నొకటి గావు. ఆత్మ యోగులచే నెల్లపుడు ధ్యేయము ఆ పరమాత్మతో సంయోగము (ఆత్మైక్యము) పరమ శ్రేయస్సు. శ్రేయస్సు లిట్లనేకములు వందలు వేలును గలవు. కాని యివి పరమార్థములు మాత్రము గావు. వినుము. ధర్మము కొఱకు ధనము త్యాగము సేయ బడుచున్నది. ఆ ధనము పరమార్థ మగుచో నెందులకు వ్యయింప బడును! కావున నది కామప్రాప్తికి హేతువే. సమస్తము దేనికోరకో. యేది యితరము కొఱకు కాదో అది పరమార్థము. అట్టిది ఆత్మయే. పుత్రుడే పరమార్థ మగునేని యతడును (ఆ తండ్రి) మఱి యోకనికి (అతని తండ్రికి) బరమార్థము. వాని తండ్రికూడ యొకనికి పరమార్థ మైనవాడే కదా! ఈ విధముగా నీ పరమార్థ నిశ్చయ మవ్యవస్థిత మైపోవును. కారణము లన్నిటికిని కార్యము పరమార్త మగుచునుండును గదా! రాజ్యాదుల ప్రాప్తి పరమార్థముగా జెప్ప బడునేని యీ రాజ్యాది సుఖా లొకమారు పరమార్థములై యివే యామీద నపరమార్థము లగుచుండును. అనగా ఆయా రాజ్యాధి విషయములు దుఃఖ హేతువులై పరమార్థత్వమును గోల్పోవును. అనగా, ఆగమాపాయి యగుటచే రాజ్యదికము పరమార్థము కాదు. నీకు ఋగ్యజుస్సామ రూపత్రయీ సంపాద్యమగు యజ్ఞ కర్మము పరమార్థమేని అందు గూడ జెప్పెద వినుము. కారణమైన మట్టిచేత ఘటాది రూపమైన కార్యము తయారు చేయ బడును. అపుడు కారణమైన వస్తువు (మట్టి) యొక్క యను గమనము చేత మృణ్మయమైన వస్తువు తయారగు చున్నది. ఇట్లు నశించు ద్రవ్యములచే అనగా సమిధలు నెయ్యి మొదలయిన వానిచే నొనరింప బడు క్రియ (యజ్ఞము) నాశనశీలము గలదియే యగును. పరమార్థమైన వస్తువు అవినాశియని ప్రాజ్ఞు లెరుంగుదురు. నశ్వర వస్తు సంపాదితమైన యా వస్తువు నశించునదే. సందేహము లేదు, కర్మము ఫలదాయి గాదు కాని యది పరమార్థమైన ముక్తికి సాధన మగుట వలన పరమార్థ మనుకొను చున్నావు. పరమార్థము సాధన మెన్నటికి గాడు. ఆత్మధ్యానము పరమార్థమని చెప్పబడదు. ఇతర వస్తువుల నుండి వేరు సేయునది భేదము గలది. పరమార్థ మెన్నటికి భేదము గలది గానేరదు. పరమాత్మ యొక్కయు ఆత్మ (జీవాత్మ) యొక్కయు యోగము (ఐక్యము) పరమార్థ మనెద వేనియదియే నసత్యమే. ఒక ద్రవ్యము మఱియొక ద్రవ్యము కాదుగదా! కావున నోరాజా ఈయనేకము లయిన ధనాదులెల్ల శేయస్సులే. సందియము లేదు. పరమార్థమును సంక్షేపముగా దెల్పెద వినుము. ఒక్కటియై వ్యాపించునది సమము శుద్దము నిర్గుణము ప్రకృతి కంటె పరము (ఉపాది శూన్యం) జన్మ వృద్ద్యాది షడ్భావ వికారములు లేనిది ఆత్మయు సర్వగము అవ్యయము ప్రకృష్ట జ్ఞాన స్వరూపము. అసత్తులయిన నామ జాత్యదులతో విభువు దేనితో గూడునది మున్ను గూడినదియు మున్ముందు గూడ గలదియు గాని. తన దేహము ననితర దేహము లందు నున్నను నొక్కతియై వస్తువైన విజ్ఞానమే పరమార్థ మైయున్న వస్తువు. ద్వైతులు (భేదాదర్శనులు) అసత్య దర్శనులు. పిల్లంగ్రోవి యొక్క రంధ్రము లందు వ్యాపించిన యొకే వాయువు ఉపాధి భేదముచే షడ్జము మొదలయిన ఏడు స్వరములుగా చెప్ప బడునట్లు పరమాత్మ యోక్కనికే దేహాది కర్మ ప్రవృత్తి వలన దేవాది రూపభేదము. ఆ కర్మావరణ పోగానే రూపభేదము లేనేలేదు. ఉన్నదా యొక్క ఆత్మయే.