3 - కృష్ణావతారము

శ్రీపరాశరుడు:

ఏవం సంస్తూయమానాసాదేవై ర్దేవమధారయత్।

గర్భేణపుణ్దరీకాక్షం జగతస్త్రాణకారణమ్॥

తతోఽఖిల జగద్పద్మబోధయాచ్యుతభానునా।

దేవకీపూర్వసంధ్యాయామావిర్భూతం మహాత్మనా॥

తజ్జన్మదినమత్యర్థమాహ్లా ద్యామలదిఙ్ముఖమ్।

బభూవసర్వలోకస్య కౌముదీశ శినోయథా॥

సంతస్సంతోషమధికం ప్రశమం చణ్డమారుతాః।

ప్రసాదంనిమ్నగాయాతా జాయమానేజనార్దనే॥

సిన్ధవోనిజశబ్దేనవాద్యంచక్రుర్మనోహరమ్।

జగుర్గన్ధర్వపతయో ననృతుశ్చాప్సరోగణాః॥

ససృజుః పుష్పవర్షాణిదేవాభువ్యన్తరిక్షగాః।

జజ్వలుశ్చాగ్నయశ్శాన్తా జాయమానే జనార్దనే॥

మన్దం జగర్జుర్జలదాః పుష్పవృష్టిముచోద్విజ!

అర్ధరాత్రేఖిలాధారేజాయమానే జనార్దనే॥

పుల్లెందీవరపత్రాభం చతుర్భాహుముదీక్ష్య తమ్।

శ్రీవత్సవక్ష సంజాతం తుష్టావా నకదున్దుభిః॥

అభిష్టూయ చ తం వాగ్భిః ప్రసన్నాభిర్మహామతిః।

విజ్ఞాపయామాసతదాకంసా ద్భీతోద్విజోత్తమ॥

శ్రీపరాశరుడు:

ఇట్లా దేవీ దేవతలచే స్తుతింప బడినదై తన గర్భమున సర్వ జగత్త్రాణ కారణమైన పుండరీకాక్షుని ధరించెను. అఖిల భువన పద్మ బోధనము కొఱకు మహాత్ముడు విష్ణుభానువు దేవకీరూప పూర్వాసంధ్య యందావిర్భవించెను. ఆ పుట్టిన రోజు విమలమైన దిశాముఖములు గలదియునై చంద్రుని కౌముది (వెన్నెల) వలె సర్వ లోకమున కత్యంతాహ్లాదకర మైనది జనార్ధను డావిర్భావించిన యెడ సత్పురుషులు మిగుల సంతోషమును ప్రచండ వాయువులు ప్రశమమును, నదులు ప్రసన్నతను బొందినవి. సముద్రములు తమ శబ్ధముచే మనోహర మంగళ వాద్యములను మేళవించెను. గంధర్వ రాజులు గానములు సేసిరి. అప్సరో గణములు నాట్యములు సేసెను. వేల్పు లంతరిక్ష మందుండి పూల వానలం గురిపించిరి. జగన్నాథు డవతరింప అగ్నులు శాంతముగ దక్షిణావర్త జ్వాలలచే దీపించెను. మేఘములు మందీమందముగ నురిమెను. మఱియు నవి పూలవాన గురిసినవి. జనార్దనుం డర్ధరాత్రము నందుదయించెను. వికసించిన నల్లతామర పూవు వంటి నిగనిగలాడు మేని కాంతితో నలుచేతులలో శ్రీవత్స చిహ్నముతో నుదయించిన యామూర్తిం జూచి వసుదేవుడు ప్రసాద గుణభరితము లయిన వచనములచే స్తుతించి కంసుని వలని జడుపుతో నయ్యెడ నిట్లని విన్నవించెను.

వసుదేవుడు:

జాతోఽసిదేవదేవేశ! శంఖచక్రగదా ధరమ్।

దివ్యరూపం మిదం దేవ! ప్రసాదేనోసంహర!॥

అద్వైవదేవా! కంసోఽయంకురుతేమమ ఘాతనమ్।

అవతీర్ణ ఇతిజ్ఞాత్వా త్వమస్మిన్మమ మన్దిరే॥

వసుదేవుడు:

ఓ దేవదేవ ప్రభూ! నీవు జన్మించితివి. అనుగ్రహము సేసి యీ నీ దివ్య రూపమును శంఖ చక్ర గదా ధారియైన మూర్తిని ఉపసంహరింపుము. నా నివసమున నీవు అవతరించి నట్లు విని యీ కంసుడీ క్షణము నాకు ఘాతసేయును.

దేవకి:

యోఽనన్తరూపోఽఖిలవిశ్వరూపో గర్భేఽపిలోకాన్ వపుషాబిభర్తి।

ప్రసీదతా మేషసదేసదే వో యోమాయయాఽఽవిష్కృతబాలరూపః॥

ఉపసంహరసర్వాత్మన్ రూపమేతచ్చతుతుర్భుజమ్।

జానాతు మావతారంతే కంసోయందితిజన్మజః॥

దేవకి:

అనంతరూపుడు అఖిల విశ్వ స్వరూపుడునై తనలో సర్వ లోకములం దాల్చునట్టి దేవదేవుడు మాయచే నియ్యేడ బాలక మూర్తియై యున్న స్వామి ప్రసన్నుడవు గాక! ఓ సర్వాత్మక! నాల్గు భుజములతో నున్న యీ రూపమును మఱుగు పఱపుము. దైత్యుడై పుట్టిన యీ కంసుడు నీవు అవతరించినావని యెఱుంగ కుండుగాక!

భగవానుడు:

స్తుతోఽహంయత్త్వయాపూర్వం పుత్రార్థిన్యా తదద్యతే।

సఫలం దేవి సంజాతం జాతోఽహంయత్తవోదరాత్॥

భగవానుడు:

‘పుత్రుం గోరి మున్ను నీవు నన్ను స్తుతించితివి. అది యిప్పుడు ఫలించినది. నీ కడుపున నేను జన్మించితిని’ అని భగవంతు డూరకున్నంత

శ్రీపరాశరుడు:

ఇత్యుక్త్వాభగవాంస్తూష్ణీం బభూవమునిసత్తమ!।

వసుదేవోపితం రాత్రా వాదాయప్రయయౌబహిః॥

మోహితాశ్చాభవం స్తత్రరక్షిణో యోగానిద్రయా।

మధురా ద్వారపాలాశ్చ వ్రజత్యానకదున్దుభౌ॥

వర్షతాం జలదానాంచ తోయమత్యుల్బణం నిశి।

సంవృత్యానుయయౌ శేషః ఫణైరాకనకదున్దుభిమ్॥

యమునాంచాతిగమ్భీరాం నానావర్తశతాకులామ్।

వసుదేవో వహన్విష్ణుం జానుమాత్రవహాంయయౌ॥

కంసస్య కరదానాయ తత్త్రైవాభ్యాగతాంస్తటే।

నన్దాదీన్ గొపవృద్దాంశ్చ యమునాయా దదర్శసః॥

తస్మిన్ కాలేయశోఽదాపి మోహితా యోగనిద్రయా।

తామేవకన్యాం మైత్రేయ! ప్రసూతా మోహితేజనే॥

వసుదేవోపి విన్యస్యబాలమాదాయదారికమ్।

యశోదా శయనాత్తూర్ణమాజగామామితద్యుతిః॥

దదృశేచ ప్రబుద్ధాసా యశోదా జాతమాత్మజమ్।

నిలోత్పలదలశ్యామం తతోఽత్యర్థముదం యయౌ॥

ఆదాయవసుదేవోఽపిదారికాంనిజమన్దిరే।

దేవకీ శయనేన్యస్య యథాపూర్వమతిష్ఠత॥

శ్రీపరాశరుడు:

వాసుదేవుండా శిశువు నెత్తికొని వెలికిం జనియె. కారాగార రక్షకుల య్యెడ యోగానిద్రచే మొహమున బడిరి. మధురా నగర ద్వారపాలురు గూడ వసుదేవు డేగుచుండ మాయా మోహ వశులైరి. నడిరేయి మేఘములు పెనువాన గురియు చుండ యమునా నది విష్ణువు నెత్తికొని వసుదేవుడు దన్ను దాటుతఱి మోకాలి లోతై తోచెను. ఆ నదీ తటము నందు కంసునికి పన్నులు గట్టనేతెంచి విడిది చేసిన నందాది గోపా వృద్దులను వసుదేవుడు చూచెను. ఆ సమయమందు యశోద యోగానిద్రచే మైమరచి నిద్రపోవ నయ్యింట పరిజనమును నొడలెరుంగకున్న వేళ నా కన్యకం గాంచెను. వసుదేవుడు బాలుడిని యశోద ప్రక్కనుంచి యామె శయ్యపై నుండి యా బాలిక నెత్తుకొని తిఱిగి వేగముగా వచ్చెను. యశోద మేల్కొని తనకు నీలోత్పల దళశ్యాముడు కొడుకు పెట్టెనని యా శిశువుం జూచి మురిసి పోయెను. వసుదేవుడా పిల్లం గొని తన యిరువున కేతెంచి దేవకి ప్రక్కలో

నుంచి ముందటి యట్ల యుండెను.

తతోబాలధ్వనింశ్రుత్వా రక్షిణస్సహసోత్థితాః।

కంసాయావేదయామాసుః దేవకీప్రసవంద్విజ॥

కంసస్తూర్ణముపెత్యైనాం తతోజగ్రాహబాలికామ్।

ముఞ్చముఞ్చేతిదేవక్యాసన్నకణ్ఠ్యానివారితః॥

చిక్షేపచశిలాపృష్ఠేసాక్షిప్తావియతిస్థితా।

అవాపరూపం సుమత్సాయుదాష్టమహాభుజమ్॥

ప్రజహాసతథైవోచ్చైః కంసం చరుషితాఽబ్రనీత్।

కింమయాక్షి ప్తయాకంస! జాతోయస్త్వాంవధిష్యతి ॥

సర్వస్వభూతోదేవానామాసీన్మృత్యుః పురాసతే।

తదేతత్సం ప్రధార్యాశుక్రియతాం హితమాత్మనః॥

ఇత్యుక్త్వాప్రయయౌదేవీదివ్యస్రగ్గన్ధభూషణా।

పశ్యతోభోజరాజస్య స్తుతాసిద్దైర్విహాయసా॥

అవ్వల కారాగార రక్షకులు పిల్ల ఏడుపు విని తొట్రుపడి లేచి దేవకి ప్రసవించినదని కంసునుకి నివేదించిరి. కంసుడు వెంటనే వచ్చి యీ బాలికం బట్టికొని దేవకి విడువు విడువు మని నిరుద్ధ కంఠయై నివారింపగా నతనొక రాతిపై విసరి కొట్టినంత నా శిశువు మీది కెగిరి ఆయుధములతో గూడిన యెనిమిది భుజముల తోడి రూపముంగొనిన బిగ్గరగ నవ్వి కోపోగ్రయై కంసునితో ఓరి! కంసా! నన్ను విసరివైచి నంత నేమయ్యె? నిన్ను వధింప గలవాడు దేవతల సర్వభాగ్యాధి దేవత యతడింత మున్ను పుట్టినాడు. ఈ యంశము బుద్దినిడికొని నీకు హితమట్ల సేయుము అని పలికి దివ్యకుసుమ మాలధారిణి యగు నా దేవి భోజరాజు గనుగొను చుండగనే సిద్దులు స్తుతించు చుండ గగన మార్గమునం జనెను.