బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

21 - ఇంద్రయాగ భంజనము

శ్రీనారాయణ ఉవాచ - నారాయణమహర్షి ఇట్లనెను :

ఏకదాఽనంద యుక్తశ్చ నందో గోపవ్రజే మునే

దుందుభిం వాదయామాస శక్రయాగకృతోద్యమః

దధిక్షీరం ఘృతం తక్రం నవనీతం గడం మధు

ఏతాన్యాదాయ శక్రస్య పూజాం కుర్వంత్వితి బ్రువన్

 యే యే సంత్యత్ర నగరే గోపా గోప్యశ్చ బాలకా:

బాలికాశ్చ ద్విజా భూయో వైశ్యాః శూద్రాశ్చ భక్తితః

ఇత్యేవం శ్రావయామాస స్వయమేవ ముదాఽన్వితః

ఓ నారదమునీ! గోపవ్రజములో గోపాలకులు గోవులు నివసించిన పురము) ఆనందముగా నున్న నందుడొకసారి ఇంద్రుని గురించి ఒకయాగము చేయబూనినవాడై నగారా మ్రోగించి చాటింపు {ప్రకటన) చేయించేను. “ఈ పట్టణములో గోపాలురు గోపికలు బాలురు బాలికలు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు ఎవరెవరు నివసించుచున్నారో వారందరు పెరుగు పాలు నెయ్యి మజ్జిగ వెన్న బెల్లము తేనె అను పదార్థములను తెచ్చి భక్తితో ఇంద్ర పూజ చేయుదురు గాక” అని పలుకుచు స్వయముగా సంతోషముతో ఎల్లరకు.

యష్టిమారోపయామాస రమ్యస్థానే సువిస్తృతే

దదౌ తత్ర క్షౌమ వస్త్రం మాలాజాలం మనోహరం

చందనాగురు కస్తూరీ కుంకుమద్రవమేవ చ

మిక్కిలి విశాలముగా నున్న ఒక సుందర ప్రదేశమున చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వు అను సుగంధ ద్రవ్యముల ద్రవముతో అలికి మనోహరముగా పూమాలలను ధ్వజదండము ఎత్తించెను (పట్టు వస్త్రమున ఇంద్ర ధ్వజమున్నగడను.

స్నాతః కృతాహ్నికో భక్త్యా ధృత్వా ధౌతే చ వాససీ

ఉవాస స్వర్ణపీఠే చ ప్రక్షాళిత పదాంబుజః

నానాప్రకార పాత్రైశ్చ బ్రాహ్మణైశ్చ పురోహితైః

గోపాలైర్గోపికాభిశ్చ బాలాభిః సహ బాలకై:

ఏతస్మిన్నంతరే తత్రా జగ్ముర్నగర వాసినః

మహాసంభృత సంభారా నానోపాయన సంయుతాః

ఆజగ్ముర్మునయః సర్వే జ్వలంతో బ్రహ్మతేజసా

శాంతాః శిష్యగణైః సార్ధం వేదవేదాంగ పారగాః

నందుడు స్నానము చేసి భక్తితో సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలు చేసి ఉతికిన వస్త్రములను రెంటిని ధరించి (ధోతీ ఉత్తరీయము} పాద ప్రక్షాళనము చేసికొని స్వర్ణపీఠముపై కూర్చుండెను. నానావిధ పదార్ధముల పాత్రలు తీసుకొని అచ్చటికి గోపాలురు గోపికలు బాలురు బాలికలు బ్రాహ్మణులు పురోహితులు వచ్చిరి. ఇంతలో గొప్పగా కూర్చి తెచ్చిన వస్తు సామగ్రితో అచ్చటికి నగరమున వసించు జనులు వచ్చి చేరిరి. పోరు నానావిధములైన ఉపాయనములను (కానుకలను తెచ్చిరి. వేదవేదాంగముల పారమును ముట్టిన (అంతుచూచిన) మునులు బ్రహ్మ తేజస్సుతో వెలుగుచు శాంతులై శిష్యగణములతో బాటు అక్కడకు వచ్చిరి.

గర్గశ్చ గాలవశ్చైవ శాకల్యః శాకటాయనః

గౌతమః కరుష: కణ్వో వాత్స్య: కాత్యాయనస్తథా

సౌభరిర్వామదేవశ్చ యాజ్ఞవల్క్యశ్చ పాణినిః

ఋష్యశృంగో గౌరముఖో భరద్వాజశ్చ వామనః

 కృష్ణద్వైపాయనః శృంగీ సుమంతుర్జైమినిః కచః

పరాశరశ్చ మైత్రేయో వైశంపాయన ఏవ చ

బ్రాహ్మణాశ్చ కతివిధా భిక్షుకా వందినస్తథా

భూపా వైశ్యాశ్చ శూద్రాశ్చ నమాజగ్ముర్మహోత్సవే

గర్గుడు గాలవుడు శాకల్యుడు శాకటియనుడు గౌతముడు కరుషుడు కణ్వుడు వాత్యుడు కాత్యాయనుడు సౌభరి వామదేవుడు యాజ్ఞవల్క్యుడు పాణీని ఋష్యశృంగుడు గౌరముఖుడు భరద్వాజుడు వామనుడు కృష్ణద్వైపాయనుడు శృంగి సుమంతుడు జైమినీ కచుడు పరాశరుడు మైత్రేయుడు వైశంపాయనుడు అను మునులును బ్రాహ్మణులును పలు విధముల భిక్షుకులును వందిజనమును, రాజులు వైశ్యులు శూద్రులును ఆ మహోత్సవమునకు చేరవచ్చిరి.

దృష్ట్వా మునీంద్రాన్ నందశ్చ బ్రాహ్మణాస్ భూమిపాంస్తథా

స్వర్ణపీఠాత్పముత్తస్థౌ ప్రజాశ్చోత్తస్థురేవ చ

ప్రణమ్య వానయామాస మునీంద్రాన్ విప్రభూమిపాన్

తేషామనుమతిం ప్రాప్య తత్రోవాస పునర్ముదా

పాకం చ యష్టినికటే కర్తుమాజ్ఞాం చకార హ

పాకప్రాజ్ఞం బ్రాహ్మణానాం శతమావీయ పాదరం

నందుడు అతని వారగు గోపాలురును వచ్చిన మునీంద్రులను బ్రాహ్మణులను రాజులను చూచి అతడు తన స్వర్ణపీఠము మీది నుండి లేవగా గోపాలురును లేచి నిలబడిరి, నందుడు వచ్చిన వారికి నమస్కరించి వారిని కూర్చుండబెట్టి వారి ఆజ్ఞతో. తాను కూర్చుండెను యష్టి సమీపమున ధ్వజము - గడ) వంటలో ప్రావీణ్యము గల నూరుగురు బ్రాహ్మణులను పిలిపించి ఆదరముగా వంటలు చేయుటకాజ్ఞాపించెను.

తత్ర రత్నప్రదీపాశ్చ జజ్వలుః పరితస్తధా

ఆంధీభూతం చ ధూపేన స్థానం తత్పురభీకృతం

 నానావిధాన పుష్పాణి మాల్యాని వివిధాని చ

 నైవేద్యం చ బహువిధమహూర్వం సుమనోహరం

తిల లడ్డుక పూర్ణం చ మండకానాం సహస్రకం

స్వస్తికై: పరిపూర్ణం చ యష్టిస్థానం చ నారద

కలశానాం సహస్రం చ పూర్ణం శర్కరయా మునే

యమగోధూమ చూర్ణానాం లడ్డుకైర్మధురైర్వరైః

 ఘృతపక్వైర్విప్రకృతైః పూర్ణాని కలశానిచ

వృక్షపక్వాని రమ్యాణి చారు రంభా పలానిచ

 ఫలాని వరిపక్వాని కాలదేశోద్భవాని చ

క్షీరాణాం కుంభలక్షాణి దధ్నాం తావంతి నారద

 మధూనాం కుంభశతకం నర్పిష్కుంభ సహస్రకం

కలశానాం త్రిలక్షాణి తత్రపూర్ణాని నిశ్చితం

ఘటానాం పంచలక్షాణీ గుడపూర్ణాని నిశ్చితం

తిలతైలేన పూర్ణం చ కలశానాం సహస్రకం

ఆ ధ్వజప్రదేశము పొగదినుసులు (ఊదు మొదలగు సుగంధపు పొడులు) కాల్చుట వలన ఏర్పడిన పొగతో సువాసనలు గలదై చిమ్మచీకట్లు క్రమ్మెను. అప్పుడంతట రత్నాల దీపములు వెలిగించబడెను. నానావిధములైన పుష్పములు రకరకముల పూలదండలు అపూర్వము మనోహరమైన రకరకముల నైవేద్యము సమకూర్చబడెను, నువ్వుల లడ్డుకములు మండకములు స్వస్తికములు వేలకొలది నింపిన పాత్రలు ఆయష్టి స్థానమున నిండెను. ఓ నారదా! శర్కరతో నింపిన కలశములు వేయి, జవ్వలపిండి గోధుమ పిండితో మధురముగా అందముగా బ్రాహ్మణులు నేతిలో వండిన లడ్డూలతో అనేక కలశములు నిండి యుండెను. చెట్ల మీదనే పండి అందముగా రుచిగా నున్న . అరటి పండు ఆయాకాలములలో ఆయాదేశములలో పంటపండి లభించెడి పరిపక్వ ఫలములు - లక్ష కడవల పాలు లక్ష కడవల పెరుగు నూరు కడవల తేనె వెయ్యి కడవల నెయ్యి మూడు లక్షల కడవల మజ్జిగ బెల్లము నింపిన ఘటములైదు లక్షలు నువ్వుల నూనె నింపిన వెయ్యి కడవలు {అక్కడ చేర్చబడెను).

 వృషేంద్రాశ్చ బహవిధా భోగార్హ ద్రవ్య వాహకాః

నానావిధాని పాత్రాని సౌవర్ణ రాజతాని చ

 స్వర్ణపీఠాని చ బ్రహ్మన్నాజగ్ముర్యష్టి సన్నిధిం

వస్త్రాణి వరణార్హాణీ చారూణి భూషణాని చ

నానావిధాని వాద్యాని చారూణి మధురాణి చ

వాదకాః స్వరయంత్రాణి వాదయామాసురుత్సవే

భోగద్రవ్యములను మోసి తెచ్చు మంచి వృషభములు (ఎద్దులు) నానావిధములైన వెండి బంగారు పాత్రలను బంగారు పీటలను అక్కడకు తెచ్చెను, ధరింపయోగ్యమైన మంచి వస్త్రములు సుందర భూషణములు చేర్చబడెను. ఆ ఉత్సవ సమయమున కన్నులకింపుగా నున్న వివిధ వాద్యములను స్వరయంత్రములను వాదకులు (వాద్యమును మ్రోగించువారు) చెవికి మధురముగా మ్రోగించిరి.

ఛాగలానాం సహస్రాణి మహిషాణాం శతాని చ

మేషకాణాం చ లక్షాణి హ్యానయామాస తత్ర వై

శతాన్యేవ గండకానామాజగ్ముర్యష్టి సన్నిధిం

ప్రేక్షితాని చ సర్వాణి రక్షితాని చ రక్షకైః

వేలకొలది గొళె పొట్టేళ్లు, వందదున్నలు, లక్షల మేకపోతులు వందల దూడలు ఆ యష్టివద్దకు తేబడెను. వాటినన్నిటినీ చక్కగా చూచి రక్షకులు కాపాడుచుండిరి.

బాలకానాం బాలికానాం వృక్షానాం వృక్షయోషితాం

యూనాం చ యువతీనాం చ నంఖ్యాం కర్తుం చ కః క్షమః

గాయకానాం చ సంగీతం నర్తకానాం చ నర్తనం

శ్రుత్వా దృష్వా జనాః సర్వే ముముహుః సుమహోత్సవే

ఉత్సవమును చూచుటకై అక్కడికి చేరిన బాలురను బాలికలను యువతీ యువకులను వృక్షములను లతలను {అక్కడ వెలసినవాటిని) లెక్కించుట ఎవని తరము ? గాయకుల సంగీతమును విని నర్తకుల నర్తనము చూచి జనులందరు ఆ ఉత్సవములో వ్యామోహితులైరి.

రంభోర్వశీ మేనకా చ ఘృతాచీ మోహినీ రతిః

ప్రభావతీ భానుమతీ విప్రచిత్తి స్తిలోత్తమా

చంద్రప్రభా సుప్రభా చ రత్నమాలా మదాలసా

రేణుకా రమణీ బ్రహ్మన్నేతా ఆజగ్మురుత్సవే

తాసాం నృత్యేన గీతేన స్తనాన్య శ్రోణిదర్శనాత్

 రూపేణ వక్రదృష్యా చ మూర్చాం ప్రాపుశ్చ మానవాః

ఆ ఉత్సవసమయములో అక్కడకు రంభ ఊర్వశి మేనక ఘృతాచి మోహిని, రతి, ప్రభావతీ, భానుమతి, విప్రచిత్త, తిలోత్తమ, చంద్రప్రభ, సుప్రభ, రత్నమాల, మదాలస, రేణుక, రమణీ అను నీ అప్పరసలు వచ్చిరి, వారి నృత్యమును గాసమును స్తనములను ముఖములను పిరుదులను రూపమును ఓరచూపులను చూచి వ్యామోహితులై మానవులు మూర్ఛిల్లిరి.

ఏతస్మిన్నంతరే శీఘ్రమాజగామ హరిః స్వయం

గోపాలబాలకైః సార్దం బలేన బలిశాలినా

 దృష్ట్వా తం చ జనాః సర్వే సంభ్రాంతా హర్షవిహ్వలాః

ఉత్తస్థురారాద్భీతాశ్చ పులకాంకిత విగ్రహాః

ఇంతలో శ్రీకృష్ణుడు గోపాల బాలకులు బలశాలియైన బలదేవుడు వెంటరాగా అక్కడికి వచ్చాను. అతనిని చూచి జనులందరు తొందరపాటు ఆనంద పారవశ్యము భయము ఏర్పడగా పులకరించిన శరీరములతో లేచి నిలబడిరి.

క్రీడాస్థానాత్సమాయాంతం శాంతం సుందర విగ్రహం

వినోద మురలీ వేణు శృంగశబ్ద సమన్వితం

నద్రత్నసారభూషాభిర్భూషితం కౌస్తుభేన చ

చందనాగురు పంకేన చర్చితం శ్యామ విగ్రహం

శరన్మధ్యాహ్న పద్మాస్యం వశ్యంతం రత్నదర్పణే

చారుచందన చంద్రేణ కస్తూరీ బిందునా సహ

శశాంకేన యథాఽకాశం ఫాలమధ్య విరాజితం

మాలతీ మాలయా శ్యామకంఠవక్షః స్థలోజ్జ్వలం

బక పంక్త్యా యథాకాశం శారదీయం సునిర్మలం

చారుణా పీత వస్త్రేణ శోభితం శ్యామవిగ్రహం

విభాతం విద్యుతా శశ్వన్నవీనం నీరదం యధా

కుంద ప్రసూనైర్గుంజాభిర్బధ్ద వక్రిమ చూడకం

యథేంద్ర ధనుషా భాతి విభాతం భగణైర్నభః

రత్నకుండలదీస్త్యా చ స్మితవక్త్ర సుశోభితం

శరత్ప్రపుల్లపద్మం చ ద్యుమణేః కీరణైర్యథా

క్రీడాస్థానము (ఆటలాడుకొన్న ప్రదేశము) నుండి వచ్చుచున్న శాంతసుందరమూర్తియగు శ్రీకృష్ణుడు వినోదముగా పిల్లన గ్రోవి బూరలు కొమ్ముల నూదుచున్నవారితో కూడి వచ్చుచుండెను. శ్రేష్ఠమైన రత్నాభరణములతో కౌస్తుభమణితో అలంకృతుడై శ్రీగంధము అగురుల యొక్క ద్రవము పులుముకొన్న శ్యామవిగ్రహముతో ఒప్పుచుండెను. శరదృతువులోని మధ్యాహ్న కాలపు పద్మము వలె (వికసించిన) ముఖమండలమును రత్నదర్పణమున - చూచుకొనుచున్నవాడును - ఆకాశములో కుందేలు మచ్చ గల చంద్రుని వలె ఫాలమధ్యమందు (నొసలు) సుందరమైన చందన తిలకము నడుమ కస్తూరి చుక్క బోట్టు గలవాడును - ఏ మబ్బులు లేని శరదృతువులోని నిర్మలాకాశములో కొంగల వరుస ఎగిరినట్లు నల్లనీ కంఠము వక్షః స్థలమున మాలతీ పుష్పహారము వీరాజిల్లుచున్నవాడును - మాటిమాటికి మెరుపులు మెరియుచున్న క్రొత్తమేఘము వలె సుందరమైన పీతాంబరముతో ప్రకాశించుచున్న నల్లని దేహము గలవాడును ఉదయకాలమున నక్షత్రములతో ఇంద్రధనుస్సుతో ఒప్పుచున్న ఆకాశము వలె మొల్లపూలతో ఎర్రని గురివింద పూసలతో బిగించబడిన వంకర కొండెకొప్పు గలవాడును శరదృతువులో సూర్యకిరణముల చేత వికసింపజేయబడిన రత్న కుండలముల (చెవి కమ్మల) కోంతితోను చిరునవ్వు నవ్వుచున్న ముఖముతోను - ఆ స్వామి మనోహరముగా నుండెను.

వివక్షత్రియ వైశ్యాశ్చ మునయో వల్లవా మునే

 ప్రణమ్య వాసయామాసూ రత్న సింహాసనే శుభే

నారదా! బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మునులు గోపాలురు అందగతనికి నమస్కరించి శుభమైన రత్న సింహాసనము పైన కూర్చుండ బెట్టిరి.

ఉవాస రత్నపీఠే న తేషాం మధ్యే జగత్పతి:

యధా బభౌ శరచ్చంద్రో జ్యోతిషామంతరే చ ఖే

ఆకాశములో గ్రహ నక్షత్రముల నడుమ శరత్కాల చంద్రుడు వెలిగినట్లు ఆ జగన్నాధుడాజనుల మధ్యమందు రత్నపీఠమున ప్రకాశించెను.

శ్రుత్వా తమూచుస్తే నర్వే జగతామీశ్వరం వరం

 స్వేచ్ఛామయం గుణాతీతం జ్యోతిరూపం సనాతనం

దృష్ట్వా మహోత్సవం శీఘ్రమువాచ పీతరం హరిః

సర్వేషాం దుర్లభాం నీతిం నీతిశాస్త్ర విశారదః

 (పీరము ఫై విలసిల్లిన స్వామి కూర్చుండుటకు వారికి సెలవీయగా) అది విని వారు స్వేచ్ఛయే (తన సంకల్పమే) అవతారకారణమైనవాడు త్రిగుణముల కతీతుడు జ్యోతీరూపుడు సనాతనుడు జగత్తులకు పరమేశ్వరుడు అని స్వామిని గూర్చి ముచ్చటించుకొనిరి. నీతిశాస్త్ర విశారదుడైన శ్రీకృష్ణుడు ఆ మహోత్సవమును చూచి సర్వజనులకు దుర్లభమైన నీతిని తండ్రినుద్దేశించి పలికిను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

భోభో వల్లవ రాజేంద్ర కింకరోషీహ సువ్రత

ఆరాధ్యః కశ్చ కా పూజా కిం ఫలం పూజనే భవేత్

ఫలేన సాధనం కిం వా కః సాధ్య: సాధనేన చ

దేవే రుష్టే భవేత్కీం వా పూజాయాః ప్రతిబంధకే

 తుష్టో దేవః కిం దదాతీ ఫలమత్ర పరత్రకం

 కాచిద్దదాత్యత్ర ఫలం పరత్రేహ చ కాచన

కాచిచ్చ నోభయత్రాపి చోభయత్రాపి కాచన

ఓయీ! గోపాల రాజేంద్రా! మంచివ్రతనిష్ఠగలవాడా! ఇక్కడేమి చేయుచున్నావు ? ఇదేమి పూజ ? పూజింపబడువాడెవడు ? ఈ పూజ వలన ఏ ఫలము కలుగును? ఆ ఫలము వలన ఏ సాధనము లభించును ? ఆ సాధనముతో సాధింపబడునదేమి? ఈ పూజకాటంకమేర్పడిన యెడల ఆ దేవత కోపించెనేని ఏమి జరుగును ? ఆ దేవత సంతృప్తి చెందినచో ఇహ పరములకు సంబంధించి ఏమి ఫలమిచ్చును ? ఒక దేవత ఇహలోక ఫలమే ఇచ్చును. మరొక దేవత పరలోక ఫలమే ఇచ్చును. ఒక దేవత రెంటినీయదు. మరొక దేవత రెండిచ్చును.

ఆవేద విహితా పూజా సర్వహానికరండికా

పూజేయమధునా వా తే కిము వా పురుషక్రమాత్

దృష్టో దేవస్త్వయా కస్మిన్ పూజేయం చానుసారిణీ

సాక్షాత్ఖాదతి దేవ స్తే సాక్షాత్కిం వా న ఖాదతి

సాక్షాద్భుంకే చ యో దేవః సుప్రశస్తం తదర్చనం

సాక్షాత్ఖాదతి నైవేద్యం విప్రరూపీ జనార్దనః

వేదమందు చెప్పబడని పూజ సర్వవిధములైన నష్టములకు మూలము. ఈ పూజ నీకు క్రొత్తదియా లేక పరంపరగా మీ పెద్దలాచరించుచున్నదీయా ! ఈ పూజ ఏ దేవుని గురించి ఆచరింపబడుచున్నదో అతనిని నీవు చూచితివా ? నీ దేవుడి పదార్థములను నేరుగా తాను భుజించునా? భుజించడా ? నేరుగా భుజించు దేవునర్చించుట చాల చాల ప్రశస్తముగా నుండును. బ్రాహ్మణ రూపమున నుండు జనార్దనుడు (విష్ణువు} నైవేద్యమును సాక్షాత్తుగా భుజించును.

బ్రాహ్మణే పరితుష్టే చ సంతుష్టాః సర్వదేవతాః

కిం తస్య దేవ పూజాయాం యో నియుక్తో ద్విజార్చనే

పూజితా బ్రాహ్మణా యేన పూజితాః సర్వ దేవతాః

దేవాయ దత్త్యా నైవేద్యం ద్విజాయ న ప్రయచ్ఛతి

భస్మీభూతం చ నైవేద్యం పూజనం నిష్ఫలం భవేత్

విప్రాయ దేవ నైవేద్య దానాద్ద్రువమనంతకం

తుష్టో దేవో వరం దత్త్వా ప్రయాతి చ స్వమందిరం

దత్త్వా దేవాయ నైవేద్యం మూడో భుంక్తే స్వయం యది

 దత్తాపహారీ దేవస్వం భుక్త్వా చ నరకం వ్రజేత్

బ్రాహ్మణుడు సంతోషించినయెడల సర్వదేవతలు సంతృప్తి చెందుదురు. దేవపూజయందు బ్రాహ్మణుల నర్చించుటకేవడు నియమింపబడునో వానికేమి లభించదు ? బ్రాహ్మణుల నెవడు పూజించునో వాడు సర్వదేవతలను పూజించినవాడగును. నివేదన పదార్థములను దేవునికి సమర్పించి దానిని బ్రాహ్మణులకర్పించనిచో. ఆ నైవేద్యము భస్మమై పోవును, ఆ పూజ నిష్ఫలమగును. దేవతానైవేద్యమును విప్రునకు దానమొనర్చిన యెడల అనంతమైన స్థిర పదము లభించును. సంతోషించిన దేవత వరమిచ్చి తన లోకమునకేగును. దేవతా నివేదన చేసి తానే భుజించిన అవివేకి దానమిచ్చిన సొత్తు నపహరించినవాడగును. ఆ దేవద్రవ్యము భుజించినచో వాడు నరకమును పొందును.

దేవదత్తం న భోక్తవ్యం నైవేద్యం చ వీనా హరేః

ప్రశస్తం నర్వదేవేషు విష్ణు నైవేద్య భోజనం

అన్నం విష్ఠా జలం మూత్రం యద్విష్ణోరనివేదితం

సర్వేషాం చ క్రమమిదం బ్రాహ్మణానాం విశేషతః

న దత్త్వా వస్తు దేవాయ దత్తం విప్రాయ చేత్సుధీః

భుక్త్యా విప్రముఖే దేవా సుష్టాః స్వర్గం ప్రయాంతి చ

తస్మాత్సర్వ ప్రయత్నేన విప్రాణామర్చనం కురు

విష్ణువుకు నివేదించినది తప్ప ఇతర దేవతానైవేద్యము భుజింపగూడదు. సర్వదేవతల యందు విష్ణువునైవేద్యమును భుజించుట ప్రశస్తము. విష్ణువుకు నివేదించని అన్నము మలముతో సమానము జలము మూత్రముతో సమానము. ఎల్ల జనులకిదియే పాటీంపవలసిన క్రమము. విశేషించి బ్రాహ్మణులకు దాటరానీ నియమము. ఏ ప్రాజ్ఞుడు గాని పదార్ధమును దేవునికరించకుండ బ్రాహ్మణునకర్పించిన యెడల విప్రుని ద్వారా దేవతలు భుజించి సంతృప్తులగుట వలన స్వర్గమునకేగును. కాబట్టి అన్ని విధముల ప్రయత్నించి విప్రుల నారాధించుము.

ప్రశస్తఫలదాతృణామిహలోకే పరత్ర చ

జపస్తపశ్చ పూజా వా యజ్ఞదానం మహోత్సవం

సర్వేషాం కర్మణాం సారం విప్ర తుష్టిశ్చ దక్షిణా

దక్షిణానాం శరీరేమ తిష్ఠంతి సర్వ దేవతాః

ఇహ పరలోకములందు ప్రశస్తమైన ఫలమిచ్చువారు బ్రాహ్మణులు, జపము తపస్సు పూజ యజ్ఞము దానము మహోత్సవము అనెడి అన్ని కర్మల యొక్క సారము బ్రాహ్మణ సంతుష్టి మరియు ఈయబడునట్టి దక్షిణ. దక్షిణగా ఈయబడు దానియందు సర్వదేవతలు నివసింతురు.

పాదేషు నర్వతీర్థాని పుణ్యాని పాదధూళిషు

పాదోదకే చ విప్రాణాం తీర్థతోయాని నంతి చ

తత్ స్పర్శాత్ సర్వ, తీర్ధేషు స్నాన పుణ్యఫలం లభేత్

 నశ్యంతి భక్షణాద్రోగా భక్తి భావేన వల్లవ

సప్త జన్మకృతాత్పాపాస్ముచ్యతే నాత్ర సంశయః

 పాపం పంచ విధం కృత్వా యో విప్రం ప్రణమేద్ర్వజే

నస్నాతః సర్వతీర్ధేషు సర్వ పాపాత్ ప్రముచ్యతే

 బ్రాహ్మణ స్పర్శ మాత్రేణ ముక్తో భవతి పాతకీ

 దర్శనాన్ముచ్యతే పాపాదితి వేదే నిరూపితం

అప్రాజ్ఞో వాఽధ ప్రాజ్ఞో వా బ్రాహ్మణో విష్ణు విగ్రహః

 ప్రియాః ప్రాణాధికా విష్ణో ర్యే విప్రా హరి సేవనః

ద్విజానాం హరి భక్తానాం ప్రభావో దుర్లభః శ్రుతౌ

 యేషాం పాదాబ్జ రజసా సద్యః పూతా వసుంధరా

 తేషాం పాదచిహ్నం యతీర్థం తత్పరికీర్తితం

తేషాం చ స్పర్శమాత్రేణ తీర్థపాపం ప్రణశ్యతి

ఆలింగనాత్సదాలాపాత్తేషాముచ్ఛిష్ట భోజనాత్

దర్శనాత్స్పర్శనాచైవ సర్వపాపాత్ప్రముచ్యతే

భ్రమణే సర్వతీర్ధానాం యత్పుణ్య స్నానతో భవేత్

హరిదాసస్య విప్రస్య తత్పుణ్యం దర్శనాల్లభేత్

యే విప్రా హరయే దత్త్వా నిత్యమన్నం చ భుంజతే

ఉచ్ఛిష్టభోజనాత్తేషాం హరేరాస్యం లభేన్నరః

విప్రుల యొక్క పాదములయందు సర్వపుణ్యక్షేత్రములుండును. వారి పాదధూళిలో పుణ్యముండును. వారి పాద జలములో సర్వపుణ్య తీర్ధ జలములుండును. వీప్రపాద జలమును స్పృశించినంత మాత్రమున సర్వతీర్థములో స్నానమాడిన ఫలము లభించును. ఓ నందరాజా! భక్తితో వారి పాద జలము త్రాగిన యెడల రోగములు నశించును. ఏడు జన్మలలో చేసిన పాపముల నుండి కూడ వాడు - విముక్తుడగుననుటలో సంశయము లేదు. పంచవిధపాతకములు చేసినను బ్రాహ్మణునకు గోకులక్షేత్రమున నమస్కరించినట్లు సర్వతీర్థములలో స్నానమొనర్చినట్లు సర్వపాపముల నుండి విముక్తుడగును. బ్రాహ్మణునీ స్పృశించినంత మాత్రమున పాపి ముక్తుడగును. దర్శనము వలననే పాపవిముక్తుడగునని వేదమందు చెప్పబడినది. పండితుడు (జ్ఞాని) గాని అపండితుడు (ఏమి తెలియనివాడు) గానీ బ్రాహ్మణుడు, విష్ణువు యొక్క విగ్రహము. ఏ విప్రులు హరిని సేవించుచుందురో వారు విష్ణువునకు ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమైనవారు. హరి భక్తులైన బ్రాహ్మణుల మహిమ వేదమందును దుర్లభమని చెప్పబడినది. ఎవరి పాదపద్మముల ధూళితో వసుంధర (భూమి) అప్పటికప్పుడు పవిత్రయగునో ఆ బ్రాహ్మణుల పాద చిహ్నము (నేలమీద ముద్రితమైన అడుగు గుర్తు) పుణ్యతీర్థ ప్రదేశముగా చెప్పబడినది. ఆ పాద చిహ్నములను ముట్టుకోన్నంత మాత్రమున అజ్ఞానముతో పుణ్యతీర్ధములలో చేసిన పాపము నశించును. సద్వీప్రుని ఆలింగనము చేసికొన్నందువలన, అతనితో సంభాషించుట వలన వారి ఉచ్ఛిష్టము (తినగా మిగిలినది, ఎంగిలి పదార్థము) భుజించుట వలన, వారిని దర్శించుట వలన స్పృశించుట వలన కూడ సర్వపాపముల నుండి విముక్తుడగును. సర్వతీర్థయాత్రలు చేసి పుణ్యజలములలో స్నానము చేసినచో ఏ పుణ్యము లభించునో ఆ పుణ్యము హరి భక్తుడైన విప్రుని దర్శించినందు వలన లభించును, ఏ బ్రాహ్మణులు ప్రతిదినము శ్రీహరికి నివేదించిన యన్నమునే భుజింతురో వారి యుచ్ఛిష్టమును భుజించు నరుడు శ్రీహరి దాస్యముక్తిని పొందును.

న దత్త్వా హరయే భక్త్యా కుంజతే చేద్భ్రమాదపి

పురీష సదృశం వస్తు జలం మూత్రసమం భవేత్

ఏ నరుడు. భ్రమ ప్రమాదముల వలన నైనను శ్రీహరికి నివేదించకుండ భుజించినచో ఆ పదార్ధము మలముతో సమము ఆ జలము మూత్రముతో సమానమగును.

శూద్రశ్చేద్ధరిభక్తశ్చ నైవేద్య భోజనోత్సుకః

ఆమాన్నం హరయే దత్త్వా కృత్వా పాకం చ ఖాదతి

శూద్రుడు హరిభక్తుడై నైవేద్య పదార్థమే భుజించవలె నన్న ఆసక్తి కలవాడైనచో అమాన్నమును (పక్వము గాని - వండని పదార్థము) శ్రీహరికి నివేదించి తరువాత వండుకొని తినుచున్నాడు (తినవలెను అని ముందునుండి వచ్చుచున్న ఆచారమును చెప్పినాడు).

విప్రక్షత్రియ వైశ్యానాం సాలగ్రామ శిలార్చనే

ఆధికారో న శూద్రాణాం హరేరవ్యర్చనే తథా

 బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు సాలగ్రామ శిలను పూజించునధికారము కలదు. సాలగ్రామ శిలనే కాదు హరిని నేరుగా పూజించుటకును శూద్రునకధికారము లేదు.

ద్రవ్యాణ్యేతాని గోపేంద్ర విప్రేభ్యశ్చేన్న దాస్యతి

భస్మీభూతాని సర్వాణి భవిష్యంతి న సంశయః

అన్నం చ సర్వజీవేభ్యః పుణ్యార్ధం దాతుమర్హతి

దత్త్వా విశిష్ట జీవేభ్యో విశిష్టం ఫలమాప్నుయాత్

 అతో దత్యా మనుష్యేభ్యో లభతేఽష్టగుణం ఫలం

ఓ గోపాలనాధా! ఈ పదార్థములను బ్రాహ్మణులకు దానమీయకున్నచో ఇవి యన్నియు భస్మీభూతములగును. సంశయము లేదు. పుణ్యప్రాప్తి కొరకు సర్వజీవులకన్నము పెట్టదగును. అందులో విశిష్టజీవులకు దానమొనర్చినచో (అన్నము) విశేష ఫలము లభించును. అంతకంటే మనుష్యులకు పెట్టినయెడల ఎనిమిదింతలు పుణ్యము లభించును.

శూద్రానాం ద్విగుణం పుణ్యం వైశ్యేభ్యోఽన్నం ప్రదాయ చ

దత్త్యాన్నం క్షత్రియేభ్యోఽపి వైశ్యానాం ద్విగుణం భవేత్

క్షత్రియాణాం శతగుణం విపేభ్యోఽన్నం ప్రదాయ చ

 విప్రాణాం చ శతగుణం శాస్త్రజ్ఞే బ్రాహ్మణే ఫలం

శాస్త్రజ్ఞానాం శతగుణం భక్తే విప్రే లభేద్రువం

స చాన్నం హరయే దత్త్వా భుంక్తే భక్త్యా చ సాదరం

శూద్రుల కన్నము బెట్టినందువలన వచ్పు పుణ్యములో రెండింతల పుణ్యము వైశ్యులకన్నము పెట్టుట వలన వచ్చును. అంతకంటే ద్విగుణమైన పుణ్యము (రెండింతలు క్షత్రియులకు పెట్టుట వలన కలుగును. క్షత్రియులకు పెట్టుట వలన లభించు పుణ్యమునకు నూరంతలు పుణ్యము విప్రుల కన్నదానము చేయుట వలన కలుగును. బ్రాహ్మణులకు పెట్టినందు వలన వచ్చు దానీకంటే నూరంతలు పుణ్యఫలము శాస్త్రజ్ఞుడైన ఒక బ్రాహ్మణునకు పెట్టుట వలన కల్గును. శాస్త్రజ్ఞుల కంటే నూరంతలు పుణ్యఫలము భక్తుడైన విప్రున కన్న దానము చేసినందువలన - ఆయన్నము నాభక్తుడు భక్తితో హరికి నివేదించి భుజించును కనుక నీశ్చయముగా లభించును.

విష్ణవే విష్ణుభక్తాయ దత్త్వా దాతుశ్చ యత్ఫలం

తత్ఫలం లభతే నూనం భక్త బ్రాహ్మణ భోజనే

భక్తే తుష్టే హరిస్తుష్టో హారౌ తుష్టే చ దేవతాః

భవంతి సిద్ధా: శాఖాశ్చ యధా మూలనిషేచనాత్

ద్రవ్యాణ్యేతాని దేవాయ యద్యేక స్మై ప్రయచ్ఛతి

సర్వే దేవాశ్చ రుష్టాశ్చేద్దేవైః కః కిం కరిష్యతి

ఆధవాఽర్ధం చ వస్తూనాం దేహి గోవర్ధనాయ చ

విష్ణువునకు విష్ణుభక్తునకు అన్నదానమొనర్చి దాత ఏ ఫలము పొందునో ఆ ఫలమునే భక్తుడైన బ్రాహ్మణుడు భుజించినందు వలన తప్పక పొందును. భక్తుడు సంతుష్టుడైనచో హరీ సంతుష్టుడగును. హరి సంతుష్టుడైనచో సర్వదేవతలు సంతుష్టులగుదురు, చెట్టు మొదట నీరుపోసినందు వలన కొమ్మలు రెమ్మలెట్లు ఏర్పడునో నవనవలాడునో ఇదియునట్లే జరుగును. ఈ పదార్థములన్నిటిని ఏ యొక దేవతకో నీవర్పింతువేని సర్వ దేవతలు కోపము పొందిన యెడల ఆ దేవతలతో ఎవడేమి చేయగలడు. కానీచో నీ పదార్ధములలో సగము గోవర్థన పర్వతమునకు సమర్పించుము.

గా వర్గయతి నిత్యం యస్తేన గోవర్ధనః స్మృతః

గోవర్ధన సమస్తాత పుణ్యవాన్న మహీతలే

నిత్యం దదాతి గోఖ్యో యో నవీనాని తృణాని చ

గోవులనెప్పుడు వృద్ధి పొందించునది కనుక గోవర్ధనమని చెప్పబడినది. ఓ తండ్రి. గోవర్ధనముతో సమమైన పుణ్యాత్ముడీ భూమండలమున లేడు. ప్రతిదినము గోవులకీ పర్వతము లేతగడ్డినిచ్చుచున్నది కదా!

తీర్థస్నానేషు యత్పుణ్యం యత్పుణ్యం విప్రభోజనే

సర్వప్రతోవవాసేషు సర్వే ష్వేవ తపస్సు చ

యత్పుణ్యం చ మహాదానే యత్పుణ్యం హరి సేవనే

భువః పర్యటనే యత్తు సర్వవాక్యేషు యద్భవేత్

యత్పుణ్యం సర్వయజ్ఞేషు దీక్షాయాం చ లభేన్నరః

తత్పుణ్యం లభతే ప్రాజ్ఞో గోభ్యో దత్త్వా తృణాని చ

భుక్తవంతీం తృణం యశ్చ గాం వారయతి కామతః

బ్రహ్మహత్యా భవేత్తస్య ప్రాయశ్చిత్తాద్విశుధ్యతి

సర్వే దేవా గవామంగే తీర్థాని తత్పదేషు చ

తద్గు హ్యేషు స్వయం లక్ష్మీ స్తిష్ఠత్యేవ సదా పితః

గోష్పాదాక్త మృదా యో హి తిలకం కురుతే నరః

తీర్థస్నాతో భవేత్సద్యో జయస్తస్య పదే పదే

గావస్తిష్ఠంతి యత్రైవ తత్తీర్ణం పరికీర్తితం

ప్రాణాం స్త్యక్త్వా నరస్తత్ర సద్యో ముక్తో భవేద్ ధ్రువం

బ్రాహ్మణానాం గవామంగం యో హంతి మానవాధమః

బ్రహ్మహత్యా సమం పాపం భవేత్తస్య నసంశయః

నారాయణాంశాన్ విప్రాంశ్చ గాశ్చ యే ఘ్నంతి మానవాః

కాలసూత్రం చ తే యాంతి యావచ్చంద్ర దివాకరౌ

ఇత్యేవముక్త్యా శ్రీకృష్ణో వీరరామ చ నారద

పుణ్యతీర్థములలో స్నానమాడుట వలన, బ్రాహ్మణునకు భోజనము పెట్టుట వలన, సర్వవిధవ్రతముల వలన, ఉపవాసముల వలన, సర్వవీధ తపస్సుల వలన, మహాదానము వలన, హరి సేవ వలస, భూప్రదక్షిణము వలన, సర్వవేదశాస్త్రములు వినుట వలన, సర్వవిధముల యజ్ఞదీక్షలు పూని నెరవేర్చుట వలన, మానవుడే పుణ్యమును పొందునో ఆ పుణ్యమును బుద్ధిమంతుడు గోజాతీకి గడ్డిమేపి {గడ్డి ఇచ్చి) పొందును. గడ్డిమేయుచున్న ఆవును కావలెనని కోరికతో నెవడు ఆటంకపరచునో (వారించునో వానికి బ్రహ్మహత్యాదోషము పచ్చును. ఆ పాపము ప్రాయశ్చిత్తములవలననే తీరిపోవును. వాడు శుదుడగును. గోవుల శరీరమున స్వయముగా లక్ష్మీదేవి ఎల్లప్పుడు నివసించును. ఓ తండ్రీ! గోవుల యడుగుల తొక్కుడు వడిన మట్టీనెవడు తిలకముగా ధరించునో వాడప్పుడే తీర్థజల స్నానమొనర్చినవాడగును. వాని కడుగడుగున జయము కలుగును. గోవులెక్కడ నివసించునో ఆ ప్రదేశము పుణ్యతీర్థముగా చెప్పబడినది, అక్కడ ప్రాణములు విడిచిన మానవుడు వెంటనే ముక్తి పొందుట నిశ్చయము. బ్రాహ్మణుని గోవును దండించిన మానవాధముడు బ్రహ్మహత్యతో సమమైన పాపము పొందుననుటలో సందేహము లేదు. నారాయణుని అంశగలవారైన విప్రులను గోవునేమానవులు పధింతురో వారు సూర్యచంద్రులున్నంత వరకు కాలసూత్ర నరకమును పొందుదురు. ఇట్లు పలికి శ్రీకృష్ణుడు విరమించెను.

ఆనందోయుక్తో నందశ్చ తమువాచ స్మితాననః

శ్రీకృష్ణుని మాటలు విని ఆనందము పొందిన నందుడు చిరునవ్వుతో నతనికిట్లనెను.

నంద ఉవాచ - నందుడనెను :

పూర్వాపరీయం పూజేతి మహేంద్రస్య మహాత్మనః

నువృష్టి సాధనీ సాధ్యం నర్వనన్య మనోహరం

నస్యాని ప్రాణినాం ప్రాణాః సస్యాజీవంతి జీవీనః

 పూజయంతి వ్రజస్థాశ్చ మహేంద్రం పురుష క్రమాత్

 మహోత్సవం వత్సరాంతే నిర్విఘ్నాయ శివాయ చ

ఇది మహాశక్తి శాలియైన మహేంద్రుని పూజ. మంచి వర్షమునకిది సాధనము, సర్వవిధములైన సస్యములు చక్కగా పండుట మన లక్ష్యము (సాధ్యము} సస్యములే జీవకోటికి ప్రాణము కదా! భూమీ మీది జీవకోటి యంతయు సస్యము వలన జీవించును. అందుకొరకే ప్రజవాసులందరు పురుషక్రమముగా (వంశములో ప్రతి పురుషుడాచరించుట వంశాచారముగా తరతరముల నుండి మహేంద్రుని పూజించుచున్నారు. ఒక సంవత్సరము మొదలు చివరగా ఈ పూజ సాచరించవలయును. విఘ్నములు తొలగుటకు మంగళము కొరకుగాను ఇది ఆదిలో చేయు పూజ. సంవత్సరాంతమున మహోత్సవముండును.

ఇత్యేవం వచనం శ్రుత్వా బలేన సహ మాధవః

ఉచ్ఛైర్జహాస స పునరువాచ పీతరం ముదా

ఇట్లు పలికిన తండ్రి మాట వినీ బలదేవునితో బాటు శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వెను. తరువాత, తండ్రితో మరల నిట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడనెను :

అహో శ్రుతం విచిత్రం తే వచనం పరమాద్భుతం

ఉపహాస్యం లోకశాస్త్రం వేదే ష్వేవ విగర్హితం

నిరూపణం నాస్తి కుత్ర శక్రాద్ వృష్టి: ప్రజాయతే

ఆపూర్వం నీతి వచనం శ్రుతమద్య ముఖాత్తవ

శ్రుణు నీతిం శ్రుతిమతాం హే తాత నానయం వదేః

వచనం సామ వేదోక్తం సంతో జాసంతి సర్వతః

ఆహా! విడ్డూరమైన నీ వాక్కును మిక్కిలి అద్భుతముగా వింటీని. లోక మర్యాదను బట్టి గానీ శాస్త్ర నియమమును బట్టి గాని ఇది నవ్వుకొనవలసిన మాట. వేదములలో మిక్కిలి గర్జించుకొన్న (అసహ్యించుకొన్న- నిందించిన మాట యిది. ఇంద్రుని వలన వర్షమేర్పడునన్న దానికి ఎక్కడ కూడ నీరూపణము (ఆధార వాక్యము) లేదు. ఈ దినము నీ ముఖము నుండి అపూర్వమైన నీతి వాక్యము వింటిని. ఓ తండ్రీ! వినుము. నేనధర్మము చెప్పను. నేను చెప్పునది వేదవేత్తల నీతి. దీనిని పండితులంతట ఎరుగుదురు. సామవేదముందు చెప్పబడిన మాట యిది.

ప్రశ్నం కురుష్వ మంత్రింశ్చ వివిధానపి సంసది

 బ్రువంతు పరమార్థం చ కిమింద్రాద్వృష్ఠిరేవ చ

ఈ సభలో ఆలోచించి చెప్పగలవారనేకులు (చాల విషయములు తెలిసినవారు) ఉన్నారు. వారినడుగుము. “అయ్యా! ఏమి? ఇంద్రుని వలన వర్షమేర్పడునా ? పరమార్ధము (వాస్తవము) చెప్పుడు” అని.

సూర్యాద్ధి జాయతే తోయం తోయత్పస్యాని శాఖినః

 తేభ్యోఽన్నాని ఫలాన్యేవ తేభ్యో జీవంతి జీవినః

సూర్యగ్రస్తం చ నీరం చ కాలే తస్మాత్సముద్భవః

సూర్యో మేఘాదయః సర్వే విధాత్రా తే నిరూపితాః

యత్రాబ్ధే యో జలధరో గజశ్చ సాగరో మతః

సస్యాధిపో నృపో మంత్రి విధాత్రా తే నిరూపితాః

జలాదికానాం సస్యానాం తృణానాం చ నిరూపితం

 అబ్ధేఽబ్ధేఽస్త్యేవ తత్సర్వం కల్పేకల్పే యుగే యుగే

సూర్యుని వలన జలమేర్పడును, జలము వలన సస్యములు (పంటచేలు వృక్షములు} వర్ధిల్లును. పోటీ నుండి ధాన్యములు {అన్నము) ఫలములు ఏర్పడును. ప్రాణులు వాటిని భుజించీ బ్రతుకుచున్నారు. సూర్యునిచేత పీల్చబడిన నీటి వలన తగిన కాలములో మేఘమేర్పడును. సూర్యుడు మేఘములు మొదలైనవన్నియు విధాత (బ్రహ్మ -దైవము) చేత నిరూపింపబడినవే. మేఘము గజము సాగరము సస్యాధిపతి రాజు మంత్రి ఏ సంవత్సరమున ఎవరుందురో వారందరు విధాత చేత నిర్ణయించబడియున్నారు. నీరు మొదలైన . పంటలు గడ్డి మొదలు గాగల వన్నియు యుగయుగమున ప్రతికల్పములో ప్రతి సంవత్సరము నిర్ణయించబడియే ఉన్నవి.

హస్తీ సముద్రాదాదాయ కరేణ జలమీప్సితం

దద్యాద్ఘనాయ తద్దద్యాద్వాతేన ప్రేరితో ఘనః

స్థానే స్థానే పృధివ్యాం చ కాలే కాలే యధోచితం

 ఈశేచ్ఛయాఽఽవిర్భూతం చ న భవేత్రృతిబంధకం

భూతం భవ్యం భవిష్యచ్చ మహత్ క్షుద్రం చ మధ్యమం

ధాత్రా నిరూపితం కర్మ కేన తాత నివార్యతే

గజము తనకిష్టమున్నంత జలము సముద్రము నుండి తొండముతో తీసుకొని మేఘమునకిచ్చును. (ఇంతకు ముందు జలము గ్రహించువాడు సూర్యుడని చెప్పి ఇక్కడ ఇట్లు చెప్పుట ఒక సంకేతమని భావించవలెను. సూర్యకిరణములు భూమి మీది జలము గ్రహించుట ఏనుగు తొండముతో పీల్చినట్లు అన్న పోలికను పురాణకర్త ఇట్లు చెప్పియుండవచ్చును). మేఘము గాలి వలన ప్రేరణ పొంది తగిన కాలములో భూమి మీద అచ్చటచ్చట తగినట్లు వర్షించును. భగవంతునీ ఇచ్ఛవలన ఏర్పడిన ఈ మేఘ వర్షములకు వేరేదో ఒకటి ప్రతిబంధకము (ఆటంకము) కాజాలదు. జరిగినది జరుగుచున్నది జరుగుబోవునది గొప్పది చిన్నది మధ్యస్థాయిది అన్నియు భగవదిచ్ఛ వలననే జరుగును. సృష్టికర్తచేత నిరూపితమైన కర్మను ఎవడు నివారించగలుగును?.

జగచ్చరాచరం సర్వ కృతం తేనేశ్వరాజ్ఞయా

ఆదౌ వినిర్మితం భక్ష్యం పశ్చాజ్జీవ ఇతి స్మృతః

ఆభ్యాసాత్ప స్వభావో హే స్వభావాత్కర్మ ఏవ చ

జాయతే కర్మణాం భోగో జీవినాం సుఖదు:ఖయోః

యాతనా జన్మమరణ రోగశోక భయానీ చ

నముత్పత్తిర్వివద్విద్యా కవితా వా యశోఽయశః

 వుణ్యం చ స్వర్గ వాసశ్చ పాపం నరక సంస్థితి:

 భుక్తిర్ముక్తి ర్హ రేర్దాస్యం కర్మణా మటతే నృణాం

భగవంతుని ఆజ్ఞచేత ఆ సృష్టికర్త (బ్రహ్మ) మొత్తము చరాచర జగత్తును సృష్టించేను. మొదలే భోజన పదార్థమును నిర్మించి తరువాతనే జీవుని సృష్టించెనని చెప్పబడినది. ఒక ప్రాణికి ఒక కర్మ అభ్యాసమై అది స్వభావముగా మారును. స్వభావమును బట్టి కర్మ చేయబడును. జీవకోటికి సుఖదుఃఖముల రూపమున కర్మల భోగము సంభవించును. పాపకర్మ ఫలమనుభవించు యాతనా శరీరము (నరకములో) తరువాత భూమిపైన జన్మించుట మరణము రోగములు శోకము భయముల యొక్క ఉత్పత్తి ఆపదలు విద్యలు కవిత్వ రచన కీర్త్యపకీర్తులు పుణ్యము చేయుటస్వర్గవాసము పాపమొనర్చుట నరకవాసము కర్మఫలభక్తి సంసార విముక్తి శ్రీహరి దోస్యముక్తి ఇవియన్నియు మనుష్యులకు కర్మ వలన ఘటించును.

సర్వేషాం జనకో హ్యీశశ్చాభ్యాసః శీలకర్మణాం

ధాతుశ్చ ఫలదాతా చ సర్వం తస్వేచ్ఛయా భవేత్

వినిర్మితో విరాడ్యేస తత్త్వానీ ప్రకృతిర్జగత్

కూర్మాశ్చ శేషధరణీ చాబ్రహ్మస్తంబ ఏవ చ

యస్యాజ్ఞయా మరుత్కూర్మం ధత్తే శేషం బిభర్తి సః

 శేషో వసుంధరాం మూర్ధ్నా సా చ సర్వం చరాచరం

యస్యాజ్ఞయా సదా పాతి జగత్ప్రాణో జగత్త్రయే

తవతి భ్రమణం కృత్వా భూలోకం సుప్రభాకరః

దహత్యగ్ని: సంచరతే మృత్యుశ్చ సర్వజంతుషుః

ఉత్పత్తి: శాలినాం కాలే వుష్పాణి చ ఫలాని చ

స్వే స్వే స్థానే సముద్రాశ్చ తూర్ణం మజ్జంత్యధోఽఽధునా

తమీశం భజ భక్త్యా చ శక్రః కిం కర్తుమీశ్వరః

బ్రహ్మాండం కతివిధమావిర్భూతం తిరోహితం

విధయశ్చ కతివిధా యన్య భ్రూభంగ లీలయా

మృత్యోర్మృత్యుః కాలకాలే విధాతుర్విధీరేవ సః

భజ తం శరణం తాత స తే రక్షాం కరిష్యతి

అహోఽష్టావింశదీంద్రాణాం పతనే యదహర్నిశం

విధాతురేవ జగతామష్టోత్తర శతాధికః

నిమేషాద్యస్య పతనం నిర్గుణస్యాత్మనః ప్రభో:

 ఏవం భూతే తిష్ఠతీశే శక్ర పూజా విడంబనం

ఇత్యేవముక్త్వా శ్రీకృష్ణో విరరామ చ నారద

ప్రశశంసుశ్స మునయో భగవంతం సభాసదః

 జీవుల యొక్క అభ్యాసము శీలము కర్మ అను వానిని జనింపజేయువాడు {ఉత్పత్తికారుడు) భగవంతుడే. బ్రహ్మకు ఫల ప్రదాత కూడ స్వామియే. కావున సర్వము భగవంతుని ఇచ్ఛను బట్టియే ఏర్పడును. ఏ పరాత్పరుని చేత విరాట్టు (విశ్వము) తత్వములు ప్రకృతి జగత్తు కూర్మము శేషుడు ధరణి బ్రహ్మ మొదలుకొని గడ్డి వేరు వరకు నిర్మింపబడినదో - ఎవనీ యాజ్ఞచేత వాయువు కూర్మమును {తాబేలు) ఆ కూర్మము శేషుని ఆ శేషుడు భూమిని తలలోను ఆ భూమి చరాచర జీవకోటిని మోయుచున్నారో - ఎవని యాజ్ఞచేత జగత్తునకు ప్రాణమైన వాయువు ముల్లోకములలో నెల్లప్పుడు వీచుచున్నాడో - ప్రభాకరుడు చుట్టు తిరుగుచు భూలోకమునకు తన వేడి వెలుగు నిచ్చుచున్నాడో - అగ్ని కాల్చుట సర్వ జంతువులందు మృత్యువు సంచరించుట వృక్షములకు తగిన కాలములో పుష్పములు ఫలములు ఉత్పత్తి యగుట జరుగుచున్నవో - ఇప్పటికిని తమతమ స్థానములోనే సముద్రములు త్వరగా జలమును తమ క్రింది భాగమునకే ప్రవహింపజేయుచున్నవో - ఆ పరమాత్మను భక్తితో భజించుము. ఇంద్రుడు నిన్నేమి చేయ సమర్దుడగును? ఎవని బోమముడి విలాసము చేత బహు విధములైన బ్రహ్మాండములుద్భవించుచు లయించుచున్నవో - ఎన్ని విధముల విధులేర్పడుచున్నవో ఆ భగవంతుడు మృత్యువునకే మృత్యువు కాలునికి కాలుడు వీధికి విధి కూడ. ఓ తండ్రీ! అతనిని శరణుబొందుము. అతడు నిన్ను రక్షించును. జగత్సృష్టి కర్తయైన బ్రహ్మ జీవితములోని ఒక పగలు రాత్రి కాలములో ఇరువది యెనిమిది మంది ఇంద్రులు తమ స్థానము నుండి రాలిపోదురు. అంత సుదీర్ఘకాలము జీవించు బ్రహ్మ శక్తి కంటే నూట యెనిమిది యంతలు అధికుడు కూడ నిరుణుడు ఆత్మలకు ప్రభువైన భగవంతుని యొక్క కనురెప్పపాటు వలన (అంతకాలములో) పడిపోవును. ఇటువంటి పరమాత్మ యుండగా ఇంద్రపూజ యనునది వ్యర్ధమైన కార్యము. ఇట్లు పలికి శ్రీకృష్ణుడు విరమించగా అక్కడున్న సభలోని మునులు భగవంతుని (శ్రీకృష్ణుని) ప్రశంసించిరి.

నందః సపులకో హృష్టః సభాయాం సాశ్రులోచనః

ఆనంద యుక్తా మనుజా యది పుత్రైః పరాజితాః

పుత్రుల చేతిలో ఓడిపోయిన మనుజులు పరుల చేతిలో ఓడిపోయినప్పుడు బాధపడినట్లుగాక) ఆనందపడుదురు కనుక నందుడు శరీరము పులకలెత్తగా కన్నుల నీరు గలవాడై ఆ నిండు సభలో హరము ప్రకటించెను.

శ్రీకృష్ణాజ్ఞాం సమాజ్ఞాయ చకార స్వస్తివాచనం

క్రమేణ వరణం తత్ర సర్వేషాం చ చకార హా

పర్వతస్య మునీంద్రాణాం చకార పూజనం తదా

బుధానాం బ్రాహ్మణానాం చ గవాం వ హ్నేశ్చ సాదరం

తత్ర పూజా సమాప్తౌ చ క్రతౌ చ సుమహోత్సవే

 నానా ప్రకార వాద్యానాం బభూవ శబ్ద ఉల్బణః

జయశబ్దః శంఖశబ్ధో హరిశబ్ధో బభూవ హ

వేదమంగల కాండం చ పపాఠ మునిపుంగవః

వందనాం ప్రవరో డిండీ కంసస్య సచివః ప్రియః

 ఉచ్చైః పపాఠ పురతో మంగలం మంగలాష్టకం

శ్రీకృష్ణుని ఆజ్ఞను తెలిసికొని నందుడు స్వస్తి వాచసము చేసి క్రమముగా ఆ కార్యక్రమమునకు తగినట్లు బ్రాహ్మణవరణము (ఈ కార్యములు మీరు మీరు చేయుడు అని బాధ్యతలను ఆదర మర్యాదలతో అప్పగించుట) గావించెను. గోవర్ధన పర్వతమును మునీంద్రులను పండితులను బ్రాహ్మణోత్తములను గోజాతిని అగ్నిని భక్తి శ్రద్ధలతో పూజించెను. అగ్నీలో హోమము జరిపించెను. అట్లు పూజలు సమాప్తియైన తరువాత ఆ మహోత్సవములో నానావిధములైన మంగళ వాద్యములను మ్రోగించిన ధ్వని అంతట వ్యాపించెను. వెంట వెంట జయజయ అన్న శబ్దము శంఖములు మ్రోగించిన ధ్వని హరి హరీ అన్న శబ్దము ఏర్పడి విస్తరించేను. ముని పుంగవులు వేదములందలి మంగళకాండములను పఠించిరి. వందులలో శ్రేష్ఠుడు కంసునకిష్ట సచివుడైన డిండి యనువాడు ముందు నిలిచి మంగళకరమైన మంగళాష్టకమును గొంతెత్తి పఠించెను.

కృష్ణః శైలాంతికం గత్వా భిన్నాం మూర్తిం విధాయ చ

వస్తు ఖాదామి శైలోఽస్మి వరం వృణ్విత్యువాచ హ

ఉవాచ నందం శ్రీకృష్ణః పశ్య శైలం ఏతః పురః

వరం ప్రార్థయ భద్రం తే భవితా చేత్యువాచ హా

శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వత సమీపమునకు పోయి తన రూపము కన్న వేరైన ఒక రూపము ధరించి “ఓ నందరాజా! నీవర్పించిన వస్తువులను భుజించుచున్నాను. నేను గోవర్ధన పర్వతమును. నీకు నచ్చిన వరము కోరుకొనుము” అనెను. అపుడు తండ్రి ప్రక్కనున్న శ్రీకృష్ణుడు) “ఓ తండ్రీ! నీ ముందు నిలిచియున్న పర్వతమూర్తిని చూడుము. వరమును ప్రార్థించుము. నీకు మంగళమగును" అని నందునితో పలికెను.

హరేర్దాస్యం హరేర్భక్తిం వరం వవ్రే న వల్లవః

ద్రవ్యం భుక్త్యా వరం దత్త్వా సోంఽతర్ధానం చకార హా

ఆ గోపాలుడు (నందుడు} శ్రీహరి భక్తిని శ్రీహరి దాస్యముక్తిని వరముగా కోరుకొనెను. ఆ పర్వతమూర్తి నందుడర్పించిన పదార్థములను భుజించి అతనికి వరమిచ్చి అంతర్ధానము పొందెను. (అదృశ్యమయ్యెను).

 మునీంద్రాన్ బ్రాహ్మణాంశ్చైవ భోజయిత్వా చ గోవపః

వందిభ్యో బ్రాహ్మణేభ్యశ్చ మునిభ్యశ్చ ధనం దదౌ

మునిభ్యో బ్రాహ్మణేభ్యోఽపీ దత్త్వా నందో ముదాఽన్వితః

రామకృష్ణౌ పురస్కృత్య సగణః స్వాలయం యయౌ

రౌష్యం వస్త్రం సువర్ణం చ వరమశ్వం మణిం తథా

భక్ష్యం ద్రవ్యం బహువిధం వందినే డిండినే దదౌ

గోపనాధుడైన నందుడు మునీంద్రులకు బ్రాహ్మణులకు వందీజనమునకు భోజనములు పెట్టించి అందరికి తగినంత ధనమును దానమిచ్చెను. ఇట్లందరికి దానమిచ్చి సంతోషముతో తన బంధువులను గోపాలురను రామకృష్ణులను తోడ్కొని తన గృహమున కేగెను. వందియైన డిండికి వస్త్రములను వెండి బంగారములను ఉత్తమాశ్వమును రత్నమును బహువిధములైన భోజన పదార్థములను ఇచ్చి సత్కరించెను.

స్తుత్వా నత్వా రామకృష్ణౌ మునయో బ్రాహ్మణా యయః

యయురప్సరసః సర్వా గంధర్వాః కిన్నరాస్తథా

రాజానో వల్లవాః సర్వే చాహూతా యే మహోత్సవే

సర్వే ప్రణమ్య శ్రీకృష్ణం యయుః సాదరపూర్వకం

ఆ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన మునులు బ్రాహ్మణులు. రామకృష్ణులను స్తోత్రమొనర్చి నమస్కరించి తిరిగి వెడలిపోయిరి. మొత్తము అప్సరసలు .గంధర్వులు కిన్నరులు రాజులు గోపాలురు (ఆహ్వానింపబడిన వారందరు) ఆదరముతో అందరు శ్రీకృష్ణునకు నమస్కరించి వెడలిపోయిరి.

ఏతస్మిన్నంతరే శక్ర: కోపప్రస్సురితాధరః

మఖభంగే బహువిధాం నిందాం శ్రుత్వా సురేశ్వరః

మరుద్భిః వారిదైః సార్ధం రధమారుహ్య సత్వరం

జగామ నందనగరం బృందారణ్యం మనోహరం

సర్వే దేవా యయుః పశ్చాద్యుద్ధశాస్త్ర విశారదాః

శస్త్రాస్త్ర పాణయ: కోపాద్రథమారుహ్య నారద

నారదా! ఇంతలో ఇంద్రుడు తన పేరున ఆరంభించబడిన యజ్ఞము భంగమొనర్చి అనేక విధములుగా తనను నిందించిన శ్రీకృష్ణుని విషయము విని - దేవరాజు నన్న భావముతో కోపము వలన క్రింది పెదవి వణకుచుండగా రథమెక్కి మరుత్తులను మేఘములను వెంటబెట్టుకోనీ - మనోహరమైన బృందావనములో నున్న నందుని నగరమునకు పోయెను. యుద్ధము నందు విశారదులైన (నేర్పుగలవారు) సర్వదేవతలు శస్త్రములు అస్త్రములు చేత బట్టుకొని రథములెక్కి కోపముతో నింద్రుని వెనుక పోయిరి.

వాయుశబ్ధైర్మేఘశబ్ధై: సైన్యశబ్ధైర్భయానకై:

చకoపే నగరం నర్వం నందో భయమవావ హ

భార్యాం సంబోధ్య స్వగణమువాచ శోకకాతరః

రహః స్థలం నమామీయ నీతిశాస్త్ర విశారదః

హోరుమని వీచుచున్న గాలి వలన ఏర్పడిన ధ్వనుల వలన, ఉరుముచున్న మేఘముల ధ్వని వలన భయము గల్గించు దేవతా సైన్యపు ధ్వని వలన నందుని నగరము గడగడలాడిను. ప్రజలందరును నందుడును మిక్కిలి భయపడిరి. తన వారికే ప్రమాదము సంభవించునో యన్న భయదుఃఖములతో నందుడు రహస్య ప్రదేశమునకు భార్యను పిలిచి నీతిశాస్త్రమునందు ఆరితేరిన వ్యక్తిగా ఈ తీరుగా పలికెను.

నంద ఉవాచ - సందుడిట్లు పలికెను :

హేయశోదే సమాగచ్చ వచనం శృణు రోహిణి

రామకృష్ణౌ సమాదాయ వ్రజ దూరం వ్రజాత్ ప్రియే

 బాలకా బాలికా నార్యో యాంతు దూరం భయాకులాః

 బలవంతశ్చ గోపాలాస్తిష్ఠంతు మత్సమీపతః

పశ్చాచ్చ నిర్గమిష్యామో వయం చ ప్రాణసంకటాత్

ఇత్యుక్త్వా వల్లవ శ్రేష్ఠః సస్మార శ్రీహరిం భీయా

పుటాంజలియుతో భూత్వా భక్తి నమ్రత కంధరః

కాణ్వశాఖోక్త స్తోత్రేణ తుష్టావ హ శచీపతిం

ఓ యశోదా! ఇటురమ్ము, రోహిణీ! నామాట వినుము. ఓ ప్రియురాలా! (యశోదనుద్దేశించి అన్నమాట) బలరామకృష్ణులను తీసుకొని ఈ ప్రజము నుండి దూరముగా వెళుడు. భయముతో ఆందోళన పడుచున్న బాలురు బాలికలు స్త్రీలు అందరు వెడలిపొండు. - బలవంతులైన గోపాలురు మాత్రము నావద్ద నిలువుడు. ఈ ప్రాణసంకట ప్రదేశము నుండి వెనుక (తర్వాత) మేము కూడ బయలుదేరి

రాగలము. గోపాలనాధుడు (నందుడు) ఇట్లు పలికి భయముతో శ్రీహరిని స్మరించెను. చేతులు జోడించి భక్తితో తలవంచీ సామవేదములో కాణ్వశాఖలో చెప్పబడిన స్తోత్రముతో శచీపతిని (దేవరాజగు ఇంద్రుని) ఇట్లు స్తుతించెను.

నంద ఉవాచ - నందుడిట్లనెను :

ఇంద్రః సురపతిః శక్రో దితిజః పవనాగ్రజః

సహస్రాక్షో భగాంగశ్చ కశ్యపాంగజ ఏవ చ

బిడౌజాశ్చ నునాసీరో మరుత్వాన్ పాకశాసనః

జయంత జనకః శ్రీమాన్ శచీశో దైత్యసూదనః

వజ్రహస్త: కామసఖో గౌతమీ వ్రతనాశనః

వృత్రహా వాసవశ్చైవ దధీచి దేహభిక్షుకః

విష్ణుశ్చ వామనభ్రాతా పురుహూతః పురందరః

 దివస్పతి: శతమఖః సుత్రామా గోత్రభిద్విభుః

లేఖర్షభో బలరాతిర్జంభభేదీ సురాశ్రయః

సంక్రందనో దుశ్చ్యవనస్తురాషాణ్ మేఘవాహనః

ఆఖండలో హరిహయో నముచి ప్రాణనాశనః

వృద్ధశ్రవా వృషశ్చైవ దైత్యదర్ప నిమాదనః

 షట్చత్వారింశన్నామాని పాపఘ్నాని వినిశ్చితం

స్తోత్రమేతత్కౌధుమోక్తం నిత్యం యది పఠేన్నరః

 మహావిపత్తౌ శక్రస్తం వజ్రహస్తశ్చ రక్షతి

అతివృష్టి శిలావృష్టి వజ్రపాతాశ్చ దారుణాత్

 కదాచిన్న భయం తస్య రక్షితా వానవః స్వయం

 యత్ర గేహే స్తోత్రమిదం యశ్ప జానాతి పుణ్యవాస్

న తత్ర వజ్ర వతనం శిలావృష్టిశ్చ నారద

ఇంద్రుడు సురపతి శక్రుడు దితిపుత్రుడు సప్తమరుత్తుల కగ్రజుడు, సహస్రాక్షుడు (వేయి కన్నులు గలవాడు) భగాంగుడు - కశ్యపాంగజుడు (కశ్యప ప్రజాపతి పుత్రుడు} బిడౌజుడు, సునాసీరుడు, మరుత్వంతుడు (మరుత్తులు గలవాడు) పాకశాసనుడు, జయంత జనకుడు(జయంతుడనువాని తండ్రి) శ్రీమంతుడు శచీ నాథుడు దైత్యసూదనుడు, వజ్రహస్తుడు, కామసఖుడు {మన్మథుని మిత్రుడు గౌతమీ వ్రత భంగము చేసినవాడు, వృత్ర సంహారము చేసినవాడు, వాసవుడు, దధీచి దేహమును భిక్షమెత్తినవాడు, విష్ణువు, వామనుని అన్న, పురుహూతుడు, పురందరుడు, దీవస్పతి (స్వర్గరాజు) శతమఖుడు సుత్రాముడు గోత్రభేదకుడు (పర్వతములు. చీల్చినవాడు) విభువు, లేఖర్షభుడు (దేవతలలో శ్రేష్ఠుడు) బలరాతి (బలరాక్షసుని శత్రువు) జంభభేది (జంభుని చీల్చినవాడు) సురల కాశ్రయమైనవాడు, సంక్రందనుడు దుశ్చ్యవనుడు, తురాషాట్టు, మేఘవాహనుడు, ఆఖండలుడు, హరిహయుడు (ఆకుపచ్చని గుర్రాలవాడు) నముచి ప్రాణనాశకుడు వృద్ధశ్రవుడు, వృషుడు, దైత్యులదర్పమును నశింప జేసినవాడు. ఈ నలుబది ఆరు నామములు పాపమును నశింపజేయునవి. కౌధుమ ఋషి ప్రోక్తమైన ఈ స్తోత్రమును ప్రతిదినము పఠించిన నరుడు మహాపదలో వజ్రహస్తుడైన ఇంద్రుని చేత రక్షింపబడును. అతివృష్టి శిలలపర్చము భయంకరమైన పిడుగుపాటు అను వాటి భయములు మానవునకేనాడు ఉండదు. స్వయముగా - ఇంద్రుడు వానీని రక్షించును. ఓ నారదా! ఎవనీ యింటిలో ఈ స్తోత్రముండునో ఎవడీ గోత్రమునేరుగునో ఆ పుణ్యాత్ముని ఇంటికి పిడుగుపాటు శిలావర భయము కలుగదు.

శ్రీనారాయణ ఉవాచ - నారాయణమూర్తి పలికెను :

స్తోత్రం నందముఖాచ్ఛృత్వా చుకోవ మధుసూదనః

ఉవాచ పితరం నీతిం ప్రజ్వలన్ బ్రహ్మతేజసా

కం స్తౌషి భీరో కో వేంద్రస్త్యజ భీతిం మమాంతికే

 క్షణార్ధే భస్మసాత్కర్తుం క్షమోఽహమవలీలయా

గాశ్చ వత్సాంశ్చ బాలాంశ్చ యోషితో హి భయాతురాః

గోవర్ధనన్య కుహరే సంస్థాప్య తిష్ఠ నిర్భయం

నందుడు పఠించిన స్తోత్రమును విని శ్రీకృష్ణుడు కోపము చెంది బ్రహ్మతేజస్సుతో వెలుగుచు తండ్రికి నీతిని చెప్పెను. “ఓ పిరికివాడా! ఎవనీనీ స్తుతించుచున్నావు ? ఎవడా యింద్రుడు ? నా వద్ద భయము వదిలి పెట్టుము. సగము క్షణములో వానీనీ లీలగా బూడిదగా చేయుటకు సమర్ధుడను నేను. ఆవులను ఎద్దులను దూడలను బాలబాలికలను స్త్రీలను భయబాధితులందరినీ గోవర్ధన పర్వతము యొక్క గుహలో చేర్చి నిర్భయముగా నుండుము”.

బాలస్య వచనం శ్రుత్వా తచ్చకార ముదాన్వితః

హరిర్దధార శైలం తం వామహస్తేన దండవత్

బాలుడైన కృష్ణుని మాట విని సంతోషముతో కూడిన నందుడు అట్లే చేసెను. అపుడు శ్రీహరి ఆ పర్వతమును కర్రను పట్టుకొన్నట్లు ఎడమచేతితో ఎత్తి పట్టుకొనెను.

ఏతస్మిన్నంతరే తత్ర దీప్తోఽపి రత్నతేజసా

ఆంధీభూతశ్చ సహసా బభూవ రేజసాఽఽవృతః

నవాతో మేఘనీకరశ్చచ్ఛాద గగనం మునే

బృందావనే బభూవాతివృష్టిరేవ నిరంతరం

 శిలావృష్టి ర్వజ్ర వృష్ఠిరుల్కాపాతః నుదారుణః

సమస్తం పర్వత స్పర్శా తృతితం దూరతస్తతః

విఫల స్తత్సమారంభో యధాఽనీశోద్యమో మునే

ఓ నారదా! ఆ ప్రదేశము రత్నముల తేజస్సుతో ప్రకాశించుచున్నప్పటికిని, హఠాత్తుగా హోరుషుని వీచిన గాలితో ధూళిరేగి వ్యాపించి - ఆకాశమున మేఘములు క్రమ్ముకొని చిమ్మచీకటి ఏర్పడెను. ఆ బృందావనములో ఎడతెగని అతివృష్టి, రాళ్లతోన, పిడుగులు పడుట, చుక్కలు రాలుటతో అంతయు భయంకరముగా నుండెను. ఇంతటి వరము గోవర్ధన పర్వతమునకు లోకగనే దూరముగా చెల్లాచెదురయ్యెను, ఇంద్రుని మొత్తము ప్రయత్నము వ్యర్ధమయ్యెను. తన ప్రయత్నములో (తాను పూనిన కార్యములో) అతడు శక్తిచాలని వాడయ్యెను.

దృష్ట్వా మోఘం చ తత్సర్వం సద్వః శక్రః చుకోవ హ

జగ్రాహామోఘకులీశం దధీచ్యస్థి వినిర్మితం

దృష్ట్వా తం వజ్ర హస్తం చ జహాస మధుసూదనః

 సహస్తం స్తంభయామాస వజ్రమేపాతి దారుణం

సహామరగణం మోఘం చకార స్తంభనం విభుః

సర్వే తనుర్నిశ్చలాస్తే బిత్తౌ వుత్తలికా యధా

హరిణా జృంభితః శక్రః సద్యస్తంద్రామవాప హ

దదర్శ నర్వం తంద్రియాం తత్ర కృష్ణమయం జగత్

తన ప్రయత్నమంతయు వ్యర్థమగుట చూచి ఇంద్రుడు వెంటనే కోపించి దధీచిముని ఎముకలతో నిర్మించబడినదియు ఎన్నడెక్కడ వ్యర్థము కానిదియునగు వజ్రాయుధమును చేతిలోనికి {విసరుటకై తీసుకొనెను. వజ్రాయుధమును గ్రహించిన యింద్రుని జూచి శ్రీకృష్ణుడు నవ్వి అతి భయంకరమైన వజ్రముతో కూడిన ఇంద్రుని చేతిని స్తంభింపజేసెను. (కదలకుండ జేసెను}. ఎత్తి వచ్చిన దేవగణమంతయు వ్యర్థమగునట్లు అందరినీ స్తంభింపజేసెను. అప్పుడు వారందరు గోడమీది బొమ్మలవలె కదలకుండ నిలిచిపోయిరి. శ్రీహరి చేత భగ్నము చేయబడిన (కదలకుండ బిగుసుకపోయిన} ఇంద్రుడు అప్పటికప్పుడు బుద్ధి పనిచేయని మాంద్యము (చైతన్యము లేని జడస్థితి) పొందెను. ఆ దశలో అతనికి సర్వము కృష్ణమయముగా కన్పించెను.

ద్విభుజం మురలీహస్తం రత్నాలంకార భూషితం

పీతవస్త్ర పరీధానం రత్న సింహాసన స్థితం

ఈషద్ధాన్య ప్రసన్నాత్యం భక్తానుగ్రహ కాతరం

చందనోక్షిత నర్వాంగమేతత్సర్వం చరాచరం

దృష్ట్వాఽద్భుత తమం తత్ర సద్యో మూర్ఛామవాప హ

 జజాప మంత్రం తత్రైవ ప్రదత్తం గురుణా పురా

రెండు హస్తములు గలవాడు మురళిని ధరించినవాడు రత్నాలంకారములతో అలంకరింపబడినవాడు పీతాంబరధారీ రత్నసింహాసనమున కొలువై యున్న వాడు చిరునవ్వుతో ప్రసన్నముగానున్న ముఖమండలము గలవాడు భక్తులననుగ్రహించవలెను త్వరలో నున్నవాడు సర్వాంగములందు చందనము గలవాడగు స్వామీ, కనుపించుచున్న చరాచర ప్రపంచమంతటను చంద్రునకు కన్పించగా పరమాద్భుతమైన ఆదృశ్యమును చూచి వెంటనే మూర్ఛ పొందెను. ఆ స్థితిలోనే పూర్వము గురువగు బృహస్పతి ఉపదేశించిన మంత్రమును జపించెను.

సహస్ర దళ పద్మస్థం దదర్శ జ్యోతిరుల్బణం

తత్రాంతరే దివ్యరూపమతీవ సుమనోహరం

నవీన జలదోత్కర్షం శ్యామసుందర విగ్రహం

సద్రత్న సార నిర్మాణ జ్వలన్మకర కుండలం

జ్వలన్మణీంద్ర మకర కిరీటోజ్జ్వల శేఖరం

జ్వలతా కౌస్తు భేంద్రేణ కంఠ వక్షస్థలోజ్జ్వలం

మణికేయూర వలయ మణి మంజీర రంజితం

అంతర్బహి సమం దృష్ట్వా తుష్టాప పరమేశ్వరం

మంత్రము జపించుచున్న సందర్భములో ఇంద్రునకు వేయి రేకుల పద్మము దాని నుండి తీవ్రముగా ఉప్పొంగి వచ్చిన ప్రకాశము కన్పించెను. ఆ జ్యోతిర్మండలము నడుము మీక్కిలీ మనోహరమైన దివ్యరూపము కన్పించెను. క్రిక మేఘమును మించిన శ్యామ సుందరమూర్తి శ్రేష్ఠ రత్నములతో నిర్మించబడిన ధగధగలాడు మకరకుండలములను ప్రభలు విరజిమ్ముచున్న మకర ముఖము గల మణి కిరీటమును ధరించినవాడు, కౌస్తుభమణితేజస్సుతో ప్రకాశించుచున్న కంఠము వక్షస్మలము గలవాడు మణుల కేయూరములు {భుజకీర్తులు) కంకణములు మణినూపురములు {కాలియందెలు) ధరించినవాడు అగు పరమాత్మను. తన అంతరాత్మలోను బయటను సమానముగా దర్శించి ఇంద్రుడిట్లు స్తుతించెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు పలికెను :

అక్షరం పరమం బ్రహ్మ జ్యోతిరూపం సనాతనం

గుణాతీతం నిరాకారం స్వేచ్చామయమనంతకం

భక్త ధ్యానాయ సేవాయై నావారూప ధరం వరం

శుక్లరక్త పీత శ్యామం యుగానుక్రమణేన చ

శుక్లతేజః స్వరూపం చ సత్యే నత్య స్వరూపిణం

త్రేతాయాం కుంకుమకారం జ్వలంతం బ్రహ్మతేజసా

 ద్వాపరే పీతవర్ణం చ శోభితం పీతవాససా

కృష్ణవర్ణం కలౌ కృష్ణం వరిపూర్ణతమం ప్రభుం

నవధారాధరోత్కృష్ట శ్యామ సుందర విగ్రహం

నందైకనందనం వందే యశోదానందనం ప్రభుం

అక్షరుడు (నాశరహితుడు) అన్ని లక్షణముల చేత అతిశయించినపరబ్రహ్మయైన వాడు - జ్యోతిరూపమున భాసించువాడు - అనాదిగానున్న వాడయ్యును నిత్యనూతనుడు – త్రిగుణములకతీతుడు నిరాకారుడనుపించుకోనీయు భక్తులు ధ్యానించుటకొరకు వారిసేవలందుకొనుట కొరకు తన సంకల్పము వలన నానారూపములు ధరించు అనంతమూర్తి - నాలు యుగములందు క్రమముగా తెలుపు.. ఎరుపు పసుపు నలుపు వన్నెలు గలవాడు - సత్య (కృత యుగమున తెల్లని తేజోమయ రూపముతో సత్యస్వరూపియు, త్రేతాయుగమున కుంకుమవర్ణముతో బ్రహ్మతేజస్సుతో వెలుగువాడును, ద్వాపరయుగమున పీత (పసుపుపచ్చ) వర్ణముతో పీతాంబరముతో శోభించువాడును, కలియుగమున నల్లనివన్నెతో కృష్ణరూపమున నున్న పరిపూర్ణతముడు (సర్వమంగళ గుణములు సర్వశక్తులు నిండుగా గలవాడు) నైన ప్రభువును సేవించితిని, క్రొత్తగా వర్షించు మేఘము వలె శ్రేష్ఠమైన శ్యామ వర్ణముతో సుందర విగ్రహము గలవాడు, నందుగోపుని ఏకైక పుత్రుడు యశోదనానంద పరచు సుపుత్రుడైన ప్రభువునకు నమస్కరించుచున్నాను.

గోపికాచేతసహరం రాధాప్రాణాధికం పరం

వినోద మురలీశబ్ధం కుర్వంతం కౌతుకేన చ

రూపేణా ప్రతిమే నైవ రత్నభూషణ భూషితం

కందర్ప కోటి సౌందర్యం బిభ్రాంతం శాంతమీశ్వరం

క్రీడంతం రాధయా సార్థం బృందారణ్యే చ కుత్రచిత్

కిత్రచిన్నిర్జనేఽరణ్యే రాధావక్షః స్థలస్థితం

జలక్రీడాం ప్రకుర్వంతం రాధయా సహ కుత్రచిత్

రాధికా కబరీ భారం కుర్వంతం కుత్రచిద్వనే

కుత్రచిద్రాధికా పాదే దత్తవంతములక్తికం

సదా చర్విత తాంబూలం గృహ్ణాంతం కుత్రచిన్ముదా

వశ్యంతం కుత్రచిద్రాధాం వశ్యంతీం వక్ర చక్షుషా

దత్తవంతం చ రాధాయై కృత్వా మాలాం చ కుత్రచిత్

కుత్రచిద్రాధయా సార్ధం గచ్ఛంతం రానమండలం

రాధాదత్తం గలే మాలాం ధృతవంతం చ కుత్రచిత్

సార్థం గోపాలికాభిశ్చ విహరంతం చ కుత్రచిత్

 రాధాం గృహీత్వా గచ్ఛంతం విహాయ తాం చ కుత్రచిత్

గోపికల మనస్సులను దొంగిలించినవాడును, రాధాదేవికి ప్రాణముల కన్న మిక్కిలి ఇష్టుడైన స్వామియు, ఆసక్తితో వినోదముగా ధరించిన మురళిని మ్రోయించుచున్నవాడును, రత్నాలంకారములతో అలంకరింపబడిన సాటిలేని రూపముతో కోటిమన్మధుల సౌందర్యమును ధరించియున్న శాంతుడును అగు ప్రభువునకు నమస్కరించుచున్నాను. బృందారణ్యములో నొకచోట రాధతో క్రీడించుచున్నవాడును, ఇంకొకచోట జనులు లేని అరణ్యమున రాధ వక్షస్థలమున విలసిల్లువాడును, వేరొక చోట రాధతో జలక్రీడలాడుచున్నవాడును, ఒకచోట రాధాదేవి కొప్పుముడుచు చున్నవాడును, ఇంకొక చోట రాధాదేవి పాదములకు లత్తుకు పారాణిగా అలంకరించుచున్నవాడును, ఇంకొక చోట సంతోషముతో నమిలెడి తాంబూలము స్వీకరించుచున్న వాడును, ఇంకొక చోట పుష్పమాల యల్లి రాధాదేవి కర్పించుచున్నవాడును, ఒక చోట రాధాదేవితో రాసమండలమున కేగుచున్నవాడును, ఇంకొక చోట రాధాదేవి అర్పించిన పుష్పమాలను కంఠమున ధరించువాడును, - . ఒకచోట గోపికలతో బాటుగా విహరించుచున్నవాడును, రాధను చేతబట్టుకోని ఒకచోట ఆమెను విడిచి మరియొక చోట నొంటరిగాను విరహించుచున్న స్వామికి నమస్కరించుచున్నాను.

విప్రపత్నీ దత్తమన్నం భుక్తవంతం చ కుత్రచిత్

భుక్తవంతం తాలఫలం బాలకై: సహ కుత్రచిత్

వస్త్రం గోపాలికానాం చ హరంతం కుత్రచిన్ముదా

 గవాంగణం వ్యాహరంతం కుత్రచిద్భాలకై: సహ

 కాలీయ మూర్ద్ని పాదాబ్జం దత్తపంతం చ కుత్రచిత్

 వినోద మురళీ శబ్దం కుర్వంతం కుత్రచిన్ముదా

గాయంతం రమ్య సంగీతం కుత్రచిద్బాలకై: సహ

స్తుత్వా శక్రః స్తవేంద్రేణ ప్రణనామ హరిం భీయా

 (ఇంతవరకు రాధాదేవితో విహరించిన విధము స్తుతించి ఇప్పుడు బాల్యలీలలను స్తుతించుచున్నాడు). బ్రాహ్మణపత్నులు తెచ్చి అర్పించిన అన్నమునోకచోట భుజించువాడును, మరియొకచోట గోపబాలురతో కలిసి తాళఫలములు {తాటిపండ్లు) భుజించుచున్నవాడును, ఇంకొకచోట సంతసముగా గోపికల వస్త్రములపహరించుచున్న వాడును, బాలకులతో బాటు ఒకచోట గోబృందమును మేతకు పిలుచున్నవాడును, ఒకచోట కాళీయుని తలమీద పాదము పెట్టుచున్నవాడును {పడగలపై నాట్యమాడుచున్నపాడు సంతోషముతో నొకచోట వినోదార్థము చేత బట్టిన మురళీనీ మ్రోయించుచున్నవాడును, ఒకచోట గోపబాలకులతో కూడి రమ్యుమైన సంగీతము పాడుచున్నవాడును అగు శ్రీహరిని దర్శించి స్తుతించుచున్నాను. ఇట్లు భయభక్తులతో నింద్రుడు స్తోత్రరాజము పఠించి స్తుతించి శ్రీకృష్ణునికి నమస్కరించెను.

పురా దత్తైన గురుణా రణే వృత్రాసురేణ చ

కృష్ణేన దత్తం కృపయా బ్రహ్మణే చ తపస్యతే

ఏకాదశాక్షరో మంత్రః కవచం సర్వలక్షణం

దత్త మేతత్ కుమారాయ పుష్కరే బ్రహ్మణా పురా

కుమారోంగిరసే దత్తం గురవేంఽగిరసా మునే

ఏకాదశాక్షరములు గల (ఇంద్రుడు జపించిన) మంత్రమును సర్వలక్షణములు గల కవచమును పూర్వము తపస్సొనర్చుచున్న బ్రహ్మకు కృపతో కృష్ణుడుపదేశించెను. దానిని బ్రహ్మ పుష్కరక్షేత్రమున తన పుత్రుడైన ప్రజాపతికుపదేశించెను. అతడు ఆంగిరసునకు ఆంగిరసుడు బృహస్పతికి ఉపదేశించెను. ఓ నారదా! అట్టి మహామంత్రమును ఇంద్రునకు వృత్రాసురునితో యుద్ధము సంభవించినపుడు బృహస్పతి ఇంద్రునకుపదేశించెను.

ఇదమింద్రకృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్

స హి ప్రాప్య దృడాం భక్తి మంతే దాస్యం లభేద్ద్రువం

జన్మమృత్యుజరావ్యాధి శోకేభ్యో ముచ్యతే నరః

 న హి పశ్యతి స్వప్నేఽపి యమదూతం యమాలయం

ఇంద్రుడొనర్చిన ఈ స్తోత్రమును నీత్యము భక్తితో నెవడు పఠించునో వాడు శ్రీహరి యందు దృఢమైన భక్తిని పొంది అంత్యమందు శాశ్వతమైన దాస్యముక్తిని పొందును. జన్మము మరణము ముసలితనము వ్యాధులు శోకములు అను సంసార బంధముల నుండి మానవుడు విడుదల పొందును. కలలో గూడ యమదూతలు యమలోకమును చూచుట సంభవించదు.

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :

ఇంద్రస్య వచనం శ్రుత్వా ప్రసన్న: శ్రీనికేతనః

ప్రీత్యా తస్మై వరం దత్త్వా స్థాపయామాస పర్వతం

ప్రణమ్య చ హరిం శక్రః ప్రయయౌ స్వగణైః సహ

 గహ్వరస్థా జనాః సర్వే ప్రజగ్ముర్గహ్వరాద్ గృహం

తే సర్వే మేనిరే కృష్ణం పరిపూర్ణతమం విభుః

పురస్కృత్య ప్రజస్థాంశ్చ ప్రయయౌ స్వాలయం హరిః

తుష్టావ సందః పుత్రం తం పూర్ణ బ్రహ్మ సనాతనం

పులకాంచిత నర్వాంగో భక్తి పూర్ణాశ్రులోచనః

ఇంద్రుని స్తోత్రవాక్యములను విని లక్ష్మీదేవికి నివాసస్థానమైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై (దయదలచి) ప్రీతితో నతనికి వరమిచ్చి గోవర్ధన పర్వతమును భూమిపై నిలిపెను. ఇంద్రుడు శ్రీహరికి నమస్కరించి తన గణములతో వెడలిపోయెను. పర్వతగుహలో నింతవరకు నివసించిన గోపాలాదులందరు గుహనుండి బయటకు వచ్చి తమతమ గృహములకు పోయిరి. వారందరీఅద్భుత కర్మతో శ్రీకృష్ణుని , పరిపూర్ణతముడైన ప్రభువుగా {పరమాత్మగా భావించిరి. శ్రీకృష్ణుడును ప్రజములోని వారినందరిని ముందుంచుకొని అందరినీ బయలుదేరదీసి తన గృహమున కేగెను. అపుడు సందుడు సనాతనుడైన పరబ్రహ్మయే తనకు కుమారుడైనాడనీ భక్తి ఆనందములతో శరీరమంతయు పులకలెత్తగా కన్నులలో ఆనంద బాష్పములు నిండగా ఇట్లు స్తుతించెను.

నంద ఉవాచ - నందుడనెను :

నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః

నమో బ్రహ్మణ్యదేవాయ బ్రహ్మణే పరమాత్మనే

అనంతకోటి బ్రహ్మాండధామధామ్నే నమోస్తు తే

నమో మత్స్యాదీ రూపాణాం జీవరూపాయ సాక్షిణే

నిర్లిప్తాయ నిర్గుణాయ నిరాకారయ తే నమః

అతి సూక్ష్మ స్వరూపాయ స్థూలాత్ స్థూలతమాయ చ

సర్వేశ్వరాయ నర్వాయ తేజోరూప నమోఽస్తు తే

అతి ప్రత్యక్ష రూపాయ ధ్యాన సాధ్యాయ యోగినాం

బ్రహ్మ విష్ణు మహేశానాం వంద్యాయ నీత్యరూపిణే

ధామ్నే చతుర్ణాo వర్ణానాం యుగే ష్వేవ చతుర్షు చ

శుక్లరక్త పీతశ్యామాభిధానగుణశాలినే

యోగినే యోగరూపాయ గురవే యోగినామపి

సిద్ధేశ్వరాయ సిద్ధాయ సిద్ధానాం గురవే నమః

గోజాతికిని బ్రాహ్మణులకును హితము కూర్చువాడును జగత్తునకు (జగతిలోని సర్వజీవకోటికి) హీతరూపుడును, గోవిందుడును (వేదాంతవాక్యముల చేత తెలియబడువాడు, వేదములను, పాతాళగత భూమిని పొందినవాడు! ఆగు కృష్ణునకు, తపస్సులకు వేదములకు విప్రులకు జ్ఞానమునకు హితము గూర్చువాడు గాన బ్రహ్మణ్యుడని కీర్తింపబడు వానికి మరల మరల నమస్కారములు.. అనంత కోటులు గానున్న బ్రహ్మాండములు నివాస స్థానములుగా నున్న వాడును విస్తారమైన గొప్పనైన ఆకారము గలవాడును బ్రహ్మణ్య దేవుడన బడుచున్న నీకు నమస్కారము. చేప మొదలగు సర్వ దేహములు ధరించు జీవకోటికి తద్రూపుడవై జీవుల కర్మలకు సాక్షిరూపుడిపై అంతట నిండియు కర్మాదులంటనివాడవై త్రిగుణాతీతుడవై నిరాకారుడవగు నీకు నమస్పులు, సూక్ష్మమున కన్న సూక్ష్మము స్థూలము కన్న మిక్కిలి స్థూలమునగు స్వరూపము గలవాడును సర్వేశ్వరుడు నత్ అనత్ రూపమైన నర్వ పదార్థములకు ఉత్పత్తి స్థానము లయస్థానమును - సర్వజ్ఞానము కలవాడును తేజోరూపుడవగు నీకు నమస్కారము. విశ్వరూపమున మిక్కిలి ప్రత్యక్షమూర్తియు యోగులకు ధ్యానగోచరుడును బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు నమస్కరింపదగీన నిత్యరూపియు నాలు యుగములందు క్రమముగా తెలుపు ఎరుపు పసుపు నలుపు వర్ణములు నామములు గుణములు గలవాడును బ్రహ్మ క్షత్రీయాది చతుర్వర్ణములకు నిలయమైన వాడును యోగియు యోగ (ధ్యాన) రూపుడును యోగులకును గురువైన వాడును అణిమాద్యష్ట సిద్ధులకు ప్రభువును సర్వము సిద్ధించిన వాడును సిద్ధులకు గురువునగు నీకు నమస్కారము.

యం స్తోతుమక్షమో బ్రహ్మ విష్ణుర్యం స్తోతుమక్షమః

యం స్తోతుమక్షమో రుద్రః శేషో యం స్తోతుమక్షమ:

యం స్తోతుమక్షమో ధర్మో యం స్తోతుమక్షమో రవి:

యం స్తోతుమక్షమో లంబోదరశ్చాపి షడాననః

యం స్తోతుమక్షమాః సర్వే మునయః సనకాదయః

కపిలో న క్షమః స్తోతుం సిద్ధేంద్రాణాం గురోరురుః

న శక్తౌ స్తవనం కర్తుం నర నారాయణావృషి

అన్యే జడధియ: కే వా స్తోతుం శక్తాః పరాత్పరం

వేదపాఠకుడగు బ్రహ్మయు, పాలన దక్షుడగు విష్ణువును, జ్ఞానప్రదాతయగు రుద్రుడును వేయి తలల శేషుడును, ధర్మపాలకుడగు ధర్మదేవతయు, తేజోమూర్తియగు సూర్యుడును, విఘ్ననాశకుడగు గణపతియు, యోగియగు షణ్ముఖుడును, ననక సనందనాదులు బ్రహ్మ మానసపుత్రులందరును, సాంఖ్య దర్శన ప్రవక్త సిద్ధేంద్రులకు పరమ గురువగు కపిలుడును, నర నారాయణ మహరులును ఏ పరాత్పరుని స్తుతించుటకు సమర్థులు కారో అట్టి పరమాత్మను ఇతరులైన జడబుధులెవరు స్తుతించగలరు.

వేదా న శక్తా నో వాణీ న చ లక్ష్మీః సరస్వతీ

న రాధా స్తవనే శక్తి కిం స్తువంతి వివశ్చితః

నాలు వేదములు లక్ష్మీ సరస్వతులు రాధాదేవియు స్తుతింప నశక్తులైనప్పుడిక వారి దయ వలన కొద్దీ జ్ఞానము పొందిన విద్వాంసులేమీ స్తుతింతురు.

క్షమస్వ నిఖిలం బ్రహ్మన్నపరోధం క్షణే క్షణే

రక్ష మాం కరుణాసింధో దీనబంధో భవార్ణవే

పుర తీర్ధే తవస్తప్త్వా వుత్రః ప్రాప్తః సనాతనః

స్వకీయ చరణాంభోజే భక్తిం దాస్యం చ దేహి మే

ఓ పరబ్రహ్మ! దీనబంధూ! కరుణా సముద్రుడా! క్షణక్షణము చేయుచున్న నాయపరాధములన్నిటిని క్షమించుము. ఈ సంసార సముద్రమున పుణ్యతీర్థమునందు నేనొనర్చిన తపస్పులకు ఫలముగా సనాతనుడవగు నీవు నాకు పుత్ర రూపమున లభించితివి. ఇక నాకు నీ పాద పద్మములందు దృఢభక్తిని దాస్యముక్తిని నాకు ప్రసాదింపుము.

బ్రహ్మత్వమమరత్వం వా సాలోక్యాదికమేవ వా

త్వత్పదాంభోజ దాస్యన్య కలాం నార్హంతి షోడశీం

ఇంద్రత్వం వా సురత్వం వా సంప్రాప్తిం సిద్ధ స్వర్గయోః

రాజత్వం చిరజీవిత్వం సుధియో గణయంతి కిం

సృష్టికర్త పదవి గాని దేవస్థితి గాని సాలోక్యాది ముక్తులు గానీ నీ పాదపద్మ దాస్యము యొక్క పదహారవ భాగమునకును సరిరావు. ఆ స్థితిలో విజ్ఞులు ఇంద్ర పదవినో దేవత్వమునో సిద్ధులను గాని స్వర్గమును గాని రాజపదవి గాని చిరంజీవ స్థితినిగాని పొందదగినవిగా లెక్కింతురా??

ఏతద్యత్కథితం నర్వం బ్రహ్మత్వాదికమీశ్వర

భక్త సంగ క్షణార్ధస్య నోపమా తే కిమర్హతి

త్వద్భక్తో యస్త్వత్పదృశః కస్త్వాం తర్కితుమీశ్వరః

క్షణార్ధాలాపమాత్రేణ పారం కర్తుం న వేశ్వరః

భక్త సంగాద్భవత్యేవ భక్తిం కర్తుమనేకధా

తద్భక్త జలదాలాప జల సేకేన వర్ధతే

అభక్తాలాప తాపాత్తు శుష్కతాం యాతి తత్ క్షణం

ఓ ఈశ్వరా! పైన చెప్పబడిన బ్రహ్మత్వము మొదలగునవి అన్నియు కలిసి కూడ నీ భక్తునితో కలిసియుండు కాలములోని సగము క్షణమునకును సరి వచ్చునా?! నీ భక్తుడు నీయంతవాడు. అతని మహిమ నూహింపనవడు సమర్థుడు ? ఆ భక్తునితో సగము క్షణము సేపు మాట్లాడినచో దానితో నతడు సంసార సాగరపు నొడ్డునకు చేర్ప సమర్థుడు. భక్త సంగము వలన నిన్ను గూర్చి అనేక విధములుగా భక్తి క్రియలు చేయగల్గుదుము. నీ భక్తుడను మేఘము యొక్క సంభాషణమను నీరు తడుపుట చేత { వీభక్తుడొక మేఘము, అతని సంభాషణము జలము. ఆ జలము తడుపుట చేత) నీ యందలి భక్తి మాకు వర్ధిల్లును. భక్తులు కాని వారితో కలిసి మాట్లాడుటయను తాపము చేత మా లోని భక్తి యన్న మొలక ఆ క్షణము లోనే ఎండిపోవును.

త్వద్గుణ స్మతి సేకాచ్చ వర్ధతే తత్క్షణే స్ఫుటం

త్వద్భక్యంకురముద్భూతం స్ఫీతం మానవజం పరం

ననశ్యం వర్ధనీయం చ నిత్యం నిత్యం క్షణే క్షణే

తతః సంప్రాప్య బ్రహ్మత్వం భక్తస్య జీవనాయ చ

దదాత్యేవ ఫలం తస్మై హరి దాస్యమనుత్తమం

సంప్రాప్య దుర్లభం దాస్యం యది దాసో బభూవ హ

 సునిశ్చయేన తేనైవ జీతం సర్వం భయాదికం

మనస్సులో జనించి విస్తరించిన శ్రేష్ఠమైన నీ పాదభక్తి యను అంకురము (మొలక) భక్తుల సంభాషణ వలన తెలియవచ్చిన నీ కల్యాణగుణముల స్మృతి (జలము) చేత తడుపబడీ ఆ క్షణముననే స్ఫుటముగా వృద్ధి పొందును. ఆ భక్తియను అంకురము ప్రతిదినము క్షణక్షణము పెంచదగినదే గానీ నశింపనీయరాదు. ఆ గుణ స్మృతి వలన బ్రహ్మభావన పొందిన భక్తుని ఉజ్జీవనము కొరకు హరీదాస్యమనెడి అత్యుత్తమ ఫలము నా గుణస్మృతి ఇచ్చును. దుర్లభమైన దాస్యముక్తిని పొంది హరీదాసుడాయెనా నిశ్చయముగా అతని చేత సర్వసంసార భయములు జయింప బడినవే సుమా!

ఇత్యేవ ముక్త్వా భక్త్యా చ నందస్తస్థౌ హరేః పురః

ప్రసన్న వదనః కృష్ణో దదౌ తస్మై తదీప్సితం

ఇట్లు పలికి నందుడు శ్రీకృష్ణుని ముందట భక్తితో నిలిచెను. ఆ స్తోత్రమునకు ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు తన ముఖమున ప్రసన్నత స్పష్టమగుచుండగా నందుని వాంఛితమును వరముగా నతనికిచ్చెను.

ఏవం నందకృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్

సుదృడాం భక్తి మాప్నోతి సద్యో దాన్యం లభేద్ధరేః

తవస్తాప్త్వా యదా ద్రోణస్తీర్దే చ ధరయా సహ

స్తోత్రం తస్మై పురా దత్తం బ్రహ్మణా తత్సుదుర్లభం

 హరేః షడక్షరో మంత్రః కవచం సర్వరక్షణం

ఇహ సౌభరిణా దత్తం తస్మై తుష్టేన పుష్కరే

తదేవ కవచం స్తోత్రం న చ మంత్ర: నుదుర్లభః

బ్రహ్మణోంఽశేన మునినా నందాయ చ తవన్యతే

మంత్రః స్తోత్రం చ కవచమిష్టదేవో గురుస్తథా

యా యన్య విద్యా ప్రాచీనా న తోం త్యజతి నిశ్చితం

ఇత్యేవం కథితం స్తోత్రం శ్రీకృష్ణాఖ్యాన మద్భుతం

సుఖదం మోక్షదం సారం భవబంధ విమోచనం

ఇట్లు నందుడొనర్చిన స్తోత్రమును నిత్యము భక్తితో పఠించిన వ్యక్తి సుదృఢమైన హరి భక్తిని పొంది అప్పుడే హరిదాస్యమను ముక్తిని పొందును. ధరాదేవితో బాటు ద్రోణుడు తీర్ధ ప్రదేశమున తపస్సు చేయగా దుర్లభమైన హరి షడక్షర మంత్రమును సర్వవిధ భయముల నుండి రక్షించు కవచమును స్తోత్రమును బ్రహ్మ అతనికుపదేశించెను. ఆ స్తోత్ర మంత్ర కవచములనే బ్రహ్మాంశతో నున్న సౌభరీముని పుష్కర క్షేత్రమున తపస్సు చేయుచున్న నందుని పై.దయతో అతని కుపదేశించెను. ఏ వ్యక్తికి ఏ విద్య (మంత్రము) పరంపరగా గురూపదేశమున లభించునో ఆ మంత్రమును స్తోత్రమును కవచమును అతడు విడువడు. (మంత్రము, స్తోత్రము కవచము గురువు ఇష్టదైవము పరంపరగా వచ్చువానిని విడువ గూడధు). ఇట్లు ఈ స్తోత్రము అద్భుతమై ఆత్మకు సుఖమిచ్చునది మోక్షమిచ్చునది సంసార బంధములను విడిపించునది, సారమైనదీ ఐన శ్రీకృష్ణ చరిత్రము చెప్పబడినది.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే ఇంద్రయాగభంజనో నామ ఏకవింశతీతమోఽధ్యాయః.

ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన, ఇంద్రయాగ భంజసమను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.