బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

98 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

అథోద్దవో యశోదాంచ ప్రణమ్యత్వరయాముదా

ఖర్జూర కాననం వామేకృత్వాచ యమునాం యయౌ

స్నాత్వాభుక్త్యాచతత్రైవ జగామ మథురాంపునః

దదర్శవటమూలేచ గోవిందం రహిసిస్థితం

ప్రఫుల్లో ప్యుద్ధవం దృష్ట్వా సస్మితంత మువాచ సః

రుదంతం శోకదగ్ధంచ సాశ్రునేత్రంచ కాతరం

శ్రీభగవానువాచ :

ఆగచ్ఛోద్ధవ కళ్యాణి రాధా జీవతి జీవతి

కళ్యాణయుక్తా గోప్యశ్చ జీవన్తి విరహ జ్వరాత్

శుభం గోపశిశూనాంచ వత్సానాంచ గవామపి

మాతా మే పుత్రవిరహాత్ యశోదా దృశీచ సా

వదబంధో యథార్థంతత్ త్వాందృష్ట్వా కిమువాచ సా

త్వయోక్తాజననీకింకా పునః సా కిమువాచ మాం

దృష్టం తద్యమునా కూలం పుణ్యం బృందావనం వనం

నిర్జనోపవనౌఘైశ్చ సురమ్యం రాసమండలం

రమ్యం కుంజకుటీరాఘే రమ్యం క్రీడా సరోవరం

పుష్పోద్యానం వికసితం సంకులంచ మధువ్రతైః

భాండీరాఖ్యోవటోదృష్టః సుస్నిగ్ధోబాలకాన్వితః

దృష్టాగోష్ఠోగవాం దృష్టం గోకులం గోకులవ్రజం

యది జీవతి రాధాసా దృష్ట్వాత్వాం కిమువాచమాం

తత్సర్వం వద హేబంధో చాందోలయతి మే మనః

కిమూచుః గోపికాః సర్వాః కిమూచుః గోపబాలకాః

గోపాశ్చ వృద్ధా కింవోచుః వయస్యా జనకస్యమే

బలదేవస్య జననీ కిమూచేరోహిణీ సతీ

కిమూచురపరాస్తాత బంధువల్లభ వల్లవాః

కింభుక్తం కిమపూర్వంవా దత్తం మాత్రాచ రాధయా

కీదృగ్వాక్యం సుమధురం సంభాషా కీదృశీతిచ

గోపానాం గోపికానాంచ శిశూనాం మాతురేవచ

రాధాయాశ్చాపి కీదృగ్వామయిప్రేమోద్ధవాధికం

మాంచస్మరతి మాతామే మాంచ స్మరతిరోహిణీ

మాంచస్మరతి సారాధా మత్ప్రేమ విరహాకులా

మాంచస్మరంతి గోప్యశ్చ గోపాశ్చ గోపబాలకాః

భాండీ రేవట మూలేత బాలాః క్రీడంతి మాంవినా

దత్తమన్నం బ్రాహ్మణీభిః యత్రభుక్తం సుధోపమం

ప్రమదాబాలకైస్సార్ధం యత్తదృష్టం పరీప్సితం

ఇంద్రయాగస్థలం దృష్టం దృష్టో గోవర్ధనో వరః

బ్రహ్మణాచ హృతా గావో యత్ర తద్దృష్టముత్తమం

శ్రీకృష్ణస్వవచః శ్రుత్వాశోకోక్తం మధురాన్వితం

ఉద్ధవః సమువాచేదం భగవంతం సనాతనం

నారాయణుడిట్లన్నాడు :

ఇక ఉద్ధవుడు యశోదకు నమస్కరించి త్వరగా, ఆనందంగా ఒకపక్క ఖర్జూరపు అడవి ఎడమ ప్రక్కన యమునా నది ఉండగా, బయలు దేరాడు. (1) అక్కడే స్నానం చేసి భుజించి తిరిగి మధురకు వెళ్ళాడు. వటమూలమందు రహస్యంగా (ఒంటరిగా) ఉన్న గోవిందుని చూచాడు. (2) ఉద్ధవుని చూచి ఆనందం ఉప్పొంగగా నవ్వుతూ ఉద్ధవునితో కృష్ణుడిట్లన్నాడు. ఉద్ధవుడు ఏడుస్తున్నాడు శోకంతో దహించి పోతూన్నాడు. కళ్ళునీళ్ళతో నిండాయి. భయపడుతున్నాడు. (3) భగవంతుని మాట ఇట్లా - కళ్యాణ రూపుడ! ఉద్దవ!! రా. రాధ బ్రతికి ఉంది, బ్రతికి ఉంది (కదా). గోపికలు క్షేమమేనా. విరహ జ్వరంతో బ్రతికే ఉన్నారు గదా. (4) గోపశిశువులు, దూడలు క్షేమమేకదా. ఆవులు క్షేమమేనా. నా తల్లిగా విరహంతో యశోద ఎట్లా ఉంది. (5) ఓ బంధు! ఉన్నదున్నట్లు అది చెప్పు. నిన్ను చూచి యశోద ఏమన్నది. నీవు అమ్మతో ఏమి చెప్పావు తిరిగి ఆమే నా గురించి ఏం చెప్పింది (6) యమున నది ఒడ్డును చూచావా. పుణ్యప్రదమైన బృందావన వనాన్ని చూచావా? జనులు లేని ఉపవన సమూహములతో అందమైన రాసమండలం ఉంది కదా (7) రమ్యమైన కుంజకుటీరముల సమూహమందు క్రీడా సరోవరం చూశావా. వికసించిన పుష్పోద్యానము, తుమ్మెదలతో నిండి ఉంది కదా. (8) భాండీరమను పేరుగల వటవృక్షమును చూచావా. నిగనిగలాడుతూ పిల్లలతో అదికూడి ఉందా. ఆవుల కొట్టాలు చూచావా (సమూహం) . గోకులాన్ని గోకుల ప్రజాన్ని చూచావా! (9) (మందను). రాధ బ్రతికి ఉండి ఆరాధ నిన్నుచూచి, నాగూర్చి ఏం చెప్పింది ఓ బంధు! అదంతా నాకు చెప్పు. నా మనస్సు ఆందోళనం చెందుతోంది. (10) అందరు గోపికలేమన్నారు. గోపబాలురు ఏమన్నారు. వృద్ధులైన గొల్లలేమన్నారు. నాతండ్రి స్నేహితులేమన్నారు. (11) బలరాముని తల్లియైనరోహిణి సతి ఏం చెప్పింది. ఓఅయ్య! వేరే బంధు శ్రేష్ఠులైన గొల్లలు ఏం చెప్పారు. (12) భుజించావా! నా తల్లి, రాధ ఏ అపూర్వమైనవి ఇచ్చారు. మధురమైన ఆమాటేమిటి. వాళ్ళ సంభాషణ ఎలాటిది. (13) గోపులు, గోపికలు, శిశువులు, తల్లి, రాధ వీరందరికి నా పై ప్రేమ ఎంత ఎక్కువగా ఉంది, చెప్పు ఉద్ధవ! (14) నా తల్లి నన్ను స్మరిస్తోందా? రోహిణి నన్ను స్మరిస్తోందా? ఆరాధ నన్ను స్మరిస్తోందా? నాపై ప్రేమ విరహంతో వ్యాకులమై ఎట్లా ఉంది? (15) గోపికలు,గొల్లలు, గోపబాలకులు నన్ను స్మరిస్తున్నారా? నేను లేకుండా భాండీరంలో వటవృక్షం నీడలో (మూలంలో) ఆబాలురు ఆడుకుంటున్నారా? (16) అమృతంతో సమానమైన అన్నాన్ని బ్రాహ్మణ స్త్రీలు ఇచ్చిన దాన్ని తిన్నచోటు చూశావా? ప్రమదలతో (స్త్రీలు) బాలురతో కలిసి తిన్న చోటును ఇష్టమైన దాన్ని (17) ఇంద్రుని యాగస్థలాన్ని చూశావా? శ్రేష్ఠమైన గోవర్ధన పర్వతాన్ని చూశావా? బ్రహ్మ ఆవులను ఎత్తుకుపోయిన స్థలాన్ని ఉత్తమమైన దాన్ని చూచావా? (18) శ్రీ కృష్ణుని మాటలను విని, శోకంతో చెప్పిన మధురమైన మాటలను, సనాతనుడైన భగవంతునితో ఉద్ధవుడు ఇట్లా చెప్పాడు.

మూII ఉద్ధవ ఉవాచ :

యద్యుదుక్తం త్వయానాథ సర్వం దృష్టం యథేప్సితం

సఫలం జీవనం జన్మకృతమత్రైవ భారతే

దృష్టం భారతసారంచ పుణ్యం వృందావనం వనం

తత్సారం వ్రజభూమౌచ సురమ్యం రాసమండలం

తత్సారభూతాగోలోకవాసిన్యో గోపికాః వరాః

దృష్టాతత్సార భూతాచ రాధా రాసేశ్వరీ పరా

కదళీవనమధ్యేచ నిర్జనే సుహృదస్థలే

 పంకస్థే పంకజ దళే సజలే చందనార్చితే

శయనేఽతివిషణ్ణా సా, రత్నభూషణ వర్జితా

అతీవమలినా క్షీణాఽఽచ్ఛాదితాశుక్ల వాససా

సేవితా సఖిభిస్తత్ర సతతం శ్వేతచామరైః

కృశోదరీ నిరాహారా క్షణం శ్వసితీచ క్షణం

క్షణం జీవతి కింసావా విరహజ్వరపీడితా

కింవాజలం స్థలం కింవా నక్తం కింవాది నంహరే

పరం పశుంనజానాతి కింపరం కః సుబాంధవః

బాహ్యజ్ఞాన విరహితా ధ్యాయమానాపదం తవ

త్రైలోక్యయశసాభాతి తన్మృత్యుర్యశసం భవః

స్త్రీ హత్యాంనైవవాంఛంతి జ్ఞాన హీనాశ్చదస్యవః

గచ్ఛశీఘ్రం జగన్నాథ కదళీవన మీప్సితం

బహిర్భూ తా న జగతాం సారాధా త్వత్సరాయణా

 అతీవభక్తా నత్యాజ్యా ప్రభుణారక్షితా సదా

నహిరాధాపరాభక్తా న భూతో న భవిష్యతి

మన్మథ: శంకరాద్భితో భవాంశ్చ తత్పురః సరః

భవద్విధం పతింప్రాప్య కామదగ్ధచరాధికా

తస్మాత్సర్వ పరం కర్మతచ్చకేనాపి వార్యతే

మధుర్దహతి చంద్రశ్చ సతతం కిరణేనచ

అను!! ఉద్ధవుడిట్లన్నాడు - ఓ నాథుడ! నీవు చెప్పినవన్నీ మనసుదీర చూశాను. (కోరికతో). ఈ భారతంలో జీవనము జన్మ సఫలమైంది (20) భారతదేశ) సారాన్ని చూచాను. పుణ్యమైన బృందావన వనాన్ని చూచాను. దానిసారమైన వ్రజభూమిలోని చాలా రమ్యమైన రాసమండలాన్ని చూచాను. (21) దాని సారమైన గోలోకంలో ఉండే శ్రేష్ఠులైన గోపికల చూచాను. వారి సారభూతమైన, పరురాలైన రాసేశ్వరియైన రాధను చూచాను. (22) కదళీవనం మధ్యలో నిర్జనమైన చోట మంచి హృదయంగల వారి స్థలంలో (మధ్య) బురదయందున్న పద్మదళమందు, నీరుగల దానియందు, చందనం పూయబడిన (23) పడకయందు చాలా విషణురాలై ఆమె రత్నా భరణములు లేకుండ, చాలా మలినమై, క్షీణించిన, తెల్లని వస్త్రంతో కప్పబడిన (24) తెల్ల వింజామరలు గల సఖులతో ఎప్పుడూ సేవింపబడుతున్నది. బక్కచిక్కిన ఉదరం కలిగి, ఆహారం లేకుండా ఉన్న, మాటిమాటికి ఊపిరి పీలుస్తున్న (ఎగశ్వాస) (25) విరహజ్వరంతో పీడితురాలై క్షణకాలం బ్రతుకుతుందేమో అన్నట్లున్న ఆమెను అక్కడ చూచాను. నీరేదో భూమేదో రాత్రేదో పగలేదో తెలియక ఉన్న, ఓహరి! (26) పరుడెవరో, పశువేదో తెలియక ఉన్న, తరువాతే మౌతుందో మంచి బంధువెవరో తెలియకున్న (అంతవివశురాలై) బ్రహ్మజ్ఞానం లేకుండా , నీ పాదాలనే స్మరిస్తూ (27) న్న ఆమెను చూచాను. కీర్తివహించిన మృత్యువు ముల్లోకాలలో ఇంకా కీర్తి వంతురాలౌతుంది. జ్ఞానహీనులైనా, దస్యులైనా స్త్రీ హత్యను కోరరు. (28) ఓ జగన్నాథ! కోరతగిన కరళీవనానికి శీఘ్రంగా వెళ్ళు. లోకాలకు రాధ బయటిదికాదు. నీయందే మనసు లగ్నం చేసింది. (29) నీకు చాలా భక్తురాలు, ఆమెను వదలొద్దు. ప్రభువైనవాడు ఎప్పుడూ రక్షించాలి. రాధను మించిన భక్తురాలు ఇప్పుడు లేదు గతంలో లేదు భవిష్యత్తులో ఉండదు. (30) మన్మథుడు శంకరునికి భయపడ్డాడు. నీవు ఆమెకు ముందున్నావు. నీలాంటి పతిని పొంది రాధకామదగ్గురాలైంది. (31) అందువల్ల సర్వునిపరమైన (విష్ణు) కర్మను, దాన్నెవరు తొలగిస్తారు. వసంతుడు వేధిస్తున్నాడు. చంద్రుడు ఎప్పుడూ కిరణాలతో (కిరణంతోనే) బాధిస్తున్నాడు.

మూII శశ్వత్సుగంధి వాయుశ్చాప్యనాథా సర్వపీడితా

తప్తకాంచన వర్ణాభా సాధునాకజ్జలోపమా

సువర్ణ వర్ణకేశీచ వాసోవేషవివర్జితా

స్వయం విధాతా త్వద్భక్తః సురాణాం ప్రవరోవిభుః

త్వద్భక్తః శంకరోదేవోయోగీంద్రాణాం గురోర్గురుః

సనత్కుమారస్త్వద్భక్తి గణేశోజ్ఞానినాం వరః

మునీంద్రాశ్చ కతివిధాః త్వద్భక్తా ధరణీతలే

త్వద్భక్తా యాదృశీరాధా న భక్తః తాదృశోపరః

ధ్యాయతే యాదృశీరాధా స్వయం లక్ష్మీర్నతాదృశీ

హరిరాహతిచేత్యేవం రాధాగ్రేస్వీకృతం మయా

శీఘ్రం గచ్చమహాభాగ తదేవసార్థకంకురు

ఉద్దవస్యవచః శ్రుత్వా జహాసోవాచ మాధవః

వేదోక్తం కథయామాస సహితం సత్యసువ్రతం

శ్రీభగవానువాచ :

స్త్రీషు నర్మవివా హేషు వృత్త్యర్దే ప్రాణసంకటే

గవామర్డే బ్రాహ్మణార్దే నానృతం స్యాజుగుప్పితం

తత్స్వీకారవిహీనేన కుతస్త్వం నరకః కుతః

గోలోకం యాతిమద్భక్త నరకం నహిపశ్యతి

త్వదంగీకార సాఫల్యం కరిష్యామి తథాపిచ

యాస్యామిస్వప్నే తన్మూలం గోపీనాం మాతురేవచ

ఇత్యాకర్ణ్యయణోగేహం ఉద్ధవశ్చ మహాయశాః

హరిర్జగామస్వప్నేచ గోకులం విరహాకులం

స్వప్నేరాధాం సమాశ్వాస్య దత్వా జ్ఞానం సుదుర్లభం

సంతోష్య క్రీడలో తాంచ గోపికాశ్చ యథోచితం

బోధయిత్వా యశోదాంచ స్తనం పీతాచ నిద్రితాం

గోపానోపశిశంశ్చైవ బోధయిత్వాయయౌ పునః

ఇతి బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే అష్ట నవతితమోధ్యాయః

ఎప్పుడూ మంచి వాసనగల వాయువు ఆమెను పీడిస్తోంది. ఆమె అనాథురాలైంది. అందరితో పీడింపబడుతోంది. ఆమె కాల్చిన బంగారం వంటి శరీరం రంగు గలది, కాని ఆమె ఇప్పుడు కాటుకలా నల్లగైనది. (33) బంగారు రంగు వంటి రంగుగల వెంట్రుకలు కలది. కాని ఇప్పుడు వస్త్రములు అలంకరణ లేకుండా ఉంది. బ్రహ్మ నీ భక్తుడు. ఆతడు దేవతలకు శ్రేష్ఠుడు, విభువు.         యోగీంద్రులకు గురువులైన వారికి గురువైన శంకరుడు నీ భక్తుడు. (34) సనత్కుమారుడు నీ భక్తుడు గణేశుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. ఎన్ని రకాలైన మునీంద్రులు భూమి పై ఉన్నారో వాళ్ళంతా నీ భక్తులు. (35) కాని రాధ నీకు ఎలాంటి భక్తురాలో, అలాటి భక్తుడు మరొకడు లేడు. రాధ నిన్ను ఎట్లా స్మరిస్తుందో, అట్లా లక్ష్మి కూడా నిన్ను స్మరించదు. (36) హరివస్తాడు అని రాధ ఎదుట నేను చెప్పాను. ఓ మహాభాగ! త్వరగా వెళ్ళు. నా మాటను సార్థకం చేయి. (37) అన్న ఉద్ధవుని మాటలను విని నవ్వి మాధవుడిట్లన్నాడు. వేదములలో చెప్పిన, మేలైన, సత్యమైన, మంచివ్రతాన్ని (మాటను) చెప్పాడు. (38) భగవంతుడిట్లన్నాడు. స్త్రీల విషయంలో, రహస్య వివాహములలో, ఉపాధి సందర్భంలో, ప్రాణ సంకటమందు, ఆవు కొరకు, బ్రాహ్మణుని కొరకు అబద్దము ఈసడించతగినది కాదు. (39) అది స్వీకరించనటువంటి నీవెక్కడ. నరకమెక్కడ. నా భక్తుడు గోలోకానికి పోతాడు, నరకాన్ని చూడడు. (40) అయినప్పటికి నీవు అంగీకరించిన దానిని సఫలం చేస్తాను. కలలో ఆమె దగ్గరకు వెళ్తాను గోపికల దగ్గరకు, నా తల్లి దగ్గరకు వెళ్తాను. (41) అనేమాట విని గొప్ప కీర్తిగల ఉద్ధవుడు తన ఇంటికి వెళ్ళాడు. హరికలలో విరహాకులమైన గోకులానికి వెళ్ళాడు. (42) కలలో రాధను ఓదార్చి చాలా దుర్లభమైన జ్ఞానాన్ని ఇచ్చి క్రీడతో ఆమెను సంతోషపరచి, గోపికలను తగిన విధంగా సంతోషపరచి (43) యశోదను మేల్కొలిపి, (జ్ఞానం) నిద్రపోతున్న ఆమె పాలు తాగి గోపాలురు, గోప శిశువులను జ్ఞానవంతులచేసి తిరిగి వెళ్ళిపోయాడు. (44) అని

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు తొంబది ఎనిమిదవ అధ్యాయము.