విష్ణు మహా పురాణము

2 - దేవకృత విష్ణుమాయా స్మృతి

శ్రీపరాశరుడు:

యథోక్తం సాజగద్దాత్రాదేవదేవేనవై తథా

షడ్గర్భగర్భవిన్యాసం చక్రేచాన్యస్యకర్షణమ్

సప్తమేరోహిణీం గర్భేప్రాప్తేగర్భంతతోహరిః

లోకత్రయోపకారాయదేవక్యాః ప్రవివేశహ

యోగానిద్రాయశోదాయా స్తస్మిన్నేవతథాదినే

సంభూతాజఠరేతద్వద్యథో క్తంపరమేష్ఠినా

తతోగ్రహగణస్సమ్యక్ప్రచచారదివిద్విజ!

విష్ణోరంశేభువం యాతే ఋతవశ్చాబభుశ్శుభాః

నసేహేదేవకీంద్రష్టుం కశ్చిదప్యతి తేజసా

జాజ్వల్యమానాంతాం ద్రుస్ట్వామనాంసి క్షోభామాయయుః

అదృష్టాః పురు షైః స్త్రీభిః దేవకీం దేవతాగణాః

బిభ్రాణాం వపుషావిష్ణుం తుష్టువుస్తామహర్నిశమ్

శ్రీపరాశరుడు:

జగద్విధాత దేవదేవుడు చెప్పినట్లు యోగమాయ ఆఱవ గర్భము నందలి (శిశువును) రోహిణీ గర్భమందుంచి యామె గర్భము నందలి శిశువునొక కర్షణమును గావించి ఆ రోహిణీ జఠర మందుంప బడిన యతడే సంకర్షణుడు (బలరాముడు). ఆ యోగనిద్ర యదే రోజున యశోద యొక్క జఠరము నందు విష్ణువెట్లానతిచ్చె నట్లే పుట్టెను, అటుపై దివంబున గ్రహగణము చక్కని స్థానము లందు సంచరింప విష్ణ్వంశ మవని నవతరించెను. ఋతువులు పరమ శోభనము లయి ప్రకాశించెను. అద్భుత తేజమున దీపించు దేవకీ దేవిని యెవ్వరునేని దర్శింప నేరరైరి. ఆమె వంక జూచిన వారి మనస్సు లాందోళన మందినవి. స్త్రీ పురుషు లెవ్వరికిం గనబడకుండ దేవగణములు విష్ణునిం దానయుదర మందు ధరించిన యా దేవకీ దేవిని రేయింబవళ్ళిట్లు స్తుతించిరి.

దేవతలు:

ప్రకృతి స్త్వంపరాసూక్ష్మాబ్రహ్మగర్భాభవత్పురా

తతోవాణీజగద్దాతుర్వేదగర్భాసిశోభనే

సృజ్యస్వరూపగర్భాసిసృష్టిభూతాసనాతనే

బీజభూతాతుసర్వస్య యజ్ఞగర్భాభవస్త్రయీ

ఫలగర్భా త్వమేవేజ్యావహ్నిగర్భాతథారణిః

అదితిః దేవగర్భాత్వం దైత్యగర్భాతథాదితిః

జోత్స్నావాసరగర్భాత్వం జ్ఞానగర్భాసిసన్నతిః

నయగర్భాపరానీతిర్లజ్జాత్వం ప్రశ్రయోద్వహా

కామగర్భాతథేచ్చాత్వం తుష్టిస్సంతోషగర్భిణీ

మేధాచబోధగర్భాసిదైర్యగర్భోద్వహాధృతిః

గ్రహర్ క్షతారకాగర్భాద్యౌరస్యాఖిలహైతుకీ

ఏతావిభూతయోదేవితథాన్యాశ్చసహస్రశః

తథాసంఖ్యాజగద్దాత్రీసాంప్రతంజఠరేతవ

సముద్రాద్రి నదీద్వీపవనపట్టణభూషణా

గ్రామఖర్వటఖేటాఢ్యా సమస్తాపృథివీశుభే

సమస్తవహ్నయోఽమ్భాంసిసకలాశ్చసమీరణాః

మహోరగా స్తథాయక్షరాక్షసాః ప్రేతగుహ్యకాః

గ్రహర్క్షతారకాచిత్రవిమానశతసంకులమ్

అవకాశమశేషస్య యద్దదాతినభాస్దృలమ్

భూలోకశ్చభువర్ లోకస్స్వర్ లోకోథమహర్జనః

తపశ్చబ్రహ్మలోకశ్చ బ్రహ్మాణ్డమఖిలం శుభే

తద న్తరేస్థితాదేవాదైత్యగన్ధర్వచారణాః

మహోరగాస్తథాయక్షారాక్షసాః ప్రేతగుహ్యకాః

మనుష్యాః పశవశ్చాన్యేయేచజీవాయశస్విని

తైర న్తస్తైరనన్తోఽసౌసర్వగః సర్వభావనః

రూపకర్మసర్వరూపాణినపరిచ్చేదగోచరే

యస్యాఖిలప్రమాణానిస విష్ణు ర్గర్భగస్తవ

త్వంస్వాహాత్వం స్వధావిద్యాసుధాత్వం జ్యోతిరమ్భరే

త్వంసర్వలోకరక్షార్థమవతీర్ణామహీతలే

ప్రసీదదేవిసర్వస్యజగతశ్శం శుభే కురు

ప్రీత్యాతం ధారయేశానం ధృతం యేనాఖిలం జగత్

నీవు సూక్ష్మమయిన పరాప్రకృతి. బ్రహ్మగర్భవు. ఓ కళ్యాణీ యా మీద జగత్తులకు విధాత యగు బ్రహ్మకు వాణివై వేదగర్భ వైతివి. సృజ్యమగు (సృష్టింప బడునది యగు) దృశ్యాత్మక జగత్తునకు రూపగర్భవై సృష్టి రూపిణి వైతివి. సర్వమునకు బీజమయి త్రయీ రూపమగు యజ్ఞ గర్భ వైతివి. యజింప బడుదానవై (ఇజ్యవై) నీవే ఫల గర్భ వైతివి. అరణి రూపమున నీవు వహ్ని గర్భ వైతివి. వెన్నెలవై వాసర గర్భ వైతిని, సన్నతివై (నమస్కార స్వరూపిణివై) జ్ఞాన గర్భ వయితివి. పరమ నీతివీవై నయగర్భ వయితివి. వినయముం బూని లజ్జ గర్భ వైతివి. ఇచ్చవు కామ గర్భవు. తుష్టిగా సంతోష గర్భినివి. మేధగా బోధ గర్భవు, ధృతివై ధైర్య గర్భవు, అఖిల కారణమైన ద్యులోక మంతరిక్షముగా గ్రహ నక్షత్ర తారకా గర్భవు. మరియును వేల కొలదిగా గల విభూతులు అసంఖ్యాకములు నైన జగద్ధాత్రి యిపుడు నీ కడుపులో నున్నది. ఆమెకు సముద్రాద్రి నదీద్వీప పట్టణములు విభూషణములు. గ్రామ ఖర్వట ఖేతాదుల యెల్ల పృథివి అన్ని యగ్నులు నీళ్ళు వాయువులు ఉరగులు యక్షులు రాక్షసులు ప్రేతములు గుహ్యకులు గ్రహర్క్ష తారకా విమాన శతసంకుల మయిన నభము (అంతరిక్షము) అంతటికి అవకాశ మయిన ఆకాశము భూర్భువ స్వర్మ హర్జనస్తపో బ్రహ్మ లోకములు అఖిల బహ్మండము దానిలో నున్న దేవదైత్య గంధర్వచారణ మహోరగ యక్ష రాక్షస ప్రేతగుహ్యకులు మనుష్యులు పశువులు మఱియుం గల జీవులు తనలో నున్న వానిచే ననంతుడగు నీ సర్వాంతర్యామి సర్వభావనుడు యెవ్వని రూపకర్మ స్వరూపులు కొలత కందవో అఖిల మైన కొలత లెవ్వనిలో నిముడునో అట్టి విష్ణువు నీ గర్భ మందున్నాడు, విష్ణు గర్భవు అన్నమాట. నీవు స్వాహదేవీ వి స్వధవు విద్యవు సుధవు నింగిని జ్యోతిస్సువు. నీవు సర్వలోక రక్షార్థ మవని నవతరించిన దానవు దేవీ! ప్రసన్నవు గమ్ము. సర్వ జగమ్మునకు నో కల్యాణీ! శం (= సుఖమును) కురు (= చేయుము). ఎవ్వనిచే నఖిల జగమ్ము ధరింప బడినదో యా యీశానుని బ్రీతితో నీవు ధరింపుము.