13 - పృథూపాఖ్యానము

శ్రీపరాశరుడు:

ద్రువాచ్చిష్టించ భవ్యంచ భవ్యాచ్చమ్భుర్వ్యజాయత।

శిష్టేరాధత్తసూచ్చాయా పంచపుత్రాన కల్మషాన్॥

రిపుంరిపుంజయంవిప్రంవృకలంవృక తేజసమ్।

రిపోరాధత్తబృహతీ చాక్షుషం సర్వ తేజసమ్॥

అజీజనత్పుష్కరిణ్యాంవారుణ్యంచాక్షుషోమనుమ్।

ప్రజాపతేరాత్మజాయాం వీరణస్యమహాత్మనః॥

మనోరజాయన్తదశనడ్వలాయాంమమౌజసః।

కన్యాయాంతపతాంశ్రేష్ఠవై రాజస్య ప్రజాపతేః॥

కురుఃపురుశ్మతద్యుమ్నస్తపస్వీ సత్యవాన్ శుచిః।

అగ్నిష్టోమోఽతిరాత్రశ్చ సద్యుమ్నశ్చేతితేనవ।

అభిమన్యుశ్చ దశమోనడ్వలాయాంమమౌజసః॥

కురోరజనయత్పత్రాన్ షడాగ్నే యీ మహాప్రభాన్।

అంగంసుమనసంస్వాతిం క్రతుమంగిరసంశిబిమ్॥

అంగాత్సునీధాపత్యంవై వేవమేకమజాయత।

ప్రజార్థమృషయస్తస్యమామన్థురదక్షిణంకరమ్॥

వేనస్యపాణౌమథితేసంబభూవమహాద్యుతిః।

వైన్యోనామమహీపాలోయఃపృథుఃపరికీర్త్యతే॥

యేనదగ్దామహీపూర్వం ప్రజానాం హితకారణాత్॥

శ్రీపరాశరుడు:

యోగ్యుడగు ధ్రువుని వలన శంభువను నామే శిష్టి భవ్యుడు నను పుత్రులం గనెను. శిష్టి వలన సుచ్చాయ, రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు నను నైదుగురు కొడుకులం గనెను. రిపుని వలన చాక్షుషి యనునామె సర్వ తేజస్సంపన్నుడైన చాక్షుషునిం గనెను. చాక్షుషుడు వీరణ ప్రజాపతి కూతురగు పుష్కరిణి యందు మనువుం గనెను. వైరాజ ప్రజాపతి కుమార్తె యగు నడ్వల యందు మనువునకు బదిమంది తనయులు గల్గిరి. కురువు, పరువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవంతుడు, శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు ననువారు తొమ్మిది మంది. పదియవ యతడు అభిమన్యుడు. అందరు మహాబల సంపన్నులు. ఆగ్నేయ కురువు వలన మంచి ప్రతిభావంతుల నార్వురు కొడుకులం గనెను. వారు అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, శిభి అను వారార్గురు. అన్గుని వలన సునీథ వేనుని గనెను. ఋషులు సంతతి కొఱకాతని కుడి హస్తము వధించిరి. అందు పృథువు మహాతేజస్వి యుదయించెను. అతని చేత ప్రజాహితమునకై భూదేవి గోవుగానై పిదుక బడినది. 

మైత్రేయుడు:

కిమథంమథితః పాణిః వెనస్యపరమమర్శిభిః।

యత్రజజ్ఞే మహావీర్యస్య పృథుర్మునిసత్తమ॥

మైత్రేయుడు:

మైత్రేయుడా కథ నానతిమ్మన శ్రీపరాశరుం డిట్లనియె.

శ్రీపరాశరుడు:

సునీథానామ యాకన్యామృత్యోః ప్రథమజాభవత్।

అంగస్యభార్యాసాదత్తాతస్యాంవేనోవ్యజాయత॥

సమాతామహదోషేణతేనమృత్యుసుతాత్మజః।

నిసర్గాదేషమైత్రేయదుష్టఏవవ్యజాయత॥

అభిషిక్తోయదారాజ్యేసవేనఃపరమర్షిభిః।

ఘోషయామాససతదా పృథివ్యాం పృథివీ పతిః॥

నయష్టవ్యంనదాతవ్యంనహోతవ్యం కథంచన।

భోక్తాయజ్ఞస్యకస్త్వన్యోహ్యహం యజ్ఞపతిః ప్రభుః॥

తతమృషయః పూర్వంసంపూజ్య పృథివీ పతిమ్।

ఊచుస్సామకలం వాక్యం మైత్రేయ సముపస్థితాః॥

శ్రీపరాశరుడు: 

మృత్యువు పెద్ద కూతురు సునీధ యంగుని కీయబడినది. అతడు మాతామహుని దోషముచే (తాత పోలిక గొని) స్వభావము చేతనే దుష్టుడయి పుట్టెను. పరమర్షులు వానిని రాజ్యమందు బట్టాభిషేకించిరి. అతడు వెంటనే పృథివెల్ల నిట్లు చాటింపించెను. యజ్ఞములు సేయరాదు. ఎవ్వరికి నెవ్వ రీయరాదు. అగ్ని హోత్రములు సేయ రాదు. యజ్ఞ భోక్త మరియొక డెవ్వడు. నేనే యజ్ఞపతిని. ప్రభువును. అంతట పరమర్షు లేతెంచి తొలుత మహీపతి గదా యని పూజించి, సామ మధురముగ నిట్లు పలికిరి. 

ఋషులు:

భోభోరాజన్ శృణుష్వత్వంయద్వదామస్తవాన్తికే।

రాజ్యందేవోపభోగాయప్రజానాంచహితంపరమ్॥

దీర్ ఘసత్రేణ దేవేశం సర్వయజ్ఞేశ్వరం హరిమ్।

పూజయిష్యామభద్రంతేతత్రాంశస్తే భవిష్యతి॥

యజ్ఞేనయజ్ఞపురుషో విష్ణుస్సంప్రీణితో నృప।

అస్మాభిర్భవతః కామాన్ సర్వానేవప్రదాస్యతి॥

యజ్ఞేయజ్ఞేశ్వరో యేషాంరాష్ట్రేసంపూజ్యతేహరిః।

తేహంసర్వేప్సితావాప్తిందదాతి నృపభూభృతామ్॥

ఋషులు:

రాజా! రాజ్యము దేవోపభోగమునకు ప్రజా హితమునకును నుద్దేశింప బడెను. యజ్ఞము నందు యజ్ఞేశ్వరుడు మాచే ప్రీణితుడై నీకెల్ల కోరికల నీయ గలడు. ఏ రాష్ట్రమందు యజ్ఞ మందు యజ్ఞాపతి పూజింప బడునో యా రాజుల కభీప్సితార్థముల నాయన ఇచ్చును. అన వేనుం డిట్లనియె.

వేనుడు:

మత్తః కోభ్యధికోన్యోఽస్తికశ్చారాధ్యోమమాపరః।

కోయంహరిరితిఖ్యాతోయోవో యజ్ఞేశ్వరోమతః॥

బ్రహ్మాజనార్ధనశ్శమ్భురిన్ద్రో వాయుర్యమో రవిః।

హుతభుగ్వరుణోధాతాపుషాభూమిర్నిశాకరః॥

ఏతేచాన్యేచయేదేవాశ్శాపానుగ్రహహారిణః।

నృపస్యతేశశరీరస్థాస్సర్వదేవమాయో నృపః॥

ఏతద్ జ్ఞాత్వామయాజ్ఞప్తంయద్యథాక్రియతాంతథా।

నదాతవ్యంనహోతవ్యంనయష్టవ్యంచభోద్విజాః॥

భర్తృ శుశ్రూషణం ధర్మోయథా స్త్రీణాంపరోమతః।

మమాజ్ఞా పాలనం ధర్మోభవతాం తథాద్విజాః॥

వేనుడు:

నాకంటే గొప్ప వాడు నాకంటే నారాధింప వలసిన వాడు మరి ఎవ్వడున్నాడు? మీకు యజ్ఞేశ్వరుడీ హరి యెవ్వడు? బ్రహ్మ జనార్ధనుడు శంభువు ఇంద్రుడు వాయువు యముడు రవి అగ్ని వరుణుడు ధాత పూషభూమి చంద్రుడు మరి శాపానుగ్రహ కారులయిన యితర దేవతలు రాజ శరీర మందున్న వారు. నృపతి సర్వ దేవమయుడు. ఇది తెలిసి, నేనోసంగిన యాజ్ఞ నందరుం జేయ వలయును. దానము సేయరాదు, హోమము సేయరాదు, యజ్ఞములు సేయ గూడదు. స్త్రీలకు భర్త యొక్క సేవ పరమ ధర్మమయినట్లు, ఓ విప్రులార మీకు నా యాజ్ఞా పాలనము ధర్మమూ. 

ఋషులు: 

దేహ్యనుజ్ఞాం మహాభాగమా ధర్మోయాతుం సంక్షయమ్।

హవిషాం పరిణామోఽయం యదేతదఖిలం జగత్॥

ఋషులు:

ఓ మహానుభావ! అనుజ్ఞ ఇమ్ము. ధర్మము సంక్షయ మందరాదు. ఈ సకల జగత్తు దేవతల కిచ్చు హవిర్భాగముల యొక్క పరిణామమే కాని వేరు గాదు.

శ్రీపరాశరుడు:

ఇతివిజ్ఞాప్యమానోఽపిసవేనః పరమర్షిభిః।

యాదాదదాతినానుజ్ఞాం ప్రోక్తః ప్రోక్తః పునః పునః॥

తతస్తు ఋషయస్సర్వేకోపామర్షసమన్వితాః।

హన్యతాంహన్యతామేషఇత్యూచుస్తే పరస్పరమ్॥

యోయజ్ఞ పురుషం విష్ణుమనాది నిధనం ప్రభుమ్।

వినిన్దత్య సమాచారో నసయోగ్యోభువఃపతిః॥

ఇత్యుక్త్వామన్త్రపూతైస్తైః కుశైర్మునిగణాభ్రుశమ్।

నిజఘ్నుర్నిహతం పూర్వం భగవన్నిన్దనాదినా॥

తతశ్చమునయోరేణుందదృశుస్సర్వతో ద్విజ।

కిమేతదితిచాసన్నాన్ పప్రచ్చుస్తే జనాంస్తదా॥

ఆఖ్యాతంచజనైన్తేషాంచోరీభూతైరరాజకే।

రాష్ట్రేతులోకైరారబ్దంపరస్వాదానమాతురైః॥

శ్రీపరాశరుడు:

అని పరమర్షులు విన్నవించినను వినక మరిమరి తెలియ జెప్పినను ననుజ్ఞ యివ్వకున్నంత నమ్మహర్షులెల్ల కుపితులై వీనిం జంపుదము జంపుదమని యొండొరులను కొనిరి. యజ్ఞ పురుషుని విష్ణుని ఆదిమధ్యాంతములు లేని వానినెవ్వడు దూషించునో యా దురాచారుడు భూపతిగ నుండదగడు. అని మంత్ర పవిత్రములయిన కుశలచే భగవన్నిందచే నీవరకే చచ్చినవానిం జంపిరి. అంతట నమ్మునులంతట రేగిన రేణువును (ధూళిని) జూచిరి. దరినున్న వారి నిదియేమి యని యడిగిరి. రాష్టములో జనులు దొంగలై పరదార ధనముల హరించు చున్నారని లోకులు తెల్పిరి. 

తేషాముదీర్ణవేగానాంచోరాణాం మునిసత్తమాః। 

సుమహాన్ దృశ్యతేరేణుః పరవిత్తాపహారిణామ్॥

తతస్సంమన్త్ర్యతేసర్వేమునయస్తస్యమన్త్రతః।

మమన్థురూరుంపుత్రార్థ మనపత్యస్యయత్నతః॥

మథ్యమానాత్సముత్తస్థౌతస్యోరోః పురుషఃకిల।

దగ్ధస్థూనణాప్రతీకాశః ఖర్వటాస్యోతిహ్రస్వకః॥

కింకరోమీతితాన్ సర్వాన్ విప్రానాహత్వరాన్వితః।

నిషీదేతితమూచుస్తేనిషాదస్తేనసోఽభవత్॥

తతస్తత్సంభవాజ్జాతావిన్ధ్యశైలనివాసినః।

నిషాదాముని శార్దూల పాపకర్మోఫలక్షణాః॥

తేనద్వారేణతత్పాపంనిష్క్రాన్తంతస్యభూపతేః।

నిషాదాస్తేతతోజాతావేనకల్మషనాశనాః॥

తతోస్యదక్షిణంహస్తంమమన్థుస్తేతదాద్విజాః॥

మథ్యమానేచతత్రాభూత్పృథుర్వైన్యః ప్రతాపవాన్।

దీప్యమాసస్స్వవపుషాసాక్షాదగ్నిరివోజ్జ్వలన్॥

ఆద్యమాజగవంనామఖాత్పపాతతతోధనుః।

శరశ్చదివ్యానభసః కవచంచపపాతహ॥

తస్మిన్ జాతేతు భూతాని సంప్రహృష్టానిసర్వశః॥

సత్పుత్రేణచతేనవేనోఽపిత్రిదివంయయౌ।

పున్నామ్నోనరకాత్త్పతస్సతేనసుమహాత్మనా॥

తంసముద్రాశ్చ నద్యశ్చ రత్నాన్యాదాయసర్వశః।

తోయనిచాభిశేకార్థం సర్వాణ్యేవోపత స్థిరే॥

పితామహశ్చ భగవాన్ దేవై రాంగిరసైస్సహ।

స్థావరాణిచ భూతాని జంగమానిచ సర్వశః॥

సమాగమ్యతదావై న్యమభ్యషించన్నరాధిపమ్॥

మిక్కిలి వేగముగా విజృంభించిన యా దొంగల వలన రేగిన దూళి యిదియన విని, మునులాలోచించి అపుత్రకుడైన యా వేనుని తోడను మథించిరి. వాని యూరువు నుండి కాలిన యినప ప్రతిమం బోలిన యొక్క మరుగుజ్జు పుట్టె. నేనేమి చేయవలెనని తొందర పాటున యమ్మునుల నడిగెను. వారు నీషీద (కూర్చుండ) మనిరి. దాన వాడు నిషాదుడను పేరొందెను. (బోయ జాతి వాడయ్యేనన్న మాట) వాని సంతానము వింధ్య శైల వాసులయిరి. వాండ్రందరు పాప కర్మ పరులు. ఆ వేనుని పాపము వాని ద్వార తొలగి పోయినది. అవ్వాల నాతని కుడిచేయి మథించిరి. అందుండి పృథువు అగ్నివలె దేదీప్యమాన మూర్తియై యుదయించెను. ఆ వెంటనే ఆజగవమను విల్లు దివ్య భాణము కవచము నింగి నుండి పడినవి. అతడు జనించిన తఱి సర్వ భూతము లానందభరితము లైనవి. అట్టి యుత్తమ పుత్రా లాభముచే వేనుడు స్వర్గమున కేగెను. పున్నామ నరకము నుండి త్రాయతి (కాపాడు వాడు), పుత్రుడు అన్న పేరు పృథునికి సార్థకమయ్యె. అతనికి సముద్రములు, నదులు, రత్నములం జేకొని తన యుదకములచే నభిషేకింప పచ్చినవి. బ్రహ్మయు వేల్పులతో అంగిరసులతో దయ చేసెను. స్థావర జంగమును జీవ కోట్లన్నియు వచ్చి వైన్యు నభిషేకించినవి. 

హస్తేతు దక్షిణే చక్రందృష్ట్వా తస్య పితామహః।

విష్ణోరంశం పృథుంమత్వా పరితోషంపరంయయౌ॥

విష్ణుచిహ్నంకరేచక్రం సర్వేషాంచక్రవర్తినామ్।

భవత్యవ్యాహతో యస్యప్రభావస్త్రిదశైరపి॥

మహతారాజరాజ్యేన పృథుర్త్వైన్యః ప్రతాపవన్।

సోభిషిక్తో మహాతేజా విదివద్ధర్మకోవిదైః॥

పిత్రాపరాజితాస్తస్య ప్రజాస్తేనానురంజతాః।

అనురాగాత్తతస్తస్యనామరాజేత్యజాయత॥

ఆపస్తస్తంభిరేచాస్య సముద్రభియాస్యతః।

పర్వతాశ్చదదుర్మార్గం ధ్వజంభంగశ్చనాభవత్॥

అకృష్ణపచ్యా పృథివీసిద్ధ్యన్త్యన్నానిచిన్తయా।

సర్వకామదుఘాగావః పుటకేవుటకేమధు॥

తస్యవైజాతమాత్రస్య యజ్ఞేపై తామహాశుభే।

సూతస్సూత్యాంసముత్పన్నః సేత్యేఽహానిమహామతిః॥

తస్మిన్నేవమహాయజ్ఞే జజ్ఞేప్రాజ్ఞోథమాగధః।

ప్రోక్తౌతదామునివరైస్తావుభౌసూతగదౌ॥

స్తూయతామేషనృపతిః పృథుర్వైన్యః ప్రతాపవాన్।

కర్మైతదనురూపంచపాత్రంస్తోత్రస్యవాంపరమ్॥

తతస్తావూచతుర్విప్రాన్సర్చానేవ కృతాంజలీ।

అద్యజాతస్యనోకర్మజ్ఞాయతేఽస్య మహీపతేః॥

గుణానచాస్యజ్ఞాయన్తేనచాస్య ప్రథితంయశః।

స్తోత్రంకిమాశ్రయంత్వస్య కార్యమస్మాభిరుచ్యతామ్॥

ఆయన కుడి చేతిలో చక్రరేఖ చూచి బ్రహ్మ యీతడు విష్ణ్వంశ సంభూతుడని సంతోషించెను. ఏ చక్రవర్తి హస్తమందు విష్ణుచక్ర రేక యుండునో ఆతడవ్యాహత పరాక్రముడై దేవతలకు గూడ ఆజయ్యు డగును. మంత్ర కోవిదులైన విప్రులు పృథుని గొప్ప రాజ రాజ్యాధికారమందు యథావిధిగా నభిషేకించిరి. తండ్రిచే నిడుమలు వడిన ప్రజలాతనిచే ననురాగముతో ననురంజితులైరి. దాననతనికి ‘రాజు’ అను శబ్దము సార్థకముగ నేర్పడినది. (రంజనాత్ రాజా) సముద్ర గాములయిన నీరతనిచే స్తంభింప జేయ బడినది. పర్వతములు దారి యిచ్చినవి. అతని ధ్వజమునకు, పతాకమున కెందును భంగము లేకుండెను. ఇరుకైన యడవులలో కూడా యతని జెండా దించవలసిన పని లేడయ్యెను. దున్నకయే భూమి పండెను. సంకల్ప మాత్రమున నన్నములు సిద్ధము లయ్యెను. గోవులు సర్వ కామములను జేసినవి. పట్టుపట్టునను తేనెలు గురిసినవి. అతడు పుట్టగానే బ్రహ్మ దేవతాక యజ్ఞమందు సూత్యాహస్సు నందు సూతి యందు మహాబుద్ధిశాలి సూతుడు పుట్టెను. అందే ప్రాజ్ఞుడు మాగధుడును జనించెను. మునులా యిద్దరను సూత, మాగధులని పేర్కొనిరి. మీరు పృథు చక్రవర్తిని (అతని కీర్తిని) గానము సేయుడు. ఇది మీకు విధి నిహితమైన పని కాగలదనిరి. వారు చేతులు జోడించి మునులతో నిపుడే ఆవిర్భవించిన యీ చక్రవర్తి చేసిన పనులు చరిత్రాయు మాకు దెలియవు గదా, ఇతని గుణములు మాకు దెలియవు. ఇతని కీర్తి ప్రసిద్ధము గాదు. దేనిని గురించి స్తోత్రము సేయవలెనో యానతిండన ఋషు లిట్లనిరి.

ఋషులు:

కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తీ మహాబలః।

గుణా భవిష్యాయే చాస్యతై రయంస్తూయతాం నృపః॥

ఋషులు:

ఈ చక్రవర్తి మహాబలుడయి యీ పైనేమి పనులు సేయగలడో చేయబోవునో ఆ పనులనే కీర్తింపుడనిరి.

శ్రీపరాశరుడు:

తతస్సనృపతి స్తోషం తచ్చృత్వాపరమంయయౌ।

సద్గుణైశ్శ్లాఘ్య తామేతితస్మాత్ శ్లాఘ్యాగుణామమ॥

తస్మాద్యదత్ర స్తోత్రేమే గుణనిర్వర్ణనంత్విమౌ।

కరిష్యేతే కరిష్యామి తదేవాహం సమాహితః॥

యదిమౌవర్జనీయంచ కించిదత్రవదిష్యతః।

తదహంవర్జయిష్యామీ త్యేవంచక్రేమతింనృపః॥

అథతౌ చక్రతుః స్తోత్రం పృథోర్వైన్యస్యధీమతః।

భవిష్యైః కర్మభిస్సమ్యక్ సుస్వరౌసూతమాగధౌ॥

సత్యవాగ్దానశీలోయం సత్యసన్ధో నరేశ్వరః।

హ్రీమాన్ మైత్రః క్షమాశీలో విక్రాంతో దుష్టశాసనః॥

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దయావాన్ ప్రియభాషితా।

మాన్యాన్మానయితాయజ్వా బ్రహ్మణ్యస్సాధువత్సలః॥

సమశ్శాత్రౌచమిత్రేచ వ్యవహారస్థితౌ నృపః॥

సూతేనోక్తాన్ గుణానిత్థంసతాథామాగధేనాచ।

చకారహృదితాధృంశి కర్మణాకృతవాససౌ॥

తతస్సపృథివీ పాలః పాలయన్ పృథివీమీమాన్।

ఇయాజవివిధైర్యజ్ఞైరమహద్భిర్భూరి దక్షిణైః॥

తంప్రజాః పృథివీనాథ ముపతస్థుః క్షుధార్దితాః।

ఓషధీషుప్రణష్టాసుతస్మిన్ కాలేహ్యరాజకే॥

తమూచుస్తేనరాః ప్రుష్టాస్తత్రాగమన కారణమ్॥

అరాజకేనృప శ్రేష్ఠధరిత్య్రాం సకలౌషదీః।

గ్రస్తాస్తతః క్షయంయాన్తి ప్రజాస్సర్వాః ప్రజేశ్వర॥

త్వంనో వృత్తిప్రదోధాత్రాప్రజాపాలో నిరూపితః।

దేహినః క్షుత్పరీతానాం ప్రజానాం జీవనౌషదీః॥

తతస్సనృపతిర్దవ్యమాదాయాజగవంధనుః।

శరాంశ్చదివ్యాన్ కుపితస్సోఽన్వధావద్వసుంధరామ్॥

తతోననాశత్వరితాగౌర్భూత్వాతువసుంధరా।

సాలోకాన్ బ్రహ్మలోకాదీన్ సంత్రాసాదగమన్మహీ॥

యత్రయత్రయయౌ దేవీసాతదాభూతధారిణీ।

తత్రతత్రచసావైన్యందదర్శాభ్యుధ్యతాయుధమ్॥

తతస్తంప్రాహవసుధాపృథుంపృథుపరాక్రమమ్।

ప్రవేపమానాతద్బాణపరిత్రాణపరాయణా॥

శ్రీపరాశరుడు:

వారు చేసిన స్తుతుల విని యారేడు పరమానంద మందెను. సుగుణ సంపదచే మానవుడు శ్లాఘుడగును. కావున నా లక్షణములు శ్లాఘ్యములు గావలయును. అందుచే నీ వందిమాగధులు సేసిన గుణ వర్ణనము ననుసరించి యా పనులే నేను స్థిర చిత్తముతో చేసెదను. వీరు చేయ గూడదని వర్ణించిన పనులను మానెదను అని నిశ్చయించు కొనెను. ఆ బుద్ధి మంతుని జరుపబోవు నుత్తమ కార్యములను సుస్వర లయాను రంజనముగ వారు గానము సేసిరి. సత్య వచనుడు, దాన శీలుడు, సత్య సంధుడు, హ్రీమంతుడు (హ్రీ యనగా మనము సేయు పనిని పెద్దలు మహానుభావులు మెచ్చు కొందురో లేదో యెక్కడ పొరపాటు జరిగిపోవునో యను బెదురు, ఒంచాడింపు అం జాతీయమైన తెలుగు), మిత్రభావుడు, క్షమావంతుడు, పరాక్రమవంతుడు, దుష్ట శాసకుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దయాళువు, ప్రియబాషి, మాన్యులను గౌరవించు వాడు, యజ్వ (యజ్ఞములను సేయువాడు), బ్రహ్మణ్యుడు (బ్రహ్మ జ్ఞాని, సాధువుల యెడ వాత్సల్యము గలవాడు), శత్రువునెడ మిత్రునెడ వ్యవహారము లందు సముడు. ఇట్లా సూతమాగధులు పాడిన గుణములను హృదయ మందిడుకొనెను. అట్టి పనులే చేసెను. ఇట్లాతాడు పృథివిం బాలించుచు భూరిదక్షిణములైన యజ్ఞములను పెక్కులు సేసెను. అంతమున్న రాజకమైన కాలమున (వేనుని వాలమున) సర్వౌషదులు నష్టములై నందున నాకలి కల్లాడి ప్రజలా భూనాథుని దరికేగిరి. అతడు రాకకు కారణ మడిగినంత ఓ నృప శిరోమణీ! ఇంతకూ మున్న రాజ్యమందు ధరిత్రి యందలి యౌశథులన్నియు నశించినవి. దాన ప్రజలు నశించు చున్నారు. విదాతచే (బ్రహ్మ) మాకు నీవు జీవన విధాతయగు ప్రజా పాలకుడుగా జూప బడినావు. ఆకలి నలమటించు మాకు జీవనౌషధులను దయ సేయుము. నావిని పృథు చక్రవర్తి ఆజగవమను దివ్య ధనువు దివ్య బానములను గొని కినుక గొని, వసుంధర పైకి బరుగిడెను. ఆ దేవి జడిసి పోయి గొవి సత్వరమ బ్రహ్మాదుల లోకములకు బారి పోయెను. ఎటనెట నా దేవి సనె నటనట తనముందా భూతధాత్రి ఆయుధ మెత్తియున్న ఆ వైన్యుని దర్శించెను. అవ్వల నవ్వసుధ పృథు పరాక్రముడైన పృథు చక్రవర్తిం గని, గడగడ వడుకుచు రక్షణకై తహతహ లాడుచు నిట్లనియె. 

పృథివి:

స్త్రీవధేత్వంమహత్పాపం కిం నరేన్ద్రనపశ్యసి।

యేనమాంహన్తుమత్యర్థంప్రకరోషినృపోద్యమమ్॥

పృథివి:

అక్కట! నను దుదముట్టింప వలయునని యత్నించు చున్నావు. నరేంద్రా! స్త్రీ వధ యందు పాపమును గమనింపవ! యన 

పృథువు:

ఏకస్మిన్ యత్రనిధనంప్రాపితే దుష్టకారిణి।

బహూనాంభవతి క్షేమంతస్య పుణ్యప్రదోవధః॥

పృథువు:

ఓ దుష్టకారిణీ! ఒక్కని గడతెరచిన పెక్కు మందికి క్షేమము గల్గు నపుడమ్రుక్కడిం దుద ముట్టించుట పుణ్యము.

పృథివి:

ప్రజానాముపకారాయయదిమాంత్వంహనిష్యసి।

ఆధారః కః ప్రజానాంతే నృపశ్రేష్ఠ భవిష్యతి॥

పృథివి:

ప్రజోపకారమునకు నీవు నన్ను హత మొనర్తువేని నీ ప్రజల కాధార మేముండ గలదు? అనెను.

పృథువు:

త్వాంహత్వావసుధేబాణైరమచ్చాసనపరాఙ్ఞ్ముఖీమ్।

ఆత్మయోగబాలేనై వధా రయిష్యామ్యహంప్రజాః॥

తతఃప్రణమ్యవసుధాతంభూయః ప్రాహపార్థివమ్।

ప్రవేపితాజ్గీ పరమంసాధ్వసం సముపాగతా॥

ఉపాయతస్సమారబ్దాస్సర్వేసిద్ద్యన్త్యుపక్రమాః।

తస్మాద్వదామ్యుపాయంతే తంకురుష్వయదీచ్చసి॥

సమస్తా యామయాజీర్ణా నరనాథ! మహౌషధీః।

యదీచ్చసిప్రదాస్యామితాఃక్షీరపరిణామినీః॥

తస్మాత్ప్రజాహితార్థాయమధర్మభ్రుతాంవర।

తంతువత్సంప్రయచ్చత్వంక్షరేయంయత్రవత్సలా॥

సమాంచకురుసర్వత్రయేసక్షీరంసమన్తతః।

వరౌషధీభీజభూతంవీరసర్వత్రభావయే॥

పృథువు:

నా యాజ్ఞకు బెడమొగమైన నిన్ను జంపి మా యోగ బలముచే నీప్రజలను నేను భరింతును. అన వసుంధర యా ఱేనికి బ్రణతయై మేను వడంక పరమ భయమంది సర్వ ప్రారంభములు (పనులు) ఉపాయము వలన నెరవేరును. అందువలన నీకొక యుపాయమే నెరింగించెద. నిష్టమేని యట్లు సేయుము. నాచే జీర్ణములైన మహౌషదుల నన్నిటి క్షీర రూప పరిణామము నొందించి యేనిచ్చెద. కావున ప్రజల హితమునకో ధార్మిక సార్వభౌమ! నాకొక దూడ నోసంగుము. దానియందేను వత్సలనై పాలు చేపెడను. అంతియ కాదు, లోగడ నేగుడు దిగుడైన నన్ను సమస్థితిం బొనరింపుము. వనౌషదులకు బీజమైన పాలను నేనంతట భావింతును. (భావనా మాత్రమున నవి స్రవించు నన్నమాట).

శ్రీపరాశరుడు:

తత ఉత్సారయామాసశైలాన్ శతసహస్రశః।

ధనుష్కోట్యాతథావై న్యస్తేనశైలావివర్దితాః॥

నహిపూర్వవిసర్గేవై విషమేపృథివీ తలే।

ప్రవిభాగః పురాణాంవాగ్రామాణాంవా పురాభవత్॥

నసస్యానినగోరక్ష్యంనకృషిర్నవణిక్పథః।

వైన్యాత్ప్రభృతిమైత్రేయసర్వ స్యైతస్యసంభవః॥

యత్రయత్ర సమత్వంచ భూమేరాసీన్నరాధీపః।

తత్రతత్రప్రజానాంహినివాసంసమరోచయత్॥

ఆహారః ఫలమూలానిప్రజానామభవంస్తదా।

కృచ్చ్రేణమహతాసోఽపిప్రణష్టా స్వోషదీషువై॥

సకల్పయిత్వావత్సంతుమనుం స్వాయంభువం ప్రభుమ్।

స్వపాణౌపృథివీనాథోదుదోహపృథివీం పృథుః॥

సస్యబీజానిసర్వాణిప్రజానాం హితకామ్యయా॥

తేనాన్నేనప్రజాస్తాతవర్తన్తేఽద్యాపినిత్యశః॥

ప్రాణప్రదాతాసపృథుర్యస్మాద్భూమేరభూత్పితా।

తతస్తుపృథివీసంజ్ఞా మవాపాఖిలదారిణీ॥

శ్రీపరాశరుడు:

అది విని పృథువవనిం గల పర్వతములను ధనుష్కోటిచే బెల్లగించి మీది కెత్తెను. దాననవి పెరిగినవి. పూర్వ సృష్టి యందు భూతలము మిత్తపల్లముల నెగుడు, దిగుడై యుండి పురగ్రామ విభాగము లేకుండెను. అప్పుడు పంటలు లేవు. గో రక్షణ లేదు. వ్యవసాయము లేదు. వర్తకము లేదు. ఇదంతయు నీ వైన్యుని దగ్గర నుండియే యైనది. ఎటనెట భూమి చదునయ్యే నటనట బ్రజలు నివసింప నీ రాజు గోరెను. అపుడు ప్రజలకు గందమూల ఫలాదు లాహార మయ్యె. అదికూడ కష్టమై యోషాదులు క్షీణింప నీ పృథువు స్వాయంభువ మనువును దూడగా సంకల్పించి (ఏర్పరిచి) తన చేతితో నా పృథివీపతి పృథివిం సర్వ సస్యముల విత్తనముల బిదికెను. ఆనాడతడట్లు కల్పించిన యన్నము చేతనే నాడు నీ నాడును బ్రజలు జీవించు చున్నారు. ఆ ప్రభువు ప్రాణ ప్రదాత. భూమికి తండ్రియు నయ్యె. అందుచే నఖిల ధారిణి యైన యీ ధారుణి పృథివి యను పేరోందె. (పృథువు యొక్క కూతురు, స్త్రీ సంతానము పృథువి యన్న మాట)

తతశ్చదేవై ర్మునిభిఃదైత్యైరక్షోభిరద్రిభిః।

గన్దర్వైరురగైర్యక్షైః పితృభిస్తరుభిస్తథా॥

తత్తత్పాత్రముపాదాయతత్తద్దుగ్ధంమునేపయః।

వత్సదోగ్ధృవిశేషాశ్చ తేషాంతద్యోనయోభవన్॥

సైషాదాత్రీవిధాత్రీధారణీపోషణీతథా।

సర్వస్య జగతః పృథ్వీ విష్ణుపాదతలోద్భవా॥

ఏవంప్రభావస్సపృథుఃపుత్రోవేనస్య వీర్యవాన్।

జజ్ఞే మహీపతిః పూర్వో రాజాభూ జ్జనరంజనాత్॥

యఇదంజన్మ వైన్యస్య పపృథోః కీర్తయతే నరః।

న తస్యదుష్కృతం కించిత్ఫలదాయి ప్రజాయతే॥

దుస్స్వప్నోపశమం నృణాం శృణ్వతాంచై తదుత్తమమ్।

పృథోర్జన్మ ప్రభావశ్చ కరోతి సతతం శుభమ్॥

అవ్వల దేవతలు మునులు దైత్యులు రక్షస్సులు పర్వతములు గంధర్వులు నాగులు పితరులు మరి యెల్లరకు నా యా పాత్రలం జేకొని యాయా వర్గమున కనువైన పాలు దూడలు పితుకు వారు వారివారికి మూలమైనది. ఆ యీ ధాత్రి సర్వ జగమ్మునకు ధాత్రి ధారణి పోషిణియై పృథ్వీ విష్ణుపాద తలము నందు జనించినది. ఆ పృథువిట్టి ప్రభావము గలవాడు. వేనుని పుత్రుడు. వీర్యవంతుడునై యవతరించెను. జన రంజనము సేసి తొంటి రాజైనాడు. వేనుని కొడుకగు పృథువు యొక్క యీ జన్మ వృత్తమును గీర్తించిన నరునికి తొల్లి చేసిన పాపమే కొంచెమేని ఫలింపదు. ఇది చదివిన విన్న దుస్స్వప్న దోషోప శమనము. ఈ పృథు చక్రవర్తి జన్మ వృత్తాంతము ప్రభావమును నిరంతర శుభకారకము.