108 - అధ్యాయము

శ్రీనారాయణ ఉవాచ :

ఏతస్మిన్నంతరే దేవీ మహాలక్ష్మీశ్చ రుక్మిణీ ।

ఆజగామసభామధ్యేముని దేవాదిభిర్యుతా ॥

రత్న సింహాసనస్థాచ రత్నాలంకార భూషితా ।

వహ్నిశుద్ధాంశుకాధానా కబరీభారభూషితా ॥

పశ్యంతీసస్మితా సాధ్వీహ్యమూల్యరత్న దర్పణం ।

కస్తూరీబిందుభిర్యుక్తా స్నిగ్ధ చందనచర్చితా ॥

సిందూరబిందునాశశ్వతాల మధ్యస్థలోజ్జ్వలా ।

తప్తకాంచన వర్ణాభా శతచంద్ర సమప్రభా ॥

చందనోక్షిప్త సర్వాంగా మాలతీ మాల్యశోభితా ।

సప్తభిర్నృపపుతైశ్చ సమానీతాచ బాలకై: ॥

దేవేంద్రాశ్చ మునీంద్రాశ్చ సిద్ధేంద్రా నృపపుంగవా: ।

దదృశూరుక్మిణీం దేవీం మహాలక్ష్మీం పతివ్రతాం ॥

సప్త ప్రదక్షిణాః కృత్వా ప్రణమ్య స్వపతింసతీ ।

సి షేచ శీతతోయేనస్నిగ్ధ చందన పల్లవైః ॥

తాం సి షేచ జగత్కాంతః కాంతాం శాంతాంచ సస్మితాం ।

దదర్శకాంతః కాంతాంచ కాంతాకాంతం శుభే, క్షణే ॥

అథదేవీపితుః క్రోడేసమువాస శుభాననా ।

లజ్జయా నమ్రవదనా జ్వలంతీచ స్వతేజసా ॥

రాజా దేవేశ్వరీం తస్మై పరిపూర్ణత మాయచ ।

ప్రదదౌ సంప్రదానేన వేదమంత్రేణ నారద ॥

వసుదేవాజ్ఞయా కృష్ణః స్వస్తిత్యుక్త్వాస్థితోముదా ।

జగ్రాహదేవీందేవశ్చ భవానీంచ భవోయథా ॥

సువర్ణానాం పంచలక్షం కృష్ణాయ పరమాత్మనే ।

దక్షిణాం తాం దదౌరాజా పరిపూర్ణతమాయచ ॥

శుభకర్మణినిషన్నే కృత్వా కన్యాంచ వక్షసి ।

రురోద రాజా మో హేన మునిదేవేంద్ర సంసది ॥

పరిహారేణవచసా కృత్వాత స్మై సమర్పణం ।

సి షేచ కన్యాంధన్యాంచ నేత్రయుగ్మ జలేనచ ॥

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్థే నారాయణ నారద సంవాదే రుక్మిణ్యుద్వాహేష్టధిక శతతమోధ్యాయః ॥

శ్రీనారాయణుని వచనమిట్లా –

ఇంతలో దేవి, మహాలక్ష్మి, రుక్మిణి, మునులు దేవతలు మొదలగు వారితో కూడి సభ మధ్యలోకి వచ్చింది. (1) రత్నసింహాసనంలో ఉన్నట్టిది, రత్నాలంకారములతో అలంకరింపబడ్డది, వహ్నిశుద్ధమైన వస్త్రాన్ని ధరించింది, కొప్పులో బరువయ్యేంత ఆభరణాలు ధరించింది. (2) నవ్వుతూ, ఆసాధ్వి అమూల్యమైన రత్నదర్పణాన్ని చూస్తోంది. కస్తూరి బిందువులతో కూడినది, మృదువైన చందనముతో పూయబడింది, (3) ఎప్పుడూ సిందూర బిందువుతో నొసటిమధ్య భాగము వెలిగిపోతోంది. పుటం పెట్టిన బంగారం వంటి రంగు గలది, నూరు చంద్రులతో సమానమైన కాంతి గలది. (4) శరీరం నిండా చందనమలదుకొన్నది. మాలతి మాలతో శోభిస్తున్నది. ఏడుగురు రాకుమారులు బాలురు ఆమెను తెచ్చారు. (5) దేవేంద్రులు, మునీంద్రులు సిద్ధేంద్రులు, రాజశ్రేష్ఠులు, వీరంతా మహాలక్ష్మి పతివ్రత ఐన రుక్మిణి దేవిని చూచారు. (6) ఏడు ప్రదక్షిణాలు చేసి, ఆసతి తన పతికి నమస్కరించి, చల్లని నీటితో మృదువైన చందనపు ఆకులతో చిలకరించింది. (7) మనోహరమైన, శాంతురాలైన, చిరునవ్వు నవ్వుతున్న ఆమె పై జగత్కాంతుడు నీరు చిలకరించాడు. కాంతుడు, కాంతను చూచాడు, శుభక్షణమందు కాంతకాంతుణ్ణి చూసింది. (8) ఆ పిదప దేవి, శుభానన, తండ్రి ఉరమందు ఉన్నది. సిగ్గుతో తలవంచుకున్నది. తన కాంతితో వెలిగిపోతోంది. (9) రాజు, దేవేశ్వరిని పరిపూర్ణతముడైన ఆతనికి, వేదమంత్రములతో, దానపూర్వకంగా ఇచ్చాడు, ఓ నారద! (10) వసుదేవుని ఆజ్ఞతో,కృష్ణుడు, 'స్వస్తి' అని పలికి ఆనందంగా ఉన్నాడు. భవుడు భవానిని స్వీకరించినట్లు దేవుడు దేవిని స్వీకరించాడు. (11) ఐదు లక్షల సువర్ణములను పరమాత్మయైన కృష్ణునకు, పరిపూర్ణతమునకు, రాజు దానిని దక్షిణగా ఇచ్చాడు, ఆమెను ఇచ్చాడు. (12) శుభకర్మ జరిగినప్పుడు, కన్యను వక్షమందుంచుకొని, మునులు దేవేంద్రులున్న సభలో రాజు, మోహంతో ఏడ్చాడు. (13) పరిహారపు మాటలతో, ఆతనికి, ఆమెను సమర్పించి, కనుల నుండి వచ్చిన నీటితో ధన్యమైన కన్యను తడిపాడు. (14)

అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రుక్మిణి వివాహమందు నూట ఎనిమిదవ అధ్యాయము.