విష్ణు మహా పురాణము

2 - సప్త ద్వీప సముద్ర పర్వత వర్ణనము

మైత్రేయుడు:

కథితోభవతాబ్రహ్మన్ సర్గస్స్వాయంభువస్తుమే

శ్రోతుమిచ్చామ్యహంత్వత్తస్సకలంమణ్డలంభువః

యావన్తస్సాగరాద్వీపాస్తథావర్షాణి పర్వతాః

వనానిసరితః పుర్యోదేవాదీనాం మహామునే

యత్ప్రమాణమిదంసర్వం యదాధారంయదాత్మకమ్

సంస్థానమస్యచమునే! యథావద్వక్తుమర్హసి

మైత్రేయుడు:

మహామతివగు నీవు భారత రాజుల యొక్కయు దేవా దానవ గాంధర్వ యక్షోరగాదుల యొక్కయు అద్భుతములగు చరిత్రలను స్థావర జంగామాదుల సృష్ట్వాదులను మృదు మధురముగ మన శ్శ్రవణా నందకరముగా జెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము విన గుతూహలులమై యున్నాము. భువన కోశ సంస్థాన మవదానమున విననున్న మాకది యాదరముతో నానతిమ్మని మునులడిగిరి. 

శ్రీపరాశరుడు:

మైత్రేయ శ్రూయతేమేతత్సంక్షేపాద్గదతోమమ

నాస్యవర్షశతేనాపివక్తుంశక్నోతివిస్తరమ్

జమ్బూప్ల క్షాహ్వయౌద్వీపౌశాల్మలశ్చాపరోద్విజ

కుశఃక్రౌంచస్తథాశాకఃపుష్కరశ్చైవసప్తమః

ఏతేద్వీపాస్సముద్రైస్తుసప్తసప్తభిరావృతాః

లవణేక్షుసురాసర్పిర్దధిదుగ్ధజలై స్సమమ్

జమ్బూద్వీపస్సమస్తానామేతేషాం మధ్యసంస్థితః

తస్యాపిమేరుర్ మైత్రేయమధ్యేకనక పర్వతః

చతురాశీతిసాహస్రో యోజనైర్యస్యచోచ్చ్రయః

ప్రవిష్తః షోడశాధస్తాద్ద్వాత్రింశన్మూర్ ద్నివిస్తృతః

మూలేషోడశసాహస్రోవిస్తారస్తస్యపర్వతః

భూపద్మస్యాస్యశైలోఽసౌ కర్ణికాకారసంస్థితః

హిమవాన్ హేమకూటశ్చ నిషధశ్చాస్య దక్షిణే

నీలశ్శ్వేతశ్చశృంగీచ ఉత్తరేవర్షపర్వతాః

భారతంప్రథమం వర్షం తతః కింపురుషంస్మృతమ్

హరివర్షంతథై వాన్యన్మేరోర్దక్షిణతోద్విజ

రమ్యకంచోత్తరంవర్షం తస్యైవానుహిరణ్మయమ్

ఉత్తరాః కురవశ్చైవ యథావైభారతంతథా

నవసాహస్రమేకై కమేతేషాంద్విజ సత్తమ

ఇళావృతంచతన్మధ్యే తన్మధ్యే మేరురుచ్చ్రితః

శ్రీపరాశరుడు: 

మైత్రేయ! ఇది నూరేండ్లు సెప్పినం దీరదు, సంక్షేపించి తెల్పెద వినుండు. జంబూ + ప్లక్ష + శాల్మల + కుశ + క్రౌంచ + శాఖ + పుష్కరములు అనునవి సప్త ద్వీపములు. ఇవి లవణ = ఉప్పు, ఇక్షు = చెరకు రసము, సురా = కల్లు, సర్పి = నెయ్యి, దధి = పెరుగు, దుగ్ధ = పాలు, జల = నీరునుం గల ఏడు సముద్రములచే జుట్టుకొన బడినది. వీని నడుమ జంబూ ద్వీపమున్నది. దానికి నడుమ "మేరువు" అను బంగారు కొండ యున్నది. అది ఎనుబది నాలుగు యోజనముల ఎత్తు, పదునారు వేల యోజనముల లోతు, ముప్పది రెండు వేల యోజనముల వైశాల్యము గల యుపరి భాగము కలిగి యున్నది. మూలము పదునారువేల యోజనముల విస్తారమై యున్నది. భూమియను పద్మమున కది నడిమికర్ణిక (దుద్దు) వలె నున్నది. హిమవంతము - హేమకూటము, నిషధము ననునవి దానికి దక్షిణమునను, నీలము, శ్వేతము, శృంగి యనునవి యుత్తరమునను వర్ష పర్వతము లున్నవి. అవి లక్ష యోజన ప్రామాణములు, తక్కినవి తొంబది వేల యోజనముల ప్రమాణము గలవి. రెండు వేల యోజనముల ఎత్తు, అన్ని యోజనముల వెడల్పు గలవి. భారత, కింపురుష, హరి వర్షములు మేరువునకు దక్షిణమున నున్నవి. రమ్యకము ఉత్తర మందున్నది. అది కనకమయము. ఉత్తర కురు భూములక్కడనే యున్నవి. ఈ వర్షము లోక్కొక్కటి భారత వర్షము వలె తొమ్మిది వేల యోజనముల వైశాల్యము గలవి. 

మేరోశ్చతుర్దిశంతత్ర నవసాహస్రవిస్తృతమ్

ఇళావృతంమహాభాగ చత్వారశ్చాత్రపర్వతాః

విష్కమ్భారచితామేరోర్యోజనాయుతముచ్చ్రితాః

నవైస్సరోభిశ్చసమందిక్ష్వేతే కేసరాచలాః

పూర్వేణమన్దరోనామదక్షిణేగన్ధమాదనః

విపులః పశ్చిమేపార్ శ్వేసుపార్ శ్వశ్చోత్తరేస్మృతః

కదమ్బస్తేషుజమ్బూశ్చ పిప్పలోవట ఏవచ

ఏకాదశశతాయామాః పాదపాగిరికేతవః

జమ్బూద్వీపస్యసాజమ్బూర్నామహేతుర్మహామునే

మహాగజప్రమాణాని జమ్బ్వాస్తస్యాః ఫలానివై

పతన్తిభూభృతః పృష్ఠే శీర్యమాణాతిసర్వతః

రసేనతేషాంప్రఖ్యాతా తత్రజమ్బూనదీతి వై

సరిత్ప్రవర్తతేసాచ పీయ తే తన్నివాసిభిః

నస్వేదోనచదౌర్గన్ధ్యం నజరానేన్దియక్షయాః

తత్పానాత్స్వస్థమనసాంజనానాంతత్రజాయతే

తీరమృత్తద్రసంప్రాప్యసుఖవాయువిశోషితా

జామ్బూనదాఖ్యంభవతిసువర్ణంసిద్ధ భూషణమ్

భద్రాశ్వంపూర్వతోమేరోః కేతుమాలంచపశ్చిమమ్

వర్షేతు మునిశ్రేష్ఠ! తయోర్మధ్య మిలావృతమ్

వనంచైత్రరథంపూర్వేదక్షిణేగన్ధమాదనమ్

వైభ్రాజంపశ్చిమేతద్వదుత్తరేనన్దనంస్మృతమ్

అరుణోదంమహాభద్రంసితోదమథమానసమ్

సరాంస్యేతానిచత్వారి దేవభోగ్యానిసర్వదా

మేరువు నలు దిశల నిలావృతము తొమ్మిది వేల యోజనుల వైశాల్యము గలది. ఇందు నాల్గు పర్వతములు మేరువునకు విష్కంభములట్లున్నవి. విష్కంభములు = పదివేల యోజనముల పొడవు గలవి. తూర్పున మందర పర్వతము, దక్షిణమున గంధమాదనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము ననునవి గలవు. వీని యందు క్రమముగ కదంబము (కడిమి) జంబువు (నేరేడు) పిప్పలము (రావి) వటము (మఱ్ఱి) యను చెట్లు పదునొకండు వందల యోజనముల విరివి గల వృక్షములు “గిరి కేతువులు” (పర్వతాగ్ర పతాకము లట్టివి) గలవు. జంబూ వృక్ష సమృద్ధిం బట్టి జంబూ ద్వీపమ్ము నాబరిగె. ఆ నేరేడు పండ్లు మహాగజ ప్రమాణమున రాలు చుండును. అవి ప్రిదిలి కారినరస మేరైపారి జంబూ నది యనంబరుగు. ఆ జంబూ రసము ద్రావిన వారు కష్టము దుర్వాసన ముదిమి ఇంద్రియక్షయము నెరుంగరు. ఆ జంబూ నది యొడ్డునం గల మన్నా రసముచే దడిసి సుఖ వాయువున నారి జంబూ నదమను బంగార మేర్పడును. అది సిద్ధ భూషణము అనగా సిద్ధులు ధరించున దన్నమాట. మేరువునకు తూర్పు దెస భద్రాశ్వము, పడమట కేతుమూల మను రెండు వర్షము లున్నవి. వానికి నడుమ ఇలావృతము, తూర్పున చైత్ర రథము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము ఉత్తరమున నందన వనము నున్నవి. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవ భోగ్యములు.

సితామ్భశ్చకుముద్వాంశ్చ కురరీమాల్య వాంస్తథా

వైకంక ప్రముఖామేరోః పూర్వతః కేసరాచలాః

త్రికూటశ్శిశిరశ్చైవపతంగోరుచకస్తథా

నిషదాద్యాదక్షిణత స్తస్యకేసర పర్వతాః

శిఖివాసాస్సవైడూర్యఃకపిలోగన్ధమాదనః

జారుధిప్రముఖా స్తద్వత్పశ్చిమే కేసరాచలాః

మేరోరనన్తరాంగెషు జఠరాదిష్వవస్థితాః

శంఖకూటోఽథ ఋషభో హంసోణాగస్తథాపరః

కాళాంజనాద్యాశ్చతథా హ్యుత్తరేకేసరాచలాః

చతుర్దశసహస్రాణి యోజనానాం మహాపురీ

మేరోరుపరి మైత్రేయ! బ్రహ్మణః ప్రథితాదివి

తస్యాస్సమన్తతశ్చాష్టదిశాసువిదిశాసుచ

ఇన్ద్రాది లోకపాలానాం ప్రఖ్యాతాః ప్రవరాః పురః

విష్ణుపాదవినిష్క్రాన్తాప్లావయంతీన్దుమణ్డలమ్

సమన్తాద్బ్రహ్మణః పుర్యాంగంగాపతతివైదివః

సాతత్రపతితాదిక్షుచతుర్దా ప్రతిపద్యతే

సీతాచాలకనన్దాచచక్షుర్భ ద్రాచవైక్రమాత్

పూర్వేణశైలాచ్చైలంతు సీతాయాత్యన్తరిక్షగా

తతశ్చపూర్వ వర్షేణ భద్రాశ్వేనై తిసార్ణవమ్

తథైవాలకనన్దాపిదక్షిణేనైత్యభారతమ్

ప్రయాతిసాగరంభూత్వా సప్తభేదామహామునే

సాచక్షుః పశ్చిమగిరీనతీత్యసకలాంస్తతః

పశ్చిమం కేతుమాలాఖ్యంవర్షంగత్వైతిచార్ణవమ్

భద్రాతథోత్తరగిరీనుత్తరాంశ్చతథాకురూన్

అతీత్యోత్తరమమ్భోధింసమభ్యేతి మహామునే

సితామ్భతము, కుముద్వంతము, కురారీ, మాల్యవంతము, వైకంకము ననునవి మేరువు యొక్క కేసర పర్వతములు. త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషధము మొదలైనవి దక్షిణ దిశ మేరువు యొక్క కేసర పర్వతములు. తశిఖివాసము, వైదూర్యము, కపిలము, గంధమాదనము, జారుథి మొదలైనవి మేరు పశ్చిమ కేసర గిరులు. అవి మేరువు నంటి జఠరాది స్థానము లందున్నవి. శంఖ కూటము, ఋషభము, హంసము, నాగము, కాలాంజనము మొదలగునవి వురూత్తర దిశ కేసర శైలములు. మేరువు మీద బ్రహ్మ యొక్క నగరము పదునాలుగు వేల యోజనముల వైశాల్యము గలది. అందెనిమిది మూలలందు అష్ట దిక్పాలుర పురములు గలవు. విఘ్న పదము నుండి వెడలి చంద్ర మండలమున ప్రవహించుచు నాకాశ గంగ బ్రహ్మపురి నలువైపుల పడు చున్నది. అట్టుపడి నాల్గు దెసల నాల్గు పాయలైనది. అవి సీత, అలకనంద, చక్షువు, భద్ర. సీత పూర్వ శైలము నుండి మరియొక శైలమున కంతరిక్ష సంచారము సేయును అవ్వాల భద్రాశ్వ వర్ష పర్వతము మీదుగా సముద్రుం బొందును. అలక నంద దక్షిణ దిశగా భారత వర్షముం జేరి యేడు భాగములయి సముద్రము జోచ్చును. చక్షువు పడమటి గిరులన్నియు దాటి పడమటం గల కేతుమాల వర్షముం జొచ్చి సముద్రముం గలియును. భద్ర ఉత్తర గిరులం దాటి యుత్తర కురు భూములం బ్రవహించి ఉత్తర సముద్రముం జేరును. 

ఆనీల నిషదాయామౌమాల్యవద్గన్ధమాదనౌ

తయోర్మధ్యగతోమేరుః కర్ణికాకారసంస్థితః

భారతాః కేతుమాలాశ్చభద్రాశ్వాఃకురువస్తథా

పత్రాణిలోకపద్మస్యమర్యాదాశైలబాహ్యతః

జఠరోహేమకూటశ్చమర్యాదాపర్వతావుభౌ

తౌదక్షిణోత్తరాయా మావానిలాన్నిషధాయతౌ

గన్ధమాదన కైలాసౌపూర్వవచ్చాయతావుభౌ

అశీతియోజనాయామావర్ణవాన్తర్ వ్యవస్థితౌ

నిషదః పారియాత్రశ్చ మర్యాదాపర్వతావుభౌ

మేరోః పశ్చిమాదిగ్భాగేయథాపూర్వేతథాస్థితౌ

త్రిశృంగో జారుధిశ్చైవ ఉత్తరేవర్షపర్వతౌ

పూర్వవచ్చాయతావేతావర్ణవాన్తర్వ్యవస్థితౌ

ఇత్యేతేమునివర్యోక్తామర్యాదాపర్వతాస్తవ

జఠరాద్యాస్స్థితామేరోర్యేషాంద్వౌద్వాచతుర్దిశమ్

మేరోశ్చతుర్దిశంయేతుప్రోక్తాః కేసర పర్వతాః

సితాద్యాశ్చమునేతేషామతీవహిమనోరమాః

శైలానామన్తరేద్రోణ్యస్సిద్ధచారణసేవితాః

సురమ్యాణి తథాతాసుకాననానిపురాణిచ

లక్ష్మీవిష్ణ్వగ్ని సూర్యాది దేవానాం మునిసత్తమ

తాస్వాయతనవర్యాణి జుష్టానిసురకిన్నరైః

గన్దర్వయక్షరక్షాంసీతథాదైతేయదానవాః

క్రీడన్తితాసురమ్యాసుశైలద్రోణీష్వహర్నిశమ్

నైతేషుపాపకర్తారో యాన్తిజన్మశతైరపి

భద్రాశ్వేభగవాన్విష్ణురాస్తేహయశిరాద్విజ

వరాహః కేతుమాలేతుభారతే కూర్మరూపద్రుత్

మత్స్యరూపశ్చగోవిన్దః కురుష్వాస్తే సనాతనః

విశ్వరూపేణ సర్వత్ర సర్వస్సర్వేశ్వరోహరిః

సర్వస్యాధారభూఽతోసౌమైత్రేయాస్తేఽఖిలాత్మకః

యానికింపురుషాదీనివర్షాణ్యష్టౌ మహామునే

నతేషుశోకోనాయాసోనోద్వేగః క్షుద్భయాదికమ్

స్వస్థాః ప్రజానిరాతంకాః సర్వదుఃఖవివర్జితాః

దశద్వాదశవర్షాణాం సహస్రాణి స్థిరాయుషః

నతేషువర్షతేదేవోభౌమాన్యమ్భాసితేషువై

కృతత్రేతాదికానై వతేహుస్థానేషుకల్పనా

సర్వేష్వేతేషువర్షే షుసప్తసప్తకులాచలాః

నద్యశ్చశతశస్తేభ్యః ప్రసూతాయాద్విజోత్తమ

నీల పర్వతము నుండి నిషధ పర్వతము నంతటి పొడవున మాల్యవంతము, గంధమాదనమును గలవు. వాని నడిమి భాగమున తామర పువ్వులోని దుద్దువలె మేరువున్నది. మర్యాదా పర్వతమునకు ఆవల లోకాలోకమను పర్వతమునకు భారతములు, కేతుమూలములు, భద్రాశ్వములు, కురు భూములును రేకులట్లున్నవి. జఠరము, దేవకూటము అనునవి రెండు మర్యాదా పర్వతములు. అవి దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము దాక వ్యాపించి యున్నవి. గంధమాదన , కైలాస పర్వతములు తూర్పు పడమర లందు నేనుబది యోజనముల పొడవు గలవై నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు వ్యాపించి సముద్రములో జొచ్చి యున్నవి. నిషధము పారియాత్రము అనునవి రెండును మర్యాదా పర్వతములు. దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు దైర్ఘ్యము గలవై మేరు పర్వతమునకు పశ్చిమ భాగము నందు యథా పూర్వముగా నున్నవి. త్రిశృంగము జారుధియు నుత్తర దిశ వర్ష పర్వతములు తూర్పు పడమరగా వ్యాపించి యవి సముద్ర మధ్యమున నున్నవి. మర్యాదా గిరుల జెప్పితిని. వీనిలో రెండు రెండు పర్వతములు మేరు పర్వతమునకు జఠర (గర్భ) భాగములుగా నలు దెసల నున్నవి. మేరువు నలు దెసలంగల కేసర పర్వతములు చెప్ప బడినవి. అవి చల్లని ఆద్యంత ప్రదేశములు వనంబులు గలవు. లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతల ఆలయ శ్రేష్టములు నర కిన్నరులచే సేవితములై యొప్పును. రమ్యములైన ఆ పర్వత ద్రోణు (లోయ) లందు రేయింబవళ్ళు గాంధర్వ, యక్ష, రాక్షస, చైత్య, దానవులు గ్రీడించు చుందురు. ఇవి భౌమ స్వర్గములు. అనగా భూమి మీద నున్న స్వర్గ భూములు. ధర్మ నిష్టులకు నివాసములు ఇందెన్ని జన్మముల కైనను బాపాత్ములు చేర జాలరు.