బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

7 - శ్రీకృష్ణ జన్మాఖ్యానము

నారద ఉవాచ :

తస్యాతిరేకం కృష్ణన్య మహత్పుణ్య కరం పరం

వద జన్మ మహాభాగ జన్మమృత్యుజరాపహం

వసుదేవః కన్య పుత్రః కస్య కన్యా చ దేవకీ

కో వసుర్దేవకీ కా వా వివాహం చోభయోర్వదా

కథం జఘాన కంసస్తత్పుత్ర షట్కం చ దారుణః

కస్మిన్ దినే హరేర్జన్మ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః

నారదడిట్లు పలికెను :

ఓ మహానుభావా! గొప్ప పుణ్యమును సమకూర్చునదియు జన్మమృత్యుజరా బాధలను తొలగించునదియు అగు శ్రీకృష్ణ జన్మను గూర్చి నాకు వినవలెనను ఆసక్తి గలదు. ఆ వృత్తాంతము జరిగినది జరిగినట్లు తెలుపుము. వసుదేవుడెవరి పుత్రుడు? దేవకి ఎవరి కూతురు? దేవకీ వసుదేవులెవరి ఆంశలతో జన్మించిరి. ఆ ఉభయుల వివాహమెట్లు జరిగెను? క్రూరుడైన కంసుడు వారి ఆరుగురు పుత్రుల నెట్లు చంపెను? శ్రీహరి జన్మ (అవతారము) ఏదినమున జరిగినది?

 శ్రీనారాయణ ఉవాచ :

కశ్యపో వసుదేవశ్చ దేవమాతా చ దేవకీ

పూర్వపుణ్య ఫలేనైవ ప్రాపతుః శ్రీహరిం సుతం

దేవమీఢాన్మారిషాయాం వసుదేవో మహానభూత్

యస్యోద్భవే దేవసంఘో వారయామాస దుందుభిః

ఆనకం చ మహాహృష్టాః శ్రీహరేర్జనకం చ తం

నంతః పురాతనాస్తేన వదం త్యానక దుందుభిం

శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలి కెను :

కశ్యప ప్రజాపతియే వసుదేవుడుగా జన్మించెను. దేవమాతయైన అదితియే దేవకిగా జన్మించెను. ఆయుభయులు పూర్వ పుణ్యఫలము వలన శ్రీహరిని పుత్రునిగా పడసిరి. దేవమీఢుడను వానికి మారిషయను భార్యయందు శ్రేష్ఠుడైన వసుదేవుడు కలిగెను ఈ వసుదేవుడు జన్మించిన కాలములో గొప్ప హరము పొందిన దేవసంఘములు దుందుభులను తాళములను మ్రోగించుట వలన శ్రీహరిని కననున్న అతనిని ప్రాచీనులైన సాధుపురుషులు “ఆనక దుందుభి” అను పేరుతో వ్యవహరించిరి.

ఆహుకస్య నుతః శ్రీమాన్ యదువంశ సముద్భవః

దేవకో జ్ఞాన సింధుశ్చ తస్య కన్యా చ దేవకీ

ఆహుకుడన్న వాని పుత్రుడు భాగ్యవంతుడు యదువంశమున పుట్టినవాడు భగవద్ జ్ఞానములో సముద్రమంతటి వాడు దేవకుడు. అతని పుత్రికయే దేవకీదేవి.

గర్గో యదుకులాచార్యః నంబంధం వసునా సహా

దేవక్యాః కారయామాస విధివచ్ప యథోచితం

మహా సంభృత సంభారో వసుదేవః శుభేక్షణే

ఉద్వా హే దేవకీం తస్మై దేవకః ప్రదదౌ కిల

ఆశ్వానాం చ సహస్రాణి గజానాం చ శతాని చ

సాలంకృతానాం దాసీనాం శతోని సుందరాణి చ

నానావిధాని ద్రవ్యాణి రత్నాని వివిధాని చ

మణిశ్రేష్ఠాని వజ్రాణి స్వర్ణ పాత్రాని నారద

ఓ నారదా! యాదవ కులమునకు ఆచార్యుడైన గర్గమహర్షి ఉభయవర్గములకు యోగ్యముగా శాస్త్రీయముగా దేవకి వసుదేవుల వివాహము జరిపించెను. దేవకుడు దేవకి యొక్క “శుభవీవాహ సందర్భమున వసుదేవునకు పెద్ద వాహనములు మోయదగిన వస్తు సామగ్రిని, వేలగుఱ్ఱములను, వందల ఏనుగులను, నానావిధ ద్రవ్యములను, వివిధ రత్నములను, శ్రేష్ఠమైన వజ్రములను స్వర్ణపాత్రలను ఇచ్చెనని చెప్పుదురు.

సద్రత్న భూషితాం కన్యాం శత చంద్ర సమప్రభం

త్రైలోక్య మోహినీం ధన్యాం మాన్యాం శ్రేష్ఠం చ యోషితాం

రూపాధారాం గుణాధారాం సుస్మితాం వక్రలోచనాం

నవ సంగమ యోగ్యం చ ప్రొద్భిన్న నవ యౌవనాం

తాం గృహీత్వా రధే కృత్వా ప్రస్థాన సమయే తదా

కంసో హృష్ణస్సహచరో భగిన్యుద్వాహ కర్మణి

తస్యా రథ సమీపస్థే కంసే గచ్ఛతి తత్ క్షణే

కంసం సంబోధ్య గదవే వాగ్బభూవాశరీరిణీ

మంచి రత్నముల చేత అలంకరింపబడినదియు, నూర్గురు చంద్రుల కాంతితో సమమైన కాంతి గలదియు, ముల్లోకములను మోహింపజేయునదియు, శ్రీహరికి తల్లిగావలసియున్నందున ధన్యురాలును అందువలననే మాన్యురాలును, ఉత్తమ స్త్రీలలో శ్రేష్ఠురాలును, సద్రూపమునకు సద్గుణములకు ఆధారభూతురాలును, చిరునవ్వును ప్రక్క చూపులును గలదియు, క్రొత్తగా కాపురము చేయదగిన దశలోనున్నదియు, శరీరమున సృష్టపడిన నవయౌవన లక్షణములు గలదియు, అగు కన్యను (పెండ్లికూతురు దేవకి) వివాహమాడీ వసుదేవుడు రథము పై ఎక్కించుకొని ప్రయాణమై పోవుచుండగా - చెల్లెలి వివాహ సందర్భమున మీక్కిలి సంతోషముతో కంసుడు దేవకి ఎక్కిన రథమునకు దగ్గరగా పోవుచుండగా - ఆ క్షణమున కంసుని సంబోధించి ఆకాశమున అశరీరవాక్కు (శరీరము కన్పించని ధ్వని) ఇట్లు వినిపించెను.

కథం హృష్టోఽసి రాజేంద్ర శ్రుణు సత్యం వచో హితం

దేవక్యా హ్యష్టమోగర్భో మృత్యు హేతు స్తవైవ హి

ఓయీ కంసరాజా! ఎందుకంతగా హరముతోనున్నావు. సత్యము హితమునైన మాట వినుము. దేవకి యొక్క ఎనిమిదవ గర్భము (ఎనిమిదవ సంతానము) నీ మృత్యువునకు కారణము కాగలదు.

శ్రుత్వైవం దేవకీం కంసః ఖడ్గహస్తో మహాబలః

దేవవాక్యాద్భయాత్ క్రోధాత్ పాపిష్ఠో హంతుముద్యతః

తాం హంతుముద్యతం దృష్ట్వా వసుదేవస్సుపండితః

బోధయామాస నీతిజ్ఞో నీతిశాస్త్ర విశారదః

ఆ మాటను వీని మహాబలము గల కంసుడు దేవ వాక్యము (అశరీరవాణి) వలన ఏర్పడిన భయము వలన తద్వారా కలిగిన కోపముతో ఖడ్గము చేతబట్టి దేవకిని చంపుటకు - ఆ పాపిష్టుడు పూనుకొనెను. దేవకిని చంపబూనిన కంసుని జూచి రాజనీతి నెరిగినవాడు నీతిశాస్త్రమందు నేర్పుగలవాడు మంచి పండితుడైన వసుదేపుడు కంసునకిట్లు బోధచేసెను.

వసుదేవ ఉవాచ :

రాజనీతిం న జానాసి శ్రుణు మే వచనం హితం

యశస్కరం చ దోషఘ్నం శాస్త్రోక్తం సమయోచితం

అస్యా ఏవాష్టమో గర్భో మృత్యుశ్చేత్తవ భూమిప

ఇమాం చ హత్వా దుష్కర్తిం కరోషి త్వం నరః కథం

వధే చ క్షుద్ర జంతూనాం పొంనకానాం చ పండితః

కార్షాపణం సముత్పృజ్య మృత్యుకాలే ప్రముచ్యతే

అహింసకానాం క్షుద్రాణాం వధః శతగుణం ధ్రువం

ప్రాయశ్చిత్తం మృత్యుకాలే కధితం పద్మయోనినా

వధే విశిష్ట జంతూనాం పశ్వాదీనాం చ కాపరః

తతశ్శతగుణం పాపం నిశ్చితం మనురబ్రవీత్

నరాణాం మ్లేచ్ఛ జాతీనాం వధే శతగుణం తతః

మ్లేచ్ఛానాం చ శతానాం చ యత్సాహం లభతే వధే

నచ్ఛూద్రైకస్య ఎధే తత్సావం లభతే పుమాన్

నచ్ఛూద్రాణాం శతానాం చ యత్సాహం లభతే వధే

తత్పాపం లభతే నూనం గోవదైకేన నిశ్చితం

గవాం దశగుణం పాపం బ్రాహ్మణస్య వధే భవేత్

విప్ర హత్యా సమం పాపం స్త్రీవధే లభతే నరః

ఓ రాజా! నీవు రాజనీతి నేరుగవు, కీర్తిని కల్గించునదియు, పాపములను నశింపజేయునదియు, ఆయాసమయమునకు తగిన విధముగా శాస్త్రమందు చెప్పబడినదియు నీకు హితము కూర్చునదియునగు నామాటను వినుము. ఈమె ఎనిమిదవ కానుపు నీకు మృత్యువైనచో ఈమెను చంపి ఆపకీర్తి నేందుకు కూర్చుకొందువు! కృషి (భూమి దున్నుట) వాణిజ్యము (మాంసము అమ్ముట) ఆను రెండిట గాక ఇతరముగా క్షుద్ర జంతు వధ చేసినను, క్రూర జంతువులను వేధించినను ఎంతపండితుడైనను తన మరణమున ఆ ఫలమనుభవించవలెను. సాధు జంతువులను. క్షుత్రజంతువులను వధించినచో ఆ పాపమునకు (అంత్యకాలమున) చేసికొనవలసిన ప్రాయశ్చిత్తము నూరంతలుగా చేయవలెనని బ్రహ్మచేత చెప్పబడినది. పశువులు మొదలగు సాత్త్విక విశిష్ట జంతువులను బుద్ధి పూర్వకముగా చంపినచో పొరపాటున ఏర్పడు పాపముకంటే నూరంతలు పాపము నిశ్చయింపబడినదని స్మృతికర్తయగు మనువు పలికెను. (చెప్పెను). మ్ళేచ్ఛజాతి మనుష్యునోకని వధించినచో పశువధపాపముకంటే నూరంతలు పాపమును - ఉత్తముడైన (సత్చ్రవర్తన గల) శూద్రునొకని చంపినచో వందమంది ప్లేచ్చులను చంపిన పాపమును - ఓక గోవును వధించినచో వందమంది నచూద్రులను చంపిన పాపమును మానవుడు పొందును. ఒక బ్రాహ్మణుని హత్యచేసినచో వందగోవులను వధించిన పాపము సంభవించును. స్త్రీని వధించినచో బ్రాహ్మణ హత్యకు సమమైన పాపము ప్రాప్తించి తీరుసు.

విశేషతో హి భగినీ పోష్యా చ శరణాగతా

స్త్రీహత్యా శతపాపం చ భవేదస్యా వధే నృప

తపో జపం చ దానం చ పూజనం తీర్థ దర్శనం

విప్రాణాం భోజనం హోమం స్వర్గార్థం కురుతే బుధః

జల బుద్బుదవత్సర్వం న్వప్నతుల్య నమం భవం

పశ్యంతి సతతం సంతో ధర్మం కుర్వంతి యత్నతః

భగినీం త్యజ ధర్మిష్ఠ స్వవంశాపరభాస్కర

బుధాః కతి విధాస్పంతి సభాయాం పృచ్ఛ్యతాం నృప

అస్యాశ్చైవాష్టమో గర్భో యదపత్యం భవిష్యతి

బంధో తుభ్యం ప్రదాస్యామీ తేన మే కిం ప్రయోజనం

అథవా యాన్యవత్యాని భవంతి జ్ఞానినాం వర

తాని సర్వాణి దాస్యామీ త్వత్తః కో మే వరః ప్రియః

భగినీం త్యజ రాజేంద్ర కన్యాశుల్యాం ప్రియాం తవ

మిష్టాన్న దాన పానేన వర్థితామనుజాం సదా

వసుదేవ వచః శ్రుత్వా తత్యాజ భగినీం సృవః

ఓ రాజా! విశేషించి ఈమె నీ చెల్లెలు. నిన్ను శరణు పొందిన వ్యక్తి కనుక పోషింపదగినది. ఈమెను చంపినచో వందమంది. స్త్రీలను చంపిన పాపము సంభవించును. పండితుడైనవాడు స్వర్గప్రాప్తి కోసము తపస్సు మంత్రజపము దానము దేవతా పూజ పుణ్య తీర్ధములను దర్శించుట బ్రాహ్మణులకు భోజనము పెట్టుట, హోమము అన్నవి ఆచరించును. ఈ సంసారము ఒక కలవంటిది. ఇందలి అనుభవములన్నియు నీటి బుడగల వంటివి అని సజ్జనులెల్లప్పుడు భావించుచు పూనికతో ధర్మకార్యము లాచరింతురు. నీ వంశమును వెల్లించు సూర్యుడవు కదా! ఓ రాజా! నీ సభలో ఎందరో విద్వాంసులున్నారు. ఈ విషయమై వారినడిగి తెలుసుకొనుము. ఓ బంధూ! ఈమె ఎనిమిదవ కాన్పులో కలుగు సంతానమును నీకప్పగింతును. నీకు కీడు కల్గించు ఆ సంతానముతో నాకేమి పనీ? ఓ జ్ఞానివరా! కానిచో ఈమెకు సంతానమెందరు కలుదురో వారందరిని నీకర్పింతును. నీకంటే సోకు ప్రియమైన వాడెవడు? ఓ రాజేంద్రా! నీ చెల్లెలు కూతురు వంటిది. ఇప్పటి వరకు రుచికరమైన అన్నపానములచే పోషించిన నీ ప్రియమైన చెల్లెలును విడిచిపెట్టుము” అని అనెను. వసుదేవుని మాటలకు కంసుడు సోదరిని వదిలి పెట్టెను.

వసుదేవః ప్రియాం నీత్వా జగామ నిజమందిరం

క్రమాదపత్య షట్కం చ యద్యద్భూతం చ నారద

దదౌ తస్మై వను స్పత్యాత్స జఘాన క్రమేణ తాన్

దేవక్యాస్సప్తమే గర్భే కంసో రక్షాః దదౌ ఖియా

రోహిణీ జఠరే మాయా త మా కృష్య రరక్ష చ

రక్షకాః కథయామానుర్గర్భస్రావో బభూవ హ

తస్మాద్బభూవ భగవానాత్మా సంకర్షణః ప్రభుః

వసుదేవుడు ప్రియపత్నిని వెంటబెట్టుకొని తన గృహమున కేగెను. ఓ నారదా! అతడు క్రమముగా తనకు కలిగిన ఆర్గురు పుత్రులను సత్యవాక్యము ప్రకారము కంసున కప్పగించెను. ఆ కంసుడు వారినందరిని ఇచ్చినవారి నిచ్చినట్లు చంపివేసెను. దేవకి ఏడవమారు గర్భవతి కాగా భయముతో కంసుడు వారికి కావలి నేర్పరచెను. యోగమాయ ఆ గర్భమును ఆకర్షించి రోహిణీదేవి గర్భమున చేర్చి రక్షించెను, కావలివారు దేవకికి గర్భస్రావమైనదని కంసునకు చెప్పిరి. గర్భమును మార్చుట వలన ఆ భగవంతుడు (బలరాముడు) సంకర్షణుడని వ్యవవహరింపబడెను.

తస్యా ఏవాష్టమో గర్భో వాయుపూర్ణో బభూవ హా

గతే చ నవమే మాసి దశమే సముపస్థితే

దృష్టిం దదౌ చ గర్భే చ భగవాన్ సర్వ దర్శనం

స్వయం రూపవతీ దేవీ సర్వాసాం యోషితాం వరా

బభూవ దర్శనాత్పద్యః సుందరీ సా చతుర్గుణా

ఎనిమిదవ దేవకీదేవి గర్భము కేవలము వాయువుతో నిండెను. నవమాసములు గడవగా పదియవ నెల రాగానే సర్వము దర్శించెడి భగవంతుడు ఆమె గర్భమందు దృష్టి పెట్టెను. స్వయముగానే మంచి అందగత్తేయు, స్త్రీలలో శ్రేష్ఠురాలును ఐన ఆ దేవీ పరమాత్మ దృష్టి ప్రసరించగానే నాలుగు రెట్లు అధిక సౌందర్యవతి అయ్యెను.

దదర్శ దేవకీం కంసః ప్రపుల్ల వదనేక్షణాం

తేజసా ప్రజ్వలంతీం చ మయామివ దిశో దశ

జ్యోతిషాం సంహాతిం చై వ యథా మూర్తిమతీమివ

దృష్ఠ్వా తామసురేంద్రశ్చ విస్మయం పరమం యయౌ

అస్మాద్గర్భాదపత్యం చ మృత్యుబీజం మమైవ చ

ఇత్యేవముక్త్వా కంసశ్ప దదౌ రక్షాం ప్రయత్నతః

దేవకీం వసుదేవం చ సప్తద్వారం రరక్ష చ

వికసించిన ముఖముతో నిండు చూపులతో వెలిగి పోవుచున్న దేవకి కంసుని కన్నులకు తన తేజస్సుతో దశదిశలను వెలిగించుచున్న విష్ణుమాయవలె, స్త్రీరూపము దాల్చిన గ్రహా నక్షత్ర కాంతి రాశివలె కన్పించెను. ఆమెను చూచీ ఆ అసురుడు (కృత్యములను బట్టి, అంశను బట్టి) మిక్కిలి ఆశ్చర్య పడెను. “ఈ గర్భము నుండి కలుగు సంతానము నాకు మృత్యుబీజము” అని చెప్పి ఎక్కువ ప్రయత్నముతో కంసుడు రక్ష (కావలి) ఏర్పరచెను. దేవకీ వసుదేవులను సప్తద్వారములు గల మందిరమున నుంచి కావలి నేర్పాటు చేసెను.

పూర్ణే చ దశమే మా సే గర్భః పూర్ణో బభూవ హ

బభూవ సా చలస్పందా జడరూపా చ నారద

గర్భే చ వాయునా పూర్ణే నిర్లిప్తో భగవానజిత్

హృత్పద్మకోశే దేవక్యా అధిష్టానం చకార హ

ఓ నారదా! పదియవ నెల నిండగా గర్భము నిండుగా నుండెను. అప్పుడాదేవకి మెల్లని కదలికలు కలది కదలిక లేనిది అయ్యెను. ఆ గర్భము గాలితో నిండియుండగా నీర్లిపుడైన (ఏదోషములంటని వాడు) దేవకిదేవి యొక్క హృదయ కమలము మధ్య తన నివాసమేర్పరచుకొనెను.

సా విశ్వంభరగర్భా చ మందిరాభ్యంతరే సతీ

ఉవాస జడరూపా చ క్లేశయుక్తా బభూవ హ

ఉవాస చ క్షణం దేవీ క్షణముత్థాయ తిష్ఠతి

క్షణం ప్రజతి పాదైకం క్షణం స్వపితి తత్ర వై

విశ్వమును మోయునట్టి పరమాత్మను తన గర్భమందు గల ఆమె నివాసమందిరము లోపల జడరూపము గలదిగా (కదలికలు లేనిది) నివసించుచు శ్రమ పడుచుండెను. క్షణము కూర్చుండి, అంతలో లేచి నీలచి, క్షణము సేపు ఒక అడుగు దూరము నడచి, క్షణము సేపు అక్కడనే పండుకొనుచుండెను.

దృష్ట్వా చ దేవకీం శీఘ్రం వసుదేవో మహామనాః

ప్రసూతి సమయం జ్ఞాత్వా సస్మార హరిమీశ్వరం

గొప్ప మనస్సు గల వసుదేవుడు దేవకి నా స్థితిలో చూచి కాన్పు సమయమనీ (సంతానము గనుకాలము) తెలిసికొని ప్రభువగు శ్రీహరిని స్మరించెను.

రత్నప్రదీప సంయుక్తే మందిరే సుమనోహరే

స్థాపయామాన ఖడ్గంచ లోహం తోయం హతాశనం

మంత్రజ్ఞం చ నరం చైవ బంధువత్నీర్భయాకులః

విద్వాంసం బ్రాహ్మణం చైవ త్రస్తో బంధూంశ్చ సాదరం

వసుదేవుడు రత్నదీపములకాంతి గల సుందరముందిరమున నిలువు కత్తిని ఇనుమును జలమును, అగ్నిని తగిన ఆలోచన చెప్పగల ఒక వ్యక్తిని బంధువుల భార్యలను, విద్వాంసుడైన బ్రాహ్మణుని కొందరు బంధువులను భయముచేత తొందరపాటు గలవాడై సమకూర్చుకొనెను.

ఏతస్మిన్నంతరే తస్యా రాత్రే ర్ద్వౌ ప్రహరౌ గతౌ

వ్యాప్తం చ గగనం మే ఘైః క్షణద్యుతి సమన్వితైః

వవుశ్చ వాయవశ్చేష్టా యయుర్నిద్రాం చ రక్షకాః

అచేష్ఠితాశ్చ శయనే మృతా ఇవ విచేతనాః

ఇంతలో ఆ రాత్రి రెండు జాములు గడచిపోగా ఆకాశమున మెరుపులతో బాటు మేఘములు వ్యాపించెను. స్వేచ్ఛగా వాయువులు వీచెను. కావలివారు చచ్చిన వారివలె కదలికలు లేకుండ తెలివి తప్పి నిద్రపోయిరి.

ఏతస్మిన్నంతరే తత్ర చాజగ్ము స్త్రిదశేశ్వరాః

తుష్టువుర్థర్మ బ్రహ్మేశా గర్భస్థం పరమేశ్వరం

అంతలో బ్రహ్మరుద్ర ధర్మదేవతలు ఆ ప్రసూతి గృహమునకు వచ్చి దేవకీ గర్భమందున్న పరమాత్మనిట్లు స్తుతించిరి.

దేవా ఊచుః :

జగద్యోనిరయోమి న్యమనంతోఽవ్యయ ఏవ చ

జ్యోతి స్వరూపో హ్యనషుః సగుణో నిర్గుణో మహాన్

భక్తానురోధాత్పాకారో నిరాకారో నిరంకుశః

నిర్వ్యూహో నిఖిలాధారో నిశ్శంకో నిరుపద్రవః

నిరుపాధిశ్చ నిర్లిప్తో నిరీహో నిధవాంతకః

స్వాత్మారామః పూర్ణకామోఽ నిమోషో నిత్య ఏవ చ

స్వేచ్ఛామయః సర్వహేతుః సర్వః సర్వగుణాశ్రయః

సుఖదో దుఃఖదో దుర్గో దుర్జనాంతక ఏవ చ

సుభగో దుర్భగో వాగ్మీ దురారాధ్యో దురత్యయః

వేద హేతుశ్చ వేదాశ్చ వేదాంగో వేదవిధ్విభుః

జగత్తునకు జన్మస్థానమైనవాడవు (కారణము-మూలము) తనకు వేరొక మూలము (జన్మకారణము) లేనివాడవు అగు నీవు అనంతుడవు, నాశరహితుడవు. జ్యోతి స్వరూపుడవు. అనఘుడవు (ఏ దోషములు లేనివాడవు) లోకకల్యాణ గుణుడవు. హేయ, విషము గుణములు లేని వాడవు. మహాత్ముడవు. భక్తుల ఒత్తిడి వలన వారి రక్షణార్థము నిరాకారుడవయ్యు సాకారుడవు. నీ పై అధికారముతో నిన్నదుపు పెట్టువారు లేనివాడవు. ఒక వర్గమునకు పరిమితము కానివాడవు. చిదచిదాత్మకమైన సర్వమునకు ఆధారమైనవాడవు. శంకలు (సందేహములు) కానీ ఉపద్రవములు (కీడు) కానీ లేని మహతుడవు. నీకు వేరొక ఆధారము లేనివాడవు. ఏ దోషములంటని వాడవు. తీరనీ కోరికలులేని వాడవు. మృత్యువునకు మృత్యువైనవాడవు నీలోనే ఆనందపూర్ణుడవు. పూర్ణకాముడవు (కోరికలన్ని స్వాధీనమైనవాడవు నీత్యుడవు నిద్రారహితుడవు. నీ ఇచ్ఛకొలది సర్వము నిర్వహించువాడవు. సర్వమునకు మూలమైనవాడవు. సర్వము నీవైనవాడవు, సర్వకల్యాణగుణములకు ఆశ్రయమైనవాడవు. జీవులకు వారి వారి కర్మానుసారము సుఖమును దుఃఖమును ఇచ్చువాడవు. విరోధులకు సౌందరాని వాడవు. దుర్జనులకు అంతకుడవు. సుందరమూర్తివయ్యు విరోధులకు భీకరమూర్తివి. చక్కని మాటలనేర్పు గలవాడవు. భక్తి లేకుండ ఇతర విధములుగా ఆరాధింపరానివాడవు. దుష్టులకు త్రోయరాని ఆపదవు. వేదములకు మూలమైనవాడవు. (వేదములే నీ తత్త్వము తెలియుటకు మూలము ఐనవాడవు) వేదములు నీ రూపమే. వేదాంగములును నీ తత్త్వమునకాధారము. వేదజ్ఞుడవు. సర్వవ్యాపకుడవు నీవే

ఇత్యేవముక్త్యా దేవాశ్చ ప్రణేముశ్చ ముహుర్ముహః

హర్షాశ్రు లోచనాస్సర్వే వవృషః కుసుమాని చ

ఇట్లు పలికి దేవతలు మాటి మాటికి నమస్కరించిరి. ఆనంద బాష్పములు గల కన్నులతో వారందరు పుష్పవర్షము కురిపించిరి.

ద్విచత్వారింశ న్నామని ప్రాతరుత్థాయ యః పఠేత్

దృఢాం భక్తిం హరేర్దాన్యం లభతే వాంఛితం ఫలం

ఈ నలుబది రెండు నామములను ఉదయమున మేల్కొని పరించిన వ్యక్తి దృఢమైన హరిభక్తిని, హరిదాస్యమును ఇతర కోరికలను పొందును.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే బ్రహ్మాదికృత శ్రీకృష్ణస్తోత్రం

(ఇది శ్రీబ్రహ్మవైవర్త పురాణములో బ్రహ్మాదిదేవతలోనర్చిన శ్రీకృష్ణస్తోత్రము)

నారాయణ ఉవాచ :

ఇత్యేవం స్తవనం కృత్వా దేవాస్తే స్వాలయం యయుః

బభూవ జలవృష్టి శ్చ నిశ్చేష్టా మధురాపురీ

ఘోరాంధకార నిబిడా బభూవ యామినీ మునే

నారాయణ మహర్షి ఇట్లు పలికెను :

ఓ నారదా! దేవతలిట్లు స్తుతించి తమ నివాసములకు వెళ్లిరి. ఆ రాత్రి ఘోరమైన చీకట్లు క్రమ్ముకొనెను. జలవర్షము కురిసెను. మధురాపురి మొత్తము చేష్టలు లేనిదయ్యెను.

గతే సప్త ముహూర్తేతు చాష్టమే నముపస్థితే

వేదాతిరిక్తదుర్జే యే సర్వోత్కృష్టే శుభే క్షణే

శుబేగ్ర హే దృష్టి యుక్తేఽ వ్యదృష్టే చాశుభగ్రహే

అర్థరాత్రే నముత్పన్నే రోహిణ్యామష్టమీతిధౌ

జయంతీ యోగసంయుక్తే చార్థ చంద్రోదయే మునే

దృష్ట్వా దృష్ట్వా క్షణం లగ్నం భీతాస్పూర్యాదయస్తదా

గగనే క్రమముల్లంఘ్య జగ్ముర్మీనం శుభావహాః

సుప్రసన్నా గ్రహాస్సర్వే బభూవునత్ర సంస్థితాః

ఏకాదశా స్తే ప్రీత్యా చ ముహూర్తం ధాతురాజ్ఞయా

వవర్షుశ్చ జలధరా వవుర్వాతాన్సుశీతలాః

సుప్రసన్నా చ పృథివీ ప్రసన్నాశ్చ దిశో దశ

ఋషయో మనవశ్చైవ యక్ష గంధర్వ కిన్నరాః

దేవా దేవ్యశ్చ ముదితా ననృతుశ్చాప్సరో గణాః

జగుర్గంధర్వ పతయో విద్యాధర్యశ్చ నారద

సుఖేన సుస్రువుర్నద్యో జజ్వలుశాగ్నయో ముదా

నేదుర్దుందుభయో నారే చానకాశ్చ మనోహరాః

పారిజాత ప్రసూనానాం మహావృష్టిర్బభూవ హ

జగామ సూతికాగేహం నారీరూపం విధాయ భూః

నారదా! ఏడు ముహూర్తముల కాలము గడచిపోయి ఎనిమిదవ ముహూర్తము ఏర్పడగా వేదవిజ్ఞానము వలన తప్ప ఇతర విధముల తెలిసికోన శక్యము గాని సర్వోత్తమమైన శుభక్షణమున పాపగ్రహముల దృష్టిపడనట్టి, శుభగ్రహముల దృష్టి ప్రసరించునట్టి లగ్నములో రోహిణీ నక్షత్రముతో కూడియున్న అష్టమీ తిథినాడు, మధ్యరాత్రి కాలమున చంద్రోదయము సగము కాగా 'జయంతి' అనెడి అపూర్వ యోగము కూడివచ్చిన కాలమున - సూర్యాదిగ్రహములు క్షణక్షణము ఆ లగ్నమును చూచి భయపడి (స్వామీ అవతారకాలమునకు అనుకూల స్థితిలో ఉండనందుడు) తమ తమ గతి క్రమమునుల్లంఘించి (తాత్కాలికముగా) ఆకాశమున మీన లగ్నమును పొంది బ్రహ్మ ఆజ్ఞననుసరించి స్వామి మీది ప్రీతిననుసరించియు, ఒక ముహూర్తకాలము ఏకాదశస్థానమున నిలిచిరి. అది శుభము కలిగించు స్థానము. కనుక గ్రహములన్నియు అక్కడ నిలిచి మిక్కిలి సంతసించెను. అప్పుడు మేఘములు బాగుగా వర్షించేను, మిక్కిలి చల్లగాలులు వీచెను. భూమి ప్రసన్నురాలయ్యెను. పది దిక్కులు ప్రసన్నముగా నుండెను. ఋషులు మనువులు యక్ష గంధర్వకిన్నరులు దేవతలు వారి పత్నులు ఆనందించిరి. అప్పర గణములు నాట్యము చేసిరి. గంధర్వులు విద్యాధరస్త్రీలు గానము చేసిరి. నదులు నిండుగా ప్రవహించెను. అగ్నులు సంతసముతో ప్రదక్షిణ జ్వాలలతో మండెను. స్వర్గమున దుందుభులు తాళములు మనోహరముగా మ్రోగెను. పారిజాత పుష్పముల వర్షము అధికముగా కురిసెను. ఆ సమయమున భూదేవి స్త్రీ రూపము దాల్చి (కాన్పువేళ సహకరించుటకు) ప్రసూతి గృహమును చేరబోయెను.

జయ శబ్దశ్శంఖశబ్దో హరిశబ్దో బభూవ హ

ఏతస్మిన్నంతరే తత్ర పపాత దేవకీ సతీ

నిస్ససార చ వాయుశ్చ దేవకీ జఠరాత్తతః

“జయ జయ” అను ధ్వని శంఖముల ధ్వని, “హరి హరి” అన్న నామోచ్చారణ ధ్వని ఏర్పడెను. ఇంతలో దేవకీ దేవి పురిటింటిలో పడిపోయెను. అపుడామె గర్భము నుండి (స్వామి సంకల్పముననుసరించి స్తంభించిన) వాయువు బయటికి వెళ్లి వచ్చెను.

తత్రైవ భగవాన్ కృష్ణో దివ్యరూపం విధాయ చ

హృత్పద్మకోశా ద్దేవక్యా హరిరావిర్బభూవ హ

ఆతీవ కమనీయం చ శరీరం సుమనోహరం

ద్విభుజం మురళీ హస్తం స్పురన్ముకుట కుండలం

ఈషద్ధాస్యం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకాతరం

మణి రత్నేంద్ర సారాణాం భూషణైశ్చ విభూషితం

నవీన నీరద శ్యామం శోభితం పీత వాససా

చందనాగురు కస్తూరీ కుంకుమ ద్రవ చర్చితం

శరత్పార్వణ చంద్రన్యం బింబాధర మనోహరం

మయూర పిచ్ఛ చూడం చ సద్రత్న ముకుటోజ్వలం

త్రిభంగ వక్రమధ్యం చ వనమాలా విభూషితం

శ్రీవత్స వక్షసం చారు కౌస్తుభేన విరాజితం

కిశోర వయసం శాంతం కాంతం బ్రహ్మేశయోః పరం

దదర్శ వనుదేవశ్చ దేవకీ పురతో మునే

తుష్టావ వరయా భక్త్యా విస్మయం పరమం యయౌ

కృతాంజలి పుటో భూత్వా భక్తి నమ్రాత్మ కంధరః

సాశ్రుపూర్ణః నపులకో దేవక్యా చస్త్రియా సహ

ఆ ప్రసూతి గృహమున భగవంతుడగు శ్రీకృష్ణుడు దివ్యరూపము కల్పించుకొని దేవకీ దేవి హృదయ కమలపుటము నుండి ఆవిర్భవించెను. మిక్కిలి కోరదగినవాడు చూచువారి మనస్సునపహరించునంతటి ఆకారము కలవాడును రెండు భుజములు గలవాడును, పిల్లన గ్రోవిని చేత బట్టినవాడును, మెరయుచున్న కిరీటము, చెవుల కుండలములు గలవాడును, చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖము కలవాడును, భక్తుల ననుగ్రహించుటలో తొందరగలవాడును, సారవంతమైన మణిరత్నముల భూషణములు ధరించినవాడును, క్రొత్తమేఘము వలె సల్లనైనవాడును, పసుపువన్నె వస్త్రముతో శోభించుచున్న వాడును, చందనము అగురు కస్తూరి కుంకుమపువ్వుల గంధము ధరించినవాడును, శరదృతువులోని పున్నమినాటి చంద్రుని వంటి ముఖము గలవాడును, దొండపండువంటి క్రింది పెదవితో మనోహరముగా నున్నవాడును, నెమిలీపింఛము చూడమందు (తలమీద ముందున్న కొప్పు) గల వాడును, రత్న కిరీటముతో ప్రకాశించుచున్నవాడును, మువ్వంకలుగా నెన్నడుము వరకు వీరాసముగా నిలిచినవాడును, పాదముల వరకు నిండు వనమాల (పుష్పమాల) ధరించినవాడును, శ్రీవత్సమును పుట్టుమచ్చయు కౌస్తుభమును మఱియు వక్షస్థలమందు విరాజిల్లుచున్న వాడును, బాల్యవయస్సులో (ఐదేండ్ల లోపు) నున్న శాంత మనోహరరూపుడును బ్రహ్మరుద్రులకన్న పరుడగు (శ్రేష్టుడు) స్వామిని దేవకీవసుదేవులు తమముందు దర్శించిరి. వసుదేవుడు పరమాశ్చర్యము పొంది భక్తితో వంచిన మెడకలవాడును, ఆనందబాష్పములు కలవాడును, పులకరించిన దేహము కలవాడునై చేతులు జోడించి నిండు భక్తితో దేవకితో గూడి స్తుతియొనర్చెను.

వసుదేవ ఉవాచ :

త్వామతీంద్రియమువ్యక్తమక్షరం నిర్గుణం విభుం

ధ్యానాసాధ్యం చ సర్వేషాం పరమాత్మానమీశ్వరం

స్వేచ్ఛామయం సర్వరూపం స్వేచ్ఛారూపధరం పరం

నిర్లిప్తం పరమం బ్రహ్మ బీజరూపం సనాతనం

స్థూలాత్ స్థూలతరం వ్యాప్తమతి సూక్ష్మమదర్శనం

స్థితం సర్వ శరీరేమ సాక్షిరూపముదృశ్యకం

శరీరపంతం సగుణమశరీరం గుణోత్కరం

ప్రకృతి ప్రకృతీశం చ ప్రాకృతం ప్రకృతేః పరం

సర్వేశం నర్వరూపం చ సర్వాంతకరమవ్యయం

సర్వాధారం నిరాధారం నిర్వ్యూహం స్తౌమి కింవిభుం

అనంతః స్తవనేఽశక్తోఽ శక్తి దేవీ నరస్త్రతీ

యం వా స్తోతుమశక్తశ్చ పంచవక్త్రః షడాననః

చతుర్ముఖో వేదకర్తా యం స్తోతుముక్షమన్సదా

గణేశో న సమర్థశ్చ యోగీంద్రాణాం గురోర్గురుః

ఋషయో దేవతాశ్చైవ మునీంద్ర మనుమానవాః

స్వప్నే తేషామదృశ్యం చ త్వామేవం కింస్తువంతి తే

శ్రుతయః స్తవనేఽ శక్తః కింస్తువంతి వివశ్చితః

విహాయైవం శరీరం చ బాలో భవితుమర్హసి

వసుదేవుడిట్లు పలికెను :

మా జ్ఞానేంద్రియములకందనీవాడవును అందువలననే వ్యక్తముగాని (స్పష్టముగా తెలియరాని వాడవును, నాశములేనివాడవును, త్రిగుణములకతీతుడవును అంతట వ్యాపించి యుండువాడవును, సర్వజీవులకును ధ్యానము చేత సాధింపరానీవాడవును, పరమాత్మను పరమేశ్వరుడవును, సృష్టిలోని నర్వరూపములు నీ సంకల్పమయములైనవాడవును స్వేచ్ఛతో శ్రేష్ఠమైన రూపములు ధరించువాడవును, ప్రకృతి గుణములంటనివాడవును, లోపల వెలుపల (అంతట) వ్యాపించియుండు పరబ్రహ్మవును, విశ్వమంతటికి కారణమైనవాడవును, సనాతనుడవును, స్థూలపదార్ధము కన్న మిక్కిలి స్తూలతనుడవును, కన్పించని అతి సూక్ష్మమునై వ్యాపించువాడవును, సర్వదేహములందు కన్పించకుండ లోపలనుండి ఆయా జీవుల కర్మలకు సాక్షిభూతముగా నిలిచినవాడవును, శరీరము లేని వాడవయ్యును, లోకానుగ్రహము కొరకు శరీరము కలవాడవును గుణరాశిపై కల్యాణగుణములు గలవాడవును, సాలెపురుగు దారమును పుట్టించినట్లు ప్రకృతిని కల్పించి దానికి నియామకుడవైనవాడవును, ప్రాకృతరూపము ధరించియు ప్రకృతికి వేరైనవాడవును, సర్వదేవతలకు ప్రభువును సర్వరూపములు నీవియైనవాడవును సర్వజీవకోటికి లయకారుడవును నాశరహితుడవును, సర్వమునకు ఆధారమునై నీకితరాధారములేని వాడవును దేనికి చిక్కనివాడవునగు నిన్ను ఏమని స్తుతింతును?

నిన్ను స్తుతించుటకు (వేయి ముఖములు గల) అనంతుడును, వాగ్దేవియైన సరస్వతియు, పంచముఖములు గల శంకరుడును, ఆరు ముఖముల కుమారస్వామియు, అశక్తులు. వేదపాఠకుడైన చతుర్ముఖుడు (నాలు ముఖముల బ్రహ్మ) నిన్ను స్తోత్రము చేయ సమర్థుడు కాడు - యోగీంద్రులకు గురువులకు గురువైన గణేశుడు సమర్థుడు కాడు - ఋషులకు, దేవతలకు మునీంద్రులకు పదునాల్గురు మనువులకు వారి సంతతియైన మానవులకు స్వప్నమున కూడ దర్శనమీయని నిన్ను వారేమని స్తుతింతురు?! వేదములే నిన్ను ఉన్నదున్నట్లు వర్ణించుటకు శక్తి చాలనివైనప్పుడు వాటిని చదువుకొన్న విద్వాంసులు మాత్రమెట్లు స్తుతింతురు? ఓ స్వామీ! ఇట్టి దీవ్యరూపమును పరిత్యజించి లోక సాధారణ శీశువుగా ఉండవలెనని మనవి చేయుయున్నాను.

వసుదేవకృతం స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః

భక్తిం దాస్యమవాప్నోతి శ్రీకృష్ణచరణాంబుజే

విశిష్ట పుత్రం లభతే హరిదానం గుణాన్వితం

సంకటం నిన్తరేత్తూర్ణం శత్రు భీత్యా ప్రముచ్యతే

వసుదేవుడోనర్చిన ఈ స్తోత్రమును మూడు సంధ్యలందు (ఉదయము మధ్యాహ్నము సాయంకాలము) ఏ నరుడు పఠించునో వాడు శ్రీకృష్ణపాదాబ్జములయందు దృఢభక్తిని పొందును. సేవలు చేయగల ముక్తిని పొందును. సద్గుణములు కలవాడు, విష్ణుభక్తుడు అగు ఉత్తమపుత్రుని పొందగలును. త్వరగా అతని ఆపదలు తొలగిపోవును. శత్రుభయమునుండి విడుదల పొందును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే వసుదేవకృతం శ్రీ కృష్ణస్తోత్రం

(ఇది శ్రీబ్రహ్మవైవర్తపురాణములో వసుదేవుడొనర్చిన శ్రీకృష్ణస్తోత్రము సమాప్తము).

నారాయణ ఉవాచ :

వసుదేవ వచః శ్రుత్వా తమువాచ హరి: స్వయం

ప్రసన్నవదనః శ్రీమాన్ భక్తానుగ్రహకాతరః

నారాయణ మహర్షి ఇట్లు పలికెను :

వసుదేవుని మాట విని ప్రసన్నమైన ముఖము గలవాడు లక్ష్మీపల్లభుడైన శ్రీహరి భక్తుని అనుగ్రహించుటలో త్వరగలవాడై స్వయముగా నీట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ :

తపసాం చ ఫలెనైవ పుత్రోఽహం తవ సాంప్రతం

వరం వృణీష్వ భద్రం తే భవిష్యతి న సంశయః

పురా తపస్వీనాం శ్రేష్ఠః సుతపాస్త్వం ప్రజాపతిః

పత్నీ తే పృశ్నినామ్నీ చ తపసాఽరాధితస్త్వయా

పుత్రో మత్సదృశస్తత్ర దృష్ట్వా మాం చ వృతో బుధః

మయా దత్తో పరస్తుభ్యం మత్సమో భవితా సుతః

దత్వా తుభ్యం వరం తాత మనసాలోచ్య చింతితః

మత్సమోఽనాస్తి భువనే పుత్రోఽహం తేన హేతునా

తపసాం చ ప్రభావేణ త్వమేవ కశ్యపః స్వయం

సుతపా దేవమాతేయమదీతిశ్చ పతివ్రతా

అధునా కశ్యపాంతస్త్వం వసుదేవః పితా మమ

దేవకీ దేవమాతేయమదితేరంశ సంభవా

త్వత్తోదీత్యాం వామనోఽహం పుత్రస్తేఽoశేన సంభవః

అధునా పరిపూర్ణోఽహం వుత్రస్తే తపసాం ఫలాత్

మాం వా త్వం పుత్ర భావేన బ్రహ్మ భావేన వా పునః

మాం ప్రాప్తోఽసి మహాప్రాజ్ఞ జీవన్ముక్తో భవిష్యసి

శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలికెను :

ప్రస్తుతము నీవోనర్చిన తపస్సుల ఫలము వలన నీకు పుత్రుడనైతినీ. వరము కోరుకొనుము. సందేహింపకుము. నీకు మంగళమగును. నీవు పూర్వజన్మలో తపస్వి జనులలో శ్రేష్టుడపుగా మంచీతపస్సు చేసిన ప్రజాపతివి. నీభార్య పృశ్ని అను పేరు గలది. నీవపుడు తపస్సుతో నన్నారాధించితివి. అప్పుడు ప్రత్యక్షమైన నన్ను నౌవంటి పుత్రునిమ్మని వరము కోరుకుంటివి. సావంటీ కుమారుడు నీకు కలుగునని వరమిచ్చి యుంటిని. అప్పుడు నీకట్టి వరమిచ్చిన తరువాత మనస్సులో ఆలోచించి ప్రపంచమున నావంటివాడు లేడని నిశ్చయించుకొని ఈ కారణము వలన నీ తపః ప్రభావమును బట్టి నీకు నేను పుత్రుడగానైతిని. నీవు స్వయముగా ఆకశ్యప ప్రజాపతివే. మంచి తపస్విని పతివ్రత ఐన ఈమె దేవతలమాతయగు అదితియే. ఇప్పుడు కశ్యపాంశతో వసుదేవుడవై నాకు తండ్రివైతివి. అతి అంశతో జన్మించిన ఈ దేవకి దేవమాతయే. పూర్వము నీవలన అదితియందు అంశావతారముగా వామనుడనై జన్మించితిని. ఇప్పుడు నీ తపస్పులఫలముగా పరిపూర్ణముగా (మొత్తము భగవత్కథలతో) నీకు పుత్రుడుగా జన్మించితిని. ఓ మహాప్రాజ్ఞుడా! నీవు నన్ను పుత్రభావముతో గాని బ్రహ్మభావముతో గానీ ఉపాసించి నన్ను పొందితివి కనుక ఇక నీవు జీవన్ముక్తుడవగుదువు.

యశోదాభవనం శీఘ్రం మాం గృహీత్వా వ్రజం వ్రజ

సంస్థావ్య తత్ర మాం తాత మాయామాదాయ స్థాపయ

ఇత్యుక్త్వా శ్రీహరిస్తత్ర బాలరూపో బభూవ హ

ఓ తండ్రీ! శీఘ్రముగా నన్ను తీసుకొని ప్రజము (గోకులము)లోని యశోదాదేవి గృహమునకు పొమ్ము. అక్కడ నన్ను ఉంచి అక్కడ ఉన్న బాలికా రూపిణియగు మాయను తీసికొని వచ్చి ఇక్కడ ఉంచుము అని శ్రీహరి పలికీ అచ్చట బాలరూపము పొందెను.

నగ్నం భూమౌ శయానం చ దదర్శ శ్యామలం సుతం

దృష్ట్వా స బాలకం తత్ర మోహితో విష్ణుమాయయా

కిం వా కూటం చ తంద్రియామపూర్వం సూతికాగృహం

ఇత్యుక్త్వా వసుదేవశ్చ సమాలోచ్య స్త్రీయా సహ

గృహీత్వా బాలకం క్రోడే జగామ నంద గోకులం

గత్వా నంద వ్రజం శీఘ్రం వివేశ సూతికాగృహం

దదర్శ శయనావిష్టాం యశోదాం నిద్రయాన్వితాం

నిద్రాన్వితం చ నందం చ సర్వం తత్ర గృహే స్థితం

వసుదేవుడు భూమియందు నగ్నముగా పండుకొనియున్న శ్యామలవర్ణుడగు తన పుత్రుని దర్శించి విష్ణుమాయవలన వ్యామోహము పొందెను. అపూర్వమైన ఈ సూతికా గృహము (పురిటీలు) ఈ మాంద్యపురాత్రిలో ఏమి ఘటించెను?! ఇట్లు అతడు పల్కి భార్యతో బాగుగా ఆలోచించి బాలుని తన ఒడిలోనికి తీసుకోని నందుని గోకులమునకేగెను. శీఘ్రముగా నందుని రేపల్లెకు చేరి సూతికాగృహమును (యశోద పురిటింటిని) ప్రవేశీంచెను. అక్కడ మంచము పై నిద్రలోనున్న యశోదను చూచెను. ఆ గృహమందున్న సర్వజనులు నందుడును నిద్రలోనుండీరి.

దదర్శ బాలికాం నగ్నాం తప్తకాంచన సన్నిభాం

ఈషద్ధాస్యాం ప్రసన్నాస్యాం వశ్యంతీ గృహశేఖరం

తాం దృష్ట్వా వసుదేవశ్చ విస్మయం పరమం యయౌ

సంస్థాప్య తత్ర పుత్రం చ కన్యాదాయ నత్వరం

జగామ మధురాం హృష్టః స్వకాంతా సూతికాగృహం

స్థాపయామాస తత్రైవ మహామాయాం చ బాలికాం

రోరూయమాణాం తామేవ దృష్ట్వా హృష్టా చ దేవకీ

వసుదేవుడక్కడ మేలిమి బంగారు వర్ణము గలికి చిరునవ్వుతో ప్రసన్నముఖముతో ఇంటి పై కప్పును తిలకించుచున్న నగ్న శిశువును (బాలికను) చూచి మీక్కీలీ ఆశ్చర్యము పొందెను. అక్కడ తన పుత్రునుంచి త్వరగా ఆ బాలికను తీసుకొని సంతోషపడుచు మధురానగరమునకు పోయి తన భార్య పురిటింటిని చేరెను. బాలికారూపమున నున్న మహామాయను దేవకివద్ద ఉంచెను. అప్పుడు రోదనము చేయుచున్న ఆ బాలికను చూచి దేవకి (దైవకృపకు) సంతసించెను.

రోదనేనైవ సా బాలా బోధయామాస రక్షకాన్

ఉత్థాయ రక్షకాశ్శీఘ్రం బాలీకాం జగృహుస్తదా

గృహీత్వా బాలికాం తే చ వ్రజగ్ముః కంగసన్నిధిం

జగామ దేవకీ పశ్చాద్వసుదేవశ్చ శోకతః

ఆ బాలిక తన రోదనముతో కావలివారిని మేల్కోల్పెను. ఆ రక్షకులు లేచి వెంటనే బాలికను స్వీకరించిరి. అట్లో బాలికను తీసుకోని వారు కంసునీ సన్నిధికి వెళ్లిరి. తరువాత దుఃఖముతో దేవకీయు వసుదేవుడును అక్కడకు వెళ్ళిరి.

దృష్ట్వా చ బాలికాం కంసో సాతిహృష్టో మహామునే

రోరూయమాణాం కల్యాణీం తద్దయా న బభూవ హ

ఓ నారదమునీ! కంసుడాబాలికను చూచి మిక్కిలిగా సంతోషించలేదు. ఏడ్చుచున్న ఆ బాలికను చూచి వానికి దయ ఏర్పడలేదు.

తాం గృహీత్వా తు పాషాణే హాంతుం యాంతం సుదారుణం

ఉవాచ వసుదేవశ్చ దేవకీ పరమాదరం

ఆ బాలికను తీసుకొని శిలపై కొట్టి చంపుటకు పోవుచున్న పరమక్రూరుడగు కంసుని చూచి దేవకీ వసుదేవులు మిక్కిలి గౌరవముగా ఇట్లు పలికిరి.

భోభోః కంస నృపశ్రేష్ఠ నీతిశాస్త్ర విశారద

నిబోధ వాక్యం సత్యం చ నీతియుక్తం మనోగమం

హత్వాఽఽవయోః పుత్రషట్కం దయా తే నాస్తి బాంధవ

అధునా చాష్టమే గర్భే బాలికామబలాం మమ

హత్వా తవ కిమైశ్వర్యం భవిష్యతి మహీతలే

స్త్రీమేవ హంతుమబల కిం క్షమా రణమూర్ధని

ఓ రాజనీతిశాస్త్ర పండితుడా! ఓ కంస మహారాజా! సత్యమును, నీతి యుక్తమును మనస్సునానంద పరచునదియునగు మామాటను వినుము. ఓ బంధువా! మా ఆరుగురు కొడుకులను చంపి కూడ నీకు దయలేదే! ఇప్పుడీ ఎనిమిదవ కాన్పు ఐన ఈ బాలికను చంపినచో ఈ భూమండలమున ఏమి ఐశ్వర్యము నీకు లభించును. అయ్యో! స్త్రీనే చంపబూనితీవే. ఇక యుద్ధరంగమున నీకు క్షమాగుణమెట్లు కల్గును?

ఇత్యేవముక్త్వా తం వనుర్దేవకీ చ సభాతలే

రురోద పురతస్తత్ర కంసస్య చ దురాత్మనః

కంసస్తయోర్వచః శ్రుత్వా తామువాచ దురాత్మనా

ఇట్లు పలికి వసుదేవుడును దేవకియు దుష్టాత్ముడైన ఆ కంసుని ముందు సభలో నేలపై పడి ఏడ్చిరి. కంసుడు వారి మాట విని దుష్టబుద్ధితో ఇట్లు పలికెను.

కంస ఉవాచ :

శ్రుణు వాక్యం మదీయం చ నిబోధ బోధయామి తే

తృణేన పర్వతం హంతుం శక్తో ధాతా చ దైవతః

కీటేన సింహశార్దూలం మశకేన గజం తథా

శిశునా చ మహావీరం మహాంతం క్షుద్ర జంతుభిః

మూషికేన చ మార్జారం మండూకేన భుజంగమం

ఏవం జన్యేన జనకం భక్ష్యేనైవ చ భక్షకం

వహ్నినా చ జలం నష్టుం వహ్నిం శుష్క తృణేన చ

పీతాః సప్తసముద్రాశ్చ ద్విజేనైకేన జంతునా

ధాతుర్గతిర్విచిత్రా తు దుర్జ్ఞేయా భువన త్రయే

దైవేన బాలికా నష్టుం మాం సమర్థా భవిష్యతి

బాలికాం చ వధిష్యామి నాత్ర కార్యా విచారణా

కంసుడిట్లు పలికెను :

ఓ దేవకీ నామాట వినుము. బ్రహ్మ దైవబలము వలన గడ్డిపోచతో పర్వతమును కొట్టి నాశము చేయుటకు సమర్థుడగును. చిన్న పురుగుతో సింహా శార్దూలములను, దోమతో ఏనుగును, వసిపాపతో మహావీరుని, క్షుద్ర జంతువుతో గొప్ప వ్యక్తినీ, ఎలుకతో పిల్లినీ, కప్పతో పామును, అగ్నీతో నీటినీ, ఎండుగడ్డితో అగ్నిని, కడుపున బుట్టినవానితో తండ్రిని, భోజనమైన ప్రాణితోనే భుజించు ప్రాణిని, బ్రహ్మ చంపగల్గును. ఒక బ్రాహ్మణమాత్రుని చేత సప్త సముద్రములు జలములు త్రాగబడలేదా! సృష్టికర్త నడక విచిత్రమైనది. ముల్లోకములలో తెలియ శక్యముగానీది. దైవమూలముగా ఈ బాలీకయే నన్ను చంపుటకు సమర్థురాలగును. కావున ఈ బాలికను వధింతును. ఈ విషయమై విచారించవలసిన పనిలేదు.

ఇత్యేవముక్త్వా కంసశ్చ గృహీత్వా బాలికాం తదా

హంతుమారబ్ధవాన్ కంసస్తమువాచ వసుస్తదా

ఇట్లు పలికి కంసుడు బాలికను చంపుటకు పూనుకొసగా అతనితో వసుదేవుడిట్లు పలికెను.

వృధా హింసితవాన్ రాజన్ దేహి బాలాం కృపానిధే

స తచ్ఛ్రుత్వా విచారజ్ఞః కంసస్తుష్టో మహామునే

ఓ సారదమునీ! “ఓ రాజా! దయానిధీ! అనవసరముగా హింసించితివి, బోలికనీవ్వవయ్యా” అన్న వసుదేవుని మాట విని పరుల వీచారమెరిగిన కంసుడామాటకు సంతసించెను.

సంబోధయంతం తత్రైవ వాగ్బభూవాశరీరిణీ

హేకంస హంసి కాం మూఢ న విజ్ఞాయ హరేర్గతిం

కుత్ర చిత్త్వన్నిహంతాఽస్తి కాలే వ్యక్తో భవిష్యతి

శ్రుత్వైతద్దేవవాణీం చ తత్యాజ బాలికాం నృపః

ఇట్లు కంసుని గూర్చి పలుకుచుండగనే ఒక అశరీరవాక్కు ఇట్లు (శరీరము లేకుండ ఏర్పడిన పాక్కు) విన్పించెను. “ఓ మూడుడా! కంసా! విష్ణువు యొక్క లీలొగతినెరుగకుండ ఎవతను చంపుచుంటివి?! నిన్ను సంహరించు వాడెక్కడనో ఉన్నోడు. తగిన కాలమున బయట పడగలడు”. ఆ దేవవాణిని (ఆకాశమునుండి విన్పించిన మాటను) వీని కంసుడా బాలికను విడిచి పెట్టెను.

వనుదేవో దేవకీ చ తామాదాయ ముదాఽన్వితౌ

జగ్మతుః స్వగృహం తౌ చ కన్యాం కృత్వా స్వవక్షసి

మృతామివ పునః ప్రాప్య బ్రాహ్మణేభ్యో దదౌ ధనం

సా పరా భగినీ విప్ర కృష్ణస్య పరమాత్మనః

ఏకానంశేతి విఖ్యాతా పార్వత్యంశ సముద్భవా

వసుస్తాం ద్వారాకాయాం తు రుక్మిణ్యుద్వాహ కర్మణి

దదౌ దుర్వాస సే భక్త్యా శంకరాంశాయ భక్తితః

దేవకీ వసుదేవులు సంతోషముతో ఆ కన్యను తీసుకొని రొమ్మున హత్తుకొని తమ యింటికి కొనిపోయిరి. వసుదేవుడు చచ్చిన బిడ్డ బ్రతికినట్లుగా ఆమె లభించినందున బ్రాహ్మణులకు ధనమును దానమొనర్చెను. ఓ నారదా! ఆమె కృష్ణ పరమాత్మకు శ్రేష్ఠమైన చెల్లెలు. పార్వతి అంశతో జన్మించిన ఆమె “ఏకాసంశ” అని ప్రసిద్ధికెక్కెను. వసుదేవుడు ద్వారకలో రుక్మిణీ వివాహ సందర్భములో శంకరాంశ గల దుర్వాసమహర్షికి భక్తితో ఆమె నిచ్చేను.

ఏవం నిగదీతం సర్వం కృష్ణ జన్మానుకీర్తనం

జన్మమృత్యు జరాతిఘ్నం సుఖదం పుణ్యదం మునే

నారదమహర్షీ! ఈ విధముగా నీకు శ్రీకృష్ణుడు జన్మించిన వృత్తాంతమునంతయు తెలిపితిని. ఈ కథ పునర్జన్మ, మృత్యువు, ముసలితనమును కలిగించదు. పైగా సుఖమును, పుణ్యమును కూడ కలిగించును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నరనారాయణ సంవాదే సప్తమోఽధ్యాయః

ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నరనారాయణ సంవాదములో ఏడవ అధ్యాయము సమాప్తము.