బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

92 - అధ్యాయము

మూ శ్రీనారాయణ ఉవాచ :

శ్రీకృష్ణ ప్రేరితో హృష్టః ప్రణమ్యచ గణేశ్వరం

స్మరన్నారాయణం శంభుం దుర్గాం లక్ష్మీం సరస్వతీం

గంగాంచ మనసిధ్యాత్వా దిగీశం తం మహేశ్వరం

ప్రజగామోద్ధవశ్చైవ దృష్ట్వా మంగల సూచకం

శుశ్రావదుందుభిం ఘంటానాదం శంఖధ్వనిం తథా

హరిశబ్దంచ సంగీతం శుశ్రావమంగళ ధ్వనిం

పతిపుత్రవతీం సాధ్వీం ప్రదీపం మాల్యదర్పణం

పరిపూర్ణతమం కుంభం దధిలాజ ఫలానిచ

దూర్వాంకురం శుక్ల ధాన్యం రజతం కాంచనం మధు

బ్రాహ్మణానాంసమూహంచ కృష్ణసారం వృషం ఘృతం

సద్యోమాంసం గజేంద్రంచ నృపేంద్రం శ్వేత ఘోటకం

పతాకాం నకులం చాషం శుక్లంపుష్పంచ చందనం

దృష్ట్వైవం పథకల్యాణం ప్రాపవృందావనం వనం

దదర్శపురతో వృక్షం భాండీరవట మక్షయం

స్నిగ్ధపూర్ణం రక్తవర్ణం పుణ్యదం తీర్థమీప్సితం

సువేషానాలకాంశ్చైవ రక్తభూషణ భూషితామ్

వదతోబాలకృష్ణేతి రుదతశ్చ శుచాన్వితాన్

తానాశ్వాస్యయయౌ దూరం ప్రవిశ్యనగరం ముదా

దదర్శనందశిబిరం రచితం విశ్వకర్మణా

మణిరత్న వినిర్మాణం ముక్తి మాణిక్యహీరకైః

పరిచ్ఛన్నం మనోరమ్యం సద్రత్నకలశాన్వితం

ద్వారం చిత్ర విచిత్రాఢ్యం దృష్ట్వాచ ప్రవివేశ సః

అవరుహ్యరథాత్తూర్ణం తస్థౌతత్ప్రాంగణే ముదా

యశోదా రోహిణీ శీఘ్రం పప్రచ్ఛకుశలం పరం

ఆసనంచ జలం గాంచ మధుపర్కం దదౌముదా

క్వనందః క్వబలః కృష్ణః సత్యం తత్కథయోద్ధవ

ఉద్ధవః కథయామాస సర్వం భద్రంక్రమేణచ

సార్థంచ బాలకృష్ణాభ్యాం నందః సానందపూర్వకం

ఆయాస్యతి విలంబేన కృష్ణోపనయనావధి

యుష్మాకం కుశలంతత్వం విధాయ విధిపూర్వకం

అహం యాస్యామి మథురాం యశోదే శృణుసాంప్రతం

శ్రుత్వామంగల వార్తాంచ యశోదా రోహిణీముదా

బ్రాహ్మణాయ దదౌరత్నం సువర్ణం వస్త్ర మీప్సితం

ఉద్ధవంభోజయామాసమిష్టాన్నంచ సుధోపమం

మణిశ్రేష్ఠంచ రత్నంచ దదౌతస్మైచ హీరకం

వాద్యంచ వాదయామాస భద్రం నానావిధం తథా

బ్రాహ్మణాన్ భోజయామాస కారయామాస మంగలం

వేదాంశ్చపాఠయామాస పరమానంద పూర్వకం

శంకరం పూజయామాస విప్రద్వారా పరం విభుం

నానోపహారై ర్నైవేద్యైః పుష్పధూప ప్రదీపకైః

చందనైః వస్త్రతాంబూలై: మధుగవ్యఘృతాదిభిః

భవానీం పూజయామాస శ్రీవృందారణ్య దేవతాం

షోడశోపచారైః ద్రవ్యైశ్చ బలిభిః వివిధైర్మునే

మహిషాణాం శతం శుద్ధం ఛాగలానాం సహస్రకం

మేషాణామయుతం శుద్ధం యుక్త మా దాయపంచకం

బ్రాహ్మణేభ్యః స్వర్ణశతం ధేనూనాంచ శతం తథా

ప్రదదౌ దక్షిణం తూర్ణం కృష్ణ కల్యాణ హేతవే

ఉద్ధవం పూజయామాస సాదరంచ పునః పునః

నారాయణుని వచన మిట్లా - శ్రీకృష్ణునితో ప్రేరేపింపబడి ఆనందంతో గణేశ్వరునకు నమస్కరించి, నారాయణుని, శంభుని, దుర్గను, లక్ష్మిని, సరస్వతిని స్మరించి (1) గంగను మనస్సులో ధ్యానించి, దిగీశుడైన ఆ మహేశ్వరుని ధ్యానించి మంగళసూచలను (శకునాలు) చూసి, ఉద్ధవుడు బయలు దేరాడు. (2) దుందుభిధ్వనిని, ఘంటాధ్వనిని, శంఖధ్వనిని విన్నాడు. హరిశబ్దమును, సంగీతమును మంగళధ్వనినీ విన్నాడు. (3) పతిపుత్రులు గల సాధ్విని, దీపమును మాలలు అద్దము, నిండిన కుండను, పెరుగు, పేలాలు,పండ్లు (4) గరిక మొలక తెల్లధాన్యము, వెండి, బంగారము, తేనె, బ్రాహ్మల సమూహము, కృష్ణసారమును (జింక) వృషభమును, నేయిని, (5) కొత్త (ఫ్రెష్) మాంసమును, గజేంద్రమును, నృపేంద్రుని, తెల్లని గుఱ్ఱన్ని, ధ్వజమును, ముంగిసను, పాలపిట్టను, తెల్లని పుష్పాన్ని, చందనమును (6) ఈ విధంగా దారిలో శుభసూచలను చూస్తూ వృందావన వనమునకు చేరాడు. ఎదురుగా అత్తి చెట్టును, అక్షయమైన వటవృక్షాన్ని చూచాడు. (7) నిగనిగలాడుతున్న, ఎరుపు రంగుగల, పుణ్యమునిచ్చే, ఈప్సితమైన తీర్థమును మంచివేషముగల, ఎర్రని భూషణములతో అలంకరింపబడ్డ బాలకులను చూచాడు. (8) శుచిగా ఉండి బాలకృష్ణ! అని అంటూ రోదిస్తున్న వారినోదార్చి దూరంగా వెళ్ళాడు. ఆనందంతో నగరంలో ప్రవేశించి (9) విశ్వకర్మ నిర్మించిన నందుని శిబిరాన్ని చూచాడు. ఆభవనము మణులతో రత్నములతో నిర్మింపబడింది.ముత్యములు మాణిక్యములు వజ్రాలు వానితో ఆ భవనం నిర్మించారు. (10) రత్నాలతో కప్పబడి, మనోహ్లాదమైన, ఉత్తమ రత్నకలశములతో కూడిన, చిత్రమైన విచిత్రములతో కూడిన ద్వారాన్ని చూచి ఆతడు ప్రవేశించాడు. (11) రథము పైనుండి త్వరగా దిగి ఆ ప్రాంగణమందు ఆనందంతో నిలబడినాడు. యశోద, రోహిణి వీరలు త్వరగా వచ్చి యోగక్షేమాలన్ని అడిగారు. (12) సంతోషంతో ఆసనం వేసి, నీటిని తాగటానికి) ఇచ్చి, ఆవును మధుపర్కమును ఇచ్చారు నందుడెట్లున్నాడు, బలరాముడు, కృష్ణుడు ఎట్లున్నారో, ఎక్కడున్నారో అదంతా ఉన్నదున్నట్లు చెప్పు, ఓ ఉద్ధవ! అని అడిగారు. (13) వారిక్షేమ సమాచారమంతా క్రమంగా ఉద్దవుడు చెప్పసాగాడు. బలరామకృష్ణులతో కూడినందుడు, ఆనందంగా ఉన్నాడని చెప్పాడు. (14) కృష్ణుని ఉపనయనం వరకు ఆలస్యంగా వస్తాడు. శాస్త్రానుగుణంగా ఉండవలసిన రీతిలో మీకు కుశలాన్ని చేకూర్చి (15) నేను మథురకు వెళ్తాను. యశోద! ఇప్పుడు విను అని అన్నాడు. యశోద, రోహిణులు నందుని, కృష్ణ బలరాముల, క్షేమ వార్తను విని ఆనందించారు. (16) ఆతనికి రత్నములు, సువర్ణము, వస్త్రములు కావలసినవి ఇచ్చారు. అమృతం లాంటి మధుర పదార్థాలను ఉద్దవునకు భుజింపచేశారు. (17) ఆతనికి ఉత్తమమైన మణులు, రత్నములు వజ్రములు ఇచ్చారు. అట్లాగే అనేక రకాలైన మంగళకరమైన వాద్యములను వాయింపచేశారు. (18) బ్రాహ్మణులను భుజింపచేశారు. మంగళక్రియలు చేశారు. మిక్కిలి ఆనందంతో వేదములను పఠింపచేశారు. (19) పరుడైన విభుని, విప్రుని ద్వారాశంకరుని పూజింపచేశారు. అనేక రకాలుగా తేబడిన పదార్థాలను నైవేద్యంగా ఇచ్చారు. పుష్పధూప దీపములతో (20) చందన, వస్త్ర, తాంబూలములతో, మధువు గవ్యము, ఘృతము వీనితో పూజించారు. శ్రీవృందారణ్య దేవతయైన భవానిని పూజింపచేశారు. (21) ఓముని! షోడశోపచార ద్రవ్యములతో ఉపచరించారు. రకరకాలైన బలులు నివేదించారు. నూరు మహిషములను, శుద్దమైన వేయిమేకపోతులను , (22) శుద్దమైన యోగ్యమైన పదివేలమేకలను తీసుకొని వచ్చి (ఐదేసి చొప్పున) బలిగా ఇచ్చారు. బ్రాహ్మణులకు నూరేసి బంగారు నాణములను, నూరేసి ఆవులను ఇచ్చారు. (23) కృష్ణునకు క్షేమము జరగాలని త్వరగా దక్షిణలు కూడా ఇచ్చారు. ఆదర పూర్వకంగా మాటిమాటికి ఉద్దవుని పూజించారు.

మూ!! సమాశ్వాస్య యశోదాంచ రోహిణీం గోపబాలకాన్

వృద్ధాన్ గోపాలికాః సర్వాః ప్రయయూరాసమండలం

దదర్శరాసం రుచిరంచంద్రమండలవర్తులం

శ్రీరామకదలీస్తంభ శతకైరుపశోభితం

యుకైశ్చస్నిగ్ధవసనైః చందనానాంచ పల్లవైః

పట్టసూత్రనిబద్ధైశ్చశ్రీయుక్తమాల్య జాలకైః

దధిలాజ ఫలైః పట్టైః పుష్పైః దూర్వాంకురైరపి

చందనాగురు కస్తూరీ కుంకుమైః పరిసంస్కృతం

వేష్టితం రక్షితం యత్నాత్ గోపికానాం త్రికోటిభిః

త్రిలక్షైః సుందరైః రమ్యైః సంసిక్తం రతిమందిరైః

లక్షగో పైః పరివృతం కృష్ణా గమనశంకితైః

యమునాం దక్షిణాం కృత్వా ప్రయయౌమాలతీ వనం

చందనానాం చంపకానాం యూధికానాంతథైవచ

కేతకీ మాధవీనాంచ వనం కృత్వా ప్రదక్షిణం

వకుళానాం వంజులానాం అశోకానాంచ కాననం

మల్లికానాంపలాశానాం శిరీషాణాం తథైవచ

ధాత్రీణాం కాంచనానాంచ కర్ణికానాంవనం తథా

నాగేశ్వరాణాం విపినం లవంగానాంతథైవచ

వనంచ శాలతాలానాం హింతాలానాంవనం తథా

పనసానాం రసాలానాం లాంగలీనాం మనోహరం

మందార కాననం రమ్యం వామంకృత్వాచ సత్వరం

దృష్ట్వా కుందవనం రమ్యం సంప్రాప్యమధుకాననం

పుంస్కోకిలానాం శబ్దేన మధురేణ సమన్వితం

మధువ్రత సమూహానాం మధుర ధ్వనిపూరితం

వన్యవృక్షైః పరివృతం మాధ్వీకాధార మీప్సితం

వాతేన వన్య పుష్పాణాం పరితః సురభీకృతం

తద్దృష్ట్వారాజమార్గేణ యశోదోక్తేన సాంప్రతం

యయౌశీఘ్రం నిరుద్విగ్నం రహస్యం బదరీవనం

శ్రీఫలానాంచ నింబానాం నారింగాణాం వనంతథా

పద్మానాం కరవీరాణాం తులసీనాంచ కాననం

దృష్ట్వా రక్తిమ వర్ణంచ సుపక్వఫలమీప్సితం

తదేవ వామతః కృత్వా వివేశ కదలీనం

అతీవ నిర్జనేరమ్యే దదర్శరాధికాశ్రమం

మణీంద్రాణాంచ ప్రాకారం పరిఖాదుర్గవేష్టితం

అత్యగమ్యం రిపూణాంచ మిత్రాణాం సుగమం సుఖం

గోప్యం సంకేతమార్గంచ రక్షకైః పరిరక్షితం

నానాచిత్రవిచిత్రాఢ్యం నిర్మితం విశ్వకర్మణా

మణీంద్రముక్తామాణిక్య హీరహారోజ్జ్వలం పరం

రత్నేంద్ర సారరచితం రత్నస్తంభైః సుశోభితం

రత్నసోపాన సంసక్త మందిరేణ మనోహరం

అమూల్యరత్న రచితం కలశైః పరిశోభితం

వహ్నిశుద్ధాంశుకాభిశ్చ పతాకాభిః పరిష్కృతం

సద్రత్న దర్పణోత్కృష్టం చర్చితం శ్వేతచామరైః

దదర్శసింహద్వారంచయుక్తం రత్న కపాటకైః

యశోదనురోహిణిని, గోపబాలకులను ఓదార్చి వృద్దులను గోపాల బాలికలను అందరిని ఓదార్చి రాసమండలానికి వెళ్ళాడు. (25) చంద్రమండలంలా వర్తులంగా ఉన్న అందమైన రాసమండలాన్ని చూచాడు. మారేడు, వాస్తూకము, అరటి స్తంభములు ఇవి నూర్లకొలది వెలిగిపోతున్నాయి. (26) తగినట్టి మృదువైన వస్త్రములు, చందనపు చిగుళ్ళు, పట్టు దారంతో కట్టబడిన మారేడు దళములు గల మాలలు గల కిటికీలున్నాయి. (27) పెరుగు, పేలాలు, పండ్లు, పట్టు వస్తువులు, పూలు, గరికపోచలు, చందనము అగురు, కస్తూరి, కుంకుమ వీటన్నిటితో అంతటా సంస్కరింపబడింది. (28) మూడు కోట్ల గోపికలు దానినిచుట్టి ఉన్నారు, ప్రయత్నంగా దాన్ని రక్షిస్తున్నారు. సుందరమైన రమ్యమైన మూడు లక్షల రతి మందిరములతో తడుపబడింది. (అలంకరింప) (29) కృష్ణుడు వస్తాడని అనుమానిస్తున్న లక్షమంది గోపాలురు దాన్ని చుట్టి ఉన్నారు. యమున నది ఎడమైపునుండి మాలతీ వనానికి వెళ్ళాడు. (30) చందనపు చెట్లకు, చంపకపు చెట్లకు, అడవి మొల్లలకు, అట్లాగే మొగిలి, మాధవి వనములకు ప్రదక్షిణం చేసి (31) పొగడ, ప్రబ్బలి, అశోకముల అడవిని చుట్టి, మల్లిక, మోదుగ, దిరిశెన వనములను అట్లాగే (32) ఉసిరి, కాంచనపు చెట్లు, కర్ణికార చెట్ల వనమును, అట్లాగే లవంగము, నాగేశ్వరముల విపినమును, అట్లాగే (33) సాలవృక్షముల, తాలవృక్షముల, హింతాలవృక్షముల వనమును, అట్లాగే, పనస, మామిడి, మనోహరమైన లాంగలి వనములను, (34) రమ్యమైన మందారకాననమును (చుట్టి) ఇవన్నీ ఎడమవైపున ఉండగా త్వరగా వెళ్ళాడు. అందమైన కుంద వనమును చూచి, మధుకాననమును చేరి(35)నాడు. పుంస్కోకిలల మధురమైన శబ్దంతో నిండిందా వనము. అనేకమైన తుమ్మెదలు గుంపులుగా తమ మధుర ధ్వనిని విన్పిస్తున్నాయి. ఆవనం నిండిందా ధ్వనితో (36) అడవి చెట్లతో చుట్టబడిందా ప్రదేశం. ఈప్సితమైన ఇప్పచెట్లకు ఆధారమైనది. గాలి, అడవి పూలవాసనతో ఆప్రదేశాన్నంతా సువాసనగా చేసింది. (37) అది చూచి యశోద చెప్పిన రాజమార్గం గుండా అప్పుడు ఉద్వేకరంకాని, రహస్యమైన బదరీవనానికి త్వరగా వెళ్ళాడు. (38) మారేడు పండ్లు, వేప, నారింజ వనము, అట్లాగే పద్మముల, కరవీరముల (గన్నేరు), తులసి వృక్షముల అడవిని (39) చూచి, ఎర్రనైన పండిన, ఇష్టమైన పండ్లను చూచి, దాని కుడి ప్రక్కనుండి కదళీ వనమును ప్రవేశించాడు. (40) మిక్కిలి నిర్జనమైన అడవిలో అందమైన, రాధిక ఆశ్రమమును చూచాడు. శ్రేష్ఠమైన మణులతో చేసిన ప్రాకారము, కందకము, దుర్గము ఇవి ఆ ఆశ్రమం చుట్టూ ఉన్నాయి. (41) శత్రువులు ప్రవేశించటానికి ఏమాత్రం వీలులేనిది, మిత్రులకు ప్రవేశించుటకు సులభ సాధ్యమైంది, సుఖకరమైనది అది రహస్యమైనది. సంకేత మార్గంలో రక్షకులు పరిరక్షిస్తున్నారు. (42) విశ్వకర్మదీనిని నిర్మించాడు. అది రకరకాల చిత్రవిచిత్రములతో కూడి ఉన్నది. శ్రేష్ఠమైన మణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు వీటి హారములతో ప్రకాశిస్తున్నది, పరమమైనది. (43) శ్రేష్ఠమైన రత్నములలో ఉత్తమమైన వానితో చేయబడింది. రత్న స్తంభములతో చక్కగా ప్రకాశిస్తున్నది. రత్నసోపానములతో కూడిన మందిరముతో మనోహరముగా నున్నది. (44) అమూల్యమైన రత్నములతో చేయబడింది. కలశములతో అంతటా ప్రకాశిస్తున్నది. అగ్నితో శుద్ధిచేయబడిన వస్త్ర ముల పతాకములతో అలంకరింపబడినది. (45) మంచి రత్నములతో చేసిన దర్పణముల (అద్దముల)తో ఉత్కృష్టమైనది, తెల్లని చామరలతో నింపబడింది. రత్నకవాటములు గల సింహద్వారమును చూచాడు, ఉద్ధవుడు.

మూ ద్వారోపరి విచిత్రంచ రమ్యం వృందావనం వనం

కదంబకాననం రమ్యం తద్వస్త్ర హరణాదికం

విశ్వకర్మ విరచితం సురమ్యంరాసమండలం

నానారత్నకుటీరంచ గోపగోపీసమన్వితం

రక్షితం గోపికాలక్షైః వేత్రహస్తైః మనోహరైః

స్వచ్ఛందా చరణైః శశ్వదమితైః బలిభిర్ముదా

తద్ద్వారం పురతో దృష్ట్వా విలంఘ్యచ జగామ సః

ద్వితీయం ద్వారముల్లంఘ్య తస్మాదుత్తమ మీప్సితం

ద్వారం చతుర్థం సంప్రాప్య సర్వస్మాచ్చ విలక్షణం

తత్పశ్చాత్పంచమం ద్వారం దదర్శ చిత్రముత్తమం

ద్వారషట్కంచ ప్రయయౌ సర్వత్రరుచిరం పరం

రామరావణయో ర్యుద్ధం భిత్తిచిత్రం మనోహరం

దశావతారం విష్ణోశ్చ కృత్రిమం రాసమండలం

యమునాంజలకేలించ రచితాం విశ్వకర్మణా

గోపికానాం సహస్రేణ షష్ఠం ద్వారంచ రక్షితం

రత్నేంద్రసారనిర్మాణ భూషణై ర్భూషితేనచ

సద్రత్న దండహస్తేన హీరకైః భూషితేనచ

మణీంద్రముక్తా మాణిక్య హీరహారాన్వితేనచ

మాధవీ తత్రృధానా సాపప్రచ్చసాంప్రతం శివం

దదౌ ప్రత్యుత్తరం సర్వం క్రమేణచ స ఉద్ధవః

గత్వావిజ్ఞాపయామాస రాధా ప్రియసఖీగణం

సా మాధవీ మహాహృష్టా తత్ర సంస్థాప్య తం ముదా

శ్రుత్వా మంగళ వార్తాంచ రాధా ప్రియసఖీగణైః

కృత్వా శంఖధ్వనిం ఘంటామృదంగపటహ స్వనం

కృత్వా నిర్మంఛనం శీఘ్రముద్ధవం ప్రియమాగతం

హృష్టా ప్రవేశయామాస రాధాభ్యంతరముత్తమం

అమూల్య రత్ననిర్మాణం గత్వామందిరముత్తమం

దదర్శపురతో రాధాం కుహ్వాం చంద్రకలోపమాం

సుపక్వ పద్మనేత్రంచ శయానాం శోకమూర్ఛితాం

రుదంతీం రక్తవదనాం క్లిష్ఠాంచ త్యక్తభూషణాం

నిశ్చేష్ఠాంచ నిరాహారాం సువర్ణ వర్ణ కుండలాం

శుష్కితాధర కంఠాం చ కించిన్నిశ్వాస సంయుతాం

ప్రణనామ చ తాందృష్ట్వా భక్తి నమ్రాత్మకంధరః

పులకాంచితసర్వాంగో భక్త్యా భక్తః ఉద్ధవః

ఉద్ధవ ఉవాచ :

వందే రాధాపదాంభోజం బ్రహ్మాదిసుర వందితం

యత్కీర్తి కీర్తనేనైవ పునాతి భువనత్రయం

నమోగోకుల వాసిన్యై రాధికాయైనమోనమః

శతశృంగనివాసిన్యై చంద్రవత్యై నమోనమః

తులసీ వనవాసిన్యై వృందారభ్యై నమోనమః

రాసమండల వాసిన్యై రాసేశ్వర్యై నమోనమః

విరజాతీరవాసిన్యై వృందాయైచ నమోనమః

వృందావనవిలాసి స్యై కృష్ణాయైచ నమోనమః

నమః కృష్ణ ప్రియాయైచ శాంతాయైచ నమోనమః

కృష్ణ వక్షఃస్థితాయైచ తత్ప్రియాయై నమోనమః

ద్వారం పైన విచిత్రమైన రమ్యమైన వృందావనమను వనమును, రమ్యమైన కదంబవనమును, వారివస్త్రాపహరణాదికమును (47) విశ్వకర్మ నిర్మించిన మిక్కిలి అందమైన రాసమండలమును చూచాడు. గోపాలురు గోపికలతో కూడిన రకరకాల రత్న కుటీరములను చూచాడు. (48) అందమైన వేత్రములను చేత ధరించిన లక్ష గోపికలతో రక్షింపబడిన ఎప్పుడూ స్వేచ్ఛగా విహరించే, అధిక బలవంతులున్న వానిని ఆనందంగా చూచాడు. (49) ఆ ద్వారాన్ని ఎదురుగా చూచి, దానిని దాటి ఆతడు వెళ్ళాడు. రెండవ ద్వారాన్ని దాటాడు. దానికన్న ఉత్తమమైన, ఇష్టమైన దానిని దాటాడు. (50) అన్నిటి కన్నా విలక్షణమైన నాలుగవ ద్వారానికి చేరాడు. విచిత్రమైన, ఉత్తమమైన ఐదవ ద్వారాన్ని ఆ పైన చూచాడు. (51) అంతట రుచిరంగా ఉన్న, పరమమైన ఆరవ ద్వారానికి చేరాడు. అక్కడ గోడల పై రామరావణుల యుద్ధము అందంగా చిత్రితమైనది. (52) విష్ణువు యొక్క పది అవతారములు, కృత్రిమమైన రాసమండలమును, యమునా నదిని, జలకేళిని, చూచాడు. ఇవన్నీ విశ్వకర్మ ఏర్పరచాడు. (53) ఆరవ ద్వారాన్ని వేయిమంది గోపికలు రక్షిస్తున్నారు. వారు శ్రేష్ఠమైన, రత్నములలో ఉత్తమమైన వానితో చేయబడిన అలంకారములను అలంకరించుకున్నారు. (54) వజ్రములు పొదిగిన మంచి రత్నములతో చేసిన దండమును చేత ధరించారు. ఉత్తమమైన మణులు, ముత్యములు, మాణిక్యములు, వజ్రములు వీటితో నిర్మించిన హారముల ధరించారు. (55) వారికి నాయకురాలైన మాధవి ఇప్పుడు ఉద్ధవుని క్షేమ సమాచారం అడిగింది. ఆ ఉద్ధవుడు క్రమంగా సమాధానం పూర్తిగా చెప్పాడు. (56) రాధాప్రియ సఖీగణము వెళ్ళి చెప్పారు. ఆ మాధవి చాలా ఆనందించి, ఆనందంతో ఆతనిని అక్కడ ఉంచింది. (57) రాధ తన ప్రియసఖీ గణముతో మంగళ వార్తను విని ఆనందంతో శంఖధ్వనిని, గంట, పటహము, మృందగము వీని ధ్వనిని చేసింది. (58) ప్రియమైనవాడు, వచ్చినవాడు ఐన ఉద్ధవుణ్ణి త్వరగా యోగక్షేమాన్ని ప్రశ్నించింది. ఆనందంతో, ఉత్తమైన తన అభ్యంతర మందిరంలోకి రాధ ఆతనిని ప్రవేశ పెట్టమంది. (59) అమూల్యమైన రత్నములతో నిర్మింపబడిన శ్రేష్ఠమైన మందిరానికి వెళ్ళి, అమావాస్యనాటి (చంద్రుడులేని) చంద్రకళలా ఉన్న రాధను ఎదురుగా చూచాడు. (60) బాగా వికసించిన పద్మమువంటి నేత్రములు కలది, నిద్రిస్తోంది, శోకం వల్ల మూర్చిల్లింది, ఏడుస్తున్నది, ముఖం ఎర్రబారింది, బాధపడుతోంది సొమ్ములన్నీ తీసివేసింది. (61) చేష్టలుడిగి ఉంది. ఆ హారం తినటం లేదు. బంగారం రంగుగల కుండలాలను ధరించింది. ఆమె గొంతు, పెదవి ఎండిపోయాయి. కొద్ది ఊపిరితో ఉంది. (62) ఆమెను చూచి భక్తితో తన మెడను వంచి ఆమెకు నమస్కరించాడు. భక్తితో భక్తుడైన ఆ ఉద్ధవుని శరీరమంతా పులకాంకురాలు పొందింది. (63) ఉద్దవుని వచనమిట్లా - రాధ పాదపద్మములకు నమస్కారము. ఆమె బ్రహ్మాది దేవతలతో నమస్కరింపబడేది. ఆమె కీర్తిని, కీర్తి స్తేనే ముల్లోకాలు పవిత్రమౌతాయి. (64) గోలోకంలో ఉండే రాధికకు నమస్కారము. శతశృంగవాసురాలికి చంద్రవతికి నమస్కారము. (65) తులసీవన వాసురాలికి వృందారణ్య వాసురాలికి నమస్కారము. రాసమండల వాసురాలికి, రాసేశ్వరికి నమస్కారము. (66) విరజాతీర నివాసురాలికి వృందకు నమస్కారము బృందావన విలాసినికి, కృష్ణకు నమస్కారము. (67) కృష్ణుని ప్రియకు శాంతురాలికి నమస్కారము. కృష్ణుని వక్షః స్థలనివాసురాలికి, కృష్ణునికి ప్రియమైన ఆమెకు ) ప్రియురాలికి నమస్సులు.

మూII నమోవైకుంఠవాసిన్యై మహాలక్ష్మ్యై నమోనమః

విద్యాధిష్ఠాతృదేవ్యైచ సరస్వత్యై నమోనమః

సర్వైశ్వర్యాధిదేవ్యైచ కమలాయై నమోనమః

పద్మనాభప్రియాయైచ పద్మాయైచ నమోనమః

మహావిష్ణోశ్చ మాత్రేచ పరాద్యాయై నమోనమః

నమః సింధుసుతాయైచ మర్త్యలక్మ్యై నమోనమః

నారాయణ ప్రియాయైచ నారాయణ్యే నమోనమః

నమోఽస్తు విష్ణుమాయాయై వైష్ణవ్యైచ నమోనమః

మహామాయాస్వరూపాయై సంప్రదాయై నమోనమః

నమ: కళ్యాణ రూపిణ్యై శుభాయైచ నమోనమః

మాత్రే చతుర్ణాం వేదానాం సావిత్ర్యైచ నమోనమః

నమోదుర్గవినాశిన్యై దుర్గాదేవ్యై నమోనమః

తేజఃసు సర్వదేవానాం పురాకృతయుగే ముదా

అధిష్టాన కృతాయైచ ప్రకృత్యైచ నమోనమః

నమః త్రిపురహారిణ్యై త్రిపురాయై నమోనమః

సుందరీషుచ రమ్యాయై నిర్గుణాయై నమోనమః

నమోనిద్రాస్వరూపాయై నిర్గుణాయై నమోనమః

నమోదక్షసుతాయైచ నమః సత్యై నమోనమః

నమః శైలసుతాయైచ పార్వత్యైచ నమోనమః

నమోనమస్తపస్విన్యై హ్యుమాయైచ నమోనమః

నిరాహార స్వరూపాయై హ్యపర్ణాయై నమోనమః

గౌరీ లోకవిలాసిన్యై నమోగౌర్యై నమోనమః

నమః కైలాసవాసిన్యై మాహేశ్వర్యై నమోనమః

నిద్రాయైచ దయాయైచ శ్రద్ధాయైచ నమోనమః

నమోధృత్యైక్షమాయై చ లజ్జాయైచ నమోనమః

తృష్ణాయైక్షుత్ స్వరూపాయై స్థితికర్యై నమోనమః

నమః సంహార రూపిణ్యై మహామార్యై నమోనమః

భయాయైచాభయా యైచ ముక్తిదాయై నమోనమః

నమః స్వధాయై స్వాహాయై శాంత్యైకాంత్యై నమోనమః

నమస్త్యుష్ట్యైచ పుష్ట్యైచ దయాయైచ నమోనమః

నమోనిద్రాస్వరూపాయై శ్రదాయైచ నమోనమః

క్షుత్పిపాసాస్వరూపాయై లజ్జాయైచ నమోనమః

నమోధృత్యైక్షమాయైచ చేతనాయై నమోనమః

సర్వశక్తి స్వరూపిణ్యై సర్వమాత్రే నమోనమః

అగ్నౌదాహస్వరూపాయై భద్రాయైచ నమోనమః

శోభాయై పూర్ణచంద్రేచ శరత్పద్మే నమోనమః

నాస్తి భేదోయథాదేవి దుగ్ధధావల్యయోః సదా

యథైవ గంధభూమ్యోశ్చ యథైవజలశైత్యయోః

యథైవ శబ్దనభసోః జ్యోతి స్సూర్యకయోర్యథా

లోకే వేదేపురాణేచ రాధామాధవయోస్తథా

చేతనం కురుకళ్యాణి దేహిమాముత్తరంసతి

ఇత్యుక్త్వా చోద్ధవస్తత్ర ప్రణనామపునః పునః

ఇత్యుద్ధవకృతం స్తోత్రంయఃపఠేద్భక్తి పూర్వకం

ఇహ లోకేసుఖం భుక్త్వా యాత్యంతే హరి మందిరం

అను! వైకుంఠవాసినికి మహాలక్ష్మికి నమస్కారము. విద్యాధిష్ఠాతృ దేవతకు సరస్వతికి నమస్కారము. (69) ఐశ్వర్యాని కంతకు అధిదేవతయైన కమలకు నమస్కారము. పద్మనాభుని ప్రియకు పద్మకు నమస్కారము. (70) మహావిష్ణువు తల్లికి పరాద్యకు నమస్కారము. సింధు సుతకు మర్త్యలక్ష్మికి నమస్కారము. (71) నారాయణ ప్రియకు నారాయణికి నమస్కారము. విష్ణుమాయకు వైష్ణవికి నమస్కారము. (72) మహామాయా స్వరూపురాలికి సంపదకు నమస్కారము. కళ్యాణ రూపిణికి, శుభురాలకు నమస్కారము. (73) నాలుగు వేదముల తల్లియైన ఆమెకు సావిత్రికి నమస్కారము. దుర్గ వినాశినికి దుర్గా దేవికి నమస్కారము. (74) ఇది వరలో కృతయుగంలో తేజస్వంతులలో సర్వదేవతల తేజస్సుకు, అధిష్టానమైన ప్రకృతికి ఆనందంతో నమస్కరిస్తున్నాను. (75) త్రిపుర సంహారికి త్రిపురకు నమస్కారము. సుందర స్త్రీలలో రమ్యమైన ఆమెకు నిర్గుణురాలుకు నమస్కారము. (76)నిద్రా స్వరూపురాలికి, నిర్గుణరాలికి నమస్కారము. దక్షసుతకు, సతికి నమస్కారము. (77) శైలసుతకు పార్వతికి నమస్కారము. తపస్వినికి, ఉమకు నమస్కారము. (78) నిరాహార స్వరూపురాలికి, అపర్ణకు నమస్కారము. గౌరీలోక విలాసినికి గౌరికి నమస్కారము. (79) కైలాసవాసినికి, మా హేశ్వరికి నమస్కారము. నిద్రా స్వరూపురాలికి దయాస్వరూపురాలికి, శ్రద్ధాస్వరూపురాలికి నమస్కారము. (80) ధృతి, క్షమ, లజ్జస్వరూపురాలికి నమస్కారము. తృష్ణ, క్షుత్తు స్వరూపురాలికి స్థితి కర్రికి నమస్కారము. (81) సంహార రూపిణికి మహామారికి నమస్కారము. భయకు, అభయ రూపురాలికి నమస్కారము. ముక్తిదాయినికి నమస్కారము. (82) స్వధకు, స్వాహారూపురాలికి, శాంతికి, కాంతికి నమస్కారము. తుష్టికి, పుష్టికి, దయా స్వరూపురాలికి, నమస్కారము. (83) నిద్రాస్వరూపురాలికి శ్రద్ధకు నమస్కారము. క్షుత్పిపాసా స్వరూపురాలుకు, లజ్జకు నమస్కారము. (84) ధృతికి క్షమకు, చేతన స్వరూపురాలికి నమస్కారము. సర్వశక్తి స్వరూపిణికి సర్వమాత్రకు నమస్కారము. (85) అగ్నిలోదాహ స్వరూపురాలైన ఆమెకు భద్రకు నమస్కారము. పూర్ణ చంద్రునిలో శోభకు శరత్పద్మంలో శోభకు నమస్కారము. (86) పాలకుదాని తెలుపుదనానికి భేదం లేనట్లే, వాసనకు భూమికి భేదం లేనట్లుగానే నీటికి చల్లదనానికి భేదం లేనట్లుగానే (87) 'ఆకాశానికి శబ్దానికి భేదం లేనట్లుగానే వెలుగుకు సూర్యునికి భేదం లేనట్లుగానే, లోకంలో వేదంలో పురాణంలో రాధామాధవులకు భేదంలేదు. (88) ఓ కళ్యాణి! మేలుకో. ఓ సతి! నాకు సమాధానమివ్వు. అని పలికి ఉద్ధవుడు అక్కడ మాటిమాటికి నమస్కరించాడు. (89) ఇట్లా ఉద్దవుడు చేసిన స్తోత్రాన్ని భక్తితో చదివిన వారు ఈలోకంలో సుఖాన్ని అనుభవించి, చివర హరి మందిరానికి వెళ్తారు.

మూ నభవేద్బంధువిచ్ఛేదో రోగః శోకః సుద్దారుణః

ప్రోషితాస్త్రీ లభేత్కాంతం భార్యా భేదీ లభేత్ప్రియం

అపుత్రోలభతే పుత్రాన్ నిర్దనోలభతే ధనం

నిర్భూమిః లభతే భూమిం ప్రజాహీనోలభేత్ప్రిజాం

రోగాద్విముచ్యతేరోనీ బధోముచేత బంధనాత్

భయాన్ముచ్యేతభీతస్తు ముచ్యతాపన్న ఆపదః

అస్పష్టకీర్తిః సుయశాః మూర్ఖభవతి పండితః

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే ఉత్తరార్దే నారాయణ నారద సంవాదే రాధాస్తోత్రే ద్వినవతితమోఽధ్యాయః

ఈ స్తోత్రం చదివిన వారికి బంధువిచ్చేదం కలుగదు. మిక్కిలి దారుణమైన రోగ, శోకములు కలుగవు. భర్త దేశాంతరమందున్న స్త్రీ తిరిగి భర్తను పొందుతుంది. భార్యకు దూరంగా ఉన్నవాడు తన ప్రియురాలిని పొందుతాడు. (91) సంతానహీనుడు పుత్రులను పొందుతాడు. ధనహీనుడు ధనాన్ని పొందుతాడు. భూమిలేనివాడు భూమిని, ప్రజా (సంతాన)హీనుడు ప్రజను పొందుతాడు. (92) రోగి రోగం నుండి ముక్తుడౌతాడు జైలులోని వాడు జైలునుండి ముక్తుడౌతాడు. భయంగలిగిన వాడు భయంనుండి ముక్తుడౌతాడు. ఆపదలో నున్నవాడు ఆపదనుండి ముక్తుడౌతాడు. అంతంతమాత్రం కీర్తిగలవాడు మంచికీర్తిమంతుడౌతాడు. మూరుడు పండితుడౌతాడు.(93) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రాధాస్తోత్రమనునది తొండది రెండవ అధ్యాయము ముగిసినది.