బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

33 - మోహినీశాప, బ్రహ్మదర్ప భంగము

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు (రాధాదేవితో) పలికెను :

కృత్వా బ్రహ్మా హరేః స్తోత్రం తస్థౌ తస్యాః సమీపతః

మనో మత్తగజేంద్రం చ కామాసక్తం నివారయన్

 దివ్య జ్ఞానాంకుశేనైవ మయా దత్తేన రాధికే

ఉవాచ మోహినీ తం చ పరిహాసపరం వచః

ఓ రాధా! ఇట్లు బ్రహ్మ శ్రీహరిని స్తుతించి నాచేత ప్రసాదించబడిన దివ్యజ్ఞానమనెడి అంకుశము చేత కామాసక్తమై యున్న తన. మనస్సను మదగజమును అదుపులో బెట్టుచు ఆమె సమీపమున నిలిచియుండెను. అప్పుడు మోహిని పరిహాస రూపముగా బ్రహ్మతో ఇట్లు పలికెను.

 మోహిన్యువాచ - మోహిని అనెను

ఇంగితేనైవ నారీణాం సద్యో మత్తం భవేన్మనః

కరోత్యాకృష్య సంభోగం యస్స ఏవోత్తమో విభో

 జ్ఞాత్వా స్ఫుటమభిప్రాయం నార్యా సంప్రేషితో హి యః

పశ్చాత్కరోతి శృంగారం పురుషస్స చ మధ్యమః

పునః పునః ప్రేషితశ్చ స్త్రీయా కామార్తయా చ యః

 తయా న లిప్తో రహసి స క్రీజో న పుమానహో

గృహీ తపస్వీ కామీ వా త్యజేత్ స్త్రీయ ముపస్థితాం

 ప్రజేత్పరత్ర నరకమపూజ్యశ్చ భవేదిహ

నష్టశ్రీభ్రష్టరూపశ్చ భ్రష్ఠ బుద్ధిర్భవేద్ధ్రువం

స సద్యః క్లీబతాం యాతి బ్రహ్మన్ శాపేన యోషితః

విభూ! స్త్రీల మనస్సు కామాసక్తమైనదని చూపు మొదలగు అవయవ వికారములను బట్టి తెలిసికొని వెంటనే ఎవడు చేరదీసి సంభోగమొనర్చునో వాడుత్తముడు. శ్రీచేత ప్రేరణ పొంది స్పష్టముగా ఆమె అభిప్రాయ మెరిగిన తరువాత ఎవడు శృంగార కర్మ చేయునో వాడు మధ్యముడు. కామార్హురాలైన స్త్రీ చేత మరల మరల ప్రేరణ పొంది కూడ ఎవడేకాంతమున ఆమెతో కూడదో ఆ పురుషుడు నపుంసకుడు. ఒక గృహస్థుడు గాని తపస్వి గాని కామి గాని తనను చేరవచ్చిన స్త్రీని త్యజించిన యెడల ఈ లోకమున వాడగౌరవ పాత్రుడగును. పరమున నరకము పొందును. ఓ బ్రహ్మా! స్త్రీ శాపము చేత వాడు సంపద నశించి రూపము భ్రష్టమై బుద్ధి భ్రష్టమై వెంటనే క్షీబత్వమును (నపుంసక స్థితిని పొందును.

ఉత్తిష్ఠ జగతీనాథ పారం కురు స్వరార్ణవే

నిమగ్నాం దుస్తరే ఘోరే కర్ణధార భయానకే

అతీవ నిర్జన స్థానే సర్వజంతు వివర్జితే

సుగంధి వాయునా రమ్యే వుంస్కోకిల రుతశ్రుతే

సతతం త్వన్మనస్కాo మాం దాసీం జన్మని జన్మని

 క్రీణీహి రతి పణ్యేనామూల్య రత్నేన సత్వరం

ఇత్యుక్త్వా మోహినీ సద్యో జగత్ర్సష్టుశ్చ బ్రహ్మణః

 విచకర్ష వరం వస్త్రం సస్మితా కామ విహ్వలా

ఓ జగన్నాథా! లెమ్ము, ఘోరము దుస్తరము (దాటశక్యము గానిది) భయంకరమైన మన్మధ సముద్రమున మునిగిన నన్ను ఓ నావికుడా! ఒడ్డుకు చేర్చును. ఏ ప్రాణులు లేనట్టి ఏకాంత ప్రదేశమున సుగంధవాయువుతో మనోహరమై గండుకోకీల కూతలు వినవచ్చుచోట ఎల్లప్పుడు నీయందే మనస్సు కలిగియున్న - జన్మజన్మలకు నీ దాసినైన నన్ను వెలగట్టరాని రత్నము వంటి నీ రతీయను వెలతో కొనవలసినది. త్వరపడుము. ఇట్లు పలికి మోహిని కామభావముతో గుండె చెదిరి చిరునవ్వు చిందించుచు వెంటనే ఆ సృష్టికర్త ధరించిన వస్త్రమును లాగివేసెను.

విజ్ఞాయ సమయం ధాతా తామువాచ భయాతురః

పీయూష తుల్యం వచనం వరం వినయ పూర్వకం

భయాతురుడైన బ్రహ్మ కాలస్థితిని తెలిసికొని వినయపూర్వకముగా శ్రేష్ఠము అమృత సమానము ఐన వచనము పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :

శ్రుణు మోహివి మద్వాక్యం సత్యసారం హితం స్ఫుటం

న కురు త్వం చ త్రైలోక్యే స్త్రీజాతీనామపత్రపాం

త్యజ మామంబికే పుత్రం వృద్ధం నిష్కామమేవ చ

త్వత్కర్మ యోగ్య రసికం యువానం పశ్య సుస్మితే

నిషేకాల్లభతే పత్నీ గురుం భర్తు శ్శుభాశుభం

మంత్ర శిల్పమపత్యం చ సర్వమేతన్న యత్నతః

త్వయా సహ మమ రతే నిబంధో నాస్తి సువ్రతే

క్షుద్రం మహద్వా యత్కర్మ సర్వం దైవ నిబంధకం

ఇత్యుక్త వంతం బ్రహ్మాణం స్మరంతం మత్పదాంబుజం

 విచకర్ష పునర్వేశ్యా కామేన హతచేతనా

మోహినీ! సత్యసారము హితము ఐన నా వాక్యమును స్పష్టముగా వినుము. మూడు లోకములందలి స్త్రీలకును సిగ్గుదీయు పనిని చేయకుము.తల్లీ! వృద్ధుడను నిష్కాముడను నీ పుత్రుడనైన నన్ను వదలుము. మంచీ నవ్వు గలదానా! నీ కర్మకు యోగ్యుడైన రసికునిని యావన మందున్న వానిని చూచుకొమ్ము. ఒక భార్య భర్తయొక్క వీర్యమును ధరించుట వలన అతనికి చెందిన సర్వశుభ శుభములను మంత్ర శిల్ప శక్తులను గొప్ప సంతానమును ఈ సర్వమును, ప్రయత్నము లేకుండ పొందును. ఓ సువ్రతా! నీతో నారతికీ శాస్త్రమంగీకరించదు. క్షుద్రమైనది కానీ గొప్పది కాని కర్మమొత్తము దైవ నిర్ణయముతో కూడినది. ఇట్లు పల్కుచు నా పాదపద్మములను స్మరించుచున్న బ్రహ్మను కామము చేత, వివేకము నశించిన ఆవేశ్య మరల లాగెను.

ఏతస్మిన్నంతరే శీఘ్రం స్థానం తత్సుమనోహరం

ఆజగ్ముర్మునయస్సర్వే జ్వలంతో బ్రహ్మతేజసా

ఆత్రిః పులస్త్య: పులహో వసిష్ఠః క్రతురంగిరాః

భృగుర్మరీచిః కపిలో వోడు: పంచశిఖో రుచి:

ఆసురీశ్చ ప్రచేతాశ్చ స్వయం శుక్రో బృహస్పతిః

ఉతథ్య: కరక: కణ్వ: కశ్యపో గౌతమ స్తథా

సనకశ్చ సనందశ్చ కర్దమశ్చ సనాతనః

సనత్కుమారో భగవాన్ యోగినాం పరమో గురుః

శాతాతపః పిప్పలశ్చ శంకు శుక్రః పరాశరః

మార్కండేయో లోమశశ్చ మృకండుశ్చ్యవనస్తథా

దుర్వాసాశ్చ జరత్కారురార్తీకశ్చ విభాండకః

ఋష్యశృంగో భరద్వాజో వామదేవశ్చ కౌశికః

దృష్ట్వైతాంశ్చ తపో నిష్ఠానాగతాంశ్చ మునీశ్వరాన్

తత్యాజ మోహినీ శీఘ్రం వ్రీడయా కమలోద్భవం

తత్రోవాస జగద్ధాతా తదామ పార్శ్వతశ్చ సా

ఇంతలో మిక్కిలి మనోహరమైన ఆ ప్రదేశమునకు బ్రహ్మ తేజస్సుతో వెలుగుచున్న మునులు అత్రీ పులస్త్యుడు పులహుడు వసిష్ఠుడు క్రతువు ఆంగిరసుడు భృగువు మరీచి కపిలుడు వోడుడు పంచశిఖుడు రుచి ఆసురీ ప్రచేతసుడు శుక్రుడు బృహస్పతి ఉతధ్యుడు కరకుడు కణ్వుడు కశ్యపుడు గౌతముడు సనతుడు సనందుడు కర్దముడు సనాతనుడు యోగులకును పరమ గురువగు సనాతనుడు శాతాతపుడు పిప్పలుడు శంకువు పరాశరుడు మార్కండేయుడు లోమశుడు మృకండుడు చ్యవనుడు దూర్వాసుడు జరత్కారు ఆస్తీకుడు విభాండకుడు ఋష్యశృంగుడు భరద్వాజుడు వామదేవుడు కౌశికుడు చేరవచ్చిరి. తపోనిష్ఠులైన మునీశ్వరులక్కడికి రాగా వారిని చూచిన మోహినీ వెంటనే సిగ్గుతో కమలోద్భవుని (బ్రహ్మను విడిచి పెట్టెను. జగత్కర్తయైన బ్రహ్మ, అతని ప్రక్క ఆమెయు ఉండిరి.

ప్రణేముర్మునయస్తం చ భక్తనమ్రత కంథరా:

వచ్చిన మునులు భక్తితో శిరస్సులు వంచి బ్రహ్మకు నమస్కరించిరి.

ఆశిషం యుయుజే బ్రహ్మా వాసయామాస తాన్ విభుః

తేషు మధ్యే ప్రజజ్వాల యధా తారాసు చంద్రమాః

 ప్రప్రచ్ఛుర్మునయో దేవం కధమేషా తవాంతికే

స్వర్వేశ్యానాం చ ప్రవరా మోహినీత్యేవమేవ చ

శ్రుత్వా మునీనాం వచనమువాచ తాన్ ప్రజాపతిః

స్త్రీజాతీనాం చ వచనం లజ్జాచ్చాదన మేవ చ

విభుడైన బ్రహ్మ వారందరి నాశీర్వదించి కూర్చుండుట కనుమతించి ఆ మునుల మధ్య నక్షత్రముల నడుమ చంద్రుని వలె ప్రకాశించెను. అప్పుడు మునులు “దేవవేశ్యలలో శ్రేష్టురాలైన ఈ మోహిని నీ సమీపమున ఉండుటేమి"? అని ప్రశ్నించగా వారీ వాక్కులు విని బ్రహ్మ స్త్రీల మాటను సిగ్గును కప్పిపుచ్చుచు (గోప్యముగా ఉంచుచు) ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :

ఆపూర్వం నృత్యగీతం చ చిరం కృత్వా శుభావహా

ఉవాసేయం పరిశ్రాంతా యథా కన్యా పితుః పురః

ఇత్యుక్త్వా జగతాం ధాతో జహాస ముని సంసదీ

జహసుర్మువయస్సర్వే సర్వజ్ఞాస్తత్ర రాధికే

సర్వం రహస్యం విజ్ఞాయ జగత్ర్సష్ణుశ్చ మానసం

 సద్యశ్చకోప కులటా హాస్యవ్యాజేన సంసది

 సర్వాంగం కంపమానాసా కులటా కుటిలాననా

రక్తపంకజ నేత్రా చ కోపప్రస్ఫురితాధరా

ఉత్థాయ చ సభామధ్యే తేషాం చ పురతః స్థితా

సంబోధ్యోవాచ బ్రహ్మాణం మృత్యుకన్యా యథా రుషా

ఈ శుభకారిణి చాల సేపు తండ్రీముందు కూతురు వలె నృత్యము చేసి పాటలు పాడి అలిసిపోయి నిలిచియున్నది” అని ఆ జగత్కర్త మునీ గణముతో పలికి నవ్వెను. ఓ రాధా! సర్వజ్ఞులైన ఆ మునులు ఆ సృష్టికర్త మనస్సులోని మొత్తము రహస్యమును తెలుసుకొని వారును నవ్విరీ. నిండుసభలో వారట్లు నవ్వుట వలన ఆ కులట శరీరమంతయు కంపించగా కోపముతో పెదవులు వణుకగా ముఖము బిగించుకొని హఠాత్తుగా కోపము పొంది రక్త పద్మములవలే కన్నులెర్రబడగా ఆ సభలో లేచి వారిముందు నిలిచి మృత్యుకన్య వలె కోపముతో బ్రహ్మను సంబోధించి ఇట్లు పలికెను.

మోహిన్యువాచ - మోహినీ అనెను :

అయే బ్రహ్మన్ జగన్నాథ వేదకర్తా త్వమేవ చ

కిం వా వేదప్రణిహితం కర్మ కిం తద్విపర్యయం

విచారం మనసా స్వేన కురు వేదవిదాం గురో

స్వకన్యాయాం తత్స్పృహా స కథం హససి నర్తకీం

నిర్మితాఽహమీశ్వరేణ స్వర్వేశ్యో సర్వగామినీ

సతాం కర్మ విరుద్ధం యత్తదత్యంత విడంబనం

దాసీ తుల్యాం వినీతాం చ దైవేన శరణాగతాం

యతో హనసి గర్వేణ తతోఽపూజ్యో భవాచిరం

అచిరాద్దర్ప భంగం తే కరిష్యతి హరిః స్వయం

 నీబోధ వచనం బ్రహ్మన్ వేశ్యాయాశ్చ తు సాంప్రతం

 తవైవ వచనం స్తోత్రం గృహ్ణాతి యో నరస్సదా

 భవీతా తన్య విఘ్నశ్చ స యాస్యత్యుపహాస్యతాం

భవితా వార్షికీ పూజా దేవతానాం యుగే యుగే

తవ మాఘ్యం చ సంక్రాంత్యాం న భవిష్యతీ సా పునః

కల్పాంతరేఽత్ర కల్పే వా దే హే దేహాంతరేఽత్ర వా

పునః పూజా న భవితా యా గతా సా గతైవ చ

ఇత్యుక్త్వా మోహినీ శీఘ్రం జగామ మదనాలయం

తేన సార్థం రతిం కృత్వా బభూవ విజ్వరా పునః

 పశ్చాత్తా చేతనాం ప్రాప్య విలలాప భృశం పునః

 ఆయం కథం మయా శక్తే జగద్విధీరతిప్రియః

“ఓయీ బ్రహ్మదేవా! నీవు జగన్నాథుడవు. వేదకర్తవు. వేదమందేమి చెప్పబడినది. దానికి విరుద్ధమైన కర్మ ఏది? వేదవేత్తలలో పెద్దవాడా! నీ మనస్సులో విచారించుకొనుము. నీవు గన్న బిడ్డయందే కామవాంఛ పొందిన నీవు నర్తకినైన నన్ను గూర్చి ఎట్లు నవ్వుచున్నావు? నే నీశ్వరుని చేత దేవవై శ్యగా నిర్మించబడితిని. నేనందరు పురుషులను పొందుదును, కానీ నీవు సత్పురుషుల కర్మకు విరుద్ధముగా ప్రవర్తించి గూడ మిక్కిలి లోక వంచనము చేయుచున్నావు, దాసీ సమానురాలను వినయవతిని దైవికముగా నిన్ను శరణు పొందిన దానను. అట్టి నన్ను గురించి గర్వముతో నవ్వుచుంటివి. అందువలన నీవు త్వరలో అపూజ్యుడవగుదువు గాక, త్వరలో శ్రీహరి నీ గర్వమును భంగపరచగలడు. ఓ బ్రహ్మా! ఇపుడు వేశ్యనైన నా మాటవినుము. ఏ నరుడు నీ వచనమును నీ సుతిని గ్రహించునో వానికి విఘ్నములు (కాగ్యభంగము) ఏర్పడగలవు. వాడు నవ్వుల పాలగును. ఇకముందు దేవతలకు యుగయుగములందు ఏడాదికొకమారే పూజ జరుగుగాక. నీకైతే పూజ మాఘ సంక్రాంతి యందు తప్ప మరల జరుగదు, ఈ కల్పమందు గానీ కల్పాంతర మందు గాని ఈ దేహమున్నపుడుగాని మరియొక దేహము ధరించినప్పుడు గాని రెండవ సారి పూజ (ఒక సంవత్సరములో) నీకు జరుగదు. గడిచి పోయిన కాల విషయమైతే గడిచిపోయినదే కదా”. ఇట్లు పలికి {శపించి) మోహిని శీఘ్రముగా మన్మథుని గృహమున కేగి అతనితో శరీర సుఖమనుభవించి జ్వరము లేనిదయ్యెను, ఆ పిదప వివేకము పొంది “నాకు మిక్కిలి ప్రియుడైన సృష్టికర్త నెట్లు శపించితిని! అని మిక్కిలి విలపించెను.

స్వర్వేశ్యాయాం గతాయాం చ మునయో దుఃఖితా భృశం

 స్వయం విధాతా జగతాం చకం పే నతకంథరః

ఉపాయం మునయస్త స్మై దదు: కల్యాణకారిణః

శరణం వ్రజ వైకుంఠమితుక్త్వా తే గృహాన్యయుః

బ్రహ్మా జగామ శరణం మమ మూర్త్యంతరం పరం

శాంతం తం కమలాకాంతం శ్యామం నారాయణాభిధం

గత్వా విషణ్ణవదనః ప్రణమ్య చ చతుర్భుజం

తత్రోవాన జగత్కర్తా నాతిదూరే సమీపతః

రహస్యం కథయామాస శుష్కకంఠోష్ఠ తాలుకః

దీనబంధుం దయాసింధుం విపత్తారణ కారణం

శ్రీత్వా రహస్యం తత్సర్వం ప్రపస్యోవాచ తం విభుం

సత్యం సారం హితం వాక్యం జగతాం చ సుఖావహం

దేవవేశ్య వెళ్లిపోగా మునులు మిక్కిలి దుఃఖించిరి. జగములను సృష్టించు బ్రహ్మ శిరస్సు వంచుకొని మిక్కిలి వణికి పోయెను. క్షేమకారకులైన ఆ మునులతనీకీ వైకుంఠుని శరణు పొందు"మని ఉపాయము చెప్పి తమ స్థానముల కేగిరీ. నా యొక్క మూర్త్యంతరమైన (రెండవ రూపమైన) కమలావల్లభుడు శాంతుడును శ్యామవరడును చతురుజుడునైన నారాయణుని జేరబోయి బ్రహ్మ శరణు జొచ్చెను, విషాద ముఖముతో నమస్కరించీ కంఠము పెదవులు దవడలును ఎండిపోగా నారాయణుని సమీపమున నిలబడి జరిగిన రహస్య వృత్తాంతమును చెప్పెను. దీనబంధువు దయాసింధువు ఆపద తరింపజేయుటకు మూలమైన ఆ నారాయణుడది విని ఒక నవ్వు నవ్వి సత్యమును సారభూతమును జగములకు (జగత్తునందలి జీవులకు) హితమును సుఖమును గూర్చునదియు ఐన వాక్యమును బ్రహ్మతో పలికెను.

శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడు పలికెను :

స్వయం త్వం వేదవిదసి విదుషాం చ గురోర్గురుః

 త్వయా కృతం చ యత్కర్మ ఇహ కేన న తత్కృతం

 స్త్రీ జాతి: ప్రకృతేరంశా జగతాం బీజరూపిణీ

 స్త్రీణాం విడంబనేనైవ ప్రకృతేశ్చ విడంబనం

న తద్భారత వర్షం చ పుణ్య క్షేత్రమనుత్తమం

 క్రీడా క్షేత్రే బ్రహ్మలోకే కస్తవేంద్రియ నిగ్రహః

యది తద్భారతే దైవాత్కామినీ సముపస్థితా

స్వయం రహసి కామార్తా స సా త్యాజ్యా జితేంద్రియైః

త్యక్త్యా పరత్ర నరకం వ్రజేదతి విడంబితః

 భవేదేవ హి దుఃఖార్తా శాపం దద్యాచ్చతం ధ్రువం

ఓయీ! నీవు స్వయముగా వేదమెరిగిన వాడవు. విద్వాంసులకు పరమగురువువు. నీవు చేసినటువంటి పనిని ఎవడును చేయలేదు. స్త్రీజాతి ప్రకృతి యొక్క అంశ. ఈ జగములకు బీజరూపురాలు. స్త్రీలనవమానించుట ప్రకృతి నవమానించుటయే. ఇది సాటిలేని పుణ్యక్షేత్రమైన భారత వర్షము కాదు గదా. క్రీడా (విలాస) క్షేత్రమైన బ్రహ్మలోకములో నీకింద్రయ నిగ్రహమెక్కడ? భారత వర్షమందు కూడ కామార్హురాలై ఒక స్త్రీ స్వయముగా రహస్యముగా చేరవచ్చినప్పుడు జితేంద్రియులును త్యజింపరాదు, త్యజించిన యెడల అట్లు నటించిన (మోసగించిన) వాడు మరణించి నరకమును పొందును. ఆ స్త్రీ దుఃఖార్జురాలై అతనికి శాపమిచ్చుట నిశ్చయము.

విహాయ స్వకళత్రం చ యో గృహ్ణాతి పరస్త్రీయం

లోభాత్కామ సుఖద్వాఽపి సోఽధమో నాత్ర సంశయః

పాతయిత్వా స చ వతేద్దశ పూర్వాన్ దశాపరాన్

త్యక్త్వాస్వ స్వామీనం యా చ పరం గచ్ఛతి కామత:

న పుమాన్న చ వేశ్యా చ కులస్త్రీ తత్ర దుష్యతి

ఉపాయేన చ యా సాధ్యం కరోతి వరపూరుషం

తిష్ఠత్యేవాంధకూపే సా యావచ్చంద్ర దివాకరౌ

స్వర్వేశ్యా చ దీవం యాతి సతతం కులధర్మతః

 ధ్రువం భవేత్సోఽ పరాధీ తస్యా అవ్యవమానతః

తముపాయం కరిష్యామీ శప్తో యత్ర విశుద్ధ్యతి

క్షణం తిష్ఠ జగన్నాథ పాపినశ్చ భవార్ణవే

లోభముతో గానీ కామ సుఖా పేక్షతో గాని తన భార్యను వదిలి పరస్త్రీని స్వీకరించువాడు (ఇతరుడు వివాహమాడిన స్త్రీని) ఆధముడే. ఆ విషయములో సందేహము లేదు. ఆ పురుషుడు తనకంటే ముందు పది తరముల వారిని తన తరువాతి పది తరముల వారినీ ఉత్తమ గతి నుండి పడగొట్టి తాను నరకములో బడును. ఏ కులస్తీ (వివాహమాడిన స్త్రీ కామముతో తన భర్తను విడిచి పరపురుషుని జేరబోవునో ఆ స్త్రీ అపవిత్రురాలు (పాపమొనర్చినది) అగుచున్నది. వేశ్యకా దోషము లేదు. ఏస్త్రీ అనేక మాయోపాయములతో పర పురుషుని తనకు సాధ్యుని (స్వాధీనునిగా)గా చేసుకొనునో ఆ కులస్త్రి చంద్రసూర్యులున్నంత సుదీర్ఘ కాలము అంధకూపమను నరకములో నుండును. దేవవేశ్య తన జాతి ధర్మమును బట్టి (ఏ పురుషునితో విహరించినను) స్వర్గమునే చేరబోవును. అట్టి దేవవేశ్యనవమానించుట వలన పురుషుడు నిశ్చయముగా అపరాధి యగును. ఓ జగత్కర్తా! శాపము పొందినవాడు సంసార సముద్రములో బడిన పాపి దేని వలన శుద్ధి పొందునో ఆ ఉపాయమును చేయుదును. క్షణకాలమగుము.

ఏతస్మిన్నంతరే కశ్చిదాజగామ హరేః పురః

ద్వారపాల: శీఘ్రగామీత్యువాచ నతకంధరః

ఇట్లు పలుకుచుండగా నింతలో ద్వారపాలకుడొకడు త్వరగా వచ్చి శిరస్సు వంచి శ్రీహరి ముందు ఇట్లు పలికెను.

ద్వారపాలక ఉవాచ - ద్వారపాలకుడనెను :

ఆన్యబ్రహ్మాండాధిపతీర్ర్బహ్మా దశముఖః స్వయం

ద్వారే తీష్ఠన్ మహాభక్తస్త్వాం ద్రష్టుం స్వయమాగతః

ద్వారపాల వచః శ్రుత్వా స చైవానుమతిం దదౌ

ద్వారపాలాజ్ఞయా బ్రహ్మా తుష్టావాగత్య భక్తితః

 స్తోత్రైరతివిచిత్రైశ్చ చతుర్వక్త్రాఽశ్రుతైరహో

స్తుత్వోవాసాజ్ఞయా విష్ణోః కృత్వా పశ్చాచ్చతుర్ముఖం

నారాయణో ద్వారపాలానిత్యువాచ చతుర్భుజాన్

ఆగంతుకం జనమపి ప్రవేశయత సాదరం

“వేరొక బ్రహ్మాండాధిపతియైన దశముఖ బ్రహ్మ మహాభక్తుడు నిన్ను దర్శించుటకు వచ్చి ద్వారప్రదేశమున నీలిచియున్నాడు" అని అనెను. ద్వారపాలకుని ఆ వాక్కు విని శ్రీహరి వచ్చిన వ్యక్తిని లోనికి పంపుట కనుమతి నిచ్చెను. ద్వారపాలకుని ఆజ్ఞతో ఆ పదితలల బ్రహ్మ లోనికి వచ్చి భక్తితో చతుర్ముఖ బ్రహ్మ ఇంతకు ముందు వినని చిత్ర విచిత్రములైన స్తోత్రములతో స్తుతించెను. స్తుతించి పిదప శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞ వలన చతుర్మునీ ముందు కూర్చుండెను. శ్రీమన్నారాయణుడు చతుర్భుజులైన తన ద్వారపాలకులను పిలిచి దర్శనార్థము వచ్చిన వారిని కూడ ఆదరముతో లోపలికి ప్రవేశ పెట్టుడని చెప్పెను.

ఏతస్మిన్నంతరే తత్ర బృందావన వినోదిని

ఆజగామాతిప్రణతో బ్రహ్మా శతముఖః న్వయం

దివ్యైః స్తోత్రైశ్చ తుష్ఠాప నిగూఢమతిసుందరైః

 స్తుత్వోవాస వరైః స్తోత్రైః సర్వేషామశ్రుతైరహా

తదనంతరయోరగ్రే భక్త్యా శతముఖః స్వయం

జగద్విదౌ సఖాయాం చ తత్ర తిష్ఠతి తత్క్షణే

 ఆజగామాన్య బ్రహ్మాండాధిపో బ్రహ్మా హరేః పురః

 సహస్రవదనః శ్రీమాన్ భక్త్యా నమ్రాత్మకంధరః

స్తుత్వోవాస వరైః స్తోత్రైః సర్వేషామతిరహో

తం చ వప్రచ్ఛ సర్వేషాం బ్రహ్మాండానాం చ బ్రహ్మణాం

వార్తా విషయణాం చైవ సురాణాం చ క్రమేణ చ

 చతుర్ముఖస్య తాన్ దృష్ట్వా దర్పభంగో బభూవ హ

ఓ బృందావన వినోదినీ! (రాధనుద్దేశించి కథలను చెప్పు శ్రీకృష్ణుడు పిలిచిన సంబోధన! ఇంతలో మిక్కిలి వినయముతో వంగియున్న శతముఖ బ్రహ్మ (నూరు తలల బ్రహ్మ) అక్కడికి వచ్చాను, మిక్కిలి సుందరములు సర్వజీవులకు ఆశ్రుతములు (ఇంతకు ముందు విననివి) శ్రేష్ఠములునైన దివ్య స్తోత్రములతో గంభీరము (తత్త్వార్ధము గలవి గా నున్న వాటితో నుతించి ఆ ప్రభువు సభలో ముందు వచ్చియున్న బ్రహ్మలకన్న ముందు కూర్చుండెను. ఇంతలో ఇంకొక బ్రహ్మాండాధిపతియైన సహస్రవదన బ్రహ్మ (వేయి ముఖములవాడు) శ్రీహరి ముందుకు వచ్చి భక్తితో వంగిన తలలు గలవాడై సభలోని బ్రహ్మలకందరికి ఇంతకు ముందు విననట్టి ప్రశస్తమైన స్తోత్రములతో నుతించి కూర్చుండెను. అప్పుడు స్వామి ఆ సహస్ర ముఖుని అన్ని బ్రహ్మాండముల యొక్కయు, ఆ బ్రహ్మాండముల బ్రహ్మల యొక్కయు ఆయా బ్రహ్మాండములందలి దేవతల యొక్కయు వార్తలను వరుసగా ప్రశ్నించెను. చతుర్ముఖ బ్రహ్మకు ఆ బ్రహ్మలను చూచీ గర్వభంగమాయెను.

ఆత్మానం విష్ణుసదృశం మన్యమానన్య దర్పతః

అన్యాన్న దర్శయామాస బ్రహ్మాండస్థాన్ విధీన్ హరిః

దృష్ట్వా చ కృపయా తత్ర మృత తుల్యం చతుర్ముఖం

గర్వముతో తనను విష్ణువుతో సమానునిగా భావించుచున్న చతుర్ముఖ బ్రహ్మకు ఇట్లు గర్వభంగమై చచ్చినవాని వలె ఉండగా శ్రీహరి చూచీ దయదలచి ఇతర బ్రహ్మాండములందలి బ్రహ్మలను చూపలేదు.

యావంతీ గాత్రలోమాని సంతి నారాయణన్య మే

తత్రమాణాశ్చ బ్రహ్మాణః బ్రహ్మాండా: నంతి నంతరం

నారాయణం ప్రణమ్యాశు జగ్ముస్తే స్వాలయం ప్రతి

స మేనే విధిరాత్మానమత్యల్ప విషయాధిపం

వవ్రచ్ఛ వ్రణతం విష్ణుర్లజా నమ్ర చతుర్ముఖం

పద తత్కిమీదం దృష్ఠం స్వప్నవద్భవతాఽధునా

నారాయణ వచః శ్రుత్వా విధిరిత్యుక్త వాంస్తదా

నా వాడైన నారాయణుని యొక్క శరీరమందెన్నీ రోమములున్నవో అన్ని సంఖ్యల బ్రహ్మలు బ్రహ్మాండములు ఉన్నవి. ఆ వచ్చిన బ్రహ్మలు నారాయణునికి నమస్కరించి తమ తమ లోకములకు (బ్రహ్మాండములకు వెళ్లిరి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ తాను మిక్కిలి చిన్నదైన దేశమునకు (బ్రహ్మాండమునకు) అధిపునిగా భావించెను. స్వామికి నమస్కరించెను. లజ్జతో శిరస్సు వంచుకొన్న నాలు తలల బ్రహ్మను చూచి విష్ణువడిగెను. “నీవిప్పుడు స్వప్నము వలె ఏది చూచితివో దానిని చెప్పుము”. శ్రీమన్నారాయణుని మాట విని విధి ఇట్లు పలికెను.

భూతం భవ్యం భవిష్యం చ తన మాయా సముద్భవం

ఇత్యేవముక్త్వా స విధిస్తస్థౌ సంసది లజ్జయా

సర్వాంతర్యామీ భగవాన్ తస్యోపాయం వినిర్మమే

 “స్వామీ! భూత భవిష్యద్వర్తమానములన్నియు నీ మాయ వలన ఏర్పడినవే”. ఇట్లు పలికి ఆ సభలో సిగ్గుతో నిలిచియుండెను. సర్వాంతర్యామియైన ఆ భగవంతుడు అతనిశాప విముక్తికి ఒక ఉపాయము చేసెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారాయణ నారదసంవాదే మోహినీ శాప బ్రహ్మదర్ప భంగో నామ త్రయస్త్రింశోఽధ్యాయః.

ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన మోహినీ శాపము బ్రహ్మగర్వభంగము అనెడి ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.