శ్రీపరాశరుడు:
ఇదంచశ్రుణు మైత్రేయ యత్పృష్టోహమిహత్వయా।
శ్రీసంబన్దంమయాప్యేతచ్చ్రుతమాసీన్మరీచితః॥
సంతానకానామఖిలం యస్యాగన్ధేనవాసితమ్।
అతి సేవ్యమభూద్బ్రహ్మం స్తద్వనంవనచారిణామ్॥
ఉన్మత్తవ్రతధృద్విప్రస్తాందృష్టా శోభనస్రజమ్।
తాంయయాచేవరారోహాం విద్యాధరవధూంతతః॥
యాచితాతేనతనవజ్గీమాలాంవిద్యాధరాంగనా।
దదౌతస్మై విశాలాక్షీసాదరం ప్రణిపత్యతమ్॥
తామాదాయాత్మనోమూర్ద్నిస్రజమున్మత్తరూపధృత్।
కృత్వాసవిప్రోమైత్రేయ పరిబభ్రామమేదినీమ్॥
సదదర్శసమయాన్తమున్మత్తైరావతేస్థితమ్।
త్రైలోక్యాధీపతిం దేవం సహదేవైశ్శచీపతిమ్॥
తామాత్మనస్సశిరస్స్రజమున్మత్త షట్పదామ్।
ఆదాయామరరాజాయచిక్షేపోన్మత్తవన్మునిః॥
గృహీత్వాసురరాజేన స్రగైరావతమూర్ధని।
న్యస్తారరాజ కైలాసశిఖరే జాహ్నవీయథా॥
మదాన్ధకారితాక్షోఽసౌగన్ధోత్కృష్టేనవారణః।
కరణేఘ్రాయ చిక్షేపతాం స్రజంధరణీతలే॥
తతశ్చుక్రోధభగవాన్ దుర్వాసా మునిసత్తమః।
మైత్రేయ దేవరాజానం క్రుద్ధశ్చైతదువాచహ॥
శ్రీపరాశరుడు:
మైత్రేయ! నన్నీవడిగితివి గాన తెల్పెద వినుము. మరీచి వలన లక్ష్మీ చారిత్రము నిట్లు విని యుంటిని. దుర్వాసుడు శంకరుని యంశము. ఆయన యీ భూలోకము సంచరించుచు నొక దివ్య పుష్పమాలను జూచెను. దాని పరిమళముచే నా వనమంతయు ఘుమఘుమ లాడి వనవాసు లందఱకు సంసేవ్య మయ్యెను. అమ్మహర్షి పిచ్చివాని యట్లు తిరుగుచు (ఉన్మత్త వ్రతముదాల్చి) ఆ సుశోభన కల్పవృక్ష కుసుమ మాలికం గని యా సుందరి నది తనకిమ్మని యడిగెను. ఆ విశాల నయన యాతనికి మ్రొక్కి యది యమ్మునికి సమర్పించెను. అది చేకొని పిచ్చి గంతులు వేయుచు నమ్ముని యీ భూమి నలుదెసల పరిభ్రమించుచు నైరావత మెక్కి యెదురుగా వచ్చు త్రిభువనాధి పతిని శచీపతిని గనెను. తత్సుగంధమునకు తుమ్మెదలు దిమ్ముగొని (వెర్రెత్తి) తుమ్మెదలు మూగు నా మాలను తన తలకు విసిరి వైచెను. కైలాస శిఖర మందు గంగా నదివలె రాణించెను. మదముచే గన్నులు గానని యా గంధగజము మదము స్రవించు తొండముచే నాఘ్రాణించి దానిని నేలకు విసరెను. దాన దుర్వాసుడు కోపించి దేవరాజున కిట్లనియె.
దుర్వాసుడు:
ఐశ్వర్య మదదుష్టాత్మన్నతి స్తబ్దోఽసివాసవ।
శ్రియోధామస్రజం యస్త్వంమద్దత్తాంనాభినన్దసి॥
ప్రసాద ఇతినోక్తంతేప్రణిపాత పురస్సరమ్।
హర్షోత్పుల్లకపోలేన నచాపిశిరసాధృతా॥
మాయాదత్తామీమాంమాలాం యస్మాన్నబహుమన్యసే।
త్రైలోక్యశ్రీరతోమూఢ వినాశముపయాస్యతి॥
మాంమన్యతేఽన్యై స్సధృశం నూనం శక్ర భవాన్ ద్విజైః।
అతోఽవమానమస్మాసుమానినా భవతాకృతమ్॥
మద్దత్తాభవతాయస్మాత్ క్షిప్తామాలా మహీతలే।
తస్మాత్ప్రనష్టలక్ష్మీకం త్రైలోక్యం తేభవిష్యతి॥
యస్యసంజాత కొపస్యభయమేతి చరాచరమ్।
తంత్వం మామతిగర్వేణ దేవరాజావమన్యసే॥
దుర్వాసుడు:
వాసవ! ఐశ్వర్య మదముచే మత్తేక్కితివి. మొద్దు బారితివి. లక్ష్మీ స్థానమైన దానిని నేనిచ్చిన యీ కల్ప సుమ మాలను అభినందింప వైతివి. మహా ప్రసాదమని ప్రణతుడవై సంతోషాతిశయముచే చెక్కిళ్ళు విప్పార (మోము విప్పార) దీనిందల దాల్చ వైతివి. అందులో గూడ నేనిచ్చినదని యైన గమనింపక గౌరవింప వైతివి. ఇందుచే నో మూడ! నీ త్రోలోక సామ్రాజ్య లక్ష్మి తరిగి పోగలదు. ఇతర బ్రాహ్మణులనట్లు నన్ను లెక్కించి లెక్క చేయనైతివి. దురభిమానివీ వందుచే మమ్మవమానించితివి. నేను కోపించి కనుబొమలు ముడిచితివా యీ చరాచర ప్రపంచము గడగడ లాడునే! అట్టి నన్ను పొగరెక్కి ఓ దేవరాజా! అవమానించితివి.
శ్రీపరాశరుడు:
మహేన్ద్రో వారణస్కన్ధాదవతీర్య త్వరాన్వితః।
ప్రసాదయామాసతదా దుర్వాఽససమ కల్మషమ్॥
ప్రసాద్యమానస్సతదా ప్రణిపాతపురస్సరమ్।
ప్రత్యువాచసహస్రాక్షం దుర్వాసా మునిసత్తమః॥
శ్రీపరాశరుడు:
నావిని మహేంద్రుడు గజేంద్ర స్కంధము నుండి దిగ్గున దిగి పుణ్యమూర్తి యగు దుర్వాసుని బ్రతిమాలెను. అతడంతట నల్లన నవ్వి ప్రణతుడై యింద్రుని కిట్లు బదులు పల్కెను.
దుర్వాసుడు:
నాహంకృపాలు హృదయో నచమాంభజతెక్షమా।
అన్యేతే మునయశ్శక్ర దుర్వాస సమవేహి మామ్॥
దుర్వాసుడు:
నేను దయా హృదయుడను గాను, నన్నోరిమి పొందదు. ఆ మునులు వేరని యెరుంగుము, ఆ గౌతమాది మునులితరులు వృధాగా నిన్ను పొగరెక్కించినారు. ఇంద్రా! అశాంతికి (ఓరిమి లేమికి) పరమసారము (నిగ్గు) అయిన దుర్వాసునిగ నన్నెరుంగుము.
గౌతమాదిభిరన్యైస్త్వం గర్వమారోపితోముధా।
అక్షాన్తీసారసర్వస్వం దుర్వాస సమవేహిమామ్॥
వసిష్ఠాద్యైఃదయాసారైః స్తోత్రం కుర్వద్భిరుచ్చకైః।
గర్వంగతోసియేనైవం మామప్యద్యావమన్యసే॥
జ్వలజ్జలాటకలాపస్య భ్రుకుటీకుటిలం ముఖమ్।
నిరీక్ష్యక స్త్రిభువనే మమ యో నగతో భయమ్॥
నాహంక్షమిష్యే బహునాకిముక్తేన శతక్రతో।
విడమ్భనామిమాంభూయః కరోష్యనునయాత్మికామ్॥
దయాసారులైన వశిష్ఠాది ఋషులు తెగ బొగడ నీవు మదమెక్కితివి. అందుచేతనే నన్నిట్లవమానించితివి. జ్వలించు జటా మండలముతో కినుకచే కనుబొమ్మలు ముడిపడి వికటమైన నా మొగముం జూచి భువన త్రయమం దెవ్వడు హడలిపోడు? పెక్కు మాటలెందుకు? నిన్ను నేను క్షమింపను. బ్రతిమాలుట యను నీ నాటక మింకను నాడుచున్నావు అని యవ్విప్రుడు వెళ్ళిపోయెను. దేవరాజును నైరావత మెక్కి యమరావతికి జనెను.
శ్రీపరాశరుడు:
ఇత్యుక్త్వాప్రయయౌవిప్రోదేవరాజోపితంపునః।
ఆరుహ్యై రావతంనాగం ప్రయయావమరావతీమ్॥
తతః ప్రభృతినిశ్ర్శీకంసశక్రంభువనత్రయమ్।
మైత్రేయాసీదపధ్వస్తంసంక్షీణౌషదివీరుధమ్॥
నయజ్ఞాస్సంప్రవర్తన్తేన తపస్యన్తి తాపసాః।
నచ దానాదిధర్మేషు మనశ్చ క్రేతథాజనః॥
నిస్సత్త్వాస్సకలాలోకాలోభాద్యుపహతేన్ద్రియాః।
స్వల్పేపిహిబభూవు స్తేసాభిలాషాద్విజోత్తమ॥
యతస్సత్త్వంతతోలక్ష్మీస్సత్త్వం భూత్యనుసారిచ।
నిశ్ర్శీకాణాంకుతస్సత్త్వంవినాతేన గుణాఃకుతః॥
బలశౌర్యాద్యభావాశ్చ పురుషాణాం గుణైర్వినా।
లంఘనీయస్సమస్తస్య బలశౌర్య వివర్జితః॥
భవత్యపధ్వస్తమతిః లఘితః ప్రథితఃపుమాన్।
ఏవమత్యన్తనిశ్ర్శీకేత్రైలోక్యేసత్త్వవర్జితే॥
దేవాన్ ప్రతిబలోద్యోగంచక్రుః దైతేయదానవాః॥
లోభాభిభూతానిశ్ర్శీకాదై త్యాస్సత్త్వ వివర్జితాః।
శ్రియావిహీనైః నిస్సత్త్వైః దేవైశ్చక్రుస్తతోరణమ్॥
ఇంద్రరాజ్య భ్రంశము తరువాత అది మొదలు మూడు భువనములు జగత్స్వరూపము సొంపు దరిగి పోయినవి. ధ్వంసమైనది. ఓషదులు పంటలు క్షీణించి పోయినవి. యజ్ఞములు జరుగుట లేదు. తాపసులు తపస్సు సేయరు. దానాది ధర్మములందు జనము మనస్సును బెట్టరు. లోభాదుల కింద్రియములు వశమై అల్పాల్ప వస్తువున కుబలాట పడిరి. ఎందు సత్వమో (సత్వ గుణమో) అందు లక్ష్మి యుండును. ఎందు లక్ష్మియో యట సత్వ గుణముండును. సిరి గోల్పోయిన వారికి సత్వమెక్కడ? అది లేనిచో బలము శౌర్యము మొదలగునవి శూన్యము నగును. అవిలేని వాడందరికి లొంగి పోవును. లొంగి పోయిన మానవుడు మతిభ్రష్టుడగును. ఇట్లత్యంతము సిరి తగ్గి త్రిభువనములు సత్త్వ శూన్యము లయినంత దైత్య దానవులు దేవతల మీదికి దండెత్త నుద్యమించిరి. లోభ వశురైయైశ్వర్య హీనులైన దైత్యాలు సత్వము పోయి సిరి తరిగి నిస్సత్వులైన దేవతలతో యుద్దము చేసిరి.
విజితాస్త్రిదశాదై త్యైరిన్ద్రాద్యాశ్శరణంయయుః।
పితామహం మహాభాగం హుతాశ నపురోగామాః॥
యథావత్కథితోదేవైః బ్రహ్మా ప్రాహతతస్సురాన్।
పరాపరేశం శరణం వ్రజధ్వమసురార్ధనమ్॥
ఉత్పత్తిస్థితినాశానమహేతుం హేతుమీశ్వరమ్।
ప్రజాపతిపతిం విష్ణుమనన్తమ పరాజితమ్॥
ప్రధానపుంసోరాజయోః కారణం కార్యభూతయోః।
ప్రణతార్తిహరం విష్ణుం సవశ్శ్రేయోవిధాస్యతి॥
ఏవముక్త్వాసురాన్ సర్వాన్ బ్రహ్మాలోక పితామహః।
క్షీరోదస్యోత్తరం తీరం తై రేవసహితో యయౌ॥
సగత్వాత్రిదశైస్సర్వైస్సమవేతః పితామహః।
తుష్టావవాగ్భిరిష్టాభిః పరాపరపతింహరిమ్॥
ఇంద్రాదు లోడిపోయి యగ్ని మున్నుగా నందరు బ్రహ్మను శరణందిరి. వారి ఘోష నాలించి బ్రహ్మ అసురమర్దను జనార్దను శరణు పొందు డనియె. అని వారితో దానును పాల్కడలి యుత్తర తీరమున కేగి పరాశర ప్రభుడగు హరిని తదిష్టములైన వాక్కులచే (వేదము చేత) స్తుతించెను.
బ్రహ్మ:
నమామిసర్వేశమనన్తమజమవ్యయమ్।
లోకధామధరాధారమప్రకాశమభేదినమ్॥
నారాయణమణీయాంసమశేషాణామణీయాసామ్।
సమస్తానాం గరిష్ఠం చభూరాదీనాంగరీయసామ్॥
యత్రసర్వం యతస్సర్వముత్పన్నం యత్పురస్సరమ్।
సర్వ భూతశ్చయః ప్రోక్తః పరాణామపియః పరః॥
పరః పరస్మాత్పురుషాత్పరమాత్మ స్వరూపధృత్।
యోగిభిశ్చిన్త్యతేయోఽసౌముక్తిహేతోర్ముముక్షుభిః॥
సత్త్వాదయోనసన్తీశేయత్రచ ప్రాకృతాగుణాః।
సశుద్ధస్సర్వశుద్దేభ్యః పుమానాద్యః ప్రసీదతు॥
కలాకాష్ఠానిమేషాదికాలసూత్రస్యగోచరే।
యస్యశక్తిర్నశుద్ధస్య ప్రసీదతు సనోహరిః॥
ప్రోచ్యతేపరమేశోఽజోయశ్శుద్దోప్యుపచారతః।
ప్రసీదతుసనో విష్ణోరాత్మాయస్సర్వ దేహినామ్॥
యః కారణం చకార్యంచకారణస్యాపికారణమ్।
కార్యాస్యాపిచయఃకార్యం ప్రసీదతు సనోహరిః॥
కార్యకార్యస్య యత్కార్యం తత్కార్యస్యాపియస్స్వయమ్।
తత్కార్యకార్యభూతోయస్తతశ్చప్రణతాస్స్మతమ్॥
కారణం కారణస్యాపితస్య కారణకారణమ్।
తత్కారణానాం హేతుంతం ప్రణతాస్స్మ సురేశ్వరమ్॥
భోక్తారం భోజ్యభూతంచ స్రష్టారం సృజ్యమేవచ।
కార్యకర్ తృస్వరూపంతం ప్రణతాస్స్మ పరంపదమ్॥
విశుద్ధభోధవన్నిత్య మజమక్షయమవ్యయమ్।
అవ్యక్తమవికారం యత్తద్విష్ణోః పరమంపదమ్॥
నస్థూలంనచసూక్ష్మంయన్న విశేషణగోచరమ్।
తత్పదం పరమం విష్ణోః ప్రణమామసదాఽమలమ్॥
యస్యాయుతాయుతాంశే విశ్వశక్తిరియంస్థితా।
పరబ్రహ్మ స్వరూపస్య ప్రణమామస్తమవ్యయమ్॥
యద్యోగినస్సదోద్యుక్తాః పుణ్యపాపక్షయేక్షయమ్।
పశ్యన్తిప్రణవేచిన్త్యంతద్విష్ణోః పరమంపదమ్॥
యన్నదేవానమునయోనచాహంనచ శంకరః।
జానన్తి పరమేశస్య తద్విష్ణోః పరమంపదమ్॥
శక్తయోయస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాత్మికాః।
భవన్త్య భూతపూర్వస్య తద్విష్ణోః పరమంపదమ్॥
సర్వేశ సర్వ భూతాత్మన్ సర్వసర్వాశ్రయాచ్యుత।
ప్రసీద విష్ణో భక్తానాం వ్రజనోదృష్టి గోచరమ్॥
ఇత్యుదీరితమాకర్ణ్య బ్రాహ్మణస్త్రీదశాస్తతః।
ప్రణమోచ్యుః ప్రసీదేత్రివ్రజనోదృష్టి గోచరమ్॥
యన్నాయం భగవాన్ బ్రహ్మాజానాటిపరమంపదమ్।
తన్న తాస్స్మ జగద్ధామతవసర్వగతాచ్యుత॥
ఇత్యన్తేవచసస్తేషాం దేవానాం బ్రాహ్మణస్తథా।
ఊచుర్దేవర్షయస్సర్వే బృహస్పతి పురోగమాః॥
బ్రహ్మకృత విష్ణు స్తుతి:
సర్వులకు సర్వేశ్వరుడు, అనంతడు, అజుడు, అవ్యయుడు, కారణమునకు కారణము, దాని కారణమునకు కారణము, దానికి కారణము లయిన వానికి కారణమునైన సురేశ్వరునికి బ్రణతు లయ్యెదము. భోక్త భోజ్యము, స్రష్ట సృజ్యము. కార్యము, కర్తయు నైన పరమ పదమునకు వినతులయ్యెదము. విశుద్ధ జ్ఞాన సంపన్నము అజము, అవ్యక్తము, అవికారము నైన విష్ణువు పరమ పదము స్థూలము గాదు, సూక్ష్మము గాదు. విశేష గుణములకు గోచరము గాని యవిష్ణుని పరమ పదమునకు మ్రొక్కెదము. ఏ పరబ్రహ్మ యొక్క పదివేల యంశమునకు బదివేలవ యంశమై ఈ విశ్వ శక్తి యున్నదో ఆ యవ్యయమును మ్రొక్కెదము. యోగులు నిత్యమును ఉద్యమించి (నిరంతరాను సంధానము సేసి) పుణ్య పాపములు క్షయింప నీ యక్షయము అచింత్యము నైన దానిం దర్శింతురో ఆ విష్ణువు పరమ పదము దేవతలు, మునులు, నేనును, శంకరుడునుం గూడ నెరుంగరో అవ్విష్ణు పరమ పదమును, అచ్యుత పూర్వుడయిన (పుట్టుక లేని) శక్తులు బ్రహ్మయు, విష్ణువు, శివుడను పేర నున్నవో అట్టి ఓ సర్వేశ, సర్వ భూతాత్మా! సర్వ! సర్వాశ్రయ! అచ్యుత! ఓ సర్వగతా! అని బ్రహ్మ దేవతలు పలికిన తరువాత నిట్లు బృహస్పతి, దేవర్షులును స్తుతించిరి.
దేవర్షులు:
ఆద్యోయజ్ఞః పుమానిజ్యో యఃపూర్వేషాంచపూర్వజః।
తంనతాస్స్మజగత్స్రష్టుః స్తష్టారమవిశేషణమ్॥
భగవాన్ భూతభవ్యేశ యజ్ఞమూర్తి ధరావ్యయ।
ప్రసీద ప్రాణతానాంత్వం సర్వేషాందేహి దర్శనమ్॥
ఏషబ్రహ్మాసహాస్మాభిస్సహరుద్రైస్త్రిలోచనః।
సర్వాది త్యైస్సమంపూషాపావకోయం సహాగ్నిభిః॥
అశ్వినౌవసవశ్చైవ సర్వేచైతే మరుద్గణాః।
సాధ్యావిశ్వేతథాదేవాదేవేన్ద్రశ్చాయమీశ్వరః॥
ప్రణామప్రవణానాథా దైత్యసైన్య పరాజితాః।
శరణం త్వామనుప్రాప్తాస్సమస్తా దేవతాగణాః॥
దేవర్షులు:
ఆద్యుడవు యజ్ఞ మూర్తివి, పూర్వుల కెల్ల పూర్వుడవు. సృష్టికర్తను సృష్టించిన వాడవు. అవిశేషణుడవు. (విశేషణ మనగా భేదకము. ఉన్నదొక్కటే వస్తువైనప్పుడు అది నిర్గుణము. నిర్వికార మైనప్పుడు భేదక సామాగ్రి మరి యుండనే యుండదని తాత్పర్యము) అట్టి నీకు వినతులయ్యెదము. లోగడ పుట్టిన యికమీద పుట్టనున్న వానికీవీశ్వరుడవు. యజ్ఞమూర్తిధరుడవు (లోగడనే యజ్ఞమూర్తివని పిలిచినారు. మరల యజ్ఞమూర్తి వనుట పునరుక్తి కాదా? అన్న స్తుతే “బూమితానాస్తి” స్తుతులందు బునరుక్తి దోషము లేదను న్యాయానుసారము చెప్పినవే మరల చెప్పుట స్తుతి లక్షణము. అట్టి వానికి బునరుక్తికా భావము వ్రాయబడదు. చదువరులు గమనింతురు గాక!) మాయెడ బ్రసన్నుడ వగుము. దర్శన మిమ్ము. ఇదిగో బ్రహ్మాది దేవతలు వారి ముఖమైన యగ్నితో కూడ నీకు బ్రణతులైనారు. శరణొందినారు.
శ్రీపరాశరుడు:
ఏవంసంస్తూయమానస్తు భగవాన్ శంఖచక్రద్రుత్।
జగామ దర్శనం తేషాం మైత్రేయ పరమేశ్వరః॥
తందృష్ట్వాతేతదా దేవాః శంఖచక్రగదాధరమ్।
అపూర్వ రూప సంస్థానం తేజసాం రాశిమూర్జితమ్॥
ప్రణమ్య ప్రణతాః పూర్వంసంతోషస్తిమితెక్షణాః।
తుష్టువుః పుండరీకాక్షం పితామహ పురోగమాః॥
శ్రీపరాశరుడు:
అన ననుగ్రహమూని విష్ణువు వారికి బ్రత్యక్ష మయ్యెను. శంఖ చక్ర గదాధరియై అపూర్వరూప సంపత్తి కలిగి తెజోరాసియై దర్శన మిచ్చిన యా పుండరీకాక్షుని బ్రహ్మాది దేవతలు స్తుతించిరి.
దేవతలు:
నమోనమో విశేషస్త్వం త్వం బ్రహ్మా త్వంపినాకద్రుత్।
ఇంద్రస్త్వమగ్నిః పవనోవరుణస్సవితాయమః॥
వసవోమరుతస్సాధ్యావిశ్వే దేవగణాభవాన్।
యోఽయంతవాగ్రతో దేవసమస్తో దేవతాగణః॥
సర్వమేవజగత్స్రష్టాయతస్సర్వగతో భవాన్॥
త్వంయజ్ఞస్త్వం వషట్కారస్త్వమోంకారః త్వం ప్రజాపతిః।
వేత్తావేద్యంచసర్వాత్మం స్త్వన్మయంచాఖిలం జగత్॥
త్వామార్తాశ్శరణం విష్ణో ప్రయాతాదైత్యనిర్జితాః।
వయంప్రసీదసర్వాత్మం స్తేజసాఽఽప్యాయయస్వనః॥
తావదార్తిస్తథావాంచా తావన్మోహస్తథా సుఖమ్।
యావన్న యాతిశరణం త్వామశేషాఘనాశనమ్॥
త్వంప్రసాదం ప్రసన్నాత్మన్ ప్రసన్నానాం కురుష్వనః।
తేజసాంనాథ సర్వేషాం స్వశక్త్యాఽఽప్యాయనంకురు॥
ఏవంసామ్స్తూయమానస్తు ప్రణతై రమరైర్హరిః।
ప్రసన్న దృష్టిః భగవానిదమా హసవిశ్వ కృత్॥
దేవర్షులు విష్ణువును స్తుతించుట:
తెలియువాడు తెలియదగినది తెలివియు నీవే. నీ తేజస్సుచే (ప్రతాపముచే) మమ్ములను శత్రువశుల గాచి యాప్యాయన పరుపుము. నీ దర్శన మగునంత వరకే బాధ కోరిక మోహము దుఃఖమును, నీవు నీ శక్తితో మమ్మానంద పరుపుము. అని స్తుతింప ప్రసన్న కటాక్షముల వారినాదరించి యిట్లనియె.
శ్రీభగవానుడు:
తేజసోభవతాం దేవాః కరిష్యామ్యుపబృంహణమ్।
వదామ్యహంయత్క్రియతాం భవద్భిస్తదిదం సురాః॥
ఆనీయసహిత దైత్యైః క్షీరాబ్దౌసకలౌషాదీః।
మన్థానంమన్ధరం కృత్వాయోక్త్రత్వాంచవాసుకిమ్॥
మథ్యతామమృతం దేవాః సహాయే మయ్యవస్థితే॥
సామపూర్వంచదై తేయాస్తత్ర సామాన్య కర్మణి।
సామాన్య ఫలభోక్తారో యూయం వాచ్యాభవిష్యథ॥
మథ్యమానేచతత్రాబ్దౌయత్సముత్పద్యతేఽమృతమ్।
తత్పానాద్బలినో యూయమమరాశ్చ భవిష్యథ॥
తథాచాయం కరిష్యామితేయథాత్రిదశద్విషః।
నప్రాప్స్యన్త్యమృతం దేవాః కేవలం క్లేశభాగినః॥
ఇత్యుక్తాదేవదేవేస సర్వ ఏవతతస్సురాః।
సంధానమసురైః కృత్వాయత్నవన్తోఽమృతేఽభవన్॥
నానౌషదీస్సమానీయ దేవదై తేయదానవాః।
క్షిప్త్వాక్షీరాబ్దిపయసి శరదభ్రామలత్విషి॥
మన్థానంమన్ధరంక్మత్వాయోక్త్రంకృత్వాచ వాసుకిమ్।
తతోమథితుమారబ్డా మైత్రేయ తరసామృతమ్॥
విబుధాస్సహితాస్సర్వే యతః పుచ్చంతతః కృతాః।
కృష్ణేన వసుకేః దైత్యాః పూర్వకాయే నివేశితాః॥
తేతస్యముఖనిశ్వాసవహ్నినోపహతిత్విషః।
నిస్తేజసోఽసురాస్సర్వే బభూవురమితౌజసః॥
తేనైవముఖనిశ్వాసవాయునాస్తేబలాహకైః।
పుచ్చప్రదేశేవర్షద్భిస్తథాచాప్యాయితాస్సురాః॥
క్షీరోదమధ్యే భగవాన్ కూర్మ రూపీస్వయంహరిః।
మన్దరాద్రేరధీష్ఠానంభ్రమతో భూన్మహామునే॥
రూపేణాన్యేనదేవానాం మధ్యేచక్రగదాధరః।
చకర్షనాగరాజానం దైత్యమధ్యేపరేణచ॥
ఉపర్యాక్రాన్తవాన్ శైలంబృహద్రూపేణ కేశవః।
తథాపరేణ మైత్రేయ యన్నదృష్టం సరాసురైః॥
తేజసానాగరాజానంతథాప్యాయితవాన్ హరిః।
అన్యేన తేజసా దేవానుపబృంహితవాన్ ప్రభుః॥
శ్రీభగవానుడు (క్షీర సముద్ర మథనము):
ఓ వేల్పులారా! మీ తేజస్సుల మరల వూరించేదను. నేను దెల్పినట్లు సేయుడు. మందరమును గవ్వముగను వాసుకిని దరిత్రాడుగను జేసి నేను దోడైయుండ పాల్కడిలిం ద్రచ్చుడు. అయ్యెడ మంచి మాటల నా రాక్షసుల నందరికిని సంబంధించిన పని యిది, ఫలము నందరకును సమానమే. ఇందులకు మీరాహుతులు గండు. సముద్ర మథన మయినంతట నమృతము పుట్టును. అది త్రావి మీరు బలవంతులు అమరులు (మరణము లేనివారు) గండు. ఈయన (తానన్న మాట) దేవద్వేషు లమృతము నందకుండ కేవలము సముద్ర మథన క్లేశము మాత్రము కుడుచునట్లు సేయగలరు. అనవిని సురలసురులతో సంధి చేసికొని యమృత సంపాదనమునకు ప్రయత్నా మారంభించిరి. ఓషధులన్ని దెచ్చి పాల సంద్రమున వైచిరి. శరత్కాలాకాశ మట్లచ్చమైన కాంతి గల యా పయోధి యందు మథన మారంభించిరి. మొట్ట మొదట పాము తలకడ బట్టిన దేవతలు దోక బట్టుటకు, తోక బట్టిన దైత్యులు తల బట్టునట్లు హరి తంత్రము గావించెను. మీరు మహా బలశాలురు ధీరులు మీరేమి తుచ్చమైన తోక పట్టుటేమి? ఈ అల్పబలుల ధీరులు దేవతలు శరీరమున కెల్ల ప్రధానమైన ముఖము పట్టుటేమి? సిగ్గు సిగ్గు అని పొఱపులు వెట్టి వాండ్రచే నౌనౌను పొరబడితిమి మేము తల బట్టు కొందుము. మీరు తోకకు రండని వారల చేతనే యనిపించి బేలు చేసి యిద్దరకుం దల తోక మార్చెను. మొదటి కంటే పోయిన కొలది ద్రచ్చు తరితరిగొండ దిరిగిన కొలది వాసుకి ముఖ నిశ్వాస వేగా మెక్కువై కాలకూట విష జ్వాల లువ్వెత్తున లేచి మొగము వైపున నున్న రాక్షసులం దహించెను. దాన్నే వారిలో ముప్పాతిక మంది నశించిరి. మిగిలిన రక్కసులు తోజోహీనులైరి. తోకనున్న వేల్పులను హరి మేఘముల వర్షింప జేసి యాప్యాయనము గావించెను. అంతలో మందరము మత్తు (కవ్వము) బరువున ణా సంద్రమున దిగబడి పోయినంత తాను దాబేలయి ఎత్తుటయే గాక మేరు రూపున రాక్షసులలోని కీడ్చివైచెను. మరియు నా కొండ శిఖరమున బెద్ద రూపమున నిలచెను. సురాసురు లెన్నడు నా రూపము సూచీ యెరుంగరు. ఆ మీద తన తేజముచే నాగరాజును గూడ శ్రమ నదలించి అప్యాయితుం గావించెను. మరియొక రూపమున దేవతలకు బుష్టి చేకూర్చెను.
మధ్యమానేతతస్తస్మిన్ క్షీరాభ్దౌ దేవదానవైః।
హవిర్దామాభవత్పూర్వంసురభిస్సుర పూజితాః॥
జగ్ముర్ముదంతదా దేవాదానవాశ్చ మహామునే।
వ్యాక్షిప్త చేతసశ్చైవబభూవుస్త్సిమితెక్షణాః॥
కిమేతదితి సిద్దానాందివిచిన్తయతాంతతః।
బభూవవారుణీ దేవీ మదాఘూర్ణిత లోచనా॥
క్రుతావర్తా త్తతస్తస్మాత్ క్షీరోదాద్వాసయన్ జగత్।
గన్దేన పారిజాతోభూద్దేవ స్త్రీనన్దనస్తరుః॥
రూపౌదార్యగుణోపేతస్తతశ్చాప్సర సాంగనాః।
క్షీరోదధేస్సముత్పన్నో మైత్రేయ పరమాద్భుతః॥
తతశ్శీతాంశురభవజ్జగృహేతం మహేశ్వరః।
జగృహుశ్చ విషం నాగాః క్షీరోదధి సముద్భవమ్॥
తతోధన్వన్వరిర్దే వశ్శ్వేతామ్బర ధరస్స్వయమ్।
బిభ్రత్కమణ్డలుం పూర్ణ మమృతస్య సముత్థితః॥
అట్లు తరచు చుండ నా పాల్కడలి యందు దేవహవిర్దానము సురభి (హవిర్ధానము = హవిర్భాగమైనపాలకు నివాసము, కామధేనువు) పుట్టెను. వేల్పులెల్లరు నవ్వేల్పుటావును బూజించు చుందురు. దేవదానవు లానంద భరితులైరి. అంతమున్ను జెదరిన చిత్తముల వారు వారు స్తిమిత దృష్టి నందిరి. అంతలో నిదియేమని సిద్ధులను కొనుచుండ వారుణీదేవి మత్తుచే కనుగ్రుడ్లు తిరుగాడ పాల్కడలిలో సుడి సేసుకొని యెగసి వచ్చెను. సువాసనలచే జగమెల్ల బరిమళింప జేయుచు పారిజాత ముదయించెను. రూపౌదార్యాది గుణ సంపదతో నద్భూతావహముగా సప్సరో గణము బుట్టెను. అవ్వాల శీతాంశువు (చంద్రుడు) బుట్టెను. అతనిని మహేశ్వరుడు గైకొనెను. అందు బుట్టిన విషమును నాగులు గైకొనిరి. అచ్చము పట్టు పుట్టములం దాల్చి అమృత పూర్ణ కమండలువుం బట్టుకొని ధన్వంతరి తానుగా నందుండి మీదికి వచ్చెను. అంత దైతేయులు దానవులు మునులతో స్వస్థ చిత్తులైరి, ముదితులైరి.
లక్ష్మీ ప్రాదుర్భావము:
తతస్స్వస్థమనస్కాస్తేసర్వేదై తేయదానవాః।
బభూవుర్ముదితాస్సద్యో మైత్రేయ మునిభిస్సహ॥
తతస్స్వరత్కాన్తిమతీవికాసికమలేస్థితా।
శ్రీర్దేవీ పయసస్తస్మాదుత్థితా ధృతపంకజా॥
లక్ష్మీ ప్రాదుర్భావము:
అంతట నలుదెసల వెలుగులు గ్రమ్మ వికసించిన పద్మమందు గూర్చిండి చేతం బద్మము బట్టుకొని శ్రీదేవి యావిర్భవించెను.
తాంతుష్టువుర్ముదాయుక్తా శ్రీసూక్తేన మహర్షయః॥
విశ్వావ సుముఖాస్తస్యా గన్ధర్వాః పురతోజగుః।
ఘృతాచీప్రముఖా బ్రహ్మన్ ననృతుశ్చాప్సరోగణాః।
గఙ్గాద్యాస్సరితస్తోయైస్స్నానార్ద ముపతస్థిరే।
దిగ్గజాహేమపాత్రస్థమాదాయ విమలం జలమ్॥
స్నాపయాంచక్రిరే దేవీం సర్వలోకమహేశ్వరీమ్॥
క్షీరోదోరూపధత్తస్యై మాలామమ్లానపఞ్కజామ్।
దదౌవిభూషణాన్యఙ్గే విశ్వకర్మాచాకారహ॥
దివ్యమాల్యామ్భరధరా స్నాతభూషణ భూషితా।
పశ్యతాంసర్వదేవానాం యయౌవక్షస్స్థలంహరేః॥
తతోవలోకితాదేవాహరివక్షస్థ్సలస్థయా।
లక్ష్మ్యామైత్రేయ సహసాపరాంనిర్ వృతిమాగతాః॥
ఉద్వేగంపరమం జగ్ముర్ దైత్యావిష్ణుపరాఙ్కుఖాః।
త్యక్తాలక్ష్మ్యామహాభాగ విప్రచిత్తిపురోగమాః॥
తతస్తేజగృహుర్ దైత్యా ధన్వన్తరికరస్తితమ్।
కమన్డలుం మహావీర్యాయత్రాస్తేతద్ద్విజామృతమ్॥
మాయయాలోభయిత్వాతాన్ విష్ణుః స్త్రీరూప సంస్థితః।
దానవేభ్యాస్తదాదాయ దేవేభ్యః ప్రదదౌహరిః॥
తతః పపుస్సురగణాశ్శాక్రాద్యాస్తత్తదాఽమృతమ్।
ఉద్యతాయుధనిస్త్రింశా దైత్యాంస్తాంశ్చ సమభ్యయుః॥
పీతేమృతేచబలిభిఃదేవైః దైత్యచామూస్తథా।
వధ్యమానా దిశోభేజేపాతాలంచ వివేశహ॥
తతోదేవాముడాయుక్తాశ్శాఙ్ఖచక్ర గదాధరమ్।
ప్రణిపత్యయథా పూర్వమశాసంస్థాత్త్రివిష్టపమ్॥
తతః ప్రస్న్నభాస్సూర్యః ప్రయయౌస్వేనవర్ త్మనా।
జ్యోతీంషిచయథామార్గం ప్రయయుర్మునిసత్తమ॥
జజ్వాలభాగావాంశ్చోచైశ్చారుదీప్తిర్విభావసుః।
ధర్మేచసర్వ భూతానాంతదామతిరాజయత॥
శ్రియాజుష్టంచత్రైలోక్యంబభూవ ద్విజసత్తమ।
శక్రశ్చత్రిదశశ్రేష్ఠః పునశ్ర్షీమానజాయత॥
సింహాసనగతశ్శక్రస్సం ప్రాప్యత్రిదివంపునః।
దేవరాజ్యేస్థితో దేవీం తుష్టావాజకరాం తతః॥
అట్లుదయించిన యా దేవిని మహర్షు లానంద మంది స్తుతించిరి. విశ్వావసు ప్రముఖ గంధర్వు లామె ముందు గానములు సేసిరి ఘృతాచీ ప్రముఖ లప్సరసలు నర్తించిరి. గంగాది నదులు పవిత్ర జలముం గొనివచ్చిరి.మఱియు దిగ్గజ కుంభస్థల మందు సువర్ణ కుంభము లందున్న యా పవిత్ర తీర్ధములచే నమ్మంగళ దేవతను సర్వలోకేశ్వరిని స్నానమాడించిరి. ఆవిడకు క్షీర సముద్రుడు వాడులేని తామర పూలమాల నిచ్చెను. దివ్య మాల్యాంబరములుం దాల్చి దివ్య స్వర్ణ మణి భూషములు గైసేసి యా సుందరి ఇందిరా యల్లన జని సురలెల్లరు గనుచుండ హరి వక్షస్థల మలంకరించెను. అవ్వల హరి వక్షస్థల మందున్న యా లక్ష్మి క్రేగంటం గనుగొనబడి (లక్ష్మి కటాక్ష పాత్రులాయి) యెన్నడులేని సుఖమును సంతోషమును బొందిరి. విష్ణు విముఖులు (విష్ణునికి బెడ మొగమైన వారు) లక్ష్మిచే బరిత్యక్తులై విప్రచిత్తి మొదలగు వాండ్రేగి ధన్వంతరి చేతనున్న యమృత కమండలువు లాగికొనిరి. విష్ణువు మాయచే స్త్రీ రూపము దాల్చి వారిని లోభపెట్టి దానిని దేవతల చేతికిచ్చెను. అంతట నింద్రాదులా అమృతమును ద్రావిరి. రాక్షసులాయుధముల నెత్తి వారి పైకెత్తిరి. అమృతము ద్రావి బలమొందిన దేవతల చేత దైత్యసేన హతము గావింప బడుచు పాతాళామును ప్రవేశించె. అపుడు దేవతలు నమ్మోదమంది శంఖ చక్ర గదాధరుని దామోదరుం మ్రొక్కి ముందతయట్లు స్వర్గముం బాలించిరి. అవ్వల సూర్యుడు కావిరివాసి ప్రసన్నప్రభతో దానదారిందాను సంచరించెను. ఎల్లవెలుగులు (జ్యోతిర్మండలము) తనదారిం బ్రవర్తించె. అగ్ని భట్టారకుడు చక్కని దీప్తితో మిక్కిలిగ బ్రజ్వలించెను. భూతములకు ధర్మమందు బుద్దిగలిగె. ముల్లోకము లక్ష్మీకళ నిండెను. శక్రుడెప్పయట్టి శ్రీమంతు డయ్యెను. మఱల స్వర్గ సామ్రాజ్య మంది సింహాసన మదిష్టించి పద్మహస్త యగు శ్రీదేవిని దేవరాజు స్తుతించెను.
ఇంద్రుడు (ఇంద్ర కృత లక్ష్మీస్తుతి):
నమామి సర్వలోకానాం జననీమబ్ధి సంభవామ్।
శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణు వక్షస్థ్సలస్థితామ్॥
పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనిభేక్షణామ్।
వన్దే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహమ్॥
త్వంసిద్దిస్త్వంస్వదాస్వాహాత్వం సుధాలోకపావని।
సంధ్యారాత్రిః ప్రభాభూతిర్మేధాశ్రద్దా సరస్వతీ॥
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యాచ శోభనే।
ఆత్మవిద్యాచ దేవిత్వాం విముక్తి ఫలదాయినీ॥
ఆన్విక్షికీత్రయీవార్తా దణ్డనీతిస్త్వమేవచ।
సౌమ్యాసౌమ్యైర్జ గద్రూపైస్త్వయైతద్దేవి పూరితమ్॥
కాత్వన్యాత్వామృతే దేవి సర్వ యజ్ఞమయింవపుః।
అధ్యాస్తేదేవదేవస్యయోగిచిన్త్యంగదాభృతః॥
త్వయాదేవిపరిత్యక్తం సకలం భువనత్రయమ్।
వినష్టప్రాయమభవత్త్వయేదానీం సమేధితమ్॥
దారాః పుత్రాస్తథాఽగారసుహృద్దాన్యాధనాదికమ్।
భవత్యేతన్మహాభాగే నిత్యన్త్వద్వీక్షణా నదుర్లభమ్॥
శరీరారోగ్యమైశ్వర్యమరిపక్షక్షయస్సుఖమ్।
దేవిత్వాద్దృష్టానాం పురుషాణాం నదుర్లభమ్॥
త్వంమాతాసర్వలోకానాం దేవదేవోహరిః పితా।
త్వయైతద్విష్ణునాచామ్బజగద్వ్యాప్తం చరాచరమ్॥
మానఃకోశంతథా గోష్ఠం మాగృహం మాపరిచ్చదమ్।
మాశారీరంకలత్రంచాత్యజేథాస్సర్వపావని॥
మాపుత్రాన్మాసుహృద్వర్గాన్ మాపశూన్ మావిభూషణమ్।
త్యజేథామమదేవస్య విష్ణోర్వక్షాస్థ్సలాలయే॥
సత్త్వేన శౌచసత్యాభ్యాంతథా శీలాదిభిర్గుణైః।
త్యజ్యన్తేతేన రాస్సద్యస్సంత్యక్తాయేత్వాయామ లే॥
త్వయావలోకితాస్సద్యశ్శీలాద్యైస్సకలైర్గుణైః।
ధనైశ్వర్యైశ్చ యుజ్యన్తే పురుషానిర్గుణా అపి॥
ఇంద్రుడు:
సర్వలోక జనని సముద్రమందు జనించిన లక్ష్మిని వికసించిన పద్మమట్టి నయనములు గలదానిని విష్ణు వక్ష స్థలమందున్న దానిని మ్రొక్కు చున్నాను. పద్మము నివాసము హస్తముం బద్మము. పద్మము వంటి కన్నులు పద్మము వంటి కన్నులు పద్మము వంటి నెమ్మోము సోంపు గులుకు పద్మనాభుని యిల్లాలిని నమస్కరింతును అమ్మా! నీవు సిద్దివి స్వధవు స్వాహాదేవివి సుధ లోకపావని సంధ్యరాత్రి ప్రభ భూతి మేధ శ్రద్ధ సరస్వతి మహావిద్య గుహ్యవిద్య ఓ శోభన దేవతా! నీవు ఆత్మవిద్యవును ముక్తి ఫలదాయినివి అన్వీక్షకి. త్రయివార్త దండనీతి నీవే. సౌమ్యములు అసౌమ్యములునైన రూపముల చేత నీ చేతనే యీ జగత్తు నింప బడినది నీవుగాక దేవీ! మరి యెవ్వరు సర్వ యజ్ఞ మయమైన దేవదేవుని గదాధరుని ధ్యానమున కందనిది యోగి ధ్యేయ మైనదియు నగు నా మూర్తి నలంకరింప గలది. నీచే విడువడి యీ భువనములు మూడును లేనట్లయి యిపుడు నీచేత పెంపొందినవి. ఓ మహానుభావా! నీ కటాక్షమున గదా! దారలు పుత్రులు ఇండ్లు వాకిండ్లు మిత్రుల ధనధాన్యదికము నిత్యము గల్గును. శరీరారోగ్యము ఐశ్వర్యము శత్రునాశనము! దేవీ! సుఖము నీ దృష్టిచే జూడబడిన వారికి దుర్లభము గాదు. నీవు సర్వలోక మాతవు. దేవదేవుడు హరి తండ్రి. అమ్మా! ఈ చరాచర ప్రపంచము నీచే వ్యాప్తము మా కోశము మహాలక్ష్మి. మా గోశాల మహాలక్ష్మి. మా పరిచ్చదము సర్వసామగ్రి లక్ష్మి. మా శరీరమును కళత్రమును మా పుత్రులను మిత్రులను పశువులను మా విభూషణములను నెన్నడు విడవుకుము. ఓ సర్వపావనీ! ఓ విష్ణువక్ష స్థల వాసీనీ నీచే విడువ బడినవారు సత్త్వము సత్యము శౌచము శీలము మొదలైన లక్షణములచే విడువ బడుదురు. నీచే గనబడిన వారు గుణ హీనులైనా క్షమాశీలాది సంపన్నులు ధనైశ్వర్యులు కలవారయ్యెదరు.
సశ్లాఘ్యస్స గుణీధన్యస్స కులనస్సబుద్దిమాన్।
సశూరస్సచవిక్రాన్తో యంత్వం దేవినిరీక్షసే॥
సద్యోవైగుణ్యమయాన్తిశీలాద్యాస్సకలాగుణాః।
పరాఙ్ముఖీజగద్దాత్రీ యస్యత్వం విష్ణువల్లభే॥
నతేవర్ణయితుం శక్తాగుణాన్ జిహ్వాపివేధసః।
ప్రసీద దేవిపద్మాక్షిమాస్మాంస్త్యాక్షీః కదాచన॥
ఏవంశ్రీస్సంస్తుతాసంయక్ప్రాహాదృశ్యాశతక్రతుమ్।
పశ్యతాంసర్వదేవాతాంసర్వదేవానాంసర్వభూతస్థితాద్విజ॥
పరితుష్టాస్మిదేవేశ స్తోత్రేణానేనతేహరే।
వరంవృణీష్వ యస్త్విశ్తోవరదాహంతవాగతా॥
నీవెవ్వని వంక గనుగొందువో అతడు శ్లాఘ్యుడు. ఓ విష్ణువల్లభా! నీవెవ్వరికి బెడమొగ మౌదువో అప్పటి కప్పుడే వారి శీలాది గుణములు వైగుణ్యము నందును. బ్రహ్మ జిహ్వ (నాలుక) గూడ నీ గుణముల వర్ణింప జాలదు. పద్మాక్షీ! ప్రసన్న వగుము దేవీ! ఎన్నడు నన్ను విడవుకుము. అని యిట్లు స్తుతింప దేవతల లందఱు చూచుచుండ సర్వభూత నివాసిని శ్రీదేవి యెదుట గానవచ్చి దేవేశ! హరీ! నీ యీ స్తుతిచే నేను సంతుష్ట నైతిని. నీ యిష్టమైన వారము నడుగుము. నీయెడ వరదనై వచ్చితిని.
ఇంద్రుడు:
వరదాయదిమే దేవివారార్హోయదిచాప్యహమ్।
త్రైలోక్యంనత్వయాత్యాజ్యమేషమేఽ స్తువరః పరః॥
స్తోత్రేణయ స్త్వథై తేనత్వాంస్తోష్యత్యబ్దిసంభావే।
సత్వయానపరిత్యాజ్యోద్వితీయోఽ స్తువరోమమ॥
ఇంద్రుడు:
దేవీ! నీవు వరమిత్తువేని నేనా వరమునొండ నర్హుడనేని ఈ ముల్లోకమును నీవెన్నడు విడువ రాదు అదియే నాకు బరమ వరమగును గాక! అబ్దిసంభవ! ఈ నాచేసిన స్తుతిచే నిన్నెవ్వరు స్తుతింతురో వారిని గూడ నీవు విడువ వలదు. ఇది నాకు రెండవ వరము.
శ్రీదేవి:
త్రైలోక్యంత్రిదశశ్రేష్ఠనసంత్యక్ష్యామివాసవ।
దత్తోవరోమయాయం తే స్తోత్రారాధనతుష్టయా॥
యశ్చసాయంతథాప్రతస్త్సోత్రేనానేనమానవః।
మాంస్తోష్యతినతస్యాహంభవిష్యామి పరఙ్ముఖీ॥
ఏవందదౌవారౌదేవీ దేవరాజాయవై పురా।
మైత్రేయ శ్రీర్మహాభాగాస్తోత్రారా థనతోషితా॥
భృగోఃఖ్యాత్యాం సముత్పన్నా శ్రీః పూర్వముదధేఃపునః।
దేవదానవయత్నేన ప్రసూతాఽమృతమన్థనే॥
ఏవంయదాజగత్స్వామీ దేవదేవో జనార్దనః।
అవతారంకరోత్యేషా తదా శ్రీస్తత్సహాయినీ॥
పునశ్చపద్మాసంభూతాహ్యాదిత్యోభూద్యదాహరిః।
యదాచాభార్గవోరామస్తదాఽభూద్దరణీత్వియమ్॥
రాఘవత్వేఽభావత్సీతా రుక్మిణీకృష్ణజన్మని।
అన్యేషుచావతారేషు విష్ణోరేషాఽనపాయినీ॥
దేవత్వేదేవాదే హేయం మనుష్యత్వేచ మానుషీ।
విష్ణోర్దేహానురూపాంవై కరోత్యేషాఽఽత్మనస్తనుమ్॥
యస్త్వేతచ్ఛృణుయాజ్జన్మ లక్ష్మ్యాయశ్చపఠేన్నరః।
శ్రియోనవిచ్యుతిస్తస్య గృహేయావత్కులత్రయమ్॥
పఠ్యతే యేషుచై వైశాగృహేషు శ్రీకథా మునే।
అలక్ష్మీః కలహాధారా న తేశ్వాస్తే కదాచన॥
ఏతత్తేకథితంసర్వంయన్మాంత్వం పరిపృచ్చపి।
క్షీరాబ్దౌశ్రీర్యథాజాతాపూర్వంభృగుసుతాసతీ॥
ఇతి సకల విభూత్యవాప్తి హేతుస్స్తుతిరియ మిన్ద్రముఖోద్గాతా హిలక్ష్మ్యాః।
అనుదినమిహ పఠ్య తేనృభిర్యైర్వసతి నతేషు కదాచిద ప్యాలక్ష్మీః॥
శ్రీదేవి:
ఓ త్రిదశ శిరోమణీ! వాసవ! నీ పాలనలోని ముల్లోకము నెన్నడు నే విడవను. నీ స్తోత్రముచే ఆరాధనచే సంతుష్టనై యీ వరమిచ్చితిని. ఎవ్వడు సాయంప్రాత సమయములందీ స్తుతిచే నన్ను స్తుతించు వానికి నేను బరాఙ్ముఖిని గాను. అని దేవరాజున కాదేవి వర మొసగెను. మైత్రేయ! భృగు మహర్షికి ఖ్యాతి యందు మున్ను శ్రీదేవి యుదయించినది. ఆమె మరల దేవ దానవులు అమృత మథనము గావించిన తఱి నీమే భూదేవి యైనది. రాఘవుడై యవతరించిన తఱి సీత యయ్యెను. కృష్ణా వతారమందు రుక్మిణి యయ్యె. తక్కిన యవతాము లందున నీమె విష్ణువున కనపాయిని (విదిడ్చి పెట్టనిది). దేవత్వ మందు దేవ శరీరిణి. మనుష్యత్వమును హరి పొందినపుడు మానుషి యగును. విష్ణువు దేహమున కనురూపముగ తన తనువుం గైకొనెను. ఈ లక్ష్మీ జన్మకథ నెవ్వడు వినునో జదువునో అతని యింట మూడు తరముల దాక లక్ష్మి యెడ వీడదు. ఈ శ్రీకథ యెవరి యిండ్ల యందు బఠింపబడు నా గృహంబులం దెన్నడు కలహముల కాధారమైన అలక్ష్మి యుండదు. మైత్రేయ! నీవదిగితివి గావున నిది యెల్ల నీకు దెల్పితిని. ఈ విధముగా సకల విభూతి వ్యాప్తికి హేతువగు నీ యింద్ర ముఖోదితమైన లక్ష్మీ స్తుతి యనుదిన మీలోకమున నెచట నరులచే బఠింపబడు నా సదనము లందు అలక్ష్మి(దారిద్ర దేవత) యుండదు.
Summary of chapter 9 of the Vishnu Mahā Purāṇa is as follows:
The great churning of the cosmic ocean (samudra mathana) is narrated. The devas, weakened by Durvāsa's curse, seek Viṣṇu's help. Viṣṇu advises them to form an alliance with the asuras and churn the ocean using Mount Mandara and the serpent Vāsuki. Viṣṇu tricks the asuras into holding the head-end of Vāsuki (from which the poison breath flows), while the devas hold the tail. The treasures that emerge include Dhanvantari with the kumbha of amṛta, Lakṣmī (Śrī), the Kauśtubha jewel, Uccaiḥśravas, Airāvata, and other ratnas. Viṣṇu-Mohini takes the amṛta and distributes it to the devas. Lakṣmī's cosmic vibhūtis — the correspondences by which she manifests in all the good, beautiful, and prosperous aspects of creation — are extensively listed.