బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

1 - విష్ణువైష్ణవగుణ ప్రశంసా ప్రస్తావము

శ్లో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

శ్రీనారాయణ మునికి జీవులలో శ్రేష్ఠుడైన నరునకు సరస్వతీదేవికి వ్యాసునకు నమస్కరించి "జయ" సంహిత (వ్యాసమహర్షి రచన)ను పఠించవలెను.

నారద ఉవాచః

శ్రుతం ప్రథమతో బ్రహ్మన్ బ్రహ్మఖండం మనోహరం

బ్రహ్మణో వదసాంభోజాత్ పరమాద్భుతమేవ చ

తతస్తద్వచనాత్తూర్ణం సమాగత్య తవాంతికం

శ్రుతం ప్రకృతిఖండం చ సుధాఖండాత్పరం వరం

తతో గణపతేః ఖండమఖండ భవఖండనం

న మేతృప్తం మనోలోలం విశిష్టం శ్రోతుమిచ్ఛతి

నారదుడిట్లు పలికెను :

ఓ పరమాత్మా! ఇంతకు ముందు బ్రహ్మదేవుడు చెప్పిన మిక్కిలి అద్భుతము మనోహరము ఐన బ్రహ్మఖండమును వింటీని. అతని ఆజ్ఞ వలన నీ వద్దకు వచ్చి అమృతము కంటే రుచియైన ప్రకృతి ఖండముసు - తెగనీ సంసార బంధమును ఖండించగల గణపతి ఖండమును నీవు చెప్పగా వింటిని. చలించు స్వభావము గల నా మనస్సు తృప్తిపడక ఇంకను మంచి విషయములు వినగోరుచున్నది.

శ్రీకృష్ణ జన్మఖండం చ జన్మాదేః ఖండనం నృణాం

ప్రదీపం సర్వ తత్త్వానాం కర్మఘ్నం హరి భక్తిదం

సద్యో వైరాగ్య జననం భవరోగనికృంతనం

కారణం ముక్తి బీజావాం భవాబ్ధేః తారణం నృణాం

కర్మోపభోగ రోగాణాం ఖండనే చ రసాయనం

శ్రీకృష్ణ చరణాంభోజ ప్రాప్తి సోపాన కారణం

జీవనం వైష్ణవాసాం చ జగతాం పాపనం పరం

పద విస్తార్య మాం భక్తం శీష్యం చ చరణాగతం

జీవుల చావుపుట్టుకలను ముసలితనమును నశింపజేయగల శ్రీకృష్ణజన్మఖండము అన్ని తత్వములను ప్రకాశపరచును. కర్మబంధములను నశింపజేసి హరిభక్తిని కలిగించును. భవరోగములను కత్తిరించివేసి వెంటనే వైరాగ్యమును కలిగించును. ముక్తి బీజములు మొలకెత్తించి సంసార సముద్రమును దాటించును. పూర్వకర్మఫలములైన సుఖదుఃఖములు స్వర్గనరకములు అను రోగములను నశింపజేయు దివ్య ఔషధము. శ్రీ కృష్ణ పాదపద్మములు లభించుటకు సోపానమార్గము. విష్ణుభక్తులకు జీవనాధారము. లోకులందరికి పరమ పవిత్రమైన కథ. నీ భక్తుడను శిష్యుడను శరణు పొందినవాడను అగు నాకు అట్టి కథను వినిపించుము.

కేన వా ప్రార్థితః కృష్ణ ఆజగామ మహీతలం

సర్వాం శైరేక ఏవేశః పరిపూర్ణతమః స్వయం

యుగే కుత్ర కుతో హేతోః కుత్ర వాఽఽ విర్భభూవ హ

వసుదేవోఽన్య జనకః కో వా కో వా చ దేవకీ

వద కన్య కులే జన్మ మాయయా సువిడంబనం

కిం చకార సమాగత్య కేన రూపేణ పా హరిః

జగామ గోకులం కంనభయేన సూతికాగృహాత్

కథం కంసాత్కీటతుల్యాద్భయేశస్య భయం మునే

హరిర్వా గోపవేషేణ గోకులే కిం చకార హ

కుతో గోపాంగనాసార్థం విజహార జగత్పతిః

కా వా గోపాంగనా కే వా గోపాలా బాలరూపిణః

కా వా యశోదా కో సందః కిం వా పుణ్యం చకార హ

కథం రాధా పుణ్యవతీ దేవీ గోకులవాసినీ

ప్రజేవాప్రజకన్యా సా బభూవ ప్రేయసో హరేః

కథం గోప్యో దురారాధ్యం సంప్రాపురీశ్వరం పరం

కథం తాశ్చ పరిత్యజ్య జగాము మధురాం పునః

భారావతరణం కృత్వా కిం విధాయ జగామ సః

కథయస్వ మహాభాగ పుణ్యశ్రవణకీర్తన

ఎవరు ప్రార్థించగా శ్రీకృష్ణుడు భూమండలమును చేరవచ్చెను. సర్వదేవతల అంశలు వొక్కటైన ఆ ప్రభువు స్వయముగా పరిపూర్ణతముడై - ఏ యుగములో - ఏ కారణము వలన - ఎక్కడ అవతరించెను. అతని తండ్రియైన వసుదేవుడెవరు? దేవకీ ఎవరు? చక్కగా మాయతో నటించుచు ఏ వంశమున జన్మించెను. ఆ హరి ఏ రూపముతో వచ్చి ఏమేమి చేసెను? పురుటింటినుండి గోకులమున (రేపల్లె)కు కంసునికి భయపడి పోవుట ఎందుకు? ఇతరుల భయములను తొలగించు పరమేశ్వరుడు పురుగు వంటి కంసునికి భయపడుట ఏమి? గోపాలక వేషముతో గోకులమున ఏమీ చేసినాడు? ఆ జగత్పతి గోపికలతో ఎందుకు విహరించినాడు? ఆ గోపికలెవరు? గోపాల బాలురు ఎవరు? యశోదానందులు ఎవరు? వారు ఏమి పుణ్యము చేసిరి? గోలోకమున నివసించు పుణ్యమూర్తి రాధాదేవి గోకులమున నివసించుటకు కారణమేమి? ప్రేమమూర్తియైన హరికి గోపికగా ఎట్లు లభించేను? ఎంతటి వారికిని ఏమి చేసినను లభించని పరమేశ్వరుని గోపికలు ఎట్లు పొందగలిగిరి? వారిని వదిలి పెట్టి అతడు మధురానగరికెట్లు పోయెను? పాపుల భారమును భరించలేని భూదేవి బాధలు ఎట్లు తొలగించి అవతారము చాలించెను. ఓ మహానుభావా! ఈ కథాశ్రవణ కీర్తనములు పుణ్యప్రదములు. అట్టి కథను నాకు చెప్పుము.

నుదుర్లభాం హరికధేం తరణం భవసాగరే

నిషేకభోగ నిగడక్షేశ చ్ఛేదన కర్తనీం

పాపేంధనానాం దహనే జ్వలదగ్ని శిఖామివ

పుంసాం శ్రుతవతాం కోటి జన్మ కిల్బిష నాశినీం

ముక్తిం కర్ణనుధరమ్యాం శోకసాగర నాశినీం

మహ్యం భక్తాయ శిష్యాయ జ్ఞానం దేహి కృపానిధే

దుర్లభమైన భగవంతుని కథ సంసార సాగరము దాటించునావ, తల్లిగర్భమున ప్రవేశించుట కర్మఫలములనుభవించుట అను సంకెళ్ల బాధను ఛేదించు కత్తెర. పాపములనెడి కట్టెలను కాల్చివేయు అగ్నిజ్వాల. వినిన వారి కోటి జన్మల పాపములను నశింపచేయునది. శోకసాగరమునింకించి ముక్తినిచ్చునది. ఓ దయానిధీ! వినువారి చెవులకు అమృతము వలె మనోహరమైన ఈ అవతార కథా జ్ఞానమును నీ భక్తుడను శిష్యుడను అగు నాకు ప్రసాదించుము.

తపో జపమహాదానాత్ వృధ్వ్యాం తీర్థదర్శనాత్

శ్రుతిపాఠాదనశనాద్ వ్రతాద్దేవార్చనా దపి

దీక్షాయాః సర్వయజ్ఞేషు యత్ఫలం లభతే నరః

షోడశీం జ్ఞానదానస్య కళాం నార్హ తి తత్ఫలం

పిత్రాఽహం ప్రేషితో జ్ఞానాదానాయ తవ సన్నిధిం

సుధాసముద్రం సంప్రాప్య కో వాఽ న్యత్పాతుమిచ్ఛతి

తపస్సు మంత్రజపము మహాదానములు తీర్థయాత్రలు వేదపఠనము ఉపవాసములు దేవతార్చనలు అన్నివిధముల యజ్ఞయాగములు జ్ఞానదానపుణ్యఫలమునకు పదహారవ వంతు కూడ సరిగావు. జ్ఞానార్జనము కొరకే తండ్రి (బ్రహ్మ) పంపగా మీ సన్నిధికి వచ్చితిని. అమృత సముద్రమును చేరవచ్చినవాడు ఇతర జలములు త్రాగగోరునా!

శ్రీనారాయణ ఉవాచ :

మయా జ్ఞాతోఽసి ధన్యస్త్వం పుణ్యరాశీ స్సమూర్తిమాన్

కరోషీ భ్రమణం లోకాన్ పావితుం కులపావన

జనానాం హృదయం సద్యః సువ్యక్తం వచనేన వై

శిష్యే కళత్రే కన్యాయాం దౌహిత్ర బాంధవేఽపి చ

పుత్రే పౌత్రే చ వచసి ప్రతాపే చాపది ప్రియాం

వృద్ధౌ వైరిణి విద్యాయాం జ్ఞాయతే హృదయం నృణాం

నారాయణ మునీ ఇట్లు పలికెను :

ఓ నారదా! నీవు ధన్యుడవు. రూపుదాల్చిన పుణ్యరాశీవీ అని గుర్తించితిని. ఓ కులపావనా! నీవు లోకసంచారము చేయుట లోకులను పావనము చేయుటకే. మాటలవలననే మనుష్యుని మనస్సు స్పష్టముగా తెలియవచ్చును. శిష్యుడు, భార్య, కూతురు, బిడ్డ, కొడుకు, పుత్రుడు, పౌత్రుడు, బంధువు అను వారీ హృదయము మాటలవలననే తెలియును. ఒక వ్యక్తి ప్రతాపము ఆపద మాటలతోనే గుర్తింపవచ్చును. స్త్రీ వృద్ధుడు శత్రువు విద్వాంసుడు అన్నవారీ హృదయములు కూడా అట్లే తెలియును.

జీవన్ముక్తోఽసి పూతస్త్వం శుద్ధభక్తో గదాభృతః

పునాసి పాదరజసా సర్వాధారాం వసుంధరాం

పునాసి లోకాంత్సర్వాంశ్చ స్వీయ విగ్రహదర్శనాత్

సుమంగలాం హరికధాం తేన త్వం శ్రోతు మిచ్ఛసి

యత్ర కృష్ణకథాః సంతి తత్రైవ నర్వ దేవతాః

ఋషయో మునయశ్చైవ తీర్థాని నిఖిలానీ చ

కథాః శ్రుత్వా కథాంతే తే యాంతి సంతో నిరాపదమ్

భవంతి తానీ తీర్థానీ యేసు కృష్ణ కథాః శుభాః

నద్యః కృష్ణకథా వక్తా స్వస్య వుంసాం శతం శతం

సముద్ధృత్య శ్రుతవతాం పునాతీ నిఖిలం కులం

ప్రష్టాతు ప్రశ్న మాత్రేణ పునొతి కులమాత్మనః

శ్రోతా శ్రవణమాత్రేణ స్వకులం స్వ స్వ బాంధవాస్

నారదా నీవు జీవన్ముక్తుడవు, పవిత్రుడవు. విష్ణువు యొక్క శుద్ధ భక్తుడవు. నీ పాదధూళితో జీవకోటికి ఆధారమైన భూమిని పవిత్రము చేయుచున్నావు. నీ దర్శనముతో అందరినీ పావనులను చేయుచున్నావు. అందువలననే నీవు మంగళకరమైన పరీకథను వినగోరుచున్నావు. కృష్ణ కథలు ప్రచారమగుచోట సర్వదేవతలు, ఋషులు, మునులు సర్వతీర్థములు నివాసముండును. భగవత్కథ వీని ఆ సాధుపురుషులు ముక్తిని పొందుదురు. శుభకరమైన కృష్ణ కధలు జరిగిన చోటులు తీర్థయాత్రా స్థలములగును. కృష్ణ కథలను చెప్పు వ్యక్తి తన వంశపు సూరుతరములను, విన్నవారి నూరు తరములను అప్పుడే ఉద్దరించి పవిత్రులను చేయును. హరికథను గూర్చి ప్రశ్నవేసినపోడు ప్రశ్న వేసినందు వలన, విన్నవాడు వీన్నందువలన తనవంశమును తన బంధువులను పవిత్రము చేయుదురు.

శతజన్మ తపస్తప్తో జన్మేదం భారతే లభేత్

కరోతి సఫలం జన్మ శ్రుత్వా హరికథామృతం

అర్పనం వందనం మంత్ర జపః సేవనమేవ చ

న్మరణం కీర్తనం శశ్వద్గుణ శ్రవణమీప్సితం

నివేదనం తస్య దాస్యం నవధా భక్తి లక్షణం

కరోతి జన్మ సుఫలం కృత్వైత్తాని చ నారద

న చ విఘ్నో భవేత్తస్య పరమయుర్న నశ్యతి

న యాతి తత్పురః కాలో వైనతేయమివోరగః

న జహాతి సమీపం చ క్షణం తస్య హరిః స్వయం

ఉపతిష్ఠంతి తూర్ణం తమణిమాదిక సిద్ధయః

సుదర్శనం భ్రమత్యేవ తన్య పార్శ్వే దివానీశం

కృష్ణాజ్ఞయా చ రక్షార్థం కో వా కిం కర్తుమీశ్వరః

న యాంతి తత్పమీపం చ స్వప్నేఽపి యమకింకరా  

జ్వలదగ్నిం యధా దృష్ట్వా శలభా న ప్రజంతి తం

వ్యాధయో విపదశ్శోకా విఘ్నశ్చ స ప్రయాంతి తం

న యాతి తత్సమీపం చ మృత్యుర్మౄత్యు భయాస్మునే

ఋషయో మునయః సిద్ధాః సంతుష్టాః సర్వదేవతాః

స చ సర్వత్ర నిశ్శంకః సుఖీ కృష్ణ ప్రసాదతః

నూరు జన్మల తపస్సు ఫలితముగా జీవుడు భారతదేశమున జన్మించును. అమృతము వంటి పరికథను అతడు విని తన జన్మను సఫలమొనర్చుకొనును. అర్చనము (పూజ) వందనము (నమస్కారము) మంత్ర జపము, సేవనము (సేవలు చేయుట) స్మరణము, కీర్తనము, గుణ శ్రవణము (భగవంతుని కళ్యాణ గుణములు వినుట), నివేదనము (నైవేద్యాదులు), దాస్యము (సేవకావృత్తి) అని భక్తి తొమ్మిది విధములు. నారదా! నవవిధ భక్తులాచరించి నరుడు జన్మసాఫల్యము పొందును. అతనికే విఘ్నములు ఏర్పడవు. పరమాయువు నశించదు. గరుడుని ముందుకు సర్పము రాజాలనట్లు అతని ముందుకు అపమృత్యువు రాజాలదు. అణిమాది అష్టసిద్దులు వెంటనే సిద్ధించును. శ్రీహరి అతనిని క్షణము కూడ విడిచి ఉండడు. శ్రీకృష్ణుని ఆజ్ఞతో సుదర్శన చక్రము అతని ప్రక్కలందు తిరుగుచు రాత్రింబగళ్లు రక్షించును. కనుక అతనికి ఆపద కలిగించుటకెవడు సమర్థుడు? మండుచున్న అగ్నీ వద్దకు మిడుతలు రాజాలనట్లు యమదూతలు కలలో కూడ అతని దగ్గరకు రాజాలరు. వ్యాధులు ఆపదలు దుఃఖములు విఘ్నములు అతనిని సమీపించవు. మృత్యువు కూడ తనకే మృత్యువు ఏర్పడునని భయపడును. ఋషులు, మునులు, సిద్ధులు, సర్వదేవతలు అతని యెడల సంతృప్తులగుదురు. కృష్ణానుగ్రహము వలన ఏ సందేహములు లేక అంతట సుఖముగా నుండును.

తవ కృష్ణకథాయాం చ రతిరాత్యంతికీ నదా

జనకన్య స్వభావో హీ జన్యే తిష్ఠతి నిశ్చితం

విప్రేంద్ర కా ప్రశంసేయం జన్మ తే బ్రహ్మమాన సే

యత్ర యత్ర కులే జన్మ తన్మతిస్తాదృశీ భవేత్

పితా విధాతా జగతాం కృష్ణ పాదాబ్జ సేవయా

నిత్యం కరోతి యః శశ్వన్నవధా భక్తీ లక్షణం

నీకెల్లప్పుడును కృష్ణుకథయందు ఆసక్తి ఎక్కువ. తండ్రి స్వభావము కొడుకునకు వచ్చునన్నది సత్యము. బ్రహ్మమానస పుత్రుడవగు నీయందు కృష్ణ కథాసక్తి యుండుట సాధారణమే. ఏ కులమున జన్మించునో ఆ బుద్ధి యేర్పడును. సృష్టికర్తయగు నీ తండ్రి శ్రీకృష్ణ పాదసేవాసక్తితో ఎల్లప్పుడు నవ విధ భక్తులు కొనసాగించును.

రతిః కృష్ణ కథోయాంచ యస్యాశ్రు పులకోద్గమః

మనో నిమగ్నం తత్రైవ న భక్తః కథితో బుధైః

పుత్రదారాదికం సర్వం జానాతి శ్రీహరేరితి

ఆత్మనా మనసా వాచా స భక్తః కధితో బుధైః

నీర్జనే తీర్థ సంపర్కే నిస్సంగా యే ముదాన్వితాః

ధ్యాయంతే చరణాంభోజం శ్రీహరేస్తే చ వైష్ణవాః

దయాఽస్తి సర్వజీవేషు సర్వం కృష్ణమయం జగత్

యో జానాతి మహాజ్ఞానీ స భక్తో వైష్ణవో మతః

శశ్వద్యే నామ గాయంతి గుణం మంత్రం జపంతి చ

కుర్వంతి శ్రవణం గాథా వదంతి తేఽ తి వైష్ణవాః

లబ్ధానీష్టాని వస్తూని ప్రదాతుం హరయే ముదా

తూర్ణం యన్య మనో హృష్టం న భక్తో  జ్ఞానినాం వరః

యన్మనో హరిపాదాబ్జే స్వప్నే జ్ఞానే దివానిశం

పూర్వకర్మోపభోగం చ బహిర్భుం  క్తే స వైష్ణవః

గురు వక్త్రాద్విష్ణు మంత్రో యస్య కర్ణే విశత్యలం

తం వైష్ణవం మహాపూతం ప్రవదంతి మనీషిణః

పూర్వాంత్సప్త పరాంత్సప్త సప్త మాతా మహాదికాన్

సోదరానుద్ధరేద్భక్తః స్వప్రసూం చ ప్రసూప్రసూం

కళత్రం కన్యకాం బంధుం శిష్యం దౌహిత్రమాత్మనః

కింకరాన్ కింకరీశ్చైవముద్ధరేద్వైష్ణవః సదా

కృష్ణ కథలందు ప్రీతి కలిగి, వాటి స్మరణతో ఆనంద భాష్పములు శరీరము పులకరింత కలిగి మనస్సు దానియందే మగ్నమైయుండు వానిని బుధజనులు భక్తుడందురు. భార్యాపుత్రులు ఇతర సంపదలు అన్నియు శ్రీహరివే అని త్రికరణ శుద్ధిగా భావించు వానిని బుధజనులు భక్తుడందురు. జనులు లేని పుణ్య స్థలములలో నిస్సంగులై ఎవరు ఏకాంతముగా ప్రేమతో శ్రీహరి పాదపద్మములను ధ్యానింతురో వారే వైష్ణవులు. సర్వజీవులయందు దయ సర్వజగత్తు కృష్ణమయమున్న జ్ఞానము కల మహాజ్ఞాని విష్ణుభక్తుడనీ అంగీకరింపబడినది. ఎల్లప్పుడు నామసంకీర్తనము చేయువారు భగవద్గుణములను ధ్యానించువారు భగవన్మంత్రమును జపించువారు భగవత్కథలు వినువారు వైష్ణవ శ్రేష్ఠులు. తనకు ప్రియమైన లబ్ధపదార్ధములను ప్రీతిపూర్వకముగా శ్రీహరికి సమర్చించుటకు ఎవని మనస్సు త్వరపడునో, అర్పించి ఉప్పొంగునో ఆ భక్తుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. ఎవని మనస్సు కలలో గాని మెలకువలో గాని రాత్రింబగళ్లు శ్రీహరీ పాదపద్మములందే నిలిచి బాహిరముగా పూర్వకర్మ ప్రాప్తములైన సుఖదుఃఖాది భోగములనుభవించునో అతడే వైష్ణవుడు. గురుముఖమునుండి విష్ణుమంత్రము ఎవని చెవిలో పడునో ఆ వైష్ణవుడు మహా పవిత్రుడని విద్వాంసులు చెప్పుదురు. భక్తుడు తనకంటే ముందున్న ఏడుతరములవారిని తరువాతి ఏడు తరములవారిని మాతామహనీ (తల్లితండ్రీ)ని ఏడుతరముల వారిని, తనను గన్న తల్లిని, ఆమెను గన్న తల్లిని తన సోదరులను గూడ ఉద్ధరించును. భార్యను బిడ్డను బంధువును శిష్యుని బిడ్డ కొడుకును దాసదాసీ జనమును కూడ వైష్ణవుడుద్ధరించును.

సదా వాంఛంతి తీర్థాని వైష్ణవ స్పర్శ దర్శనే

పాపిదత్తాని పాపాని తేషాం నశ్యంతి సంగతః

గోదోహనక్షణం యావద్యత్ర తిష్ఠంతి వైష్ణవాః

తత్ర సర్వాణీ తీర్థాని సంతి తావన్మహీతలే

ధృవం తత్ర మృతః పాపీ ముక్తో యాతి హరేః పదం

తథైవ జ్ఞాన గంగాయామంతే కృష్ణస్మృతౌ  యథా

తులసీకాననే గోష్థే  శ్రీకృష్ణ మందిరే వరే

బృందారణ్యే హరిద్వారే తీర్థేష్వన్యేమ వా యథా

పాపాని పాపినాం యాంతి తీర్థ స్నానావగా హనాత్

తేషాం పాపాని నశ్యంతీ వైష్ణవ స్పర్శవాయునా

న హి స్థాతుం శక్నువంతి పాపాన్యేవ కృతాని చ

జ్వలదగ్నౌ  యథా క్షిప్రం శుష్కాణి హీ తృణాని చ

భక్తం వర్త్మని గచ్ఛంతం యే యే  పశ్యంతి మానవాః

నప్త జన్మార్జితౌఘాని తేషాం నశ్యంతి నిశ్చితం

పాపాత్ములు స్నానము చేసి తమలో విడిచిన పాపములను తొలగించుకొనుటకు అన్ని పుణ్యతీర్థములు వైష్ణవుల దర్శనమును స్పర్శను ఎల్లప్పుడు కోరుచుండును. వారి సాంగత్యము వలన వాటికంటిన పాపములు నశించును. ఆవు పాలు పిదుకునంత సమయము విష్ణుభక్తులెక్కడ నిలుతురో అక్కడ అంతసేపు అన్ని పుణ్యతీర్ధములు నిలుచును. జ్ఞానగంగయైన కృష్ణస్మృతి అంత్యకాలమున ఏర్పడిన వానికి ఏ ముక్తి లభించునో వైష్ణవుడు నిలిచిన చోట చచ్చిన పాపికి అట్టి ముక్తియే లభించును. తులసీవనములో, ఆవులమంది నిలిచినచోట, శ్రీకృష్ణ మందిరములో, బృందారణ్యములో, హరిద్వారములో, ఇతర పుణ్య స్థలములోని పవిత్ర జలములలో స్నానము చేయుట ఎట్లు పాపనాశకమో విష్ణు భక్తుని పై నుండి వీచిన గాలి కూడ అట్లే పాపనాశకము. మండెడి అగ్నిలో వేసిన ఎండుగడ్డి వెంటనే ఎట్లు మాడిపోవునో వైష్ణవ స్పర్శ వలన పాపుల పాపములును అట్లే నశించును. మార్గము వెంట నడచిపోవుచున్న భక్తుని దర్శించిన మానవులందరు గడచిన ఏడు జన్మలలోని పాపములను నశింపజేసికొనుట నిశ్చయము.

యే నిందంతి హృషీకేశం తద్భక్తం వుణ్యరూపిణం

శతజన్మార్జితం పుణ్యం తేషాం నశ్యతి నిశ్చితః

తే పచ్యంతే మహాఘోరే కుంభీపాకే భయానకే

భక్షితాః కీటనం ఘేన యావచ్చంద్ర దివాకరౌ

తన్య దర్శన మాత్రేణ పుణ్యం నశ్యతి నిశ్చితం

గంగాం స్నాత్వా రవిం  నత్వా తదా విద్వాన్ విశుధ్యతి

వైష్ణవ స్పర్శ మాత్రేణ ముక్తో  భవతి పాతకీ

తన్య పాపాని హంత్యేవ స్వాంతఃస్ధో  మధుసూదనః

ఇత్యేవం కథితో విప్ర విష్ణు వైష్ణవయోర్గుణః

అధునా శ్రీహరేర్జన్మ నిబోధ కథయామి తే

ఎవరు హృషీకేశుని, పుణ్యస్వరూపుడగు అతని భక్తుని నిందింతురో, గడచిన నూరు జన్మలలో వారు సంపాదించిన పుణ్యము నశించుట నిశ్చయము. మహా ఘోరమును భయంకరములనైన కుంభీపాక నరకములో ఆ పాపాత్ములు ఉడికింపబడుచు పురుగులు భక్షింపగా సూర్యచంద్రులున్నంత వరకు క్లేశములనుభవింతురు. అట్టి పాపుల దర్శనము పుణ్యనాశకము. పాపులను చూచిన దోషము హరించుటకు గంగాస్నానము సూర్యనమస్కారము కర్తవ్యములు. భగవన్నింద చేసిన పాపాత్ముడు వైష్ణవ స్పర్శతో ముక్తుడగును. హృదయములో నివసించి యున్న మధుసూదనుడే వాని పాపములను నశింపజేయును. ఓ నారదా! విష్ణు వైష్ణవుల గుణ విశేషములు ఇంత వరకు చెప్పితిని. ఇప్పుడు శ్రీహరి జన్మక్రమము చెప్పుదును వినుము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే  మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే నారాయణ నారద సంవాదే విష్ణు వైష్ణవయొరుణ ప్రశంసా ప్రస్తావ వర్ణనం నామ ప్రథమోఽధ్యాయః

ఇది శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణములోని శ్రీ కృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదమందు విష్ణు వైష్ణవుల యొక్క గుణ ప్రశంస, ప్రస్తావ వర్ణనము అను మొదటి అధ్యాయము.