మూ!! శ్రీకృష్ణ ఉవాచ:
చేతనంకురు హేతాత, హేతాత చేతనంకురు ।
జలబుద్బుద వత్సర్వం సంసారం సచరా చరం ॥
త్యజ మోహం మహాభాగ మాయాంస్తౌహి పరాత్పరాం ।
బ్రహ్మస్వరూపాం పరమాం సర్వమోహ నికృంతనీం ముక్తి ప్రదాం మహాభాగాం విషమాయాం సనాతనీం ॥
త్రిపురస్యవధేఘోరే మహాయుద్ధీభయాకులే ।
యేనస్తోత్రేణ శంభుశ్చ తయాదైత్యం జఘానసః ॥
స్తోత్రరాజం ప్రదాస్యామి సర్వమోహ నికృంతనం ।
సర్వవాంఛా ప్రదానం చ శ్రూయతామత్ర సంసది ॥
శ్రీనంద ఉవాచ:
సర్వవిఘ్నవినాశాయ దుఃఖప్రశమణాయచ ।
విభూతయేచ యశసేనృణాం వాంఛితసిద్ధయే ॥
స్తోత్రమేకం మహాదేవ్యా జగన్మాతుర్జగత్ర్పభో ।
పరందుర్గతి నాశిన్యా గోపనీయం సుదుర్లభం ॥
దేహిమహ్యం వినీతాయ భక్తాయభక్తవత్సల ।
వేదానాం జనకస్త్వంచ నిరుణశ్చ పరాత్పరః ॥
అను!! శ్రీకృష్ణుడిట్లన్నాడు:
ఓతండ్రి! మేలుకో. ఓ తండ్రి మేలుకో. సచరాచరమైన సంసారమంతా నీటి బుడగలాటిది. (1) ఓ మహాభాగ! దీనిమీద మోహాన్ని విడిచి పెట్టు. పరాత్పరమైన మాయను, స్తుతించు. ఆమె పరమ, బ్రహ్మస్వరూపురాలు, మోహాన్నంతా నశింపచేసేది, ముక్తినిచ్చేది, మహాభాగ ఆమె. విష్ణుమాయ, సనాతని. (2) త్రిపురవధ కాలంలో ఘోరమైన మహాయుద్ధంలో భయంతో వ్యాకులమైన వేళ, ఆమెను స్తుతించి, శంభుడు, ఆరాక్షసుణ్ణి చంపాడు. (3) మోహములనన్నిటిని నవింపచేసే ఆస్తోత్రరాజాన్ని నీకు చెబుతాను. ఓనంద! ఆస్తోత్రము అన్ని వాంఛలను తీర్చేది. ఈసభలో విను. (4) నందుడిట్లన్నాడు - విఘ్నములన్నీ నశించే కొరకు, దుఃఖం కమించే కొరకు, ఐశ్వర్యము, కీర్తి వీనికొరకు, నరులకు వాంఛాసిద్ది కొరకు (5) మహాదేవి జగన్మాత యొక్క స్తోత్రాన్ని ఒకటి ఇస్తావా, ఓ జగత్ర్పభూ దుర్గతిని నశింపచేసే, సుదుర్లభమైన ఆస్తోత్రాన్ని బాగారక్షించాలి. (6) ఓ భక్తవత్సల! భక్తుడనైన వినీతుడనైన నాకు ఆ స్తోత్రాన్ని ఇవ్వు. నీవు వేదములకు జనకుడవు. నిర్గుణుడవు. పరాత్పరుడవు.
మూ॥ శ్రీభగవానువాచ:
శృణువక్ష్యామి వైశ్యేంద్ర స్తోత్రం యత్పరమాద్భుతం ।
సర్వవిఘ్నవినాశార్థం మోహపాశనికృంతనం ॥
రణ త్రస్తేన విభునా శంకరేణ పురాకృతం ।
నారాయణోపదేశేన ప్రేరితేనచ బ్రహ్మణా ॥
శత్రుగ్రస్తం శివందృష్ట్వాసబ్రహ్మాణమువాచ హ ।
ఉవాచ శంకరం బ్రహ్మారథస్థం పతితంరణే ॥
శూరసంకటశాంత్యర్థం దుర్గాం దుర్గతి నాశినీం ।
మూలప్రకృతి మాద్యాం తాంస్తౌహి బ్రహ్మస్వరూపిణీం ॥
హరిణాప్రేరితోఽహంచ త్వాం వదామిసురేశ్వర ।
వినా శక్తి సహాయేన కోవా కం జేతుమీశ్వరః ॥
బ్రహ్మణశ్చవచః శ్రుత్వా దుర్గాం సస్మార శంకరః ।
పుటాంజలి పరోభూత్వాభక్తినమ్రాత్మ కంధరః ॥
స్నాతః పాదౌచ ప్రక్షాల్య ధృత్వాధౌతేచ వాససీ ।
ఆచాంతః కుశహస్తశ్చ శుచిర్విష్ణుంశ్చ సంస్మరన్ ॥
శ్రీమహాదేవఉవాచ:
రక్షరక్ష మహాదేవి దుర్గేదుర్గతినాశిని ।
మాంభక్త మనురక్తంచ శత్రుగ్రస్తంకృపామయి ॥
విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని ।
బ్రహ్మ స్వరూపే పరమే నిత్యానంద స్వరూపిణి ॥
త్వంచ బ్రహ్మాది దేవానా మంబికే జగదంబికే ।
త్వం సాకారేచ గుణతో నిరాకారేచ నిర్గుణాత్ ॥
మాయయా పురుషత్వంచ మాయయా ప్రకృతి స్స్వయం ।
తయోః పరం బ్రహ్మపరం త్వం భిభర్షి సనాతని ॥
వేదానాం జననీత్వంచ సావిత్రీచ పరాత్పరా ।
వైకుంఠేచ మహాలక్ష్మీః సర్వసంపత్స్వరూపిణీ ॥
మర్త్యలక్ష్మీశ్చక్షీరోదే కామినీశేషశాయినః ।
స్వర్గేషు స్వర్గలక్ష్మీస్త్వం రాజలక్ష్మీశ్చభూతలే ॥
నాగాది లక్ష్మీః పాతాలే గృహేషుగృహదేవతా ।
సర్వసస్య స్వరూపాత్వం సర్వైశ్యర్య విధాయినీ ॥
రాగాధిష్ఠాతృదేవీత్వం బ్రహ్మణశ్చ సరస్వతీ ।
ప్రాణానా మధిదేవీత్వం కృష్ణస్య పరమాత్మనః ॥!
గోలోకేచస్వయం రాధా శ్రీకృష్ణ స్యైవ వక్షసి ।
గోలోకాధిష్ఠితా దేవీ వృందావన వనే వనే ॥
శ్రీరాస మండలేరమ్యా వృందావన వినోదినీ ।
శతశృంగాధిదేవీత్వం నామ్నాచిత్రా వలీతిచ ॥
దక్షకన్యాకుత్రకల్పే కుత్ర కల్పేచ శైలజా ।
దేవమాతా దితిస్త్వంచ సర్వాధారా వసుంధరా ॥
త్వమేవగంగా తులసీత్వంచ స్వాహా స్వధాసతీ ।
త్వదంశాంశాం శకలయా సర్వదేవాది యోక్షితః ॥
స్త్రీ రూపం చాతి పురుషం దేవీత్వంచ నపుంసకం ।
వృక్షాణాం వృక్షరూపాత్వం సృష్టా చాంకురరూపిణీ ॥
వహ్నౌచ దాహికా శక్తిర్జలే శైత్య స్వరూపిణీ ।
సూర్యేతేజకి స్వరూపాచ ప్రఖారూపాచ సంతతం ॥
అను II భగవంతుని వచనమిట్లా: ఓ వైశ్యశ్రేష్ఠ ! పరమాద్భుతమైన స్తోత్రాన్ని చెబుతాను విను. మోహపాశాన్ని కత్తిరించే దాన్ని, అన్ని విఘ్నముల నాశం కొరకు చెబుతాను. (8) యుద్ధంతో భయపడిన శంకరుడు, విభువు చేసినస్తోత్రాన్ని, నారాయణుని ఉపదేశంతో, బ్రహ్మతో ప్రేరేపింపబడిచేసిన స్తోత్రాన్ని విను. (9) శత్రువులతో పట్టుబడ్డ శివుని చూచి హరిబ్రహ్మతో అన్నాడు. బ్రహ్మరథమందు, యుద్ధంలో పడిపోయిన శంకరునితో అన్నాడు. (10) శూర! సంకటములు నశించే కొరకు, దుర్గతిని నశింపచే సే దుర్గను, మూలప్రకృతిని, ఆద్యను బ్రహ్మ స్వరూపిణియైన ఆమెను స్తుతించు (11) ఓ సురేశ్వర! హరి పంపగా వచ్చి నేను నీకు బోధిస్తున్నాను. శక్తి యొక్క సహాయం లేకుండా ఎవడు ఎవ్వణ్ణి జయించటానికి సమర్థుడు? (12) బ్రహ్మమాటను విని శంకరుడు దుర్గను స్మరించాడు. భక్తితో తలను వంచినవాడై, చేతులు జోడించి స్మరించాడు. (13) స్నానం చేసి, కాళ్ళు కడిగికొని ఉతికినవస్త్రాలు ధరించి, ఆచమించి, కుశలు చేత ధరించి, శుచిగా, విష్ణువును కూడా స్మరిస్తూ స్మరించాడు. (14) మహాదేవుని వచనమిట్లా - దుర్గతిని నశింపచేసే ఓదుర్గ! ఓ మహాదేవి నన్ను రక్షించు రక్షించు. నేను నీభక్తుణ్ణి. నీ యందనురాగం కలవాణ్ణి, శత్రువులు నన్ను పట్టారు. నా పై దయచూపు (15) ఓ విష్ణుమాయ! సనాతని! మహాభాగే! నారాయణి! బ్రహ్మస్వరూపిణి ! పరమా! నిత్యానంద స్వరూపిణి! (16) ఓ జగదంబిక! నీవు బ్రహ్మాది దేవతలకు అంబికవు. నీవు గుణముల వల్ల సాకారరూపిణివి. గుణములు లేకుండటం వల్ల (నిర్గుణ) నిరాకారిణి. (17) మాయతో పురుషత్వం కలదానవు. మాయతో స్వయంగా ప్రకృతివి. ఆరెంటికి పరమైనది బ్రహ్మ. ఆ పరబ్రహ్మను నీవు భరిస్తున్నావు, ఓ సనాతని! (18) వేదములకు జననివి నీవు. సావిత్రివి, పరాత్పరవు. వైకుంఠంలో మహాలక్ష్మివి, సర్వసంపదల స్వరూపిణి. (19) పాలసముద్రంలో మర్త్యలక్ష్మివి,శేషశాయికి కామినివి. స్వర్గంలో స్వర్గలక్ష్మివి. భూతలమందు రాజలక్ష్మివి. (20) పాతాలంలో నాగాది లక్ష్మివి గృహంలో గృహదేవతవు. అన్ని పంటల రూపము నీవే. అన్ని ఐశ్వర్యముల కూర్చే దానివి నీవే (21) రాగాధిష్ఠాతృ దేవతవు నీవే బ్రహ్మకు సరస్వతివి. ప్రాణములకు అధిదేవతవు నీవు, కృష్ణ పరమాత్మకు (22) గోలోకంలో రాధవు, శ్రీకృష్ణుని వక్షంలో ఉంటావు. బృందావనంలోనే ప్రతి వనంలో గోలోకాధిష్ఠిత దేవివి నీవు. (23) బృందావనంలో వినోదించే, శ్రీరాసమండలమందుండే, రమ్యవునీవే శతశృంగాధి దేవివి నువ్వే. నీ పేరు చిత్రావలీ అని (24) ఒక కల్పంలో దక్షకన్యవు. ఒక కల్పంలో శైలజవు. దేవమాతయైన దితివి నువ్వే. అందరికి ఆధారమైన వసుంధరవు నువ్వే. (25) గంగ, తులసి, స్వాహా, స్వధా, సతీ ఇవి నీవే. నీ యొక్క అంశాంశాంశ కలతో వచ్చిన వారే దేవాది స్త్రీలంతా (26) నీవు స్త్రీ రూపిణిని, అతిపురుష రూపమునీవే, నీవే నపుంసకము. వృక్షములకు వృక్షరూపిణివి, సృష్టి (ఉత్పత్తి)లో అంకుర రూపానివి (27) అగ్నిలో కాల్చేశక్తివి, నీళ్ళలో చల్లదనానివి. సూర్యునిలో తేజోరూపిణివి. ఎప్పుడూ కాంతిరూపిణివి.
మూII గంధరూపాచ భూమౌచ ఆకాశే శబ్ద రూపిణీ ।
శోభాస్యరూపా చంద్రేచ పద్మసంఘేచ నిశ్చితం ॥
సృష్ఠౌ సృష్టి స్వరూపాచ పాలనే పరిపాలకా ।
మహామారీచ సంహారే జలేచ జలరూపిణీ ॥
క్షుత్వంద యాత్వం నిద్రాత్వం తృష్ణాత్వం బుద్ధిరూపిణీ ।
తుష్టి స్త్వంచాపి పుష్టిస్త్వం శ్రద్ధాత్వంచ క్షమాస్వయం ॥
శాంతిస్త్వంచ స్వయంభ్రాంతిః కాంతిస్త్వంకీర్తి రేవచ ।
లజ్జాత్వంచ తథామాయా భుక్తి ముక్తి స్వరూపిణీ ॥
సర్వశక్తి స్వరూపాత్వం సర్వసంపత్ర్పదాయినీ ।
వేదేచ నిర్వచనీయా త్వం త్వాం నజానాతికశ్చన ॥
సహస్రవక్త్రస్త్వాం స్తోతుంనచ శక్తః సురేశ్వరి ।
వేదా, నశక్తాః కోవిద్వాన్నచ శక్తః సరస్వతీ ॥
స్వయం విధాతా శక్తోన, నచ విష్ణుః సనాతనః ।
కింస్తౌమి పంచ వక్రైస్తురణ త్రస్తో మహేశ్వరి ॥
కృపాంకురు మహామాయే మమశత్రుక్షయంకురు ।
ఇత్యుక్త్వాచ స కరుణం రథస్థే పతితేరణే ॥
ఆవిర్భ భూవ సా దుర్గా సూర్యకోటిసమప్రభా ।
నారాయణేన కృపయా ప్రేరితా పరమాత్మనా ॥
శివస్య పురతః శీఘ్రం శివాయచ జయాయచ ।
ఇత్యువాచ మహాదేవీ మాయాశక్త్యా సురం జహి ॥
శ్రీదుర్గోవాచ :
వరం వృణీష్వ భద్రంతే యత్తే మనసి వాంఛితం ।
భవాన్వరః సురాణాంచ జయం తుభ్యం దదామ్యహం ॥
శ్రీమహాదేవ ఉవాచ:
క్షయోభవతు దైత్యస్య ఇతిమే వరమీశ్వరి ।
దేహీతి వాంఛితం దుర్గే పరమాద్యే సనాతని ॥
భగవత్యువాచ –
హరిం స్మర మహాభాగ జయదైత్యం జగద్గురో ।
స్వయం విధాతా భగవాం స్త్వమేవజ్యోతిరీశ్వరః ॥
ఏతస్మిన్నంతరే విష్ణుః వృషరూపోబభూవహ ।
దధారకలయా మూర్ద్నా శూలపాణే రథం విభుః ॥
ఊర్ధ్వచక్రమథోగ్రంచ ప్రకృతించ చకారసః ।
అస్త్రందదౌమంత్రపూత ముద్దధార తతోరథం ॥
శివః శస్త్రం గృహీత్వాచ ధ్యాత్వా విష్ణుం మహేశ్వరీం ।
జఘాన త్రిపురం శీఘ్రం సపపాతమహీతలే ॥
తుష్టువుః శంకరం దేవా శ్చక్రుశ్చ పుష్పవర్షణం ।
దుర్గా తస్మైదదౌశూలం పినాకం విష్ణు రేవచ ॥
బ్రహ్మాశుభాశిషం చైవ మునయశ్చాపిహర్షితాః ।
ననృతుః దేవతాః సర్వాజగుః గంధర్వకిన్నరాః ॥
ఏతస్మిన్నంతరేతా త స్తవరా జమనుత్తమం ।
విఘ్నం విఘ్నకరం శీఘ్రం శత్రు సంహారకారణం ॥
పరమైశ్వర్య జనకం సుఖదంపరమం శుభం ।
నిర్వాణ మోక్షదం చైవ హరిభక్తి ప్రదం ధ్రువం ॥
గోలోకవాసదం చైవ సర్వసిద్ధి ప్రదం వరం ।
స్తోత్రరాజప్రపఠనాత్ ప్రసన్నా పార్వతీ సదా ॥
అను II భూమియందు గంధరూపిణివి, ఆకాశంలో శబ్దరూపిణివి. చంద్రునిలో కాంతిరూపానివి, పద్మసంఘమందు కూర్చంటావు, నిశ్చయము. (29) సృష్టియందు సృష్టి స్వరూపానివి పాలనయందు పాలించేదానివి. సంహారమందు మహామారివి, జలమందు జలరూపిణివి (30) ఆకలివి, దయవు, నిద్రవు, దప్పికవు, బుద్ధిరూపానివి. తుష్టివి, పుష్టివి, శ్రద్దవు, క్షమవు. (31) శాంతివి, భ్రాంతివి, కాంతివి, కీర్తివి, సిగ్గువు, మాయవు, భుక్తిముక్తి స్వరూపిణివి (32) శక్తి స్వరూపమంతా నీవే, అన్ని సంపదలనిచ్చే దానివి నీవే. వేదంలో వాక్కులతో నిర్వచింపరాని దానివి. నిన్నెవరు తెలుసుకోలేరు. (33) ఓసురేశ్వరి! నిన్ను స్తుతించటానికి, వేయి శిరముల (నోరుల) వాడు కూడా అసమర్థుడే. వేదములు, అసమర్థములు (నీవిషయంలో). ఏ విద్వాంసుడు కానీ, సరస్వతి కానీ అసమర్థులే.(34) విధాత అశక్తుడు. సనాతనుడైన విష్ణువు కూడా అసమర్థుడే. నా ఐదు ముఖాలతో ఏం స్తుతించగలను. నేను రణమందు భయపడ్డవాణ్ణి ఓ మహేశ్వరి (35) ఓ మహామాయ! దయజూపునా పై. నా శత్రువుల నాశనం చేయి, అని పలికి దీనంగా రథమందుండి, యుద్దంలో పడిపోగా (36) కోటి సూర్యుల కాంతిగల ఆదుర్గ ప్రత్యక్షమైంది. పరమాత్మయైన నారాయణునితో కృపతో ప్రేరేపింపబడింది. (37) శివుని ఎదురుగా వచ్చింది, శబవునకు జయం కలిగే కొరకు, త్వరగా వచ్చింది. మాయాశక్తితో రాక్షసుని జయించు అని మహాదేవి పలికింది. (38) దుర్గావచన మిట్లా - నీకు క్షేమం, నీ మనసులోని కోరిక ఏమిటో, ఆవరం కోరుకో. దేవతలకన్నా నీవు శ్రేష్టుడవు. నీకుజయాన్ని కల్గిస్తాను. (39) మహాదేవుని వచనమిట్లా - దైత్యుడు, నశించుగాక ఇదే నా వరము ఓ ఈశ్వరి, దీన్ని ఇవ్వు మిక్కిలి ఆద్యురాల! సనాతనీ! ఓ దుర్గ! ఇదే నావాంఛితము, అని (40) భగవతి వచనమిట్లా - హరిని స్మరించు, ఓ మహాభాగ! జగద్గురు! రాక్షసుని జయించు. నీవు స్వయంగా విధాతవు భగవంతుడవు. నీవు జ్యోతివి ఈశ్వరుడవు. (41) ఇంతలో విష్ణువు వృషరూపుడైనాడు. మూర్ధ భాగంతో శూలపాణి రథమును, విభువు ధరించాడు. (42) ఊర్ద్వ చక్రమును, ప్రకృతిని ఉగ్రముగాను చేశాడు, విష్ణువు. మంత్రపూతమైన అస్త్రమును ఇచ్చాడు. ఆపై రథమును ఎత్తాడు. (43) శివుడు శస్త్రాన్ని గ్రహించి, విష్ణువును, మహేశ్వరిని ధ్యానించి, వేగంగా త్రిపురాసురుణ్ణి చంపాడు. వాడు భూమి పై పడ్డాడు. (44) దేవతలు శంకరుని స్తుతించారు. పుష్ప వర్షం కురిపించారు. దుర్గ అతనికి శూలాన్ని ఇచ్చింది. విష్ణువు పినాకాన్ని ఇచ్చాడు. (45) బ్రహ్మ ఆశీస్సులిచ్చాడు. మునులు ఆనందించారు. దేవతలంతా నాట్యం చేశారు. గంధర్వులు, కిన్నరులు పాటలు పాడారు. (46) ఇంతలో (కు) ఓ తండ్రి ఇది ఉత్తమమైన స్తోత్ర రాజము. విఘ్నములకు విఘ్నాన్ని కూర్చేది. త్వరగా శత్రువుల సంహరించేది (47) ఐశ్వర్యము నిచ్చేది, సుఖమిచ్చేది. పరమమైనది. శుభమైనది. నిర్వాణమోక్షమిచ్చేది. హరిభక్తిని కల్గించేది, నిశ్చయము (48) గోలోకవాసాన్ని కల్గించేది. సర్వసిద్ధి ప్రదము, వరమైనది. ఈస్తోత్రరాజం చదవటం వల్ల పార్వతి ఎప్పుడూ ప్రసన్నురాలౌతుంది.
మూII లోభమోహకామక్రోధ కర్మమూల నికృంతనం ।
బలబుద్ధికరం చైవ జన్మమృత్యు వినాశనం ॥
ధనపుత్ర ప్రియాభూమి సర్వసంపత్ర్పదం నృణాం ।
శోకదుఃఖహరంచైవ సర్వసిద్ధి ప్రదం వరం ॥
స్తోత్రరాజ ప్రపఠనాత్ మహావంధ్యా ప్రసూయతే ।
బంధనాన్ముచ్యతే దుఃఖీ భయాన్ముచేత నిశ్చితం ॥
రోగాద్విముచ్యతే రోగీ దరిద్రశ్చ ధనీ భవేత్ ।
దావాగ్ని మధ్యే నమృతః భగ్నో పోతోమహార్ణణే ॥
దస్యుగ్రస్తోరిపుగ్రస్తో హింస్రజంతు సమన్వితః ।
స్తోత్రేనానేన వైశ్యేంద్ర కల్యాణం లభతేనరః ॥
తైజసానాం యథారత్నం ఆశ్రమాణాం ద్విజోయథా ।
నదీనాంచ యథా గంగా మంత్రాణాం ప్రణవోయథా ॥
తులసీ సర్వపత్రాణాం ధారాణాంచ వసుంధరా ।
పుష్పాణాం పారిజాతంచ కాష్టానాం చందనం యథా ॥
విష్ణుపూజాచ తపసాం వ్రతే ష్వేకాదశీ యథా ।
జ్ఞానినాంచ యథా శంభుః సిద్దానాంచ గణేశ్వరః ॥
దేవానాంచ యథావిష్ణు: వేదాః శాస్రషుతంత్రతః ।
దేవీనాంచ యథాదుర్గా శాంతానం కమలాయథా ॥
సరస్వతీచ విదుషాం రాధికాసుందరీషుచ ।
తథాస్తోత్రేష్విదంస్తోత్రం నాతః పరతరం వ్రజ ॥
పురాదత్తం బ్రహ్మణేచ పుష్కరే సూర్యపర్వణి ।
దైత్యగ్రస్తాయ భీతాయ సర్వదుర్గహరం పరం ॥
శివాయ శత్రుగ్రస్తాయ దదౌ బ్రహ్మా యదాజ్ఞయా ।
శివశ్చసనకాదిభ్యః పురాదూర్వాస సేదదౌ ॥
సనత్కుమారోభగవాన్ కృపయా గౌతమాయచ ।
పులహాయ పులస్త్యాయ దదౌచాంగిరసే ముదా ॥
తథాచంద్రాయ సూర్యాయ సూర్యశ్చాపి యమాయచ ।
యమశ్చ చిత్రగుప్తాయ కృపయాచపురాదదౌ ॥
నిత్యం పఠిష్యసి స్తోత్రం గోలోక గమనాయవై ।
సాక్షాత్పశ్యసి భోతాత తామేవ పార్వతీమిహ ॥
య స్మైక స్మైనదాతవ్యం పాపినే గోపనం కురు ।
నారాయణస్యభక్తాయ శాంతాయ విదు షేతథా ॥
సర్వజ్ఞాయచ విప్రాయ ప్రదాతవ్యం ప్రయత్నతః ।
విప్రాయ వృషవాహాయ వృషలీ పతయే తథా ॥
శూద్రాణాం సూపకారాయ శూద్రశ్రాద్ధాన్న భోజినే ।
కన్యా విక్రయిణే చైవ బ్రాహ్మణాయ విశేషతః ॥
సర్వసిద్ధించలభతే సిద్ధస్తోత్రో భవేద్యది ।
దశాయుతజ పేనైవ సిద్ధస్తోత్రోభవేన్నరః ॥
అగ్నిస్తంభంజలస్తంభం మృత్త్సంతంభం మనసస్తథా ।
అశ్వమేధ సహస్రాచ్చ పృథివ్యాశ్చ ప్రదక్షిణాత్ ॥
స్నానాచ్చ సర్వతీర్ధానాం స్తోత్రమేతచ్చపుణ్యదం ।
దత్తంతుభ్యం మయాతాత మమప్రాణసమంవ్రజ ॥
స్తవనం కురుపార్వత్యాశ్చేదానీం మమసంసది ।
శ్రీకృష్ణస్య వచః శ్రుత్వానందః తుష్టావ పార్వతీం ॥
లోభము, మోహము, కామము, క్రోధములను, కర్మమూలములను నశింపచేసేది, బలము, బుద్ధి వీనిని ఇచ్చేది, జన్మము, మృత్యువు వీనిని నశింపచేసేది, ఈస్తోత్ర పఠనము. (50) నరులకు ధనము, పుత్రులు, ప్రియురాలు, భూమి అన్ని సంపదలను ఇచ్చేదిది. శోకదుఃఖములను హరించేది, అన్నిటిని సిద్ధింపజేసేది, వరమైనది (51) ఈ స్తోత్రరాజాన్ని చదివితే గొప్ప గొడ్రాలు కూడా సంతతి నందుతుంది. దుఃఖితుడు బంధనం నుండి ముక్తుడౌతాడు. భయము నుండి ముక్తుడౌతాడు, నిశ్చయము. (52) రోగి, రోగమునుండి ముక్తుడౌతాడు. దరిద్రుడు ధనవంతుడౌతాడు. దావాగ్ని మధ్యంలోనివాడు చావడు. గొప్ప సముద్రంలో నావ భగ్నమైనవాడు చావడు. (53) దొంగలబారినపడ్డవాడు, శత్రువులకు చిక్కినవాడు, హింసించే జంతువుల పాలబడినవాడు, నరుడు ఈ స్తోత్రం చదివితే కల్యాణాన్ని పొందుతాడు ఓ వైశ్యశ్రేష్ఠ! (54) కాంతివంతమైన వానిలో రత్నము, ఆశ్రమములలో (కు) బ్రాహ్మణుడు ఎట్లాగో , నదులలో గంగ, మంత్రములలో ప్రణవము, (55) ఆకులలో తులసి, భూములలో వసుంధర (ధరించేవానిలో), పుష్పములలో పారిజాతము, కట్టెలలో చందనము (56) తపస్సుచేసే వారికి విష్ణుపూజ, వ్రతములలో ఏకాదశీవ్రతం, జ్ఞానులలో శివుడు, సిద్ధులలో గణేశ్వరుడు (57) దేవతలలో విష్ణువు, శాస్త్రములలో ప్రధానమైన వేదములు, దేవతా స్త్రీలలో దుర్గ, శాంతరూపులలో లక్ష్మి (58) విద్వాంసులలో సరస్వతి, సుందర స్త్రీలలో రాధిక ఎట్లో అట్లాగే సోత్రములలో ఈ స్తోత్రము అలాటిది. దీన్నిమించింది లేదు, ఓప్రజ! (59) ఇదివరలో, సూర్య పర్వమందు పుష్కర తీర్థంలో దైత్యులకు పట్టుబడ్డ భయపడ్డ బ్రహ్మకు ఇవ్వబడిందీ స్తోత్రం. సర్వదుర్గములను (పోలేనివి) తొలగించేది, వరమైనది. (60) నా ఆజ్ఞతో శత్రుగ్రస్తుడైన శివునకు బ్రహ్మ ఇచ్చాడు. శివుడు, సనకాదులకు, దుర్వాసునకు ఇది వరలో ఇచ్చాడు. (61) భగవాన్ సనత్కుమారుడు దయతో గౌతమునకిచ్చాడు. పులహునకు, పులస్త్యునకు, ఆంగిరసునకు, సంతోషంతో ఇచ్చాడు. (62) అట్లాగే చంద్రునకు సూర్యునకు ఇచ్చాడు. సూర్యుడు యమునకిచ్చాడు. యముడు చిత్రగుప్తునకిచ్చాడు, ఇదివరలో దయతో, (63) గోలోకం పోవటానికై ఈ స్తోత్రాన్ని రోజు చదివితే , ఓ తండ్రి! ఆ పార్వతినే ఇక్కడ సాక్షాత్తుగా చూస్తావు. (64) ఎవడో ఒక పాపికి ఇవ్వరాదు. పాపినుండి దీన్ని రక్షించాలి. నారాయణుని భక్తునకు, శాంతునకు, విద్వాంసునకు (65) అన్ని తెలిసిన విప్రునకు ప్రయత్నపూర్వకంగా ఇవ్వాలి. ఎద్దులను తోలే విప్రునకు, గొడ్రాలి పతికి, (66) శూద్రులకు వంటచేసే వానికీ, శూద్రశ్రాద్ధాన్నాన్ని భుజించే వానికి, కన్యను విక్రయించేవానికి, ప్రత్యేకించి బ్రాహ్మణునకు (67) ఇస్తే, ఆతనికి ఈ స్తోత్రం సిద్ధిస్తే, అన్ని సిద్ధులను (సర్వసిద్ధి) పొందుతాడు. లక్షసార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే స్తోత్రసిద్ధిని పొందుతాడు నరుడు (68) అగ్ని స్తంబము, ‘జలస్తంబము, మట్టి స్తంబనము, మన స్తంబనము, వేయి అశ్వమేధములు, భూప్రదక్షిణము, (69) సర్వతీర్థముల స్నానము వీటన్నిటికన్న ఈ స్తోత్రము పుణ్యమునిచ్చేది. ఓ ప్రజ! నేను నీకు దీన్ని ఇచ్చాను. ఇది నాకు ప్రాణసమమైనది, ఓ తండ్రి! (70) ఇప్పుడు నా సభలో పార్వతీ స్తవాన్ని చెయ్యి. ఈ కృష్ణుని మాటలను విని, నందుడు తల పై పార్వతిని స్తుతించాడు.
మూ॥ స్తోత్రేణానేన విప్రేంద్ర సర్వసంపత్ర్పదాయినీం ।
వరంత స్మైదదౌ దుర్గా గోలోకవాస మీప్సితం ॥
దుర్లభంపరమజ్ఞానం వేదేమన్న శ్రుతంమునే ।
రాజేంద్ర స్త్వం గోకులేచ కృష్ణభక్తి: సుదుర్లభాం ॥
తద్దాస్యంచాపి పరతో మహత్వం సిద్ధమేవచ ।
వరందత్వాయయౌ దుర్గా సంభాష్య శంభునా సహ ।
జగ్ముః దేవాశ్చమునయః స్తుత్వాచ నందనందనం ॥
ఉవాచనందం శ్రీకృష్ణో ప్రజ నందం ప్రజాన్వితః ।
ప్రహృష్టస్యక్త మోహశ్చ బోధనే దుర్లభేనచ ॥
ఇతి బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్ధ నారాయణ నారద సంవాదే శ్రీభగవన్నంద సంవాదే అష్టాశీతితమోఽధ్యాయః॥
ఓ విప్రేంద్ర! ఈ స్తుతితో , అన్ని సంపదలనిచ్చే , కోరతగిన, గోలోకవాసమును వరముగా, ఆతనికి దుర్గ ఇచ్చింది. (72) ఓముని! ఇది వేదములలో విన్పడనిది (చెప్పనిది) దుర్లభమైనది, పరమజ్ఞానము ఇది. గోలోకంలోను నీవు రాజేంద్రుడవే, చాలా దుర్లభమైన కృష్ణభక్తిని పొందుతావు. (73) తరువాత ఆదాస్యమును పొందాడు. అది చాలా గొప్పది సిద్దమైనది. శంభునితో మాట్లాడి, వరమిచ్చి దుర్గ వెళ్ళిపోయింది. నందనందనుని స్తుతించి దేవతలు, మునులు వెళ్ళిపోయారు. (74) నందునితో శ్రీకృష్ణుడన్నాడు - ప్రజవాసులతో కూడి నందమునకు వెళ్ళు. దుర్లభమైన బోధతో ఆనందించాడు నందుడు. ఆతని మోహం పోయింది. (75) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు శ్రీభగవన్నంద సంవాదమందు ఎనుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 88 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Detailing practical daily discipline, the text outlines the sacred rules for morning ablutions, ceremonial bathing in rivers, wearing clean garments, and applying sacred tilaka upon the forehead. It expounds upon the performance of morning and evening Sandhyā prayers, the silent chanting of the Gayatrī Mantra, and inner mental purification. Practicing these daily disciplines cleanses the subtle body, sharpens intellectual clarity, and prepares the practitioner for deep absorption in devotional service.