బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

19 - కాలీయదమన, దావాగ్ని మోక్షణములు 

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :

ఏకదా బాలకై: సార్ధం బలదేవం వినా హరి:

జగామ యమునాతీరం యత్ర కాలియ మందిరం

పరిపక్వ ఫలం భుక్త్వా యమునా తీరజే వనే

స్వేచ్ఛామయస్తృట్పరీత: వపౌ చ నిర్మలం జలం

గోకులం చారయామాస శిశుభి: సహ కాననే

విజహార చ తై: సార్ధం స్థావయామాన గోకులం  

క్రీడా నిమగ్న చిత్తోఽయం బాలకాశ్చ ముదాన్వితాః  

ఒకసారి బలరాముడు కాక ఇతర గోపబాలురందరతో కలిసి శ్రీకృష్ణుడు కాళియ నాగరాజు నివసించెడి యమునానదీ తీరమునకు పోయెను. ఆ నదీ. తీరమునందలి వనములో ఆరమగ్గిన పండ్లను భుజించి ఆ స్వేచ్ఛామయుడు దప్పిగొని నిర్మలజలము త్రాగెను. గోపశిశువులతో కలిసి ఆయరణ్యమున గో బృందమును మేపుచు అంతట సంచరించి ఒక చోట ఆ గోబృందమును నిలిపెను. క్రీడలయందు మునిగి అతడును గోపాల బాలురును సంతోషముగా నుండిరి.

భుక్త్వా నవ తృణం గావో విషతోయం వపుర్మునే

విషాక్తం చ జలం పీత్వా దారుణాంతక చేష్టయా

జ్వాలాభిః కాలకూటానాం సద్యః ప్రాణాంశ్చ తత్యజు:

దృష్ట్వా మృతం గోసమూహం గోపాశ్చింతాకులా భియా

విషణ్ణవదనాః సర్వే తమూచుర్మధుసూదనం  

జ్ఞాత్వా సర్వం జగన్నాథో జీవయామాన గోకులం

ఉత్తస్థున్తక్షణం గావో దదృశుః శ్రీహరేర్ముఖం  

ఓ నారదా ! లేతగడ్డి మేసిన గోబృందము విషజలము త్రాగినవి. విషమిశ్రమైన జలము ( కాళియుడు నివసించు యమునా నది మడుగులోనిది) త్రాగి కాలకూట విషజ్వాలలచేత బాధపడి క్రూరమైన అంతకుని (యముని) చేష్టచేత గోబృందమప్పటికప్పుడే ప్రాణములు విడిచెను. మరణించిన గో సమూహమును చూచి గోపాలకులు విచారముతో మనస్సులు చెదరి భయపడుచు విషాదముఖములతో 

అందరు వచ్చి మధుసూదనునకు చెప్పిరి. ఆ జగన్నాధుడంతయు తెలిసికొని గోబృందమును బ్రతికించెను. అదే క్షణములో ఆ గోవులన్నియు లేచి నిలబడి శ్రీహరి యొక్క ముఖమండలమును చూచినవి. 

కృష్ణః కదంబమారుహ్య యమునా నీరతీరజం

పపాత సర్పభవనే నాగమధ్యే నరాకృతిః

శతహస్త ప్రమాణం చ జలోత్థానం బభూవ హ

బాలా హర్షం విషాదం చ మేనిరే తత్ర నారద  

నరవేషధారియగు శ్రీకృష్ణుడు యమునా నది నీటి యొడ్డున పుట్టి పెరిగిన కడిమి చెట్టు నెక్కి ఆ కాళియుని భవనములో (నీటి మడుగులో) నాగముల (సర్పములు) మధ్య దుమికెను. ఓ నారదా ! అతడు దుముకుట వలన నూరు బారల యెత్తు జలము పైకెగిరెను. ఆశ్చర్యము ! అది చూచి గోప బాలురు ఒక్కసారి హర్షమును విషాదమును పొందిరి. 

నర్పో నరాకృతిం దృష్ట్వా కాలియ: క్రోధ విహ్వల:  

జగ్రాహ శ్రీ హరిం తూర్ణం తప్త లోహం యధా నరః :

దగ్ధ కంఠోదరో నాగశ్చోద్విగ్నో బ్రహ్మ తేజసా

ప్రాణా యాన్త్యేవ ముక్త్యా చ చకారోద్వమనం పునః

భగ్న దంతో రక్తముఖః కృష్ణవజ్రాంగ చర్వణాత్

రక్తవక్త్రస్య భగవానుత్త స్థే మస్తకోపరి

నాగో విశ్వంభరాక్రాంతః న ప్రాణాంస్త్యక్తుముద్యతః

చకార రక్తోద్యమనం పపాత మూర్ఛితో మునే  

నారదా ! మనుష్యాకారమున నున్న స్వామిని చూచి కాళియనాగుడు క్రోధము చేత పరవశుడై వెంటనే శ్రీహరిని పట్టుకొనెను. ఎఱ్ఱగా కాలిన లోహమును పట్టుకొన్న నరుని వలె ఆ పరమాత్మ తేజస్సుకు వాడు కంఠము కాలి కడుపు దగ్ధమై మిక్కిలి భయపడెను. “నా ప్రాణములు పోవుచున్నవి” అని పలికి, వాడు క్రక్కుకొనెను. శ్రీకృష్ణుని ప్రజము వంటి కఠిన శరీరమును కొరికి నములుట వలన కాళియుని పండ్లూడిపోయి నోటినిండ రక్తమయ్యెను. శ్రీకృష్ణ భగవానుడు వాని తలమీదికెగిరి పడగల మీద నిలిచెను. ఆ నాగుడు విశ్వము నంతయు తనలో భరించెడి పరమాత్మ చేత అట్లాక్రమింపబడి ప్రాణములు విడుచునంత స్థితికి వచ్చి రక్తమును కక్కి మూర్ఛిల్లెను. 

దృష్ట్వా తం మూర్ఛితం నాగా రురుదు: ప్రేమవిహ్వలా:

కేచిత్పలాయితా భీతా: కేచిత్ప్రవివిశుర్బిలం

మరణాభిముఖం కాంతం దృష్ట్వా సా సురసా నతీ

నాగినీభిః సహ ప్రేమ్ణా రురోద పురతో హరేః

పుటాంజలి యుతా తూర్ణం ప్రణమ్య శ్రీ హరిం భియా

ధృత్వా పాదారవిందే చ తమువాచ భియాఽకులా  

కాళియుడు మూర్చిల్లినది చూచి నాగులందరు ప్రేమ చేత మనస్సు వికలమై భోరున ఏడ్చిరి. కొందరు నాగులు భయపడి పారిపోయి బిలములలో చొచ్చిరి. తన భర్త మరణించనున్నట్లు గుర్తించి అతని భార్యయగు సురస తోడి నాగినీ స్త్రీలతో కూడి వచ్చి శ్రీకృష్ణుని ముందు కాంతుని మీద ప్రేమతో మిక్కిలి శోకించెను. వెంటనే భయముతో హస్తములు జోడించి శ్రీకృష్ణునకు నమస్కరించి అతని పాదారవిందములను పట్టుకొని భయము తత్తరపాటులతో స్వామితోనిట్లు పలికెను.

సురసోవాచ - సురన ఇట్లనెను : 

హే జగత్కాంత మే కొంతం దేహి మానం చ మానద

పతి: ఫ్రాణాధిక: స్త్రీణాం నాస్తి బంధుశ్చ తత్పరః

నకల భువననాథ ప్రాణనాథం మదీయం న కురు వధమనంత ప్రేమసింధో సుబంధో  

అఖిల భువనబంధో రాధికా ప్రేమసింధో పతిమిహ కురుదానం మే విధాతుర్విధాతః  

ఓ జగన్నాథా ! నా నాధునిమ్ము. ఓ గౌరవప్రద ! నాకోదరమిమ్ము. స్త్రీలకు భర్త ప్రాణముల కంటె అధికుడు. భర్తకన్న వేరొక బంధువు లేడు. ఓ సకలలోకేశ్వరా ! ఓ అనంతా ! ఓ ప్రేమ సముద్రుడా ! ఉత్తమ బంధూ ! నా ప్రాణనాధుని వధింపకుము. సమస్త జీవకోటికి బంధువైన వాడా ! రాధాదేవి ప్రేమ సముద్రుడా ! సృష్టికర్తను సృష్టించినవాడా ! నాకు పతిదానము చేయుము. 

త్రినయన విధిశేషా: షణ్ముఖశ్చాస్య సంఘైః స్తవన విషయ మౌఢ్యాత్ స్తోతుమీశాన వాణి

ఖలు నిఖిలవేదా: స్తోతుమన్యేఽపి దేవాః స్తవన విషయశక్తాః సంతి సంతస్తవైవ  

శంకరుడు బ్రహ్మ ఆదిశేషుడు కుమారస్వామి ఐదు నాల్గు వెయ్యి ఆరు ముఖములు గలవారు ఐనను - సరస్వతీ దేవి విద్యాదేవత ఐనను - నిన్ను స్తుతించు విషయము తెలియనందున స్తోత్రమొనర్చుటకు సమర్థులుగారు కదా! వేదములును ఇతర దేవతలును అంతియే. ఐనను కొందరు విద్వాంసులు నిన్ను స్తుతించు విషయమున శక్తి గలిగియున్నారు (అది నీ కృప).

 కుమతిరహ మధిజ్ఞా యోషితాం క్వాధమా వా

క్వ భువనగతిరీశశ్చక్షుషోఽగోచరోఽపి

విధి హరిహర శేషైః స్తూయమానశ్చ యస్త్వమతనుమనుజమీశం స్తోతుమిచ్ఛామి తం త్వాం  

స్త్రీలలో అజ్ఞరాలను అధమురాలను ఐన నేనెక్కడ !! కన్నులకు కన్పించనివాడవైనను లోకములకు లోక జనులకు పొందదగినవాడవు ఈశుడవునగు నీవెక్కడ !! బ్రహ్మ విష్ణుమహేశ్వర శేషులచేత స్తోత్రము చేయబడువాడవును ఒకే ఆకారమను నియమములేని మహాపురుషుడవును ఈశ్వరుడవగు నిన్ను స్తుతింప గోరుచున్నాను. (ఇది ఆశ్చర్యము). 

స్తవన విషయతా పార్వతీ కస్య పద్మా శ్రుతిగణ జనయిత్రీ స్తోతుమీశా న యం త్వాం

కలికలుష నిమగ్నా వేదవేదాంగ శాస్త్ర శ్రవణ విషయ మూడా స్తోతు మిచ్ఛామి కిం త్వాం  

ఎవని స్తోత్రమొనర్చుటకు పార్వతియు లక్ష్మియు వేదమాతయైన గాయత్రీదేవియు భయపడుచు నిన్ను స్తుతించుటకు సమర్థులు గాకున్నారో - కలి కల్మషములలో మునిగినదానను వేదవేదాంగ శాస్త్ర విషయములలో మూడురాలను అగు నేను నిన్నేమి శక్తి గలదాననని స్తుతింపగోరుచున్నాను.

శయానో రత్నపర్యంకే రత్నభూషణ భూషితః

రత్నభూషణభూషాంగో రాధావక్షసి సంస్థితః  

చందనోక్షిత సర్వాంగః స్మేరానన సరోరుహః

ప్రోద్యత్ప్రేమ రసాంభోధా నిమగ్న: సతతం సుఖాత్

మల్లికామాలతీ మాలాజాలై: శోభితశేఖరః

పారిజాత ప్రసూనానాం గంధామోదితమానసః

పుంస్కోకిల కలధ్వానైర్భ్రమర ధ్వని సంయుతైః

కుసుమేమ వికారేణ పులకాంకిత విగ్రహః  

ప్రియా ప్రదత్త తాంబూలం భుక్తవాన్ యస్సదా ముదా

వేదా ఆశక్తా యం స్తోతుం జడీభూతా విచక్షణాః

తమనిర్వచనీయం చ కిం స్తౌమి నాగవల్లభా  

రత్నాభరణములతో అలంకరింపబడిన సర్వావయవములు గలవాడును రత్నాల శయ్యమీద రాధాదేవి వక్షస్థలమున కానుకొని శయనించినవాడును సర్వాంగములందు చందనము పులుముకొన్నవాడును చిరునవ్వుతో వెలుగు ముఖ పద్మము గలవాడును ఉప్పొంగెడు 

ప్రేమ రససముద్రమున నెప్పుడు మునిగి సుఖముగా నున్నవాడును, మల్లెల మాలతుల పూమాలలతో శోభించు శిరము గలవాడును, పారిజాత పుష్పగంధమునకు తన్మయుడగువాడును, గండుకోకిలల మధుర ధ్వనులకు తుమ్మెదల ఛాతకు మన్మధ వికారము పొంది పులకరించు శరీరము గలవాడును ప్రియురాలు (రాధ) ఇచ్చిన తాంబూలము ముదముతోనెప్పుడును నములువాడును అగు స్వామిని స్తుతించుటకు వేదములశక్తములైనవి. పండితులు జడులైనారు. అట్టి అనిర్వచనీయుని నాగపత్నిని నేనేమి స్తుతించగలను.

వందేఽహం త్వత్పదాంభోజం బ్రహ్మేశ శేష సేవితం  

లక్ష్మీ సరస్వతీదుర్గా జాహ్నవీ వేదమాతృభిః

సేవితం సిద్ధ సంఘైశ్చ మునీంద్రైర్మనుభి: సదా  

బ్రహ్మ రుద్ర శేషుల చేత సేవించబడునదియు, లక్ష్మి సరస్వతి దుర్గ జాహ్నవి (గంగాదేవి) గాయత్రీదేవి సిద్ధ సంఘములు మునీంద్రులు మనువుల చేత ఎల్లప్పుడు సేవింపబడునదియునగు నీపాద పద్మమునకు నేను నమస్కరించుచున్నాను.

నిష్కారణాయాఖిల కారణాయ సర్వేశ్వరాయాపి పరాత్పరాయ

స్వయం ప్రకాశాయ పరావరాయ పరావరాణామధిపాయ తే నమః  

తనకింకొక మూలకారణము లేనివాడును మొత్తము ప్రపంచమునకు (జీవులు ప్రకృతి) మూలకారణమైనవాడును సర్వమునకు ఈశ్వరుడును ముక్త జీవుల కన్న శ్రేష్ఠుడును స్వయముగా ప్రకాశించువాడును ఇహపరములు (భుక్తి ముక్తులు) తన అధీనమైన వాడును బద్ధులు జ్ఞానులు ముక్తులు అన్న త్రివిధ జీవకోటికి ప్రభువునగు నీకు నమస్కారము. 

హే కృష్ణ హేకృష్ణ సురాసురేశ బ్రహ్మేశ శేషేశ సురానురేశ

మునీశ మన్వీశ చరాచరేశ సిద్ధీశ సిద్ధేశ గణేశ పాహి  

ఓ శ్రీకృష్ణ కృష్ణా ! దేవదానవులకు బ్రహ్మరుద్రులకు శేషునకు ప్రజాపతులకు మునీంద్రులకు మనువులకు చరాచరములకు (జీవులు ప్రకృతి) అణిమాద్యష్ట సిద్ధులకు అవి పొందిన సిద్ధుల గణములకు ప్రభువైనవాడా నన్ను కాపాడుము.

ధర్మేశ ధర్మీశ శుభాశుభేశ విదేశ వేదేష్వనిరూపితశ్చ  

సర్వేశ సర్వాత్మక సర్వబంధో జీవీశ జీవేశ్వర పాహి మత్ర్పభుం  

ధర్మదేవతానాథా! సృష్టి స్థితిలయ ధర్మముల పాలించు దేవతలకు నాధుడా! పుణ్యపాప కర్మలకీశుడా! వేదప్రభూ ! వేదములలో నిరూపింపబడని తత్త్వమూర్తీ ! సర్వేశ్వరా ! సర్వము నీవైన వాడా! సర్వజీవబంధూ! దేహములకు దేహధారులకు ప్రభువైనవాడా! నాభర్తను కాపాడుము.

ఇత్యేవం స్తవనం కృత్వా భక్తి నమ్రాత్మకంధరా

విధృత్య చరణాంభోజం తస్థౌ నాగేశ వల్లభా  

ఇట్లు స్తుతించి భక్తితో శిరస్సు వంచిన కాళియనాగరాజ పత్ని స్వామి పాదపద్మములను దృఢముగా పట్టుకొని నిలిచెను.

నాగపత్నీ కృతం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః

సర్వపాపాత్ ప్రముక్తస్తు యాత్యంతే శ్రీహరేః పదం

ఇహ లోకే హరేర్భక్తిమంతే దాన్యం లభేద్ద్రువం

లభతే పార్షదో భూత్వా సాలోక్యాది చతుష్టయం  

కాళియ నాగుని భార్య చేసిన స్తోత్రమును ప్రతిదినము మూడు సంధ్యాకాలములలో ఎవడు పఠించునో వాడు అన్ని పాపముల నుండి విముక్తుడై ఇహలోకమున క్రమముగా శ్రీహరి పాదభక్తిని తరువాత దాస్యభావమును అంత్యమున పరలోకములో శ్రీహరి స్థానమును పొంది గోలోకమున పార్షదులలో ఒకడై సాలోక్యాది ముక్తి చతుష్టయమును పొందును (33-34). 

నారద ఉవాచ - నారదుడనేను :

నాగపత్నీ పచః శ్రుత్వా భగవాన్ సర్వనందసః

ప్రహృష్టోతుల్ల నయనః కిమువాచ హరి: స్వయం II 

కథయస్వ మహాభాగ రహస్యం పరమాద్భుతం  

ఓ మహానుభావా! నాగపత్ని వాక్యమును విని మిక్కిలి హర్షము చేత వికసించిన నేత్రములు గలవాడును అందరి నానందపరచు వాడునగు భగవంతుడు శ్రీహరి స్వయముగా ఆమెతో నేమనెనో ఆ మిక్కిలి అద్భుతమైన రహస్యమును చెప్పుము.

(సూత ఉవాచ - సూతుడనెను)::

నారదస్య వచః శ్రుత్వా భగవాన్ సర్వదర్శన :  

ఉవాచ పరమాత్మానం మధుబృందం పదే పదే  

నారదుని వాక్కులు విని అందరిని సమముగా చూచెడి భగవంతుడగు నారాయణ మహర్షి ప్రతిమాటలో తేనె బిందువులు నింపుచు శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇట్లు చెప్పెను. 

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :

నాగపత్నీ వచః శ్రుత్వా శ్రీ కృష్ణస్తమువాచ హ

పుటాంజలియుతాం పాదే పతితాం భయవిహ్వలాం

భయము తొందరతో పాదముల మీదపడి చేతులు జోడించియున్న నాగపత్ని వాక్కులు విని శ్రీకృష్ణుడామెతో ఇట్లనెను. 

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను : 

ఉత్తిష్ఠోత్తిష్ఠ నాగేశి వరం వృణు భయం త్యజ

గృహాణ కాంతం హే మాతర్మద్వరాదజరామరం

కాలిందీ హ్రదముత్సృజ్య స్వకీయం భవవం ప్రజ

భర్త్రా సగోష్ఠ్యా సార్ధం చ గచ్ఛ వత్సే సుఖీ భవ

అద్య ప్రభృతి నాగేశి భూతా కన్యా చ త్వం మమ

త్వత్ప్రాణాధిక ఏవాయం జామాతా చ న సంశయః

మత్పాదపద్మ చిహ్నేన గరుడ స్త్వత్పతిం శుభే

కృత్వా చ స్తవనం భక్త్యా ప్రణమిష్యతి మత్పదం

త్యజ త్వం గరుడాద్భీతిం శీఘ్రం రమణకం వ్రజ  

హ్రదాన్నిర్గచ్ఛ వత్సే త్వం వరం వృణు యధేప్సితం  

ఓ నాగరాణీ లేలెమ్ము. భయము విడువుము. వరము కోరుకొనుము. ఓ తల్లీ! నా వరము వలన ముసలి తనము మరణము లేని నీ భర్తను స్వీకరించుము. బిడ్డా! ఈ కాళింది మడుగు విడిచి పెట్టి నీ భర్తతో నీ నాగనాగినీ గణముతో బాటు నీ స్వగృహమునకు పొమ్ము. సుఖవంతులు కండు. ఓ నాగరాణి నేటి నుండి నీవు నా కూతురువైతివి. నీకు ప్రాణముల కంటె అధికుడైన ఇతడు నాకల్లుడు. సందేహమక్కరలేదు. ఓ సుమంగళీ తలపై నా పాద చిహ్నములు గల నీ భర్తను గరుడుడు చూచి స్తోత్రము చేసి భక్తితో నా పాదములకు (చిహ్నములకు) నమస్కరించును. గరుడుని భీతిని వదిలివేయుము. ఈ ప్రదము (మడుగు) నుండి మీ నివాసమగు రమణకమునకు త్వరగా పొండు. బిడ్డా! నీకిష్టమైన వరము కోరుకొనుము. 

శ్రీకృష్ణస్య వచః శ్రుత్వా ప్రసన్నవదనేక్షణా

ఉవాచ సాశ్రు నేత్రా సా భక్తి నమ్రాత్మకంధరా  

శ్రీకృష్ణుని మాటలు విని ప్రసన్నమైన చూపులు ముఖము గలదై భక్తితో తన శిరస్సు వంచి అశ్రువులు నిండిన కన్నులతో ఆమె ఇట్లు పలికెను.

నురసోవాచ - సురస అనెను :

వరం దాస్యసి చేదానీం వరదేశ్వర మేఽపి చ

త్వత్పాదాబ్జే దృడాం భక్తిం నిశ్చలాం దాతుమర్హసి

మన్మనస్త్వత్పదాంభోజే భ్రమతు భ్రమరో యథా

తప స్మృతేర్విస్మృతిర్మే కదాఽపి న భవిష్యతి

స్వకాంతే మమ సౌభాగ్యం కాంతోఽయం జ్ఞానినాం వరః

ఇత్యేవం ప్రార్థనీయం చ పరిపూర్ణం కురు ప్రభో !

ఇత్యేవముక్త్వా సర్పస్త్రీ ప్రతస్తౌ పురతో హరేః  

వరములిచ్చువారికిని ప్రభువా! నాకు నీవిప్పుడు వరమొసగదలచితివేని నీ పాదపద్మములయందు నిశ్చలముగా నిలుచు ధృఢమైన భక్తిని నాకిమ్ము. కమలము మీదనే తుమ్మెద తిరుగునట్లు నా మనస్సు నీ పాదముల మీదనే ఎల్లప్పుడు చరించుచుండును గాక. సోకెప్పుడు గాని నీ స్మృతి తొలగకుండనుండుగాక. ఈ నా ప్రియనాధుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. నా సౌభాగ్యమితని మీదనే నిలిచియుండుగాక. ఇట్టి నా కోరిన కోరికను పరిపూర్ణము చేయుము అని పలికి ఆ నాగకాంత శ్రీహరి ముందు నిలిచెను. 

శరత్పార్వణ చంద్రాస్యం దదర్శ శ్రీహరేర్ముఖం

లోచనాభ్యాం పపౌ వక్త్రం నిమేష రహితం సతీ  

సర్వాంగ పులకోద్బిన్నా సానందాశ్రు పరిప్లుతో

సుందరం బాలకం దృష్ట్వా పుత్ర స్నేహం ప్రకుర్వతీ

ఉవాచ పునరేవేదం భక్త్యుద్రేక పరిప్లుతా  

ఆ సతి శరత్కాలపూర్ణిమ నాటి చంద్ర బింబము వంటి శ్రీకృష్ణ ముఖము దర్శించి రెప్పపాటు లేని కన్నులతో స్వామి ముఖ సౌందర్యమును త్రాగెను. సర్వాంగములు పులకరించగా ఆనంద బాష్పములు రాల్చుచు సుందరుడైన ఆ బాలకృష్ణుణి చూచి పుత్రుని మీదవలె ప్రేమను ప్రకటించుచు ఉప్పొంగిన భక్తి రసములో తడిసి మరల ఇట్లనెను. 

న యాస్యామి రమణకం తత్ర నాస్తి ప్రయోజనం

సర్ప: కరోతు సంసారం కురు మాం విజకింకరీం

న వాంఛా మమ హే కృష్ణ సాలోక్యాది చతుష్టయే

త్వత్పాదాంభోజ సేవాయాః కలాం నార్హంతి షోడశీం

వినా త్వత్సాద సేవాం చ యో వాంఛతి వరాంతరం

భారతే దుర్లభం జన్మ లబ్ధ్వాఽసౌ వంచిత: స్వయం

నాగవత్వ్యా వచః శ్రుత్వా స్మేరానన సరోరుహః

ప్రసన్నమానసః శ్రీమానోమిత్యేవమువాచ హ  

నేను రమణకమునకు పోను. నాకక్కడ పనిలేదు. ఈ నాగుడు సంసారము చేసుకొను గాక. నన్ను నీ సేవకురాలిని చేసి కొనుము. ఓ కృష్ణా ! నాకు సాలోక్యము మొదలగు నాల్గు విధముల ముక్తి పైనను కోరికలేదు. అవి నీ పాద పద్మ సేవలో పదహారవ వంతునకును పోలవు. నీ పాద సేవను కాకుండ వేరొక్క వరము నేనరుడైన కోరుకొన్నచో భరత వర్షమున దుర్లభమైన జన్మ పొంది కూడ తనను తాను వంచించుకొన్న (మోసగించుకొన్న) వాడగును. ఇట్లు పలికిన నాగపత్ని మాట విని చిరునవ్వుతో గూడిన ముఖపద్మము గల స్వామి ప్రసన్నమైన మనస్సుతో ఓం (అట్లే అగుగాక) అని అంగీకారము తెల్పెను.

ఏతస్మిన్నంతరే దివ్య: సద్రత్నసార నిర్మితః

ఆజగామ రధస్తూర్ణముద్దీప్త స్తేజసా మునే

పార్షద ప్రవరైర్యుక్తో వస్త్రమాలా పరిచ్ఛదః

శతచక్రో వాయువేగో మనోయాయీ మనోహరః

అవరుహ్య రథాత్తూర్ణం శ్యామలా: శ్యామకింకరా:  

ప్రణమ్య కృష్ణం తాం నీత్వా జగ్ముర్గోలోకముత్తమం  

ఓ నారదా ! ఇంతలో రత్నసార నిర్మితమైన దివ్యరథమొకటి గొప్ప తేజస్సుతో వెల్గుచు తొందరగా అక్కడికి వచ్చెను. దానికి నూరు చక్రములుండెను. అనేక వస్త్రములతో పూలదండలతో ఇతర సామగ్రితో కూడిన దాని మీద కొందరు పారదులుండిరి. మనస్సంకల్పమును బట్టి వాయువేగముతో నడచు సుందర రధము నుండి శ్యామసుందరుని (శ్రీకృష్ణుని) సేవకులు నల్లని వారు దిగివచ్చి శ్రీకృష్ణునకు నమస్కరించి ఆ నాగస్త్రీని తీసుకొని గోలోకమునకేగిరి. 

హరిశ్ఛాయాం వినిర్మాయ దదౌ సర్పాయ తేజసా

న చ కించిన్న బుబుధే మోహితో విష్ణుమాయయా

అవరుహ్య సర్పమూర్ధ్నః: శ్రీకృష్ణః కరుణానిధి:

దదౌ హస్తం చ కృపయా శీఘ్రం కాళియ మస్తకే

సంప్రాప్య చేతనాం సద్యో దదర్శ పురతో హరిం

పుటాంజలియుతాం సాశ్రుపూర్ణాం చ సురసాం సతీం

ప్రణనామ హరిం సద్యో రురోద ప్రేమవిహ్వల:  

శ్రీహరి తన మహిము చేత నాగపత్ని యొక్క ఛాయారూపమును నిర్మించి నాగునకిచ్చెను. విష్ణుమాయతో మోహితుడైన (తెలియకున్న) కాళియుడీ విషయమేదియు తెలిసికొన లేకపోయెను. దయానిధియైన శ్రీకృష్ణుడు సర్పశిరస్సు (పడగ) నుండి దిగి కృపతో కాళీయుని శిరస్సును చేతితో స్పృశించెను. అప్పుడు వాడు తెలివి పొంది తనముందున్న శ్రీహరిని చేతులు జోడించి కన్నుల నీరు నింపుకొనుచున్న తన భార్యయగు సురసను చూచి వెంటనే ప్రేమ పట్టజాలక స్వామికి నమస్కరించెను మరియు రోదించెను. 

భక్త్యుద్రేకాత్సాశ్రునేత్రాం పులకాంకిత విగ్రహం

తూష్ణీం భూతాం చ తాం దృష్ట్వా నమువాచ కృపానిధి:  

యదీశ్వరస్య సతతం యోగ్యాయోగ్యే సమా కృపా  

ఉప్పొంగిన భక్తి వలన బాష్ప నేత్రయై పులకరించిన శరీరముతో మాట్లాడకుండ నిలిచియున్న ఆమెను (ఛాయారూపమున నున్న నాగకాంతను) చూచిన దయానిధి యైన శ్రీహరి ఇట్లు పలికెను. ఈశ్వరునకు యోగ్యునియందు అయోగ్యుని యందును ఎల్లప్పుడు కృప సమానముగా నుండును గదా. 

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను : 

వరం వృణు త్వం కాళీయ యస్తే మనసి వర్తతే

త్వం మే ప్రాణాధికో వత్స సుఖం తిష్ఠ భయం త్యజ

తస్యాహమనుగృహ్ణామి యోఽతిభక్తో మమాంశజః

కించిత్రద్ధమనం కృత్వా సుప్రసాదం కరోమ్యహం

త్వద్వంశజాతాన్ సర్సాంశ్చ హంతి యో మానవాధమః  

బ్రహ్మహత్యా సమం పాపం భవితా తస్య నిశ్చితం

మత్పాద పద్మ చిహ్నే యః కరోతి దండతాడనం

ద్విగుణం బ్రహ్మ హత్యాయా భవితా తస్య కిల్బిషం

లక్ష్మీర్యాస్యతి తధ్గేహాచ్ఛావం దత్వా సుదారుణం

వంశాయుర్యశసాం హానిర్భవితా తస్య నిశ్చితం

ధ్రువం వర్షశతం కాలసూత్రే యాస్యతి మధ్గిరా

త్వత్ప్రమాణా: కీటసంఘా దంశిష్యంతి చ సతతం

భోగాంతే జన్మ లబ్ధ్వా చ తన్మృత్యుస్తన్య దంశనాత్

తన్య వంశోద్భవానాం చ త్వద్వంశాద్భవితా భయం

యే చ త్వద్వంశజాన్ దృష్ట్వా మపదాంకం మదీయకం

ప్రణమిష్యంతి భక్త్యా తే ముచ్యంతే సర్వపాతకాత్

గచ్ఛ శీఘ్రం రమణకం త్యజ భీతిం ఖగాధిపాత్

మత్పాదాంకం మూర్ద్ని దృష్ట్యా త్వాం భక్త్యా ప్రణమిష్యతి

తవ త్వద్వంశజానాం చ గరుడాన్న భయం క్వచిత్

సర్వేషాం జ్ఞాతి సర్పాణాం వరోఽద్య భవ మద్వరాత్

వరం కిం పరమం వత్స వాంఛితం వరమాధునా

భయం త్యక్త్వా కధయ మాం త్వదీయం దుఃఖ భంజనం  

ఓ కాళియుడా! నీ మనస్సున గల వరము కోరుకొనుము. నీవు నాకు ప్రాణాధికుడవు. బిడ్డా! సుఖముగా నుండుము. భీతిని వద లుము. నా అంశతో పుట్టినవాడెవరో నాయందతి భక్తుడెవడో వానిని కొంచెము శిక్షించి అనుగ్రహింతును. నా దయకు పాత్రుని జేతును. ఏనరాధముడు నీ వంశజాతులైన సర్పములను హత్యచేయునో వానికి బ్రహ్మహత్యతో సమానమైన పాపమేర్పడును. ఇది నా నిశ్చయము. నా పాద చిహ్నము మీద (పాద చిహ్నము గల పడగ మీద) ఎవడు కఱ్ఱతో కొట్టునో వానికి బ్రహ్మహత్యకు రెండింతల పాపము సంభ వించును. లక్ష్మీదేవి వానికి ఘోరమైన శాపమిచ్చి వాని గృహము నుండి వెడలిపోవును. వానికి నిశ్చయముగా కీర్తి నశించును. వంశస్థుల ఆయుష్యము నశించును. వాడు నూరేండ్లు నా వాక్కు వలన కాలసూత్ర నరకము పొందును. అక్కడ వానిని నీ శరీరమంత నుండు పురుగుల గుంపులు సర్వదా కరచుచుండును. (కొరుకుచుండును) ఆ నరకానుభవము తరువాత వాడు భూమిపై జన్మించి పాము కరిచి మరణించును. . అతని వంశమున పుట్టినవారికి కూడ నీవంశము వారి వలన (సర్పముల వలన) భయము కల్గును. ఎవరు నాపాద చిహ్నములు తలపై గల సర్పములను చూచి భక్తితో నమస్కరింతురో వారు సమస్త పాపముల నుండి విమోచనము పొందుదురు. నీవు త్వరగా రమణకమునకు వెళ్లిపొమ్ము. గరుడుని భయము త్యజింపుము. నా పాద చిహ్నమును నీ తలపై చూచి వాడు నీకు భక్తితో నమస్కరించును. నీకును నీవంశమున పుట్టినవారికిన ఎప్పుడు గాని ఎక్కడ గాని గరుడ భయము లేదు. నీవు నా వరము వలన నీ 

మొత్తము జాతి వర్గమునకు (సర్పములకు) నేటినుండి రాజువు కమ్ము. వత్సా! నీకు శ్రేష్ఠమైన ఏ వరమందు కోరికయో దానినిప్పుడు కోరుకొనుము. భయము విడిచి నీ దుఃఖమును దేనిని నశింపజేయవలెనో నాకు చెప్పుము. 

శ్రీ కృష్ణవచనం శ్రుత్వా కాలియః కంపితో భియా

పుటాంజలి యుతోభూత్వా తమువాచ భుజంగమః  

శ్రీకృష్ణుని మాటలు విన్న కాళియుడు భయముతో వణుకుచు హస్తములు జోడించి (నమస్కరించుచు) స్వామితో ఈ క్రింది విధముగా పలికెను. 

కాలియ ఉవాచ - కాళియుడనెను : 

వరేఽన్యస్మిన్ మము విభో వాంఛా నాస్తి వరప్రద

భక్తిం స్మృతిం త్వత్పదాబ్జే దేహి జన్మని జన్మని

జన్మ బ్రహ్మకులే వాఽపి తిర్యగ్యోనిషు వా సమం  

తద్భవేత్సఫలం యత్ర స్మృతిస్త్వచ్చరణాంబుజే

తన్నిష్ఫల: స్వర్గవాసో నాస్తి చేత్త్వత్పదస్మృతిః

త్వత్పద ధ్యానయుక్తన్య యత్త్రత్ స్థానం చ తత్పరం

క్షణం వా కోటి కల్పం వా పురుషాయుః క్షయోఽస్తు వా  

యది త్వర్పేవయా యాతి సఫలో నిష్పలోఽథవా

తేషాం చాయుర్వ్యయో నాస్తి యే త్వత్పాదాబ్జ సేవకాః

న నంతిజన్మమరణ రోగ శోకాతిభీతయః

ఇంద్రత్వే వాఽ మరత్వే వా బ్రహ్మత్వే చాతిదుర్లభే

వాంఛా నా స్త్యేవ భక్తానాం త్వత్పాద సేవనం వినా

సుజీర్ణపట ఖండన్య సమం నూతనమేవ చ

పశ్యంతి భక్తా: కించాన్యత్సాలోక్యాది చతుష్టయం

సంప్రాప్తస్త్వన్మసుర్ర్బహ్మన్ననంతాద్యావదేవ హి

తావద్భక్తావనే నైవ త్వద్వర్ణోఽహమనుగ్రహాత్  

ఓ వరప్రదుడా ! వ్యాపకుడా! నాకితర వరములందు కోరికలేదు. నీ పదాబ్జములందలిని భక్తిని స్మృతిని నాకు జన్మజన్మకు కల్గునట్లు వరమిమ్ము. వేదము లెరిగిన బ్రాహ్మణుడుగానైనను లేదా తిర్యగ్జంతువుగా (వెన్నెముక అడ్డముగా నుండు పశుమృగ పక్షులు) నైనను ఏ జన్మనెత్తినప్పటికిని నీ పాదపద్మములందు స్కృతియుండునేని ఆ జన్మ సఫలము. నీ పాద స్మరణ లేనిచో స్వర్గ లోక నివాసము నిష్పలము. నీ పాద ధ్యానము గలవానికి ఏ స్థానమైనను శ్రేష్ఠమైనదే. ఒక జీవి జీవితము క్షణకాలముగాని కోటి కల్పములు గాని నూరేండ్ల పురుషాయువు లేక అల్పాయువు గాని నీ సేవతో అది గడచునేని సఫలము. కానిచో వ్యర్థము నిష్ఫలము. నీ పాదపద్మముల సేవించు సేవకులకు ఆయుః క్షీణము గాని జన్మమరణ రోగ శోకములు గాని అతిభీతి గాని కలుగవు. భక్తులకు నీ పాదసేవయందు తప్ప దేవత్వము (దేవతలలో నొకడు కావలెనన్న భావన) నందు గాని ఇంద్ర పదవియందు గాని అతి దుర్లభమైన బ్రహ్మ పదవి యందు గాని వాంఛ యుండదు. మిక్కిలి చినిగి పాతబడిన వర్రపు పీలికను (చిన్న భాగము) క్రొత్త వస్త్రమును సమముగా 

భావించు భక్తులకు సాలోక్యాది చతుర్ముక్తులను గూర్చి అపేక్షయుండదు కదా. నాగరాజగు అనంతుని నుండి నీ మనువును (మంత్రము) నుపదేశము పొందిన నేను నీవాడనై నీ దయ వలన నీ భక్త రక్షణ దీక్షలో రక్షింపబడితిని. 

మాం చ భక్తమవక్వం వా విజ్ఞాయ గరుడః స్వయం

దేశాద్దూరం చ స్యక్కారం చకార దృఢ భక్తిమాన్

భవతా చ దృఢాం భక్తిం దత్త్వా మే వరదేశ్వర

సచ ఉక్తశ్చ భక్తోఽహం న మాం త్యక్తుం క్షమోఽధునా

త్వత్పాదపద్మ చిహ్నాక్తం దృష్ట్వా శ్రీమస్తకం మమ

సదోషం గుణయుక్తం మాం సోఽధునా త్యక్తుమక్షమః

మమాఽరాధ్యాశ్చ నాగేంద్రా న తద్వధ్యోఽహమీశ్వర

భయం న కేభ్యః సర్వత్ర తమనంతం గురుం వినా  

నీయందు దృఢభక్తి గల గరుడుడు జ్ఞానపరివేక్వత లేని భక్తి లేని నన్ను గుర్తించి నా నివాస స్థానము నుండి నన్ను దూరముగా తొలగించి వేసెను. ఓ వరము లిచ్చు ఈశ్వరా ! నాకు నీవు దృఢభక్తిని అనుగ్రహించితివి. నీ పాద పద్మచిహ్నముల ముద్రలు గల నా శిరస్సునతడు చూచి నీ భక్తుడనని “ఇక ఇప్పుడు నన్ను నీవు విడిచి యుండవలదు” అని పల్కును. దోషములు గలవాడనైనప్పటికి నీ భక్తి యన్న గుణము గలవాడను కనుక ఇక నన్నతడు వదలజాలడు. నాకు పూజ్యులైన నాగేంద్రులిక నన్ను వధింపరు.. నా గురువగు 

అనంతుని యెడల తప్ప నాకెక్కడ ఎవరి వలన గాని భయము లేదు.

యం దేవేంద్రాశ్చ దేవాశ్చ మునయో మనవో నరాః  

స్వప్నే ధ్యానే న పశ్యంతి చక్షుషోర్గోచర: నమే

భక్తానురోధాత్సాకారః కుతస్తే విగ్రహో విభో

సగుణస్త్వంచ పాకారో నిరాకారశ్చ నిర్గుణః

స్వేచ్ఛామయః సర్వధామ సర్వబీజం సనాతనం

సర్వేశామీశ్వర: సాక్షి సర్వాత్మా సర్వరూపధృక్

బ్రహ్మేశ శేషధర్మేంద్రా వేదవేదాంగ పారగా:

స్తోతుం తమీశం యే జాడ్యా: సర్ప: స్తోష్యతి తం విభుం

హేనాధ కరుణాసింధో దీనబంధో క్షమాధమం  

ఖలస్వభావాదజ్ఞానాత్ కృష్ణ త్వం చర్వితో మయా

నాస్త్రలక్ష్యో యధాఽకాశో న దృశ్యాంతో న లంఘ్యకః

న స్పృశ్యో హి స చావర్య స్తథా తేజ స్త్వమేవ చ

ఇత్యేవ ముక్త్వా నాగేంద్రః పపాత చరణాంబుజే  

దేవతల ప్రభువులు దేవతలు మునులు మనువులు మానవులు స్వప్నములో గాని ధ్యానించి గాని ఏ స్వామిని చూడజాలరో అట్టివాడు నాకు కన్నులకు గోచరించినాడు. “ఓ ప్రభూ! నిరాకారుడవు నిర్గుణుడవగు నీవు భక్తుల ఒత్తిడి వలన సగుణుడవు సాకారుడవగుచున్నావు కాని నీకు విగ్రహమెక్కడిది ? నీ యిచ్చా సంకల్పములను బట్టి మారువాడవు. ఓ సర్వము నివాసముగా గలవాడా! సర్వమునకు నీవు సనాతన బీజమువు. సర్వజీవకోటికి ప్రభువువు. అందరి చర్యలకు సాక్షివి. సర్వమునకాత్మవు సర్వరూప థారివి నీవు. బ్రహ్మ, రుద్రుడు ఆదిశేషుడు ధర్మదేవత వేదవేదాంగ వేత్తలు ఏ ప్రభువును స్తుతించుటకు మందబుద్ధులో (బుద్ధి శక్తి లేని వారు) అట్టి ప్రభువును ఒక సర్పము స్తుతించుచున్నది. ఓ నాధుడా ! కరుణాసముద్రుడా ! దీనబంధూ! ఈ అధముని క్షమించుము. పుట్టుకతో వచ్చిన దుర్జనత్వము వలన దానికి తోడున్న అజ్ఞానము వలన నేను నిన్ను నమిలితిని. ఆకాశమును అస్రములతో భేదింపబడనట్లు నీ అంతు చూడరాదు, నిన్ను దాటరాదు, నిన్ను తాకరాదు, నిన్ను చుట్టి తిరుగరాదు, నీవు తేజోమూర్తివి" అని నాగరాజు పలికి శ్రీకృష్ణుని పాదపద్మములపై పడెను.

ఓ మిత్యుక్త్వా హరిస్తుష్టః సర్వం తస్మై వరం దదౌ  

శ్రీహరి సంతుష్టుడై సరియే అట్లే అగుగాక అని సర్వవరములిచ్చెను.

నాగరాజకృతం స్తోత్రం ప్రాతరుత్థాయ యః పరేత్

తద్వంశ్యానాం చ తస్యైవ నాగేభ్యో న భయం భవేత్

స నాగశయ్యాం కృత్వైవ స్వప్తుం శక్తః సదా భువి

విష పీయూషయోర్భేదో నాస్త్యేవ తస్య భక్షణే

నాగగ్రస్తే నాగఘాతే ప్రాణాంతే విషభోజనాత్

స్తోత్రస్మరణ మాత్రేణ సుస్థో భవతి మానవః

భూర్జే కృత్వా స్తోత్రమిదం కంఠే వా దక్షిణే కరే

బిభర్తి యో భక్తియుక్తో నాగేభ్యోఽపి న తధ్బయం

యత్ర గేహే స్తోత్రమిదం నాగస్తత్ర న తిష్ఠతి

విషాగ్ని వజ్ర భీతిశ్చ న భవేత్తత్ర నిశ్చితం

ఇహ లోకే హరేర్భక్తిం స్మృతిం చ సతతం లభేత్  

అంతే చ స్వకులం పూత్వా దాస్యం చ లభతే ధ్రువం  

కాళియనాగరాజోనర్చిన ఈ స్తోత్రము నే మానవుడు ప్రాతః కాలమున లేచి పఠించునో వానికిని వాని వంశమున పుట్టిన వారికిని సర్పముల భయముండదు. వాడీ భూమి మీద ఎల్లప్పుడు నాగమును శయ్యగా (పడక) చేసికొని నిద్రించుటకు శక్తుడగును. నాగగ్రస్తుడైనను (నాగము చేత కొరుకబడినవాడు) నాగము కాటు దెబ్బ తిన్నను విష భోజనము చేయుట వలన ప్రాణములు పోవు స్థితిలోనున్నను ఈ స్తోత్రమును స్మరించినంతలోనే మానవుడారోగ్యవంతుడగును. ఈ స్తోత్రమును భూర్జపత్రము మీద వ్రాసి భక్తి యుక్తుడై ఎవడు కంఠమున గాని దక్షిణ హస్తమునగాని ధరించునో వానికి సర్పముల భయముండదు. ఏ గృహమున ఈ స్తోత్రముండునో అక్కడ సర్పములుండవు. అక్కడ విషము వలన అగ్ని వలన పిడుగు పాటు వలన భయమేర్పడదన్నది నిశ్చయము. ఈ స్తోత్రము తలంచువాడీ లోకమున నెల్లప్పుడు హరి భక్తిని హరి స్మృతిని కలిగియుండి చివరకు తన వంశమును పవిత్రమొనర్చి అంత్యమున హరిదాస్య ముక్తిని పొందునన్నది నిశ్చయము. 

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను :

నాగేంద్రాయ వరం దత్వా పునస్తం జగదీశ్వరః

ఉవాచ మధురం వాక్యం పరిణామ సుఖావహం  

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు నాగరాజునకిట్లు వరమిచ్చి తరువాత సుఖము కూర్చునట్టి మధుర వాక్యమిట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :

గచ్ఛ త్వం చ రమణకం యథేంద్ర నగరం పరం

సార్థం స్వగోష్ఠ్యా నాగేంద్ర యమునా జలవర్త్మనా

శ్రత్వా నాగో హరేరాజ్ఞాం రురోద ప్రేమ విహ్వల:

కదా ద్రక్ష్యామి త్వత్పాద పద్మం నాధేత్యువాచ హ

ప్రణమ్య శతకృత్వశ్చ స్త్రీయా గోష్ఠ్యా సహేశ్వరం

జగామ జలమార్గేణ నాగేంద్రో విరహాతురః

యమునా హ్రద తోయం చ బభూవామృత కల్పకం

ప్రసన్నా జంతవ స్సర్వే బభూవుస్తేన నారద

గత్వా దదర్శ భవనం యధేంద్ర నగరం పరం  

ఆజ్ఞయా చ కృపాసింధోర్నిర్మితం విశ్వకర్మణా

తత్ర తస్థౌ చ నాగేంద్ర: ప్రియా పుత్రగణైః సహ  

నిశ్శంకో హర్ష యుక్తశ్చ హరిభావన తత్పరః

ఇత్యేవం కథితం సర్వం హరేశ్చరిత మద్భుతం

ముఖదం మోక్షదం సారం పరం కిం శ్రోతుమిచ్ఛసి  

“ఓ నాగరాజూ! నీ బలగముతో బాటు యమునా నదీజలమార్గము ద్వారా ఇంద్ర నగరము వలె శ్రేష్ఠముగానున్న నీ రమణక ప్రదేశమునకు వెడలిపొమ్ము.” కాళియుడు హరియాజ్ఞ విని ప్రేమ విహ్వలుడై ఏడ్చెను. ఓ నాథా! నీ పాదపద్మములను తిరిగి ఎపుడు దర్శింతును' అని స్వామికి భార్యతో గణముతో బాటు నూరుమార్లు ప్రణామములొనరించి స్వామి ఎడబాటుకు బాధపడుచు నాగేంద్రుడు జలమార్గమున వెడలిపోయెను. ఆ తరువాత యమున మడుగులోని నీరు అమృతము వలెనాయెను. అక్కడి జంతువులన్నియు కాళియుడు వెడలిపోవుట వలన సంతసము ప్రశాంతత గలవయ్యెను. ఆ దయాసముద్రుడైన హరియాజ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఇంద్ర 

నగరము వంటి తన భవనమును (రమణకమును) చూచి నాగరాజు భార్యతో పుత్రగణములతో బాటు భయరహితుడై హర్షయుక్తుడై శ్రీహరి ధ్యాన తత్పరుడై అక్కడ కాపురముండెను. ఓ నారదా! ఇట్లు అద్భుతమైన హరి చరిత్రము మొత్తము సుఖదాయకము మోక్షదాయకమైన దానిని సారవంతమైన దానిని చెప్పితిని. ఇంకేమి వినగోరుదువు?  

సూత ఉవాచ - సూతుడనెను :

మహర్షేర్వచనం శ్రుత్వా నారదో హర్ష విహ్వలః

ఋషిం వవ్రచ్ఛ సందేహం సర్వసందేహ భంజనం  

నారాయణ మహర్షి వచనములను విని నారదుడు హర్షము పట్టజాలక పరవశుడై అన్ని సందేహములను తీర్చు ఒక సందేహమును నారాయణ మహర్షి నడిగెను.

నారద ఉవాచ - నారదుడనెను :

కథం విహాయ కాలీయ: స్వపూర్వ భవనం పరం

జగామ యమునా తీరం తన్మే బ్రూహి జగద్గురో  

ఓ జగద్గురూ! కాళియుడు శ్రేష్ఠమైన తన పూర్వ నివాస భవనమును వదిలి పెట్టి యమునా తీరమున కెందుకు పోయెను? నాకది చెప్పుము. 

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి వల్కెను :

శ్రుణు నారద వక్ష్యేహమితిహాసం పురాతనం  

యచ్చ్రుతం ధర్మవక్త్రాన్మే మలయే సూర్యపర్వణి

కృష్ణాఖ్యాన ప్రసంగేన నుప్రభాపశ్చిమే తటే

వవ్రచ్ఛ ధర్మం పులహః కథితం మునిసంసది

ఇదమాఖ్యాసమాశ్చర్యమువాచ తం కృపానిధిః

తత్ర శ్రుతం మయా విప్ర నిబోధ కధయామి తే

శేషాజ్ఞయా నాగగణాః ప్రతి సంవత్సరం ఖియా

కార్తికీ పూర్ణిమాయాం తు కుర్వంతి గరుడార్చనం

పుష్పైరూపైశ్చ దీపైశ్చ నైవేద్యైర్బలిభిర్ముదా  

పుష్కరే చ మహాతీర్దే సుస్నాతా భక్తి సంయుతా:  

నారదా! వినుము. సూర్యగ్రహణకాలమందు మలయ పర్వత సమీపమున సుప్రభానది పడమటి ఒడ్డున కృష్ణ కథాప్రసంగమేర్పడిన సందర్భమున మాతండ్రి ధర్మఋషి ద్వారా నేను విన్న పురాతణేతిహాసము చెప్పుచున్నాను. ఆనాడు మునుల సభలో పులహడు ధర్మఋషి నడుగగా ఆశ్చర్యకరమైన ఈ ఆఖ్యానమును ఆ దయానిధి చెప్పెను. అక్కడ నేనిది వినియుంటిని. నాగరాజగు శేషుని ఆజ్ఞ ప్రకారము నాగ గణములు ప్రతిసంవత్సరము కార్తీక పూర్ణిమనాడు భయముతో గరుడార్చన చేయుచుండిరి. వారు పుష్కర తీర్ధమున చక్కగా స్నానమాడి భక్తియుతులై పుష్పములు ధూపదీపములు నైవేద్యములు బలులు సమర్పించి ముదముతో గరుడుని పూజించుచుండిరి. 

తస్య పూజాం చ కాలీయో న చకారాత్యహంకృతః

నాగపూజోపకరణం బలాద్భక్షితుముద్యతః

చక్రుర్నివారణం నాగా నీతిమూచుర్మదోద్దతం

న శక్తా వారణే తే చేత్యా విర్భూత: ఖగేశ్వరః

దృష్ట్వా ఖగేశ్వరం నాగా: కాళీయ ప్రాణ రక్షయా

ప్రాణశక్త్యా చ యుయుధుర్యావత్సూర్యోదయం మునే !

పక్షీంద్ర తేజసా సర్వే సముద్విగ్నా: పలాయితాః

అనంతం శరణం జగ్ము: సర్వేషామభయప్రదం  

కాళియుడు మిక్కిలి అహంకరించి అందరివలె గరుడుని పూజింపక నాగులు కూర్చుకొన్న పూజాద్రవ్యమును బలవంతముగా తినబూనెను. ఆ మదోద్ధతుని (గర్విష్టిని) నాగులు నివారించి నీతిని బోధించిరి. కాని వారు నివారింపజాలకుండిరి. అప్పుడు గరుడుడు 

ఆవిర్భవించెను. (ప్రత్యక్షమయ్యెను. వచ్చెను) ఆ పక్షిరాజును చూచి కాళీయుని ప్రాణములు రక్షించుటకై తమ ప్రాణశక్తులు కూడగట్టుకొని సూర్యోదయమగు వరకు నాగులు గరుడునితో యుద్ధము చేసిరి. ఆ పక్షిరాజు తేజస్సు (పరాక్రమము)నకు మిక్కిలి భయపడి వారందరు పారిపోయి అందరికభయ మిచ్చెడి అనంతనాగరాజును శరణు పొందిరి. 

పలాయన పరాన్ దృష్ట్వా నాగాంశ్చ కరుణానిధి:

తత్ర తస్థౌ చ నిశ్శంకః కాలీయన్తం దదర్శ హ

స్మృత్వా హరిపదాంభోజం కాలీయో యుయుధే మునే

ముహూర్తం చ తయార్యుద్ధం బభూవాతీవ దారుణం

పరాజితశ్చ సాగేంద్ర స్తేజసా గరుడన్య చ  

భియా పలాయనం కృత్వా జగామ యమునా హ్రదం

న తం సౌభరిశాపేన ఖగేంద్రో గంతుమీశ్వరః

తత్ర తస్థౌ భియా నాగో జగ్ముః పశ్చాచ్చ తధ్గణాః  

పారిపోవుచున్న నాగులను చూచి దయానిధియగు గరుడుడు అక్కడ నిలిచెను. భయములేని కాళియుడతనిని చూచి హరిపాదములు తలచి యుద్ధము చేసెను. ఒక ముహూర్తకాలము వారిద్దరికి భయంకర యుద్ధము జరిగెను. గరుడుని పరాక్రమమునకు నాగరాజోడిపోయి భయముతో పారిపోయి యమునా నది మడుగును చేరెను. సౌభరిముని శాపము మూలమున గరుడుడక్కడికి పోజాలకుండెను. కాళీయుడు గరుడ భయముతో అక్కడనే నివాసముండెను. అతని గణములు తరువాత పోయి చేరిరి. 

నారద ఉవాచ - నారదుడనెను: 

కథం తు సౌభరే: శాపో బభూవ గరుడాయ వై

కథం న శక్తో గంతుం తం హ్రదమీశ్వర వాహనః  

గరుత్మంతునకు సౌభరి శాపమెట్లు సంభవించెను. పరమ ప్రభువు యొక్క వాహనమగునతడు ఆ మడుగున కెట్టు పోజాలకుండెను. 

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను : 

దివ్యం వర్ష సహస్రం చ వర్షాణాం తత్ర సౌభరి:  

తవస్తప్త్వా మహాసిద్ధో దద్ధ్యౌ కృష్ణ పదాంబుజం

సమీ పే ధ్యాయమానస్య కూలే చ యమునా జలే  

గణేన సార్ధం నిశ్శంకః కరోతి భ్రమణం ముదా

పుచ్ఛముత్ఫాల్య బహధా పరితః పరమేచ్ఛయా  

మునిం ప్రదక్షిణీకృత్య యాత్యాయాతి ముదాన్వితః

సకులం సుమహాత్మానం దర్శం దర్శం ఖగాధిపః  

జగ్రాహ చంచునా మీనం మునీంద్రస్య సమీపతః

గచ్ఛంతం మీనముఖం దదర్శ కోప చక్షుషా  

ప్రకోపితో మునేర్దృష్ట్యా మీనస్తోయే పపాత హ

తమువాచ మునీంద్రశ్చ పునరాదాతుముద్యతం  

మీనశ్చ గరుడ త్రాసాత్త స్థౌ ముని సమీపతః  

సౌభరిముని వేయి దేవతా సంవత్సరములు తపస్సు చేసి మహాసిద్ధి (అణిమాద్యష్ట సిద్ధులతో బాటు) పొంది శ్రీకృష్ణ పాదపద్మముల ధ్యానించెను. యమునా నది యొడ్డు సమీపమున నతడు ధ్యానము చేయుచుండగా పక్షిరాజగు గరుత్మంతుడు యమునానదీ జలములో భయము లేకుండ తన గణముతో బాటు సంతోషముగా తిరుగుచుండెను. అనేక విధములుగా తన తోకను ఎత్తి విసురుచు స్వేచ్చగా ముని చుట్టు ప్రదక్షిణము చేసి ఉల్లాసముతో వచ్చుచు పోవుచుండెను. తన గణముతో బాటు ఆ మహానుభావుని చూచుచూ చూచుచూ అతని సమీపమున (జలములో) నున్న చేపను ముక్కుతో పట్టుకొనెను. చేప వైపు పోవుచున్న గరుడుని మునీంద్రుడు కోపదృష్టితో చూడగనే చేప నీటిలో పడెను. మరల దానిని పట్టుకొనుటకు ముందే చేప గరుడ భయముతో ముని సమీపమున (శరణముగా) నిలిచెను. దానిని పట్టబోవుచున్న గరుడినితో మునీంద్రుడిట్లనెను. 

సౌభరిరువాచ - సౌభరిముని ఇట్లనెను : 

గచ్ఛ దూరం గచ్ఛ దూరం ఖగేంద్ర మత్సమీవతః  

కా యోగ్యతా మత్పురస్తే గ్రహీతుం జీవముల్బణం !

శ్రీకృష్ణ వాహనం జ్ఞాత్వా చాత్మానం బహుమన్యసే

త్వద్విధాన్ కోటిశః కృష్ణః స్రష్టుం శక్తిశ్చ వాహకాన్

కరోమి భస్మసాత్తూర్ణం త్వాం చ భ్రూభంగ లీలయా  

వాహనం చ త్వమీశస్య న వయం తవ కింకరాః

అద్య ప్రభృతి పక్షీంద్ర యద్యాగచ్ఛసి మే హ్రదం  

మదీయ శాపాత్తూర్ణం చ భస్మసాద్భవితా ధ్రువం

మునీంద్రస్య వచః శ్రత్వా ప్రచచాల ఖగేశ్వరః  

స్మారం స్మారం కృష్ణపాదం తం ప్రణమ్య జగామ హ

అద్య ప్రభృతి విప్రేంద్ర పతగేంద్రస్య సంతతం  

హ్రదస్య స్మృతి మాత్రేణ కంపో భవతి నిశ్చితం

ఇతిహానశ్చ కధితో యః శ్రుతో ధర్మవక్త్రతః  

ఓ పక్షిరాజా! నా సమీపము నుండి దూరముగా పొమ్ము. దూరముగా పొమ్ము. క్రూరముగా నాముందు ఒక ప్రాణి పట్టుకొనుటకు నీకేమి సామర్థ్యమున్నది? నేను శ్రీకృష్ణుని వాహనమునని గొప్పగా భావించుకొనుచున్నావు. శ్రీకృష్ణుడు నీవంటి వాహకులను (మోయువారిని) కోట్లను సృష్టింప సమర్థుడు సుమా. నిన్ను నా కనుబొమ్మలకదలికతో వెంటనే భస్మము చేయుదును. నీవు పరమాత్మకు వాహనము వైనను మేము నీదాసులము కాము. ఓ పక్షీంద్రా! ఈ నాటినుండి నా ప్రదమునకు (మడుగు, నదిలో నొక లోతైన ప్రదేశము) నీవు వచ్చినచో వెంటనే నా శాపము వలన భస్మమై పోవుట నిశ్చయము. మునీంద్రుని వాక్కు విని పక్షిరాజు గడగడలాడెను. శ్రీకృష్ణ పాదములను స్మరించి స్మరించి మునికి నమస్కరించి అక్కడి నుండి వెడలిపోయెను. బ్రాహ్మణోత్తమా! నాటినుండి పక్షిరాజగు గరుడునికి యమునానది మడుగు స్మృతికి రాగానే వణుకు పుట్టునన్నది నిశ్చయము. ధర్మఋషి ద్వారా వినిన ఇతిహాసము నీకు చెప్పితిని. 

నరహస్యం శ్రుతిసుఖం ప్రకృతం శ్రుణు మంగలం

విజ్ఞాయ నుచిరం బాలా నోత్తస్థౌ తజ్జలా ద్ధరి:  

చక్రుర్విషాదం మోహాచ్చ రురుదుర్యమునాతటే

స్వవక్షోఘాతనం చక్రు: కేచిద్బాలా: శుచాఽకులాః

కేచిన్ని పత్య భూమౌ చ మూర్ఛాం ప్రాపుర్హ రిం వినా

హ్రదం ప్రవేష్టుం కేచిచ్చ విరహేణ సమన్వితాః

కేచిధ్గోపాలబాలాశ్చ చక్రుశ్చ తన్నివారణం

కృత్వా విలాపం కేచిచ్చ ప్రాణాంస్త్యక్తుం సముద్యతాః  

ఎవరెరుగని రహస్య విషయములు గలదియు చెవులకు సుఖము కూర్చునదియు మంగళప్రదమైన ప్రసంగకథ వినుము. 'నీటి మడుగులో నుండి శ్రీకృష్ణుడు చాల సేపటి వరకు పైకి తేల లేదు' అని గ్రహించిన గోపబాలురు అజ్ఞానము వలన విషాదము పొంది యమునా తీరమున నేడ్చిరి. కొందరు బాలురు దుఃఖము చేత మనస్సు చెదరి తమ వక్షస్థలములను బాదుకొనిరి. కొందరు హరిలేడని నేలమీద పడి మూర్ఛిల్లిరి. శ్రీకృష్ణుని వియోగము భరించలేక కొందరు ఆ మడుగులో పడబోయిరి. మరికొందరు బాలురు వారి నట్లు పడకుండ వారించిరి. కొందరేడ్చి యేడ్చి ప్రాణములు విడువబూనుకొనిరి. 

తేషాం కేచిద్ జ్ఞానవంతో రక్షాం చక్రుః ప్రయత్నతః

కేచి దూచుశ్చ హా హేతి కృష్ణ కృష్ణేతి కేచన

కేచిద్వక్తుం ప్రవృత్తిం చ ప్రయయుర్నంద సన్నిధిం

కేచిత్సమ్మీలితాస్తత్ర శోకమోహ భయాతురాః

ఇత్యూచుః కిం కరిష్యామః కుతోఽస్మాకం గతో హరిః

హే నందసూనో హే కృష్ణ ప్రాణేభ్యోఽవ్యధికప్రియ  

హే బంధో దర్శనం దేహీ త్యూచుః ప్రాణాః ప్రయాంతి హి  

వారిలో కొందరు జ్ఞానాత్ములు ప్రయత్నించి రక్షామంత్రములతో రక్ష చేసిరి. కొందరు హాహాయని మరికొందరు కృష్ణ కృష్ణాయని పలికిరి. కొందరు నందునికీవార్త తెలుపుటకై అతనివద్ద కేగిరి. కొందరు శోకము మోహము భయములతో తొందర గలవారై ఒకచోట చేరి మన కృష్ణుడెక్కడ పోయెను ? మనమేమి చేయుదము ? ఓ నందకుమారా ! ఓ కృష్ణా! ప్రాణముల కన్న మిక్కిలి ప్రియమైనవాడా! ఓ బంధూ! మా ప్రాణములు పోవుచున్నవయ్యా నీ దర్శనమిమ్ము అని పలికిరి. 

ఏతస్మిన్నంతరే కేచిద్బాలకా నంద సన్నిధిం

సంప్రాపురతిలోలాశ్చ రుదంతః శోక విహ్వలాః

ప్రవృత్తిమూచుస్తం శీఘ్రం యశోదాం మూలతో బలం  

గోపాన్ గోపాలికాశ్చైవ రక్త పంకజలోచనాః

శ్రుత్వా వార్తాం చ తే సర్వే శీఘ్రం జగ్ముః శుచాన్వితాః

కలింద నందినీ తీరం రురుదుర్బాలకైర్యుతాః

గత్వా సంమీలితా: నర్వే రురుదు: శోకమూర్ఛితాః  

హ్రదం విశంతిమంబాం తాం, కేచిచ్చక్రుర్నివారణం

గోపా గోపాలికాశ్చైవ జఘ్నరంగాని శోకతః  

కేచిద్విలలపుస్తత్ర మూర్ఛాం ప్రాపుశ్చ కేచన

హ్రదం విశంతీం తాం రాధాం వారయామాస కాచన  

మూర్ఛాం చ ప్రాప సా శోకాన్మృతేవ చ సరిత్తటే

విలప్యాతిభృశం నందో మూర్ఛాం ప్రాప పునః పునః

భూయోఽపి రోదనం కృత్వా భూయో మూర్ఛామవాప హ

విలపంతం భృశం నందం యశోదాం శోక కర్మితాం

గోపాశ్చ గోపికాశ్చైవ రాధికా మతిమూర్ఛితాం

రుదతో బాలకాన్ సర్వాన్ బాలికాశ్చ శుచాన్వితాః  

సర్వాంశ్చ బోధయామాస బలశ్చ జ్ఞానినాం వరః  

ఇంతలో కొందరు బాలకులు మిక్కిలి చలించి ఏడ్చుచు శోకముతో చెదరిన మనస్సులు గలవారై నందుని వద్దకేగి త్వరగా నతని కీవార్తను తెలిపిరి. యశోదాదేవి మూలబలము గోపాలురు ఎర్రదామరల వంటి కన్నులు గల గోపికలు అందరీ వార్తవిని దుఃఖముతో 

యమునానదీ తీరమునకు పరుగెత్తిరి. బాలురతో గూడి దుఃఖించిరి. అందరొక చోట చేరి శోకముతో ఒడలెరుగక దుఃఖించిరి. ఆ మడుగులో పడబోయిన యశోదామాతను కొందరడ్డుకొని ఆపిరి. గోపాలురు గోపికలు దుఃఖముతో తమ అంగములను బాదుకొనిరి. కొందరు విలపించిరి. కొందరు మూర్ఛిల్లిరి. మడుగులో దూకబోయిన రాధనొక స్త్రీ వారించెను. ఆ రాధాదేవి దుఃఖముతో మరణించినట్లు నదీ తటమున మూర్ఛిల్లెను. నందుడు మిక్కిలి ఏడ్చి యేడ్చి మరల మరల మూర్ఛిల్లెను. మరి మరి యేడ్చి తిరిగి తిరిగి మూర్ఛపొందెను. మిక్కిలి ఏడ్చుచున్న నందుని శోకముతో బాధపడుచున్న యశోదను మూర్ఛలో మునిగిన రాధను గోపాలురను గోపికలను ఏడ్చుచున్న బాలకులను దుఃఖాన్వితలైన బాలికలను జ్ఞానులలో శ్రేష్ఠుడైన బలదేవుడందరినిట్లు బోధించెను.

శ్రీ బలదేవ ఉవాచ - శ్రీబలదేవుడిట్లనెను :

గోపా గోపాలికా బాలా:  సర్వే శ్రణుత మద్వచః  

హే నంద జ్ఞానినాం శ్రేష్ఠ గర్గవాక్య స్మృతిం కురు

జగద్బిభర్తుః శేషస్య సంహర్తుః శంకరస్య చ  

విధాతు: నంవిధాతుశ్చ భువి కస్మాత్పరాజయః

పరమాణు: పరో వ్యూహ: స్థూలాత్ స్థూల: పరాత్పరః  

విద్యమానోఽప్య విదృశ్య: సంయోగో యోగినామపి

దిశాం నాస్తి సమాహారః స్పృశ్యో నాకాశ ఏవ చ

అపి సర్వేశ్వరో బాధ్య ఇత్యూచుః శ్రుతయః స్ఫుటం  

ఓ గోపాలులారా ! గోపికలారా ! ఓ బాలులారా! అందరు నామాట వినుడు. జ్ఞానులలో శ్రేష్ఠుడవైన ఓ నందుడా! గర్గమహర్షి వాక్యమును స్మరించుకొనుము. జగత్తును మోయునట్టి ఆదిశేషునకు జగత్ ప్రళయమును చేయు శంకరునకు సృష్టికర్తయగు బ్రహ్మకు ఈ ప్రపంచమున ఎవని ముందు పరాజయము పొందుట సంభవించునో అట్టి సర్వేశ్వరుడు అణువులకంటె అణువైన కారణమైనవాడు స్థూలముకంటె స్థూలమైనవాడు శ్రేష్ఠునికన్న శ్రేష్ఠుడు ఉండియు చూడబడనివాడు యోగులకు విశ్రాంతిస్థానము దిక్కులలో ఒక చోట కలియక లేనట్లు ఆకాశము స్పృశింపబడనట్లుండువాడు సర్వేశ్వరుడైనను బాధ్యుడతడేయని శ్రుతులు స్పష్టముగా చెప్పుచున్నవి. 

నాత్మా దృశ్యో నాస్త్ర లక్ష్యో న వధ్యో స హి దృశ్యకః  

నాగ్ని గ్రస్తో న హింస్యశ్చాపీదమాధ్యాత్మికా విదుః

విగ్రహోఽస్యైవ కృష్ణస్య భక్తధ్యానార్ధమేవ చ

జ్యోతిస్వరూపన్య విభోర్నాద్యంతమధ్యమాత్మనః  

ఆత్మ కన్పించునట్టివాడు కాడు. అస్రములకు గురికాడు. (అస్త్రముల చేత నరకబడడు) చంపబడడు. కనపడువాడును కాడు. అగ్నిచేత పట్టువడడు. హింసింపబడడు. ఈ విషయ మాధ్యాత్మిక వేత్త లెరుగుదురు. జ్యోతి స్వరూపుడగు ఆత్మకు జన్మ యౌవన మరణములను ఆదిమధ్యాంతము లేవు. శ్రీకృష్ణ పరమాత్మకు విగ్రహమన్నది భక్తులు ధ్యానించుట కొరకే.

జలప్లుతే బ్రహ్మాండే జలశాయీ జనార్దనః  

యన్నాభిపద్మజో బ్రహ్మ తస్యేశస్య హ్రదే విపత్

మశకశ్చేత్ క్షమో గ్రస్తుం బ్రహ్మాండమఖిలం పితః

న తథాఽపి తదీశం తం గ్రస్తుం సర్ప:  క్షమో భవేత్  

బ్రహ్మాండమంతయు జలప్రళయకాలములో జలమున మునిగినప్పుడీ జనార్దనుడు ఆ జలమున శయనించువాడు. ఓ తండ్రి సృష్టికర్తయగు బ్రహ్మ ఎవని నాభి కమలమున పుట్టినాడో అట్టి ప్రభువునకు మడుగులో ఆపదయా ? ఒక దోమ బ్రహ్మాండమంతటిని 

మ్రింగుటకు శక్తి కలదైనప్పటికిని కాళియ సర్పము స్వామిని మ్రింగుటకు సమర్ధము కాజాలదు. 

ఇత్యేవం కధితం సర్వమాధ్యాత్మికమనుత్తమం

నిగూఢం యోగినాం సారం సంశయచ్ఛేద కారణం

బలదేవ వచః శ్రుత్వా గర్గవాక్యమనుస్మరన్

తత్యాజ శోకం నందశ్చ వ్రజశ్చ ప్రజయోషితః

ప్రబోధం మేనిరే సర్వే న యశోదా న రాధికా

బంధువిచ్ఛేద విషయే ప్రబోధేన స్థితం మనః

ఈ విధముగా యోగులకును తెలియని రహస్యము సంశయములను ఛేదించు మూలసారము ఉత్తమమైన ఆధ్యాత్మిక తత్త్వము సర్వము చెప్పబడినది. ఇట్టి బలదేవుని మాటలు విని గర్గమహర్షి వాక్యమును తలంచుకొని నందుడు గోపాలకులు గోపస్త్రీలు శోకమును విడిచి అందరును ఆ జ్ఞాన విషయమును తలంచుకొనిరి. యశోద రాధ మాత్రము ప్రబోధము పొందకుండిరి. ఔను. బంధువుల ఆపద (వియోగము) విషయములో ఆసందర్భమున ఉపదేశము నందు మనస్సు నిలువదు కదా!  

ఏతస్మిన్నంతరే కృష్ణముత్పతంతం జలాన్మునే

దదృశుస్తం సుప్రసన్నా ప్రజాశ్చ ప్రజయోషితః

శరత్పార్వణ చంద్రాస్యం నస్మితం సుమనోహరం

అస్నిగ్ధ వస్త్రమస్నిగ్ధమలుప్త చందనాంజనం

సర్వాభరణ సంయుక్తం జ్వలంతం బ్రహ్మతేజసా  

మయూర పిచ్చ చూడం చ వంశీ వదనమచ్యుతం

యశోదా బాలకం దృష్ట్వా కృత్వా వక్షసి సస్మితా

చుచుంబ వదనాంభోజం ప్రసన్న వదనేక్షణా

క్రోడే చకార నందశ్చ బలశ్చ రోహిణీ ముదా  

ఓ నారదా ! ఇంతలో నీటిలో నుండి పై కెగిరి వచ్చుచున్న శ్రీకృష్ణుని తేటనైన మనస్సులతో గోపాలురు గోపికలు దర్శించిరి. శరదృతువులో పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖము గల వాడును మిక్కిలి మనోహరమైన చిరునవ్వు గలవాడును వస్త్రములు గాని తాను గాని నీటికి తడువక పులుమబడిన చందనము గాని కొటుక గాని చెదరిపోక ఉన్నవాడును సర్వాభరణములతో గూడి బ్రహ్మ తేజస్సుతో వెలుగుచున్నవాడును నెమిలియీక కొండెకొప్పున గలవాడును పెదవుల మీద పిల్లనగ్రోవి గలవాడునగు నాయచ్యుతుని (శ్రీకృష్ణుడు) తన బాలకుని యశోద కౌగిలించుకొని చిరునవ్వుతో ప్రసన్నముగా మారిన వదనమునేత్రములతో అతని ముఖపద్మమును ముద్దిడుకొనెను. నందుడును బలదేవుడును రోహిణియు ఒడిలోనికి తీసుకొనిరి. 

నిమేష రహితా: సర్వే దదృశుః శ్రీముఖం హరేః

ప్రేమాంధా బాలకాస్సర్వే చక్రురాలింగనం హరేః I

పపుశ్చక్షుశ్చక్రైశ్చ ముఖ చంద్రం చ గోపికా:  

అందరును కనురెప్పపాటు లేకుండ శ్రీకృష్ణుని సుందరముఖమును దర్శించిరి.. మిక్కిలి ప్రేమతో నున్న గోపాలబాలురందరు అతని నాలింగనము చేసుకొనిరి. గోపికలు తమ కన్నులనెడి చకోరపక్షులద్వారా అతని ముఖచంద్ర (కాంతిని) పానము చేసిరి. 

ఏతస్మిన్నంతరే తత్ర సహసా కాననాంతరం  

దావాగ్ని ర్వేష్టయామాస తై: సర్వై: సహ గోకులం

దృష్ట్వా శైల ప్రమాణాగ్నిం వరితః కాననాంతరే  

ప్రణాశం మేనిరే సర్వే భయమావుశ్చ సంకటే

శ్రీకృష్ణం తుష్టువు: సర్వే సంపుటాంజలయో ప్రజాః

బాలా గోప్యశ్చ సంత్రస్తా భక్తి నమ్రాత్మ కంధరా:  

ఇంతలోనక్కడ హఠాత్తుగా అరణ్యభాగమును వారినందరిని గోకులమునంతయు కారుచిచ్చు చుట్టుముట్టెను. అడవిలో అన్ని వైపులలో పర్వతమంత యెత్తుగా మండుచున్న అగ్నిని చూచి ఆయాపత్కాలములో భీతులై తామందరు నశింతుమనుకొనిరి. బాలురు గోపికలు మిక్కిలి భయపడినవారై భక్తితో తలలు వంచి గోకులవాసులందరు చేతులు జోడించి శ్రీకృష్ణుని స్తుతించిరి. 

బాలా ఊచుః - బాలురనిరి : 

యథా సంరక్షితం బ్రహ్మన్ నర్వాపత్స్యేవ నః కులం

తథా రక్షాం కురు పునర్ధావాగ్నేర్మధుసూదన

త్వమిష్టదేవతాఽస్మాకం త్వమేవ కులదేవతా  

స్రష్టా పాతా చ సంహర్తా జగతాం చ జగత్పతే

వహ్నిర్వా వరుణో ఽవాపి చంద్రోవా సూర్య ఏవ చ

యమః కుబేర పవన ఈశానాద్యాశ్చ దేవతా:

బ్రహ్మేశ శేష ధర్మేంద్రా మువీంద్రా మనవః స్మృతాః

మావవాశ్చ తథా దైత్యా యక్షరాక్షస కిన్నరాః

యే యే చరాచరాశ్చైవ సర్వే తవ విభూతయః

ఆవిర్భావస్తిరోభావ: సర్వేషాం చ తవేచ్చయా

అభయం దేహి గోవింద వహ్ని సంహరణం కురు

వయం త్వాం శరణం యామో రక్ష నః శరణాగతాన్

ఇత్యేవముక్త్యా తే నర్వే తస్థుర్ద్యాత్వా పదాంబుజం  

ఓ పరబ్రహ్మా ! మధుసూదనా! ఇంతవరకే విధముగా సర్వాపదలలో మా గణములను (మావంశములను) రక్షించితివో ఇపుడట్లే మరల దావాగ్ని నుండి మమ్ము రక్షించుము. ఓ జగత్పతీ! జగములను సృష్టించి పాలించి సంహరించువాడవు. మాకిష్టదేవతవు మాకులదేవతవు నీవే. అగ్ని గాని వరుణుడు (జలదేవత) గాని చంద్రసూర్యులు గాని యముడు కుబేర వాయువులు ఈశానాది దేవతలు బ్రహ్మరుద్ర శేష ధర్మేంద్రాదులు మునీంద్రులు మనువులు మానవులు దైత్యులు యక్షరాక్షస కిన్నరులు చరాచర ప్రపంమంతయు నీ విభూతియే (నీ అంశ. నీసంపద) అందరి జన్మమరణములు నీ యిచ్చ (సంకల్పము) వలననే జరుగును. ఓ గోవిందా! మాకభయమిమ్ము.ఈ దావాగ్నిని నశింపజేయుము. మేము నిన్ను శరణు పొందుచున్నాము. శరణాగతులమైన మమ్ము రక్షింపుము. ఇట్లు పలికి వారందరు అతని పొదపద్మములు ధ్యానించి నిలిచియుండిరి. 

దూరీభూతస్తు దావాగ్ని: శ్రీకృష్ణామృతదృష్టితః

దూరీ భూతే చ దావాగ్నౌ ననృతుస్తే ముదాన్వితాః  

సర్వాపదః ప్రణశ్యంతి హరిస్మరణ మాత్రతః  

శ్రీకృష్ణుని అమృత దృష్టి వలన దావాగ్ని దూరముగా తొలగిపోయెను. అదియట్లు తొలగిపోగా వారందరు సంతసముతో నృత్యము చేసిరి. హరి స్మరణము చేసినంతలో సర్వాపదలు నశించిపోవును. 

ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్

వహ్నితో న భవేత్తన్య భయం జన్మని జన్మని

శత్రుగ్రస్తే చ దావాగ్నౌ విపత్తా ప్రాణసంకటే

స్తోత్రమేతత్ పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః

శత్రుసైన్యం క్షయం యాతి సర్వత్ర విజయీ భవేత్  

మహాపుణ్యవంతమైన ఈ స్తోత్రమును ప్రాతఃకాలమున నిద్రనుండి లేచి ఎవడు పఠించునో వానికి జన్మజన్మకు వహ్ని (అగ్ని) భయముండదు. శత్రువులచేత పట్టువడిన సమయములో గాని దావాగ్ని సంభవించినపుడు గాని ప్రాణములకు సంకటమేర్పడిన ఆపత్తులో గాని ఈ స్తోత్రమును పఠించినచో వాటి నుండి విడుదల పొందును. ఈ విషయమున సందేహమే లేదు. శత్రు సైన్యము నశించి అంతట వాడు విజయము పొందును. ఇహలోకమున హరిభక్తిని అంత్యమున హరిదాస్యముక్తిని పొందుట సత్యము. 

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను : 

దావాగ్ని మోక్షణం కృత్వా తై: సార్ధం శ్రుణు నారద

జగామ శ్రీహరిర్గేహం కుబేర భవనోపమం  

బ్రాహ్మణేభ్యో ధనం నంద: పరిపూర్ణం దదౌ ముదా

భోజనం కారయామాస జ్ఞాతివర్గాంశ్చ బాంధవాన్

నానావిధం మంగలం చ హరేర్నామానుకీర్తనం

వేదాంశ్చ పాఠయామాస విప్రద్వారా ముదాన్వితః  

ఏవం ముముదిరే సర్వే బృందారణ్యే గృహే గృహే

శ్రీకృష్ణ చరణాంభోజ ధ్యానైకతానమానసా:  

ఇత్యేవం కథితం సర్వం హరేశ్చరిత మంగలం

కలికిల్బిష కష్టానాం దహనే దహనోపమం  

శ్రీహరి ఇట్లు దావాగ్ని నుండి మోక్షణము చేసి వారితో బాటు కుబేరుని భవనమును పోలిన తన గృహమునకేగెను. నందుడు ముదముతో బ్రాహ్మణులకు నిండుగా ధనము దానము చేసి జ్ఞాతివర్గమునకు బంధువులకు భోజనములు పెట్టించెను. ఆపదలు గడచిన సంతోషముతో బ్రాహ్మణుల చేత వేదపారాయణము చేయించి నానావిధ మంగళములు జరిపించి హరినామ సంకీర్తనము చేయించెను. ఇట్లందరు బృందావనములో ప్రతి గృహమున శ్రీకృష్ణ పాదపద్మ ధ్యాన తత్పరమైన మనస్సులు కలవారై ఆనందించిరి. ఇట్లుగా శ్రీహరి యొక్క మంగళకరమైన చరిత్రము కలికల్మషము వలన నేర్పడు కష్టములను (ఆపదలను) కాల్చివేయుటలో అగ్నివంటిది అదియంతయు చెప్పబడినది. 

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారదసంవాదే కాలీయ దమన దావాగ్ని మోక్షణం నామైకోనవింశోఽధ్యాయః

ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన కాళీయదమనము దావాగ్ని మోక్షణమను భాగములు గల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.