శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను:
నిగూఢం శ్రుణు వృత్తాంతం మునేర్దుర్వాసపో మునే ।
అహోఽస్య దారసంయోగః కథం తదూర్ధ్వ రేతసః ॥
దృష్ట్వా తయోశ్చ శృంగారం మునిః కామీ బభూవ హ।
జితేంద్రియోఽసత్సంసర్గాద్దోషః సాంసర్గికో భవేత్ ॥
నహసా తస్య హృదయే బభూవ సురతే స్పృహా ।
తపస్తప్త్వా తత్ర దధ్యౌ కామినీం మదనాతురః ॥
ఓ నారదా! దూర్వాస ముని యొక్క ఒక రహస్య వృత్తాంతము వినుము. ఆశ్చర్యము! ఊర్ధ్వరేతస్సు (వీర్యము స్కలనము కాని స్థితి) గల అతనికి భార్యా సంయోగమెట్లు సంభవించెనో దానిని చెప్పుదును. ముందు చెప్పిన ఆ యిద్దరు వ్యక్తుల యొక్క శృంగారమును చూచి జితేంద్రియుడుగా నున్న ఆ ముని కాముకుడయ్యెను. దుర్జనుల సంసర్గము (దుర్జనులను కూడి ఉండుట) వలన ఒక దోషము సంభవించును. దానిని సాంసర్గిక దోషమందురు. హఠాత్తుగా ఆ ముని మనస్సులో రతి వాంఛ కలిగెను. అతడు మదన బాధ ననుభవించుచు (అక్కడ తపస్సు చేసినవాడు) ఒక కామినియగు స్త్రీని తలంచుచుండెను.
ఏతస్మిన్నంతరే తేన పథా యాతి మునీశ్వరః ।
ప్రార్థయంత్యా పతిం సంతమౌర్వశ్చ సుతయా సహ॥
ఊరూర్భవో బ్రహ్మణశ్చ పురా కల్పే తపస్యతః ।
ఊర్ధ్వరేతాశ్చ యోగీంద్ర ఔర్వస్తేన ఇతిస్మృతః ॥
తస్యజానూద్భవా కన్యా కందలీ నామ విశ్రుతా ।
దూర్వాసనం ప్రార్థయంతీ నావ్యం మనసి రోచతే ॥
నసుతో హి మునిశ్రేష్ఠో మునేర్దుర్వాస నః పురః ।
తస్థౌ మహా ప్రసన్నశ్చ జ్వలదగ్ని శిఖోవమః ॥
ఇంతలో పూర్వకల్పమున తపస్సు చేయుచున్న బ్రహ్మయొక్క ఊరువు (తొడ) నుండి ఉద్భవించిన వాడును ఊర్ధ్వరేతస్సు గల యోగీంద్రుడై ఔర్వ నామముతో పిలువబడు మునీశ్వరుడు తగిన భర్తను కోరుకొనుచున్న తన బిడ్డతో గూడి ఆ మార్గమున వచ్చుచుండెను. “కందలి” అన్న ఆ కూతురౌర్వునికి జానువు (మోకాలు) నుండి జన్మించెను. ఆమె తనకు తగిన ప్రతిగా దూర్వాసుని ప్రార్థించుచున్నదే తప్ప ఇంకొక వ్యక్తిని మనస్సులో కూడ తలచుట లేదు. ప్రకాశించుచున్న అగ్నిజ్వాలవలె తేజస్విగా నున్న ఆ మునిరాజు బిడ్డతో గూడివచ్చి మహాప్రసన్నమైన మనస్సుతో దూర్వాసముని ముందు నిలిచెను.
మునీంద్రోఽపి మునీంద్రం తం పురా దృష్ట్వా ససంభ్రమః ।
ప్రజవేస సముత్తస్థా ననామ చ ముదాఽన్వితః॥
ఔర్వో దుర్వాసనం తత్ర సమాష్లిష్య ముదాఽన్వితః ।
ఉవాచ మునయే సర్వం కన్యకాయా మనోరథం॥
దూర్వాసముని తన ముందున్న ముని రాజును చూచి సంభ్రమము (ఆశ్చర్యము) తో త్వరగా లేచి సంతోషము కలవాడై నమస్కరించెను. ఔర్వుడును సంతసించి అతనిని కౌగిలించుకొని తన కూతురు యొక్క మనోరథమును మునికిట్లు చెప్పెను.
ఔర్వ ఉవాచ - ఔర్వుడు పలికెను :
విఖ్యాతా కందలీ నామ మమ కన్యా మనోహరా।
ప్రౌఢా త్వామేవ ధ్యాయంతీ శ్రుత్వా వాచిక వక్త్రతః ॥
అయోని సంభవా కన్యా త్రైలోక్యం మోహితుం క్షమా।
సర్వరూప గుణాధారా దోషేణైకేన సంయుతా ॥
అతీవ కలహావిష్టా కోపేన కటు భాషిణీ ।
నానాగుణయుతం ద్రవ్యం న త్యజేదేక దోషతః॥
కందలి యన్న నామముతో ప్రసిద్ధి కెక్కిన నా బిడ్డ మిక్కిలి సుందరి. నిన్ను గూర్చి ఎవరో చెప్పగా విని నిన్నే మనస్సులో తలచుకొనుచు వివాహ వయస్సు కొంతమీరినను నీతలంపుతోనే ఉన్నది. ఈమె స్త్రీపురుష సంయోగము లేకుండ పుట్టిన కన్య. ముల్లోకములను మోహింపజేయుటకు సమర్థురాలు. సౌందర్యము, సద్గుణములకు ఈమె మూలము. ఈమెలో ఒక్క దోషమున్నది. తీవ్రమైన కోపముతో కయ్యమునకు పూని కటువుగా మాట్లాడును. ఐనను నానావిధములైన మంచి గుణములున్న ద్రవ్యమును ఒక్క దోషమును బట్టి విడువగూడదు కదా!
ఔర్వస్య వచనం శ్రుత్వా హర్ష శోకాన్వితో మునిః ।
దదర్శ కన్యాం పురతో గుణరూప సమన్వితాం ॥
శరత్పార్వణ చంద్రస్యాం శరత్పంకజ లోచనాం ।
ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం పీనశ్రోణి పయోధరాం ॥
నవయౌవన సంయుక్తం పశ్యంతీం వక్ర చక్షుషా ।
రత్నాలంకార శోభాఢ్యాం వహ్నిశుద్ధాంశుకాన్వితాం ॥
మునిర్ముమోహ తాం దృష్ట్వా కామ బాణ ప్రపీడితః ।
ఉవాచ తం మునిశ్రేష్ఠం హృదయేన విదూయతా ॥
ఔర్వముని మాటలు విని హర్షము దుఃఖము రెండు లక్షణములు గలవాడైన దూర్వాసుడు తన ముందున్న కన్యను రూపగుణములతో కూడియున్న దానిని చూచెను. శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖము, శరత్కాలకమలముల వంటి లోచనములు, చిరునవ్వుతో వెలుగుచున్న మోము, పుష్టిగా నున్న స్తన నితంబములు (పిరుదులు) ప్రక్కచూపులు, రత్నాభరణముల శోభ, అగ్ని వర్ణమైన వస్త్రములు నవ యౌవనము గల ఆ కన్యను చూచి దూర్వాసముని మన్మధబాణపీడితుడై వ్యామోహము పొందెను. బాధపడుచున్న హృదయముతో ఔర్వమునితో ఇట్లు పలికెను.
దూర్వాసా ఉవాచ - దూర్వాసముని పలికెను :
నారీరూపం త్రిభువనే ముక్తిమార్గ నిరోధకం।
వ్యవధానం తపస్యాయాః సతతం మోహకారణం ॥
కారాగారే చ సంసారే దుర్వహం నిగడం పరం ।
అచ్ఛేద్యజ్ఞాన ఖడ్గైశ్చ మహద్భిశ్శంకరాదిభిః ॥
నంగిచ్ఛాయాతిరిక్తం చ కర్మభోగాత్సరాత్ పరం ।
ఇంద్రియాదింద్రియాధారాద్విద్యాయాశ్చ మతేరపి ॥
ఆదేహం సంగినీ ఛాయా భోగాంతం భోగ ఏవ చ ।
దేహేంద్రియాణి జీవాంతం విద్యా చైవావశీలినం ॥
మతి శ్పైవావశీలాంతా నుస్త్రీజన్మని జన్మని ।
యావజ్జీవీ చ నుస్త్రీకో న తావజ్జన్మఖండనం॥
యావచ్చ జీవనో జన్మ తావద్భోగః సుఖావహః ।
ముల్లోకములలో స్త్రీరూపము ఎల్లప్పుడు మోహమునకు మూలము. తపస్సునకు విఘ్నము. ముక్తి మార్గములకు ఆటంకము. సంసారమును కారాగృహములో మోయరాని పెద్ద సంకెల గొప్పవారైన శంకరాదులు కూడ జ్ఞాన ఖడ్గములతో నారీ రూపమైన సంకెళ్లను నరకలేకుండిరి. శరీరపు నీడకంటె వేరైన స్త్రీసంగము, దేహచ్ఛాయకంటె బలమైనకర్మఫలానుభవము కంటె ఇంద్రియముల కంటె దేహము కంటె విద్యాబుద్ధులకన్న బలమైనది. శరీరచ్ఛాయ శరీరమున్నంత వరకుండును. కర్మఫలము అనుభవము వరకుండును. దేహేంద్రియము ఈ దేహములో జీవుడున్నంత వరకుండును. విద్యలు స్మరించుచున్నంత వరకుండును. మతి ఆలోచించునంత వరకుండును. ఆ తరువాత అంతమై పోవును. సాధ్వియైన స్త్రీ జన్మజన్మకు అనుసరించును. జీవునకు జన్మ (ఆయువు) ఉన్నంత వరకు స్త్రీ భోగము సుఖమునే కల్గించును. కాని జీవుడెంత కాలము (ఎన్ని జన్మలు) ఉత్తమ స్త్రీతో కూడియుండునో (ఆమె తన పాతివ్రత్య శక్తితో జన్మజన్మకు తన పతినే అనుసరించుట వలన) అంతకాలము జన్మపరంపర ఖండింపబడదు (ముక్తి లభించదు).
పరం మునీంద్ర సర్వస్మాద్ధరిపాదాబ్దసేవనం ॥
ధ్యాయతః కృష్ణ పాదాబ్దం మమ విఘ్నో బభూవ హ ।
న జానే కర్మదోషేణ కేన వా పూర్వజన్మనః ॥
పుంశ్పల్యా సహ శృంగారం దృష్ట్వా దైత్యస్య మన్మనః ।
బభూవ కామ సంయుక్తం దత్తం ధాత్రా చ తత్ఫలం॥
కిం త్వహం తవ కన్యాయాః కటూక్తి శతకం మునే ।
ధ్రువం క్షమాం కరిష్యామి దాస్యామి చ తతః ఫలం ॥
సర్వతోఽపి పరానిందా స్త్రీకటూక్తి సహిష్ణుతా ।
అతీవ నిందితః సత్సు స్త్రీజితో భువనత్రయే ॥
తవాజ్ఞాం ముస్తకే కృత్వా గ్రహీష్యామి సుతాం తవ।
ఉపేతాం కామినీం త్యక్త్వా కాలసూత్రం వ్రజేన్నరః ॥
రహన్యుపస్థితాం కామాత్పుంశ్పలీం చేజ్జితేంద్రియః ।
పరిత్యజేద్ధర్మభయాదధర్మాన్నరకం వ్రజేత్ ॥
మునీంద్రా! అన్నిటికంటె శ్రీహరి పాద పద్మములను సేవించుట శ్రేష్ఠము. అట్టి శ్రీకృష్ణ పాద పద్మములను ధ్యానించు చుండగా నాకు విఘ్నమేర్పడెను. పూర్వజన్మకు చెందిన ఏకర్మదోషము వలన నాకది సంభవించెనో ఎరుగను. జారిణీ స్త్రీ రాక్షసుడొనర్చిన శృంగారమును చూచి నా మనస్సు కామముతో కూడినదయ్యెను. బ్రహ్మ ఆ ఫలమునిట్లిచ్చెను. ఐనను మహామునీ! నేను నీ బిడ్డ యొక్క వంద కటువాక్యములను నిశ్చయముగా క్షమింతును. ఆ సంఖ్య దాటిన పిదప దానికి తగిన ఫలమితును. అన్నిటికంటె స్త్రీ యొక్క పరుష వాక్యములను సహించుట అన్నది పెద్ద అవమానము. స్త్రీ చేత ఓడింపబడినవాడు (స్త్రీ నిందావాక్యములను సహించువాడు) ముల్లోకములలో సత్పురుషుల గోష్ఠిలో మిక్కిలి నిందితుడగును (నిందింపబడును, అవమానింపబడును). నీ ఆజ్ఞను శిరస్సున ధరించి నీ సుతను నేను స్వీకరింతును. కూడి వచ్చిన స్త్రీని త్యజించిన పురుషుడు కాలసూత్ర సరకము పొందును. జితేంద్రియుడైనవాడు కామాసక్తితో రహస్యముగా తనతో గూడ వచ్చిన జారిణిని ధర్మమునకు భయపడి పరిత్యజించవలయును. వివాహమాడిన స్త్రీకంటె ఇతర స్త్రీని పొందుట అధర్మము. అట్టి అధర్మము చేసినచో దాని వలన వాడు నరకము పొందును.
ఇత్యేవముక్త్వా దుర్వాసా విరరామ మునేః పురః ।
మునిర్వేదోక్త విధినా దదౌ తస్మై సుతాం మునే ॥
స్వస్తీత్యువాచ దుర్వాసా మునిశ్చ యాతకం దదౌ।
కన్యాసమర్పణం కృత్వా మోహాచ్చైవ రురోదహ ॥
మూర్ఛామవాప స మునిః స్వకన్యావిరహాతురః ।
అపత్య భేద శోకౌఘః స్వాత్మారామం న ముంచతి॥
క్షణేన చేతనాం ప్రాప్య బోధయామాస కన్యకాం ।
మూర్ఛితాం తాత విచ్ఛేదాద్రుదంతీం శోకసంయుతాం ॥
ఔర్వముని ముందట్లు పలికి దూర్వాసుడు సంభాషణ ముగించెను. ఔర్వుడు వేదోక్త మార్గమున అతనికి కన్యాదానమొనర్చెను. శ్రీ ధనమును కొంత ఇచ్చెను. దూర్వాసుడు “స్వస్తి” యని అంగీకరించెను. కన్యనప్పగించి తన బిడ్డ ఎడబాటునకు తల్లడిల్లినముని వ్యామోహము (ప్రేమ)తో మూర్ఛిల్లెను. సంతానము నెడబాసిన శోక ప్రవాహము ఆత్మారాములగు జ్ఞానులను కూడ బాధింపకి విడువదు. ఔర్వముని ఒక క్షణములో చైతన్యము పొంది - తండ్రి యెడబాటునకు మూర్ఛిల్లి దుఃఖశోకములలో నున్న బిడ్డకిట్లు హితబోధ చేసెను.
ఔర్వ ఉవాచ - ఔర్వుడిట్లు పలికెను :
శ్రుణు వత్సే ప్రవక్ష్యామి నీతిసారం సుదుర్లభం ।
హితం నత్యం చ వేదోక్తం పరిణామ నుఖావహం ॥
స్వకాంతశ్చ పరోబంధురిహలోకే పరత్ర చ।
స హి కాంతాత్పరః ప్రేయాన్ కులస్త్రీణాం వరో గురుః॥
దేవ పూజావ్రతం దానం తపశ్పానశనం జపః ।
స్నానం చ సర్వతీర్థేమ దీక్షా సర్వమభేమ చ ॥
ప్రొదక్షిణ్యం పృథివ్యాశ్చ బ్రాహ్మణాతిధి సేవనం ।
సర్వాణి పతి సేవాయాః కలాం నార్హంతి షోడశీం॥
కిమేతైః పతిభక్తాయాః అభక్తాయాశ్చ భారతే।
యదా దుఃఖీ సుభారంభే సాకాంక్షః ప్రథమో భవేత్ ॥
పతి సేవా పరోధర్మః సర్వశాస్త్రేమ పఠ్యతే ॥
స్వప్రజ్ఞానేన సతతం కాంతం నారాయణాధికం ।
దృష్ట్వా తచ్ఛరణాంభోజ సేవాం నిత్యం కరిష్యతి ॥
పరిహాసేన కోపేన భ్రమేణావజ్ఞయా మునే ।
కటూక్తిం స్వామినః సాక్షాత్ పరోక్షాన్నకరిష్యతి ॥
స్త్రియా వాగ్యోవిదుష్టాయాః కామతో భారతే భువి ।
ప్రాయశ్చిత్తం శ్రుతౌ నాస్తి నరకం బ్రహ్మణ శ్శతం ॥
సర్వధర్మ పరీతా యా కటూక్తిం కురుతే పతిం ।
శతజన్మకృతం పుణ్యం తస్యా నశ్యత నిశ్చితం ॥
బిడ్డా! నీకు ఇతరత్ర మిక్కిలి దుర్లభమైన నీతిసారమును చెప్పెదను వినుము. ఇది నీకు హితమైనది. వేదోక్త సత్యమిది. మొదట కష్టముగా తోచినను పరిణామము (పరిపక్వ స్థితి) లో సుఖము కూర్చునది. కులస్త్రీలకు తన భర్తయే శ్రేష్ఠమైన బంధువు- ఈ లోకమున పరలోకమున భర్తను మించిన ప్రియమైనవాడు ఉత్తమ గురువు ఉండడు. దేవపూజ వ్రతములు దానములు తపస్సు ఉపవాసము మంత్రజపము సర్వతీర్థములందు స్నానము సర్వయజ్ఞముల దీక్ష భూప్రదక్షిణము బ్రాహ్మణులను అతిధులను సేవించుట యివి అన్నియు పతిసేవకు పదునారవ భాగముగా కూడ సరికావు, ఈ భరతఖండమున పతిభక్తురాలికి వీటితో పనిలేదు. పతిభక్తిలేని స్త్రీకిని ఇవియున్నను ఫలము లేదు కనుక ఆమెకు వీటిలోనవసరము లేదు. ఆరంభములో ఆచరణ సుఖమయమైనచో తరువాత దుఃఖదాయకమగును. ఆచరణారంభమున దుఃఖముగా నున్నపుడు తరువాత సుఖకరమగును. సర్వశాస్త్రములలో పతిసేవయే గొప్ప ధర్మమని చెప్పబడినది. తన ఆత్మజ్ఞానము చేత భర్తను నారాయణుని కంటె అధికునిగా చూచి ఎల్లప్పుడు అతని పాదసేవను సాధ్వి ఒనర్చుచుండును. ఆ సాధ్వి పరిహాసముతో గాని కోపముతో గాని భ్రమతో గాని తీరస్కారముతో గాని భర్తకెదురుగానైనను చాటుగానైనను కటువాక్యములు పలుకదు. ఈ భారత ఖండములో భర్తను నిందించి నోటిని మలినమొనర్చుకొన్న- వ్యభిచరించి శరీరమును మలిన మొనర్చుకొనిన స్త్రీకి ప్రాయశ్చిత్తము {పాపపరిహారకర్మ) వేద శాస్త్రములలో చెప్పబడలేదు. వందమంది బ్రహ్మల ఆయుష్యకాలము పర్యంతము నరకవాసము చెప్పబడినది. అన్ని విధముల ధర్మము లాచరించు స్త్రీ ఐనను భర్తను గూర్చి కటువాక్యములు పలికిన యెడల ఆమె నూరుజన్మలలో చేసిన పుణ్యమంతయు నశించుట సత్యము. నిశ్చయము.
దత్త్వా కన్యాం బోధయిత్వా జగామ మునిపుంగవః ।
స్వాత్మారామః స్వాశ్రమే చ తస్థౌ స్త్రీసహితో ముదా ॥
సంభోగేచ్ఛావృతే చిత్తే కామీ సంప్రాప కామినీం ।
అహో సుకృతినాం కామో వాంఛామాత్రేణ సిద్ధ్యతి॥
ఔర్వమునిరాజు ఇట్లు కన్యాదానమిచ్చి కన్యకు హితము బోధించి వెడలిపోయెను. ఇంతవరకు ఆత్మారాముడుగా నున్న దూర్వాసుడు భార్యా సహితుడై ముదముతో నుండెను. మనస్సు శరీర సుఖాపేక్ష కలది కాగానే ఆ కోరుకొన్నవాడు కామినిని పొందెను. ఆశ్చర్యము. పుణ్యము చేసికొన్నవారి కోరిక మనస్సున సంకల్పించినంత మాత్రమున సిద్ధించును కదా!
శయ్యాం రతికరీం కృత్వా మునిశ్రేష్ఠో మహామునే ।
శుభే క్షణే గృహీత్వా తాం సుష్వాప నిర్జనే ప్రియాం ॥
నారీ రసానభిజ్ఞః స్యాదాజన్మ మునిపుంగవః ।
తథాపి సురతా విజ్ఞః కామశాస్త్ర విశారదః॥
నానాప్రకారం శృంగారం చకార విధిపూర్వకం ।
నవ సంగమ మాత్రేణ మూర్ఛాం సంప్రాప కందలీ ॥
మూర్ఛాం ప్రాప ముని శ్రేష్ఠో బుబుధే న దివానిశం ।
ఏవం ప్రతిదినం తత్ర సురతిస్సంగతో మునే ॥
విదగ్ధయా విదగ్ధేన బభూవ సంగమస్సమః ।
నంబభూవ గృహాసక్త స్తవస్త్యక్త్వా మునీశ్వరః॥
ఓ నారదా! ఆ దూర్వాసముని సుఖకరమైన శయ్య నేర్పరచుకొని నిర్జన ప్రదేశములో తన ప్రియురాలిని తీసుకొనీ శుభకాలములో శయనించెను. స్త్రీ సుఖమెరుగని వాడైనను ఆజన్మ బ్రహ్మచారి ఐనను ఆవిజ్ఞుడు శృంగార క్రీడలో కామశాస్త్ర విశారదుడయ్యెను. నానావిధములుగా శృంగార విహారము చేయగా క్రొత్తదైన ఆ మొదటి కలయికతో కందలి సుఖానుభవము పట్టజాలక మూర్ఛిల్లెను. అతడును మూర్ఛపొందెను. ఇట్లా ముని రేబవళ్లు గుర్తించక ప్రతిదినమిట్లే ప్రవర్తించెను. అందులో నేర్పుగలవారైన ఆ ఉభయుల సంగమము సమానముగా నుండెను. ఇట్లు మునీశ్వరుడు తపస్సు త్యజించి సంసార సుఖమునందు మిక్కిలి ఆసక్తి గలవాడయ్యెను.
కరోతి కలహం నిత్యం కందలీ స్వామినా సహ।
మునీంద్రో బోధయామాస నీతివాక్యేన కామినీం ॥
సా తన్న బుబుధే కించిత్కరోతి కలహే స్పృహాం ॥
తాతప్రదత్తజ్ఞానేన సా స శాంతా బభూవ హ ।
న హీయతే ప్రబోధేన స్వభావో దురతిక్రమః ॥
నిత్యం కటూక్తిం కాంతం సా కరోతి హేతునా వినా ।
జగత్ప్రకంపితం యేన తయా కోపాత్స కంపితః ॥
తయా కృతాం కటూక్తిం చ క్షమానంస్థాం చకార హ ।
బోధయామాన తాం నిత్యం సద్యో మోహాద్దయానిధిః ॥
కటూక్తి శతకం పూర్ణం తత్కాలేన బభూవ హ ।
క్షమాం చకార కృపయా కటూక్తిం చ శతాధికాం ॥
పత్నీకటూక్త్యా నియతం ప్రదగ్ధం మానసం మునేః।
తస్యాం కటూక్తి కారణ్యాః కర్మ పూర్ణం బభూవ హ ॥
స్వాత్మారామో దయాలుశ్చ కోపం త్యక్తుం న స క్షమః ।
శశాప కామినీం మోహాద్భస్మరాశిర్భవేతి చ ॥
ఆ కందలి భర్తతో ప్రతిదినము కలహించుటకారంభించెను. ఆ మునీంద్రుడు భార్యకు నీతివాక్యములు బోధించుచుండెను. ఆమె ఏమాత్రము జ్ఞానము పొందక కలహమునే కోరుకొనుచుండెను. తండ్రిచేసిన జ్ఞానోపదేశము వలన ఆమె శాంతురాలు కాలేదు. స్వభావము దాట శక్యము గానిది కదా! ప్రబోధముచే అది త్యజింపబడదు. మనోహారుడైనను భర్తను ఆమె కారణము లేకుండగనే ఎల్లప్పుడు పరుష వాక్కులు పలుకుచుండెను. ఏ ముని లోకమును గడగడ లాడించెనో అతడామె కోపమునకు వణకి పోవుచుండెను. ఆమె మీద వ్యామోహము వలన ముని దయానిధియై కందలి పలుకు పరుషోక్తులను క్షమించుచు నిత్యము నీతిబోధను చేయుచుండెను. కొంతకాలమునకు ఆమె యొక్క కటువాక్యములు వందకు వంద నిండిపోయెను. అప్పటికిని కృపతో పరుషవాక్కులను శతాధికముగా క్షమించెను. అట్లే పరుషముగా మాట్లాడెడి కందలీ కర్మ పరిపూర్ణమయ్యెను. అప్పుడు పత్ని కటువాక్యములకతని మనస్సు ఒక్కసారి మిక్కిలి మండిపోయెను. ఎప్పుడును ఆత్మావలోకనముతో ఆనందపూర్ణుడై ఉండునట్టి- అంతవరకు దయాళువుగానున్న ముని పూర్తిగా కోపము త్యజించ లేకపోయెను. భస్మరాశి వగుము అని భార్యనతడు శపించెను.
మునేరింగితమాత్రేణ భస్మసాత్సా బభూవ హ ।
ఏవమత్యుచ్ఛ్రితానాం చ న కల్యాణం జగత్రయే ॥
శరీరే భస్మసాద్భూతే ప్రతిబింబస్స చాత్మనః ।
జీవస్తత్రాంతరిక్షస్థో హ్యువాచ వినయాత్ర్పభుం॥
ముని సంకల్పించినంతనే ఆమె భస్మరాశిగా మారెను. అది అంతే కదా! అవివేకముగా అతిగా పెరిగిపోయిన వారికి ముల్లోకములందును శుభము లేదు. కందళి శరీరమట్లు భస్మము కాగా అందలి జీవుడు ఆకాశమున నిలచి వినయముగా ఆ భర్తతో నిట్లు పలికెను.
జీవ ఉవాచ - జీవుడు పలికెను :
హే నాథ సర్వదర్శీ త్వం సతతం జ్ఞాన చక్లుషా ।
సర్వం జానాసి సర్వజ్ఞః కిమహం బోధయామి తే ॥
సదుక్తిర్వా కటూక్తిర్వా కోపః సంతాప ఏవ చ ।
లోభో మోహశ్చ కామశ్చ క్షుత్పిపాసాదికం చ యత్॥
స్థౌల్యం కార్శ్యం చ నాశశ్చ దృశ్యాదృశ్యం సముద్భవం ।
సర్వ శరీర ధర్మం చ న జీవస్య స చాత్మనః ॥
సత్త్వం రజస్తమ ఇతి శరీరం త్రిగుణాత్మకం ।
తచ్చ నానా ప్రకారం చ నిబోధ కథయామి తే ॥
ఓ నాథా! ఎల్లప్పుడు జ్ఞాననేత్రముతో అన్ని చూచువాడవు నీవు. సర్వజ్ఞుడవు కనుక అన్ని ఎరుగుదువు. నీకు నేనేమి బోధింతును. మంచిమాటలు, కటువైన మాటలు, కోపము, దుఃఖము, లోభము, మోహము, కామము ఆకలిదప్పులు బలియుట, బక్కపడుట నాశము దృశ్యముగా అదృశ్యముగా జరుగునట్టి శరీర ధర్మములన్నియు ఆత్మకు సంబంధించినవి కావు. సత్త్వము రజస్సు తమస్సు అనెడి మూడు గుణములతో గూడినది శరీరము. అది నానావిధములుగా నుండును. నీకు తెలుపుదును. వినుము.
కించిత్సత్త్వాతిరిక్తం చ కించిదేవ రజోధికం ।
తమోతిరిక్తం కించిచ్చ న సమం కుత్రచిన్మునే ॥
సత్త్వోదయాచ్చ ముక్తీచ్ఛా కర్మేచ్ఛా చ రజోగుణాత్ ।
తమోగుణాజ్జీవ హింసా కోపోఽహంకార ఏవ చ ॥
కోపాత్కటూక్తిర్నియతం కటూక్త్యా శత్రుతా భవేత్ ।
తయా చాప్రియతా సద్యః శత్రుః కః కన్య భూతలే ॥
కో వా ప్రియాఽప్రియః కః కిం కిం మిత్రం కో రిపుర్భవేత్ ।
ఇంద్రియాణి చ బీజాని సర్వత్ర శత్రుమిత్రయోః॥
ఓ మునీ! ఒకటి కొంత సత్త్వముధికముగా గలది మరియొకటి కొంత రజోగుణమధికముగా గలది మరియొకటి తమోగుణము అధికముగా గలది ఇట్లు శరీరము నానా ప్రకారముగా నుండును తప్ప. అన్ని గుణములు సమానముగా నుండునది ఎక్కడ లేదు. సత్త్వగుణముతో ఉదయించిన ప్రాణికి ముక్తివాంఛ, రజోగుణముతో జన్మించిన ప్రాణికి కర్మలు యజ్ఞయాగాదులు చేయవలెనను కోరిక, తమోగుణమధికముగా నుండిన వారికి జీవహింసా వాంఛ కోపము అహంకారము ఉండును. ఇట్లు త్రిగుణములలో ఒక్కొక్క దాని పాలు అధికముగా నున్న వారి స్థితి యుండును. కోపము వలన కటువాక్కులు పలుకుట పరుషభాషణము వలన శత్రుత్వము దాని వలన ఎవనికి ప్రియమైన వ్యక్తి కాకపోవుట సంభవించును. కానిచో ఈ భూమి మీద ఎవనికెవడు శత్రువు? ఎవడు ప్రియుడు? ఎవడు అప్రియుడు? మిత్రుడెవడు? శత్రువెవడగును ? అంతట ఈ శత్రుత్వ మితృత్వములకు జ్ఞానేంద్రియములే విత్తనములు సుమా.
ప్రాణాధికః ప్రియః స్త్రీణాం భర్తుః ప్రాణాధికా ప్రియా।
బభూవ శత్రుతా సద్యో దురుక్త్యా చ క్షణార్ద్వయోః ॥
యద్గతం తద్గతం సర్వం కామదోషేణ వై ప్రభో ।
క్షమాపరాధం నిఖిలం కిం కర్తవ్యం వదాధునా ॥
కిం కరోమి క్వ యామీతి భవితా కుత్ర జన్మ మే ।
తవ నాన్యస్య జాయాహం భవిష్యామి జగత్త్రయే ॥
ఇత్యేవ ముక్త్వా జీవశ్చ మౌనీభూతో బభూవ హ।
స్త్రీకి ఆమె ప్రియుడు ప్రాణముల కంటె అధికుడు. ఆ భర్తకు ఆమె ప్రాణముల కన్న ఎక్కువ ప్రియురాలు. దుష్ట వాక్యముల వలన అప్పటికప్పుడా క్షణములో ఇద్దరికి పగ ఏర్పడును. అంతయు కామ దోషము వలన దేనికి సంబంధించినది దానియందుండును. నాథా! నా అపరాధములన్నిటిని క్షమించుము. ఇప్పుడేమి చేయవలెనో చెప్పుము. నేనెక్కడికి పోవలెను? ఏమి చేయవలెను? నా జన్మ ఎక్కడ ఏర్పడును? ఈ ముల్లోకములలో నీకు తప్ప ఇంకొకనికి భార్యను కాజాలను. ఇట్లు పలికి ఆ జీవుడు మౌనము వహించెను.
మూర్ఛామవాప న మునిః శోకోపహతచేతనః ॥
స్వాత్మారామో మహాజ్ఞానీ జహార చేతనామహో ।
స్త్రీ విచ్ఛేదో ఏదగ్ధానాం సర్వశోకాత్పరాత్పరః ॥
క్షణేన చేతనాం ప్రాప్య ప్రాణాం స్త్యక్తుం సముద్యతః ।
తత్ర యోగాసనం కృత్వా చకార వాయుధారణం ॥
దూర్వాసముని ఆ మాటలను విని దుఃఖము చేత దెబ్బతిన్నవాడై, మహాజ్ఞాని ఆత్మారాముడై కూడ స్మృతిని పోగొట్టుకొని మూర్ఛిల్లెను. ఆశ్చర్యము, ఎంతటి పండితులకైనను స్త్రీ నాశము (భార్య మరణము) అన్ని శోకముల కంటె గొప్పది కదా ! కొద్ది సేపటికి అతడు తేరుకొని ప్రాణములను త్యజింపబూనుకొని యోగాసనమున కూర్చుండి వాయువును కుంభింపజేసెను (ఊపిరిని ఆపివేసెను).
ఏతస్మిన్నంతరే తత్ర జగామ బ్రాహ్మణోఽర్భకః।
దండీ ఛత్రీ రక్తవాసా బిభ్రత్తిలకముత్తమం ॥
నస్మితః శ్యామ వర్ణశ్చ ప్రజ్వలన్ బ్రహ్మతేజసా ।
వయసాఽతిశిశుః శాంతో జ్ఞానీ వేదవిదాం వరః ॥
దృష్ట్వా తం సంభ్రమేణైవ దుర్వాసాః ప్రణనామ హ ।
వాసయామాస తత్త్రైవ పూజయామాస భక్తితః ॥
ఉవాచ బ్రాహ్మణ వటుర్దత్త్వ తస్మై సదాశివః ।
తద్దర్శనాదాశిషా చ సర్వం దుఃఖం గతం మునేః॥
శిశురూపం క్షణం స్థిత్త్వా తమువాచ విచక్షణః।
పీయూష తుల్యం నీత్యోఘం నీతిశాస్త్ర విశారదః॥
ఇంతలో అక్కడకొక బ్రాహ్మణ బాలుడు వచ్చెను. శ్యామ వర్ణముతో నున్ననతడు ఎర్రని వస్త్రములను నుదుట మంచి తిలకమును చేతిలో దండము ఛత్రమును (గొడుగు) ధరించి యుండెను. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోవుచుండెను. చిన్న వయస్సులో నున్నను శాంతుడు జ్ఞాని వేదవేత్తలలో శ్రేష్ఠుడుగా నుండెను. చిరునవ్వు చిందించుచున్న అతనిని చూచి దూర్వాసముని ఆశ్చర్యముతో లేచి నమస్కరించి ఆసనము మీద కూర్చుండబెట్టి భక్తితో పూజించెను. ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి మునిని ఆశీర్వదించెను. అతని దర్శనము ఆశీర్వాదముల వలన దూర్వాసమునికి సర్వ దుఃఖములు తొలగిపోయెను. అట్లు శిశువుగా కొంతసేపుండి ఆ బాలుడు సదసద్విచక్షణ గల నీతిశాస్త్ర విశారదుడైనందున అమృతముతో సమానమైన నీతి సారమును మునికి వినిపించెను.
శిశురువాచ - బ్రాహ్మణ శిశువు ఇట్లనెను :
సర్వం జానాసి సర్వజ్ఞ గురోర్మంత్ర ప్రసాదతః।
కిం తత్త్వం త్వామహం విప్ర పృచ్ఛామి శోకకాతరం॥
బ్రాహ్మణానాం తపో ధర్మ స్తపస్సాధ్యం జగత్త్రయం ।
స్వధర్మం వై పరిత్యజ్య కిమిదానీం కరోషి భోః ॥
కా కస్య పత్నీ కః కాంతః కస్యా వా భువనత్రయే ।
మూర్ఖాణాం వంచనాం కర్తుం కరోతి మాయయా హరిః ॥
మిథ్యాపత్నీ తవేయం చ క్షణాత్తేన గతాధునా ।
న హి సత్యమదృశ్యం చ మిథ్యా యత్రాచిర స్థితిః ॥
ఓ సర్వజ్ఞుడా! గురువు యొక్క మంత్రరూపమైన అనుగ్రహము వలన నీవన్ని ఎరుగుదువు. ఓ బ్రాహ్మణా! దుఃఖమునకు బెదరిన నిన్ను నేనేమి తత్త్వమడుగవలెను? బ్రాహ్మణులకు తపస్సే ధర్మము. తపస్సు వలన ముల్లోకములు సాధింపబడును. నీ స్వధర్మము వదిలి పెట్టి ఇప్పుడేమి చేయుచుంటివి ? ఈ ముల్లోకములలో ఎవనికెవతె భార్య ? ఎవతకెవడు భర్త ? మూర్ఖులను మోసపుచ్చుటకు శ్రీహరి ఇటువంటి మాయలు పన్నును. ఈ నీ పత్ని మిథ్య. అందువలన మిథ్యారూపయైన ఆమె వెళ్లిపోయినది. ఎక్కడ మిథ్యయొక్క ఉనికి కొద్దికాలమై ఆ వెనుక అదృశ్యమగునో అది సత్యము కాదు కదా !
ఏకానంశా చ భగినీ వసుదేవ సుతా హరేః ।
పార్వత్యంశ సముద్భూతా సుశీలా చిరజీవినీ ॥
కల్పేకల్పే సుందరీ సా తవ పత్నీ భవిష్యతి।
మనో దేహి తపస్యాయాం ముదా కతిపయం దినం॥
కందలీ కదలీ జాతిర్భవిష్యతి మహీతలే ।
శుభదా ఫలదా కాంతా సకృత్సూతా సుదుర్లభా ॥
కల్పాంతరే శాంతరూపా తవ పత్నీ భవిష్యతి ।
అత్యుచ్ఛ్రితస్య దమనముచితం చ శ్రుతౌ శ్రుతం ॥
ఇత్యేవముక్త్వా శీఘ్రం చ విప్రరూపీ జనార్దనః ।
దత్త్వా జ్ఞానం చ విప్రాయ సోఽoతర్ధానం చకార హ ॥
పూర్ణురాలైన మాయాదేవి శ్రీకృష్ణునకు చెల్లెలిగా వసుదేవునికి పుత్రికగా పార్వతి యొక్క అంశతో జన్మించినది. ఆమె చిరంజీవిని. సచ్ఛీలవతి. ఆ సుందరియే ప్రతికల్పములో నీకు భార్య అగును. నీవిక సంతోషముతో కొంతకాలము తపస్సులో మనస్సు కుదుట పరచుకొనుము. ఈ భూమి మీద కందలి కదలీ జాతి (అరటి} కాగలదు. శుభకరము ఇతర జాతికి (వృక్షములకు) దుర్లభమైన ఒకే కాతతో మంచి ఫలము లిచ్చి మనోహరముగా నుండును. మరల కల్పాంతరములో శాంతరూపురాలైన భార్యగా నీకు లభించును. ఇట్లు చెప్పి విప్రరూపమునవచ్చిన జనార్దనుడు (విష్ణువు) దూర్వాసునకు జ్ఞానోపదేశము చేసి శీఘ్రముగా అంతర్థాన మొందెను.
మునిః సర్వభ్రమం త్యక్త్వా తపస్యాయాం మనో దధే ।
కందలీ కదలీ జాతిర్బభూవ ధరణీతలే ॥
దైత్యస్తాలవనం గత్వా బభూవ గర్డభాకృతిః ।
తిలోత్తమా బాణపుత్రీ బభూవ సమయే మునే ॥
దైత్యేంద్రో విష్ణుచక్రేణ ప్రాణాంస్త్యక్త్వా సువాంఛితం।
సంప్రాప్య చరణాంభోజం మునేరపి సుదుర్లభం ॥
కాలే తిలోత్తమా భూత్వా జగామ స్వాలయం పునః ।
కృష్ణ పౌత్రాలింగనేన పరిపూర్ణ మనోరథా॥
ఇత్యేవం కథితం శ్రుత్వా శ్రీకృష్ణాఖ్యాన ముత్తమం।
పదేపదే సుందరం చ కిం భూయః శ్రోతు మిచ్ఛసి ॥
దూర్వాసుడు అన్ని భ్రమలు వదిలి తపస్సు మీద మనస్సునిలిపెను. కందలి భూమండలములో కదలీ వృక్షజాతి అయ్యెను. సాహిసిక రాక్షసుడు తాలవనమునకు పోయి గార్దభాకారము పొంది విష్ణుచక్రము చేత ప్రాణములు వదిలి తాను మిక్కిలి వాంఛించు దుర్లభమైన శ్రీహరి పాదపద్మములను పొందెను. నారదా! తగిన సమయములో తిలోత్తమ బాణపుత్రికగా జన్మించి కృష్ణపౌత్రుని (మనుమని) ఆలింగన సుఖము పొంది తన కోరికలు నిండుగా తీర్చుకొని ఆ దేహాంతమున మరల తీలోత్తమయై తన నివాసమునకేగెను. ఇట్లు ఉత్తమమైన శ్రీకృష్ణాఖ్యానము వింటివి. ఇది ప్రతిపదమున రమణీయము. ఇకనేమి వినగోరుచున్నావు?
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే తాలఫలభక్షణ ప్రసంగే బలిపుత్ర మోక్షో నామ చతుర్వింశోఽధ్యాయః॥
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన తాళఫలభక్షణ ప్రసంగమున చెప్పిన బలిపుత్రుని మోక్ష మనెడి ఇరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 24 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
The waters of the Yamunā river near Vṛndāvana had become boiling poison due to the presence of the multi-headed venomous serpent Kāliya, whose fumes killed birds flying overhead and cows drinking from the shore. Leaping fearlessly into the poisoned pool, Kṛshṇa engaged the raging serpent in an epic aquatic combat, dancing upon Kāliya's hoods with rhythmic celestial footfalls that crushed the serpent's arrogant pride. As Kāliya's wives offered humble prayers of surrender, the serpent yielded completely, touching Kṛshṇa's lotus feet and departing with his family to Ramanaka island, restoring the pure sweetness of the Yamunā.