బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

39 - హరనిర్మాల్య శాప ప్రసంగము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :

ఇతి స్తుత్వా హిమగిరిర్వసతః శంకరస్య చ

ఉవాన పురతో దూరే లబ్ధాజ్ఞః సర్వసమ్మతః

మధుపర్కాధికం తస్మై ప్రదదౌ భక్తి పూర్వకం

మువీన్ సంపూజయామాస తతః శంకర పార్షదాన్

హిమవంతుడిట్లు స్తుతించి కూర్చుండియున్న శంకరుని ఆజ్ఞను పొంది ముందర దూరముగా అందరీ సమ్మతి పొంది నిలిచియుండెను. అట్లే పరమేశ్వరునకు భక్తితో మధుపర్కాది పరిచర్యలు చేసిను. తరువాత శంకరునీ సహచరులను, మునులనందరిని భక్తితో పూజించెను.

తదా తత్ర సమాగమ్య మేనకా స్త్రీగణైః సహ

దదర్శ వట మూలస్థం శంకరం చంద్రశేఖరం

అప్పుడక్కడికి హిమవంతుని భార్యయైన మేనకాదేవి స్త్రీ గణములతో వచ్చి శిరస్సున చంద్రుని ధరించి వటవృక్షము యొక్క మూలమందున్న శంకరుని దర్శించెను.

ఈషద్ధాన్య ప్రసన్నాన్యం వసంత వ్యాఘ్రచర్మణి

మధ్యేముని గణానాం చ జ్వలంతం బ్రహ్మతేజసా

యథాఽకాశే తారకాణాం ద్వీజరాజం విరాజితం

పరమాహ్లాదకం రూపం కందర్పకోటి సన్నిభం

విహాయ వార్ధకావస్తాం దధతం నవయౌవనం

ఆతీవ సుందరం రమ్యం చిత్తచోరం చ యోషితాం

కామం కామాతురాణాం చ నతీనాం చ సుతం యథా

వైష్ఠవానాం మహావిష్ణుం శైవానాం చ సదాశివం

శక్తి స్వరూపం శక్తానాం సౌరాణాం సూర్యరూపిణం

కాల స్వరూపం దుష్టానాం శిష్టానాం పరిపాలకం

కాలకాలనమం మృత్యోర్మృత్యుమృత్యుం భయానకం

వ్యాఘ్రచర్మ చారువస్త్రం బభూవ భన్మ చందనం

సర్పాః సుందర మాల్యాని కస్తూరీ యా విషప్రభా

జటాసు లలితా చూడా చంద్రస్త్వలీక చందనం

నుచార్వీ మాలతీమాలా గంగాధారా మనోహరా

అస్థిమాలా రత్నమాలా ధత్తూరం చారు చంపకం

ఏకీభూతం పంచవక్రం నేత్ర యుగ్మాబ్జ శోభితం

శరత్పార్వణ చంద్రాభం ప్రచ్ఛాద్య దీప్తముత్తమం

బంధుజీవ వినింద్యైకమోష్ఠాధర మనోహరం

శ్వేతశ్చంద్రో వృషేంద్రశ్చ భూతాద్యా నర్తకా ఇవ

సద్యో వ్యతిక్రమం సర్వం మహేశస్య మహేశ్వరి

దృష్ట్వైవం శివరూపం చ మేనా తుష్టా బభూవ హ

పులిచర్మమందు మునిగణముల నడుమ కూర్చుండి బ్రహ్మతేజస్సుతో వెలుగుచు చిరునవ్వు గల ముఖముతో శివుడు తారల నడుము ఆకాశములో చంద్రుని వలె విరాజిల్లుచుండెను. అతని రూపము కోటి మన్మధులతో సమానముగా మిక్కిలి ఆహ్లాదము కళించుచుండెను. అతి పురాతనమైన శరీరమందలి ముసలితనమును వదిలి పెట్టి నవ వనమును ధరించి మిక్కిలి సౌందర్యముతో స్త్రీల మనస్సులనతడు హరించుచుండెను. కామ పడితలైన స్త్రీలకు మన్మధుడుగా సతీజనమునకు పుత్రుడుగా విష్ణుభక్తులకు మహావిష్ణువుగా శివ భక్తులకు సదాశివునిగా శక్తి భక్తులకు శక్తి స్వరూపముగా సూర్యభక్తులకు సూర్యునిగా దుష్టులకు కాలస్వరూపుడుగా శిష్టులకు పాలకుడుగా ఆ శివుడుండెను. మృత్యువుకు మృత్యువుగా యమునికి యమునిగా భయానకముగా నుండెను. పులితోలే సుందర వస్త్రము, భస్మమే చందనము, సర్పములే సుందరములైన పుష్పమాలలు, కంఠమందలి విషపు కాంతియే కస్తూరి, జడల సమూహమే సుందరమైన కొప్పు (శిఖ) చంద్రుడే నుదుటి యందలీ చందన తిలకము మనోహరమైన గంగాధారయే అందమైన మాలతీ పుష్పమాల అస్థిమాల (ఎముకల దండ)యే రత్నమాల, ఉమ్మెత్త పువ్వే ధరించిన సంపెంగ పువ్వు, ఇట్లతని సామగ్రియే అలంకారముగా నుండెను. పంచముఖము లొకటియే పద్మముల వంటి నేత్ర యుగ్మముతో శోభించుచు శరత్పూర్ణిమనాటి చంద్రుని కాంతి వంటి ఉత్తము కాంతిలో పరిసరములను ఆచ్ఛాదించుచుండెను (వస్త్రము కప్పినట్లు కాంతి వ్యాపించెను). మంకెన పువ్వును (ఎర్రని వన్నె గల ఒక జాతి పుష్పము) తిరస్కరించునట్టి అందమైన క్రింది పెదవి గల శివుడు తెల్లని చంద్రుడే నంది వాహనముగా భూత గణములే నర్తకుల వలె ఇట్లు మహేశ్వరుని యొక్క సర్వము ఒకదానికొకటిగా ఉన్న శివరూపమును మేనాదేవీ చూచి సంతుష్టురాలయ్యెను.

కాశ్చిన్నిమేష రహితాః కామేన పులకాంచితాః

అతికామాతురాః సత్యః ప్రాపర్మూరాం చ కాశ్చన

కాశ్చిద్వినింద్య కాంతాంశ్చ ప్రశంశంనుర్మహేశ్వరం

మనోరథేన మనసా సమాశ్లిష్యంతి కాశ్చన

కాచిన్మానసికం కామాత్కుర్వంతీ చుంబనం ముదా

ధ్రువం కామం కరిష్యామో వయం చ కామ సాగరే

అస్మాకమేవం భర్తాచేత్పరత్రైవ యశో భవేత్

ఇహైవ కిం కరిష్యామో వయం కాంత్తె రత్తె రలం

దృష్ట్వా తమేవం సుచిరమితి జల్పంత కాశ్చన

కాశ్చిద్దృష్ట్వా శివం కించిన్ముఖమాచ్ఛాద్య వాససా

సస్మితా వక్రనయనాః పశ్యంత్యేవం పునః పునః

వయం గృహం న యాస్యామో యాస్యామః శివసన్నిధిం

శశ్వత్సుధాంశు వదనం ద్రక్ష్యామోఽహర్నిశం ముదా

సంసారం న కరిష్యామః ప్రవిశామో హుతాశనం

భవితా నః శివః స్వామీత్యేవం జల్పంత కాశ్చన

అహో పుణ్యవతీ దుర్గా శ్లాఘ్యతే జన్మ భారతే

యస్యా అయం శివః స్వామీత్యేవం జల్పంత కాశ్చన

మేనాదేవి వెంట వచ్చిన స్త్రీలలో కొందరు శివుని జూచి కనురెప్పపాటు లేక కామముతో శరీరమున పులకలేర్పడగా మిక్కిలి కామ పీడితలైరి. మరికొందరాదశలో మూర్చపోయిరి. కొందరు తమ భర్తలను నిందించి మహేశ్వరుని ప్రశంసించిరి. మరికొందరు కోరిక బలమై స్వామిని మనస్సులో కౌగిలించుకొనిరి. కొందరు కామసాగరమున నున్న మేము మా కామమును స్థిరము చేసికొందుమని సంతోష కామములతో మానసికముగా శివుని చుంబించుచుండిరి. (ముద్దులు పెట్టుకొనుట) “మాకీటువంటి భర్తయున్నచో పరమందు కీర్తి లభించెడిది. ఈ లోకమున నుండి ఇక ముందేమీ చేయవలెను. మా భర్తలలో సంసారమిక చాలును” అనీ పరమేశ్వరుని చూచి చూచి కొందరు పల్కుచుండిరి. మరికొందరు స్త్రీలు శివుని జూచి వస్త్రమును కొద్దిగా ముఖము పై కప్పుకొన్నట్లు లాగి చిరునవ్వుతో వంకర చూపులతో మరల మరల చూచుచుండిరి. “మేము గృహములకు పోము. శివుని సన్నిధికే పోదుము. రాత్రింబగళ్లు ముదముతో మాటి మాటికి అమృత కిరణములు గల చంద్రుని వంటి ఈ ముఖమునే దర్శింతుము. భర్తలతో కాపురములు చేయము. మాకు శివుడే భర్తయగు గాక అగ్నిలో ప్రవేశింతుము” అని కొందరు పల్కుచుండిరి. “భారతఖండమున జన్మించిన దుర్గాదేవి పుణ్యవతిగా ప్రశంసలందుచున్నది. ఈ స్వామీ ఆమెకు భర్తకదా” అని కొందరు పల్కుచుండిరి.

ముదా మేనా శివం దృష్ట్వా గృహం తాభిర్జగామ హ

శివం సంపూజ్య శైలేంద్రః ప్రణమ్య స్వగృహం యయౌ

కృత్వాఽనుమానం రహసి గిరీశో మేనయా సహ

దుర్గాం ప్రస్థాపయాస శివాయ శివ సన్నిధిం

పార్వతీ నఖిభిః సార్థం వేషం కృత్వా మనోహరం

భావానురక్తా హర్షేణ జగామ శివ సన్నిధిం

ముదముగా ఇట్లు శివుని దర్శించి మేసాదేవి ఆ స్త్రీలతో బాటు ఇంటికి పోయెను. శైలేంద్రుడు కూడ శివుని పూజించి నమస్కరించి స్వగృహమున కేగెను. అతడింటిలో రహస్యముగా భార్యతో విచారించి మంగళము కొరకు పార్వతిని శివుని సన్నిధికి పంపెను. పార్వతియు మనోహరమైన వేషము ధరించి తన మనస్సులో మిక్కిలి అనురక్తి గలిగియున్నందున చెలికత్తెలతో పాటు సంతోషముగా శివ సన్నిధికేగెను.

దృష్ట్వా శివం శివం శాంతం ప్రసన్న వదనేక్షణం

సప్త ప్రదక్షిణం కృత్వా సస్మితా ప్రణనామ సా

అనన్య భావం గుణినమపరం జ్ఞానినాం వరం

సుందరం లభ భర్తారం సుందరీత్యాశిషం దదౌ

భవితా తవ సౌభాగ్యం శుభే స్వామిని సంతతం

పుత్రస్తే భవితా సాధ్వి సారాయణసమో గుణైః

భవితా తే పరాపూజా త్రైలోక్యో జగదంబికే

బ్రహ్మాండేమ చ సర్వేషు సర్వేషాం చ పరా భవ

సప్త ప్రదక్షిణాః కృత్వా యతో భక్త్యా త్వయానతం

సప్త జన్మని తుషోఽహం తత్ఫలం లభ సుందరి

తీర్థే  కాంతేఽభీష్టదేవే గురౌ మంత్రే తథౌషధే

ఆస్థా చ యాదృశీ యాసాం సిద్ధిస్తాసాం చ తాదృశీ

ఇత్యుక్త్యా శంకరస్తూర్ణం బ్రహ్మజ్యోతిః వరం చ మాం

దధ్యౌ యోగాసనం కృత్వా యోగీశో వ్యాఘ్రచర్మణి

ప్రసన్న వదనముతో శాంత దృష్టితో నున్న శాంత స్వరూపుడైన శివుని పార్వతి దర్శించి ఏడు ప్రదక్షిణలు చేసి చిరునవ్వుతో నమస్కరించెను. “నీ యందు తప్ప ఇతరత్ర భావము చలించనివాడును గుణవంతుడు తనవంటి వాడింకొకడు లేనివాడును జ్ఞానులలో శ్రేష్ఠుడును సుందరుడునైన భర్తను పొందుదువు గాక సుందరీ!” అని శివుడాశీర్వదించెను. “ఓ శుభురాలా! భర్తయందు నీ సౌభాగ్య మెడతెగక ఉండగలదు. సాధ్వీ! గుణములలో నారాయణునితో సమానుడైన పుత్రుడు నీకు కలుగును. ఓ జగదంబా! నీకు ముల్లోకములందు అధికమైన పూజ జరుగ గలదు. అన్నీ బ్రహ్మాండములలో అందరికి నీవు శ్రేష్ఠురాలవగుదువు గాక. నీవు సషప్రదక్షిణలు చేసి నాకు భక్తితో నమస్కరించితివి కనుక సప్త జన్మలందు నేను సంతుష్టుడనైతిని. సుందరీ! ఆ సత్ఫలితమును పొందుము. ఒక పుణ్యతీర్ధమునందు భర్తయందు ఇష్టదైవమునందు గురువు నందు మంత్రము నందు అట్లే ఓషధి యందు ఏ స్త్రీలకెంతటి పూనిక విశ్వాసములుండునో ఆ స్త్రీలకటువంటి సిద్ధియే లభించును” అని శంకరుడు పలికి ఆ యోగీశుడు వ్యాఘ్ర చర్మము మీద యోగాసనముతో కూర్చుండి పరం బ్రహ్మ జ్యోతి స్వరూపుడైన నన్ను ధ్యానించుచుండెను.

ప్రక్షాల్య చరణౌ దేవీ వపౌ తచ్చరణోదకం

చకార మార్జనం భక్త్యా వహ్ని శౌచేన వాససా

రత్న సింహాసనం రమ్యం వీశ్వకర్మాది నిర్మితం

అపూర్వం కాంస్యపాత్రస్థం నైవేద్యం ప్రదదౌ కిల

అర్ఘ్యం మందాకినీ తోయసంయుక్తం చరణే దదౌ

సుగంధి చందనం చారు కస్తూరీ కుంకుమాన్వితం

ప్రదదౌ మాలతీ మాలాం గలే గరల సుందరే

భక్త్యా పూజాం చకారాథ పుష్ప వృష్టిం చ తుష్టయే

పీయూషం స్వర్ణ పాత్రస్థం ప్రదదౌ మధురం మధు

రత్న ప్రదీప శతకం సమంతాద్రూప ముత్తమం

త్రైలోక్య దుర్లభం వస్త్రం స్వర్ణ యజ్ఞోవీతకం

సుగంధి శీత తోయం చ పానార్థం పార్వతీ దదౌ

అతీవ సుందరం రమ్యం రత్న సారేంద్ర భూషణం

దుర్లభాం కామధేసుం చ స్వర్ణశృంగ సమన్వితాం

స్నానీయం తీర్థతోయం చ తాంబూలం చ మనోహరం

దత్వా షోడశోపచారం ప్రణనామ పునః పునః

సంపూజ్య శూలినం భక్త్యా యయౌ నిత్యం పితుర్గృహం

పార్వతీదేవి శివుని పాదములు కడిగి ఆ పాదోదకమును పానము చేసెను. అగ్నివలె పరిశుద్ధమైన వస్త్రముతో ఆ ప్రదేశమునూడ్చీ శుభ్రపరచి విశ్వకర్మాదులచేత నిర్మించబడిన రత్నసింహాసనము నుంచి కంచుపాత్రలోని అపూర్వ నైవేద్యమును సమర్పించెను. మందాకినీ జలమును హస్త పాదములు. కడుగుటకల్పించేను. కస్తూరి కుంకుమ పువ్వుతో కూడిన సుగంధము గల చందనమును విషచ్ఛాయతో సుందరముగా కన్పించు శివుని కంఠమున మాలతీ పుష్పమాలను సమర్పించెను. తన సంతోషము కొరకు భక్తితో పుష్పములు చల్లుచు పూజించేను. బంగారు పాత్రయందున్న అమృతమును మధురమైన తేనెను సమర్పించెను. అంతటను మంచిగా తీర్చిన ఆకారము గల రత్నములు పొదిగిన నూరు దీపములు వెలుగు హారతినిచ్చెను. ముల్లోకములందెక్కడ లభించని మంచి వస్త్రమును బంగారు యజ్ఞోపవీత మును చల్లగా సువాసనతో కూడియున్న జలమును త్రాగుటకు సమర్పించేను. రత్నాభరణములను బంగారు కొమ్ములు గల కామధేనువును, అవసరమైనప్పుడు పుణ్యనదీ జలమును స్నానమునకని సమకూర్చెను. ఇం పైన తాంబూలము నర్పించెను. ఇట్లు పార్వతీదేవి ప్రతిదినము షోడశోపచారములతో ఆ శివుని పూజించి భక్తితో మరల మరల నమస్కరించి పితృ గృహమున కేగెను.

శశ్రావాప్సరసాం వక్త్రాద్దేవీమింద్రో మహేశ్వరః

శ్రుత్వా వార్తాం శునాసీరో ననర్త హర్ష సంయుతః

దూతద్వారా కామదేవమానినాయ త్వరాన్వితః

ఇంద్రాజ్ఞయా కామదేవః ప్రజగామామరావతీం

తూర్ణం ప్రస్థాపయామాస తం చ యత్ర శివః శివా

పంచ సాయకసంయుక్తో జగామ పంచసాయకః

ప్రసన్న వదనః శ్రీమాన్ యత్ర శక్తి యుతః శివః

గత్వా దదర్శ మదనః శివాయుక్తం శివం విభుం

శాంతం త్రైలోక్య కాంతం చ ప్రసన్న వదనేక్షణం

సురనాయకుడైన ఇంద్రుడు అప్సరసల మాటల వలన పార్వతీదేవి పరమేశ్వరుని వద్ద ఉన్న వార్త వినగనే హర్షముతో నర్తించెను. త్వరపడి దూత ద్వారా కామదేవుని తన వద్దకు రప్పించెను. ఇంద్రుని ఆజ్ఞననుసరించి కామదేవుడు అమరావతికి పోయెను. ఇంద్రుడతనిని త్వరగా పార్వతీ పరమేశ్వరులున్న చోటికీ పంపెను. మన్మధుడు యువతీ యువకుల మీద ప్రయోగించి వ్యామోహము కల్గించు ఐదు సాయకములు (బాణములు) తీసుకొని ప్రసన్నవదనుడు అణిమాద్య స్టైశ్వరములు గలవాడు ఐన శివుడు పార్వతితో కూడియున్న స్థలమునకు పోయెను. పోయి శాంతుడును త్రైలోక్య జనమునకు మనోహరుడును పార్వతితో గూడి ప్రసన్న ముఖ నేత్రములు గలవాడై యున్న విభుని శివుని దర్శించేను.

కామః స్థితోఽoతరిక్షే చ ధృత్వా చ సశరం ధనుః

చిక్షేపాస్త్రం దుర్నిపార్యమమోఘం శంకరే ముదా

బభూవిమోఘమస్త్రం చ మోఘం తత్పరమాత్మని

ఆకాశ ఇవ నిర్లిప్తే నిర్లిప్తే పరమాత్మని

మోఘీభూతే చ శస్త్రే చ భయమాప చ మన్మధః

చకంపే పురతః స్థిత్వా దృష్ట్వా మృత్యుంజయం విభుం

నస్మార త్రిదశాన్ కామః శక్రాదీన్ భయవిహ్వలః

మన్మథుడు ధనుర్బాణములను పట్టుకొని ఆకాశమున నిలిచి నివారింప శక్యము గానిది ఎక్కడ ఎప్పుడును వ్యర్థము గానిదైన అస్త్రమును మోదముతో శంకరునీ మీద విసిరెను(ప్రయోగించెను). ఆకాశము నందు వలె నిర్లిపుడైన ఆ పరమాత్మ యందు మన్మథుని అమోఘస్త్రము మోఘ (దెబ్బతిని వ్యర్థమైనది) మయ్యెను. తన శస్త్రమట్లు వ్యర్ధమై పోగా మన్మధుడు భయము పొందెను. ఆ మృత్యుంజయ విభుని జూచి అతని యెదుట నిలిచి గడ గడ వణకెను. భయముతో మనస్సు చెదరి ఇంద్రాది దేవతలను స్మరించెను.

ఆయయుర్దేవతాస్సర్వాః శంభుకోపేన వేపితాః

చక్రుః స్తుతిం చ స్తోత్రేణ శంకరం త్రిదశేశ్వరం

కోపాగ్ని ముద్గిరంతం తం కఫాలలోచనాదహో

స్తుతిం కుర్వత్సు దేవేషు స వహ్నిః శంభు సంభవః

జజ్వాలోర్ధ్వశిఖో దీప్తః ప్రళయాగ్ని శిఖోపమః

ఉత్పత్య గగనే ఘూర్ణన్నిపత్య ధరణీతలే

భ్రామం భ్రామం చ పరితః పపాత మదనోపరి

బభూవ భస్మసాత్కామః క్షణేన హరకోవతః

విషణ్ణా దేవతాస్సర్వా నతవక్త్రా చ పార్వతీ

విలలాప బహాతరం హరస్య పురతో రతిః

తుష్టువుర్ణేవతాస్సర్వాః కంపీతాశ్చంద్రశేఖరం

రతీమూచుః సురాః సర్వే రురుదుశ్ప ముహుర్ముహుః

కించిద్భస్మ గృహీత్వా చ రక్షమాతర్భయం త్యజ

వయం తం జీవయిష్యామో లభిష్యసి ప్రీయం పునః

హర కోపాపనయనే నుప్రసన్నే దీనే తథా

దృష్ట్వా రతేర్విలాపం చ మూర్ఛాం సంప్రాప పార్వతీ

అతీంద్రియం గుణాతీతం తుష్టావ చంద్రశేఖరం

దేవతలందరక్కడకు వచ్చి ఈ శివుని కోపమును చూచి వణికిపోయి సర్వదేవనాధుడగు శంకరుని స్తోత్రముతో స్తుతించిరి. అతని ఫాలలోచనమునుండి కోపాగ్ని బయటీకీ వెడల గ్రక్కబడుచుండెను. దేవతలు స్తుతించుచుండగ శంభుని నుండి ఉత్పత్తియైన ఆ యగ్ని, పైకి జ్వాలలు ఎగియగా మండుచు ప్రళయకాలమందలి అగ్నివలె వెలుగుచుండెను. ఒక్క సారి పైకెగిరి ఆకాశమున సుడులు తిరుగుచు ఆ అగ్నినేల మీద పడెను. భూమి యంతట జ్వాలలు సుడులు తిరుగుచు పోయి మన్మథుని మీద పడెను. హరుని కోపము వలన మన్మథుడు క్షణములో భస్మమై పోయెను. దేవతలందరు విషాదము పొందిరి. పార్వతి దేవి విచారముతో తలవంచుకొనెను. మన్మధుని భార్యయైన రతీదేవీ హరుని ముందర అనేక విధముల దుఃఖించెను. సర్వదేవతలు భయకంపితులై చంద్రశేఖరుని స్తుతించిరి. రతీదేవికి వచ్చిన ఆపదకు దేవతలు మాటి మాటికి రోదించి రతీతో ఇట్లనిరి. “అమ్మా! నీ భర్త భస్మమును కొద్దిగా తీసుకొని దానిని రక్షించుము, భయము త్యజింపుము. నీ భర్తను మేము బ్రదికింపగలము మరల నీ ప్రియుని పొందగలవు. హరుని కోపము తొలగిపోయి ప్రశాంతమైన కాలమేర్పడును. ఆనాడు నీ భర్త జీవించును” అనిరి. రతీదేవి దుఃఖమును చూచి పార్వతీ మూర్చపొందెను. జ్ఞానేంద్రియములకు అందని గుణత్రయ రహితుడైన పరమశివునామె స్తోత్రమొనర్చిను.

రుదంతీం పార్వతీం త్యక్త్వా స్వస్థానం ప్రయయౌ శివః

సద్యో బభూవ తత్త్రెవ పార్వతీ దర్పమోక్షణం

రూప యౌవనయోర్గర్వం తత్యాజ శైలకన్యకా

ముఖం దర్శయితుం లజ్జా తద్బభూవ సఖీగణే

సురాశ్చ రతీమాశ్వాస్య సర్వే జగ్ముః స్వమందిరం

ప్రణమ్య దండపద్రుద్రం శోకాదుద్విగ్న మానసాః

స్తుత్వా రుదీత్వా శోకేన భయేన కామకామినీ

కోపరక్తేక్షణం రుద్రం రాధికే స్వాలయం యయౌ

రోదించుచున్న పార్వతిని వదిలి వేసి శివుడు తన స్థానమునకేగెను. అక్కడ పార్వతికి వెంటనే చర్చ (గర్వము) భంగమాయెను. రూప వనముల మూలమున తనకు గల్గిన గర్వమును ఆ శైలరాజకన్య త్యజించెను. సఖీ గణమునకు ముఖము చూపుట కామె సిగ్గిల్లెను. రతి దుఃఖము వలన కలత భయములను పొందిన దేవతలు రుద్రునకు దండవత్రణామములు (సాష్టాంగ నమస్కారములు) చేసి రతీదేవి నోదార్చి తమ తమ మందిరములకేగిరి. మన్మథుని భార్య పొంగి వచ్చు శోకముతో రోదించి భయముతో శివుని స్తుతించి కోపము చేత కనులెర్ర చేసిన రుద్రుని చూచి తన గృహమున కేగెను.

న జగామ పితుర్గేహం పార్వతీ సా తు లజ్జయా

స్వాలిభీర్వార్యమాణాఽపి జగామ తపసే వనం

ప్రజగ్ముః నహచారిణ్యస్తత్నశ్చాచ్ఛోక విహ్వలా

మాతృభి ర్వార్యమాణా సా స్వర్ణదీ తీరజం వనం

సుచిరం చ తపస్తప్త్వా సా సంప్రాప త్రిలోచనం

రతీః సంప్రాప మదనం శంకరస్య వరేణ చ

ఇత్యేవం కథితం సర్వం పార్వతీ దర్పమోక్షణం

నీగూఢ చరితం రాధే కిం భూయః శ్రోతుమిచ్ఛసి

పార్వతి సిగ్గుతో తండ్రి గృహమునకు పోలేదు. ఆమె చెలులు ఎంతగా వారించినను తపస్సు కొరకు వనమునకేగెను. అందుకు శోకము వలన మనస్సు కలత పడిన సహచారిణులు ఆమె వెనుకనే పోయిరి. తల్లులు వారించినను ఆగక పార్వతి ఆకాశగంగానదీ తీరవనమున కేగెను. సుదీర్ఘ కాలమామె మహాతపస్సు చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను. శంకరుని అనుగ్రహ వరము వలన రతీదేవియు మన్మథుని తిరిగి పొందాను. రాధా! రహస్య చరిత్రమైన పార్వతీ గర్వ మోక్షణమును మొత్తము చెప్పితిని. తిరిగి ఇంకేమీ వినగోరుచున్నావు అని శ్రీకృష్ణుడు చెప్పెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే ఏకోనచత్వారింశోఽధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.