శ్రీనారాయణ ఉవాచ :
నుప్తేషు వ్రజ నందేషు నక్తం బృందావనే వనే ।
సునిద్రితే చ నిద్రేశే మాతృ వక్షః స్థలస్థితే ॥
నిద్రితాసు చ గోపీమ రమ్యతల్పస్థితాసు చ ।
యూనాం చ సుఖ సంయోగానుషక్త మానసాసు చ ॥
కాసుచిచ్ఛిశు యుక్తాసు సఖియుక్తాసు కాసుచిత్ ।
కాసుచిచ్ఛకటస్థాసు స్యందనస్థాసు కాసుచిత్ ॥
నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
ఆ బృందావనారణ్యములో రాత్రియందు గోపాలకులు సందుడు తల్పముల మీద (శయ్యలు మంచములు) నిద్రేశుడైన కృష్ణుడు తన తల్లియెద పై, గోపికలు తమ యువక భర్తల యొక్క సంయోగ సుఖాపేక్ష గల మనస్సులతో నిద్రించి యుండగా కొందరు గోపికలు శిశువులతో కొందరు గోపికలు సఖురాళ్లతో కొందరు గోపికలు శకటములందు కొందరు గోపికలు రథములందు నిద్రించి యుండగా.
పూర్ణేందు కౌముదీయుక్తే స్వర్గాదపి మనోహరే ।
నానా ప్రకార కుసుమ వాయునా సురభీకృతే ॥
సర్వప్రాణివినిశ్చేష్టే ముహూర్తే పంచమే గతే ।
తత్రాజగామ భగవాంచ్ఛిల్పినాం చ గురోర్గురుః ॥
నిండు చంద్రుడు వెన్నెల గాయుచుండగా స్వర్గము కంటే మనోహరమై నానావిధములైన పుష్పముల మీది నుండి వీచు గాలికి పరిమళవంతమై ఉన్న ఆ రాత్రి సర్వజీవులు చేష్టలుడిగి నీద్రించియున్న వేళలో ఐదవ ముహూర్తము గడచి పోవుచుండగా (అర్థరాత్రి) అక్కడికి శిల్పుల గురువులకు గురువగు విశ్వకర్మ వచ్చెను.
బిభ్రద్దివ్యాంశకం రమ్యం సూక్ష్మం రత్నమాల్యం మనోహరం ।
రత్నాలంకారమతులం శ్రీమన్మకరకుండలం ॥
జ్ఞానేన వయసా వృద్దో దర్శనీయకిశోరవత్ ।
ఆతీవ సుందరః శ్రీమాన్ కామదేవసమప్రభః ॥
విశిష్ట శిల్పనిపుణైః సార్థం శిల్పి త్రికోటిభిః ।
మణిరత్నై ర్హే మరత్నైర్లోహాస్త్రయుతహస్తకైః ॥
అతడు సన్నగా సుందరముగా నున్న దివ్య వస్త్రములు మనోహరమైన రత్నహారము ప్రకాశించెడి మకర కుండలములు సాటిలేని రత్నాభరణములు ధరించి యుండెను. జ్ఞానములో వయస్సులో పెద్దవాడైనను చిన్నపిల్లవానివలె చూడదగినవాడుగా నుండెను. మిక్కిలి సుందరుడైన అతడు కాంతిలో మన్మధుని వలె నుండెను. అతని వెంట మణులు బంగారము లోహాస్త్రములు (తాపీ వంటివి) పట్టుకొని విశేషమైన శిల్పమునందు నైపుణ్యము గల మూడుకోట్ల శిల్పులు వచ్చిరి.
ఆజగ్ముర్యక్షనికరాః కుబేర వనకింకరాః ।
స్ఫాటికా రత్నవేషాశ్చ దీర్ఘస్కంధాశ్చ కేచన ॥
పద్మరాగ కరా కేచిదింద్రనీల కరా వరాః ।
కేచిత్స్యమంతక కరాశ్చంద్రకాంత కరాస్తథా ॥
నూర్యకాంతకరాశ్చాన్యే ప్రభాకర కరా వరాః ।
కేచిత్పరశు హస్తాశ్చ లోహసారకరా వరాః ॥
కేచిచ్ప గంధసారాణాం మణీంద్రాణాం చ వాహకాః ।
కేచిచ్చామరహస్తాశ్న కేచిద్దర్పణవాహకాః ॥
స్వర్ణపాత్ర ఘటాదీనాం వాహకాశ్చైవ కేచన ।
కుబేరుని చైత్రవనమందలి సేవకులైన యక్ష గణములు స్ఫటికము వలె తెల్లనైన వారు రత్నములు ధరించినవారు - కొందరు దీర్ఘబాహువులు గలవారు పద్మరాగములు చేతబట్టుకొని కొందరు - ఇంద్రనీలమణులు చేతబట్టుకొని కొందరు - శ్యమంతక మణులు పట్టుకోనీ కొందరు - చంద్రకాంత మణులు పట్టుకొని కొందరు - సూర్యకాంతమణులు పట్టుకొని కొందరు - గండ్రగొడ్డళ్లు పట్టుకొని కొందరు పారలు పలుగులు వంటి ఉనుప పని ముట్లు పట్టుకొని కొందరు - సారవంతములైన సుగంధ వస్తువులు పట్టుకొని కొందరు - శ్రేష్ఠమైన మణులు మోయుచు కొందరు - చామరములు పట్టుకొని కొందరు - అద్దములు మోసుకొని కొందరు - స్వర్ణపాత్రలు బంగారు బిందెలు మోయువారు కొందరు అక్కడకు చేరవచ్చిరి.
విశ్వకర్మా చ సామగ్రీం దృష్ట్వా తు సుమనోహరం ॥
నగరం కర్తుమారేభే ధ్యాత్వా కృష్ణం శుభేక్షణం ।
విశ్వకర్మ ఆ సామగ్రిని చూచి శుభకరమైన చూపులు గల శ్రీకృష్ణుని ధ్యానించి మిక్కిలి మనోహరమైన నగరము నిర్మించుట కారంభించెను.
పంచయోజన విస్తీర్ణం భారతే శ్రేష్ఠముత్తమం ॥
పుణ్యక్షేత్రం తీర్థసారమతిప్రియతమం హరేః ।
తత్రస్థానం ముముక్షణం వరం నిర్వాణకారణం ॥
గోలోకస్య చ సోపానం సర్వేషాం వాంఛితప్రదం ।
చతుష్కోటి చతుశ్శాలం తత్రైవాతి మనోహరం ॥
కపాటస్తంభ సోపాన సహితైః ప్రస్తరైర్వరైః ।
చిత్రపుత్తలికాపుష్పకలశోజ్జ్వలశేఖరం ॥
శైలజాశ్మవినిర్మాణ వేది ప్రాంగణ సంయుతం ।
శిలాప్రాకార సంయుక్తం ప్రచకారాథ లీలయా ॥
యథోచిత బృహత్ క్షుద్ర ద్వారద్వయ సమన్వితం ।
స్ఫాటికాకారమణిభిర్ముదా యుక్తో వినిర్మమే ॥
ఆ నగరము ఐదు యోజనముల ప్రదేశమున విస్తరింపబడినది. భరత వరమున శ్రేష్ఠమై ఉత్తమ పుణ్యక్షేత్రమే పవిత్రమైన తీర్థప్రదేశమై శ్రీహరికి మిక్కిలి ప్రియమైనదైనది. అక్కడ నివసించు ముముక్షువులకు (మో పేక్ష గలవారికి) మిక్కిలిగా మోక్షమునకు మూలమైనది. గోలోకమునకు సోపానము. కొందరు జీవుల వాంఛలు తీర్చునది. ఆ నగరమున మిక్కిలి మనోహరమైన చతుశ్శాలల భవనములు నాలుకోట్లు - శ్రేష్ఠమైన శిలలతో కవాటములు స్తంభములు సోపానములు నిర్మించబడినవి. చిత్రమైన బొమ్మలు పుష్పములు కలశములతో భవనముల శిఖరములు ప్రకాశించునట్లు - కొండరాళ్లతో ఆరుగులు, వాకిళ్ల నిర్మించబడినవి. శీలాప్రాకారములు వాటికి తగినట్లు సింహ ద్వారము దొడ్డి త్రోవ (ఇంటింటికీ) రెండు ద్వారములుండునట్లు స్ఫటిక మణులతో లీలగా సంతోషముతో విశ్వకర్మ చేత ఆ నగరము నిర్మింపబడినది.
సోపానైర్గంధసారాణాం స్తంభైః శంకు వినిర్మితైః ।
కవాటైః లోహసారాణాం రాజతైః కలశోజ్జ్వలైః ॥
వజ్రసార వినిర్మాణ ప్రాకారైః పరిశోభితం ।
కృత్వాఽఽశ్రమం పల్లవానాం యథాస్థానం యథోచితం ॥
మెట్లతోను శంకు ఆకారముగా నిర్మించబడిన శ్రీగంధపు స్తంభములతోను ఉక్కు కవాటములతోను వెండి కలశముల (కాంతితోనుండునట్లు)తోను శ్రేష్ఠమైన వజ్రముల ప్రాకారములతోను శోభించునట్లు ఆ గోపాలురందరకు తగిన ప్రదేశములందు వారి అధికార స్థితులకు తగినట్లు గృహములను (విశ్వకర్మ) నిర్మించెను.
వృషభాన్వాలయం రమ్యం కర్తుమారబ్ధవాన్ పునః ।
ప్రాకార పరిఖాయుక్తం చతుర్ద్వారాన్వితం పరం ॥
చారు వింశచ్చతుశ్శాలం మహామణి వినిర్మితం ॥
రత్నసార వికారైశ్చ తూలికానికరైర్వరైః ।
సువర్ణాకార మణిభిరారోహైరతీసుందరైః ॥
లోహసార కవాటైశ్చ శోభితం చిత్రకృత్రిమైః ।
మందిరే మందిరే రమ్యే సువర్ణకలశోజ్జ్వలం ॥
ఆ తరువాత విశ్వకర్మ మరల వృషభానునికి రమ్యమైన భవనము నిర్మింప బూసుకొనెను. అగడ (నీటికందకము) ప్రాకారములను శ్రేష్ఠమైన నాలుగు ద్వారములు గల సుందరమైన ఇరువది నాలు శాలల భవనమును మహామణులతో నిర్మించేను. మంచీ మణులతో నిర్మించిన ఉత్తమ శయ్యలు మంచి వన్నె గల అతి సుందరములైన మణుల సోపానములు దృడమైన లోహకవాటములు శిఖరములపై ఉజ్వలముగా నున్న సువర్ణ కలశములు కృత్రిమ చిత్రములు సుందరమైన ప్రతి శాలా మందిరములో నిర్మించబడెను.
తదాశ్రమైకదేశే చ నిర్జనేఽతీ మనోహరే ।
చారు చంపక వృక్షాణాముద్యానాభ్యంతరే మునే ॥
సంభోగార్థం కలాపత్యాః స్వామీనా సహకౌతుకాత్ ।
విశిష్టేణ మణీంద్రేణ చకారాట్టాలీకాలాయం ॥
యుక్తం నవభిరారోహైరింద్రనీలవీనిర్మితైః ।
స్థూణాకపాటనికరైర్గంధసారవికారజైః ॥
అత్యుచ్చ్రితం మనోరమ్యం నర్వతోఽపి విలక్షణం ।
ఆ గృహములో నొక ఏకాంత ప్రదేశమున సుందరమైన సంపెంగ చెట్ల పూలతోట నడుము అతి మనోహరమైన చోట కలావతి భర్తతో సొసక్తిగా కలిసి ఆనందించుట కొరకు గాను మంచి మణుల మేడను నిర్మించెను. అది ఇంద్రనీల మణులతో నిర్మించిన తొమ్మిది అంతరములుగా శ్రీ గంధపు కట్టితో చేసిన స్తంభములు కవాటములు గలదిగా ఆనగరమంతటిలో మిక్కిలి ఎత్తై విలక్షణమై మనస్సుకింపుగా నుండెను.
నారద ఉవాచ :
కలావతీ కా భగవన్ కస్య పత్నీ మనోహరా ।
యత్నతో యద్గృహం రమ్యం నిర్మమే నుర కారుణా ॥
నారదుడనెను :
ఓ భగవంతుడా ! దేవ శిల్పి ప్రయత్నించి ఏ స్త్రీ కొరకు రమ్యమైన గృహము నిర్మించెనో ఆ కలావతి ఎవతే? ఆ సుందరి ఎవని భార్య?
శ్రీనారాయణ ఉవాచ :
పితృణాం మానసీ కన్యా కమలాంశా కలావతీ ।
సుందరీ వృషభానోశ్చ పతివ్రత పరాయణా ॥
యస్యాశ్చ తనయా రాధా కృష్ణ ప్రాణాధికా ప్రియా ।
శ్రీకృష్ణార్థాంశసంభూతా తేన తుల్యా చ తేజసా ॥
యస్యాశ్చ చరణాంభోజ రజఃపూతా వసుంధరా ।
యస్యాం చ సుదృఢాం భక్తిం సంతో వాంఛంతి సంతతం ॥
నారాయణ ముని పల్కెను :
కళావతి పితృదేవతల మానసకన్య. లక్ష్మియంశ గలది. ఆమె వృషభానుని భార్య. పతివ్రతమునందు మిక్కిలి ఆసక్తి గల సాధ్వి. ఏ దేవి పాదపద్మముల ధూళి వలన భూదేవి పవిత్రురాలయ్యెనో - నత్పురుషులు ఏ దేవియందు సుదృఢభక్తిని ఎల్లప్పుడు కోరుకొందురో - ఏ దేవి శ్రీకృష్ణుని అర్ధాంశతో జన్మించి తేజస్సుతో అతనికి సాటియై ప్రాణాధిక ప్రియురాలయ్యెనో - అట్టి రాధాదేవి కళావతి బిడ్డయే.
నారద ఉవాచ :
పితృణాం మానసీం కన్యాం వ్రజే తిష్ఠన్ కథం మునే ।
మానవః కేన పుణ్యేన కథమాప నుదుర్లభాం ॥
వృషభానుర్ర్వజపతిః పురాఽఽ సీత్కో మహామునే ।
కన్య వా కేన తవసా రాధా కన్యా బభూవ హ ॥
నారదుడనేను :
గోకులసాధుడగు వృషభానుడు మానవుడు. అతడు ప్రజములో నివసించుచు మిక్కిలి దుర్లభురాలైన పితృదేవతల మానస పుత్రిని ఎట్లు ఏ పుణ్యము చేత భార్యగా పొందెను ? ఓ మహామునీ ! ఈ వృషభానుడు పూర్వ జన్మలో ఎవడు ? ఏ తపస్సు వలన ఎవరి అనుగ్రహము వలన రాధ అతనికి పుత్రిక ఆయెను ?
సూత ఉవాచ :
నారదస్య వచః శ్రుత్వా మహర్షిర్జ్ఞానినాం వరః ।
ప్రహస్యోవాచ ప్రీత్యా తమితిహాసం పురాతనం ॥
సూతుడు పలికెను :
నారదుని మాట విని జ్ఞానులలో శ్రేష్టుడైన నారాయణ మహర్షి నవ్వి నారదుని మీది ప్రీతితో పురాతనమైన ఇతిహాసమును ఇట్లు చెప్పెను.
శ్రీనారాయణ ఉవాచ :
బభూవుః కన్యకాన్తస్రః పితృణాం మానసాత్పురా ॥
కలావతీ రత్నమాలా మేనకాశ్చాతీ దుర్లభాః ।
రత్నమాలా చ జనకం వరయామాస కాముకీ ॥
శైలాధిపం హరేరంశం మేనకా సా హిమాలయం ।
దుహితా రత్నమాలా యా అయోనిసంభవా సతీ ॥
శ్రీరామపత్నీ శ్రీః సాక్షాత్సీతా సత్యపరాయణా ।
కన్యకా మేనకాయాశ్చ పార్వతీ సా వురా సతీ ॥
అయోని సంభవా సా చ హరేర్మాయా ననాతనీ ।
సా లేభే తపసా దేవం హరం నారాయణాత్మకం ॥
నారాయణ మహర్షి ఇట్లు పలికెను :
పూర్వము పితృదేవతకు ముగ్గురు మానస పుత్రికలు జన్మించిరి. కలావతీ రత్నమాల మేనక అని, సామాన్యులకు వారు దుర్లభలు (లభించనివారు) వారిలో రత్నమాల జనక చక్రవర్తిని కామించి వరించెను. ఆమె పెంపుడు కూతురే శ్రీరామచంద్రుని భార్యయగు సీతాదేవి. ఆమె సాక్షాత్తుగా లక్ష్మీయే. ఆమె గర్భవాసము వంటి దశలు. గాని మనుష్య సంబంధముగాని లేనీ జన్మగలది. పితృదేవతల ఇంకోక కూతురగు మేనక శ్రీహరి అంశగల పర్వతరాజైన హిమవంతుని భర్తగా వరించెను. మొదట సతీదేవిగా నున్న పార్వతీదేవి మేనక కూతురే. పార్వతియు అయోనిసంభవయే. శ్రీహరి యొక్క సనాతనియైన మాయ ఆమె. పార్వతి తపస్సు చేసి నారాయణుడాత్మగా గల శంకరుని భర్తగా పొందెను.
కలావతీ సుచంద్రం చ మనువంశ నముద్భవం ।
పితృ దేవతల మూడవ పుత్రికయగు కళావతీ మనువంశమున జన్మించిన సుచంద్రుని భర్తగా వరించెను.
న చ రాజా హర్రంశస్తాం సంప్రాప్య కలావతీం ॥
మన్యే గుణవతాం శ్రేష్ఠమాత్మానమతి సుందరం ।
అహో రూపమహో వేషమహోతస్యా నవం వయః ॥
నుకోమలాంగం లలితం శరచ్చంద్రాధికాననం ।
గమనం దుర్లభమహో గజ ఖంజన గంజనం ॥
కటాక్షైర్మోహితుర శక్తా మునీంద్రాణాం చ మానసం ।
శ్రోణి యుగ్మం నులలీతం రంభాస్తంభవినిర్మితం ॥
స్తనద్వయం సుకఠినమతి పీనోన్నతం మునే ।
నితంబ యుగలం చారు రథచక్రవినిర్మితం ॥
హస్తౌ పాదౌచ రక్తౌ చ పక్వ బింబఫలాధరం ।
వక్వదాడిమ బీజాభం దంత పంక్తి మనోహరం ॥
శరన్మధ్యాహ్న పద్మానాం ప్రభామోచన లోచనం ।
భూషణైర్భూషితం రూపం కృతం సద్రత్నభూషణం ॥
శ్రీహరి యంశతో జన్మించిన ఆ రాజు (సుచంద్రుడు) ఆమెను భార్యగా పొంది తనను తాను గుణవంతులలో శ్రేషునిగా అతిసుందరునిగా తలంచుకొనెను. ఆమెను గురించి బళీ ! ఏమి రూపమేమి వేషము ఏమి వయస్సు. ఆమె శరీరము మిక్కిలి కోమలము. ముఖము శరత్కాలచంద్రుని మించి యున్నది. ఇతర స్త్రీలలో దుర్లభమైన ఈమె నడక ఏనుగు యొక్క మందగమనమును తిరస్కరించును. ఆమె తన కడకంటి చూపులతో మునీంద్రుల మనస్సును మోహింపజేయు శక్తి గలది. అరటి బోదెల వంటి (తొడల) మీద నున్న పిరుదులు మిక్కిలి సుందరములు, స్తనములు పుష్టిగా కఠినముగా నున్నవి. నితంబములు (పిరుదులు) రథచక్రముల వలె సుందరముగా నిర్మించబడినవి. హస్తములు పాదములు మిక్కిలి ఎరుపు (అరిచేతులు అరికాళ్ళు). అందమైన పలువరుస పండిన దానిమ్మ గింజల రంగులో నున్నది. కన్నులు శరత్కాల మధ్యాహ్న మందలి పద్మ సౌందర్యమును దోచుకొన్నవి. భూషణముల చేత అలంకరింపబడిన ఈ రూపమే ఒక మంచి రత్నాల నగ.
ఇతీవ మత్వా దృష్ట్వా చ కామబాణ ప్రపీడితః ।
దివ్యం స్యందనమారుహ్య కాముక్యా సహ కాముకః ॥
క్రీడాం చకార రహసి స్థానే స్థానే మనోహరే ।
రమ్యాయాం మలయ ద్రోణ్యాం చందనాగురు వాయువా ॥
చారు చంపక పుష్పాణాం తల్నే రతిసుఖావహే ।
మాలతీ మల్లికానాం చ పుష్పాధ్యానేఽతిపుష్పితే ॥
పుష్పభద్రానదీ తీరే నిర్జనే కేతకీ వనే ।
పశ్చిమాబ్ధి తలాంతస్థ కాననే జంతువర్జితే ॥
నందనే మందర ద్రోణ్యాం కావేరీ తీరజే వనే ।
శైలే శైలే సురమ్యే చ నద్యాం నద్యాం నదే నదే ॥
ద్వీపే ద్వీపే తు రహసి న రేమే వామయా సహ ।
నవనంగమ సంయోగాద్భుబుదే న దీవానిశం ॥
ఆమె రూపమును చూచీ ఇట్లు తలచీ మన్మధ బాణ పీడితుడైన ఆకాముకుడు ఆ కాముకితో గూడి దేవతారథమెక్కి మనస్సునకిం పైన ప్రతి ప్రదేశము నందు ఏకాంతమున క్రీడించెను. శ్రీగంధము అగురు గాలులు వీచెడీ రమ్యమైన మలయపర్వతపు చరియలో రతిసుఖమునకు మూలమైన చంపక పుష్పముల సుందరయ్య ఫైనను - మాలతులు మల్లెలు నిలువెల్ల పుష్పించిన పుష్పోద్యానమందు - పుష్పభద్రానదీ తీరమందున్న ఏకాంతపు మొగిలీ తోటలలో - జంతు రహితమైన పశ్చిమ సముద్రతీరమందలి ఆరణ్యములో - నందనవనములో - మందర పర్వతపు చరియలో - కావేరీ తీరమందలి అడవిలో - సుందరమైన ప్రతి పర్వతము మీద - ప్రతీనదీ తీరమున - ప్రతినదము (పడమటికీ పారు ప్రవాహమునదము) ఒడ్డున - ప్రతి ద్వీపమున - అతడామెతో ఏకాంతమున రమించెను. క్రొత్తకూటమి తగులములోపడి అతడు రాత్రి పగలు ఎరుగకుండెను.
ఏవం వర్షసహస్రం తద్గతమేవ ముహూర్తవత్ ।
కృత్వా విహారం సుచిరం న విరక్తో బభూవ హ ॥
ఈ విధముగా ఆ రోజు చాల కాలము విహరించి ఒక చేయి సంవత్సరముల కాలమును ఒకముహూర్తమువలె గడిపి ఆ వెనుక వీరక్తుడయ్యెను.
జగామ తపసే వింధ్య శైలం తీర్థం తయా సహా ।
భారతేఽతిప్రశస్య పులహాశ్రమముత్తమం ॥
తపస్తే పే సృపస్తత్ర దివ్యవర్షసహస్రకం ।
మోక్షాఽకాంక్షి నిస్పృహశ్చ నిరాహారః కృశోదరః ॥
మూర్ఛామాప మునిశ్రేష్ఠః ధ్యాత్వా కృష్ణ పదాంబుజం ।
అతడు తపస్సు చేయుట కొరకు భార్యతో బాటు భారతవర్షమున అతి ప్రశస్తమును పుణ్యతీర్థమునైన వింధ్య శైలమందలి పులహాశ్రమమునకు వెళ్లాను. అక్కడ కోరికలను త్యజించి మోక్షము మీది అపేక్షతో నిరాహారుడై (ఏ ఆహారము లేనివాడై) ఒక వేయి సంవత్సరములు తపస్సు చేసిను. ఓ నారదమునీ! బక్క చిక్కిన పొట్ట గలయతడు శ్రీకృష్ణపాద పద్మములను ధ్యానించుచు మూర్ఛపోయెను.
తద్గాత్ర వ్యాప్తవల్మీకం సాధ్వీ దూరం చకార సా ॥
నిశ్చేష్టితం పతిం దృష్ట్వా త్యక్తం ప్రాణైశ్చ పంచభిః ।
మాంన శోణీతరిక్తం తమస్థి సంనక్త విగ్రహం ॥
ఉచ్చైరురోద శోకార్తా నిర్జనే తు కలావతీ ।
సాధ్వియైన కళావతి అతని శరీరము మీద పెరిగిన పుట్టను తొలగించి చూడగా ఏ మాత్రము కదలికలు లేక పంచప్రాణములు వదిలి మాంసము నెత్తురు శూన్యమైన అస్థిపంజరము మిగిలి యుండెను. నిర్జన ప్రదేశమున దుఃఖములో ఆరురాలై ఆమె పెద్ద ధ్వనితో ఏడెను.
హేనాధ నాధేత్యుచ్చార్య కృత్వా వక్షసీ మూర్ఛితం ॥
విలలాప మహాదీనా పతివ్రతపరాయణా ।
దష్ట్వా నృపం నీరాహారం కృశం ధమనీసంయుతం ॥
శ్రుత్వా చ రోదనం తస్యాః కృపయా చ కృపానిధిః ।
ఆవిర్బభూవ జగతాం విధాతా కమలోద్భవః ॥
ఆ పతివ్రత మిక్కిలి దీనురాలై కౌగిలించుకొని మూర్ఛచింది “ఓ నాథా ! ఓ నాధా !” అనీ ఆహారమేమి స్వీకరించక కృశించి నరములు తేలియున్న ఆ రాజును చూచి ఏడ్చెను. ఆమె రోదనము వీని సృష్టికర్తయు దయానిధియునగు బ్రహ్మ ఎదుట సాక్షాత్కరించెను.
క్రోడే కృత్వా చ తం తూర్ణం రురోధ భగవాన్ విభుః ।
బ్రహ్మా కమండలు జలేనాసిచ్య నృపవిగ్రహం ॥
జీవం సంచారయామాన బ్రహ్మజ్ఞానేన బ్రహ్మవిత్ ।
నృపేంద్ర శ్చేతనాం ప్రాప్య పురో దృష్ట్వా ప్రజాపతిం ॥
ప్రణనామ చ తం దృష్ట్వా తం చకామ సమ ప్రభం ।
తమువాచేతి సంతుష్టో వరం వృణు యధేప్సితం ॥
భగవంతుడగు సృష్టికర్త త్వరగా ఆ రాజును ఓడిలోనికి తీసుకొని శోకించెను. ఆ రాజ శరీరమును కమండలు జలముతో తడిపి ఆ బ్రహ్మ వేత్త బ్రహ్మజ్ఞానముతో ఆ శరీరములోని జీవుని కదలించెను. రాజు చైతన్యము పొంది బ్రహ్మ దేవుని తనముందు చూచి నమస్కరించెను. మన్మధుని వంటి కాంతీ గల సుచంద్రుని జూచి బ్రహ్మ సంతృప్తి చెంది నీవు కోరిన వరము నిత్తును కోరుకొమ్ము అనెను.
స విధేర్వచనం శ్రుత్వా వవ్రే నీర్వాణమీప్సితం ।
దయానిధే త్వం దయయా వరం దాతుం సముద్యతః ॥
ప్రసన్న వదనః శ్రీమాన్ స్మేరానన సరోరుహః ।
రాజు వీధి పలుకులు విని ఓ దయానిధీ ! నీవు దయతో వరముగా మోక్షమిమ్ముని కోరుకొనెను. బ్రహ్మ ప్రసన్నముఖము పై చిరునవ్వు వెలుగగా వరమిచ్చుటకు పూనుకొనెను.
కృత్వాఽనుమానం మనసి శుష్కకంఠోష్ఠ తాలుకా ॥
తమువాచ సతీ త్రస్తా వరం దాతుం సముద్యతం ।
బ్రహ్మ వరమీయనున్నాడని మనస్సులో ఊహించి ఆ కళావతీ దేవీ భయముతో కంఠము పెదవులు దవడలు ఎండిపోగా బ్రహ్మతో నిట్లనెను.
కలావత్యువాచ :
యది ముక్తిం నృపేంద్రాయ దదాసి కమలోద్భవ ॥
అతోఽబలాయా హే బ్రహ్మాన్ కా గతిర్భవితా పద ।
వినా కాంతం చ కాంతానాo కా శోభా చతురానన ॥
వ్రతం పతివ్రతాయాశ్చ పతిరేవ శ్రుతౌ శ్రుతం ।
గురు శ్చాభీష్టదేవశ్చ తపో ధర్మమయః పతిః ॥
సర్వేషాం చ ప్రియతరో న బంధుః స్వామినః పరః ।
నర్వధర్మాత్పరా బ్రహ్మన పతిసేవా సుదుర్లభా ॥
కళావతి ఇట్లనెను :
ఓ బ్రహ్మదేవా ! రాజుకొకవేళ ముక్తినిత్తువేనీ దాని వలన ఈ అబలకు ఏది గతీయో చెప్పుము. ఓ చతుర్ముఖుడా ! భర్తలేనిచో స్త్రీలకు ఏమి శోభ ? పతివ్రతకు ప్రతము భర్తయే అని వేదమునందు చెప్పబడినది. గురువు, కోరికలు తీర్చు దైవము, తపోధర్మమయుడగు భర్తయే కదా ! అందరు చుట్టములలో భర్త కంటె శ్రేష్ఠమైన మిక్కిలి ప్రియమైన బంధువు ఉండడు. ఓ దేవా ! అన్ని ధర్మముల కంటె శ్రేష్టమైనది దుర్లభమైన పతిసేవయే.
స్వామి సేవా విహీనాయాః సర్వం తన్నిష్ఫలం భవేత్ ।
వ్రతం దానం తపః పూజాజప హోమాదికం చ యత్ ॥
స్నానం చ సర్వతీర్ధేషు పృధివ్యాశ్చ ప్రదక్షిణం ।
దీక్షా చ సర్వయజ్ఞేషు మహాదానాని యాని చ ॥
పఠనం సర్వవేదానాం సర్వాణి చ తపాంసి చ ।
వేదజ్ఞానాం బ్రాహ్మణానాం భోజనం దేవ సేవనం ॥
ఏతాని స్వామి సేవాయాః కలాం నార్హంతి షోడశీం ।
వ్రతములు దానములు తపస్సు పూజ జపము హోమము సర్వతీర్థముల స్నానము భూ ప్రదక్షిణము సర్వవిధ యజ్ఞముల దీక్ష మహాదానములు సర్వవేదములు పఠించుట సర్వతపస్సులు వేదవేత్తలైన బ్రాహ్మణులకు భోజనము పెట్టుట దేవతా సేవనము ఇవియన్నియు పతీసేవా మహిమలో పదునారవ భాగమునకు సరిపోవు.
స్వామిసేవా విహీనా యా వదంతీ స్వామినే కటుం ॥
పతంతి కాలసూత్రే చ యావచ్చంద్ర దివాకరౌ ।
సర్పప్రమాణా కృమయో దంశంతి చ దివానిశం ॥
సంతంతం విపరీతం చ కుర్వంతి శబ్దముల్బణం ।
మూత్రశ్లేష్మ పురీషానాం కుర్వంతి భక్షణం సదా ॥
ముఖే తాసాం దదత్యేపముల్కాం చ యమకింకరాః ।
భుక్త్యా భోగం చ సరకే కృమియోనిం ప్రయాంతి తాః ॥
శ్రుతాఽ హం విదుషాం వక్త్రాద్వేదవాక్యేషు నిశ్చితం ॥
స్వామి (భర్త) సేవా విహీనలైన ఏ స్త్రీలు భర్తను కఠినముగా తిరస్కరింతురో వారు సూర్యచంద్రులున్నంతవరకు కాలసూత్ర నరకములో యాతనలనుభవింతురు. వారిని సర్పములంత శరీరములు గల పురుగులు (క్రీములు) రాత్రింబగళ్ళ కొరుకుచుండును. వారా బాధలకు విపరీతముగా అరచుచు మూత్రమును శ్లేష్మమును (తెమడ) మలమును భక్షింతురు. యమకింకరులు వారినోళ్లలో కొరువులు పెట్టుదురు. ఇట్లు వారు నరకములను అనుభవింతురు. ఈ విషయము వేదవాక్యములలో తెలుపబడినదని విద్వాంసుల ముఖతః వినియుంటిని.
జానామి కించిదబలా త్వం వేద జనకో విభుః ।
గురోర్గురుశ్చ విదుషాం యోగినాం జ్ఞానినాం తథా ॥
సర్వజ్ఞ మేవం భూతం త్వాం బోధయామి కమచ్యుత ।
ప్రాణాధికోఽయం కాంతోఽయం యది ముక్తో బభూవ హ ॥
మమ కో రక్షితా బ్రహ్మన్ ధర్మస్య యౌవనస్య చ ।
కౌమారే రక్షితా తాతో దత్త్వా పాత్రాయ సత్కృతీ ॥
సర్వదా రక్షితా కాంత స్తదభావే చ తత్పుతం ।
త్రిష్వవస్థాషు నారీణాం త్రాతారశ్చ త్రయః స్మృతాః ॥
యాః స్వతంత్రాశ్చ తా నష్టాః సర్వధర్మ బహిష్కృతాః ।
అనత్కుల ప్రసూతాస్తాః కులటా దుష్టమానసాః ॥
శతజన్మకృతం పుణ్యం తాసాం నశ్యతి పద్మజ ।
అయ్యా ! అబలనైన నేను కొద్దిగా ఎరుగుదును. నీవు వేద జనకుడవు. విద్వాంసులకు, యోగులకు జ్ఞానులకు గురువులకు గురువువు. ఓ జన్మరహితుడా ! సర్వజ్ఞుడవగు నీకు నేనేమి తెలుపుదును. నాకు ప్రాణముల కంటే అధికుడును ప్రియుడగు నితడు ముక్తుడగునేని నాధర్మమునకు యావనమునకు రక్షకుడెవరు ? స్త్రీకి బాల్యదశలో తండ్రి రక్షకుడు. ఆ పుణ్యాత్ముడు యోగ్యునకు కన్యాదానము చేయగా ఇక ఎల్లప్పుడు స్త్రీకి రక్షకుడు భర్త. అతడు లేనప్పుడు ఆమెకు పుత్రుడు రక్షకుడు. ఇట్లు కౌమార యావన వార్ధక్యములను మూడు దశలలో రక్షకులు ముగ్గురుగా చెప్పబడినది. ఏ స్త్రీలు మేము స్వతంత్రులమనుకొనీరో వారు అన్నీ ధర్మములకు బహిష్కరింపబడిరి. దుష్కలములలో (వంశములు) జన్మించిన వారు దుష్ఠమనస్సులు గల కులటలైరి. వారునూరు జన్మలలో చేసిన పుణ్యములు నశించును.
పుత్రస్నేహో యథా బాల్యే తథా యూని చ వార్ధకే ॥
పతివ్రతానాం కాంతే చ సర్వకాలే సమా స్పృహా ।
సుతే స్తనంధయే స్నేహో మాతృణాం చాతిశోభతే ॥
పతిస్నేహస్య సాధ్వీనాం కలాం నార్హ తి షోడశీం ।
స్తనాంధే స్తనదానాంతమిష్టాన్నే భోజనావధి ॥
కాంతే చిత్తం సతీనాం చ స్వప్నే జ్ఞానే చ సంతతం ।
బాల్యదశలో పుత్రునిపై ప్రేమయుండును. అట్లే యావన దశలోను ముసలి తనమందును పతివ్రతలకు భర్తయందు వాంఛ (ప్రేమ) సర్వకాలముందుండును. పాలు త్రాగు పుత్రునీ మీది ప్రేమ తల్లులకు మిక్కిలి శోభించును. కాని ఆ ప్రేమ సాధ్వీకీ భర్తయందు గల ప్రేమలో పదహారవంతునకును సరిపోలదు. పాలు త్రాగు శిశువు పై తల్లి ప్రేమ పాలిచ్చునంత వరకుండును. ఇష్టమైన పదార్థము మీద ప్రేమ దానిని తినునంత వరకుండును. సతీజనమునకు (పతివ్రతలకు) స్వప్నములోను మెలకువలోను ఎల్లప్పుడు భర్తమీద మనస్సుండును (ప్రేమ).
దుఃఖాంతో బంధువిచ్ఛేదః పుత్రాణాం చ తతోఽధికః ॥
సుదారుణః స్వామినశ్చ దుఃఖం నాతః వరం స్త్రియాః ।
అపదగ్ధా యథా దగ్ధా జ్వలదగ్నౌ విషాదనే ॥
తథా విదగ్ధా దగ్ధా స్యాద్విదగ్ధా విరహానలే ।
నాన్నే తృష్ణా జలే తృష్ణా సాధ్వీనాం స్వామీనం వినా ॥
విరహాగ్నౌ మనోదగ్ధం వహ్నౌ శుష్క తృణం యధా ।
బంధువుల వియోగబాధ ఒకసారి దుఃఖించునంత వరకుండును. పుత్ర వియోగ దుఃఖము అంతకంటే అధికమైనది. అజ్ఞానురాలైన శ్రీ మండుచున్న అగ్నిలోను, విషమును తిని, ఎట్లు దగ్ధమై పోవునో అట్లే కార్యములందు నేర్పు ఉన్న స్త్రీ కూడ భర్త విరహాగ్నిలో కాలిపోవును. భర్త లేకుండా సాధ్వియైన స్త్రీకి అన్నమునందు గాని జలమందు గాని తృష్ణ (ఆశ - పొందవలెనన్న తహతహ) ఉండదు. అగ్ని లోపడి ఎండుగడ్డి కాలునట్లు విరహాగ్నిలో స్త్రీ మనస్సు కాలిపోవును.
న హి కాంతాత్పరో బంధు ర్న హి కాంతాత్పరః ప్రియాః ॥
న హి కాంతాత్పరో దేవో న హి కాంతాత్సరో గురుః ।
న హి కాంతా త్పరో ధర్మో నహి కాంతాత్పరం ధనం ॥
న హి కాంతాత్పరః ప్రాణా న హి కాంతాత్పరః స్త్రియాః ।
స్త్రీకి భర్తకంటే వేరు బంధువుగాని ప్రియమైన వ్యక్తి గాని దైవము గాని గురువు గాని ధర్మము గాని ధనము గాని ప్రాణములు గాని లేవు (స్త్రీకి సర్వము భర్తయే).
నిమగ్నం కృష్ణపాదాబ్జే వైష్ణవానాం యధా మనః ॥
యథైక పుత్రే మాతుశ్చ యథా స్త్రీషు చ కామినాం ।
ధనేషు కృపణానాం చ చిరకాలార్జితేషు చ ॥
యథా భయేషు భీతానాం శాస్త్రేషు విదుషాం యధా ।
స్తనాదానే శిశూనాం చ శిల్పేషు శిల్పినాం యథా ॥
యథా జారే పుంశ్చలీనాం సాధ్వీనాం చ తథా ప్రియే ।
విష్ణు భక్తుల మనస్సు శ్రీకృష్ణ పాదపద్మములందేట్లు నిమగ్నమైయుండునో, ఏకైక పుత్రుని యందు తల్లి మనస్సు, స్త్రీలయందు కాముకుల చిత్తము, చిరకాలము నుండి సంపాదించిన ద్రవ్యమునందు దీనుని మనస్సు. భయపడు వారికి భయకారణములందు, విద్వాంసులకు శాస్త్రముల మీద, శిశువులకు తల్లి చన్ను కుడుచుటయందు - శిల్పముల మీద శిల్చుల మనస్సు, జారిణులకు జారుని మీద ఎట్లు మనస్సు లగ్నమై యుండునో అట్లే పతివ్రతలకు భర్తయందు మనస్సు లగ్నమై యుండును.
తం వినా జీవితుం బ్రహ్మన్ క్షణమేకం న చ క్షమం ।
మరణం జీవనం తాసాం జీవనం మరణాధికం ।
నద్భర్తృ రహితానాం చ శోకేన హతచేతసాం ।
అన్యశోకనిమగ్నానాం కాలేన పాన భోజనాత్ ॥
విపరీతః కాంతశోకో వర్ధతే భక్షణా దహో ।
కర్మచ్చాయా సతీనాం చ సంగినీనాం సతీ వరా ॥
ఓ బ్రహ్మా ! అట్టి భర్త లేని జీవనము ఒక్కక్షణము కూడ ఓర్చుకోదగినది గాదు. ఆ స్త్రీలకు భర్తలేని బ్రతుకు మరణము. ఇంకను మరణము కంటే మిక్కిలి బాధాకరము. ఉత్తముడైన భర్త లేని వారికి (భర్త మరణించిన వారికి) దుఃఖము వలన మనస్సు చచ్చిన వారికిని, ఇతర శోకములలో మునిగి కొంతకాలము తరువాత త్రాగుట తీనుటలు సంభవించును. వారి కంటే భర్తృ వియోగ శోకము వ్యతిరేకమైనది. ఆ పానముల వలన కూడ ఆ శోకము వర్ధిల్లుచుండును. సాధ్వీమణులకు కర్మ నీడవలె వెన్నంటియుండును. కర్మ సంగము గల వారి కంటే పతివ్రత శేష్ఠురాలు.
ఇతరే భోగ దేహాంతే సాధ్వీ జన్మని జన్మని ।
సాధారణ స్త్రీలు భర్తయొక్క భోగ దేహము చివరి వరకు కూడియుందురు. సాధ్వీ జన్మజన్మలనంటి యుండును.
కరోషి చేజ్జగద్ధాతరిమం ముక్తం మయా వినా ॥
త్వాం శప్త్యాహం త్వయి విభో పశ్య దాస్యామి స్త్రీవధం ।
ఓ జగత్కర్తా ! నేను వెంటనుండకుండ ఇతనిని నీవు ముక్తుని చేయుదువేని నిన్ను శపించి నీ యందు స్త్రీవధ దోషము పడవేతును.
శ్రుత్వా కలావతీ వాక్యమువాచ విస్మితో విధిః ।
హితం పీయూష సదృశం భయ సంవిగ్నమానసః ॥
కళావతి మాటలు విన్న బ్రహ్మ ఆశ్చర్యపడి భయముతో కలత చెందినవాడై ఆమెకు హితమైన అమృతము వంటి మాట పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ ఇట్లనెను:
వత్సే ముక్తిం న దాస్యామి స్వామినం చ త్వయా వినా ॥
ముక్తం కర్తుం త్వయాసార్థం సాంప్రతం నాహ మీశ్వరః ।
మాతర్ముక్తిర్వికాభోగాద్దుర్లభా సర్వసమ్మతా ॥
నీర్వాణతాం నమాప్నోతి భోగీ భోగ నికృంతనే ।
కతివర్షం స్వర్గభోగం కురుష్వ స్వామినా సహ ॥
తతస్తు యువయోర్జన్మ భవితా భారతే సతి ।
యదా భవిష్యతి సతీ కన్యా తే రాధికా స్వయం ॥
జీవన్ముక్తౌ తయా సార్థం గోలోకం చ గమిష్యధః ।
కతికాలం నృపశ్రేష్ఠ భుంక్ష్య భోగం స్త్రీయా సహ ॥
సాధ్వీ వై సత్త్వయుక్తా చ మా మాం శపుం త్వమర్హసి ।
జీవన్ముక్తాః నమః సంతః కృష్ణ పాదాబ్ద మాససాః ॥
వాంఛంతి హరిదాన్యం చ దుర్లభం న చ నిర్వృతం ।
బిడ్డా! నీవు లేకుండ నీ భర్తకు ముక్తి నీయను. నీతో పాటుగా నీతనిని ముక్తుని చేయుటకు ప్రస్తుతము నేను సమర్థుడను గాను. తల్లీ ! ముక్తి యన్నది కర్మఫలమునుభవించకుండ దుర్లభమనునది సర్వసమ్మతమైన మాట. కర్మఫలమనుభవించవలసిన జీవి ఆ బంధమును ఖండించుకొన్న తరువాతనే మోక్షము పొందును. నీవు నీ భర్తతో కలిసి కొంతకాలము స్వర్గ సుఖముననుభవించుము. ఆ తరువాత మీ యిద్దరికి భారత ఖండమున జన్మ ఏర్పడును. ఆ జన్మలో మీకు మహాసాధ్వియైన రాధాదేవీ స్వయముగా కూతురై జన్మించును. అప్పుడు మీరు జీవన్ముక్తులై ఆమెతో బాటు గోలోకమునకు వెళ్లగలరు. ఓ రాజేంద్రా ! సాధ్వీయును సత్వగుణము గలదియునగు ఈమెతో కొంతకాలము భోగములనుభవించుము. ఓ సతీ ! నీవు నన్ను శపింపదగదు. లోకములో నుండి కూడ జీవన్ముక్త స్థితిలోనుండు సాధువులు అన్నిట సమదృష్టి గలవారైనందున శ్రీకృష్ణ పాదపద్మములందే మనస్సు గలవారై దుర్లభమైన శ్రీహరి దాస్యమునే కోరుకొందురు గానీ మోక్షము న పేక్షింపరు.
ఇత్యుక్త్వా తౌ వరౌ దత్త్వా నంతస్థౌ వురతస్తయోః ॥
యయతుస్తౌ తం ప్రణమ్య జగామ స్వాలయం విధిః ।
ఇట్లు పలికి ఆ యిద్దరికి రెండు వరములిచ్చి (ఆమె కోరినట్లు భర్త ఎడబాటు లేకుండుట - అతడు కోరినట్లు ముక్తి దశ) నిలిచెను. వారాతనికి నమస్కరించి వెళ్లిపోయిరి. బ్రహ్మ తన లోకమునకేగెను.
ఆజగ్మతుస్తౌ కాలేన భుక్త్వా భోగం చ భారతం ॥
పరం పుణ్యప్రదం దివ్యం బ్రహ్మాదీనాం చ వాంఛితం ।
ఆ దంపతులిద్దరు స్వర్గ భోగములనుభవించి కొంతకాలము తరువాత మిక్కిలి పుణ్యప్రదమై దీప్యమై బ్రహ్మాదులును కోరుకోనునట్టిదైన భారత వర్షమునకు వచ్చిరి (జన్మించిరి).
సుచంద్రో వృషభానుశ్చ లలాభ జన్మ గోకులే ॥
పద్మావత్యాశ్చ జఠరే నురభాసస్య రేతసా ।
ఆ సుచంద్రుడే గోకులములో సురభానుని భార్యయగు పద్మావతి గర్భమున వృషభానుడుగా జన్మించెను.
జాతిన్మరో హరేరంశః శుక్ల పక్షే యధా శశీ ॥
వవృదేఽసుదినం తత్ర వ్రజగేహే ప్రజాధీపః।
సర్వజ్ఞశ్చ మహాయోగీ హరి పాదాబ్జ మాసనః ॥
నంద బంధుర్వదాన్యశ్చ రూపవాన్ గుణవాన్ సుధీః ।
హరి యంశతో అతడు శుక్లపక్షమున చంద్రుని వలె దినదినము గోకులములో పెరుగుచుండెను. అతడు నందునికి బంధువు. మంచి దానశీలుడు రూపవంతుడు సద్గుణవంతుడు పూర్వజన్మ స్మృతి గలవాడు మంచి బుద్ధి శక్తి గలవాడు సర్వజ్ఞుడైన మహాయోగి (పూర్వజన్మలో) కాపున శ్రీహరి పాదపద్మములందు మనస్సు గలవాడుగా నుండెను.
కలావతీ కాన్యకుబ్జే బభూవాయోని సంభవా ॥
జాతిస్మరా మహాసాధ్వీ సుందరీ కమలాకలా !
మహాసాధ్వీ కళావతీ దేవి కాన్యకు పట్టణములో లక్ష్మీదేవి అంశతో పూర్వజన్మ స్మృతి గల సుందరిగా అయోనిజగా జన్మించెను (గర్భవాసదశలేకుండ జన్మించుట).
కాన్యకుబ్జే నరశ్రేష్ఠో భనoదన ఉరుక్రమః ॥
నతాం సంప్రాప్య యాగాంతే యజ్ఞకుండ సముత్థితాం ।
నగ్నాం వాసంతీం రూపాఢ్యాం స్తనంధామివ బాలికాం ॥
తేజసా ప్రజ్వలంతీం చ వ్రతప్తకనక ప్రభం ।
కృత్వా వక్షసి రాజేంద్రః స్వకాంతాయై దదౌ ముదా ॥
కాన్యకుబ్జములో భనందనుడన్న వాడు పరాక్రమవంతుడగు రాజు. అతడొనర్చిన యజ్ఞములో చివరి రోజున యజ్ఞకుండము నుండి లేచి వచ్చిన స్త్రీ శిశువును చూచెను. ఆ బాలిక కరిగిన బంగారు వన్నెతో మంచి తేజస్సుతో వెలిగిపోవుచుండెను. మంచి రూపముతో నుండి నవ్వుచు పాలు త్రాగు బాలిక వలెనుండెను. (పుట్టిన శిశువు వలె) నగ్నముగా నున్న ఆ బాలికను రాజెత్తుకొని తెచ్చి సంతసముతో తన భార్యకిచ్చెను.
మాలావతీ స్తనం దత్వా తాంపుపోష ప్రహర్షితా ।
తదన్నప్రాశన దీనే సతాం మధ్యే శుభేక్షణే ॥
నామరక్షణ కాలే చ వాగ్బభూవాశరీరిణీ ।
కలావతీతి కన్యాయా నామ రక్ష నృపేతి చ ॥
భనందుని భార్య మాలావతి మిక్కిలి సంతోషించి చను బాలిచ్చి ఆ శిశువును పోషించెను. ఆ శిశువునకు అన్నప్రాశనము చేయునాడు శంభమైన వేళలో సత్పురుషుల నడుమ నామకరణము చేయనుండగా “ఓ రాజా ! ఈ కన్యకు కళావతి యని పేరు పెట్టుము” అని అశరీరవాణి విన్పించెను.
ఇత్యేవం వచనం శ్రుత్వా తచ్చకార మహీపతిః ।
విప్రేభ్యో భిక్షుకేభ్యశ్చ వందిభ్యశ్చ ధనం దదౌ ॥
సర్వేభ్యో భోజయామాస చకార సుమహోత్సవం ।
ఆ వచనము విని ఆ రాజు కన్యకు అదే పేరు పెట్టెను. గొప్పగా ఉత్సవము చేసి బ్రాహ్మణులకు భిక్షులకు వంది జనమునకు ధనము దానమొనర్చి సర్వజనులకు భోజనములు పెట్టించెను.
కాలేన సా రూపవతీ యౌవనస్థా బభూవ హ ॥
అతీవ సుందరీ శ్యామా మునిమానస మోహినీ ।
చారు చంపక వర్ణాభా శరచ్చంద్రనిభాననా ॥
ఈషద్ధాస్య ప్రసన్నాస్యా ప్రఫుల్ల పద్మలోచనా ।
నీతంబశ్రోణి భారార్తా స్తనభారనతా నతీ ॥
కొంతకాలమునకు ఆ సుందరీ యావనవతి ఆయెను. మిక్కిలి సుందరియైన ఆ యువతి మునులమనస్సులనే మోహింపజేయునదిగా నుండెను. ఆమె దేహకాంతి సంపంగి పూలవర్ణము (పచ్చదనము) తో ప్రకాశించుచుండెను. ముఖము శరత్కాలచంద్రుని వలె నుండెను. వికసించిన పద్మముల వంటి కన్నులు చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖముతో స్తనభారము వలన వంగినట్లున్న శరీరము కలిగి ఆ యువతి ఉండెను.
గచ్చంతీ రాజ మార్గేణ గజేంద్ర మందగామీనీ ।
దదర్శ నందః వధి తాం గచ్ఛంతీం చ మున్వితః ॥
జితేంద్రియశ్చ జ్ఞానీ చ మూర్చామాప తథాఽపి చ ।
త్రస్తో లోకాన్ పధి గతాన్ తూర్ణం పప్రచ్ఛ సాదరం ॥
గచ్ఛంతీకన్య కన్యేయమితి హోవాచ తం జనః ।
ఆమె గజరాజు వంటి మేల్లని నడకతో ఒకనాడు రాజమార్గమున పోవుచుండగా జ్ఞానియగు నందుడు ఇంద్రియములను జయించినవాడైనప్పటికి ఆమెను చూచి మూర్ఛిల్లెను. వెంటనే స్మృతి తెచ్చుకొని భయగౌరవములతో ‘పోవుచున్న కన్య ఎవరి కూతురు’ అని రాజమార్గములో నడచువారినడిగెను. వారతనికి ఇట్లు చెప్సిరి.
భనందనన్య నృపతేః కన్యా నామ్నా కలావతీ ॥
కమలాకలయా ధన్యా సంభూతా నృపమందిరే ।
కౌతుకేన చ గచ్ఛంతి క్రీడార్థం సభిమందిరం ॥
వ్రజ వ్రజ వ్రజశ్రేష్ఠేత్యుక్త్వా లోకో జగామ హ ।
ఆమె భనందన మహారాజు కూతురు. రాజమందిరములో లక్ష్మీదేవి అంశతో అవతరించిన ధన్యురాలు. క్రీడలయందలి ఆసక్తితో స్నేహితురాలి యింటికేగుచున్నది. ఓ గోకులనందరాజా ! నడువుము అని జనము చెప్పుచు పోయిరి.
ప్రహృష్టమానసో నందో జగామ రాజమందిరం ॥
ఆపరుహ్య రథాత్తూర్ణం వివేశ నృపతేః సభాం ।
ఉత్థాయ రాజా సంభాష్య స్వర్ణసింహాసనం దదౌ ॥
ఇష్టాలాపం బహుతరం చకార చ పరస్పరం ।
వినయావనతో నందః సంబోధోక్తిం చకార హ ॥
ఆ మాటలు విన్న నందుడు మిక్కిలి సంతోషించి వెంటనే రథము దిగి రాజ సభలోనికేగెను. భనందన రాజు లేచి కుశల ప్రశ్నలు పలికి స్వర్ణపీఠమిచ్చెను. ఉభయులు చాలసేపు సరస సంభాషణలతో గడిపిరి. అప్పుడు నందుడు రాజును వినయముగా సంబోధించి ఇట్లు పలికెను.
నంద ఉవాచ – నందుడనెను:
శ్రుణు రాజేంద్ర వక్ష్యామి విశేష వచనం శుభం ।
సంబంధం కురు కన్యాయా విశిష్ఠేన చ సాంప్రతం ॥
సురభాసుసుతః శ్రీమాన్ వృషభానుర్ర్వజాధిపః ।
నారాయణాంశో గుణవాన్ సుందరశ్చ సుపండితః ॥
స్థిర యౌవన యుక్తశ్చ యోగీ జాతిన్మరో యువా ।
కన్యా తేఽయోని సంభూతా యజ్ఞకుండ నముద్భవా ॥
త్రైలోక్యమోహినీ శాంతా కమలాంశా కలావతీ ।
న చ యోగ్యస్త్వద్దుహితుః తద్యోగ్యా తే చ కన్యకా ॥
విదగ్ధాయా విదగ్ధేన సంబంధో గుణవాన్నృప ।
ఇత్యేవముక్త్వా నందస్తు విరరామ చ సంపది ॥
“ఓ రాజేంద్రా! వినుము. శుభకరమైన ఒక విశేష వచనము చెప్పెదను. నీ బిడ్డకు ఒక విశేష లక్షణములు గల వరునితో సంబంధము కుదుర్చుము. సురభానుని కుమారుడు వృషభానుడు. అతడు తూ ప్రజములో సంపన్నుడైన నాయకుడు. సద్గుణవంతుడు. నారాయణాంశతో జన్మించిన సుందరుడు. మంచి పండితుడు. పూర్వజన్మ స్మృతి గల యోగీ స్థిరమైన యావనము గల యువకుడు. ఇక నీ కూతురు యజ్ఞకుండమందు లక్ష్మీ అంశతో జన్మించిన అయోనిజ. ముల్లోకములను మోహింపజేయు సుందరి. శాంత స్వభావురాలు కళావతి. వృషభానుడు నీ బిడ్డకు తగిన పరుడు. అతనికి తగిన వధువు ఈ కన్య. అన్ని విధముల నైపుణ్యము గల దాంపత్యసంబంధము శ్రేష్ఠముగానుండును.” ఇట్లు సభలో పలికి నందుడు ప్రసంగము చాలించెను.
ఉవాచ తం నరశ్రేష్ఠో వినయాననతో మునే ।
ఓ నారదా ! ఆ మాటలు విని రాజు వినయముతో వంగి నందునితో పలికెను.
భనందన ఉవాచ - భనందనుడనెను:
సంబంధో హి వీధి వశా న మే సాధ్య ప్రజాధిప ॥
ప్రజాపతిర్యోగకర్తా జన్మదాతాఽహమేవ చ ।
కా కన్య వత్నీ కన్యా వా వరః కో వా న సాధనః ॥
కర్మానురూపఫలదః సర్వేషాం కారణం విధిః ।
భవితవ్యం కృతం కర్మ తదమోమం శ్రుతాశ్రుతం ॥
అన్యధా నిష్ఫలం సర్వమనీశస్యోద్యమో యథా ।
వృషభాను ప్రియా ధాత్రా లిఖితా చేత్సుతా మమ ॥
పురా భూతైన కోవాఽహం కేనాన్యేన నివార్యతే ।
ఇత్యేవముక్త్యా రాజేంద్రో వీనయానత కంధరః ॥
మిష్టాన్నం భోజయామాన సాదరేణ చ నారద ।
నృపానుజ్ఞాముదాయ వ్రజరాజో వ్రజం గతః ॥
“ఓ ప్రజరాజా! సంబంధమన్నది దైవాధీనమైనదే తప్ప నాకు సాధ్యమైనది కాదు. వధూవరులను కూర్చువాడు బ్రహ్మ. నేను కేవలము జన్మనిచ్చిన వాడను మాత్రమే. ఎవతి ఎవని భార్య? ఎవని బిడ్డ? వరుడెవడు? సాధనమేది? కర్మకు తగినట్లు ఫలమిచ్చువాడు అన్నిటికి మూలమైనవాడు దైవమే కదా! ఇంతకుముందు జరిగినది గాని ముందు జరుగవలసినది గాని విరాటంకముగా జరుగునదే అని వేదము చెప్పును. దానికి విరుద్ధముగా చేయబడు పని నిష్పలమగును. అసమర్థుని ప్రయత్నము నేరవేరునా? నా బిడ్డ వృషభానుని భార్య కావలేననీ బ్రహ్మ చేత లిఖింపబడియున్నచో అది జరిగి తీరును కదా! దానికి నేనెవడను? ఇక వేరెవ్వని చేత నీపొరింపబడును?” ఆ రాజిట్లు పలికి వినయముతో ఆదరముగా మంచి భోజనము తినిపించెను. సందరాజు భనందుని అనుమతి తీసుకొని గోకులమున కేగెను.
గత్వా న కథయామాస సురభానోశ్చ సంసది ।
సురభానుశ్చ యత్నేన నందనేన చ సాదరం ॥
సంబంధం యోజయామాస గర్గ ద్వారా చ సత్వరం ।
వివాహకాలే రాజేంద్రో విపులం యౌతకం దదౌ ॥
గజరత్నమశ్వరత్నం రత్నాని మణి భూషణం ।
నందుడు పోయి సురభానుని సభలో ఈ విషయము చెప్పెను. వెంటనే సురభాసుడు అతని మాట మీదీ ఆదరముతో గర్ణుని ద్వారా కొడుకునకు ఆ సంబంధము కుదిర్చెను. భనందనుడు పుత్రిక వివాహ కాలమున మంచి ఏనుగులను జాతి గుఱ్ఱములను రత్నములను మణిభూషణములను స్త్రీ ధనమును విస్తారముగా నిచ్చెను.
వృషభానుర్ముదాయుక్తః ప్రాప్య తాం చ కలావతీం ॥
రేమే సునిర్జనే రమ్యే బుబుధే న దివానీశం ।
చక్షుర్నిమేష విరహాద్వ్యాకులం స్వామినా వినా ॥
వ్యాకులో వృషభానుశ్చ క్షణేన చ తయా వినా ।
జాతి స్మరా చ స కన్యా మాయా మానుషరూపిణీ ॥
జాతి స్మరే హరే రంశో వృషభాసుర్ముదాన్వితః ।
వవృధే చ తయోః ప్రేమ నిత్యం నిత్యం నవం నవం ॥
సదా నకామా సా ప్రౌడా స చ కామసమో యువా ।
తయోః కన్యా చ కాలేన రాధికా సా బభూవ హ ।
దైవాత్సుదామ శాపేన శ్రీకృష్ణస్యాజ్ఞయా పురా ॥
వృషభానుడు ఆ కళావతిని వివాహమాడీ సంతోషయుక్తుడై ఏకాంత ప్రదేశమున ఆమెతో సుఖించెను. రాత్రి పగలు ఎరుగకుండెను. ఆమె కనురెప్ప పాటు కాలము భర్తలేనిచో విరహముతో వ్యాకులపడును. అతడామె క్షణము లేనిచో వ్యాకులుడగును. ఆమెకు పూర్వస్మృతియున్నది. విష్ణుమాయయే మనుష్యరూపమెత్తినది. అతనికి పూర్వ స్మృతీ యున్నది. అతడు హరి అంశయే. ఆ ఉభయుల ప్రేమ దీనదినము మరీ మరీ క్రొత్తగానై పెరుగుచుండెను. ఆ దంపతులకు కొంతకాలమునకు హఠాత్తుగా సంభవించిన సుదాముని శాపము కారణముగా శ్రీకృష్ణుని యనుమతితో గోలోకవాసియైన రాధాదేవి కూతురుగా జన్మించెను.
అయోసంభవ సా చ కృష్ణ ప్రాణాధికా సతీ ।
యస్యాదర్శన మాత్రేణ తా విముక్తౌ బభూపతుః ॥
ఆ రాధాదేవినీ కని దర్శించి నంత మాత్రమున కలావతీ వృషభానులు జీవన్ముక్తులైరి. రాధ మానవ గర్భవాస సంబంధము లేకుండ జన్మించినదే. శ్రీకృష్ణునకు ప్రాణములకంటే మిక్కిలి ప్రియురాలు.
ఇతీహానశ్చ కథితః ప్రకృతం శ్రుణు సాంప్రతం ।
పాపేంధనానాం దాహే చ జ్వలదగ్ని శిఖోపమః ॥
పాపములను ఇంధనములను (వంటచెరకు - కఱ్ఱ) కాల్చుటలో మండుచున్న అగ్నివంటి (పాపనాశకము) ఇతిహాసము చెప్పితిని. ఇక ప్రస్తుత కథవినుము.
వృషభానాశ్రమం గత్వా శిల్పీనాం ప్రవరో ముదా ।
స్థానాంతరం విశ్వకర్మా జగామ న్వగణైః సహ ॥
శిల్పీ శ్రేష్ణుడైన విశ్వకర్మ వృషభానునీ ఆశ్రమమును నిర్మించి తన గణములతో బాటు వేరొక స్థానమునకేగెను.
క్రోశమాత్రం స్థలం చారు మనసాఽలోచ్య తత్త్వవిత్ ।
ఆశ్రమం కర్తు మారేభే నందన్య సుమహాత్మనః ॥
శిల్పతత్త్వవేత్తయైన విశ్వకర్మ మనస్సుతో బాగుగా ఆలోచించి క్రోశమాత్ర స్థలము (ఎటుచూచినను కోసు దూరము గలది) అందమైనది గ్రహించి మహానుభావుడైన నందునకు భవన నిర్మాణము చేయుట కారంభించెను.
కృత్వాఽనుమానం బుధ్యా చ సర్వతోఽపి విలక్షణం ।
పరీఖాభిర్గభీరాభిశ్చతుర్భిః సంయుతం వరం ॥
దుర్లంఘ్యాభిర్వారిభిశ్చ ఖనితాభిశ్చ ప్రస్తరైః ।
పుష్పోద్యానైః పుష్పితాభిః పారావారేషు పుష్పితైః ॥
చారుచంపక వుష్త్పెశ్చ పుష్పితైః సుమనోహరైః ।
పరితో వాసితాభిశ్చ సుగంధివాయునా మునే ॥
బుద్ధిశక్తిలో అతడాలోచించి అన్నిటికన్న విలక్షణముగా దాటరానంత నీరు నిండి ఉండునట్లుగా లోతుగా త్రవ్వి రాళ్ళతో నిర్మించిన నాలుగు అగడ్డలు (కందకములు) కంచెల (తోటహద్దులు) దాక నిండుగా పుష్పించిన పూలతోటలు కన్నులకింపై మనస్సును హరించునట్లు అందమైన సంపెంగలు పుష్పించే పరిమళవాయువులు నలువైపుల సువాసనలు వెదజల్లునట్లున్న ఉద్యాసములు.
ఆమ్రైర్గుడాలైః వనసైః ఖర్జూరైర్నారికేలకైః ।
దాడీమైః శ్రీఫలైర్భృంగైర్జంబీకైర్నాగరంగకైః ॥
తుంగైరామ్రాతకైర్జంబు సమూహైశ్చ ఫలాన్వితైః ।
మామిళ్ల ఇప్పులు పనస చెట్లు ఖర్జూరము కొబ్బరి చెట్లు దానిమ్మ మారేడు గజనిమ్మ నారింజ చెట్లు ఎత్తైన జీడి మామిడి చెట్లు అల్లనేరెళ్లు అన్ని పండ్లతోటలును.
కదలీనాం కేతకీనాం కదంబానాం కదంబకైః ॥
నర్వతః శోభితాభిశ్చ ఫలైస్తైః పుష్పితై రహో ।
క్రీడార్హాభిః నిగూఢాభిః వాంచితాభిశ్చ సర్వదా ॥
అరటి గుంపులు మొగిలిపొదలు కడిమీ చెట్ల గుంపులు పండ్లు పండి పుష్పించి అంతట శోభించుచు రహస్య క్రీడలకు తగినట్లుగా కోరదగినవై చాటు మాటులు గలవిగానుండెను.
పరిఖానాం రహః స్థానే చకార మార్గముత్తమం ।
దుర్గమం పరవర్గాణాం స్వానాం చ సుగమం సదా ॥
ఆ అగడ్తలకు మంచి త్రోవ రహస్య ప్రదేశములో (గృహములోనికి రాకపోకలకు తగినట్లు) శత్రువులకు చొరరాకుండ మిత్రులకు రాదగినట్లు నిర్మించబడెను.
నంకేతేన మణిస్తంభైశ్చాదితం స్వల్పపాథసా ।
స్తంభసీమాకృతమహో న సంకీర్ణం న విస్తృతం ॥
పరిఖోపరీ భాగేచ ప్రాకారం సుమనోహరం ।
ధసుశ్శత ప్రమాణం చ చకారాతి సముచ్ఛ్రితం ॥
ఆ రహస్య మార్గము గుర్తింపుగా మణిస్తంభముల చేత కప్పబడి పైన కొద్దినీరుండునట్లు నిర్మితమయ్యెను. ఆ స్తంభముల మధ్య దూరము మీక్కిలీ దూరముగా గాని దట్టముగా గాని లేకుండెను. అగర్త ఒడ్డున నూరు ధనుషుల ప్రమాణముతో మిక్కిలి ఎత్తుగా సుందరమైన ప్రాకారము (చుట్టుగోడ) నిర్మించబడెను.
ప్రస్తరస్య ప్రమాణం చ పంచవింశతిహస్తకం ।
సిందూరాకారమణిభిః నిర్మితం చాతిసుందరం ॥
ప్రాకారమునకున్న రాళ్లు ఇరువది ఐదు హస్తముల ప్రమాణము కలవి. సిందూర వర్ణ శిలలతో అతి సుందరముగా అది నిర్మించబడెను.
బాహ్యే ద్వాభ్యాం చ సంయుక్త మంతరే సప్తభిస్తథా ।
ద్వార్భిశ్చ నన్నిరుద్ధాభిర్మణిసార కపాటకైః ॥
మణిశిలలతో నిర్మించిన చేరేడులు గల ద్వారము బయట రెండు, లోపల ఏడు కట్లు? ఉండునట్లు నిర్మించబడెను. అవి చక్కగా బిగించబడెను.
హరిన్మణీనాం కలశైశ్చిత్రయుక్తైర్విరాజితం ।
మణిసార వికారైశ్చ కపాటైశ్చ సుశోభితం ॥
స్వర్ణసార వినిర్మాణ కలశోజ్జ్వల శేఖరం ।
నందాలయం వీనిర్మాయ బభ్రామ నగరం పునః ॥
చిత్రములతో (ఆకార రేఖలు) గూడిన ఇంద్రనీలమణుల కలశములతోను మణిశిలలతో నిర్మించిన కవాటములతోను గోపురము మీద మేలిమి బంగారు కలశములతోను ప్రకాశించుచున్న నందభవనమును నిర్మించి విశ్వకర్మ నగరమునకు మరల పోయెను.
రాజమార్గాంశ్చ వివిధాన్ స చ చారూన్ చకార హ ।
రక్తభాసు వికారైశ్చ వేధీభిశ్చ సుపత్రనైః ॥
పారావారే చ పరితో నిబంధాంశ్చ మనోహరాన్ ।
వాణిజ్యార్హైశ్చ వణిజాం పరితో మణి మండపైః ॥
సర్వతో దక్షణే వామే జ్వలద్భిశ్చ విరాజితాన్ ।
ఎఱ్ఱని సూర్యబింబము వంటి అరుగులతో వాటికి మెట్లతో - కొండ కొంత దూరములో పట్టణమంతట మనోహరములైన విశ్రాంతి స్థానములతో - వర్తకులు వర్తకము చేయుట కొరకు పట్టణమంతట కుడి ఎడమ ప్రక్కలలో ప్రకాశించెడి రత్నమంటపములతో సుందరముగా వివిధ పద్ధతులలో రాజవీధులను నిర్మించేను.
తతో బృందావనం గత్వా నిర్మమే రాసమండలం ॥
ఆ తరువాత నగరము దాటి బృందావనమునకేగి అచ్చట రాసమండలమును (రాధామాధవుల విహారస్థానము) నిర్మించేను.
సుందరం మండలాకారం మణి ప్రాకారసంయుతం ।
పరితో యోజనాయామం మణివేదిభిరన్వితం ॥
మణిసార వికారైశ్చ మండ పైర్నవ కోటిభిః ।
శృంగారార్హైశ్చ చిత్రాడ్యై రతితల్ప సమన్వితైః ॥
నానాజాతి ప్రసూనానాం వాయునా సురభీకృతైః ।
రత్న ప్రదీవ సంయుక్తైః నువర్ణ కలశోజ్జ్వలైః ॥
పుష్పోద్యానైః పుష్పితైశ్చ సరోభిశ్చ నుశోభితం ।
రాసస్థలం వినిర్మాయ జగొమాన్యత్ స్థలం వురః ॥
అంతట ఒక యోజనము (ఆమడ) వెడల్పుండునట్లు మండలాకారముగా సుందరమైన రత్నాల ప్రాకారముతోను, రత్నవేదికల తోను, తొమ్మిది కోట్ల (వరుసల) మణి శిలానిర్మితములైన మంటపములతోను, శృంగార రసయోగ్యములైన చిత్తరువులు రతి తల్పములతోను (శయ్యలు) రత్నపు దీపస్తంభములతోను, ప్రకాశించెడి సువర్ణ కలశములతోను (శిఖరముల మీద) వానాజాతుల పుష్పముల మీది నుండి పీచు గాలి వలన పరిమళవంతములైన ప్రదేశములతోను, పుష్పించిన ఉద్యానములతోను, సరస్సులతోను రాసస్థలము సుందరముగా నిర్మించి విశ్వకర్మ అటనుండి ఇతర ప్రదేశమున కేగెను.
దృష్ట్వా బృందావనం రమ్యం పరితుష్టో బభూవ ష ।
బృందావనాభ్యంతరే చ స్థానే స్థానే సునిర్జనే ॥
కృత్వాపరిమితం బుధ్యా మనసాలోచ్య యత్నతః ।
విలక్షణానీ రమ్యాణి తత్ర త్రింశద్వనాని చ ॥
రాధామాధవయేరేవ క్రీడార్ధం చ వినిర్మమే ।
విశ్వకర్మ సుందర బృందావనమును చూచి సంతసించి ఆ బృందావనములో నడుమ నడుమ ఏకాంత ప్రదేశములో, వేరు వేరు లక్షణములు గల సుందరోద్యానములను ముప్పదింటిని (30) రాధామాధవుల యొక్క క్రీడా విలాసముల కొరకనియే, ప్రయత్నపడి మనస్సుతో ఆలోచించీ బుద్ధితో స్థలము విభజించి నిర్మించెను.
తతో మధువనాభ్యాశే నిర్జనేఽతి మనోహరే ॥
వటమూల సమీపే చ సరసః పశ్చిమే తటే ।
చంపకోద్దాము పూర్వాయాం కేతకీ వనమధ్యతః ॥
పువస్తయోశ్చ క్రీడార్ధం చకార రత్నమండవం ।
చతుర్భిర్వేదికాభిశ్చ పరీతమతినుందరం ॥
సద్రత్న సార రచితై రాజితం తూలికాశతైః ।
అమూల్య రత్న రచితైర్నానా చిత్రేణ చిత్రితైః ॥
కవాటైర్నవభిర్యుక్తం నవద్వారైర్మనోహరైః ।
రత్నేంద్ర చిత్ర కలశైః కృత్రిమైశ్చ త్రికోటిభిః ॥
పరితః పరితో భీత్యామూర్ధ్వం చ పరిశోభితం ।
మహామణీంద్ర వికృతైరారో హైర్నవభిర్వతం ॥
సద్రత్నసార రచిత కలశోజ్జ్వల శేఖరం ।
పతాకా తోరణైర్యుక్తం శోభితం శ్వేత చామరైః ॥
సర్వతః పురతో దీప్తమమూల్య రత్న దర్పణైః ।
ధనుః ప్రమాణశతకమూర్ధ్వమగ్నిశిఖోవమం ॥
శతహస్త ప్రమాణం చ ప్రస్తారం వర్తులాకృతిం ।
ఆ తరువాత మధువనము దగ్గర మనోహరమైన ఏకాంత ప్రదేశమున మఱ్ఱి చెట్టునకు సమీపమున గల సరస్పునకు పశ్చిమ తీరములో చంపక వనమునకు తూర్పున కేతకీవసము నడుమ రాధామాధవుల క్రీడకొరకని మరియొక రత్న మంటపము సతడు నిర్మించెను. ఆ రత్న మంటపము వర్తులాకారముగా నూరు హస్తముల వైశాలము నూరు ధనువుల ఎత్తు గలిగీ అగ్నిజ్వాలవలె ప్రకాశించుచుండెను. దాని చుట్టు అమూల్య రత్నరచితములైన నానావిధ చిత్రములు చెక్కబడినవి. రత్నసార నిర్మితములైన వందల మెత్తని ఆసనములు గల నాలుగు వేదికలు (వెడలైన ఎత్తు అరుగులు) నిర్మితములై ఉండెను. సుందరములైన తొమ్మిది కవాట ద్వారములతో భవనమును చుట్టి వచ్చు గోడమీద విచిత్రములు మణినిర్మితములైన కృత్రిమ కలశములు మూడు వరుసలుగా ప్రకాశించుచు శోభిల్లుచుండెను. ఆ మంటప (భవనము) ము మహామణులలో ఏడు అంతరములుగా నుండెను. శిఖరముల మీద రత్న కలశములు ఉజ్జ్వలముగా ప్రకాశించుచుండెను. పతోకములు తోరణద్వారములు తెల్లని చామరములతో అలంకరింపబడెను, అంతట వెలగట్ట రాని రత్న దర్పణములు ప్రకాశించుచుండెను.
శోభితం రత్నతల్పైశ్చ తదభ్యంతర ముత్తమం ॥
వహ్ని శుద్ధాంశుకైః వస్త్రైర్మాలాజాల విచిత్రితైః ।
పారిజాత ప్రసూనానాం మాల్యోవధాన సంయుతైః ॥
చందనాగురు కస్తూరీ కుంకుమైః నురభీకృతం ।
నవశృంగార యోగ్యైశ్చ కామ వర్ధన కారీభీః ॥
మాలతీ చంపకానాం చ పుష్పరాజీభిరన్వీతం ।
సకర్పూరైశ్చ తాంబూలైః సద్రత్నపాత్ర సంస్థితైః ॥
వజ్రసారేణ ఖచితైర్ముక్తాజాల విలంబిభిః ।
రత్నసార ఘటాకీర్ణం రత్నపీఠైః సుసంయుతం ॥
రత్నసింహాసనైర్యుక్తం రత్న చిత్రేణ చిత్రితైః ।
క్షరితై శ్చంద్ర కాంతైశ్చ సుసిక్తం జలబిందుభిః ॥
రత్నమంటపములోని అభ్యంతర గృహములో (లోపలి గృహము) అగ్నివలె ప్రకాశించుచున్న ఎడ్డని పట్టు వస్త్రములతో పూమాలలతో పారిజాత పుష్పమాలలతలగడలతో, నవ శృంగారమునకు యోగ్యమైన, కామవృద్ధిని చేయునటువంటి, మాలతీ చంపక పుష్పమాలలు, రత్న పాత్రలందున్న కర్పూర తాంబూలములతోను కూడి చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల సువాసనతో పరిమళించుచున్న రత్నశయ్యలు శోభిల్లుచుండెను. ఆ శయ్యలు వజ్రములు పొదుగబడి ముత్యాల చేరులు చుట్టు వ్రేలాడుచుండగా వెలుచుండెను. రత్నఘటములు (పానీయ పాత్రలు) రత్నపీఠములు రత్నసింహాసనములు చంద్రకాంతమణులు కరగగా వచ్చు నీటి బిందువులతో చక్కగా తడుపబడుచున్న ప్రదేశములు కల్గి ఆ భవనము శోభిల్లుచుండెను.
శీతవాసితతోయేన సంయుక్తం భోగవస్తుభిః ।
కృత్వా రతిగృహం రమ్యం నగరం చ పునర్యయౌ ॥
చల్లని సుగంధజలము భోగద్రవ్యములతో కూడియున్న ఆ విలాస గృహమును సుందరముగా నిర్మించీ విశ్వకర్మ మరల నగరమునకు వెళ్లెను.
యాని యేషాం మందిరాణి తన్నామాని లీలేఖ నః ।
ముదాయుక్తో విశ్వకర్మా శిష్యైర్యక్షగణైః సహ ॥
నిద్రేశం నిద్రితం నత్వా ప్రయయౌ స్వాలయం మునే ।
సర్వత్త్రెవం సుకృతినాం నమస్తం భగవత్కృపా ॥
నేహాశ్చర్యం చ నగరం బభూవేశేచ్ఛయా భువి ।
ఇత్యేవం కథితం సర్వం హరేశ్చరిత మంగలం ॥
సుఖదం పాతకహరం కిం భూయః శ్రోతుమిచ్ఛసి ।
ఎవరికేగృహమో ఆయా వ్యక్తుల పేరులను ఆ మందిరముల మీద అతడు వ్రాసి సంతోషముతో తన శిష్యులను యక్షగణములను వెంటబెట్టుకొని, నిద్రించిన నిద్రినాధునకు (శ్రీకృష్ణునకు) నమస్కరించి తన నివాసమునకేగెను. సుకృతాత్ములకు అంతట అన్ని ఇట్లు సమకూరుట భగవత్కృప. స్వామి ఇచ్ఛవలన భూమి మీద ఇట్టి నగరమేర్పడినది. ఈ విషయములో ఆశ్చర్యపడవలసినది లేదు. నారదా ! ఇట్లు నీకు పాతకహరము సుఖమిచ్చునదియైన శ్రీహరి యొక్క మంగళకరమైన చరిత్ర చెప్పితిని. ఇక మరల నేమి వినగోరుచున్నావు.
నారద ఉవాచ - నారదుడనేను :
కధం బృందావనం నామ కాననస్యాస్య భారతే ।
వ్యుత్పత్తిరస్య నంజ్ఞా వా తత్త్వం వద నుతత్త్వవిత్ ॥
ఓ మంచి తత్త్వమెరిగిన నారాయణ మహర్షీ ! భారత వర్షములోని ఈ అరణ్యమునకు బృందావనమన్న పేరెట్లు వచ్చినది. ఆ నామము యొక్క అర్థమేమి ? చెప్పుము.
సూత ఉవాచ - సూతుడనెను :
నారదస్య వచః శ్రుత్వా ఋషిర్నారాయణో ముదా ।
ప్రహస్యోవాచ నిఖిలం తత్త్వమేవ పురాతనం ॥
నారదుని మాటలకు నారాయణ మహర్షి సంతసముతో నవ్వి ప్రాచీనమైన తత్త్వమునంతయు ఇట్లు చెప్పెను.
నారాయణ ఉవాచ - నారాయణ ఋషి అనెను :
పురా కేదార నృపతిః సప్తద్వీప పతిః స్వయం ॥
ఆసీత్సత్యయుగే బ్రహ్మన్ సత్యధర్మరతస్సదా ।
స రేమే సహ నారీభిః పుత్ర పౌత్ర గణైస్సహ ॥
పుత్రానివ ప్రజాః సర్వాః పాలయామాస ధార్మికః ।
కృత్వా క్రతు శతం రాజా లేఖే నేంద్రత్వ మీప్సితం ॥
కృత్వా నానావిధం పుణ్యం ఫలకాంక్షీ న చ స్వయం ।
నిత్యం నైమిత్తికం సర్వం శ్రీకృష్ణప్రీతీ పూర్వకం ॥
పూర్వము సత్యయుగములో (కృతయుగము) సత్యము ధర్మము లందాసక్తి గల కేదార నృపతి సప్తద్వీపములకు నాధుడుగా నుండెను. ఆ ధర్మాత్ముడు ప్రజలను కన్నబిడ్డలవలే పాలించుచు భార్యలతో సుఖములనుభవించుచు కొడుకులు మనుమలతో విలసిల్లెను. అతడు వంద యజ్ఞములు చేసి కూడ అందరు కోరెడి ఇంద్ర పదవి న పేక్షించలేదు. నిత్యములు (ఎల్లప్పుడు - దినదినము చేయు సంధ్యావందన జపహోమతర్పణాది కర్మలు) నైమిత్తికములు (ఒక పర్వ దినము నాడు చేయు వేదము చెప్పిన కర్మలు) అన్నియు నానావిధ పుణ్యకార్యములు పుణ్యము దానిఫలము రావలెనన్న కోరిక లేకుండ శ్రీకృష్ణునకు (శ్రీహరికి) ప్రీతికలుగవలెనన్న భావముతోనే చేయుచుండెను.
కేదారతుల్యో రాజేంద్రో న భూతో భవితా పునః ।
పుత్రేషు రాజ్యం సంన్యన్య ప్రియాం త్రైలోక్య మోహినీం ॥
జేగీషవ్యోపదేశేన జగామ తపసే వనం ।
హరేరేకాంతీకో భక్తో ధ్యాయతే సంతతం హరీం ॥
శశ్వత్సుదర్శనం చక్రమస్తి యత్సన్నిధౌ మునే ।
చిరం తప్త్వా ముని శ్రేష్ఠో గోలోకం చ జగామ సః ॥
కేదార నృపతితో సాటివచ్చు రాజు ఇంతకు ముందు లేడు. ఇకముందుండ బోడు. ఆ రాజు జేగీషవ్యముని ఉపదేశము వలన త్రిలోక సుందరియైన భార్యను రాజ్యమును కుమారుల కప్పగించి తపస్సు కొరకడవులకు పోయెను. శ్రీహరి యందు ఏకాంతభక్తి గల (అన్ని సేవలు చేయవలెనన్న భక్తి) అతడు స్వామి నెల్లప్పుడు ధ్యానించుచుండెను. ఓ నారదా ! స్వామి యొక్క సుదర్శన చక్రమతని రక్ష కొరకు ఎల్లప్పుడతని సమీపముననే ప్రకాశించుచుండెను. ఆ రాజు అట్లు చాలకాలము తపస్సు చేసి మునులలో శ్రేష్ఠుడై గోలోకమును పొందెను.
కేదారం నామ తీర్థం చ తన్నామ్నా చ బభూవ హ ।
తత్రాద్యాపీ మృతః ప్రాణీ సద్యో ముక్తో భవేద్ధ్రువం ॥
కేదార తీర్థమతని పేరు వలన నేర్పడినదే. అక్కడ మరణించిన ప్రాణి నేటికిని వెంటనే ముక్తిపొందును. ఇది నిశ్చయము.
కమలాంశా తస్య కన్యా నామ్నా బృందా తపస్వినీ ।
న వవ్రే సా వరం కంచిద్యోగశాస్త్ర విశారదా ॥
దత్తో దుర్వాససా తస్యై హరేర్మంత్రః సుదుర్లభః ।
సా విరక్తా గృహం త్యక్త్వా జగామ తపసే వనం ॥
షష్ఠి వర్ష సహస్రాణి తవస్తే పే నునిర్జనే ।
ఆవిర్బభూవ శ్రీకృష్ణ స్తత్పరో భక్తవత్సలః ॥
ప్రసన్న వదనః శ్రీమాన్ వరం పృణ్విత్యువాచ హ ।
ఆ కేదారనృపతి కూతురు బృంద. ఆమె లక్ష్మీ అంశతో జన్మించి తపస్సు చేసిన మహానుభావురాలు. యోగశాస్త్రము నందు ఆరితేరిన వ్యక్తి. వివాహ వయస్సులో ఏ మానవునిని భర్తగా వరించక విరక్తురాలయ్యెను. దుర్వాస మహర్షి ఆమెకు సుదుర్లభమైన శ్రీహరి మంత్రమునుపదేశించగా ఆమె ఇల్లు వదిలి తపస్సు చేయ నడపులకేగెను. అక్కడ నిర్జన ప్రదేశమున అరువది వేల సంవత్సరములు తీవ్ర తపస్సు చేసెను. భక్తులయందు వాత్సల్యము గలవాడగు శ్రీకృష్ణుడామె యందాసక్తి గలవాడై ప్రసన్నవదనము దివ్యకాంతి గలవాడై సాక్షాత్కరించి వరము కోరుకొమ్మని పల్కెను.
దృష్ట్యా సా రాధికా కాంతం శాంతం సుందర విగ్రహం ॥
మూర్ఛాం సంప్రాప సా సద్యః కామబాణ ప్రపీడితా ।
సా చ శీఘ్రం వరం వవ్రే పతిస్త్వం మే భవేతి చ ॥
ఓమిత్యుక్త్యా చ రహసి చిరం రేమే తయా సహ ।
సా జగామ చ గోలోకం కృష్ణేన సహ కౌతుకాత్ ॥
రాధావల్లభుని ఆ శాంత సుందరమూర్తిని బృంద చూచి మన్మధ బాణ పీడితురాలై అప్పుడే మూర్ఛిల్లి, నీవు నాకు భర్తవు కమ్మని ఆతురతతో వరము కోరెను. అందుకతడు సరే అని అంగీకరించీ చాలకాలమా అరణ్యములో ఏకాంత ప్రదేశములలో ఆమెతో ఆనందమనుభవించెను. బృందాదేవి కృష్ణుని మీది అసక్తితో ముక్తురాలై స్వామితో బాటు గోలోకమున కేగెను.
రాధాసమా సా సౌభాగ్యాధ్గోపీ శ్రేష్టా బభూవ హ ।
బృందా యత్ర తపస్తే సే తత్తు బృందావనం స్మృతం ॥
బృందయాఽత్ర కృతా క్రీడా తేన వా మువిపుంగవ ।
అథాఽన్యం చేతిహాసం చ శ్రుణుష్వ వత్స పుణ్యదం ॥
ఓ మునిశ్రేష్ఠా ! గోలోకమందలి ఒక గోపిక యగు బృందాదేవీ భాగ్యవశమున రాధతో సమానురాలయ్యెను. ఆమె తపస్సు చేసిన ప్రదేశము బృందావనమని చెప్పబడెను. బృందాదేవి శ్రీహరితో క్రీడించినందువలనను ఆ ప్రదేశము బృందావనమని చెప్పబడెను, ఓయీ ! పుణ్యప్రదమైన మరియొక ఇతిహాసము చెప్పెదను వినుము.
యేన బృందావనం నామ నిబోధ కథయామి తే ।
ఏకారణమున బృందావనమనునది ఏర్పడెనో అది నీకు చెప్పెదను వినుము.
కుశధ్వజస్య కన్యే ద్వే ధర్మశాస్త్ర విశారదే ॥
తులసీ వేదవత్యౌ చ విరక్తీ భవకర్మణి ।
తవస్తప్త్వా వేదవతీ ప్రావ నారాయణం పరం ॥
సీతా జనక కన్యా సా నర్వత్ర వరికీర్తితా ।
కుశధ్వజునకిద్దరు బిడ్డలు. ధర్మశాస్త్రమందు ఆరితేరిన తులసి వేదవతి అనువారు సంసార కర్మలయందు విరక్తి బొందిరి. ఆ యిద్దరిలో వేదవతి తపస్సు చేసి శ్రీమన్నారాయణుని భర్తగా పొందెను. ఆమెయే జనకుని కూతురగు సీతగా అంతట అందరిచే కీర్తింపబడినది.
తులసీ చ తవస్తప్త్వా వాంఛాం కృత్వా హరిం ప్రతీ ॥
దైవాద్దుర్వాసనః శాపాత్ ప్రాప్య శంఖాసురం పతిం ।
పశ్చాత్సంప్రాప్తి కమలాకాంతం కాంతం మనోహరం ॥
సా చైవ హరిశాపేన వృక్షరూపా నురేశ్వరీ ।
తస్యాః శాపేన చ హరిః శాలగ్రామో బభూవ హ॥
తథా తస్థౌ చ సతతం శిలా వక్షసి సుందరీ ।
విస్తీర్ణం కథితం సర్వం తులసీ చరీతం చ తే ।
తథాఽపి చ ప్రసంగేన కించిదుత్తం మునే పునః ॥
తస్యాశ్చ తపనః స్థానం తదిదం చ తపోధన ।
తేన బృందావనం నామ ప్రవదంతి మనీషిణః ॥
తులసియు శ్రీహరియందు కోరిక పెట్టుకొని తపస్సు చేసి దైవికముగా ఏర్పడిన దుర్వాసమహర్షి శాపము వలన శంభాసురుని భర్తగా పొందెను. ఆ తరువాత తన మనస్సు హరించిన సుందరుడగు లక్ష్మీవల్లభునీ పొంది, ఆ సురనాయిక హరి శాపము వలన వృక్షరూపము తాల్చెను. శ్రీహరియు ఆమె శాపము వలన సాలగ్రామ శిల అయ్యెను. ఆ తీరుగా ఆ సుందరి సాలగ్రామ శిలపై తులసీ దళరూపమున ఎల్లప్పుడు నిలిచెను. ఓ తపోధనా ! నీకు తులసీ చరిత్రము వివరముగా గాక ప్రంగవశమున కొలదిగా చెప్పితిని. ఆ తులసి (బృంద) యొక్క తపస్సు స్థానము కూడ ఇదీయే. అందువలన పండితులు దీనిని బృందావనమనీ అందురు.
అధవా తే ప్రవక్ష్యామి పరం హేత్వంతరం శ్రుణు ।
యేన బృందావనం నామ పుణ్య క్షేత్రస్య భారతే ॥
రాధాషోడశనామ్నాం చ బృందా నామ శ్రుతౌ శ్రుతం ।
తస్యాః క్రీడావనం గమ్యం తేన బృందావనం స్మృతం ॥
గోలోకే ప్రీతయే తస్యాః కృష్ణేన నిర్మితం పురా ।
క్రీడార్థం భువి తన్నామ్నా వనం బృందావనం స్మృతం ॥
అదిగాకను భారత వరమున ఈ పుణ్యక్షేత్రమునకు బృందావనమని పేరు వచ్చిన ఇతర కారణము నీకు చెప్పెద వినుము. రాధాదేవి షోడశ నామములలో “బృందా” అనునది వేదములో విన్పించును. గోలోకమందలి రాధాదేవికి ప్రీతికరముగా ఆమె క్రీడార్ధము శ్రీకృష్ణుడు భూమియందీవనమును నిర్మించినందున ఆ పేరున బృందావనమని చెప్పబడినది.
నారద ఉవాచ - నారదుడనేను :
కాని షోడశ నామావి రాధికాయా జగద్గురో ।
తాని మే వద శిష్యాయ శ్రేతుం కౌతూహలం మమ ॥
శ్రుతం నామ్నాం సహస్రం చ సామవేదే నిరూపితం ।
తధాఽపి శ్రోతు మిచ్ఛామి త్వత్తో నామాని షోడశ ॥
అభ్యంతరాణి తేషాం వా తదన్యాన్యేవ మే విభో ।
అహో పుణ్య స్వరూపాణి భక్తానాం వాంఛితాని చ ॥
నామాని తేషాం వ్యుత్పత్తిం సర్వేషాం దుర్లభానీ చ ।
పావనాని జగన్మాతుర్జగతామపి కారణం ॥
ఓ జగద్గురూ ! రాధాదేవి షోడశ నామము లేవియో పోటీని నీ శిష్యుడనగు నాకు చెప్పుము. నాకు వినవలెననీ కుతూహలమున్నది. సామవేదమందు నిరూపించబడిన సహస్రనామములు వినియుంటిని. ఐనను నీనుండి పదహారు నామములను వినగోరుచున్నాను. ఈ నామములు ఆ సహస్ర నామములలోనీవా ? పోటీకన్న ఇతరములా? భక్తుల చేత కోరబడునట్టి పుణ్య స్వరూపములైన ఆ నామములను ఎల్లరికి దుర్లభములైన ఆ సామముల వ్యుత్పత్యర్థములను (ఆ నామముల పుట్టుకను తెలుపు అర్థములు) సృష్టికి మూలమైన ఆ జగన్మాత పావననామములను తెలుపుము.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనేను :
రాధా రాసేశ్వరీ రాసవాసినీ రసికేశ్వరీ ।
కృష్ణప్రాణాధికా కృష్ణప్రియా కృష్ణ స్వరూపిణీ ॥
కృష్ణవామాంగ సంభూతా పరమానంద రూపిణీ ।
కృష్ణా బృందావనీ బృందా బృందావన వినోదినీ ॥
చంద్రావతీ చంద్రకాంతా శరచ్చంద్ర నిభాననా ।
నామాన్యేతాని సారాణి తేషామభ్యంతరాణి చ ॥
(1) రాధ (ఽ) రాసేశ్వరి (3) రాసవాసిని (4) రసికేశ్వరి (5) కృష్ణ ప్రాణాధిక (8) కృష్ణ ప్రియ (7) కృష్ణ స్వరూపిణి (8) కృష్ణవామాంగ సంభూత (9) పరమానంద రూపిణి (10) కృష్ణ (11) బృందావని (1ఽ) బృంద (13) బృందావన వినోదిని (14) చంద్రావతి (15) చంద్రకాంత (16) శరచ్చంద్ర నిభానన అను నీ నామములు సారభూతములు-సహస్ర నామముల లోనివే.
రాధేత్యేవం చ సంసిద్ధా రాకారో దానవాచకః ।
స్వయం నిర్వాణ దాత్రీ యా సా రాధా పరికీర్తితా ॥
‘రా’ అను అక్షరము దానమును అర్ధమును చెప్పును. స్వయముగా నిర్వాణ (మోక్షము) ము నిచ్చునది కనుక ఆమె రాధ అని కీర్తింపబడినది. ఇట్లు రాధాశబ్దము ఏర్పడినది.
రాసేశ్వరస్య పత్నీయం తేన రాసేశ్వరీ స్మృతా ।
రాసే చ వాసో యస్యాశ్చ తేన సా రాసవాసినీ ॥
రాసేశ్వరుని పత్నియైనందున “రాసేశ్వరి” యనియు రాస (మండల) మందు నివసించునది కనుక “రాసవాసిని” యనియు చెప్పబడినది.
సర్వాసాం రనీకానాం చ దేవీనామీశ్వరీ పరా ।
ప్రవదంతీ పురా సంతస్తేన తాం రసికేశ్వరీం ॥
మొత్తము రసికురాండ్రు ఐన దేవీ గణములకు పరమేశ్వరియగుట వలన బుధజనులు ఆమెను “రసికేశ్వరి” అని పలికిరి.
ప్రాణాధికాప్రేయసీ సా కృష్ణస్య పరమాత్మనః ।
కృష్ణప్రాణాధికా సా చ కృష్ణే న పరికీర్తితా ॥
కృష్ణ పరమాత్మకు ప్రాణముల కంటే అధికమైన ప్రియురాలు కనుక అతనిచేతనే “కృష్ణ ప్రాణాధిక” అని కీర్తింపబడినది.
కృష్ణస్యాతిప్రియా కాంతా కృష్ణో వాఽ స్యాః ప్రియః సదా ।
సర్వైర్దేవ గణైరుక్షౌ తేన కృష్ణ ప్రియా స్మృతా ॥
కృష్ణునకు మిక్కిలి ప్రియమైన కాంత లేదా ఎల్లప్పుడును కృష్ణుడామెకు ప్రియుడు కనుక అందరు దేవగణములచేత “కృష్ణ ప్రియ” అని చెప్పబడినది.
కృష్ణరూపం సన్నిధాతం యా శక్తా చావలీలయా ।
నర్వాంశైః కృష్ణ నదృశీ తేన కృష్ణ స్వరూపిణీ ॥
అవలీలగా కృష్ణ రూపమును సమకూర్చుకోనుటకు శక్తి కలదో అన్ని అంశలలో కృష్ణునితో సాటిదియో - అకారణమున ఆమె “కృష్ణ స్వరూపిణి” అనబడినది.
వామాంగార్థేన కృష్ణస్య యా సంభూతా పరా సతీ ।
కృష్ణవామాంగ నంభూతా న కృష్ణేన కీర్తితా ॥
ఏ శ్రేష్టురాలైన సతీమణి శ్రీకృష్ణుని యొక్క ఎడమభాగము నుండి సంభవించినదో, ఆ కారణము వలన ఆమె “కృష్ణ వామాంగ సంభూత” అని అతనిచేత కీర్తింపబడినది.
పరమానంద రాశిశ్చ స్వయం మూర్తిమతీ సతీ ।
శ్రుతిభిః కీర్తితా తేన వరమానంద రూపిణీ ॥
తనంతట తానుగా రూపము ధరించిన మహానందపు రాశి అగుటవలన వేదముల చేత “పరమానంద రూపిణి” అని కీర్తింపబడినది.
కృషిర్మోక్షార్థ వచనో స ఏవోత్కృష్ట వాచకః ।
ఆకారో దాతృవచనస్తేన కృష్ణా ప్రకీర్తితా ॥
‘కృష్’ అన్న పదము మోక్షమను అర్ధము చెప్పునది. న కారము శ్రేష్ఠము అన్న అర్థము చెప్పును. ఆకారము దాత (ఇచ్చు) నన్న అర్థము తెల్పునది. ఈ కారణము వలన (ఆశ్రయించిన వారికి శ్రేష్ఠమైన ముక్తినిచ్చునది కనుక) “కృష్ణా” అని చెప్పబడినది.
ఆస్తి బృందావనం యస్యాస్తేన బృందావనీ స్మృతా ।
బృందావనస్యాధిదేవి తేన వాఽథ ప్రకీర్తితా ॥
బృందావనము ఆమెకు చెందినది అగుట వలనను లేదా బృందావనమునకు నాయకురాలు (అధిష్టాన దేవత) అగుట వలన గాని “బృందావనీ” అని కీర్తింపబడినది.
సంఘః సఖీనాం బృందః స్యాదకారో ఽవ్యస్తివాచకః ।
సఖి బృందోఽస్తి యస్యాశ్చ సా బృందా పరికీర్తితా ॥
సఖుల (చెలుల) సమూహమును “బృంద” అనియు పైనున్న ఆకారము ‘ఉన్నది’ అన్న అర్థము తెలుపు పదమనియు చెప్పబడినందువల్ల ఏ దేవికి సఖుల బృందము కలదో ఆమె “బృందా” అని కీర్తింపబడినదిగా చెప్పుదురు.
బృందావనే వినోదశ్చ సోఽస్యాహ్యస్తి చ తత్ర వై ।
వేదా వదంతి తాం తేన బృందావన వినోదినీం ॥
బృందావనములో వినోదము ఆమెకున్నందున వేదములామెను బృందావన వినోదిని యని చెప్పుచున్నవి.
నఖచంద్రావలి వక్త్ర చంద్రోఽస్తి యత్ర సంతతం ।
తేన చంద్రావలి సాచ కృష్ణేన పరికీర్తితా ॥
ఏ దేవియందు ఎల్లప్పుడు నఖము లనెడి చంద్రుల సమూహము (చంద్ర - అవలి) ముఖమనెడి చంద్రుడు (చంద్రుని వంటి గోళ్లు - చంద్రుని వంటి ముఖము) కలరో - అట్టి దేవి కృష్ణుని చేత ఈ కారణము వలన “చంద్రావతి” అని కీర్తింపబడినది.
చంద్రతుల్యా కాంతిరస్తి సదా యస్యా దివానీశం ।
సా చంద్రకాంతా హర్షేణ హరిణా వరికీర్తితా ॥
ఏ దేవికి రాత్రింబవళ్లు చంద్రునితో సమానమైన కాంతి గలదో అదేవి పారిచే సంతోషాతిశయముతో “చంద్రకాంతా” అని కీర్తింపబడినది.
శరచ్చంద్రప్రభా యస్యాశ్చాననేఽస్తి దివానీశం ।
మునినా కీర్తితా తేన శరచ్చంద్రనిభాననా ॥
ఏ దేవి ముఖమందు శరదృతువునందలి చంద్రుని వెలుగు (కాంతి) రాత్రింబవళ్లున్నదో ఆమె ఆ పురాణముని చేత ఆకారణము వలన “శరచ్చంద్రనిభానన” అని కీర్తింపబడినది.
ఇదం షోడశనామోక్త మర్థవ్యాఖ్యాన సంయుతం ।
నారాయణేన యదత్తం బ్రహ్మణే నాభిపంకజే ॥
బ్రహ్మణా చ పురా దత్తం ధర్మాయ జనకాయ మే ।
ధర్మేణ కృపయా దత్తం మహ్యమాదిత్యపర్వణి ॥
పుష్కరే చ మహాతీర్థే పుణ్యాహే దేవనంనది ।
రాధాప్రభావ ప్రస్తావే సుప్రసన్నే చేతసా ॥
ఇదం స్తోత్రం మహాపుణ్యం తుభ్యం దత్తం మయా మునే ।
నిందకాయావైష్ణవాయ న దాతవ్యం మహామునే ॥
యాపజ్జీవమీదం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః ।
రాధామాధవయోః పాదపద్మే భక్తిర్భవేదిహ ॥
అంతే లభేత్తయోర్దాస్యం శశ్వత్సహచరో భవేత్ ।
అణిమాదిక సిద్ధం చ సంప్రాప్య నిత్య విగ్రహం ॥
ఈ షోడశ నామములను అర్ధవివరణముతో తన నాభికమలమున పుట్టిన బ్రహ్మకు శ్రీమన్నారాయణుడు ఉపదేశించెను. బ్రహ్మ పూర్వము మా తండ్రియగు ధర్మఋషికుపదేశించెను. సూర్యగ్రహణ పర్వకాలములో పుణ్యదినమున పుష్కర క్షేత్రమందు దేవతల సభలో రాధాదేవి ప్రభావము ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రసన్నమైన హృదయము గల మా తండ్రి (ధర్మఋషి) దయతో నాకిది ఉపదేశించెను. మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రమును నేను నీకిచ్చితిని. ఓ మహామునీ ! విష్ణుభక్తుడు కాని వానీకి దైవనింద చేయు వానికి ఇది ఉపదేశించగూడదు. తన జీవితమున్నంతవరకు ఏ నరుడు దీనిని మూడు సంధ్యలలో పఠించునో వానికి రాధామాధవుల పాదభక్తి సిద్ధించును. అంతమందు వారి “దాస్య” ముక్తియు - అణిమాద్యష్టసిద్ధులును పొంది వారికి సహచరుడై శాశ్వత సారూప్యమును పొందును.
వ్రత దానోపవా సైశ్చ సర్వైర్నియమ పూర్వకైః ।
చతుర్ణాం చైవ వేదానాం పాఠైః సర్వార్థ సంయుతైః ॥
సర్వేషాం యజ్ఞతీర్థాసాం కరణైర్వీధి బోధితైః ।
ప్రదక్షిణేన భూమేశ్చ కృత్స్నాయా ఏవ సప్తధా ॥
శరణాగత రక్షాయామజ్ఞానాం జ్ఞాన దానతః ।
దేవానాం వైష్ణవానాం చ దర్శనేనాపి యత్ఫలం ॥
తదేవ స్తోత్రపాఠస్య కలాం నార్హతీ షోడశీం ।
స్తోత్రస్యాస్య ప్రభావేణ జీవన్ముక్తో భవేన్నరః ॥
నియమముతో ఆచరించబడిన వ్రతములు, ఉపవాసములు, దానములు - అర్థముతో బాటు నాల్గు వేదముల పఠనము - అన్ని విధముల యజ్ఞములు శాస్త్రము చేత చెప్పబడిన తీర్థయాత్రలు చేయుట - మొత్తము భూమిని ఏడుమార్లు ప్రదక్షిణములు చేయుట - శరణాగతులను రక్షించుట - అజ్ఞానులకు జ్ఞాన దానము చేయుట - దేవతలను వైష్ణవులను దర్శించుట. అను సత్కార్యముల వలన ఏ ఫలము లభించునో అది ఈ రాధాషోడశ నామస్తోత్రమును పఠించుట వలన కలుగు ఫలమునకు పదునారవ వంతు కూడ కాజాలదు. ఈ స్తోత్ర ప్రభావము వలన మనుష్యుడు జీవన్ముక్తుడగును.
నారద ఉవాచ - నారదుడనెసు :
సంప్రాప్తం పరమాశ్చర్యం స్తోత్ర సర్వ సుదుర్లభం ।
కవచం చాపి దేవ్యాశ్చ సంసార విజయం ప్రభో ॥
కృతం స్తోత్రం సుయజ్ఞేన ప్రాప్తం తదపి దుర్లభం ।
శ్రుత్వా కృష్ణ కథాం చిత్రాం త్వత్పాదాబ్జ ప్రసాదతః ॥
అథునా శ్రోతు మిచ్ఛామి యద్రహస్యం చ తద్వద ।
ప్రాతశ్చ నగరం దృష్ట్వా కిమూచుర్వల్లవా మునే ॥
ఎల్లరకు మిక్కిలి దుర్లభమైన పరమాశ్చర్యము కలిగించు స్తోత్రము లభించినది. స్వామీ ! సుయజ్ఞుడు చేసిన దేవీ కవచము సంసారము జయింపజేయునది. దుర్లభమైన ఆ స్తోత్రము కూడ నాకు లభించినది. మీ పాదపద్మముల అనుగ్రహము వలన ఆశ్చర్యము కల్గించు కృష్ణ కథను విని ఇప్పుడు దానిలోని రహస్య విశేషములను వినగోరుచున్నాను. ఉదయమున ఆ సగరమును చూచి గోపాలకులేమి పల్కిరో అది తెలుపుము.
శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి పలికెను :
గతాయాం తత్ర యామిన్యాం గతే చ విశ్వకర్మణి ।
అరుణోదయ వేళాయాం జనాః సర్వే జజాగరుః ॥
ఉత్థాయ దృష్ట్వా నగరం సర్వేభ్యోఽపి విలక్షణం ।
కిమాశ్చర్యం కిమాశ్చర్యమిత్యూచుర్ర్వజవాసినః ॥
కాంశ్చద్గోపాన్ కేచిదూచుః కుత ఏతదభూదిదం ।
న జానే కేన రూపేణ కో భూమౌ ప్రభవేదితి ॥
విశ్వకర్మ వెడలి పోయిన తరువాత రాత్రి గడచి తూర్పున ఎఱ్ఱబారిన అరుణోదయ వేళకు జనులందరు నీద్రనుండి మేల్కొనిరి. వారు లేచి ఇతర నగరముల కన్న విశేషముగా నున్న ఆ నగరమును చూచి “ఇదేమి ఆశ్చర్యము! ఎంత ఆశ్చర్యము!” అని ఇంత వరకు గోకులములో (ప్రజము) నివసించిన వారు అనుకొనిరి. గోపాలకులు “ఎక్కడినుండి ఎట్లు ఈ నిర్మాణము జరిగినది? ఏ రూపము తో ఎవడిట్లు ఈ భూమి మీద చేయగలును ? నాకు తెలియదు నాకు తెలియదు” అని ఒకరితో నొకరు పలుకుచుండిరి.
బుబుధే మనసా నందో గర్గవాక్యమనుస్మరన్ ।
శ్రీహరేరిచ్ఛయా సర్వం జగదేతచ్చరాచరం ॥
బ్రహ్మాది తృణ పర్యంతం యన్య భూభంగ లీలయా ।
ఆవిర్భూతం తిరోభూతం తస్యాసాధ్యం చ కిం కుతః ॥
వివరేష్వేవ యల్లోమ్నాం బ్రహ్మాండావ్యఖిలాని చ ।
ఈశస్య తన్మహా విష్ణోః కిమసాధ్యం హరేరహో ॥
బ్రహ్మేశానంత ధర్మాశ్చ ధ్యాయంతే యత్పదాంబుజం ।
కిమసాధ్యం తదీశస్య మాయామానుష రూపిణః ॥
సందుగానగరమును చూచి గర్గమహర్షి చెప్పిన మాటలను తలచుకొని మనస్సులో ఇట్లనుకొనెను. “బ్రహ్మ మొదలుకొని గడ్డిపరక వరకు ఈ చరాచర జగత్తు మొత్తము ఎవని కనుబొమ కదలికలతో ఆవిర్భవించుట లయము చెందుట (పుట్టుట - చచ్చుట) అను దశలను పొందుచున్నదో ఆ శ్రీహరి ఇచ్చకు అసాధ్యమేది ? ఏ స్వామి రోమకూపములలో బ్రహ్మాండములన్నియు ఇమిడియున్నవో ఆ మహావిష్ణువుకు సాధ్యము కానిదేమి యుండును! బ్రహ్మరుద్రుడు అనంతుడు ధర్మదేవత మొదలుగా గల దేవతలందరు ఎవని పాద పద్మములనే ధ్యానింతురో అట్టి పరమేశునికి సాధ్యము కానిదేది ? మాయనాశ్రయించి మనుష్య రూపము ధరించిన ఈ శ్రీహరి యొక్క (బాలకృష్ణుడు) సంకల్పము వలననే ఈ నగరమేర్పడినది” అని అనుకొనెను.
భ్రామం భ్రామం తన్నగరం దర్శందర్శం గృహం గృహం ।
పాఠం పాఠం చ నామాని సర్వేభ్యో నిలయం దదౌ ॥
నందుడు నగర మంత తిరిగి తిరిగి ఇల్లిల్లు చూచి చూచి ఆయా వ్యక్తుల నామములను ఇండ్ల మీదున్న వాటిని చదివి చదివి అందరికి నివాస గృహముల నిచ్చెను.
కృత్వా శుభక్షణం నందో వృషభానుశ్చ కౌతుకీ ॥
చకార సగణైః సార్థం ముదాఽఽశ్రమనివేశనం ॥
నందుడు, ఆశ్చర్యపడిన వృషభానుడు శుభమైన ప్రవేశోత్సవము జరిపి సంతోషముగా తమ తమ బంధుగణములతో బాటు తమ ఆశ్రమములలో (నివాసస్థానములైన భవనములు) కాపురముండిరి.
సర్వే బృందావనస్థాశ్న ప్రసన్నవదనేక్షణాః ।
ముదా ప్రవేశనం చక్రుః స్వంసమాశ్రమముత్తమం ॥
సర్వే ముముదిరే గోపాః స్వే స్వే స్థానే మనోహరే ।
బాలకా బాలికాశ్చైవ చిక్రీడుశ్చ ప్రహర్షితాః ॥
శ్రీకృష్ణో బలదేవశ్చ శిశుభిః సహకౌతుకాత్ ।
క్రీడాం చకార తత్రైవ స్థానే స్థానే మనోహరే ॥
ఇత్యేవం కథితం నర్వం నిర్మాణం నగరస్య చ ।
అబలానాం వనే రాసమండలస్య చ నారద ॥
బృందావనములో నున్న వారందరు వికసించిన ముఖములతో కన్నులతో సంతోషముగా ఉత్తమమైన తమ తమ గృహములలో ప్రవేశించిరి. గోపాలకులందరు మనోహరముగా నున్న తమ స్థానములలో చేరి ఆనందించిరి. బాలబాలికలు సంతోషముతో ఆటలాడుకొనిరి. శ్రీకృష్ణుడును బలదేవుడును తమతోడి బాలకులతో కలిసి ఆసక్తితో ఆ నగరములో సుందరమైన ప్రతి ప్రదేశములోను బాలక్రీడలాడుకొనిరి. ఓ నారదా ! ఈ విధముగా ఆ బృందావనములోని స్త్రీలయొక్కయు రాసమండలము యొక్కయు నగర నిర్మాణము యొక్కయు వృత్తాంతములను నీకు తెల్పితిని.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే శ్రీ బృందావన నగర నిర్మాణం నామ సప్తదశోఽధ్యాయః.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శ్రీ బృందావన నగర నిర్మాణ మనెడి పదునేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 17 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
One morning, mother Yashodā, exasperated by little Kṛshṇa's butter-stealing pranks, attempted to bind Him with a hemp rope to a heavy wooden mortar in the courtyard. Finding the rope perpetually two fingers too short no matter how many pieces she tied together, Yashodā stood exhausted in wonder, whereupon Kṛshṇa allowed Himself to be bound out of pure love for her devotion. Crawling across the courtyard with the heavy mortar trailing behind Him, Kṛshṇa wedged the mortar between two towering Yamalārjuna trees, which were actually the cursed sons of Kuvera. As Kṛshṇa pulled gently, the trees crashed down, releasing two celestial beings who offered sublime prayers before returning to heaven.