బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

20 - గోవత్సబాలక హరణ ప్రస్తావము

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఆనెను :

ఏకదా బాలకై: సార్థం బలేన సహ మాధవః

భుక్త్వా పీత్వాఽనులిప్తశ్చ బృందారణ్యం జగామ హ  

క్రీడాం చకార భగవాన్ కౌతుకేన చ తైః సహ

క్రీడా నిమగ్న చిత్తానాం దూరం తద్గోకులం యయౌ  

ఒకసారి శ్రీకృష్ణుడు బలదేవునితో బాటు తృప్తిగా ఇష్ట పదార్ధములు తిని త్రాగి శ్రీగంధము పరిమళ ద్రవ్యములు శరీరమున పులుముకొని గోపాలబాలురతో కలిసి బృందారణ్యముమునకేగెను. ఆ స్వామి క్రీడలయందాసక్తుడై వారితో నాడుకొనుచుండగా మేతమేయు చున్న గోబృందము (ఆవులు దూడలు) అక్కడి నుండి దూరముగా బోయెను. ఆటలలో మునిగియున్న వీరది గమనించకుండిరి. 

తస్య ప్రభావం విజ్ఞాతుం విధాతా జగతాం పతిః

చకార నిహ్నుతిం గాశ్చ వత్సాంశ్చ బాలకానపి

విజ్ఞాయ తదభిప్రాయం సర్వజ్ఞః సర్వకారకః

పునశ్చకార తత్సర్వం యోగీంద్రో యోగమాయయా

జగామ శ్రీ హరిర్గేహం కారయిత్వా చ గోకులం

బలేన బాలకైః సార్థం క్రీడాకౌతుక మానసః  

ఏవం చకార భగవాన్ వర్షమేకం చ ప్రత్యహం

యమునాగమనం గోభిర్బలేన సహ బాలకైః  

శ్రీకృష్ణుని మహిమను తెలిసికొనుటకై సృష్టికార్యము వలన జగములకు ప్రభువైన బ్రహ్మ ఆవులను దూడలను గోపాల బాలకులను కూడ మొత్తము నెక్కడనో దాచి పెట్టెను. సర్వజ్ఞుడు సర్వము చేయగలవాడైన స్వామి బ్రహ్మ అభిప్రాయమును తెలిసికొని యోగీంద్రుడు కనుక తన యోగమాయాశక్తితో అపహరించిన దాచిపెట్టబడిన మొత్తము జీవకోటిని (ఆవులు దూడలు బాలకులు) మరల సృష్టించెను. సాయంకాలము వేళకు బ్రహ్మ మూలముగా సంభవించిన ఈ నటనాక్రీడయందు ఆసక్తి గల మనస్సుతో గో గణమును గోపాలురను కూర్చుకొని బలదేవునితో బాటు గృహమునకేగెను. ఇట్లా భగవంతుడు ప్రతిదినము మాయా సృష్టియైన గోగణమును గోపాలబాలురను వెంట తీసుకొని బలదేవునితో బాటు యమునా తీరమునకు పోయి వచ్చుచు ఒక సంవత్సరము నడిపెను. 

బ్రహ్మా ప్రభావం విజ్ఞాయ లజ్జా సమ్రాత్మకంధరః

ఆ జగామ హరేః స్థానం భాండీర వటమూలకే

దదర్శ కృష్ణం తత్రైవ గోపాల గణవేష్టితం

యథా పార్వణ చంద్రం చ విభాంతం సర్వగణైః సహ

బ్రహ్మ శ్రీహరి ప్రభావమును తెలిసికొని తాను చేసిన పనికి సిగ్గుతో తన తలవంచుకొని భాండీర వనములో మజ్జి చెట్టు క్రింద నివసించియున్న శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చెను. తన గణమైన నక్షత్రములతో కూడి పార్వణ చంద్రుడు (పున్నమినాటి చంద్రుడు) వెళ్లినట్లు గోగోపబాలుర నడుమ నున్న శ్రీకృష్ణుని దర్శించెను. 

రత్నసింహాసనస్థం చ హసంతం సస్మితం ముదా

పీతవస్త్ర పరీధానం జ్వలంతం బ్రహ్మతేజసా

రత్నకేయుర వలయ రత్న మంజీర రంజితం

రత్నకుండల యుగ్మాభ్యాం స్వకపోల స్థలోజ్జ్వలం

కోటికందర్పలావణ్యం లీలాధామ మనోహరం

చందనాగురు కస్తూరీ కుంకుమార్చిత విగ్రహం

పారిజాత ప్రసూనానాం మాలాజాలైర్విభూషితం

నవీన నీరద శ్యామం ప్రోద్భిన్న నవయౌవనం

మాలతీ మాల్య సంయుక్తం మయూర పిచ్చ చూడకం

స్వాంగ సౌందర్య దీప్త్యా చ కృత భూషణ భూషితం

శరత్పార్వణ చంద్రాస్య ప్రభాముష్టాస్య సుందరం

పక్వబింబాధరౌష్ఠం చ ఖగేంద్ర చంచునాసికం

శరన్మధ్యాహ్న పద్మానాం ప్రభామోచనలోచనం

ముక్తాపంక్తి వినింద్వైకదంతపంక్తి మనోహరం

కౌస్తుభేన మణీంద్రేణ వక్షఃస్థల సముజ్జ్వలం

శాంతం చ రాధికా కాంతం పరిపూర్ణతమం పరం  

ఏవం భూతం ప్రభుం దృష్ట్వా ప్రణనామాతివిస్మితః

దర్శం దర్శమీశ్వరం తం ప్రణనామ పునః పునః  

శ్రీహరి పీతాంబరము ధరించి బ్రహ్మతేజస్సుతో వెలుగుచు సంతోషముతో చిరునవ్వు నవ్వుచు రత్న సింహాసనమందుండెను. రత్నాల భుజకీర్తులు రత్నాల కడియములు రత్నాల అందెలతోను వెలుగుచు రత్నాల కుండలముల (చెవికమ్మలు) కాంతితో తన కపోలములు గొప్పగా ప్రకాశింపగా కోటిమన్మధ సుందరుడు మనోహరమైన లీలలకు నెలవైన వాడుగా నున్న స్వామి చందనము అగురు కస్తూరి కుంకుమలచేత పూజింపబడిన మూర్తి గలవాడు. పారిజాత పుష్పమాలలతో అలంకరింపబడినవాడు క్రొత్తనైన మేఘము వలె నల్లని వాడు ఉదయించుచున్న నవ యౌవనము కలవాడు, మాలతీ పుష్పముల దండను ధరించి నెమిలి ఈకతో అలంకరింపబడిన కొండెకొప్పుతో, తన దేహ సౌందర్య కాంతితో అలంకరింపబడుచున్న అలంకారములు గలవాడు - శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని కాంతిని దొంగిలించినట్లున్న సుందర ముఖము కలవాడు - పండిన దొండపండు వంటి క్రింది పెదవిలో గరుత్మంతుని ముక్కు వంటి నాసిక (ముక్కు) తో - శరదృతువులో మధ్యాహ్న కాలమందలి వికసిత పద్మముల కాంతిని దొంగిలించు నేత్రములతో - ముత్యాల చాలును తిరస్కరించు మనోహరమైన పలువరుసతో - వక్షస్థలమున మిక్కిలి ప్రకాశించుచున్న కౌస్తుభమణితో - పరిపూర్ణతముడు శాంతుడు రాధాప్రియుడైన పరమాత్మ విరాజిల్లుచుండెను. అట్టి పరమ ప్రభువును బ్రహ్మదర్శించి మిక్కిలి విస్మయము పొంది ప్రణమిల్లెను. ఆ పరమేశ్వరుని దర్శించి దర్శించి మరల మరల నమస్కరించెను. 

యద్దృష్టం హృదయాంభోజే తద్రూపం బహిరేవ చ

యా మూర్తి: పురతో దృష్టా సా పశ్చాత్పరితస్తతః

తత్ర బృందావనే సర్వం దృష్ట్వా కృష్ణ సమం మునే

ధ్యాయం ధ్యాయం చ తద్రూపం తత్ర తస్థౌ జగద్గురుః

గావో వత్సాశ్చ బాలాశ్చ లతా గుల్మాశ్చ వీరుధః

నర్వం బృందావనం బ్రహ్మ శ్యామరూపం దదర్శహ  

ఓ నారదా! తన హృదయ కమలమున ఏ రూపము బ్రహ్మకు కన్పించెనో అదియే బయట కన్పించెను. ఏ మూర్తి ముందు కన్పించెనో అదియే వెనుక వైపునను చుట్టును కన్పించెను. ఆ బృందావనమంతటను కృష్ణునితో సమమైన ఆకారమే చూచి ఆ జగత్కర్త ఆ రూపమునే ధ్యానించి ధ్యానించి అచ్చట నిలబడెను. ఆవులు దూడలు గోపాలబాలురు తీగలు చెట్లు పొదలు బృందావనమంతయు బ్రహ్మకు శ్యామసుందరువి రూపముగా కన్పించెను.

దృష్ట్వైవం పరమాశ్చర్యం పునర్ధ్యానం చకార హ

దదర్శ త్రిజగత్ బ్రహ్మా నాన్యత్ కృష్ణం వినా మునే

క్వ చ వృక్ష: క్వ వా శైల: క్వ మహీ క్వచ సాగరః

క్వ దేవా: క్వ చ గంధర్వా మునీంద్రా: క్వచ మానవాః

క్వ చాత్మా క్వ జగద్బీజం క్వ స్వర్గ: క్వాయమేవ చ

సర్వం చ స్వదృశా బ్రహ్మా దదర్శ మాయయా హరేః  

ఇట్లు మిక్కిలి ఆశ్చర్యమైన దృశ్యమునతడు చూచి మరల ధ్యానమొనర్చి ముల్లోకములలో కృష్ణుడు తప్ప దేనిని బ్రహ్మ దర్శించకుండెను. వృక్షములెక్కడ? పర్వతములేక్కడ? భూమి యెక్కడ? తానెక్కడ? జగత్తునకు బీజమెక్కడ? స్వర్గమెక్కడ? శ్రీకృష్ణుడెక్కడ? బ్రహ్మ తన దృష్టితో సర్వమును శ్రీహరి మాయగా దర్శించెను.

క్వ కృష్ణో జగతాం నాధః క్వ వా మాయా విభూతయః

సర్వం కృష్ణమయం దృష్ట్వా కించ నిర్వక్తు మక్షమః  

జగత్తులకు నాధుడైన కృష్ణుడేమి? అతని మాయ వలన నేర్పడిన విభూతులేమి? సర్వమును కృష్ణమయముగా దర్శించి ఆ బ్రహ్మ ఏమి పలుకుటకు (నిర్వచించుటకు) సమర్ధుడు కాకుండెను.

కిం స్తౌమి కిం కరోమితి మన సైవం ప్రగృహ్య చ

తత్ర స్థిత్వా జగద్ధాతా జవం కర్తుం సముద్యతః

సుఖం యోగాసనం కృత్వా బభూవ నంపుటాంజలి:

పులకాంకిత నర్వాంగః సాశ్రనేత్రోఽతిదీనవత్

ఇడాం సుషుమ్నాం మధ్యాం చ పింగలాం నలినీం ధురాం

నాడీషట్కం చ యోగేన నిబద్ధ్య చ ప్రయత్నతః

మూలాధారం స్వాధిష్ఠానం మణిపూరం మనోహరం

విశుద్ధం వరమాజ్ఞాఖ్యం షట్చక్రం నిబద్ధ్య చ

లంఘనం కారయిత్వా చ తత్ షట్చక్రం క్రమాద్విధి:

బ్రహ్మరంధ్రం సమానీయ వాయు బంధం చకార హ  

నిబద్ధ్య వాయుం మధ్యాం తామానీయ హృదయాంబుజం

తం వాయుం బ్రమయిత్వా చ యోజయామాస మధ్యయా  

ఏమని స్తోత్రమొనర్తును? ఏమి చేయుదును? అని మనస్సున తలచి అక్కడ నిలిచి బ్రహ్మ మంత్రజపము చేయబూనుకొని సుఖమైన యోగాసనమున కుదురుగా కూర్చుండి చేతులు ప్రార్థనా ముద్దగా పట్టి శరీరము మొత్తము పులకలెత్తగా ఆనందబాష్పములతో మిక్కిలి దీనునివలె తనను భావించుకొనెను. ఇడ సుషుమ్న మధ్య పింగళ నలిని ధుర అనెడి ఆరు నాడులను ప్రయత్న పూర్వకముగా యోగధారణతో బంధించి మూలాధారము స్వాధిష్ఠానము మణిపూరము మనోహరము విశుద్ధము పరమాజ్ఞ అను షట్చక్రములను బంధించి అతడు క్రమముగా వాయువును ఆరు చక్రములను లంఘింపజేసి బ్రహ్మరంధ్రమున దానిని బంధించెను. బంధింపబడిన మధ్యనాడీగతమైన వాయువును హృదయకమలమునకు తెచ్చి అటునిటు త్రిప్పి హృదయకమలమున మరల మధ్యానాడితో ప్రాణవాయువును సంయోగపరచెను (కుదురు పరచెను). 

ఏవం కృత్వాతు నిష్పందో యో దత్తో హరిణా పురా

జజాప వరమం మంత్రం త స్యైవ చ దశాక్షరం  

ఇట్లు యోగ సమాధి గతుడై చలన రహితుడై పూర్వము శ్రీహరి తన కనుగ్రహించి ఉపదేశించిన ఆ స్వామి యొక్క దశాక్షరీ మంత్రమును జపించెను.

ముహూర్తం చ జపం కృత్వా ధ్యాయం ధ్యాయం వదాంబుజం

దదర్శ హృదయాంభోజే సర్వ తేజోమయం మునే

తత్తేజసోఽoతరే రూపమతీవ సుమనోహరం

ద్విభుజం మురలీహస్తం భూషితం పీతవాససా  

శ్రుతి మూలస్థలన్యస్త జ్వలన్మకర కుండలం

ఈషఘాన్య ప్రసన్నాస్యం భక్తానుగ్రహకాతరం  

యద్ దృష్టం బ్రహ్మరంద్రే చ హృది తద్భహిరేవ చ

దృష్ట్వా చ పరమాశ్చర్యం తుష్టావ పరమేశ్వరం  

నారదా! స్వామి పాదపద్మములను ధ్యానించి ధ్యానించి ఒక ఐదు గడియలకాలము జపము చేసి బ్రహ్మ తన హృదయకమలము . నందు సర్వతేజస్సులొకముద్దయైనట్టి తేజో రాశిని చూచెను. ఆ తేజస్సు నడుమ మిక్కిలి మనోహరముగా నున్న ఒక దివ్యరూపమును దర్శించెను. పీతాంబరధారియై రెండు బాహువులతో - మురళిని ధరించిన హస్తముతో - కర్ణమూలములందు వెలుగుచున్న మకరకుండలములతో - చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖమండలముతో - భక్తులననుగ్రహించుటకు త్వరపడుచున్న ఆ రూపమును. - మొదట బ్రహ్మరంధ్రమున ఆ తరువాత హృదయ కమలమున దర్శించిన దానినే - బయట అంతటను ఆశ్చర్యకరమైన ఆ రూపమునే చూచి ఆ పరమేశ్వరుని స్తుతించెను (3ఽ-35). 

యత్ స్తోత్రం చ పురా దత్తం హరిణైకార్ణవే మునే

తమీశం తేన విధినా భక్తినమ్రాంతకంధరః  

ఓ నారదా! సృష్టియంతయు ఒకే సముద్రముగా నున్న కాలములో ఆ మధ్యప్రదేశమున శ్రీహరి తనకేస్తోత్రముపదేశించెనో - ఆ పరమేశుని ఆ స్తోత్రవిధితోనే భక్తితో వంగిన శిరస్సు గలవాడై బ్రహ్మ స్తుతించెను. 

బ్రహ్మోవాచ - బ్రహ్మ అనెను : 

సర్వస్వరూపం సర్వేశం సర్వకారణ కారణం

సర్వానిర్వచనీయం తం నమామి శివరూపిణం

సవీన జలదాకారం శ్యామసుందర విగ్రహం

స్థితం జంతుషు సర్వేషు నిర్లిప్తం సాక్షిరూపిణం

స్వాత్మారామం పూర్ణకామం జగద్వ్యాపి జగత్పరం

సర్వస్వరూపం సర్వేషాం బీజరూపం సనాతనం

సర్వాధారం సర్వవరం సర్వశక్తి సమన్వితం

సర్వారాధ్యం సర్వగురుం సర్వమంగళకారణం

సర్వమంత్ర స్వరూపం చ సర్వసంపత్కరం వరం

శక్తి యుక్తమయుక్తం చ స్తౌమి స్వేచ్ఛామయం విభుం

శక్తీ శం శక్తి బీజం చ శక్తి రూపధరం వరం

సంసార సాగరే ఘోరే శక్తి నౌకా సమన్వితం  

కృపాలుం కర్ణధారం చ నమామి భక్తవత్సలం

ఆత్మ స్వరూపమే కాంతం లిప్తం నిర్లిప్తమేవచ  

కనిపించుచున్న ఈ సర్వసృష్టి తన స్వరూపమైన వాడును సర్వమునకు ఈశుడును ఈ ప్రపంచమునకు మూలమైన దానికిని మూలమైన వాడును, (సృష్టికి మూలమైన వాటిని కూడ సృష్టించిన వాడు) సర్వజ్ఞాన జీవులచేతను ఇట్లని నిర్వచింపరానివాడును, మంగళరూపుడును, క్రొత్తమేఘము వలె తాపమును పోగొట్టు ఆకారము గలవాడును నల్లని వన్నెయైనను సుందరమైన విగ్రహము (మూర్తి) గలవాడును, సర్వజీవులలో అంతరాత్మగా నుండియు వారి సుఖదుఃఖములు పుణ్యపాపములు అంటకుండ వారు చేయు కర్మలకు సాక్షిరూపమున నుండువాడును, తనయందే తానానందించుచుపూర్ణకాముడైన వాడును (వాంఛలు తీరినవాడు - సత్యకాముడు) జగత్తంతట వ్యాపించినవాడైనను జగత్తుకంటే ఇతరుడును, అన్నిరూపములు తానైన వాడును సర్వము చరాచర ప్రపంచకోటికి బీజము వంటివాడును సనాతనుడును, సర్వమునకు తాను ఆధారమైనవాడును సర్వజ్ఞానులలో శ్రేష్ఠుడును, సర్వశక్తులతో కూడినవాడును, సర్వులకు ఆరాధ్యుడు (ఆరాధించపదగినవాడు)ను, సర్వజీవకోటి అజ్ఞానము పోగొట్టు గురువును, సర్వశుభములకు మూలమైన వాడును, సర్వమంత్రములు తన స్వరూపమైనవాడును, సర్వ సంపదలు కల్గించు శ్రేష్ఠుడును, శక్తి యుక్తుడును, తనయందు లేని దొకటి వచ్చి చేరవలసిన స్థితి లేని వాడును తన స్వేచ్ఛారూపమున అంతట ఆవరించి యుండువాడగు స్వామికి నమస్కరించుచున్నాను. స్తుతించుచున్నాను. సర్వశక్తులకు ప్రభువును, ఆ శక్తులకు బీజమైన వాడును, ఆశక్తి రూపములను ధరించువాడును, వాటికన్న శ్రేష్ఠుడును, ఘోరమైన సంసార సముద్రమున శక్తియను ఓడతో గూడినవాడును, దయావంతుడును భక్తులయందలి వాత్సల్యముతో ఆ ఓడను నడపు కర్ణధారుడును, ఆత్మలు తన స్వరూపమైనవాడును, రహస్యమైనవాడును, అన్నిటికి తాకియుండియు ఏది అంటని వాడునగు వానికి నమస్కరించుచున్నాను. 

సగుణం నిర్గుణం బ్రహ్మ స్తౌమి స్వేచ్ఛా స్వరూపిణం

సర్వేంద్రియాధిదేవం తమింద్రియాలయమేవ చ

సర్వేంద్రియ స్వరూపం చ విరాడ్రూపం నమామ్యహం

వేదం చ వేదజనకం సర్వ వేదాంగరూపిణం

నర్వ మంత్ర స్వరూపం చ నమామి పరమేశ్వరం

సారాత్పారతరం ద్రవ్యమపూర్వమనిరూపిణం

స్వతంత్రమస్వతంత్రం చ యశోదా నందనం భజే

సంతం నర్వ శరీరేషు తమదృష్టమనూహకం

ధ్యానాసాధ్యం విద్యమానం యోగీంద్రాణాం గురుం భజే

రాసమండలమధ్యస్థం రాసోల్లాస సముత్సుకం  

తన ఇచ్ఛను బట్టి సగుణముగాను నిర్గుణముగాను స్వరూపము గలవాడుగా నుండు పరబ్రహ్మను నేను స్తుతించుచున్నాను. దేహధారుల యొక్క కర్మేంద్రియ జ్ఞానేంద్రియములపై అధికారము గల దేవుడును (అధి దేవత) ఆ ఇంద్రియములను తన ఉనికిగా చేసుకొనువాడును అన్ని యింద్రియముల స్వరూవము తానే ఐనవాడును అంతటను వ్యాపించు మహారూపుడగు వానికి నమస్కరించుచున్నాను. వేదరూపుడు వేదజనకుడు సర్వవేదాంగ రూపుడు సర్వమంత్రములు తన స్వరూపమైనవాడు అగు పరమేశ్వరునకు నమస్కరించుచున్నాను. సారము కంటె మిక్కిలి సారవంతమైన ద్రవ్యమైన వాడును తన కన్న ముందుకాలము గాని ఆ కాలమందుండు వాడు గాని లేనట్టి వాడును (అపూర్వుడు) ఇట్టివాడని నిరూపించబడనివాడును తనను శాసించు వారు లేనందున స్వతంత్రుడు జ్ఞానులు భక్తుల విషయమున వారికి పరతంత్రుడును సర్వశరీరములందుండు వాడును ఐనను చూడబడనివాడు ఇట్టివాడని ఊహింపబడనివాడును ధ్యానమునకసాధ్యుడైనను ఉన్నవాడును యోగిరాజులకు గురువును అగు యశోదానందనుని భజింతును. రాసమండల మధ్యమున నుండువాడును రాసక్రీడవలన కలుగు ఉల్లాసము నందు మిక్కిలి ఉత్సుకత (కావలెనని ఆసక్తి) గలవాడునగు స్వామిని భజింతును. 

గోపిభిః సేవ్యమానం చ తం ధరేశం నమామ్యహం

సతాం సదైవ సంతం తమనంతమసతామపి  

యోగీశం యోగ సాధ్యం చ నమామి శివ సేవితం

మంత్రబీజం మంత్రరాజం మంత్రదం ఫలదం ఫలం

మంత్రసిద్ధి స్వరూపం తం నమామి చ పరాత్పరం

సుఖం దుఃఖం చ సుఖదం దుఃఖదం పుణ్యమేవ చ  

పుణ్యప్రదం చ శుభదం శుభబీజం నమామ్యహం

ఇత్యేవం స్తవనం కృత్వా దత్వా గాశ్చ సబాలకాన్

నిపత్య దండవద్భూమౌ రురోద ప్రణనామ చ

దదర్శ చక్షురున్మీల్య విధాతా జగతాం మునే  

గోపికల చేత సేవింపబడువాడును భూదేవికి భర్తయు నగు స్వామికి నమస్కరించుచున్నాను. సజ్జనులకు (సాధుపురుషులకు) ఎల్లప్పుడుండువాడును దుర్జనులకు లేని వాడును యోగీశుడును యోగమునకు. సాధ్యుడును శివుని చేత సేవింపబడినవాడునగు వానికి నమస్కరింతును. మంత్రములకు బీజమైనవాడును మంత్రములకు రాజును, మంత్రప్రదాతయు ఫలదాతయు ఫలమైనవాడును, మంత్రసిద్ధి స్వరూపుడును అగు పరాత్పరునకు నమస్కరింతును. సుఖదుఃఖరూపుడను సుఖదుఃఖదాతయు పుణ్యరూపుడును పుణ్య మిచ్చువాడును శుభము లిచ్చువాడును శుభములకు బీజమునైన వానికి నమస్కరింతును. ఓ నారదా! జగత్తులను సృష్టించు బ్రహ్మ ఇట్లు సోత్రము చేసి కన్నులు తెరచి చూచి భోరున (తాను చేసిన పనికి పశ్చాత్తపుడై) నేడ్చెను. దండము (కజ్జి) వలె నేలమీదపడి (సాష్టాంగముగా) నమస్కారమొనర్చెను. (ఆనపహరించి ఏడాదిగా దాచియుంచిన) బాలకులతో బాటు మొత్తము గోగణమును సమర్పించెను. 

బ్రహ్మణా చ కృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్

ఇహలోకే సుఖం భుంక్త్వా యాత్యంతే శ్రీహరేః పదం  

లభతే దాస్యమతులం స్థానమీశ్వరసన్నిధౌ

లబ్ధ్వా చ కృష్ణ సాన్నిధ్యం పార్షదప్రవరో భవేత్  

బ్రహ్మయొనర్చిన ఈ స్తోత్రమును నిత్యము భక్తి తోనెవడు పఠించునో వాడు ఈ లోకమున సుఖమనుభవించి అంత్యమున (ఈ దేహము వదిలిన తరువాత) శ్రీహరి పాదములను పొందును. సాటిలేని దాస్యమును ఈశ్వర సన్నిధిలో స్థానమును పొందును. ఇట్లు కృష్ణ సాన్నిధ్యముక్తి పొంది స్వామిని సేవించు పార్షదులలో ముఖ్యుడగును. 

శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను : 

గతే జగత్కారణే చ బ్రహ్మలోకం చ బ్రహ్మణి

శ్రీ కృష్ణో బాలకై: సార్ధం జగామ స్వాలయం విభుః

గావో వత్సాశ్చ బాలాశ్చ జగ్ముర్వర్షాంతరే గృహం

శ్రీకృష్ణమాయయా సర్వే మేనిరే తే దినాంతరం

గోపా గోపాలికా: కించిత్కర్తుం న క్షమాస్తదా

యోగినః కృత్రిమం నర్వం కిం నూత్నం వా పురాతనం

ఇత్యేవం కధితం సర్వం శ్రీకృష్ణ చరితం శుభం

సుఖదం మోక్షదం పుణ్యం సర్వకాలసుభావహం

 జగత్కర్తయైన బ్రహ్మ తన లోకమునకు పోయిన తరువాత శ్రీకృష్ణుడు బాలకులతో బాటు తన గృహమునకు పోయెను. ఆవులు దూడలు గోపబాలకులు ఒక సంవత్సరము తరువాత తమ తమ గృహములకేగిరి. ఐనను శ్రీకృష్ణుని మాయాశక్తి వలన వారందరిది ఒక పగటి వేళలోని భాగముగా భావించిరి (ఆనాడు ఉదయముననే అడవికి వచ్చి సాయంకాలమున తిరిగి ఇండ్లకు పోయినట్లు భావించిరి). గృహములందున్న గోపాలురు గాని గోపికలు గాని యోగియైన స్వామి యొక్క ఈ కృత్రిమ సృష్టి మొత్తమును (మాయాకల్పితమైన గోపాల గోసమూహమును) క్రొత్తదని గాని పాతదియని గాని కొద్దిగానైనను తెలిసికొన సమర్థులు కాలేదు. ఇట్లు శ్రీకృష్ణుని శుభచరిత్రము సుఖమిచ్చునది మోక్షమిచ్చునది పుణ్యమైనది సర్వకాలములలో సుఖము కూర్చునది, అట్టి దానిని మొత్తము నీకు చెప్పితిని. 

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారదసంవాదే గోవత్సబాలక హరణ ప్రస్తావో నామ వింశోఽధ్యాయః.

ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన గోవత్స బాలక హరణ ప్రస్తావమనెడి ఇరువదియవ అధ్యాయము సమాప్తము.