బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

114 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

కృష్ణ పుత్రశ్చ ప్రద్యుమ్నోమహాబలపరాక్రమః

తత్పుత్రోప్యనిరుద్ధశ్చ విధాతురంశ ఏవచ

ఏకదాసావనిరుద్ధో నవయౌవన సంయుతః

సుప్తోరహసి పర్యంకే పుష్పచందనచర్చితే

స్వప్నేదదర్శయువతీం పుష్పోద్యానే సుపుష్పితే

సుగంధి పుష్పేతత్రేమ స్నిగ్ధ చందన చర్చితే

శయానాంసుస్మితాం రమ్యాం నవయౌవన సంయుతాం

అమూల్యరత్ననిర్మాణ భూషణేన విభూషితాం

 చారుకేయూరవలయ శంఖ కంకణ శోభితాం

మణికుండల యుగ్మేన గండస్థల విరాజితాం

అతీవ సూక్ష్మవసనాం క్వణన్మంజీర రంజితాం

పక్వబింబాధరోష్ఠించ శరత్కమలలోచనాం

వైపు శరత్పద్మప్రభముష్టకోటిందునిందితాననాం

ముక్తాపంక్తి సమాసాద్య దంతపంక్తి మనోహరాం

 అను త్రివక్ర కబరీభారాం మాలతీమాల్య భూషితాం

కస్తూరీ కుంకమాలక్ష స్నిగ్ధచందన కజ్జలైః

పత్రావలీవిరచితసుకపోల స్థలోజ్జ్వలాం

దాడిమీకుసుమాకార సిందూరబిందు భూషితాం

శ్రీరామకదలిస్తంభ నిందితోరుస్థలోజ్జ్వలాం

అత్యుచ్ఛైర్వర్తులాకారస్తనయుగ్మ విభూషితాం

నితంబ భారనమ్రాంచ కామబాణ ప్రపీడితాం

 కాముకీకమనీయాంచ పశ్యంతీం వక్రచక్షుషా

కుంకుమలక్త రక్తాక్త పాదపద్మ విరాజితాం

వాయుప్రేరణ వస్తేణ వ్యక్త గుప్తస్థలోజ్జ్వలాం

తాందృష్ట్వా కామపుత్రశ్చ కామోన్మథితమానసః

ఉవాచమధురం మత్తః కామమతాం సుకోమలాం

చారుచంపక వర్ణాభాం కామేనపులకాన్వితాం

అతిప్రౌడాం నవోఢంచ శృంగారేచ్ఛాసు చంచలాం

అనిరుద్ద ఉవాచ :

కిందేవీ కించ గాంధర్వీ కాత్వం కామినికాననే

కస్య స్త్రీ కస్య కన్యావా కంవావాంఛసి సుందరి

త్రైలోక్యా తులసౌందర్యా మునిమానస మోహినీ

నభిభేషి కథం బ్రూహి స్వయమేకాకినీచమాం

నారాయణుడిట్లా -

కృష్ణుని కొడుకు ప్రద్యుమ్నుడు గోప్ప బలపరాక్రమములు కలవాడు. అతని కొడుకు, అనిరుద్ధుడు బ్రహ్మయొక్క అంశము (1) నవ యౌవనం గల ఈ అనిరుద్ధుడు ఒకసారి పుష్పములు చందనము పూయబడిన పడకయందు రహస్యంగా పడుకొన్నప్పుడు (2) బాగా పుష్పించిన పుష్పోద్యానమందు కలలో ఒక యువతిని చూచాడు. ఆమె ప్రేమ అనే మృదువైన చందనము పూయబడ్డ మంచివాసనగల పుష్పమందు ఆమె ఉంది. (3) పడుకొన్న చిరునవ్వు నవ్వుతున్న రమ్యమైన, నవయౌవనం గల ఆమె ఆమూల్యరత్నములతో నిర్మింపబడ్డ అలంకారములతో అలంకరించబడ్డది. (4) అందమైన భుజాభరణములు, కడియము, శంఖముల చేతి కడియముల (గాజుల)తో అలంకరింపబడ్డది. మణులతో చేసిన రెండు కుండలములతో చెక్కిలి భాగము ప్రకాశిస్తోంది. (5) చాలా సన్నని వస్త్రము గలది శబ్దిస్తున్న కాలి అందెలతో వెలిగిపోతోంది. పండిన దొండపండు వంటి కింది పెదవిగలది, శరత్కాల మందలి కమలముల వంటి కళ్ళు గలది. (6) శరత్కాలమందలి పద్మముల కాంతిని దొంగిలించి కోటి చంద్రుల కాంతిని వెక్కిరిస్తోంది ఆమె ముఖం ముత్యముల వరుసతో సమమనదగిన దంతపంక్తితో మనోహరంగా ఉంది. (7) మూడు వంకరలుగల కేశపాశముల బరువు గలది, తలలో మాలతీ మాల అలంకరించబడింది. కస్తూరి, కుంకుమ, లాక్షారసము వీనితో, నును పైన చందనము కాటుకలతో రాజిల్లుతోంది. (8) పత్రావలితో కూర్పబడిన మంచి చెక్కిలి భాగముతో వెలుగుతున్నది. దాడిమపూవు ఆకారం వంటి సిందూర బిందువుతో అలంకరింపబడినది. (9) శ్రీరామకదళీ (అరటి) స్తంభముల నిందించే ఊరువుల భాగముతో ప్రకాశిస్తున్నది. చాలా ఎత్తైన, గుండ్రని ఆకారముగల స్తనముల జంటతో అలంకరింపబడింది. (10) నితంబముల భారముతో వంగినట్టిది, కాముని బాణముతో బాగా పీడింపబడ్డది. కాముకి, కమనీయమైనది, వంకర చూపుతో చూస్తున్నది. (11) కుంకుమ, లత్తుక వీనితో రక్తమువలె ఎర్రని పాదపద్మములతో ప్రకాశిస్తున్నది గాలివల్ల ప్రేరేపింపబడి, వస్త్రం తొలగగా స్పష్టంగా కన్పిస్తున్న రహస్య స్థలముతో వెలిగిపోతున్నది. (12) ఆమెను చూచి, కాముని పుత్రుడు కామముతో చెదిరిన మనస్సుగలవాడై, మత్తుడై మధురముగా కామముతో మదించిన, చాలా కోమలమైన ఆమెతో ఇట్లన్నాడు. (13) అందమైన చంపకమువంటి వర్ణకాంతి గలిగి, కామంతో పులకరింతలుగల, చాలా ప్రౌఢవయస్కురాలైన, కొత్తదనంగల, శృంగారపు కోరికలతో చాలా చంచలమైన ఆమెతో అన్నాడు (14) అనిరుద్ధుడిట్లా - నీవు దేవతవా, గంధర్వ స్త్రీవా, ఈ అడవిలో నీవెవరు ఓ కామిని! ఎవరి స్త్రీవి, లేదా ఎవరికన్యవు, సుందరి! ఎవడిని కోరుకుంటున్నావు. (15) ముల్లోకములలో సాటిలేని సౌందర్యముగల, మునుల మనస్సును మోహింపజేయగల దాన, స్వయంగా ఒంటరిదానివై ఉండీ నన్ను చూసి భయపడటం లేదు. ఎందుకో చెప్పు?(16)

మూ అహంత్రైలోక్యనాథస్య పౌత్రః కామాత్మజోఆధునా

కాంతే హమనిరుద్ధశ్చ నవీనయావనాహతః

కమనీయశ్చ కామీచ కామశాస్త్ర విశారదః

కాముకీ కామనాం పూర్ణాం కర్తుమేవేశ్వరః స్వయం

మాంభజస్వ సుశీలేత్వం సువేషంచసుశీలకం

రతిశూరం రతిరసప్రాజ్ఞం రతిరసప్రియం

రతిపుత్రం రతిరసం ప్రమత్తం రసికం ప్రియే

యువానం వ్యాధిహీనంచ కాముకం కాముకీచ్ఛతి

విదగ్గా సువిదగ్ధంచ కాంతమాయాతికామతాం

విదగ్ధయా, విదగ్ధన సంగమో గుణవాన్ భవేత్

ప్రచ్ఛాద్య లోచనాస్యంచ నవ సంగమలజ్జితా

విలోకయంతీ వక్రాక్షికోణేన తమువాచసా

కామిన్యువాచ :

కాముకః కామపుత్రోసికామేన వ్యాకులో అధునా

భవాంశ్చత్కాముకీ యోగ్యో నకామః చింతితః కథం

పౌత్రస్రైలోక్యనాధస్య స్వతః సంభావితస్యచ

స్వయం యోగ్యో యోగ్యపుత్రో వివాహం న కథంకురు

వివాహితా యజ్ఞపత్నీసాచ పుణ్యవ్రతాసతీ

నిశ్చలాసతతం సాధ్యావర్ధినీ సంగినీసదా

భయప్రీతిదానసాధ్యా గుప్తపత్నీత్వనిశ్చలా

నైమిత్తికా ననిత్యాసా సాచవేద వివర్జితా

పరంనరక సోపానా పరత్రేహాయశస్కరా

సాధుస్తత్ర నహిరత వంశజోవైష్ణవోయది

యదపూర్వం భవేద్ర్భాంతో నివృత్త:సాధుసంగతః

ప్రవృత్తి రేషాభూతానాం నివృత్తిస్తు మహాఫలా

ప్రాయశ్చిత్తీ పునర్లిప్తో నివృత్తః పాతకీయది

ఉపాహాస్యో భువిభవేత్సర్వం కుంజరశాచవత్

 సుశీలా సుందరీ శాంతా ధర్మపత్నీ ప్రశంసితా

పతివ్రతా సుసాధ్యా సా శశ్వత్ సుప్రియవాదినీ

కోమలాంగీ విదగ్దాచ శ్యామారతి సుఖప్రదా

ఏవం భూతాం పరిత్యజ్య వైష్ణవః తపసే వ్రజేత్

సాచేత్ పరిణతాసాధ్వీ శాంతాపుత్రవతీయదా

అన్యథాచ వృథా సర్వంతపసః స్థలనంభవేత్

అను! నేను త్రైలోక్యనాధుని పౌత్రుడను. కాముని కొడుకును. ఓ కాంత! నేను అనిరుద్ధుడను వాడిని. నూత్న యౌవనంతో బాధపడ్తున్నాను. (17) కమనీయమైనవాణ్ణి, కోరతగినవాణ్ణి. కామంగలవాడిని కామశాస్త్రంలో విశారదుడను.నేను స్వయంగా, కాముక స్త్రీ కామనను పూర్తిచేయుటకు సమర్థుడనే (18) మంచి వేషము, మంచిశీలముగల నన్ను ఓ సుశీల! నీవు పొందుము. రతియందు శూరుణ్ణి. రతిరసమందు ప్రాజ్ఞుణ్ణి. రతిరసమంటే చాలా ఇష్టం గలవాణ్ణి. (19) రతికి పుత్రుణ్ణి, రతి రసుడను (సారము) బాగా మత్తుణ్ణి రసికుణ్ణి, ఓ ప్రియ! యువకుణ్ణి, వ్యాధిలేనివాడిని, కాముకుడిని కాముకురాలు ఇష్టపడుతుంది. (20) విదగ్గురాలు (పండిరాలు) చాలా పండితుడైనవాడిని కాంతుడిని, కామంతో చేరుతుంది. విదగ్గురాలు, విదగ్గునితో సంగమిస్తే, గుణవంతంగా ఉంటుంది. (21) కనుక రెప్పలను మూసుకుని, కొత్త సంగమమునకు సిగ్గుపడుతూ, ఆతడిని వంకరైన ఓర చూపుతో చూస్తూ, ఆమె ఇట్లా అంది. (22) కామిని ఇట్లా - కాముకడవు కాముని పుత్రుడవు ఇప్పుడు కామంతో వ్యాకులముగా ఉన్నావు. కాముకురాలికి నీవు యోగ్యుడవైతే కాముడు ఎట్లా విచారపడదు. (23) సహజంగా గౌరవింపబడే త్రైలోక్యనాథుని పౌత్రుడవు. స్వయంగా యోగ్యుడవు, యోగ్యునకు పుత్రుడవు. ఎట్లా వివాహం చేసుకోను. (24) (అగ్ని) యజ్ఞంలో పత్నియైనది, వివాహిత ఆమె పుణ్యవ్రతము గలది, సతి, నిశ్చలురాలు, ఎల్లప్పుడూ సాధించతగినది (పొందుటకు) ఎప్పుడూ సంగమమును పెంచేది (25) రహస్యమైన భార్య (అవివాహ భార్య) అనిశ్చలమైంది. భయముతో కూడిన ప్రీతి, దానములతో పొందదగినది. నైమిత్తికమైనది, నిత్యురాలుకాదు. (ఎప్పుడూ పొందేదికాదు) ఆమె. ఆమె వేదములలో వర్ణింపతగినది. (26) పైగా పైలోకంలో నరకానికి మార్గము. ఈ లోకంలో అపకీర్తిని తెచ్చేది. సాధు జనుడు అట్టి దానిని ఇష్టపడడు. వంశంలో పుట్టినవాడై వైష్ణవుడై ఉంటే ఇష్టపడడు. (అగ్నిసాక్షి భార్యనే ఇష్టపడతాడు.) (27) మొదట భ్రాంతుడైనా సజ్జన సహవాసం వల్ల అవివాహిత భార్యనుండి మరలి పోతాడు. ఇది ప్రాణుల స్వభావము. అట్లా నివృత్తుడైతే గొప్ప ఫలమందుతాడు. (28) ప్రాయశ్చిత్తము చేసుకున్నా తిరిగి ఆమెను చేరితే మళ్ళీ వెనక్కువస్తే పాతకుడౌతాడు. లోకంలో నవ్వులపాలౌతాడు. అంతా ఏనుగ మలం విసర్జించినట్లు (మలంలోనే తిరుగాడుతుంటుంది (29) మంచిశీలము, సౌందర్యము కలిగి శాంతురాలైన ధర్మపత్ని ప్రశంసించతగినది. ఆమె పతివ్రత, సులభంగా లొంగేది. ఎప్పుడూ తీయగా మాట్లాడుతుంది. (30) కోమలమైన అవయవముగలది, విదగ్గురాలు (పండితురాలు), శ్యామురాలు (మౌవన మధ్యమందున్నది) రతిలో సుఖాన్నిచ్చేది. ఇట్టి దానిని వదిలి వైష్ణవుడు తపస్సుకు వెళితే (31) ఆమె పరిణతురాలై సాధ్వియై, శాంతయై పుత్రవతియైతే మంచిది. లేకున్న అంతావ్యర్ధము. తపస్సు స్టలనమౌతుంది (చెడుతుంది). (32)

మూ అసాధుశ్చ కువంశ్చత్ పరనారీం ప్రయాతిచేత్

సయాతి నరకం ఘోరం పితృభిః సప్తభిఃసహ

అహమూషా బాణకన్యా బాణః శంకర కింకరః

రణేత్రైలోక్య విజయీ శంకరో జగతాం పతిః

న స్వతంత్రా పరాధీనా త్రిషుకాలేషుకామినీ

పుంశ్చలీ యా స్వతంత్రా సాప్య ఆసద్వంశ ప్రసూతికా

పితా దదాతి కన్యాంతాం సుయోధ్యాయ వరాయచ

 కన్యా వరం న యాచేత ధర్మ ఏషసనాతనః

త్వంచయోగ్యోసి యోగ్యాహం మామిచ్ఛసి యదిప్రభో

బాణం ప్రార్థయ శంభుంవాప్యథవా పార్వతీం సతీం II

ఇత్యుక్త్వా సుందరీసాధ్వీ సాంతర్గానా బభూవహ

నిద్రాం తత్యాజ సహసా కామీకామాత్మ జోమునే

బుద్వా స్వప్నం స విజ్ఞాయ కామేన వ్యధాంతాంతరః !

బభూవవ్యాకులో శాంతో న దృష్ట్వా ప్రాణవల్లభాం

త్యక్త్వాఆహారమనిద్రశ్చ ప్రమత్తశ్చ కృశోదరః

క్షణం తిష్ఠతి శేతేచ క్షణం రహసిరోదితి

పుత్రం దృష్ట్వాతు క్రందంతం దేవకీరుక్మిణీ రతిః

అన్యాశ్చ యోషితః సర్వాః కథయామాసు రీశ్వరం

తాసాంచ వచనం శ్రుత్వా ప్రహస్య మధుసూదనః

ఉవాచ సర్వతత్వజ్ఞః కృష్ణశ్చ పూర్ణమానసః

శ్రీభగవానువాచ :

కామాతురా బాణకన్యా రతిందృష్ట్యా శివేశయోః

వరం సంప్రాప దుర్గాయా వ్యాకులా మదనాస్త్రతః

స్వప్నంచ దర్శయామాస నానిరుద్ధంచ పార్వతీ

మమపాత్రం ప్రమత్తంచ చకార కౌతుకేనచ

తత్పుత్రించ ప్రమత్తాంతాం కరోమిస్వప్నతో అధునా

స్వచ్చందం తిష్ఠ నచిరం నాస్తి చింతామనోవ్యథా

ఇతికృష్ణః సమాశ్వాస్య సర్వాత్మా సర్వసిద్ధివిత్

స్వప్నంచ దర్శయామాస బాణ పుత్రీంచ కాముకీం

సుప్తా సుతల్పే బాలా సా పుష్పచందన చర్చితే

నవమౌనవ సంయుక్త రత్నభూషణ భూషితా

శయానా రత్నపర్యంకే దదర్శస్వప్నమీప్సితం

అతీవనిర్జనేదేశ రత్ననిర్మాణ మందిరే

అను !! అసజ్జనుడు, కువంశమువాడైతే పరస్త్రీని పొందితే, ఆతడు ఘోర నరకానికి పోతాడు, ఏడుతరాల పితరులు కూడా వెళ్లారు. (33) నేను ఉషను, బాణుని కూతురును బాణుడు శంకరుని భృత్యుడు. యుద్దమందు ముల్లోకముల జయించినవాడు. శంకరుడు జగత్పతి (34) నేను స్వతంత్రురాలను కాను. మూడు కాలములలో కామిని పరాధీనురాలే. కులట ఐతే స్వతంత్రురాలు, చెడ్డ వంశంలో పుట్టిందైతే. (35) కన్యను తండ్రి మంచి యోగ్యుడైన వరునకు ఇస్తాడు. కన్య వరుని కోరకూడదు. ఇది సనాతన ధర్మము. (36) నీవు యోగ్యుడవు. నేను యోగ్యురాలను, ఓ ప్రభు! నన్ను నీవు కోరేటట్లైతే బాణునో, శివునో, సతిపార్వతినో అడుగు. (37) అని పలికి ఆ సుందరి, సాధ్వి, ఆమె అంతర్ధానమైంది. ఓముని! కాముని ఆత్మజుడైన ఆకామి త్వరగా నిద్ర నుండి మేల్కొన్నాడు. (38) లేచి తాను చూచింది కల అని తెలుసుకొని కామంతో మనస్సంతా బాధపడగా, వ్యాకులుడు, అశాంతుడు, ఐనాడు, ప్రాణవల్లభ కన్పించలేదు కనుక (39) తిండి విడిచి పెట్టాడు, నిద్రలేదు, చిక్కిపోయాడు, బాధలో ఉన్నాడు. కొద్దిసేపు కూర్చుంటాడు, కొద్ది సేపు నిద్రపోతాడు, కొద్ది సేపు ఒంటరిగా ఏడుస్తాడు. (40) ఏడుస్తున్న కొడుకును చూచి దేవకి, రుక్మిణి, రతి ఇతర స్త్రీలంతా ఈశ్వరునితో (కృష్ణునితో) చెప్పారు. (41) వారి మాట విని మధుసూదనుడు నవ్వి, పూర్ణ మానసుడు, అన్ని తత్వములనెరిగిన కృష్ణుడు ఇట్లన్నాడు. (42) భగవంతుడిట్లా - రతిని చూచి, కామాతురురాలైన బాణకన్య ఈశుడు శివావీరవరాన్ని పొందింది. దుర్గవరమును పొంది మదనుని బాణముతో వ్యాకులురాలైనది (43) పార్వతి కల కూడాచూపించింది అనిరుద్ధుని చూపలేదు. కౌతుకంతో నా పౌత్రుని ప్రమత్తునిగా చేసింది. (44) ఇప్పుడు కల ద్వారా ఆమె పుత్రికను, ఆ అమ్మాయిని ప్రమత్తురాలనిగా చేస్తాను స్వేచ్ఛగా ఉండండి. త్వరలోనే చేస్తా. మనోవ్యథకాని చింతకాని వద్దు. (45) అని కృష్ణుడు ఓదార్చి, సర్వాత్ముడు, సర్వసిద్ధులు తెలిసినవాడు, కాముకియైన బాణపుత్రికకు కలను చూపించాడు. (46) పుష్పములు చందనమువీనితో పూయబడిన మంచి పడకయందు ఆ బాలిక నిద్రపోయింది. నవయౌవనం కలది, రత్నభూషణములను అలంకరించుకుంది. (47) రత్నపు పడకయందు పడుకొని కోరిన స్వప్పాన్ని చూచింది. మిక్కిలి నిర్జనమైన ప్రదేశమందు రత్నములతో నిర్మించిన మందిరమందు.(48)

మూ నవీననీరద శ్యామమతీవ నవయౌవనం

కోటికందర్పలీలాభంసస్మితం సుమనోహరం

రత్నకేయూర వలయరత్నమంజీర రంజితం

రత్నకుండలయుగ్మేన గండస్థల విరాజితం

చందనోక్షిత సర్వాంగం భూషితం పీతవాససా

సుచారుమాలతీమాల్య వక్షఃస్థలసముజ్జ్వలం II

శయానం రత్న పర్యంకే పుష్పచందన చర్చితే

తందృష్ట్వా సహసా సాధ్వీ తన్మూలం ప్రయహౌముదా II

ఉవాచ మధురం సాధ్వీ హృదయేన విదూయతా

కామాత్మజ ప్రియా కాంతా కామబాణ ప్రపీడితా

ఉషోవాచ :

కస్త్వంకాముక భద్రంతే మాంభజస్వస్మరాతురాం

అతిప్రౌఢాం నవోఢంచ నవసంగమలాలసాం

తవానురక్తం భక్తాంచ గాంధర్వేణ సముద్వహ

వివాహాష్టప్రకారేషు గాంధర్వః సులభోనృణాం

అనురక్తం ప్రియాంప్రాప్య త్యజేద్యః కపటీపుమాన్

తస్మాద్యాతి మహాలక్ష్మీః శాపందత్వా సుదారుణం

పుమానువాచ :

అహంకృష్ణస్య పౌత్రశ్చ కామదేవాత్మజః స్వయం

కథంగృహ్ణమిత్వాంకాతే తయోరనుమతించినా

ఇత్యేవముక్త్వాసపుమాన్ అంతర్ధానం చకార సః

కామేన వ్యాకులా కాంతా న దృష్ట్వా కాంతమీప్సితం

నిద్రంత్యక్త్యా సముత్థాయ తలాదేవ మనోహరాత్

విషసాద సఖీమధ్యే ప్రమత్తారుదతీభృశం

పప్రచ్ఛతాం వరాలీనాం కింకిమిత్యేవ నిశ్చితం

ఉవాచ బోధయామాస చిత్ర లేఖా సుయోగినీ

చిత్రలేఖోవాచ :

చేతనం కురుకల్యాణి కస్మాత్తేభీతిరుల్బణా

స్వయం శంభుః శివాసాక్షాత్ దుర్లం ఘ్యే నగరే సతి

శివస్మరణమాత్రేణ సర్వారిష్టం పలాయతే

శివంభవతి సర్వత్ర శివఏవ శివాలయః

ధ్యానాత్ దుర్గతి నాశిన్యాః సర్వదుర్గంవినశ్యతి

దదాతి మంగలంత స్మై సర్వమంగళ మంగళా

చిత్రలేఖావచః శ్రుత్వాకించిన్నోవాచ సుందరీ

త్యక్తాహారంచ నిద్రాంచ పురుషంచింతయేత్సదా

కొత్తగా వర్షించే మేఘమువలె శ్యామలవర్ణుడు. మంచి నవయౌవనంలో ఉన్నాడు. కోటి మన్మథుల లీలవంటి కాంతిగలవాడు. చినరునవ్వు నవ్వుతున్నాడు, చాలా మనోహరంగా ఉన్నాడు. (49) రత్నములతో చేసిన కేయూరములు వలయములు, రత్నముల కాలి అందెలు వీనితో ప్రకాశిస్తున్నాడు. రత్నములవి రెండు కుండలములు ఉన్నాయి. అవి చెక్కిళ్ల పై ప్రకాశిస్తున్నాయి. (50) ఒంటినిండా చందనముంది, పచ్చని వస్త్రముతో అలంకరించుకున్నాడు. అందమైన మాలతీ మాలను వక్షఃస్థలమందు ధరించి వెలిగిపోతున్నాడు. (51) రత్నపర్యంక మందు పడుకొని ఉన్నాడు. ఆపడక నిండా పూలుచందనము ఉన్నాయి. ఆతనినిచూచి త్వరగా ఆసాధ్వి ఆనందంతో ఆతని దగ్గరకు చేరింది. (52)హృదయంలో బాధపడుతూ ఆసాధ్విమధురంగా ఇట్లా అన్నది. కాముని కొడుకైన వానికి ప్రియురాలు, మనోహరంగా ఉంది. కాముని బాణంతో బాగా పీడింపబడుతోంది. (53) ఉష ఇట్లా - ఓ కాముక! నీవెవరు. నీవు క్షేమమా. మన్మథునితో బాధపడుతున్న నన్ను చేరు. చాలా ప్రౌఢవయస్కురాలను, నూతన యౌవనాన్ని వహిస్తున్నాను. తొలి సంగమమునందు ఆసక్తి కలదానిని (54) నీయందు అనురక్తురాలిని, భక్తురాలిని. గాంధర్వప్రకారం నన్ను వివాహమాడు. ఎనిమిది రకాల వివాహాలలో రాజులకు గాంధర్వము సులభము. (55) అనురక్తురాలైన ప్రియను పొంది ఎవడైనా కపటపుమనిషి వదిలి పెడితే, వానినుండి లక్ష్మి వెళ్ళిపోతుంది. దారుణమైన శాపాన్ని ఇస్తుంది. (56) పురుషుడిట్లా - నేను కృష్ణుని పౌత్రుణ్ణి. స్వయంగా కామదేవుని కుమారుణ్ణి. ఓకాంత! (మనోహరి) వారి ఆజ్ఞ లేకుండా నిన్నెట్లో స్వీకరిస్తాను. (57) ఇంతమాత్రం పలికి ఆ పురుషుడు కనిపించకుండా పోయాడు. మన్మథుని బాధతో వ్యాకులమైన ఆస్తీ కోరిన వరుని చూడక (58) నిద్రను వదలి, మనోహరమైన తల్పం నుండి లేచి, సఖురాండ్ర మధ్యలో కూర్చొన్నది. ప్రమత్తురాలై చాలా ఏడుస్తోంది. (59) ఆమెను ఇష్టసఖురాండ్రంతా ఏమిటి? ఏమిటి? అని అడిగారు. చక్కగా కూర్చే చిత్రలేఖను చెప్పమన్నారు ఆమె. (60) చిత్రలేఖ ఇట్లా - బోధించసాగింది. ఓ కళ్యాణి! చైతన్యం తెచ్చుకో నీకింత భయమెందుకు. స్వయంగా శంభువు, సాక్షాత్తుగా పార్వతి. దాటరాని నగరము ఉండగా భయమెందుకు. (61) శివుని స్మరిస్తే చాలు అరిష్టాలన్నీ తొలగిపోతాయి. అంతటా మంచే జరుగుతుంది. శివుడే ఒకమంచికి నిలయము. (62) ధ్యానం వల్ల దుర్గతిని నశింపచేసే దుర్గవల్ల చెడు అంతా నశిస్తుంది. అన్ని మంగళములకు మంగళమైన దుర్గ వారికి మంగళమిస్తుంది. (63) చిత్రలేఖ మాటలు విని సుందరి ఏమి మాట్లాడలేదు. ఆహారం నిద్ర వదిలి ఎప్పుడు పురుషుని చింతిస్తోంది. (64)

మూll చిత్రలేఖా సఖిగత్వా బాణమాహచ తత్రియాం

దుర్గాంచ శంకరం స్కందం గణేశం యోగినం గురుం

చిత్రలేఖావచః శ్రుత్వారురోదోచ్చైః భృశంసతీ

బాణశ్చశంకరాభ్యాశే విషసాద ప్రమూర్ఛితః

జహాస శంకరో దుర్గాకార్తికేయో గణేశ్వరః

గణేశ్వర ఉవాచ :

యోదదాతి ధ్రువం దుఃఖమన స్మైదంభమోహితః

సూక్ష్మధర్మ విచారేణస విదంతి చతుర్గుణం

శివేశయోశ్చ క్రీడాంచ దృష్ట్వాయాకామమోహితా

వరంత స్యైదదౌ దుర్గా వరమేవ సుదుర్లభం

స్వప్నేగత్వా స్వయం దేవీమత్తం కృత్వా స్మరాత్మజం !

అధునా వామపార్శ్వంచ శంభోస్తిష్ఠతిమూకవత్

సర్వంజ్ఞాత్వాచ సర్వజ్ఞోభగవాన్ హరిరీశ్వరః

.స్వప్నేసువేషం పురుషం దర్శయామాస కన్యకాం

సువేషం పురుషందృష్ట్వా యువానం యువతీసతీ

పరమేచ్ఛాభవేత్త స్యాధర్మభీత్యానివర్తతే

సువేషం పురుషం దృష్ట్వా పుంశ్చలీ పాపవంశజా

త్యజేన్నిద్రాంచ స్వాహారంపతిం పుత్రం ధనం గృహం

చేతనం గృహకార్యంచ కులలజ్జంకులద్వయం

యువానంరతి శూరంచా వ్యతినీచం నహిత్యజేత్

త్యజేజ్జాతించ ధర్మంచ ప్రాణాంశ్చపరిణామతః

తస్మాత్రాజ్ఞః ప్రయత్నేన ప్రాణేభ్యోయువతీంసదా

పరిరక్షేచ్చ సతతం మాయాయుక్తాంశ విశ్వ సేత్

హృదయంక్షురధారాభం నారీణాం మధురం వచః

తాసాంమనో న జానంతి సంతోవేదాశ్చ వైదికాః

ప్రయాతుద్వారకాం సద్యః చిత్రలేఖా సుయోగినీ

అనిరుద్దం సమాహర్తుం ప్రమత్త మవలీలయా

ఇతిశ్రుత్వా మహాదేవో గణేశం తమువాచ హ

నశృణోతి యథా బాణః శుభకార్యంతథాకురు

చిత్రలేఖా యమౌతూర్ణం ద్వారకా భవనం హరేః

సర్వేషామపిదుర్లంఘ్యం లీలయా ప్రవివేశ సా

నిద్రితంచానిరుద్ధంచ సమాహృత్యచ యోగితః

రథమారోహయామాస నిద్రితం బాలకంముదా

సా మనోయామినీ భద్రాగృహీత్వా బాలకంమునే

చిత్రలేఖ, సఖివెళ్ళి బాణునకు ఆతని భార్యకు ఈ వార్తను చెప్పింది. దుర్గకు, శంకరునకు స్కందునకు గణేశునకు యోగులకు గురువైన వానికి చెప్పింది. (65) చిత్రలేఖ మాటలువిని ఆసతి అతిగా గట్టిగా ఏడ్చింది. బాణుడు శంకరుని దగ్గర దు: ఖించి, మూర్ఛించాడు. శంకరుడు, దుర్గ, కార్తికేయుడు, గణేశ్వరుడు నవ్వారు. (66) గణేశుడిట్లా - ఇతరులను ఏడ్పించేవాడు, దంభంతో మోహితుడైనవాడు తప్పకవాడు నాల్గింతల దుఃఖాన్ని అనుభవిస్తాడు, సూక్ష్మంగా ధర్మాన్ని విచారిస్తే (67) శివ ఈశుల క్రీడను చూచి ఆమె కామమోహిత ఐంది. ఆమెకు దుర్గ వరమిచ్చింది, సుదుర్లభమైన వరము. (68) స్మరుని కొడుకును కలలోకి పోయి స్వయంగా దేవి మత్తుణ్ణి చేసింది. ఇప్పుడు శివుని ఎడమ భాగంలో కూర్చుండి మూగదానిలా ఉన్నది. (69) అంతా తెలిసి సర్వజ్ఞుడు, భగవాన్ హరి ఈశ్వరుడు కలలో మంచి వేషం గల పురుషుని కన్యకకు చూపాడు. (70)మంచివేషం కల పురుషుని యువకుని చూచి సతి, ఆయువతి ఆమెకు చాలా కోరిక కలిగింది కాని ధర్మభీతితో ఆగింది. (71) మంచివేషం కల పురుషుని చూచి కులట, పాపవంశంలో పుట్టింది, నిద్రను ఆహారాన్ని వదులుకొని పతిని, పుత్రుని, ధనము, గృహములను వదిలి (72) చేతనను, ఇంటిపనిని, కులపులజ్జను, కులములు రెంటిని వదలిపోతుంది. యువకుని, రతియందు శూరుని, అతినీచునైనా వదలదు. (73) జాతిని ధర్మాన్ని చివరగా ప్రాణాన్నైనా వదులుతుంది. కనుక బుద్ధిమంతుడు ప్రయత్నంగా యువతిని ఎప్పుడూ ప్రాణములకన్న మిన్నగా (74) పరిరక్షించాలి. ఎప్పుడూ మాయగలదానిని నమ్మరాదు. హృదయము కత్తి అంచులాటిది, స్త్రీల మాట మధురము. (75) సజ్జనులు కాని వేదములు, వైదికులుగాని వారి మనస్సులను తెలుసుకోలేరు. వెంటనే మంచిగా కలిపేది, యోగురాలు చిత్రలేఖ ద్వారకకు పోనీ (76) ప్రమత్తుడైన అనిరుద్ధుని అవలీలగా తెచ్చుటకు వెళ్ళని. అనే మాటను విని మహేశుడు ఆగణపతితో ఇట్లన్నాడు. (77) బాణునికి తెలియకుండా ఈ శుభకార్యాన్ని చేయి. హరి యొక్క ద్వారక భవనానికి చిత్రలేఖ త్వరగా వెళ్ళింది. (78) అందరికి దాటరాని నగరాన్ని ఆమె అవలీలగా ప్రవేశించింది. నిద్రిస్తున్న అనిరుద్ధుడిని యోగంతో తీసుకొని వచ్చి (79) రథం పై కూర్చో పెట్టింది. నిద్రిస్తున్న పిల్లవాణ్ణి ఆనందంగా కూర్చో పెట్టింది. మనోవేగంతోపోయే ఆమె భద్రురాలు పిల్లవాణ్ణి తీసుకుని, ఓముని (80) బయలుదేరినది.

మూII ముహూర్తాత్ శోణిత పురంకృత్వా శంఖధ్వనింయయౌ అథాశ్రమాభ్యంతరేచరురుదుః సర్వయోషితః

అహోబాణహరోవత్సః క్వగతః ప్రాణవల్లభః

కృష్ణఃతాశ్చసమాశ్వాస్య సర్వజ్ఞః సర్వతత్వవిత్

సాంబకామబలైః సార్థం కృష్ణః సాత్యకినా తథా

గృహీత్వాగరుడం వీరం రథమారుహ్య సత్వరః

సుదర్శనం పాంచజన్యం పద్మం కౌమోదకీంగదాం

పశ్చాద్యాస్యతిదేవేశో నగరం శోణితం తథా

సగణైః శంకరేజైవ పార్వత్యా పరిరక్షితుం

అథ సా యోగినీ ధన్యా పుణ్యామాన్యాచయోషితాం

శిష్యా దుర్వాసనః శాంతాసిద్ధయోగేన సిద్ధిదా

బాలకం బోధయామాసరుదంతం మాతరంస్మరన్

స్నాపయిత్వాదదౌతస్మై మాల్యచందన భూషణం

కృత్వాసువేషం బాలస్యకన్యాంతః పురమీప్సితం

చక్రప్రవేశం యోగేన రక్షకైశ్చాపి రక్షితం

తామూషాం రక్షితాం దృష్ట్వా నిరాహారాం కృశోదరీం

శీఘ్రంచ బోధయామాస సఖీభిః పరివారితాం

ఉషాంకృత్వాచ సుస్నాతాం వస్త్రభూషణ భూషితాం

వస్త్రైః మాల్యైః చందనైశ్చ సిందూర పత్రకైః శుభైః

ద్వయోః సంభాషణంతత్ర మ హేంద్రేచ శుభక్షణే

కారయామాసగోష్యాచ సఖీనాం సంగమేనచ

పతివ్రతా పతిందృష్ట్వా సా రేమే విగతజ్వరా II

గాంధర్వేణ వివా హేన తామువాహ స్మరాత్మజః

రతిర్బభూవసుచిరం ఉభయోః సుఖకారణం II

దివానిశం నలుబుధే స్మరపుత్రః స్మరాతురః

ఉషాకామాతురాబ్రీడా నవోడానవసంగమాత్

మూర్ఛాం సంప్రాపపుంసశ్చ స్పర్శ మాత్రేణకాముకీ

ఏవం నిత్యంచరహసి సంగమః సుమనోహరః

బభూవసుచిరం విప్ర రాజా శుశ్రావ రక్షకాత్

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీ కృష్ణజన్మఖండ ఉత్తరార్ధే నారాయణ నారద సంవాదే బాణయుద్ధే ఉషానిరుద్ధయోః సంవాదే చతుర్దశాధికశతతమోధ్యాయః

శంఖధ్వనిని చేసి ముహూర్త కాలంలో శోణిత పురానికి వెళ్ళింది. ఇక ఆశ్రమంలోపల స్త్రీలంతా ఏడ్చారు. (81) అయ్యో! ప్రాణవల్లభుడు, బాణుని హరించగల బాలుడు ఎక్కడికెళ్ళాడో, అని కృష్ణుడు ఆఆడవారిని ఓదార్చి, అన్ని తెలిసినవాడు, అన్నితత్వము లెరిగినవాడు (82) సాంబ, కామబలములతో కూడి, సాత్యకితో పాటు కృష్ణుడు, వీరుడైన గరుత్మంతుని తీసుకొని రథం పైన ఎక్కివేగంగా (83) సుదర్శన, పాంచజన్య, పద్మ, కౌమోదకి, గదలను (ఆయుధములను) తీసుకొని ఆదేవేశుడు శోణిత నగరానికి వెనుకగా వెళ్ళాడు. (84) శంకరుడు తన గణములతో, పార్వతితో రక్షించుటకు ఉన్నారు. ఆయోగిని ధన్యురాలు, మాన్యురాలు, స్త్రీలలో పుణ్యురాలు. (85) దుర్వాసుని శిష్యులు శాంతులు, సిద్దియోగంతో సిద్ధిని ఇచ్చేవారు. తల్లిని స్మరిస్తూ ఏడుస్తున్న ఆ బాలకుని మేల్కొలిపింది. (86) స్నానం చేయించి ఆతనికి మాలలు, చందనము, అలంకారములు ఇచ్చింది. బాలునకు మంచి వేషం వేసి కోరుకునే కన్య అంతఃపురానికి (87) యోగం ద్వారా ప్రవేశించింది, రక్షకులు రక్షిస్తున్నా. రక్షింపబడుతున్న ఆ ఉషను చూచి, నిరాహరురాలును కృశోదరిని ఆమె చూచి (88) చెలికత్తెలతో చుట్టబడిన ఆమెను (ఉషను) త్వరగా మేల్కొలుపసాగినది. ఉషకు కూడా స్నానం చేయించి, వస్త్ర భూషణములతో అలంకరించి (89) వస్త్రములు, మాలలు, చందనము, సిందూర పత్రకములు శుభమైన వీనితో అలంకరించి, ఆమ హేండ్రమందు శుభక్షణమందు వారిద్దరికి సంభాషణ ఏర్పరచింది. (90) సఖుల సంగమముతో గోష్ఠిగా (అందరు ఉండగా) సంభాషణ చేయించింది. ఆపతివ్రత (ఉష) పతిని చూచి విరహజ్వరమంతాపోయి ఆనందించింది. (91) మన్మథుని కొడుకు గాంధర్వ వివాహ విధిగా ఆమెను వివాహమాడాడు. వారిద్దరికి . సుఖకారణమైన రతి (సంభోగము) చాలాకాలం జరిగింది. (92) రాత్రింబగళ్ళు తెలియలేదు. వారికి. స్మరపుత్రుడు, స్మరాతురుడు. ఉషప్రొడ, కొత్తగా వివాహిత, నవసంగమము కనుకకామాతురురాలు (93) ఆకాముకి పురుషుని స్పర్శ మాత్రంతో మూర్చపోయింది. ఈ విధంగా ప్రతిరోజు రహస్యంగా సంగమము, చాలా మనోహరంగా సాగింది. ఓవిప్ర! చాలా కాలమైంది ఇట్లా. రక్షకభటునివల్ల రాజు ఈవిషయం విన్నాడు. (94)

అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణ శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారాద సంవాదమందు బాణయుద్ధమందు ఉషానిరుద్ధల సంవాదమందు నూటపదునాల్గవ అధ్యాయము.